Thursday, January 19, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే... 13... జీవన ప్రమాణ పత్రం...

🌺

      సమయం ఉదయం 11.30 కావొస్తోంది. గబగబా రెడీ అయి, బయటపడి, పది నిమిషాలు రోడ్డు పక్కన నిలబడి, ఆటో కోసం నిరీక్షించి ఎట్టకేలకు ఎక్కేశాను. మరో పది నిమిషాల్లో దిగి, ఓసారి పరకాయించి చూసి, నిర్ధారించుకుని ముందుకు నడుస్తూ గేటు లోపల ప్రవేశించాను.
   అది....STO కార్యాలయం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సంవత్సరానికి ఓసారి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన అతి  ముఖ్యమైన ప్రదేశం. నెలనెలా పెన్షన్ డబ్బులు అందాలంటే జీవన ప్రమాణ పత్రం.. అదే... life certificate ! సమర్పించాలి మరి!(ఇటీవల కొన్ని కంప్యూటర్ సెంటర్ లు  కూడా కాస్త డబ్బు పుచ్చుకుని ఆ సేవలు అందిస్తున్నాయనుకోండి.)
   బాగా పాతబడ్డ ఓ చిన్న భవనంలో సదరు ఆఫీసు కార్యకలాపాలు సాగుతున్నాయి. గేటు దాటి లోపల అడుగుపెట్టిన నాకు... అక్కడ గుంపులు  గుంపులుగా జనం కనిపించారు. అంతా వయసు మీద పడ్డవాళ్ళు, వాళ్లకు సహాయంగా వచ్చిన వాళ్లూను. గత కొన్నేళ్ళుగా ఈ దృశ్యం నాకు అలవాటైపోయింది. సరే అనుకుంటూ కదిలాను. ఎదురుగా ఒకాయన వస్తూ, దూరం నుండే విష్ చేస్తూ పలకరించాడు. అతను ఒకప్పుడు నా కొలీగ్. కుశల ప్రశ్నల తర్వాత అతను వెళ్ళిపోయాడు. చాలా రోజులకు కలిసినందుకు ఓ క్షణం అప్పటి రోజులు మెదిలాయి. 
    అక్కడున్న పది, పదిహేను కుర్చీల్లో అంతా బైఠాయించి ఉన్నారు. రెండు మూడు సిమెంట్ బెంచీలూ ఆక్రమించబడి ఉన్నాయి. నేరుగా వెళ్లి నా వివరాలున్న ఆధార్ జిరాక్స్ కాపీ అందించాను అక్కడున్న సిబ్బందికి. అది అందుకుని, 
 "కూర్చోండి, టైం పడుతుంది.. "
 అంటూ బిజీ అయిపోయాడతను. 
" ఎక్కడ కూర్చోను...! "
అనుకుంటూ కళ్ళతోనే వెతుకుతూ లాభం లేక కాస్త దూరంగా వెళ్లి నిలుచుండిపోయాను, ఎవరైనా లేస్తే కూర్చుందాంలే అనుకుంటూ. 
 ఇంతలో గేటు బయట ఓ ఆటో ఆగింది. అందులో నుండి ఓ వృద్ధురాలు, ఆమెతోపాటు మరొకామె... కూతురు అనుకుంటా.. దిగారు. ఇద్దరూ కలిసి ఓ పెద్దాయన్ని జాగ్రత్తగా పట్టుకుని దింపారు. లోపల ఉన్న వాకర్ తీసి ఆయనకందించి, మెల్లిగా నడిపించుకుంటూ రాసాగారు. దగ్గరకు వచ్చాక తెలిసింది... ఆవిడ నాకు బాగా తెలిసినావిడ! నేను టీచరుగా పనిచేసే రోజుల్లో ఒకే బస్టాప్ దగ్గర కలిసేవాళ్ళం. నన్ను చూసి ఆవిడా గుర్తుపట్టి, చాలా సంతోషించింది. ఆ పెద్దాయన తన భర్త అని చెప్పింది. కాసేపు కష్టసుఖాలు వెళ్ళబోసుకుంది. మంచి మాటకారి. బస్ స్టాప్ వద్ద కలిసే టీచర్లందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడూ నాన్ స్టాప్ గా గలగలా మాట్లాడుతూ సందడి చేసేది. అందుకేనేమో... అంత బాగా గుర్తుండిపోయింది. 
   ప్రతీసారీ ఇలా ఇక్కడ ఈ ఆఫీసువద్ద తెలిసినవాళ్ళు ఒకరిద్దరైనా కనిపిస్తూ ఉంటారు. ఏమిటో ! అదో ఆనందం ! 
