Tuesday, April 26, 2022

సహజమే... అది సహజమే

 
భగభగ మండే ఎండలు
భరించలేని ఉక్కపోతలు !
చల్లగాలికై ఎదురుచూపులు 
అలసి సొలసి పోతున్న దేహాలు...
మొరపెట్టుకుంటూ జోడించాయి చేతులు !
"భానుడా ! చాలించవా ఇక 
 నీ ప్రతాపం, చూపించవా 
మాపై కాస్త కనికరం !"
జనాల ఘోష విన్నాడేమో 
సూర్య భగవానుడు... 
ఆకాశం నిండా కమ్ముకున్నాయి
నీలి నీలి మేఘాలు !
మేఘాల నిండా కదుల్తూ  నీటికుండలు !
చల్ల గాలి సోకింది
చిరు జల్లు కురిసింది
తొలకరితో నేలంతా తడిసింది!
ప్రకృతి పరవశించింది !
అంతలోనే --
వానలు అయ్యాయి వరదలు 
వెల్లువెత్తి మిగిల్చాయి వేదనలు !
మళ్లీ మొదలు... వేడుకోలు !!
"వరుణుడా ! కనికరించు !
శాంతించి మమ్ము కాపాడు.. "
వానదేవుడూ విన్నాడేమో? 
గాడిని పడింది జనజీవనం
సాగించింది   నవజీవనం... 
మళ్ళీ అంతలోనే ---
మొదలైంది చలి  మెల్లిగా... 
మొదట ఆహ్లాదమే ! ఆపిదప...
ఆరుబయట ఆకాశం చూస్తూ 
ఎండకోసం వేచిచూస్తూ...
' అబ్బా!చలి!తాళలేము'
 అంటూ వణుకుడే !! 
" ఔరా ! మానవ నైజం !"
తక్కువైనా ఎక్కువైనా 
తట్టుకోలేరుగా జనం !
అవసరానికి మించి అందితే 
ఏదైనా మరి అంతే... 
సహజం ! అది సహజమే 😊! !

************************************



Saturday, April 23, 2022

మనుషులు ఇలా కూడా ఉంటారా... !

