Thursday, April 24, 2025

పుస్తకం... నా ప్రియ నేస్తం...

.                                          
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                                            ~ యం. ధరిత్రీ దేవి 
   పుస్తకం నా ప్రియ నేస్తం...
   నాకు ప్రాణప్రదం...
   అలసిన వేళ సేదదీర్చే ఔషధం
   ఒంటరినైన...ఊరడించే నెచ్చెలి...
   తెరిస్తే చాలు... అక్షరాలు కావవి...
   అనంత కోటి ఆలోచనలు 
   కొలువుదీరిన కూటమి...!
   మేధావుల కలం నుండి జాలువారి
   చెక్కుచెదరక నిలిచిన 
   అక్షర శిల్పాలే మరి...!!
   అలరిస్తూ..మురిపిస్తూ ఒకసారి...
   నవ్విస్తూ..విషాదంలో ముంచేస్తూ
   మరోసారి... అంతలోనే...
   ఓదారుస్తూ.. నిద్రాణమైన శక్తిని 
   తట్టిలేపుతూ.. బద్ధకాన్ని వదిలిస్తూ...
   గమ్యం చూపిస్తూ.. ఆగకుమా 
   సాగిపొమ్మంటూ..వెన్నుతడుతూ 
   ముందుకు తోసే స్ఫూర్తిప్రదాతలు 
   ఆ అక్షర దీపాలు...!!
   హస్తభూషణం కాదు పుస్తకం...
   మస్తిష్కాన్ని మధించే 
   మహిమాన్విత ఉపకరణం..
   ఉజ్వల భవితకు సోపానాలు 
   వేసే ఉత్తమోత్తమ సాధనం...!
   విజ్ఞాన వినోదాల భాండాగారం...
   కాలక్షేపం కలగలసి..లభ్యం..
   మానసికోల్లాసం...!
   పుస్తకపఠనం..మెదడును
   పదును పెట్టే ఇంధనం...
   కావాలి దినచర్యలో అదో భాగం..
   నూతనోత్తేజానికి పడుతుందపుడే బీజం!!
   అందుకే... పుస్తకం నా ప్రియనేస్తం..
   నాకు ప్రాణప్రదం...!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








Thursday, April 17, 2025

ధన్యవాదాలు

 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

 అందరికీ నమస్కారం 🙏. 2020 వ సంవత్సరం 
( 20.4.2020 ) ఇదే రోజు బ్లాగు మొదలుపెట్టాను. ఇప్పటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయినాయి. క్రమం తప్పకుండా రాయడం అలవాటైపోయింది.అదో మంచి అలవాటు అలవడింది. నా ఆలోచనలు నలుగురితో పంచుకోవడానికి సరైన వేదిక లభించినందుకు సంతోషంగానూ ఉంది. నేనొక కవితగానీ, కథగానీ, వ్యాసంగానీ మరే రచనగానీ రాస్తే ఓ పదిమంది చదివినా చాలనుకుని మొదలెట్టాను. అనూహ్యంగానే వీక్షిస్తున్నందుకు సంతృప్తిగానూ ఉంది. ఇలాగే ఈ పయనం కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు  🙏 మరియు ధన్యవాదాలు.