    ఇంతలో మరొకామె ఆటో దిగింది. వాకింగ్ స్టిక్ పట్టుకొని అతి ప్రయాసగా నడుస్తూ నెమ్మదిగా వస్తోంది. వెంట ఎవరూ లేరు. బాధగా అనిపించింది. సాధారణంగా నిస్సహాయులైన ఇలాంటి పెన్షనర్ల వెంట ఎవరో ఒకరు తోడుగా వస్తుంటారు. ఈమధ్య మరీ కదలలేని వాళ్ళకోసం ఇంటివద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ తీసుకునే సౌకర్యం కల్పించారట ! కొంతలో కొంత మేలు. 
    " Thank God ! నాకింకా అలాంటి పరిస్థితి రాలేదు. ఒక్కదాన్నే రాగలుగుతున్నాను ", 
అనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచాను. ఇంతలో ఓ ఛెయిర్ ఖాళీ అయితే వెళ్లి కూర్చున్నాను. ఇలా 'వెయిటింగ్' చేయలేనివాళ్ళు డబ్బు పోతేపోయిందని కంప్యూటర్ సెంటర్ లను ఆశ్రయిస్తున్నారు. రాన్రానూ నేనూ అదే దారి పట్టాల్సివస్తుందేమో ! లోలోపల నవ్వుకుంటూ... పిలుపు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.
 ఇంకాసేపటి తరువాత... మరో దృశ్యం కంటబడి, ననాకర్షించింది.  ఓ టీనేజ్ కుర్రాడు ఓ పెద్దాయనను నడిపించుకుంటూ వస్తున్నాడు. దగ్గరగా వచ్చేకొద్దీ... గ్రహించగలిగాను...ఎనభైకి పైగానే ఉంటుంది వయస్సు! సన్నగా, పొడుగ్గా ఉండి  వంగిపోయి నడుస్తున్నా.... అతని కళ్ళు చురుగ్గా అటూ  ఇటూ కదుల్తూ అందర్నీ చూస్తున్నాయి. అంతేకాదు.. అక్కడ ఎవరూ  అతనికి తెలియకున్నా అందరివేపూ చిరునవ్వుతో చూస్తూ ముందుకు సాగడం గమనించాను. అలా నా వైపూ చూడగానే అప్రయత్నంగా నా ముఖంలోనూ చిరునవ్వు ! పెదవి దాటి మాట రాకపోయినా... ఆ పెదవులపై విరిసే మౌన దరహాసానికి ఎంత మహత్తో  కదా !! అనిపించింది.
    ఎందుకో  ఈ వాతావరణంలో కాసేపు కూర్చునే సరికి ఆలోచనలు  గతంలోకి పరిగెడతాయి. జీవనయానంలో అత్యధిక భాగం. దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు వ్యక్తిగత జీవితంతో పాటు ఉద్యోగ జీవితానికి కూడా అంకితమై మమేకమైపోతాం. ఉత్సాహభరితమూ, అత్యంత శక్తివంతమూ అయిన ఆ 'పీరియడ్' ఎన్నెన్నో అనుభవాల సమాహారం... వీళ్లంతా ఆ రోజుల్లో క్షణం తీరిక లేక గడిపిన వాళ్లే ! రవంత  విరామం కోసం ఎదురుచూసిన వాళ్లే ! ఇప్పుడేమో... అంతా విరామమే ! అంతా విశ్రాంతే !!
     చివరి దశలో జవసత్వాలుడిగిపోయి...కన్నూ, కాలూ పనిచేయక శరీరం బొత్తిగా  సహకరించక మొరాయిస్తున్న ఈ తరుణాన 'నేనున్నా' నంటూ నెల తిరిగేసరికి చేతికందే  'పింఛను' అలాంటి వారందరికీ ఇచ్చే ఆసరా,  భరోసా మాటల్లో వర్ణించలేనిది! అదే లేకుంటే సగం జనాభా జీవచ్ఛవాలుగా బ్రతుకీడ్వాల్సిన దుర్భర పరిస్థితి! ఊహించుకోవడానికే శక్యం  కానిది..!
   ఇంతలో ఏదో కలకలం ! ఓ ఐదారుగురు లోపలి నుండి వస్తూ,
 " సర్వర్ పని చేయట్లేదట ! బయట చేయించుకో మంటున్నారు.."
అంటూ వెళ్లిపోయారు. కూర్చున్న వాళ్ళలో  సగం మంది లేచి బయటికి నడిచారు. రెండు నిమిషాలాగి నేనూ లేచాను. బయటికి దారి తీసేలోగా... లోపల నుండి ఒకతను, 
" పని చేస్తోంది.... రావచ్చు.. "
 అన్నాడు . మరో నిమిషంలో నా పేరు వినబడింది.