      నేరాలు, ఘోరాలు  గురించిన వార్తలు  పేపర్లలో, టీవీ ల్లో రావడం మామూలే. వాటిని చదువుతున్నప్పుడు క్షణకాలం'ఔరా' అనుకోవడమూ అందరికీ అలవాటే. కానీ, ఇటీవల కొన్నింటి గురించి వింటుంటే, 
 "మై గాడ్' ఇదేమిటి ! ఇలా కూడా ఉంటారా? అసలు వీళ్ళు మనుషులేనా!"
 అన్న ప్రశ్న ఉదయిస్తోంది.మూడు రోజుల క్రితం చదివిన ఓ వార్త. .... 
 అతన్ని  పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఓ కత్తి  కొని అతని గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిందట ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి ! వినటానికి తమాషాగా లేదూ ! కానీ ఎంత అసంబద్ధమైన, ఆలోచనా రహితమైన చర్య ! విషయంలోకెళ్తే....... 
--  పెళ్లి నిశ్చయమైన తర్వాత తన స్నేహితులకు పరిచయం చేస్తానంటూ ఆ వరుణ్ణి బయటకు రమ్మని చెప్పిందట ఆ పెళ్ళికూతురు. అతను సరేనంటూ ఆమెతో వెళ్ళాడట. దారిలో ఓ షాపు వద్ద ఆగి, లోనికి వెళ్ళి, ఓ కత్తి కొనుగోలు చేసిందట ఆ అమ్మాయి !
  ఏం కొంటున్నావని అతనడిగితే... 
'బహుమతి '  అని బదులిచ్చిందట !.. ఆతర్వాత అక్కడక్కడ కాసేపు గడిపాక, 
" ఏరీ నీ ఫ్రెండ్స్ " అని అతనడిగితే, కేక్ తేవడానికెళ్లారని చెప్పి, 
" ఈలోగా నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ " 
అంటూ చున్నీతో అతని కళ్ళకు గంతలు కట్టి, కొని తెచ్చుకున్న కత్తితో అతని మెడ మీద బలంగా కోసేసిందట !! అతను బలవంతంగా ఆమెను వదిలించుకుని చున్నీ విప్పేయగానే... 
" నీతో పెళ్లి నాకిష్టం లేదు..."
 అని భోరుమందట !ఆ  అమాయకుడు మళ్లీ ఆమె కూడా ఏం చేసుకుంటుందో అని భయపడి, వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఆమెను కూర్చుండబెట్టుకొని బయలుదేరాడట ! మధ్యలో రక్తస్రావం అధికమై ఇక చేతకాక స్పృహ తప్పుతున్న  దశలో దారిని పోయే వాళ్ళు చూసి హాస్పిటల్ కు తరలించారట ! విషయం పోలీసుల దాకా వెళ్ళాక.... ఆ అమ్మాయి  తనకు అతనితో పెళ్లి ఇష్టం లేకనే అలా చేశానని నేరం ఒప్పుకుందట ! నవ్వాలా,  ఏడవాలా? 
-- ఇలాంటి సంఘటనలు చదివినప్పుడు... ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇష్టం లేకపోతే బాహాటంగా చెప్పేయాలి. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయడమేంటి? ఫలితంగా జరిగిందేమిటి? వెళ్లి కటకటాల వెనక కూర్చుంది ! ఇంట్లో పెద్దలు ఒప్పుకోరన్న భయం ఉంటే ధైర్యంగా అతనికే చెప్పొచ్చుకూడా. ఇదో నేరప్రవృత్తి. మానసిక బలహీనత !
--- మరో వార్త ! ఆమెకు పెళ్లయి ఏడేళ్లయింది. ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. ఇప్పుడేమో భర్త అదనపు కట్నం కావాలని వేధిస్తున్నాడట ! ఇదెక్కడి న్యాయం  ! ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాక కూడా ఈకట్నాల గోలేమిటి !! ఆత్మాభిమానమున్న ఏ మగాడైనా ఇలా భార్య తెచ్చే డబ్బుకై  వెంపర్లాడతాడా? కుటుంబాన్ని పోషించాల్సింది అతనే కదా!  అలాకాక  ఆమెను వేధిస్తూ నరకం చూపిస్తూ.... ఆఖరికి ఇనుప రాడ్ తో కొట్టి,చీరతో గొంతు నులిమి హతమార్చాడట !
--- ఇలాంటి దారుణాల్ని విన్నపుడు.... ఎందుకిలా ప్రవర్తిస్తారు ! తాము ప్రశాంతంగా ఉండక, చుట్టూ ఉన్నవాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వక... చివరికి ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడడం లేదు. దరిమిలా వాళ్ళు బావుకుంటున్నదేమిటి? హంతకుడన్న ముద్ర ! జైలు జీవితం !సర్వం కోల్పోయి తల బాదుకోవడం  !అంతకన్నా మరేమైనా ఉన్నదా? 
కాస్త విచక్షణ, ఆలోచనా పరిజ్ఞానం ఉంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడరు కదా, అనిపిస్తుంది ఇలాంటి వాళ్లను తలచుకుంటూ ఉన్నప్పుడు. 
--- ఇదిలా ఉంటే... ఇంతకన్నా ఘోరమైన అకృత్యం -- వినడానికే అతి  హేయంగా అనిపిస్తూ నిన్నటి పేపర్లో వచ్చింది... ఓ మానసిక దివ్యాంగురాలిని ఇరుకైన గదిలో బంధించి ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారన్నది ఆ వార్త ! తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఏ ఫలితం లేకపోవడం మరీ దారుణం!
-- ఈ మూడు సంఘటనలూ కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగినవే. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉండొచ్చు. మనసంతా కలచివేసే ఈ దుశ్చర్యలకు రోజురోజుకూ అంతూ పొంతూ లేకుండా పోతోంది. సభ్యత, సంస్కారం, నాగరికత లేశమాత్రం లేని వీళ్ళు అసలు  మనుషులేనా?ఎన్ని చట్టాలు చేసినా నేర ప్రవృత్తి, క్రూర మనస్తత్వం ఎంతమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.   రానురాను ఈ సమాజం ఏమై పోతోంది! ఊహించుకోవడానికే విపరీతమైన భయమేస్తోంది !!
                       ++++++++++++++

Wednesday, April 20, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 7.. కల నిజమైన వేళ...