                                               ~ యం. ధరిత్రీ దేవి      

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐   

Tuesday, April 15, 2025

ఇదీ పరిష్కారం...కథ

 
                                  ~యం. ధరిత్రీ దేవి   
    
      "సౌమ్యా, ఇంకా ఏం చేస్తున్నావ్?"
 లాంగ్ బెల్లయి పది నిమిషాలైనా ఇంకా రాని సౌమ్య కోసం వెతుకుతూ  ఉన్న దుర్గకు క్లాస్ రూములో డెస్క్ మీద తలవాల్చి కూర్చున్న సౌమ్య కనిపించడంతో గట్టిగా పిలిచింది. తలెత్తి చూసింది గానీ సౌమ్య అక్కడినుంచి కదల్లేదు.
" ఏమిటి సౌమ్యా? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆర్ యూ ఓకే!"
 తనే లోనికి వెళ్లి సౌమ్య భుజం మీద చేయి వేసి కుదిపింది దుర్గ. లేచి నిలబడి, బ్యాగ్ తగిలించుకుంటూ,
"ఆ, ఓకే పద.."
 అంటూ కదిలింది సౌమ్య. కానీ దుర్గకు ఎందుకో సౌమ్య మామూలుగా లేదనిపించింది. బాగా ఏడ్చినట్టు మొహమంతా అదోలా ఉంది. మరీ బలవంతం చేస్తే బాగోదని దుర్గ తనతో కలిసి బయటకు దారితీసింది.
   అదో గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల. రెండంతస్తుల పాత భవనం. అందులో దుర్గ, సౌమ్య సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. దుర్గ హెచ్ఈసి గ్రూపు. సౌమ్య బైపీసీ గ్రూపు. ఇద్దరూ లాంగ్వేజ్ క్లాసుల్లో కలుస్తూ ఉంటారు. ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్. కానీ కొన్ని రోజులుగా సౌమ్య 'మూడీ'గా ఉండడం దుర్గ గమనిస్తూనే ఉంది. సౌమ్య స్వతహాగా చాలా నెమ్మదైన అమ్మాయి. ఎక్కువగా మాట్లాడదు. కానీ చదువులో చురుగ్గా ఉంటూ క్లాసులో మొదటి ఐదుగురిలో ఒకదానిగా ఉంటూ ఉంటుంది. దుర్గ స్వభావం పూర్తిగా విరుద్ధం. అందరితో గలగలా మాట్లాడుతూ అల్లరి కూడా బాగానే చేస్తూ ఉంటుంది.
" ఏమిటో, సౌమ్య ఇలా ఉండటం నాకు బొత్తిగా నచ్చడం లేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమో ఏమో..!"
 లోలోపల అనుకుంటూ కదిలింది దుర్గ.
                         **********
   వారం గడిచింది. సంవత్సరాంత పరీక్షలకు ముందు జరిగే ప్రిపరేషన్ పరీక్షలకు టైంటేబుల్ ఇచ్చారు. చివరి సంవత్సరం..పైగా పబ్లిక్ ఎగ్జామ్స్.. అందువల్ల లెక్చరర్స్ అంతా స్టూడెంట్స్ ను ప్రిపేర్ చేయడంలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులు అంటూ, స్టడీ అవర్స్ అంటూ తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారంతా.
   ఆరోజు శనివారం. సోమవారం నుండి పరీక్షలు మొదలు. క్లాసులన్నీ అయిపోయి, అమ్మాయిలంతా బిలబిలమంటూ క్లాసుల్లోంచి బయటపడ్డారు. తన క్లాసులో నుంచి ముందుగా బయటికి వచ్చిన దుర్గ సౌమ్య కోసం చూస్తూ నిలబడింది. కాసేపటికి వచ్చిన సౌమ్య,
" దుర్గా, నువ్వు వెళ్ళవే. నేను అర్జంటుగా టాయిలెట్స్ కి వెళ్ళాలి  "
అంది దుర్గతో.
, " సరేలే వెళ్లిరా. నేను వెయిట్ చేస్తూ ఉంటా బయట. త్వరగా వచ్చెయ్  "
 అంటూ వెళ్లబోయి,
"...అదేంటి సౌమ్యా పైకి వెళ్తున్నావ్, ఇక్కడే ఉన్నాయిగా టాయిలెట్స్..?"
 అప్ స్టైర్స్ వైపు వెళుతున్న సౌమ్యను ప్రశ్నించింది దుర్గ. తిరిగి చూడకుండానే,
" ఇక్కడ వాటర్ రావడం లేదులే దుర్గా "
 అనేసి పైకి దారి తీసింది సౌమ్య.
" అలాగా" అన్న దుర్గకు వెంటనే గుర్తొచ్చి,అదేంటి, ఇందాకే నేను వెళ్ళొచ్చాను, బాగా వస్తున్నాయే నీళ్లు..! అనుకుంటూ వెనుతిరగబోయిన ఆ పిల్లకు ఠక్కున ఏదో స్ఫురించి, మళ్లీ తిరిగి చూసింది. అప్పటికే పైకి వెళ్ళిపోయింది సౌమ్య. గుండె ఆగినంత పనైంది దుర్గకు . వెంటనే అప్ స్టైర్స్ వైపు పరిగెత్తింది. సౌమ్య బిల్డింగ్ టెర్రస్ మీద చివరికి గబగబా పరుగు లాంటి నడకతో నడుస్తూ పోతోంది. మరుక్షణంలో దూకేసేదే! శక్తినంతా కూడా తీసుకొని దుర్గ పరుగున వెళ్లి ఒక్క ఉదుటున సౌమ్యను చేయి పట్టి లాగేసింది. ఊహించని హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కింద పడిపోయింది సౌమ్య. అయినా వెంటనే లేచి,దుర్గ చేయి విడిపించుకొని ముందుకురకడానికి ప్రయత్నించింది. కానీ దుర్గ రెండు చేతులతో గట్టిగా సౌమ్యను వాటేసుకుని,
" బుద్ధుందా నీకు, ఏమిటీ పిచ్చి పని!!"
" దుర్గా, నన్ను వదిలేయ్ ప్లీజ్ "
" అసలేం జరిగింది? ముందు నాకు చెప్తావా లేదా? "
 అక్కడే కూలబడిపోయి,దుర్గను వాటేసుకుని  భోరున ఏడ్చేసింది సౌమ్య. మెల్లిగా ఆమె వీపు మీద తడుతూ, ఓదార్పుగా,
" ఊరుకో సౌమ్యా, ముందు ఇక్కడ నుంచి పదా, ఎవరైనా ఇక్కడ మనల్ని చూస్తే బాగోదు.. "
 అంటూ చేయి పట్టుకుని కిందికి తీసుకెళ్ళింది సౌమ్యను. అక్కడ ఎదురుగా వాచ్ మ్యాన్!
" ఏంటమ్మా ఏం చేస్తున్నారిక్కడ ? బెల్లయిపోయి ఎంత సేపయింది..! వెళ్లండి ఇక్కడి నుంచి.. "
 అంటూ అరిచాడు.
"వెళ్తున్నాం అన్నా, బుక్స్ కనిపించకపోతే వెతుక్కుంటున్నాము.. "
 అంటూ సౌమ్యతో పాటు దుర్గ బయటపడింది. పది నిమిషాల తర్వాత ఎవరూ లేని చోటు చూసుకుని ఓ చెట్టు కింద నిలబడ్డారు ఇద్దరూ. ఏడుస్తూ, సౌమ్య చెప్పిన విషయం వినేసరికి దుర్గ తల తిరిగిపోయింది. చాలా రోజులుగా సౌమ్య ముభావంగా ఉంటూ సరిగా మాట్లాడకపోవడం, పరీక్షల్లో మార్కులు కూడా తగ్గడం.. వీటన్నింటికీ కారణం ఇదన్న మాట!
  రాధాకృష్ణ ఆ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. ఇదే సంవత్సరం మొదట్లో వేరే కాలేజీ నుండి వచ్చి జాయిన్ అయ్యాడు. పాఠాలు బాగానే చెప్తాడు. ఎక్కువగా మాట్లాడడు ఎవరితో. డీసెంట్ గా కనిపిస్తాడు. అందరూ మంచివాడు అనుకునే ఈ అధ్యాపకుడి నైజం  ఇదా!!
" ఫిజిక్స్ సార్ ను చూస్తేనే భయమేస్తోంది దుర్గా. మొదటి రెండు నెలలు బాగానే ఉండేవాడు. కానీ మెల్లిగా అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించ సాగింది నాకు. కూర్చుని రాసుకుంటుంటే వెనక వీపు మీద చేయి వేయడం, భుజం మీద చేతులు వేసి మీదకు వంగి ఏదో డౌట్ క్లియర్ చేస్తున్నట్టు మాట్లాడడం...! మొదట్లో ఏదో పెద్దవాడులే అనుకొని పట్టించుకోకూడదనుకున్నా . కానీ రానురానూ ఆ చేష్టలు ఎక్కువైపోయాయి. పక్కన ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయం నన్ను మరీ బాధించసాగింది. "
 సౌమ్య చెబుతుంటే విస్తుబోయి వింటూ నిలబడిపోయింది దుర్గ. కన్నీళ్లు తుడుచుకుంటూ కొనసాగించింది సౌమ్య.
" నేను గమనించాను, నాతో మాత్రమే అలా ప్రవర్తిస్తున్న సంగతి. మిగతా వాళ్లంతా సార్ తో నవ్వుకుంటూ బాగా మాట్లాడుతుంటారు. ఎందుకు నాతోనే ఎందుకలా చేస్తున్నాడు! నాకే ఎందుకు ఇలా జరుగుతోంది!"
 ఏడుపు ఆపుకోలేక దుర్గ భుజం మీద తలవాల్చేసింది సౌమ్య .
"... ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఈ కొద్ది రోజులు ఎలాగోలా భరిద్దామనుకున్నా.నిన్న ఫిజిక్స్ క్లాస్ అయ్యాక బయటికి వస్తుంటే నన్ను దగ్గరికి రమ్మన్నాడు. ఏమిటీ, మార్కులు ఇంత తక్కువగా వచ్చాయి? అర్థం కావటం లేదా? రేపు ప్రాక్టికల్స్ అయ్యాక కాసేపు ఉండిపో. డౌట్స్ క్లియర్ చేస్తాను. అన్నాడు. మౌనంగా తలూపి వచ్చేశా. ఈరోజు ల్యాబ్ నుండి త్వరగా బయటపడదామని వచ్చేస్తున్నా. అందరూ బయటికి వెళ్లిపోయారు. ఈ లోపే వెనకగా వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని..."
 ఆపై మాటలు రాక వెక్కివెక్కి ఏడవసాగింది సౌమ్య. తనని ఎలా ఓదార్చాలో తెలియక దుర్గ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని  అనునయించసాగింది. రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.
" సౌమ్యా, వాడలా ప్రవర్తిస్తుంటే ఇన్నాళ్లుగా భరించడం పొరపాటు. ఇంకా చావాలనుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. ఇక చాలు, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాటివ్వాలి.. "
 చేయి చాపింది దుర్గ.
" లేదులే దుర్గా, ఏదో తట్టుకోలేక ఆ క్షణంలో అలా చేశాను గానీ ఇప్పుడు అనిపిస్తోంది నాకూ, అదెంత  పొరపాటో.. ప్రామిస్, ఇక ఎప్పటికీ అలా చేయను.."
దుర్గ చేతిలో చేయి వేసింది సౌమ్య.
                          ********
  మర్నాడు లంచ్ బ్రేక్ లో దుర్గ ఆలోచన ప్రకారం ఇద్దరూ వెళ్లి ఇంగ్లీష్ మేడం సాధన గారిని కలిశారు. జరిగిందంతా పూస గుచ్చినట్టు వివరించింది దుర్గ.
"వ్వాట్! రాధాకృష్ణ సర్ ఇలా చేస్తున్నాడా!అన్బిలీవబుల్. చూడ్డానికి ఎంతో మర్యాదస్తుడిలా కనిపిస్తాడే!.. "
 అంటూ సౌమ్య కేసి తిరిగి,
" ఇలా జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సమస్య చెప్పుకోవాలి. అలాకాక చచ్చిపోదామనుకుంటే ఎలా? తప్పు చేసింది అతనైతే శిక్ష నీవు వేసుకుంటావా! అలా మరికొందరు అమ్మాయిల్ని అతను టార్గెట్ చేయడా?"
 సున్నితంగానే మందలించింది సౌమ్యను.
"..పోతే, నీతోనే ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడన్నావు కదా...నెమ్మదిగా, కూల్ గా ఉండేవాళ్లు ఏమీ అనలేరనీ, ఎవరితోనూ చెప్పుకోలేరని ఇలాంటి వాళ్ళ ధైర్యం. అది నువ్వు బాగానే నిరూపించావు. కానీ దుర్గ పసిగట్టడం చాలా మంచిదయింది. సరే, దీని గురించి ఆలోచిస్తాను. మీరు క్లాస్ కి వెళ్ళండి"
 అని చెప్పి ఇద్దరినీ పంపించేసింది.
                                 ***********
 మరుసటి రోజు---
 సాధన చెప్పిందంతా విన్న ప్రిన్సిపల్ సుదేష్ణాదేవి కోపానికి అంతులేకపోయింది. కానీ,అంతలోనే ఇది సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం అన్న విచక్షణతో వెంటనే మరో ఇద్దరు లేడీ లెక్చరర్స్ ని, సివిక్స్ లెక్చరర్ శివశంకర్ ను కూడా పిలిపించి వాళ్లతో కూడా సంప్రదించి, వాళ్లందరికీ కొన్ని పనులు అప్పగించి పంపించేసి ఆలోచనలో పడింది.
   తను ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో దగ్గరి బంధువు ఒకతను  ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన భుజాలపై చేతులు వేయడం, బుగ్గల్ని సాగదీయడం లాంటి పనులు చేసేవాడు. రెండు మూడు సార్లు చూసి, కంపరంగా అనిపించి అమ్మతో చెప్పేసింది. యధాలాపంగా ఓరోజు ఇంటికి వచ్చిన అతన్ని పట్టుకుని అమ్మ చెడామడా దులిపేసింది. అంతే! అతను మళ్లీ ఇంటి గడప తొక్కితే ఒట్టు! ఆరోజు నుండీ అతనికీ, తమ ఇంటికీ సంబంధం పూర్తిగా తెగిపోయింది. అలాంటి ప్రబుద్ధులు, వికృత చేష్టల మృగాళ్లు అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటారన్నమాట !! అనుకుంటూ తల పంకించింది సుధేష్ణాదేవి.
                                 **********
   రెండు రోజుల వ్యవధి తీసుకుని పని పూర్తి చేసుకుని లెక్చరర్స్ అంతా వచ్చి కూర్చున్నారు ప్రిన్సిపల్ ఎదురుగా. వాళ్ళు చెప్పిన సమాచారం వినగానే సుదేష్ణాదేవి కాసేపు నిర్వికారంగా అయిపోయింది. ఇంతవరకూ సౌమ్య ఒక్కతే బాధితురాలు అనుకుంటున్నారు. కానీ, సైన్స్ గ్రూపుల వారందరినీ కూర్చోబెట్టి అనునయంగా వారిని ప్రశ్నించేసరికి ధైర్యం వచ్చి నోరు తెరిచారట! మొత్తం మీద బైపీసీలో ముగ్గురు, ఎంపీసీలో మరో ఇద్దరు ఇలాంటి చేదు అనుభవాలే తామూ ఎదుర్కొంటున్నట్లు బయటపడ్డారు. చెబితే అంతా తమను అదోలా చూస్తారని, ఇంట్లో తెలిస్తే కాలేజీ మాన్పించేస్తారని భయపడి  మిన్నకుండి పోయామని వాళ్ళనగానే విస్తుబోవడం  లెక్చరర్ల వంతయిందట!! ఆలోచిస్తే...ఇంకా బయటపడని వాళ్ళూ ఉండే ఉంటారని చెప్పారు లెక్చరర్స్.
     కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీలలిత ఎంక్వయిరీలో అతని వ్యక్తిగత సమాచారం కొంతవరకు తెలిసింది. నలభై దాటిన  రాధాకృష్ణ అనే ఈ అధ్యాపకునికి పెళ్లయింది. భార్య గృహిణి. పెద్దగా చదువుకోలేదు. ఇద్దరు కొడుకులు హైస్కూల్లో చదువుతున్నారు.
  తరువాత శివశంకర్ గతంలో రాధాకృష్ణ పని చేసిన కాలేజీ నుండి సేకరించిన సమాచారం తెలిపాడు. ఆ కాలేజీ కో ఎడ్యుకేషన్ . అక్కడ కూడా అమ్మాయిల నుండి ఇలాంటి ఆరోపణలు ప్రిన్సిపాల్ కు అందాయి. బ్రతిమాలి బామాలి పై అధికారుల దాకా పోకుండా చేసుకున్నాడు. అందుకే రెండేళ్ల గడువు దాటిపోగానే ఎలాగోలా ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికొచ్చి పడ్డాడు. కానీ కుక్క తోక వంకర పోయేది కాదు గదా! అలాగే ఇతని నైజమూ మారలేదన్నమాట! అనుకుంది సుదేష్ణాదేవి. వెంటనే,ఇక ఉపేక్షించడంలో అర్థం లేదు అని స్థిరంగా నిశ్చయించుకున్నారామె. గంట తర్వాత మళ్లీ కలుద్దామని చెప్పి వాళ్లను పంపించేసి, అటెండర్ తో చెప్పి రాధాకృష్ణను పిలిపించింది.ఏ ఉపోద్ఘాతమూ లేకుండా సూటిగానే విషయంలోకి వెళ్లారామె.
" మీ ప్రవర్తన వల్ల స్టూడెంట్స్ ఎంత మానసిక వేదనకు లోనవుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతోందా!గురువు తండ్రితో సమానమంటారు.
 మీ ఈ ప్రవర్తనకు మీ సంజాయిషీ ఏమిటి? "
"మేడం,వాళ్ళు చిన్న పిల్లలు. నన్ను అపార్థం చేసుకున్నారు. నేనలాంటి వాణ్ణి కాదు. ఏదో చిన్న వాళ్ళని చనువుకొద్దీ చేయి పట్టుకుంటే ఇలా వక్రీకరిస్తే ఎలా మేడం ? "
 దిగ్గున లేచింది సుదేష్ణాదేవి.
"ఆపండి, సీనియర్ ఇంటర్ చదువుతున్న టీనేజీ ఆడపిల్లలండీ వాళ్ళు. ఏది గుడ్ టచ్చో, ఏది బాడ్ టచ్చో తెలీని పసిపాపల వయసా వాళ్లది? నీ చేష్టల వల్ల ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది, తెలుసా నీకు?.. "
" సారీ మేడం, క్షమించండి ... "
" సారీతో సమసిపోయే సమస్య కాదిది. ఇక మీరు వెళ్ళవచ్చు.. "
మౌనంగా లేచి నిల్చున్నాడతను.
                          **********
  మరుదినమే స్టాఫ్ మీటింగ్ పెట్టి విషయం చర్చలో పెట్టారు సుదేష్ణాదేవి. అందరి అభిప్రాయం విన్నాక అందరి సమ్మతితో ఓ నిర్ణయం తీసుకుని ఎవరు ఏం చేయాలో చెప్పి పంపించేశారు.
   మరుసటి రోజు మధ్యాహ్నంకల్లా సైన్స్ స్టూడెంట్స్ రాధాకృష్ణ సర్ మీద కంప్లైంట్ రాసి "ఈ సార్ మాకొద్దు" అంటూ సంతకాలు చేశారు. తానూ ప్రిన్సిపల్ గా మరో కంప్లైంట్ రాసి ఆ రోజే పై అధికారులకు పంపించేశారు  సుదేష్ణాదేవి గారు.
   వారం రోజుల్లో ఎంక్వయిరీ కమిటీ వచ్చి విచారించింది. అంతా నిజమేనని తేల్చి రిపోర్ట్ రాసుకొని వెళ్లారు. రెండు రోజుల్లో రాధాకృష్ణకు సస్పెన్షన్  ఆర్డర్స్ చేతికి అందాయి. రెండు వారాల తర్వాత దూర ప్రాంతంలో మారుమూలనున్న ఓ బాలుర జూనియర్ కాలేజీకి బదిలీ జరిగిపోయింది.
                        *************
   ఆరోజు అసెంబ్లీ హాల్లో స్టాఫ్, స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ నూ సమావేశపరిచి అందరినీ ఉద్దేశిస్తూ ప్రసంగించారు సుదేష్ణాదేవి గారు.
" ఇలాంటి సంఘటనలు కాలేజీలో జరగడం చాలా బాధాకరం. కానీ, ఒక్క విషయం అందరం ఆలోచించాలి. సమస్యలు ఎలాంటివైనా సరే ఎప్పుడైనా,ఎక్కడైనా, ఎవరివల్లనైనా రావచ్చు. అలాంటప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ పిరికిగా భయపడకూడదు. తనకు తానుగా పరిష్కరించుకో లేనప్పుడు పక్కవారి సాయం తీసుకోవడంలో తప్పులేదు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. తప్పు నీదేనని మందలించడం, చదువు మానిపించడం పరిష్కారం కానే కాదు. వాళ్లకు ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టాలి. అమ్మాయిలందరికీ మరోసారి మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఇలాంటి సమస్య ఏదైనా మీకు ఎదురైనప్పుడు మీలో మీరే కుమిలిపోకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలి. ఈ సందర్భంగా దుర్గ అనే స్టూడెంట్ ను నేను మనసారా అభినందిస్తున్నాను. స్నేహితురాలి మనస్థితిని గమనించిన ఆ అమ్మాయి వయసుకు మించిన పరిణతి చూపించి సౌమ్యనే గాక మరెందరినో ఈ సమస్య నుండి బయట పడేయగలిగింది. ఆ అమ్మాయికి నా మనఃపూర్వక అభినందనలు. ఇంకా స్టూడెంట్స్ తమ వ్యక్తిగత సమస్యల్ని తనతో పంచుకునేలా వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకున్న సాధన మేడం గారినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను... "
హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
                          **********
" థాంక్యూ వెరీమచ్ దుర్గా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నన్నో పెద్ద ఉపద్రవం నుండి బయట పడేశావు.. "
 సమావేశం అయిపోయాక దుర్గ చేతులు పట్టుకుంటూ ఆర్ద్రంగా అంది సౌమ్య.
"ఛ! ఊరుకోవే, సరేగానీ, ఇప్పటికైనా పిరికితనం వదులుకుంటావా లేదా...!?"
" ఇంకానా! నీలా పదిమందికి ధైర్యం చెప్పే శక్తి వచ్చింది తెలుసా..? "
 ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని గలగలా నవ్వుకుంటూ గేటు దాటి ముందుకు కదిలారు.
              ****************************
  
   
    



  

Wednesday, April 9, 2025

పుట్టిల్లు...కథ...

