Monday, August 25, 2025

నాకు నచ్చిన పద్యం

             
            
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారు బూసెజ్జపై
నొకచో శాకము లారగించు, నొకచో నుత్క్రుష్ట శాల్యోదనం 
బొకచో బొంత ధరించు,నొక్కొక్క తరిన్ యోగ్యంబరశ్రేణి లె 
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ 

 కార్యసాధకులు సుఖదుఃఖాలను లెక్క చేయకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహిస్తూ ఉంటారు. అలాంటివారు కుదరనప్పుడు ఒక్కోసారి నేలపైనే పడుకుంటారు. మరోసారి పూలపాన్పుపై పడుకుంటారు..అలాంటి అవకాశం వారికి రావచ్చు. ఒకసారి కేవలం కాయగూరలతో  భోజనం చేస్తాడు. మరోసారి.. మృష్టాన్నభోజనంతో  విందారగిస్తాడు. ఒకసారి ముతకబట్టలు అంటే ఏమాత్రం బాగులేని బొంత లాంటి వస్త్రాలు ధరిస్తాడు. పరిస్థితి బాగున్నప్పుడు పట్టువస్త్రాలే ధరిస్తాడు. ఆ విధంగా కష్టాలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా లక్ష్యసాధనకై ఓర్పు వహిస్తూ కృషిచేయడమే ఉత్తముల లక్షణం. ఇదీ ఈ పద్య భావం. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం మంచిది అని కవి ఎంత చక్కగా తెలియజేశాడో కదా ఈ పద్యంలో...!
   భర్తృహరి సంస్కృతంలో రాసిన పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి అనువదించిన చక్కటి భావయుక్తమైన ఈ పద్యం నాకెంతగానో నచ్చిన పద్యాల్లో ఒకటి.

No comments:

Post a Comment