****************************************
      

Thursday, January 12, 2023

నేను మైనపు బొమ్మను కాను

🌹

     " చూడమ్మా , అబ్బాయి డాక్టర్. గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు ప్రైవేటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. నీవు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు... "
   సోమసుందరం గారు చెప్పుకుంటూ పోతున్నారు. తలవంచుకొని అనిత ఊకొడుతోంది. ఆమెలో అప్పుడే సంతోషతరంగాలు మొదలైనాయి. ఓ డాక్టర్ భార్యగా తన్ను తాను ఊహించుకొని మురిసిపోసాగింది. ఆ రాత్రంతా ఆమెకు అవే ఆలోచనలు. ఆ రాత్రే  కాకుండా వరుసగా మూడు రోజుల పాటు అదే తంతు కొనసాగింది. 
" ఆ అబ్బాయి డాక్టర్నే చేసుకోవాలని నిర్ణయించు కున్నాడటమ్మా... పోనీలే.. మీ మేనమామ రాఘవరావు మరోసంబంధం  గురించి చెప్పాడు. అతను ఇక్కడే ఓ స్కూల్లో టీచరట... "  
   కొండ అంచు మీద నుండి దబ్బున  కింద పడినట్లు అయింది అనితకి. కానీ త్వరలోనే ఆ నైరాశ్యం  నుండి బయట పడగలిగింది. తర్వాత షరా మామూలే..! ఓ మాస్టారుతో తన కాపురం ఎలా ఉంటుంది...! అన్న భావనలో కొద్దికాలం ఊగిసలాడుతూ ఉండిపోయింది.
" చేసేది పంతులు ఉద్యోగమైనా అతని తల్లిదండ్రుల ఆశకు మాత్రం కొదవ లేనట్టుంది.. ఈ సంబంధానికి నేను తూగలేను...".
  ఉస్సురంటూ... ఓ సాయంత్రవేళ తండ్రి నుండి వచ్చిన నిట్టూర్పులకి భావ రహితంగా ఉండిపోయింది అనిత. రాత్రి వెంట పగలు, పగలు వెంట రాత్రి... గడిచిపోతూనే ఉన్నాయి. ఆ పరంపరలో ఒకరోజు....
" అబ్బాయి ఇంటర్ దాకా చదివాడట. ఆస్తి బోలెడుంది. ఒక్కడే కొడుకు. ఆ కుటుంబం కూడా నాకు తెలిసినదే. కట్నాల వద్ద ఏ పేచీ  ఉండదు. పువ్వుల్లో పెట్టి  చూసుకుంటారు నిన్ను. కాకపోతే... పల్లెటూర్లో ఉండాల్సి వస్తుంది.ఐతేనేం...  మహారాణి లాగా బతకొచ్చు. ఈ సంబంధం నాకన్ని విధాలా నచ్చింది. ఇదే ఖాయం చేసేస్తాను..."
   తండ్రి ముఖంలో ఆనందం చూసి ఆమె హృదయం తేలికపడినా... అంతరంగం మాత్రం బాధగా మూలిగింది.
                     **            **            **
   " నీకు బుద్ధుందా అసలు...! ఎవరేం చెప్తే దానికి గంగిరెద్దులా తలాడించడం తప్ప నీకంటూ ఓ అభిప్రాయం ఉండాలని నీకనిపించదా? అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా నీవు ఎలా నెట్టుకొచ్చావో  చచ్చినా నాకర్థంకాదు.నాకో అనుమానం...నీవో పోస్టుగ్రాడ్యుయేట్ అన్న సంగతన్నా నీకు గుర్తుందా అని.. !"
  అనిత చెప్పినదంతా విని, ఇంతెత్తున  ఎగిరిపడింది తన చిన్ననాటి స్నేహితురాలు అనంత.
".................... "