🌺                                  ~~ యం.ధరిత్రీ దేవి ~~

  ఆరోజు అలివేలమ్మ పెద్దకూతురు అనసూయ కొడుకు నామకరణం. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడు. అందుకని మరీ ప్రత్యేకం...ముఖ్యంగా అలివేలమ్మకు.
     బంధుమిత్రుల సమక్షంలో కార్యక్రమం పూర్తయి భోజనాలయేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. మూడు గంటల తర్వాత... అనసూయ, ప్రభాకరం ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. సుభద్ర ఇద్దరికీ బొట్టు పెట్టి కొత్త బట్టలు పెట్టింది. ఇద్దరూ వెళ్లి కట్టుకుని, తయారై వచ్చారు. ఇద్దరికీ ఒడి బియ్యం పెట్టాక ముత్తయిదువలందరూ ఆశీర్వదించి హారతి పాట పాడి ముగించారు. సాయంత్రానికంతా సందడి సద్దుమణిగింది. 
     అలివేలమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, పెద్ద కొడుకు నారాయణరెడ్డి భార్యే సుభద్ర.పెళ్లయి ఎనిమిదేళ్లయింది . ఆమె కోడలిగా ఇంట అడుగు పెట్టాక  నాలుగేళ్ల వ్యవధిలో మరిదికి, ఆడపడుచుకూ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరూ సంవత్సరం తిరిగేసరికల్లా బిడ్డల్ని ఎత్తుకున్నారు. కానీ అదేమిటో... సుభద్ర కడుపు మాత్రం పండలేదు. అందరు  దేవుళ్లకూ మొక్కుకుంది. పూజలు,  నోములూ నోచింది. డాక్టర్ల దగ్గరకెళ్ళి  ఇద్దరూ  చూపించుకున్నారు. ఏ లోపం లేదన్నారు. ఎదురు చూడాలి...అంతే.. అనుకున్నారు ఇద్దరూ. మనసులో ఏమీ పెట్టుకోక, ఇంట్లో తిరుగాడే పిల్లలతోనే అచ్చట ముచ్చటా తీర్చుకుంటూ కాలం గడుపుతూ ఉంది  సుభద్ర. 
     కానీ... అమ్మలక్కలూరుకుంటారా...! 
" ఏమిటో పాపం! సుభద్ర ! ఇన్నేళ్లయినా ఇంకా నీళ్లోసుకోలేదు... దేవుడింకా దయ తల్చలేదు మరి!!"
 సానుభూతులు చూపిస్తున్నట్టే ఉంటుంది. సుభద్రకు ముల్లు  గుచ్చినట్లుంటుంది. వినీ వినీ విసుగొచ్చి వాళ్ల మాటలు పట్టించుకోవడం మానేసింది... కానీ.. బయటి వాళ్ల పోరు బయటే  ఉంటుంది.. ఇంట్లో అత్తగారంటూ ఒకరున్నారాయె ! ఆవిడ ఎత్తి పొడుపులు, ఈసడింపులు ఈ మధ్య భరించడం ఆమె శక్యం గావడంలేదు. భర్త మంచివాడే. తనంటే ఇష్టమే. కానీ ఎప్పుడూ తల్లి కనుసన్నల్లోనే ! పెళ్లయ్యాక భార్య అన్నది కూడా మనిషేననీ, ఆమెకూ ఇష్టాఇష్టాలుంటాయనీ మనసుకు పట్టని వాడు. స్వయంగా ఏ నిర్ణయాలు తీసుకోలేని అశక్తుడై అన్నీ తల్లికే వదిలేస్తుంటాడు. తల్లిని గౌరవించడం మంచిదే. కానీ మరీ సొంత అభిప్రాయమన్నదే లేకపోవడం సుభద్రకు బాధ కలిగించే విషయం...
      సుభద్ర ఏడెనిమిదేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకో  కొడుకు. పెళ్లయిపోయింది. ఉన్న ఊర్లోనే ఉన్న పొలం చూసుకుంటూ ఉంటాడు. భార్య, ఇద్దరు పిల్లలు. బొటాబొటీగా వచ్చే ఆదాయం ! ఇటీవలే  సవతి తల్లి కూడా చనిపోయింది...అక్కడ పరిస్థితులు అలా ఉంటే...సుభద్రకు పుట్టింటి నుండి  పెట్టుబోతలు, జరుగుబాట్లు ఎలా సాగుతాయి ! చిన్న కోడలు కలిగినింటి  నుండి వచ్చింది. అనుక్షణం ఆమెతో పోలుస్తూ, పెద్ద కోడల్ని ఎద్దేవా చేయడం... సూటిపోటీ మాటలనడం...! వయసుకు పెద్దదే గానీ, పెద్దరికం ఏమాత్రం లేని ఆడది! అయినా.. అన్నీ చేయాల్సింది మాత్రం సుభద్రే ! చిన్న కోడలు ఎప్పుడూ పుట్టింట్లోనే ! ఏడాదిలో ఏ రెణ్ణెల్లో అత్తారింట్లో గడిపేస్తూ ఉంటుంది. ఏదో చేసే వాళ్ళకే మొట్టికాయలన్నట్టు... సుభద్రకు అత్తగారి పోట్లు తప్పడం లేదు. 
                  **            **          **
  కార్యక్రమాలన్నీ అయిపోయాయి. మరుసటి రోజు, 
" వెళ్లొస్తాం అత్తా, వస్తాం బావా , "
 ప్రభాకరం భార్యాపిల్లలతో తన ఊరికి బయలుదేరుతూ అందరికీ చెప్పాడు. సుభద్ర వైపుతిరిగి, 
" వెళ్ళొస్తామమ్మా  సుభద్రా.. "
 అంటూ ఆప్యాయంగా చూస్తూ, 
"...ఏమిటో బావా, చెల్లెమ్మను తీసుకుని మా ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకూ  రాలేదు నువ్వు.. "
నారాయణతో నిష్టూరంగా అన్నాడు. మౌనమే నారాయణ సమాధానమైంది. చిన్నల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్దగా మాట్లాడే స్వభావం కాదు. ప్రభాకరమేమో మంచి మాటకారి. 
    ప్రభాకరానికి సుభద్ర అంటే లోలోపల ఏదో తెలియని ఆపేక్ష. అతనికి అక్కాచెల్లెళ్లు లేరు. సుభద్ర కంటే ముందుగానే ఈఇంటి అల్లుడైనాడతను.తర్వాత కొన్ని నెలలకే అలివేలమ్మ పెద్దకొడుకు నారాయణరెడ్డికి పెళ్లయి సుభద్ర ఆఇంటి పెద్దకోడలయ్యింది. అప్పట్నుంచీ గమనిస్తున్నాడామెను...తను ముగ్గురు పిల్లల తండ్రయ్యాడు.. ప్రతీసారి తనకేకాకుండా చిన్నల్లుడికీ, చిన్నకూతురికీ అలివేలమ్మ ముత్తయిదువు కానందుకు సుభద్రే తన చేతుల్తో బట్టలు పెట్టడం,ఇంటి అల్లుళ్లుగా ఇతర అన్ని మర్యాదలూ చేయడం చూస్తున్నాడు. ఎప్పుడూ ఆమె తన పుట్టింటికి వెళ్లడం తను చూడలేదు ప్రభాకరం. ఇంట్లో బండెడు చాకిరీ ఆమె నెత్తిమీదే!అంత చేస్తున్నా ఏమాత్రం గుర్తింపుకు నోచుకోని వైనం కూడా అతని దృష్టికి రాకపోలేదు. తన పెళ్లయి, ఇంటికి అల్లుడైన కొద్దిరోజుల్లోనే అత్తగారి నైజం అతను గ్రహించాడు. ఏంచేయగలడు ! తనేమో ఇంటి అల్లుడు.ఇంటి కోడలి గురించి అత్తగారి వద్ద ప్రస్తావించలేడు గదా !!
    మరోసారి అత్తగారికి చెప్తూ కాళ్లకు దండం పెట్టి, సెలవు తీసుకున్నాడు.తర్వాత కాసేపటికి చిన్నకూతురు,అల్లుడు, టౌన్లో పనుందంటూ చిన్నకొడుకూ వాళ్ళవాళ్ళ కుటుంబాలతో వెళ్లిపోయారు. ఇంట్లో ముగ్గురే మిగిలారు. 
                 **            **           **
    రెండేళ్లు పరుగులు తీశాయి. అతిమామూలుగా సాగిపోతున్న సుభద్ర దినచర్యలో ఏదో చిన్న మార్పు గోచరించింది. వారం, పదిరోజులుగా ఒంట్లో నలతగా ఉంటూ తిండి సయించక ఇబ్బంది పడుతూ ఉంది. రెండు వారాలు గడిచినా తగ్గకపోవడంతో ఎప్పుడూ చూపించుకునే డాక్టరమ్మ దగ్గరికెళ్లింది....
" నిజమా ! కలగాని కంటున్నానా...!"
అన్ని వివరాలూ కనుక్కుని, పరీక్షించి డాక్టర్ చెప్పిన విషయం విని ఉబ్బి తబ్బిబ్బయిపోయింది సుభద్ర. అసలు ఈమాట వినడానికి నోచుకుంటానా అని ఎన్నోసార్లు అనుకుంటూ కుమిలిపోయిన ఆమె హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కింది. వెంటనే వెళ్లి భర్తతో తన సంతోషం పంచుకోవడం కోసం ఆమె మనసు పరుగులు తీసింది. శుభవార్త విన్న నారాయణ సుభద్ర కళ్ళనుండి ధారలుగా కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ,  
" మనం ఎదురుచూసిన రోజు వచ్చింది. ఇక కన్నీళ్ళన్నవి ఉండకూడదు..."
అంటూ దగ్గరకు తీసుకున్నాడు. 
              **             **           **
   విషయం అందరికీ తెలిసింది. అలివేలమ్మలో ఆశించినంత ఆనందమయితే కనిపించలేదు. బహుశా... ఆమె మనవళ్ళు, మనవరాళ్ల  ముచ్చట అప్పటికే తీరిపోయి ఉండడం కారణం కావచ్చునేమో ! మరోవైపు...పెద్దకొడుకు...ఇంటి భారమంతా మోస్తున్న వాడు.. ఇన్నేళ్లకి తండ్రి కాబోతున్నాడని తెలిసి ఓవైపు సంబరపడినా... కోడలి వల్ల వాడికి  ఏముచ్చట్లూ తీరవే అన్నది ఓ మూల ఆమె బాధ.
    ఐదవనెల వచ్చేసింది... సీమంతం చేయవలసిన సమయం! అత్తగారి నసుగుడు మొదలైంది. సుభద్ర ఏమి చేయగలదు! తండ్రిని చిన్నప్పటినుంచీ చూస్తోంది. ఏ బాధ్యతలూ  మోసుకోని మనిషి! తమ్ముణ్ణి నోరు విడిచి అడగలేదు కదా, నాకు సీమంతం చేయమని ! తనకు తెలిసి పుట్టింటి వారే కాదు... అత్తింటి వారూ కోడళ్ళకు సీమంతాలు చేయడం చూసింది...అత్తకు ఆ విషయం తెలియదా ఏమి ! కానీ.. తన అత్తకు ఆ  ఆలోచన రాకపోవడం తన ఖర్మ ! ఆమె నుంచి అంత ఆశించడమూ అత్యాశేలే... అనుకుంది తనలో తాను.
    చూస్తుండగానే తొమ్మిదోనెల  నెల ప్రవేశించింది. నిండుగా ఇంట్లో తిరుగుతున్న భార్యను చూస్తున్న నారాయణకు ఎంతో తృప్తిగా అనిపిస్తున్నా... ఏదో బాధ కూడా ఓవైపు తొలిచేయసాగింది. చిన్నప్పటినుంచీ తల్లికి ఎన్నడూ ఎదురు చెప్పే అలవాటులేదతనికి. పైగా... బొత్తిగా నోట్లో నాలుక లేని మనిషి ! 
      ఖర్చుకు వెనుకాడే రకం కాదు.  వాస్తవానికి...  భార్యను కాన్పుకు ఎక్కడికీ పంపడం ఇష్టం లేదతనికి. మొదటిసారి...అదీ ఎన్నో ఏళ్ళకి ! తానే దగ్గరుండి చూసుకోవడం అవసరం కూడా. కానీ...తల్లి ముభావం, ప్రవర్తన అతన్ని ఇరకాటంలో పడేస్తోంది. కాన్పులు, పురుళ్ళు అంటే పూర్తిగా ఆడవాళ్ళతో ముడివడిఉన్న వ్యవహారాలు మరి ! కొద్దిరోజులుగా రేయింబవళ్లు ఇదే ఆలోచిస్తూ సతమతమౌతూ ఉన్నాడు. 
     ఆసాయంత్రం...ఇంట్లో పనిలో ఉన్న సుభద్రకు బయట పొరుగింటి వాళ్ళతో అత్తగారంటున్న మాటలు ఎంత వద్దనుకున్నా వచ్చి చెవిలో పడ్డాయి. 
" ఏమిటోనమ్మా.. ! తొలికాన్పు పుట్టింట్లో పురుడు పోసుకోవడం ఆనవాయితీ...మాకా అదృష్టంఎక్కడిదీ!
మాకు తప్పేలా లేదు..."
ఆవిడ ఈసడింపు మాటలు అలవాటైనవైనా ఎందుకో ఈసారి మనసు చివుక్కుమంది సుభద్రకు. ఏదైతే అదయింది...అనుకుంటూ...ఆరాత్రి భర్త ఫోన్ తీసుకుని తమ్ముడితో మాట్లాడింది. 
"" కృష్ణా, నాన్న ఉన్నాడా? "
" లేడక్కా, పక్క ఊర్లో జాతర...వెళ్ళాడు.."
".............. "
" చెప్పక్కా "
తటపటాయిస్తూ, 
" ఏమిలేదు...నాకు తొమ్మిదోనెల వచ్చేసింది... "
".............."
" అదే...కాన్పుకు మనింటికి రావాలనుకుంటున్నా... "
ఆరెండు మాటలూ అనడానికి ఎక్కడలేని శక్తి పుంజుకోవాల్సి వచ్చింది సుభద్రకు...ఓవిధంగా మనసు చంపుకుని ! నవనాడులూ కుంగిపోయాయి. 
"ఔనక్కా...నేనూ అదే అనుకుంటున్నా...వారం పదిరోజుల్లో వీలు చూసుకుని వస్తా, నిన్ను పిల్చుకురావడానికి... "
ఊహించని జవాబు ! ఒక్కసారిగా నోట మాట రాలేదు సుభద్రకు ! 
"...ఒక్క నిమిషం... "
"..........."
"..ఆ...వచ్చే సోమవారం అక్కా..మంచిరోజు...వస్తా. రెడీగా ఉండు "
ఫోన్ పెట్టేశాడు. మూతి తిప్పుకుంది అలివేలమ్మ. తల్లి గొణుగుడు  నుంచి తాత్కాలికంగా కాస్త ఉపశమనం లభించినట్లయింది నారాయణకు. ఆరోజు కోసం ఎదురు చూడసాగింది సుభద్ర.
                **               **             **
  రానే వచ్చింది ఆరోజు.  ఉదయం తొందరగా లేచి, పనులన్నీ ముగించుకుంది. టిఫిన్ అయ్యాక, మధ్యాహ్నానికి వంట కూడా చేసేసింది. రాత్రే  బట్టలు సర్దేసుకుంది. పది  దాటింది. తమ్ముడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.  భార్యలో  అంత సంతోషాన్ని ఎన్నడూ చూడని నారాయణ కూడా ఆమెను చూస్తూ సంబరపడ్డాడు.పన్నెండు దాటింది...ఒంటిగంట కూడా దాటింది. తమ్ముడు రాలేదు. సుభద్ర మొహంలో నీలినీడలు కమ్ముకున్నాయి. అంతా భోంచేశారు. సుభద్ర కూడా ఏదో తిన్నాననిపించి నీరసంగా పక్క మీద వాలిపోయింది. నాలుగు దాటుతుండగా ఫోన్ రింగయింది. దిగ్గున లేచింది సుభద్ర. వాడే...!తమ్ముడే...అనుకుంటూ..! నారాయణ ఫోన్ తీశాడు.
" హలో,  కృష్ణా.. "
" ఆ, బావా... "
"...చెప్పు "
"... మేము హాస్పిటల్ లో ఉన్నాము. మా మామకు.. అదే... రాజీ వాళ్ళ నాన్నకు హార్ట్ ఎటాక్! ఉదయం ఫోన్ వచ్చింది. అందరం వచ్చేశాం... మీరు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారని ఫోన్ చేస్తున్నా...అక్కకు కూడా  చెప్పు..."
ఫోన్ పెట్టేశాడు... మళ్లీ ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. ఆ పరిస్థితుల్లో తాను అడగడం బాగుంటుందా ! నారాయణ సందిగ్ధం ! వాకిలి వద్ద నక్కి అంతా వింటున్న అలివేలమ్మ, 
" అనుకుంటూనే ఉన్నా.. అనుకున్నంతా అయింది..."
గొణుగుడు  మొదలైంది మళ్ళీ...ఉత్సాహంగా లేచిన సుభద్ర ఒక్కసారిగా మంచం మీద కూలబడిపోయింది. ఆమె వద్దకు రాబోయిన నారాయణకు ఇంటి ముందు ఆగిన ఆటో కనిపించింది. శబ్దం విని అలివేలమ్మ బయటకు తొంగి చూసింది. ఇద్దరికీ పెద్దల్లుడు ప్రభాకరం, అనసూయ ఆటో దిగుతూ కనిపించారు.
" ఇప్పుడెందుకొస్తున్నారబ్బా!"
 అనుకున్నారిద్దరూ వాళ్లను చూడగానే...
" బావా,  ఇంట్లోనే ఉన్నావా... మంచిదే."
అంటూ ప్రభాకరం లోపలికి వచ్చాడు. ఐదు నిమిషాల తర్వాత మంచినీళ్లు తాగుతూ, 
" ఏమీ లేదు బావా, ఇప్పుడిలా ఎందుకొచ్చామా... అనుకుంటున్నారు కదూ.. ! మరేమీ లేదు బావా మీరు అనుమతిస్తే సుభద్రను కాన్పుకు  మాఇంటికి పిల్చుకెళ్లాలనుకుంటున్నాము..."
అంటూ అత్తగారి  వైపు చూశాడు. ఆవిడ ఒక్కసారిగా వినకూడని మాటేదో విన్నట్లు మొహం పెట్టింది. నారాయణకు అతను అంటున్నదేమిటో వెంటనే అర్థం కాలేదు. అలివేలమ్మ తేరుకుని, 
" అదేంటయ్యా, మీరు పిల్చుకెళ్లడమేమిటి ! "
అంది ప్రశ్నార్థకంగా. 
" ఏమత్తా, నాకా అర్హత లేదా ! నన్ను అన్నా అని పిలుస్తుంది. నాకు చెల్లెలే  కదా మరి! అల్లుడంటే మర్యాదలు, పెట్టుబోతలూ స్వీకరించేవాడు మాత్రమేనా ! ఎన్నోసార్లు ఆమె చేత్తో నాకు కానుకలు అందించింది. ఆమెకీమాత్రం నేను చేయడం కూడదా!ఏమత్తా !"
".............."
 తనకూ, తన బిడ్డలకు, అల్లుళ్లకూ,వాళ్ళ  పిల్లలకూ కోడలు చేయాలి... కోడలిదాకా వచ్చేసరికి... మాకేం సంబంధం? పుట్టింటి వాళ్ళు కదా చూసుకోవాలి అవన్నీ...! అనే బాపతు ఆవిడ ! 
"...అది సంప్రదాయం కదా అనొచ్చు మీరు... నిజమే.. కానీ..అదే సంప్రదాయం కోడలికి ఎందుకు వర్తించదు !అల్లుడు, కోడలు...ఇద్దరూ పరాయింటి నుంచి వచ్చినవారే...ఈ బేధభావమెందుకు? "
"అవునమ్మా, నాతో చాలాసార్లు అన్నారీయన...సుభద్రకు కాన్పు మనమే చేద్దాం అనసూయా.. అని.. వదినకు మాత్రం ఎవరున్నారు!" 
 అనసూయ తల్లి వైపు చూస్తూ అంది.
" నువ్వుండవే,   అది కాదు బాబూ, తొలి కాన్పు పుట్టింట్లో చేయడం ఆనవాయితీ కదా అని..."
" చెల్లెలికి అన్న ఇల్లు పుట్టిల్లు అవదా అత్తా ! చెల్లెలి చేత అన్నీ పెట్టించుకోవడమేనా ఈ అన్న  పని! ఈ చెల్లెలికి నేనేమీ ఇవ్వకూడదా! చేయకూడదా!ఏమత్తా! అల్లుడు మర్యాదలందుకోవడానికీ...అదే ఇంటి కోడలు అందరికీ చాకిరీ  చేయడానికేనంటావా ! అయినా అత్తా, పుట్టిల్లు అంటే పుట్టి పెరిగిన ఇల్లే అవాలా!... ప్రేమ, అభిమానం ఉన్నచోటు ఏదైనా అది ఆడపిల్లకు పుట్టిల్లే అవుతుందత్తా.. అయినా, రక్తం పంచుకు పుడితేనే అన్నాచెల్లెళ్లా! నోరారా నన్ను అన్నా అని పిలుస్తుంది, నా ఇల్లు తనకు పుట్టిల్లు కాకూడదా!? ఏమత్తా!"
మధ్యలోనే అడ్డుకొని అన్నాడు ప్రభాకరం.అలివేలమ్మ ఇంకేం మాట్లాడగలదు !!
" ఏం బావా, చెప్పు. చెల్లెమ్మను నాతో పంపిస్తావా... "
దిగ్భ్రమ నుండి బయటపడ్డ నారాయణ, ఆలోచనలో పడిపోయాడు. కృష్ణ గుర్తొచ్చాడతనికి. అతను ఖచ్చితంగా వస్తాడా ! సందేహమే ! వచ్చినా...సుభద్ర కక్కడ ఆదరణ మనస్ఫూర్తిగా అయితే ఉండదు.  ఆతమ్ముణ్ణి నోరు తెరిచి అడిగింది సుభద్ర. కరుణాకరం బావ తనకుతానుగా భార్యతో కలిసివచ్చి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. భార్యకిప్పుడు కావలసింది ఇలాంటి మనుషులే. తన ఆసరా ఎలాగూ ఉంటుంది.ప్రసవ సమయంలో ఆడపిల్లకు తన వాళ్లంటూ ఉంటే అదో భరోసా.అయినా...కృష్ణ గురించి ఓమాట చెప్తే బాగుంటుందనిపించి, 
" అది కాదు బావా, ఈరోజు కృష్ణ వచ్చి పిల్చుకెళ్తానని చెప్పాడు. కానీ, అనుకోకుండా వాళ్ళ మామ ఆసుపత్రిలో చేరాడట ! అందుకని రాలేకపోయానని ఫోన్ చేశాడు....."
" మరేమీ పర్వాలేదులే బావా, కృష్ణకు నేను నచ్చజెప్తాను. నువ్వు మాత్రం నాకోరిక కాదనకు..."
"అలాగే బావా,తప్పకుండాతీసుకెళ్ళు..నీమాట కాదన లేను."
ఇంకా మాట్లాడితే ఆయన్ని బాధపెట్టినట్లవు తుందనుకుని సరే అన్నాడు నారాయణ.  ఏచిన్న పనైనా తల్లి అనుమతి లేనిదే చేయని నారాయణ...ఇప్పుడు కనీసం తల్లి వంక చూడనుకూడా చూడకుండా వెంటనే చెప్పేశాడు. సంతోషంతో, 
" ఈరోజు మంచిరోజు... ఇప్పుడే బయలుదేరుతాం బావా అమ్మా, సుభద్రా, పదమ్మా తయారవ్వు. అనసూయా, వెళ్ళు. చెల్లెమ్మ బట్టలవీ సర్దుకుని తీసుకురా... "
" వదినా, పద.. "
అంటూ సుభద్ర వద్దకొచ్చింది అనసూయ. సుభద్ర భర్త వైపు చూసింది. నారాయణ కళ్ళతోనే చెప్పాడు వెళ్ళమని. 
 ఆమె ఇంత ప్రేమను ఒక్కసారిగా కలలోనైనా ఊహించలేదు. ప్రభాకరం అన్నయ్యంటే ఓవిధమైన ప్రత్యేకాభిమానమైతే ఆమెకూ ఉంది. ఎన్నో ఏళ్లుగా చూస్తోంది. కల్మషమన్నది ఏకోశానా లేని మనిషి ! పరాయి మనిషన్న భావన తనకెప్పుడూ కలగలేదు. అనసూయ, తను దాదాపు ఒకే ఈడు వాళ్ళు...అదృష్టవశాత్తూ తల్లి స్వభావం రాలేదు.తనతో బాగానే ఉంటుంది. మొదట ఇక్కడికి వచ్చినప్పుడంతా తనను వాళ్ళింటికి రమ్మని పిలిచేవాడు. అత్త పడనిచ్చేది కాదు...ఇంట్లో ఇబ్బంది అంటూ. రానురానూ ఇక మానేశాడు పిలవడం. 
     అదంతా గుర్తొచ్చింది సుభద్రకు. ఈరోజు ఆప్రేమ తనను ఇంత స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుందనుకోలేదు. తమ్ముణ్ణి నోరు తెరిచి అడిగింది. కానీ ఈ అన్న అడక్కుండానే వరమిస్తానంటున్నాడు...
" అనసూయా, నేను ఆటో తీసుకొస్తాను. తయారయ్యి రెడీగా ఉండండి.."
అని చెప్పి, నారాయణతో కలిసి బయటికి వెళ్ళాడు ప్రభాకరం. అలివేలమ్మకు ఎక్కడో ఏదో పట్టు తప్పుతున్న సంకేతాలు అందుతూ గుండెల్లో సన్నగా అలజడి మొదలై తన స్థానం కదులుతున్నట్లనిపించింది. ఈరోజు అల్లుడి ఊహించని   రాక, కోడలి ప్రవర్తన...ఒక ఎత్తయితే... తన అనుమతికై ఏమాత్రం చూడక ఏకంగా తనే నిర్ణయం తీసుకుని భార్యను వాళ్ళతో పంపించడం మరో ఎత్తయి,  ఆమెకు మింగుడు పడక నిశ్చేష్టయై చూస్తూ ఉండిపోయింది. మొట్టమొదటిసారిగా ఆమె చేతుల్లో నుండి కొడుకు జారిపోతున్నట్లు తోచిందామెకు !!
  అరగంట తర్వాత... 
ఆటో వచ్చింది. ఓ జిప్ బ్యాగు, చేతి సంచీ పట్టుకుని సుభద్ర, అనసూయ గది నుండి బయటకు వచ్చారు.
" వెళ్ళొస్తానత్తా, "
 అత్తగారి కాళ్లకు దండం పెట్టి, చెప్పేసి భర్తతో కలిసి బయట సిద్ధంగా ఉన్న ఆటో వద్దకెళ్ళింది సుభద్ర. ఎన్నో ఏళ్లుగా భర్త నుండి తను ఆశించింది ఎక్కడ మాయమైపోతుందో అన్న ఆతృతలో ఆమె కాసేపు అత్తగారిని లక్ష్యపెట్టడం  పక్కన పెట్టేసింది. దేవుడిచ్చిన అన్న, ఆడపడుచు మధ్యలో కూర్చుని, భర్తకు కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పి చెయ్యి ఊపి, ఇరుగూ పొరుగంతా అబ్బురంగా చూస్తుండగా,  మదినిండా సంతోషం నింపుకుని,   పుట్టింటికి తరలివెళ్ళింది సుభద్ర....
                              *************
[ ప్రభాకరం లాంటి పెద్ద మనసు కలిగిన వ్యక్తులు మన సమాజంలో చాలా అరుదు. అలాంటి అన్న లందరికీ మనఃపూర్వక నమస్సులు ]





