తనిసిరే వేల్పులు దధి రత్నముల చేత
వెరచిరే ఘోర కాకోల విషము చేత
విడిచిరే యత్న మమృతమ్ము వొడయు దనుక
నిశ్చితార్థమ్ము వదలరు నిపుణమతులు
అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్న దేవతలు ఆ సమయంలో వారికి లభించిన రత్నాలకు సంతోషించలేదు...తృప్తిజెందలేదు. ఆ ప్రయత్నంలో వెలువడిన కాలకూటవిషానికీ ఏమాత్రం భీతి చెందలేదు. అమృతం లభించేదాకా తమ ప్రయత్నాన్నీ వీడలేదు. ధీరులు, కార్యసాధకులు తాము తలపెట్టిన కార్యం సఫలమయ్యేవరకు తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు. అంటే సజ్జనులు తాము పూనిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నం విడవరని ఈ పద్యం సారాంశం. చక్కటి భావంతో పాటు సందేశాన్ని కూడా ఇస్తూ, స్ఫూర్తిని కలిగించే ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతిశతకంలోనిది.
No comments:
Post a Comment