"...మొన్నో డాక్టర్.. నిన్నో మాస్టారు... ! ఈరోజు మరొకడు...! అసలు వీళ్లలో ఒక్కరన్నా నీకు నచ్చారా..?  వాళ్లకు అనుగుణంగా నీవు ఉండాలని కాదు... నీకు తగినట్లుగా వాళ్లున్నారా అని ఒకసారన్నా ఆలోచించావా? ఈ పెళ్లి జరిగితే, అయ్యేదేమిటో తెలుసా..? నీ డిగ్రీలు ఎందుకూ  పనికిరాని చిత్తు  కాగితాలు కావడమే...! నీ తెలివితేటలు, నీ చదువు... అన్నీ  బూడిదలో పోసిన పన్నీరే. జీవితాంతం ఆ పల్లెటూర్లో జీవశ్చవంలా మగ్గి పోతావు తెలుసా..!"
    చివ్వున  తలెత్తిన అనిత కళ్ళల్లో తడి చూసి చలించిపోయింది అనంత. దగ్గరగా తీసుకుని, 
" మీ నాన్న బాధపడతాడని నీవు నీ మనసుని చంపుకుంటున్నావు. ఆత్మవంచన పనికిరాదు అనితా. ఆయన ధోరణి చూస్తుంటే... ఎలాగైనా సరే... తన తల మీద భారం దించుకోవాలి అన్నట్లుగా ఉంది... ఆయన్ని నేను తప్పు పట్టడం లేదు. ఓ తండ్రిగా ఆయన మానసిక స్థితి అర్థం చేసుకోగలను. కానీ.. ఓ విద్యాధికురాలిగా... నీ వ్యక్తిత్వం వదులుకోవద్దు అంటున్నాను..."
"..................... "
" నీ చదువుకో సార్ధకత కలిగించు. నాలాగా ఏ చిన్నపాటి ఉద్యోగమో చేస్తూ ఉండు. నీకు అన్ని విధాలా  నచ్చినవాడు తారసపడిన నాడు పెళ్లి మాట తలపెట్టు. నీకో చిరుద్యోగం చూసే పూచీ  నాది..."
   అనంత వైపు దిగ్భ్రమగా చూసింది అనిత. ఆమె భుజం మీద చేయి వేసి, పక్కనే కూర్చుంటూ, 
" తండ్రి మాట లక్ష్యపెట్టవద్దని నేను అనటం లేదు. కానీ, సొంత అభిప్రాయం అంటూ లేకుండా మైనపు బొమ్మ లాగా ఎటు ఉంచితే అటు వంగరాదని చెప్తున్నాను. ఆడపిల్లకు పెళ్లి ముఖ్యమే.. కానీ.. 'ఏదో అయిందిలే' అనిపించే పెళ్లి మాత్రం కాకుండా ఆగిపోతేనే నయమని అనుకుంటున్నాను. నా మాటలు కటువుగా  ఉన్నా కఠోర సత్యాలు సుమా..!"
    వాతావరణాన్ని తేలిక చేయడానికన్నట్లు నవ్వేసింది అనంత.
" ఇంతకీ నా మాటలు నీమీద ఏమైనా ప్రభావం కలిగించి ఉంటే.... రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా నావద్దకొస్తావు... సరేనా...!"
 అంటూ ఆప్యాయంగా చేయి నొక్కి, నిష్క్రమించింది.
                    **                   **                 **
   అనితలో చలనం మొదలైంది. 
" నిజమే ! ఇంతవరకూ నాకా ఆలోచనే కలగలేదేమిటి! ఎంతసేపూ... తండ్రి కోణం నుంచే చూసింది గానీ... తన స్పందన పూర్తిగా పక్కకు నెట్టేసింది. అనంతకు థాంక్స్ చెప్పితీరాలి. ఇకపై ఎవరేం చెప్పినా మైనపు బొమ్మ లాగా కరిగిపోతూ సొంత అభిప్రాయాల్ని మార్చుకోవడం మానేయాలి".
    ఆమెలో స్థిరనిర్ణయం రూపుదాల్చుకుంది. 
             **                 **              **
   మర్నాడుదయం తొమ్మిది గంట కొట్టడానికి ఐదు నిముషాలు ముందే అనిత తన ఇంటి గుమ్మంలో ప్రత్యక్షమవడం చూసి అనంత కళ్ళు సంతోషంతో  విప్పారాయి. 