 

Tuesday, April 1, 2025

ఇది రివర్స్ లో లేదూ...!!

 

   వారం క్రితం అనుకుంటాను, ఓ ప్రముఖ దినపత్రికలో ఓ వార్త వచ్చింది.
" మా ఆడవాళ్లు తాగుబోతులు అయిపోతున్నారు సారూ.. "
అనే హెడ్డింగ్ తో...! చిత్రంగా ఉందే అనుకుంటూ, ఆసక్తి పుట్టి వివరాల్లోకి వెళితే....
  మేము కూలీ నాలికి వెళ్ళి తెచ్చిన డబ్బులన్నీ మా ఇళ్ళలో మా ఆడవాళ్లు వాళ్ల తాగుడుకి ఖర్చుపెట్టేస్తున్నారు సారూ. మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని మాకు మహా బెంగగా, బాధగా ఉంది. మా ఊళ్లో కొందరు చేస్తున్న సారా వ్యాపారం వల్లే మా ఆడవాళ్లు ఇలా తయారయ్యారు... మా కుటుంబాల్ని కాపాడండంటూ అందరూ వెళ్లి పోలీస్ స్టేషన్లో మొర పెట్టుకున్నారట..!! ఒడిశా రాష్ట్రం, కారాపుట్ జిల్లా, కొండగూడ గ్రామానికి చెందిన పురుషుల ఆవేదన ఇది..!
  కొద్దికాలం క్రితం ఇలాగే  వితండంగా అనిపించే వార్త వచ్చింది పేపర్లో. సాధారణంగా ఎక్కడైనా కోడళ్ళు ఆధునికంగా  (modern ) ఉంటూ ఉంటారు. అత్తగార్లేమో కాస్త సంప్రదాయబద్ధంగా ఉంటారు. అవునా..! కానీ, ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ ఇంటిలో పరిస్థితి   తద్భిన్నంగా ఉందట!
    అత్తగారేమో జీన్స్ వేస్తుందట! కోడలికేమో చీరలు కట్టడమే ఇష్టమట !! పెళ్లయి అత్తవారింట అడుగుపెట్టాక, ఆ అత్తగారు కోడల్ని జీన్స్ వేసుకోవాలని ఒకటే ఒత్తిడి తెచ్చిందట! ఆ కోడలేమో పల్లెటూరి నుండి వచ్చిన కారణంగా ససేమిరా అందట!  ఆఖరికి అత్తగారి ఒత్తిడి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందట ఆ కోడలు!!
 కొసమెరుపు : ఆ అమ్మాయి భర్తతో విషయం చెప్పుకుని వాపోతే, ఆ మగడు తిరిగి తననే కొడుతున్నాడని ఆ అమాయకురాలి ఫిర్యాదు !!
వింటుంటే తమాషాగా అనిపిస్తున్నా ఈ రెండు ఉదంతాల్లో అంతర్లీనంగా ఏదో ఆవేదన ఉందనిపించడం లేదూ!!
*****************************************
  

Friday, March 28, 2025

అదిగో... విశ్వావసు..!