 
🌺
      ఎక్కువ శాతం విద్యార్థులకు పదవ తరగతి వరకూ చదువు గురించిన ఆలోచన ఒకే విధంగా ఉంటుందని నా భావన. చాలామందికి భవిష్యత్తు గురించి పెద్దగా నిర్ణయాలు, లక్ష్యాలు ఆ వయసులో ఉండకపోవచ్చు కూడా..   పది పూర్తయ్యే తరుణంలో తర్వాత వచ్చే ఇంటర్లో తీసుకునే గ్రూపును బట్టే వారి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంతే కదా !
     నాకైతే పది పూర్తయేదాకా బాగా చదవడమొక్కటే తెలుసు. క్లాసులో ఫస్ట్ వస్తే చాలనుకుని తృప్తిపడే మనస్తత్వం. సబ్జెక్ట్స్ విషయానికొస్తే లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. సైన్స్ సబ్జెక్ట్ మీద ప్రత్యేకమైన ఆసక్తి. సోషల్ స్టడీస్ అంతగా నచ్చేది కాదు. లెక్కలంటే అమితమైన భయం ! 
   మాది ఇంటర్ ఫస్ట్ బ్యాచ్. అంత వరకు టెన్త్ తర్వాత SSLC అనీ, తర్వాత PUC అనీ ఉండేవి. అవి రద్దు చేసి, రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు ప్రవేశపెట్టారు. సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు మాత్రమే ఉండేవి మొదట్లో. నా ఇంట్రెస్ట్ మేరకు నేను బై పి సి తీసుకోవడం జరిగింది. ఏముంది ! షరా మామూలే కదా! బైపిసి తీసుకున్న స్టూడెంట్స్ లో దాదాపు సగ భాగం మొదటి సంవత్సరం అంతా డాక్టర్ కావాలనే కలలు కంటూ ఉంటారు. అది పూర్తయ్యి,  రెండో సంవత్సరం మొదలై గడుస్తున్నకొద్దీ మెల్లిమెల్లిగా మొదలవుతుంది....
".. ఎందుకొచ్చిన బెడదరా బాబు... హాయిగా ఏ డిగ్రీ లో నైనా చేరిపోతే బెటర్ కదా..."
 అన్న ఆలోచన.! దీనికి నేనేమీ  మినహాయింపు కాదు. అలాగే ఇంటర్ తర్వాత  డిగ్రీలో B.Z.C  గ్రూప్ తీసుకొని జాయిన్ అయిపోయి ఊపిరి పీల్చుకున్నాను.
  అలా సాగుతూ సాగుతూ ఉన్న నా డిగ్రీ చదువు సజావుగానే సాగింది. చివరి సంవత్సరం వచ్చేసరికి  పీజీ   చేయాలన్న కోరిక చిన్నగా మొదలైంది గానీ.. పర్సంటేజ్ బాగా లేని కారణంగా రెగ్యులర్ గా చదవలేకపోయాను. కానీ ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది నా మదిలో. ఆ తర్వాత అనుకోని విధంగా BEd చేసేశాను.టీచర్ నీ అయిపోయాను.
    తర్వాత ఇంకేముంది ! పెళ్లి,  పిల్లలు.. ఆలనా పాలనా.. కుటుంబ నిర్వహణ.. మరోపక్క ఉద్యోగ బాధ్యత.. రెండు పడవల ప్రయాణం! బిజీ లైఫ్ లో  కూరుకుపోయి PG ఆలోచన పూర్తిగా పక్కకు నెట్టివేయబడింది నా మెదడులోంచి. 
    కానీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత అనుకోని విధంగా నా కొలీగ్ ద్వారా  అవకాశం లభించి, నా కోరిక చిగుళ్ళు తొడిగి కార్యరూపం దాల్చింది. ఫలితంగా MA, ఆ పిదప కొంత గ్యాప్ తీసుకుని MEd ప్రైవేట్ గానే వరుసగా చేయగలిగాను. పూర్తయ్యి  డిగ్రీలు చేతికి  వచ్చాక ఏదో తెలియని ఆనందం.. సంతృప్తి ! గొప్ప 'achievements ' అని  కాదు గానీ నేను అనుకున్నది చేయగలిగాను అన్న సంతోషం మాత్రమే!
చెప్పొద్దూ ! నన్ను చూసి మరో ముగ్గురు నా సహోపాధ్యాయినులు ప్రైవేటుగా PG కి అప్లై చేసేశారు  !
  PG చేసేటప్పుడు అధ్యాపకురాలిగా వెళ్ళాలన్న ఆలోచన ఎంత మాత్రమూ  నాకు లేదు. కేవలం MA  చేయాలన్న గోల్ మాత్రమే నా ముందుండేది. కానీ లెక్చరర్ పోస్ట్ ఆశించకుండానే ప్రమోషన్ రూపంలో నా చేతికందింది. రోజూ గంటన్నర పైగా ప్రయాణం ! అయిదేళ్ళు అలా గడిచాయి. ఓ రోజు...   మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న దిశగా  ప్రభుత్వం యోచిస్తున్నదని పేపర్లో వార్త వచ్చింది. 
"అలా వస్తే ఎంత బావుణ్ణు ! ఈ ప్రయాణం బాధ కాస్తయినా తప్పుతుంది కదా.." అనుకున్నా. కానీ ఊహించని విధంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో కౌన్సిలింగ్ పద్ధతి వచ్చి, కర్నూలు KVR కాలేజీలో నాకు అవకాశం వచ్చింది! నిజంగా అద్భుతమే!!  అక్కడ చేయడం అన్నది నా కల ! అలా కల నిజమై మరో ఐదేళ్లు అక్కడే చేసి, పదవీ విరమణ పొంది, ఉద్యోగ జీవితానికి స్వస్తి పలికాను.
    చిన్న చిన్న కోరికలే ! చిన్న చిన్న లక్ష్యాలే  ! కానీ అవి  చేరుకోవడానికి వెనక ఎంత శ్రమ, తపన, పట్టుదల, దీక్ష దాగి ఉంటాయి ! ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ ఒకింత ఆశ్చర్యం ! కొండంత  ఆనందం !! 
  ప్రతి వారి జీవితంలో ఇలా కొన్ని మైలురాళ్లన్నవి మలుపుల రూపంలో తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి కదా అనిపిస్తుంది. 
   మనం 'సూపర్ స్టార్స్' కాకపోవచ్చు. గొప్ప గొప్ప పదవులూ నిర్వహించకపోవచ్చు. కానీ... అతి సాధారణజీవితంలో అతి చిన్న కోరికలు తీరిన రోజు, చిన్న చిన్న లక్ష్యాలైతేనేమి... అవి చేరుకున్న రోజు మనసంతా ఎంతగా ఉప్పొంగిపోతుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ ఆనందం ఎంత తృప్తినిస్తుందో మాటల్లో వర్ణించలేనిది  !!  🌺

                        🙂🙂🙂🙂🙂🙂
 





    

Friday, April 15, 2022

తప్పు

🎆🌄🎆🌄🎆🌄🎆🌄🎆🌄

బ్రతుకు వెన్నెలనీ 
బ్రతికేది వెలుగుకోసమనీ 
అనుకోవడంలో లేదు తప్పు 

ఆశలు తీరాలనీ 
కోర్కెలు  నెరవేరాలనీ 
ఆశించడంలో లేదు తప్పు 

బ్రతుకు చీకటై 
వెలుగు శూన్యమై 
ఆశలు ఆవిరై 
కోర్కెలు ఎండమావులై 
ఎదుట నిలిచిన నాడు 
క్రుంగిపోవడమే తప్పు !!

🎆🌄🎆🌄🎆🌄🎆🌄🎆🌄

[ 'వనితా జ్యోతి' మాస పత్రిక లో ప్రచురితం ]