******************************************
'వనితాజ్యోతి'మాసపత్రిక,ఫిబ్రవరి,'95 లో ప్రచురితం 
******************************************





Saturday, January 7, 2023

గులాబి నవ్వినవేళ !!


🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

***************
                                        

ఓ ప్రభాతవేళ... 
ననుజూసి నవ్విందో పూబాల  !
నా ఇంటి ముంగిట విరిసి... 
మెరిసిన కుసుమ కోమలి   !
శ్వేత వర్ణ గులాబి అది... 
స్వచ్ఛతకు మారుపేరేమో మరి !
పలువర్ణాలకు దీటుగా నిలబడి... 
గెలిచింది నా మదిని.. !
ఓ శుభవేళ... నాచే నాటబడ్డ ఓ చిన్ని మొక్క...
అది నాకందించిన తొలి కాన్క !
అరచేత ఆణిముత్యమా అన్న చందాన
అలరిస్తూ... నను మురిపిస్తూ... ఏమందును !
అల్లనల్లన కదిలే కొమ్మన...
ఊయల ఊగుతూ... రా రమ్మంటూ...
నను  పిలిచింది చిరునవ్వులు చిందిస్తూ...
ఆ పుష్పవిలాసం... ఆ సుగంధపరిమళం...!
అచ్చెరువొందించే అద్భుతసోయగం !
అదో వెలుగులు వెదజల్లే వెన్నెల దీపం !
ముగ్ధ  మనోహర సౌందర్యానికి
నిలువెత్తు నిర్వచనం..!
'నాకోసమే పూసిందా...!'
అవ్యక్తభావం నాలో ఓ క్షణం...!
అబ్బురపడి.. చెంతజేరి.. చేయి వేసితి... 
తుంచను మనసు రాక నిలిచిన క్షణాన...
మొదలైంది వాన... మాటల జడివాన..!
అది..ఆ లేలేత కుసుమం మూగ భాష...!
ఆ సైగలు..వినిపించని రాగాలేవో పలికిస్తూ...
తట్టి లేపి నాలోని  భావుకతను... 
కురిపించాయి ఒక్కుమ్మడిగా  అక్షర గీతాలు...!
" నీకోసమే విరబూశా...
నీ దోసిట ఒదిగి ఓ నక్షత్రాన్నవుతా... 
నీ సిగను నెలవంకనై మెరిసిపోతా...!
ఒక్క రోజు చాలు నీ సన్నిధి...
నాకది ఎనలేని పెన్నిధి...! "
అంటూ గారాలు ఒలికినట్లు 
వినిపించిన  తేనెపలుకులకు 
పరవశిస్తూ పరుగున దరిజేరి... 
సందిట బంధిస్తూ... 
ప్రేమతో ముద్దులిడి... ఆపై... 
గులాబి 'తల్లి' ని తడిమి తడిమి...
హత్తుకుని పరవశించితి 
అరమోడ్పు  కన్నులతో...! ఆ క్షణం... 
నాలో  ప్రతిధ్వనిస్తూ  హృదయరాగాలు !!
వినిపించాయి నాకు సుమధుర స్వరాలు !!


🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🐦🌷










Sunday, January 1, 2023

వచ్చేసింది... 2023

 🌷   

   ఎన్ని సుడిగుండాలు ! ఎన్నెన్ని ఎత్తుపల్లాలు! కొండలు,లోయలు,  బండరాళ్లు! అడ్డుపడినా అదరక బెదరక,  వెనుదిరగక, మిన్ను విరిగి మీద పడ్డా భీతిల్లక... ప్రశాంతంగా,  గంభీరంగా సాగిపోయే నదీమతల్లి ప్రవాహంలా కదులుతూ పోయేదే కాలం!! క్షణం ఆగని ఆ పయనం యుగయుగాలుగా, తరతరాలుగా సాగుతోంది. ఆ గమనంలో ఆనందమే కాదు.. విషాదాన్నీ చవిచూస్తుంది. ఎన్నెన్నో అనుభవాల్ని  మూటగట్టుకుంటుంది. మనిషికి సందేశాలను ఇస్తుంది, గుణపాఠాలనూ నేర్పిస్తుంది. 

   అప్పుడప్పుడూ... పరవశిస్తూ, వినూత్నంగా వెల్లివిరుస్తుంది... అదే.. ! కొత్త సంవత్సరాన్నంటూ.. ! కొత్త పేరుతో నవ్యతనద్దుకుంటుంది. 🙂

" గతంలో జీవించకండి "

" వర్తమానం విలువ తెలుసుకోండి "

" రేపటి కలల్ని నిజం చేసుకోండి "

-- అంటుంది. భుజం తడుతూ ముందుకు నడవమంటుంది. తనలాగే... అచ్చం తనలాగే.. తడబడక సాగమంటుంది కాలం. కాలగమనమది ! ఎప్పటికీ ఆగని నిరంతర ప్రవాహమది ! 

   ఆ గమనంలో... అదిగో.. ! ప్రవేశిస్తున్నది ముస్తాబౌతున్న మరో కొత్త సంవత్సరంలోకి. కొత్త ఆలోచనలతో, కొత్త తీర్మానాలతో సరికొత్తగా సిద్ధం కమ్మంటున్నది. అందర్నీ తనతో కదిలి రారమ్మంటున్నది.  

   అదిగో... అదిగదిగో.. !😊 వచ్చేసిందిగా... 2023 నూతన సంవత్సరం ! ముక్తకంఠంతో స్వాగతిద్దాం...  🙂

                   🌷💐💐💐🌷💐💐💐🌷