              
అదిగో కోయిల..!
కొమ్మచాటున !!
కుహూ...కుహూ అంటూ...
ఇదిగో..మామిడి కొమ్మ ! 
కాయల భారంతో వంగిపోతూ ...
అల్లదిగో..వేపపూత! 
పచ్చపచ్చగా..పసిమితో 
అందర్నీ పిలుస్తూ..!!అన్నీ కలిసి
'క్రోధి' కి వీడ్కోలు చెబుతూ...
'విశ్వావసు'ను స్వాగతిస్తున్నాయి...
గుమ్మాలకు మామిడి తోరణాలు...
గుభాలించే మల్లెల సౌరభాలు..!
ఘుమఘుమలాడే వంటకాలు...
అన్నింటి నడుమ...
వేసవి వడగాడ్పులు
పరుగులే పరుగులు !!
కష్ట సుఖాల కలబోతే కదా జీవితం...
కలిమిలేములతో సహజీవనం
అనివార్యం..షడ్రుచుల సమ్మేళనం 
ఉగాది పచ్చడి రుచి చూద్దాం..
ఆస్వాదిస్తూ ఈ నిజం...
తెలుసుకుందాం..తెలియజేద్దాం...
స్వీకరిద్దాం..శుభసందేశం...
'విశ్వావసు'సంవత్సరాదిని 
మనసారా స్వాగతిద్దాం...
                              ~యం. ధరిత్రీ దేవి
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐










Friday, March 21, 2025

కవితాహృదయం అంటే...

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పువ్వు విరిస్తే నవ్వు విరుస్తుంది 
 పాప నవ్వితే పలుకు పాటవుతుంది...
 కోయిల కుహూ అంటే పాడాలనిపిస్తుంది..
 కవిహృదయం అంటే ఇదేనా !!

 నింగిని మబ్బులు కమ్మితే...
 అవి కరిగి జల్లుగా  మేను తడిపితే...
 ఊహలకు రెక్కలొచ్చి...హృది స్పందనల
 జడివాన కురిపిస్తుంది..అదే కవిత్వమా!!

 ఆకులు రాలుతున్న వేళ...రాలినచోట 
 కొత్త చివుళ్ళు తొంగి చూస్తున్న వేళ...
 భావనల పరంపర ముంచెత్తే క్షణాన...
 మెరిసే అక్షరమాల కవితాకుసుమమా..!! 

 కలతల కన్నీళ్లు..ఆనందబాష్పాలు..
 కడలి కెరటాలై కాగితాల్ని తడిపేస్తూ...
 అక్షరరూపం దాలిస్తే..! 
 హృదయాన్ని మెలిపెడుతూ..ఒకసారి...
 మోదం కురిపిస్తూ మరోసారి...
 చెలరేగే భావనలు సజీవంగా  
 ముందు నిలిస్తే..!! అది  కవిత్వమా..!!
 ఆ హృదయస్పందనే కవితాహృదయమా..!!

                                      ~ యం. ధరిత్రీ దేవి
                         
                              
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹                        నేడు ప్రపంచ కవితా దినోత్సవం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹







ఫలితం...... ' చిన్నారి ' కథ

ఫలితం 
``````             ~యం. ధరిత్రీ దేవి ~

    లక్ష్మీపురం ఉన్నత పాఠశాలలో  పదవ తరగతి విద్యార్థులకు యూనిట్ పరీక్ష జరుగుతోంది. పరీక్ష కేమేమి చదవాలో టీచర్ వారం క్రితమే చెప్పినా వినోద్ పుస్తకం ముట్టిన పాపాన పోలేదు. అందుకే ఈ రోజు ఒక్క ప్రశ్నక్కూడా జవాబు రాయలేక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. వాడికి అటువైపు కూర్చున్న వికాస్ పరిస్థితీ దాదాపు అలాగే ఉంది. కానీ వినోద్ లాగా వికాస్ చదవకుండా పరీక్షకు రాలేదు. వారం నుండీ చదవాల్సిందంతా బట్టీ పడుతూనే ఉన్నాడు. కానీ వాడి జ్ఞాపకశక్తి అంతంత మాత్రమే. అందుకే  నేర్చు కున్నదంతా మరిచిపోయి, ఎంత ఆలోచించినా గుర్తురాక తల పట్టుక్కూచున్నాడు. 
    ఇంతలో వినోద్ కు వాడు ఎదురు చూస్తున్న అవకాశం దొరికింది. వాడి ముందు కూర్చున్న అబ్బాయి కాస్త పక్కకు జరగడంతో వాడు రాస్తున్న జవాబులు వినోద్ కు స్పష్టంగా కనిపించసాగాయి.  అంతే ! ఆక్షణం కోసమే ఎదురు చూస్తోన్న వినోద్ అది చూసి ఎంచక్కా చకచకా రాసేయడం మొదలెట్టాడు. సమయం అయిపోయేలోగా పాస్ మార్కులకు అవసరమైనన్ని జవాబులు రాసేసుకున్నాడు. 
       వారం తర్వాత టీచర్ అందరి పేపర్లు దిద్ది, క్లాసులో ఇచ్చేసింది. వినోద్ పాసై పోయాడు. వికాస్ మాత్రం ఫెయిలై బిక్కమొగం వేసాడు. టీచర్ వాడికి చీవాట్లు వేస్తూ, ఎందుకు చదవలేదంటూ నిలదీసింది. వికాస్ వెక్కివెక్కి ఏడుస్తూ తన గోడు చెప్పుకున్నాడు. వాడి బాధ అర్థం చేసుకున్న టీచర్ వాణ్ణి ఓదారుస్తూ, అందరివేపు చూస్తూ,
 "చదివింది గుర్తుండాలంటే ముందుగా అర్థం చేసుకుని చదవాలి. నేర్చుకున్న తర్వాత ఒకసారి చూడకుండా రాసి చూసుకోవాలి. అప్పుడు మీమీద మీకు నమ్మకం కలుగుతుంది. అంతటితో ఆగక అలా నేర్చుకున్నవి మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి, " అంటూ కొన్ని చిట్కాలు చెప్పింది. 
      వికాస్ బుద్ధిగా తలూపి, మరోసారి ఫెయిల్ కానంటూ టీచర్ కు మాటిచ్చాడు. వినోద్ కు ఇవేమీ పట్టలేదు. పాసయానన్న ఆనందంలో వాడి తప్పిదం వాడికి తెలియలేదు. తెలిసినా బుర్ర కెక్కించుకునే స్థితిలో వాడు లేడు. 
         తర్వాతి యూనిట్ పరీక్షకు వికాస్ కష్టపడి చదువుతుంటే వాడిపక్కన జేరి, 
" రేయ్, ఎందుకురా బుర్ర పాడుజేసుకుంటావ్?  ఎంచక్కా గైడ్ పక్కన పెట్టుకుని చూసి రాయొచ్చు గదా, లేదంటే ఎవడైనా బాగా రాసే వాడి పక్కన కూచున్నా సరిపోతుంది గదా, " 
అంటూ ఉచిత సలహా పారేశాడు. 
     రెండవ యూనిట్ పరీక్ష అయిపోయింది. వికాస్ పాసయ్యాడు. వినోద్ కూడా పాసయ్యాడు, వికాస్ కంటే ఎక్కువ మార్కులతో ! వాడి పద్ధతి షరా మామూలే. చకచకా అర్ధసంవత్సర పరీక్షలు వచ్చేశాయి. టీచర్ సలహాలు తు. చ తప్పక పాటించిన వికాస్ తలెత్తకుండా రాసుకుంటూ పోతున్నాడు. తనకలవాటైన పద్దతిలో గైడ్ కింద పెట్టి కాపీ కొడుతూ రాస్తున్న వినోద్ భుజం మీద ఒక్కసారిగా టీచర్ చేయి పడింది. 
      " ఇన్నాళ్లూ మార్కులు బాగా వస్తుంటే చక్కగా చదువుతున్నావనుకున్నా, ఇదన్నమాట అసలు సంగతి !" 
వాడి చేయి పట్టుకుని హెడ్మాస్టర్ గారి గదికి బరబరా లాక్కెళ్ళింది టీచర్. అక్కడ తల వాచేలా చీవాట్లు తిని, బయటకొచ్చి ఒక్కసారి తల విదిలించుకున్నాడు. అంతేగానీ వాళ్ళ మాటలు ఇసుమంతైనా తలకెక్కించుకోలేదు. 
       తిరిగి చూసేలోగా పరీక్షలయిపోయాయి. ఈసారి వికాస్ మొదటి ఐదుగురిలో ఒకడిగా నిలిచాడు. వినోద్ కాపీ కొట్టిన మార్కులతో ఏదో పాసయాననిపించాడు. 
      సంవత్సరాంత పరీక్షలకు ఉపాధ్యాయులంతా కష్టపడి విద్యార్థులందరినీ చదివిస్తున్నారు. ఒకరోజు ఏకాగ్రతతో చదువుకుంటున్న వికాస్ చెంతకు వినోద్ చేరాడు, 
" రేయ్, ఎందుకురా మరీ ఇంత కష్టపడతావు ? నేను చూడు టీచర్ల నందరినీ ఎలా బురిడీ కొట్టిస్తున్నానో ! పాపం! వాళ్లంతా నేను నిజంగానే చదివి పాసవుతున్నాననుకుంటున్నారు.."
ఓసారి ముక్క చీవాట్లు తిన్నసంగతి మరుగున పడిపోయిందేమో, వికాస్ కు దగ్గరగా జరుగుతూ ఇంకా ఏదో చెప్పబోయాడు. వాడి మాట మధ్యలోనే తుంచేస్తూ వికాస్ అందుకున్నాడు, 
    "రేయ్, నీవు బురిడీ కొట్టిస్తున్నది టీచర్లను కాదురా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అన్ని వేళలా నీ ఎత్తులు పారవని తెలుసుకో. కనీసం ఇప్పటి నుండైనా కష్టపడి చదువు, బాగుపడతావు..." అంటూ అక్కడినుండి విసురుగా లేచి వెళ్ళిపోయాడు. కానీ, వికాస్ మాటలు వాడికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే అయ్యాయి. 
      చూస్తుండగానే పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. వినోద్ పర్యవేక్షణ చాలా కఠినంగా ఉండే సెంటర్లో పడ్డాడు. పైగా ఆ సంవత్సరం అన్ని ప్రశ్నాపత్రాలు చాలా క్లిష్టంగా వచ్చాయి. ఇక వినోద్ పరిస్థితి చెరువు లో నుండి బయట పడ్డ చేపలా తయారైంది. ప్రతీరోజు తెచ్చుకున్న కాపీ చీటీలన్నీ పరీక్ష ప్రారంభానికి ముందే లాగేసుకునేవాళ్ళు ఇన్విజిలేటర్లు. వాళ్ళు తల కూడా తిప్ప నీయకుండా తిరుగుతూ ఉంటే పక్కవాడి వంక చూసి సాహసం చేయలేకపోయాడు వినోద్. కళ్ళనీళ్ళ పర్యంతమై ప్రతీరోజు రెండు గంటల పాటు నరకం అనుభవిస్తూ నీరసంగా బయటికి రావడం వాడి వంతయింది. 
      ఆఖరి రోజు పరీక్ష అయిపోయాక నీరసంగా అడుగులు వేస్తూ ఓవారగా వెళ్లి నిల్చున్నాడు వినోద్. మిగతా పిల్లలంతా హుషారుగా నవ్వుతూ తుళ్ళుతూ వెళ్తున్నారు. 
    ఒక్కసారిగా వాడి కళ్ళముందు తరగతి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు మెదిలారు. 
   " అన్ని వేళలా నీ ఎత్తులు పారవని తెలుసుకో" 
 వికాస్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చి తల తిరిగి పోయింది వాడికి. 
     వాళ్లందరి మాటలు పెడచెవిని పెట్టిన ఫలితం! ఎంతో విలువైన ఓ విద్యాసంవత్సరం కోల్పోయి, అందరిలోనూ అవమాన పడాల్సిన పరిస్థితి దాపురించే సరికి మొదటిసారిగా వాడి కళ్ళ నుండి బొటబొటా నీళ్ళు కారాయి. 
                                ***********
నీతి : ఎప్పుడైనా సరే...మనల్ని మనం నమ్ముకోవాలి.
స్వయంకృషితోనే ఎదగాలి.

******************************************







Saturday, March 15, 2025

మొక్కై వంగనిది మానై వంగునా...!?

 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

" గురుబ్రహ్మ  గురువిష్ణు 
   గురుదేవో మహేశ్వరః 
   గురుసాక్షాత్ పరబ్రహ్మ 
   తస్మైశ్రీ గురవేనమః  "

---చదువు చెప్పే గురువులను సాక్షాత్తూ దైవ స్వరూపులుగా భావించాలనీ, అంతటి అత్యున్నత స్థానాన్ని వారికి ఇవ్వాలనీ ఆది నుండీ చెప్పబడుతోంది. 
   మాతృదేవోభవ..
   పితృదేవోభవ.. 
   ఆచార్యదేవోభవ.. 
అంటారు...కానీ..ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులు  అలా నీరాజనాలందుకుంటున్నారా !!?  
   కొద్ది నెలల  క్రితం ఓ దినపత్రికలో ఓ వార్త చదివాక మనసంతా కలచివేసినట్లయింది. కేరళలోని ఓ  కళాశాలలో ఓ అంధ  అధ్యాపకునికి అతని తరగతిలోని విద్యార్థుల వల్ల జరిగిన అవమానమది ! అదే కళాశాలలో చదువుకున్న ఆయన చూపు లేకున్నా...ఎంతో శ్రమించి అదే కళాశాలలో అధ్యాపక స్థాయికి ఎదిగినాడు. ఎంతటి జ్ఞాన సంపన్నుడై ఉంటాడో ఊహించుకోవచ్చు ! కానీ అతని క్లాస్ లోని విద్యార్థులకు మాత్రం అతని మేధస్సు కనిపించలేదు. ఆయన పాఠం చెబుతుంటే..చుట్టూ చేరి, అవహేళన చేస్తూ, దృష్టిలోపాన్ని ప్రస్తావిస్తూ ఆట పట్టిస్తూ అవమానించారట ! అది చాలక...అదేదో ఘనకార్యం చేశాం చూడండీ అన్నట్లు వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారట !! వింటుంటేనే...జుగుప్స కలిగే అతి హేయమైన చర్య కాదా ఇది ! ఆ విద్యార్థులను తరువాత...కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసిందట...అది వేరే విషయం.. 
   గంటసేపు బోధనకై నేను రెండు గంటల పాటు ప్రిపేర్ అయి, క్లాసుకి వెళ్తే జరిగింది ఇది...అని వాపోయాడట ఆ అధ్యాపకుడు ! ఇంకా... ఆ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో కళాశాల పరిధిలోనే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడట !!
    ఇది అధ్యాపకుని ఔదార్యం కావచ్చు ! కానీ.... చెప్పాలంటే..ఆ వికృత చేష్టల వల్ల ఆయనకి పోయిందేమీ లేదు.. ఆ సంస్కారహీనులు వారి అజ్ఞానం, అవివేకం,అనైతికత...బాహాటంగా చాటుకోవడం తప్ప! అయినా వారేమీ పసిపిల్లలు కాదే! కళాశాల స్థాయి యువకులే !!   
   ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం 'గుంజీలు తీసిన గురువు' అన్న హెడ్డింగ్ తో  దినపత్రికల్లో వచ్చిన వార్త, దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ వీడియో విద్యావర్గాల్లో చర్చకు దారి తీసింది.
   ఎంత చెప్పినా తన పాఠశాలలోని విద్యార్థుల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు అన్నది రావడం లేదని ఆవేదన చెందుతూ, వారి ఎదుట సాష్టాంగప్రణామం చేసి, గుంజీలు తీస్తూ తనకు తానే శిక్ష వేసుకున్న ప్రధానోపాధ్యాయుని ఉదంతమిది. విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట ZP ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఇది. చదువు అందరికీ ఒకేలా అబ్బకపోవచ్చు, కానీ సత్ప్రవర్తన అన్నది అందరికీ రావాలి కదా అన్నది వారి ప్రశ్న..! వారి ఆవేదనలో అర్థం ఉన్నది..
   చాలా సంవత్సరాల క్రితం...కొన్ని సినిమాల్లో దర్శకులు అధ్యాపకులను, ప్రిన్సిపాళ్లను బఫూన్లుగా, కమెడియన్లుగా చూపించిన వైనం అందరికీ విదితమే.తద్వారా తామేదో హాస్యాన్ని గుప్పిస్తూ అందర్నీ నవ్విస్తున్నామని వాళ్ళ ఆలోచన అయితే కావచ్చు...కానీ ఆ తరం విద్యార్థులపై అదెంత  ప్రభావం చూపించిందో బహుశా వారెరుగరు...
       ఒకప్పుడు ఉపాధ్యాయులన్నా, అధ్యాపకులన్నా ఎంతో గౌరవభావం, వాళ్లంటే ఓ విధమైన 'అడ్మిరేషన్'!...ఉండేది పిల్లల్లో, యువతలో... ఇంకా చెప్పాలంటే..దూరంగా కనిపించినా పక్కకు తప్పుకోవడమో, ఆగి నమస్కరించడమో చేసేవాళ్లు..
రాను రానూ ఆ సత్ప్రవర్తన కనుమరుగైపోయిందని చెప్పక తప్పదు.
      క్రమేణా సినిమాల్లో కాలేజీ స్థాయి నుండి  హైస్కూల్ స్థాయికీ, అది దాటుకుని ప్రాథమిక పాఠశాల స్థాయికీ ఈ కామెడీ సన్నివేశాలు పాకి... చిన్న పిల్లలు కూడా వాళ్ల టీచర్ల మీద జోకులు వేయడం, లెక్క లేకుండా మాట్లాడటం లాంటివి చూపించడం మొదలైంది. సినిమాల్లో చెడు మాత్రమేనా! మంచి కూడా చూపిస్తారు కదా... మంచిని గ్రహించవచ్చు కదా...అంటారేమో..! కానీ చెడు వ్యాపించినంత వేగంగా మంచి అన్నది అందరినీ చేరలేదు. శీఘ్రంగా ప్రభావితం చేయగల శక్తి చెడుకు మాత్రమే ఉంటుంది. మరీ ముఖ్యంగా పసివాళ్ళ మెదళ్లను ! మంచిని గ్రహించడం అయిష్టంగానూ, ఆచరించడం అంతకంటే కష్టంగానూ ఉండడమే అందుకు కారణం...
   ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పసితనం, అమాయకత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. వాళ్లకు టీచరు ఏది చెప్తే అదే రైటు...ఆ మాటే వేదవాక్కు...అన్నట్లు ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ హైస్కూలు ప్రవేశించగానే...ఆ పసితనం కాస్త పలచబడుతూ ఆ స్థానంలో ఓ విధమైన 'మెచ్యూరిటీ' కనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు ఆ మెచ్యూరిటీ అన్నది వాళ్ల ప్రవర్తనలోనూ కనిపించేది. మెల్లిమెల్లిగా తర్వాతి తరాల్లో అది మాయమైపోతూ వాళ్లలో నిర్లక్ష్య ధోరణి పుట్టుకు రావడం మొదలైంది. అందరూ ఇలాగే ఉంటున్నారని చెప్పడం కాదు నా ఉద్దేశం... ఎక్కువ శాతం గురించి ప్రస్తావిస్తున్నాను. అందులోనూ... మగ పిల్లలు..మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తొమ్మిదవ తరగతి నుండి మెల్లి మెల్లిగా మొదలయ్యే అల్లరి, అవిధేయత, నిర్లక్ష్యం ఇంటర్ స్థాయికి చేరేసరికి హద్దులు దాటుతున్న వైనాలు వింటున్నాము...అమ్మాయిలను ఏడిపించడం, ప్రేమించానంటూ వెంట పడటం, వేధించడం...! వాళ్లు తిరస్కరిస్తే... దాడి చేయడం, ఇళ్లల్లో సైతం దూరి హతమార్చడం !! ఇలాంటి వార్తలు కోకొల్లలుగా వింటున్నాం, చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. 
      ఓ వయసంటూ  వచ్చాక ఇంట్లో తల్లిదండ్రుల మాట కూడా లక్ష్యపెట్టని పిల్లలుంటున్నారు. ఇంట్లో వినకా, బయట కాలేజీల్లో వినకా...ఇక వీళ్ళు బాగుపడేదెట్లు? !!
         ఎంతో శ్రద్ధగా  చదువుతూ ఇంటా  బయట మంచి పేరు తెచ్చుకుంటూ చక్కటి భవిష్యత్తును నిర్మించుకుంటున్న వాళ్లూ ఉంటున్నారు..వాళ్ళూ ఇదే స్కూళ్లలో చదివిన వారే కదా!  కానీ...పంట చేలో  కలుపు మొక్కల్లా పెరిగే అల్లరి యువత సమాజానికి తెచ్చే చేటు అంతాఇంతా కాదు..ఎన్నో  నేరాలు,ఘోరాలూ జరగడానికి కారణభూత మవుతున్నాయి. 
 ముందుగా ప్రస్తావించిన వార్త లాంటివి చదివినప్పుడు...ఇలాంటి వాళ్లలో మార్పు సాధ్యమా! పసివాళ్లు పెరిగి పెద్దయ్యాక ఇలా వాళ్లలో పశుత్వం చోటు చేసుకుంటున్నదెందుకని !! అనిపిస్తూ బాధగా ఉంటుంది....
   ఏది ఏమైనా, విలువలతో కూడిన సమాజం ఏర్పడాలంటే నేటి బాలలు విలువలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది చిన్నతనంలోనే...ఇంటి నుండే, అదీ తల్లిదండ్రులతోనే మొదలవ్వాలి. వినయ విధేయతలు, సత్ప్రవర్తన ఇంటి నుండే అలవడాలి. ఇంటి వాతావరణం పిల్లల ఆలోచనాధోరణిపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు.   ఎందుకంటే... మొక్కై వంగనిది మానై వంగదు కదా!! 

                               ~ యం. ధరిత్రీ దేవి ~
                               
****************************************


Wednesday, March 12, 2025

చదవక మది నిలవదే !


 తెల్లారింది ! దిన పత్రిక వచ్చేసింది!
 వార్తల్ని మోసుకొచ్చింది..తెరవాలంటే భయం!
 నిండా వెక్కిరించే సమస్యల తోరణాలు!
 మింగుడుపడని నమ్మలేని నిజాలు!
 అయినా, తెలుసుకోవాలన్న కుతూహలం!
 చదవక మది నిలవదు... ఆపై...
 మదనపడక మానదు..పిచ్చి అంతరంగం !
 పదవుల కోసం కుమ్ములాటలంటూ ఒక చోట
 రాజకీయ చదరంగపు ఎత్తుగడలంటూ
 కుట్రలు కుతంత్రాలంటూ మరోచోట!
 రక్తసిక్తమైన రహదారులంట!దుర్మరణాలంట !
 దోపిడీ దొంగల దురాగతాలంట 
 దుర్మార్గుల అరాచకాలట !
 ఇంకా--హత్యలు ! ఆత్మహత్యలు!
 పరువు హత్యలు ! ఇవి చాలవన్నట్లు--
 అడుగడుగునా సంచరించే మానవ మృగాలు!
 రక్షణ కరువై రోదించే అబలల ఆర్తనాదాలు!😔
 'అయ్యో!మమ్ముల మరిచావా'అంటూ, 
 అదిగో, అంతుబట్టని వైరస్ మహమ్మారులు, 
 వాటి 'వేరియంట్లు' !!😅 అంతేనా !
 రగిలిపోతూ కుల మత విభేదాల కార్చిచ్చులు !
 ముందుకు కాదు వెనక్కి నడుద్దామంటూ 
 దుస్సాంప్రదాయాలు ! దురభిప్రాయాలు ! 
 రకరకాల రంగురంగుల చిత్ర విచిత్ర 
 విన్యాసాలు ! విపరీతాలు !
 ఆసాంతం వెక్కిరించే సమస్యల తోరణాలే !!
 కానరావే ఏ మూలనా ఆశాకిరణాల చిరుదివ్వెలు !
 నక్కినక్కి ఏ మూలనో ఒకటీ అరా దాగినా 
 అన్నింటి నడుమా చిక్కిపోయి అందిన 
 ఆవగింజంత ఆనందం కాస్తా 
 ఆవిరైపోతుంది కదా ! 
 అందుకే భయం, తెరవాలంటే భయం !
 అదిగో, మళ్ళీ తెల్లవారింది !
 దిన పత్రిక మళ్లీ వచ్చేసింది !
 వార్తలెన్నో  మోసుకొచ్చింది
 మళ్లీ మామూలే! తెరవాలంటే భయం!
 కానీ.. చదవక ఉండలేరే పిచ్చి జనం !!

       ****      *****       ****      ****
 



Saturday, March 8, 2025

ఆమె..!

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఆమె...
భూదేవంత ఓర్పు గలది...
అయితే...అవధులు దాటితే... 
భూకంపాలూ సృష్టించగల నేర్పరి !
ఆమె...
అబల!అవసరమొస్తే...కండలు తిరిగిన 
వస్తాదులనూ కంటిచూపుతో 
మట్టి కరిపించేయగల సబల !!
ఆమె...
అంతరంగం అంతెరుగని సముద్రం...
అభిమానిస్తే...కురిపించే ప్రేమ  అపారం 
ఆగ్రహిస్తే..ఉప్పెనలతో ముంచేయడమూ ఖాయం!!
ఆమె...
తన ఇంటికి మకుటం లేని మహారాణి 
ఆమె లేక ఆ రథం కదలదు అరంగుళం!!
నమ్మకతప్పని పచ్చి నిజమిది!!
ఆమె లేక జననం లేదు...
గమనం లేదు...
సృష్టిలో జీవం లేదు.. 
అసలు సృష్టే  లేదు...
మహిమాన్విత మహిళా!
వందనం 🙏
నీకు అభివందనం 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹          నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
                           8.3.2025
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
          



Monday, February 24, 2025

భగవత్స్వరూపాలు..ప్రత్యక్షదైవాలు🙏

                                      ~ యం. ధరిత్రీ దేవి 

దేవుడెక్కడ? అసలున్నాడా?
 
ఉంటే..ఏడీ..ఎక్కడ ??
భగభగ మండుతూ భూగోళమంతా  వెలుగులు విరజిమ్ముతూ..జీవకోటికి జవసత్వాలిస్తున్న 
భానుడు కాడా..కనిపించే భగవానుడు...!🙏
రేయంతా వెండి వెన్నెల కురిపిస్తూ చల్లచల్లగా 
జనాల్ని సేదదీరుస్తూ..హాయిగొలిపే 
నిండు చందురుడు కాడా..కనిపించే దేవుడు !!🙏
గుండె గదులకు ఊపిరులూదుతూ 
నిత్యం..ప్రతి నిత్యం శ్వాసలో శ్వాసగా నిలుస్తూ 
చుట్టూ ఆవరించి ఉన్న ఈ గాలి 
కాదా...కనిపించే దేవుడు !!🙏
బీడును చిరుజల్లుతో సస్యశ్యామలం చేస్తూ...
జలధారలతో కరుణించే వరుణుడు 
కాడా...కనిపించే దేవుడు !! 🙏
ఆరుగాలం శ్రమించే రైతన్న..మట్టి పిసుక్కునే 
ఆ మనిషే లేకుంటే..మనిషికి మెతుకన్నదే లేదు కదా! 
ఆ మట్టిమనిషి 'దేవుడు' కాక మరేమిటి ?? 🙏
దేశక్షేమం కోసం స్వార్ధం వీడి సరిహద్దుల నిలిచి 
నిద్ర మరిచి మనల్ని నిద్రబుచ్చుతూ 
తమ ప్రాణాలడ్డువేస్తూ కాపుగాస్తున్న 
మన వీరసైనికులు కారా..కనిపించే దేవుళ్ళు!!🙏
యావత్ప్రపంచాన్ని గడగడలాడించిన 'కరోనా' రక్కసికెదురొడ్డి పోరాడి నమ్ముకున్నవాళ్ళను
కంటికి రెప్పలా కాచుకున్న వైద్యనారాయణులు...🙏
సవాల్ విసిరిన మహమ్మారిని మట్టుబెట్టే మందుకోసం...మానవాళి మనుగడ కోసం 
రేయింబవళ్ళు తపించిన మన శాస్త్రజ్ఞులు 🙏.
వీరంతా...కారా కనిపించే దేవుళ్ళు...!!
కిరీటం దాల్చి.. నాలుగు చేతులు.. శంఖుచక్రాలతో
పట్టుపీతాంబరాలతో  ధగధగా మెరుస్తూ దర్శనమిస్తేనే దేవుడా! చూసే కళ్ళకు 'హృదయమే' ఉంటే...ఆపదలో చేయందించే  ప్రతి మనిషీ 
కనిపించే దేవుడే !! ప్రతీ మంచి మనసూ భగవత్స్వరూపమే !! కనిపించే ప్రత్యక్షదైవమే!!🙏

                                              


Thursday, February 20, 2025

అమ్మ భాష

'అమ్మ' అన్న మాటే మధురం కాదా 
అమ్మ మనసు అమృతం కాదా !
అమ్మ ప్రేమ అపురూపం అయినప్పుడు 
అమ్మ భాష మరింత ప్రియం కాదా !

ఉగ్గు పాలతో రంగరించి పోసేది 
ఏ శిక్షణ అవసరం లేనిది 
పుట్టుక తోనే సంక్రమించేది 
మాతృభాష కాక మరేది? 

పరభాష తో వద్దు శత్రుత్వం 
ప్రతీ భాషకూ ఇద్దాం గౌరవం 

కానీ --
మాతృభాషకే అగ్ర తాంబూలం !ఇది నిజం !
అది మరచిననాడు మనుగడ శూన్యం !
అవగాహనే అన్నింటికీ మూలం 
అమ్మ భాషతోనే అది సాధ్యం 
భాషేదైనా సరే ప్రతీవారూ 
ప్రేమించాలి సొంతభాషను 
అమ్మ ఎవరికైనా 'అమ్మే' కదా మరి !!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
            నేడు [ 21.02.2021] 
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  
 

Sunday, February 16, 2025

సూర్యాస్తమయం...



   ~
ధరిత్రీ దేవి 

                  దినకరుడు...
                 సెలవు పుచ్చుకుంటున్న వేళ...
                 నింగీనేల కలిసే చోట...
                 ప్రకృతి గీసే ఆ వర్ణచిత్రం !
                 ఎంత మనోహరం !!
                 పొద్దు వాలుతున్న ఆ క్షణాలు
                 ఎందుకో మరి !అందరికీ అంత ఇష్టం !
                 జీవిత చరమాంకాన్ని మాత్రం ద్వేషిస్తాం...
                 క్రుంగిపోతాం..వద్దూ వద్దంటాం...!
                 సూర్యాస్తమయంలో ఆహ్లాదం...
                 మలివయసులో  మనిషిలో మాత్రం 
                 ఉండదా ఏమి !! వెతుకుదాం...
                 బాధ్యతల సంకెళ్లు విడివడి...
                 మనకంటూ మిగిలి..చేతికందిన... 
                 ఆ అరుదైన సమయాన్ని 
                 సొంతానికి మాత్రమే 
                 సొంతం చేసుకుంటే...సంతోషం 
                 మన సొంతమవును కదా !!
                 కనురెప్పలు మూతలు పడేదాకా...
                 కలతలకతీతంగా పయనం సాగిద్దాం
                 వృద్ధాప్యాన్ని ప్రేమిద్దాం 🙂
                 ఆనందంగా ఆస్వాదిద్దాం ...

🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞


Wednesday, February 5, 2025

ఆ ఇద్దరు కుటుంబం పరువు ప్రతిష్ఠలు

    బెల్ మోగింది. పీరియడ్ అయిపోయింది. స్టూడెంట్స్ కు బై చెప్పి స్టేజి దిగి స్టాఫ్ రూం వైపు అడుగులు వేసింది వసుధ. రూమ్ సమీపిస్తుండగా లోపల నుండి పకపకా నవ్వులు ఆమె చెవిలో పడ్డాయి. '

" హు, మొదలయిందన్నమాట",

అనుకుంటూ వెళ్లి తన సీట్లో కూలబడింది. ఆ స్కూల్లో రెణ్ణెల్ల క్రితం జాయినయింది వసుధ. రజని, రాధిక, లలితలతో పాటు తనకూ ఇదే పీరియడ్ లీజర్ అవర్. ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి చర్చిస్తూ వాళ్ళ పరోక్షంలో వాళ్ల గురించి విమర్శలు చేస్తూ, జోకులేసుకుంటూ పడీ పడీ నవ్వుకుంటుంటారు ముగ్గురూ. వాళ్ల ధోరణి ఎంత మాత్రమూ నచ్చని వసుధ తప్పనిసరై ఆ నలభై అయిదు నిమిషాలూ భరిస్తూ ఏదో రాసుకుంటూనో, చదువుకుంటూనో గడిపేస్తూ ఉంటుంది. 

  "....అయితే లలితా, మీ అత్తగారు మూడురోజుల మౌనవ్రతం విరమించిందన్నమాట.... " 

 రాధిక అనగానే రజని కిసుక్కున నవ్వి, 

" అంతేగా మరి,..." అంది. 

 వెంటనే లలిత, 

"ఏం చేయను, నా కర్మ మరి.. " అంటూ తలపట్టుకుంది. 

 లలిత తన ఇంటి విషయాలు చెప్పడం, ఆ ఇద్దరూ కామెంట్స్ చేయడం రోజూ జరిగే తతంగమే. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వీళ్ళు ఎందుకిలా స్థాయిని మరిచి ప్రవర్తిస్తారో అనుకుంటూ తనలో తనే మదన పడుతూ ఉంటుంది వసుధ. ఈమధ్య వీళ్ళ ధోరణి చూస్తుంటే తనకు తన పొరుగింట్లో ఉండే వర్ధనమ్మ గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ సాయంత్రాలు తన ఇంటికి ఏదో మిష మీద వచ్చి, తన అత్తగారితో పిచ్చాపాటీ మాట్లాడుతూ అడపాదడపా తన కోడలి గురించి అవాకులు, చెవాకులూ పేలుతూ ఉంటుంది. పాపం, ఆ అమాయకురాలు ఉదయం నుండీ రాత్రి దాకా ఇంటిల్లిపాదికీ వండి వార్చుతూ సతమతమౌతుంటే, ఈవిడ కనీసం లేశమాత్రం అభిమానం అన్నది కూడా చూపక అందరి దగ్గరా ఇలా కోడలు గురించి చెడుగా చెప్తూ ఉంటుంది. అందులో ఆమె పొందే ఆనందం ఏమిటో తనకి అర్థం కాదు. 

   ఒకసారి ఆకస్మాత్తుగా వసుధకనిపించింది, తను ఇంట్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేనప్పుడు తన గురించి కూడా తన అత్తగారు ఈవిడకు ఇలాగే చెబుతుందా? కానీ వెంటనే సర్ది చెప్పుకుంది, ఆవిడ గడప దాటి బయటకు వెళ్లడమే తక్కువ. వెళ్లినా పెద్దగా నోరు విప్పే రకం కాదు అని. కానీ తనకు నచ్చని విషయం ఏమిటంటే-- వర్ధనమ్మ కోడలి గురించి అలా చెప్తూ ఉంటే తన అత్తగారు అసలు ఖండించదు, ఆసక్తిగా వింటూ ఉంటుందంతే. వినే వాళ్ళు ఉంటేనే కదా చెప్పే వాళ్ళు ఉంటారు! ఒక్కోసారి మధ్యలో దూరి అభ్యంతర పెడదామనిపిస్తుంది వసుధకు. కానీ-- వాళ్లు పాతతరం వాళ్లు. చదువు సంధ్య లేని వాళ్ళు. వయసులో పెద్ద వాళ్లు. ఎలా వాళ్లకు నీతులు బోధించగలదు? చెప్పినా వింటారా? విన్నా పాటిస్తారా? అనవసరంగా తన గురించి ఏదేదో అక్కడక్కడా వాగడం చేస్తారు గానీ ! దాంతో ఆ ఆలోచన పూర్తిగా విరమించేసుకుంది వసుధ. అయినా చాలాకాలంగా ఓ విషయం గమనిస్తూ ఉంది తను. ఈ కోవకు చెందిన ఆడవాళ్ళు( దీనికి వయసుతో నిమిత్తం లేదు) బాగా చదువుకుని,ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీల కంటే ఎంతో తెలివైనవాళ్ళు, మాటకారితనం గలవారు, ఇంకా లోకజ్ఞానం కూడా ఉన్నవాళ్ళన్నది ఇన్నేళ్ల అనుభవంలో ఆమె గమనించిన మహత్తర విషయం. చదువు లేదు కదాని దేవుడు వీళ్లకీ సౌలభ్యాలన్నీ వరంగా ప్రసాదించాడేమో అన్పిస్తూ ఉంటుంది వసుధకొక్కోసారి. 

    వీళ్లు ఇలా ఉన్నారు సరే, కానీ ఈ పంతులమ్మల్ని చూస్తూ ఉంటే ఆమెకు ఆశ్యర్యం వెల్లువెత్తుతూ ఉంటుంది. ఇంత చదువూ చదివి, పదిమందిలో ఉద్యోగాలు వెలగబెడుతూ ఏమిటీ వీళ్ళ ధోరణి ! సంస్కారమన్నది మరిచి ! ఆ ముగ్గుర్నీ గమనిస్తూ వస్తున్న వసుధకు లలిత ఎందుకో ఒకింత ప్రత్యేకంగా కనిపించింది. రెణ్నెళ్లుగా చూస్తోంది, తన మాటల్లో ఏదో అమాయకత్వం దోబూచులాడుతూ ఉంటుంది. 

 " ఇంటివద్ద పెద్దవాళ్ళను నేను ఎలాగూ అడ్డుకోలేను, కానీ...... " 

వసుధ అలా ఆలోచిస్తుండగానే బెల్ మోగింది. లేచి, నెక్స్ట్ క్లాస్ కు బయలుదేరింది. 

                        ******************

   మరుసటి రోజు క్లాస్ అవగానే వడివడిగా అడుగులేస్తూ కదిలిన వసుధకు స్టాఫ్ రూమ్ సమీపిస్తుండగా ఎదురయ్యింది లలిత. తను కోరుకున్నదీ అదే. 

  " లలితా, తలనొప్పిగా ఉంది, టీ తాగొద్దాం, వస్తావా.... "అంటూ అడిగింది వసుధ. 

 ఇంతవరకూ ఎన్నడూ క్యాంటీన్ కు రాని వసుధ అలా అడిగే సరికి కాదనలేక, ' పదండి " అంటూ దారితీసింది లలిత. ఇద్దరూ వెళ్లి క్యాంటీన్ లో కూర్చుని టీ చెప్పారు. రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత వసుధ మెల్లిగా మొదలెట్టింది. 

" లలితా, ఏమీ అనుకోనంటే సుత్తి లేకుండా సూటిగా ఓ మాట అడుగుతాను ఏమి అనుకోరు కదా.. "

 ఇలా వసుధ తనను క్యాంటీన్ కు తీసుకురావడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని ఊహించిన లలిత పెద్దగా ఆశ్చర్యపోలేదు. వసుధనే చూస్తూ, 

" చెప్పండి, పరవాలేదు " అంది. 

"  మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు అలా స్టాఫ్ రూములో అందరికీ ఎందుకు చెప్తుంటారు? 

చివ్వున వసుధ మొహంలోకి చూసింది లలిత. 

"....ఒక్క విషయం మీరు గమనించారా? ఎంతసేపూ మీరు మీ విషయాలు చెప్తుంటారు గానీ, వాళ్ళిద్దరూ వాళ్ల స్వవిషయాలు ఎప్పుడూ మీతో పంచుకోవడం నేను వినలేదు... "

చెళ్లుమని కొరడాతో కొట్టినట్లయింది లలితకు. ఒక్కసారిగా ఫ్లాష్ వెలిగిందామెలో. నిజమే! తన వ్యక్తిగత విషయాలు చెప్తూ వాళ్ల గురించి కూడా అడిగితే వెంటనే మరేదో చెప్తూ వెంటనే దాటవేసే వారిద్దరూ. తన గురించి అన్ని విషయాలూ వాళ్లకు తెలుసు కానీ వాళ్ల కుటుంబాల గురించి ఇంతవరకూ తనకు ఏ మాత్రం తెలీదు. 

 వసుధ అందుకుంది. 

"...వాళ్ల గురించి చెడుగా చెప్పడం నా ఉద్దేశం కాదు లలితా, కొందరుంటారు, చాలా తెలివిగా, మరింత తీయగా మన గురించి అన్నీ ఆరా తీస్తారు. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా అవన్నీ అందరికీ చేరవేస్తూ ఉంటారు. అదో మానసికానందం వాళ్లకు. ఈ విషయం నేను బాగా గమనించాను. నీ మనస్తత్వం నాకు అర్థమైపోయి, ఓ కొలీగ్ గా కాక ఓ తోబుట్టువుగా భావించి  ఎందుకో చెప్పాలనిపించింది.... "

 లలిత కళ్లలో సన్నటి నీటి పొర! ఎంతో మౌనంగా, గుంభనంగా కనిపించే వసుధలో ఇంత లోతైన ఆలోచనలా ! ఎప్పుడూ అసంబద్ధంగా లొడలొడా వాగే తనకూ, వసుధకూ ఎంత తేడా! ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ తన మేలు కోసమే చెప్తోంది. 

".....మన ఇంటి వ్యవహారాలు ఇంటి గడప లోపల ఉంటేనే మనకు గౌరవం. నాకూ ఇంటి నుండి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ బయట వాళ్ళతో చెప్పుకుంటే పోయేది నా పరువే. ముఖ్యంగా అత్తా కోడళ్ళు ఈ విషయం ఎరిగి మసలుకోవాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే, వాళ్ళిద్దరూ కుటుంబం పరువు ప్రతిష్టలనుకుంటాను... "

 వసుధ చేతిమీద లలిత చేయి వేసి మెల్లిగా స్పృశించింది. ఆమె కళ్ళలో భావం చూసిన వసుధకు ఇంతకన్నా చెప్పడం అనవసరం అనిపించింది. 

" వసుధ గారు, నిజం చెప్పారు, మా ఆయన అదోరకం. నా బాధ ఆయన కెన్నడూ పట్టదు. అన్నీ తేలిగ్గా కొట్టిపారేస్తారు. ఒత్తిడి భరించలేని నేను ఇలా అందరి ముందూ బయట పడిపోతుంటాను. అంతేగానీ నన్ను నేను అందరి ముందూ చులకన చేసుకుంటున్నానన్న ఆలోచన ఇంతవరకు రాలేదు. మీకు చాలా చాలా థాంక్స్..... " 

"....అర్థం చేసుకుంటావన్న నమ్మకంతోనే సాహసించి చెప్పాను, లలితా. నేనే మీకు థాంక్స్ చెప్పాలి...." 

వాచీ చూసుకుంటూ లేస్తూ అంది వసుధ. 

 ఇద్దరూ వాళ్ల క్లాసులవేపు కదిలారు. వసుధలో ఓ తృప్తి ! రాత్రంతా ఆలోచించిన ఫలితం!! లలితలో అంతర్మధనం మొదలైంది. వసుధక్కావలసిందీ అదే !

                        ************

  నిజమే కదా! అత్తాకోడళ్ళిద్దరూ ఇంటికి మూలస్తంభాలు. కుటుంబం పరువుప్రతిష్ఠలు. అవి నిత్యం కాపాడ్డం వాళ్ల బాధ్యతే కదా మరి!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                 

Sunday, February 2, 2025

పెడదారుల్లో సాంకేతికత...

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

                   
                                                  ~ యం. ధరిత్రీ దేవి 
📲☎️📠

 ఒకప్పుడు ఏదైనా సమాచారం చేరవేయాలంటే రెండు మూడు రోజులైనా పట్టేది. ఇప్పుడు...సెల్ ఫోన్లు వచ్చాక విదేశాల్లో ఉండే వాళ్ళతో కూడా రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికత పుణ్యమాని ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్నవారిని ఇక్కడ మన ఇంట్లోనే కూర్చుని చూస్తూ మాట్లాడే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. బయట షాపుల్లోకి వెళ్లి అన్ని వీధులూ తిరిగే శ్రమా, ఖర్చు తప్పి ఆన్లైన్ షాపింగులూ వచ్చాయి. ఇదంతా నేటి ఆధునికతను ప్రతిబింబిస్తోంది.
   పూర్వం పావురాలతో సందేశాలు పంపించేవారని విన్నాం. అటుపిమ్మట  ఎంత దూరమైనా సరే కాలినడకన మనుషులే వెళ్లేవారట! కాలక్రమేణా  తపాలా శాఖ పుణ్యమాని ఉత్తరాలు రాసుకోవడం మొదలైంది. మరీ అత్యవసరమైతే టెలిగ్రామ్ సేవలు అన్నవి అందుబాటులోకి వచ్చాయి. రాను రాను సాంకేతికత పెరిగిపోయి ల్యాండ్ ఫోన్లన్నవి మొదట కార్యాలయాల్లో, తర్వాత  ప్రతి ఇంటిలో కొలువుదీరిపోయాయి. ఆ తర్వాతే మొదలైంది సెల్ ఫోన్ల ఆవిర్భావం! ఇంకేముంది! కొత్తనీరొస్తే పాత నీరు పారిపోవాల్సిందేకదా!! దాంతో.. క్రమంగా ముందున్నవన్నీ అదృశ్యమైపోయాయి.
    ఇంతవరకూ బాగానే ఉంది. శతాబ్దాలు గడిచి ఆదిమానవుడు నవనాగరీకుడయ్యాడు. కంప్యూటర్ యుగం వచ్చి సాంకేతికత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఏ పనైనా నిమిషాల్లో సునాయాసంగా జరిగిపోతోంది. సంతోషించవలసిన పరిణామమే ! కానీ...మరో వంక మనస్థాపానికి లోనయ్యే దుస్థితి కూడా సంభవించడం శోచనీయం. సాంకేతికత విజృంభణతో మార్కెట్లోకి జెట్ స్పీడుతో ప్రవేశించిన స్మార్ట్ ఫోన్లు జనాల్ని ఆకర్షించి ఆకట్టుకున్న వైనం మాటల్లో చెప్పలేనిది. మొదట్లో అవసరాలకు మాత్రమే అన్నట్లుగా ఉన్న ఈ ఫోన్లు రాను రాను యువతనే కాక చిన్న పిల్లలను సైతం జాడ్యంలా పట్టుకున్నాయని చెప్పక తప్పదు.
   పెద్దలు ఎప్పుడో అన్నారు..., "అతి సర్వత్రా వర్జయేత్ " అని ! ఎందుకంటే.. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ప్రయోజనం. ఆ గీత దాటితే.. తిప్పలు తప్పవు.. అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి!
   యువతీ యువకుల మధ్య అవసరానికి మించిన సంభాషణలు, వేళాపాళా లేకుండా సందేశాలు, ఫోటోలు,వీడియోలు పంపుకోవడాలు... ఒక్కటేమిటి!! అవి శృతిమించి పక్కదారి పట్టి వాళ్ల జీవితాల్ని సమస్యల సుడిగుండాల్లోకి నెట్టడం!! ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నెన్నో దారుణాల్ని వినాల్సి, చూడాల్సి వస్తోంది.
   సాంకేతికతను సక్రమంగా ఉపయోగించుకుంటే సామాన్యులు సైతం సత్ఫలితాలు పొంది సంతోషించే అవకాశం ఉంటుంది. కానీ, విచారించదగ్గ విషయం ఏమిటంటే..నాగరికత వెర్రితలలు వేస్తూ అద్భుతమైన ఈ సాంకేతిక పరిజ్ఞానం కొన్ని దుష్టశక్తుల చేతజిక్కి దుర్వినియోగం అవుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. అందులో మచ్చుకు కొన్ని----
* ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చడం వల్ల ఏదేని నేరం జరిగినప్పుడు వాటిలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నేరగాళ్లని గుర్తించే వీలు ఉంటుంది. ఇది ఉపయోగమైతే....
 షాపింగ్ మాల్స్ లోనూ, మరికొన్ని చోట్ల టాయిలెట్స్ లోనూ ఇలాంటి కెమెరాలు అమర్చి తర్వాత వాటిని ఇతరులకు చేరవేస్తూ అమ్మాయిల, తద్వారా వారి కుటుంబ పరువు మర్యాదల్ని మంటగలపడం... మానసికంగా వేధించడం..! ఇత్యాదివన్నీ మాటల్లో చెప్పలేనంత దుర్వినియోగం కిందకి వస్తాయి.
   విద్యావంతులనబడే వారు సైతం ఇలాంటి అసాంఘిక నేర ప్రవృత్తుల్ని రెచ్చగొడుతూ నైతిక విలువలను దిగజారుస్తున్నారు. ఇదిలాగుంటే.. మరోపక్క ఆన్లైన్ మోసాలు !!
* మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లో మన డబ్బు మాయమై పోవడం !
* మనకు చెందిన భూములు మరొకరి పేర మార్చబడడం! జరిగిన విపత్తు ఎప్పటికోగానీ వారి దృష్టిలో పడకపోవడం.. పడ్డ తర్వాత లబోదిబోమంటూ గుండెలు బాదుకోవడం !! 
  ఇవన్నీ కూడా మనిషిని మానసికంగా కృంగదీసేవే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో!! ఈమధ్య సైబర్ నేరాల గొడవ మరీ శృతి మించిపోయి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్న కథనాలు వార్తాపత్రికల్లో తరచుగా రావడం అందరికీ విదితమే..వీటిని ఛేదించడానికి, కట్టడి చేయడానికి ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నా నేరగాళ్ళు ఏమాత్రం దారికి రావడం లేదని ఇంకా ఇంకా జరుగుతూనేఉన్న  ఈ నేరాలు తేటతెల్లం చేస్తున్నాయి.
   ఒకప్పుడు నిరక్షరాస్యులు కూడా బయట పనులన్నీ స్వయానా చెక్కపెట్టుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఉన్నత విద్యావంతులు సైతం కాల్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఏ పనులు సకాలంలో సజావుగా సాగక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
   ఏ టెక్నాలజీ లేని కాలంలోనే మనిషి అంతో ఇంతో  ప్రశాంతంగా జీవించేవాడు.  కానీ ఈ కంప్యూటర్ యుగంలో మనశ్శాంతి కరువైపోయింది మనిషికి. కారణం...ఎంతో విలువైన మనిషి మేధస్సు మలినమైపోవడమే! అలా జరగకూడదు అంటే.. ఏది మంచి, ఏది చెడు అన్న చిన్నపాటి ఆలోచన నేర ప్రవృత్తి గలవాళ్లలో మొదలవ్వాలి. రేయింబవళ్ళు కష్టపడి తమ విజ్ఞానాన్ని ధారపోసి, కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్న మేధావుల శ్రమ కొందరి స్వార్థపూరిత దురాలోచనలకు లోనై సమాజంలో విష సంస్కృతిని నెలకొల్పడం ఎంత మాత్రమూ అభిలషణీయం కాదు.
   ఆధునిక పరిజ్ఞానం జనాల్ని ప్రగతి బాట పట్టించాలి గానీ పక్క దారి కాదు కదా!!

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️












Monday, January 27, 2025

నిస్వార్ధంలో స్వార్థం !!

🫠

                         ~ యం. ధరిత్రీ దేవి 

చిరకాలం జీవించాలని లేదు... 
అర్ధాంతరంగా పోవాలనీ లేదు !
కాసులు కోట్లాది  కూడబెట్టాలని లేదు... 
కన్నబిడ్డలకు కాసింత కట్టబెట్టాలనుంది !
ఇంద్రభవనమైతే వద్దు...ఇల్లన్నదొకటి చాలు.. 
అదృష్టవంతుల్ని చూసి అసూయపడను... 
నాకూ కాస్త అంటించమంటాను ఆ దైవాన్ని !
సమస్యలు...సవాళ్లు వద్దనుకోను... 
ఆ సుడిగుండం దాటే స్థైర్యం కోరుకుంటాను...   
ఆశలున్నాయి నాకు...అత్యాశలైతే లేవు.. 
అవధులు దాటే ఆశయాలు...నా చెంతకు చేరలేవు...
నా శక్తిసామర్థ్యాలు వాటికెరుకే గనుక !!🙂
ఆదర్శాలు వల్లించలేను...
ఆచరించే దమ్ము లేదు మరి..!!
అనునిత్యం.. 'అందరం'  బాగుండాలనుకుంటాను...
అందులో ఖచ్చితంగా  నేనూ ఉంటాను గనక  !! 😊

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️




Friday, January 24, 2025

చిన్నారులతో సాధనా టీచర్

 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                     

                 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                                       ~ యం.ధరిత్రీ దేవి                  
      ఆరోజు శనివారం. అలవాటు ప్రకారం మధ్యాహ్నం చివరి పీరియడ్ కోసం ఎదురుచూస్తున్నారు ఐదవ తరగతి పిల్లలంతా. ఈరోజు టీచర్ ఏ విషయం గురించి చెబుతుందో, ఏ కొత్త కథ చెబుతుందో అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అంతలో బెల్ మోగింది. ఎదురుచూస్తున్న చివరి పీరియడ్  రానే వచ్చింది. సాధన టీచర్ క్లాస్ లోకి అడుగు పెట్టింది. అందరి మొహాల్లో సంతోషం...! నిలబడ్డారంతా.
" హాయ్, పిల్లలూ! ఈరోజు ఓ చక్కటి విషయం చెప్పబోతున్నాను... "
 అందరూ చిరునవ్వుతో టీచర్ వంక చూశారు.
"... రేపటి దినం ప్రత్యేకత తెలుసు కదా అందరికీ.."
" రిపబ్లిక్ డే టీచర్ "
 ముక్తకంఠంతో అన్నారంతా.
 " అది సరే, ఇంతకీ రిపబ్లిక్ డే అంటే ఏమిటో తెలుసా ? "
 అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 
" ఆరోజు జెండా ఎగరేస్తాం టీచర్ "
 శివ లేచి చెప్పాడు,
" ఎందుకు ఎగరేస్తామో చెప్పు  "
 టీచర్ ప్రశ్న. తల గోక్కున్నాడు వాడు.
" ఆ. మనకు స్వాతంత్ర్యం వచ్చింది  కాబట్టి.. "
 గోపీకి గుర్తొచ్చింది చెప్పాడు.
" అది స్వాతంత్ర్య దినం కదా!"
 అది కాదురా అన్నట్లు గోపీ వైపు చూశాడు శివ.
 అలా అలా మరో ఇద్దరు ఏవేవో చెప్పాక,
" అవేవీ కాదు. చెబుతాను వినండి శ్రద్ధగా... "
 సాధన పిల్లల వైపు చూస్తూ చెప్పసాగింది.         "బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొందిన రోజును స్వాతంత్ర్యదినంగా జరుపుకుంటాము మనము. ఇక రిపబ్లిక్ డేను భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటాము. రెండింటికి వ్యత్యాసం అదే.  రిపబ్లిక్ డే ను తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు..."
" ఓ, అలాగా..!"
 అన్నట్లు తలూపుతూ చూశారంతా టీచర్ వైపు. కొనసాగించింది సాధన.
"... గణతంత్ర రాజ్యం అనేది ఒక పరిపాలనా విధానం. ఇందులో రాజ్యాధికారం ప్రజలది, వారు ఎన్నుకున్న ప్రతినిధులది. గణతంత్ర రాజ్యంలో దేశం పరిపాలకులది కాకుండా ప్రజలందరి సొత్తు.." 
"................."
"...ఈ పద్ధతిలో ఏ కుటుంబానికో లేక సమూహానికో పరిపాలన మీద అధికారాలు ఉండవు. ప్రజా ప్రతినిధులు దేశ ప్రజలచే ఎన్నుకోబడినందున భారతదేశాన్ని రిపబ్లిక్ అంటారు..." 
"................"
"... దేశ ప్రజలచే ఎన్నుకోబడడం అంటే... ఈ మధ్య ఎలక్షన్లు.. అదే ఎన్నికలు జరిగాయి కదా.. మీ ఇళ్లల్లో పెద్దవాళ్లు అంతా వెళ్లి ఓట్లు వేశారు కదా... అదన్నమాట. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడతారు....ఇప్పుడు అర్థమైందా రిపబ్లిక్ అంటే ఏమిటో.."
 అందరూ తలలూపారు.
".. ఈ వయసులో మీకు ఈ మాత్రం అర్ధమైతే చాలు. మరింత వివరంగా పై క్లాసులకు వెళ్లే కొద్దీ తెలుసుకుంటారు.సరే మరి. రేపు రిపబ్లిక్ డే కదా. మరి స్పీచ్ ఎవరు ఇస్తారు?  "
" నేను ఇస్తా టీచర్ "
" టీచర్ నేను కూడా.. " 
 ఇద్దరు ముగ్గురు చేతులెత్తారు.
" వెరీ గుడ్. పాయింట్స్ అన్నీ బాగా గుర్తు పెట్టుకోండి. సరేనా "
" అలాగే టీచర్ "
 లాంగ్ బెల్ మోగింది. అంతా లేచి నిలబడి,
" థాంక్యూ టీచర్, గుడీవినింగ్ టీచర్  "
 చెప్పేసి, బిలబిలమంటూ టీచర్ వెంటే బయటికి దారితీశారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