Monday, January 25, 2021

నటభూషణం... ' రక్త కన్నీరు' నాగభూషణం

సాయంత్రం కాస్త రిలాక్స్ అవుదామని టీ వీ ఆన్ చేశాను. అయిదారు చానల్స్ తిప్పి ఓ చోట ఏదోో కామెడీ ప్రోగ్రాం వద్ద ఫిక్స్ అయిపోయాను. అందులోో ఓ నటుడు పంచుల మీద పంచ్ లు పేలుస్తూ అందరినీ నవ్విస్తున్నాడు. కానీ, తను చెప్పే డైలాగు ముగిసీ ముగియకముందే ప్రేక్షకుల కంటే ముందు తనే నవ్వేస్తూ ఉన్నాడు.. ఎందుకో... ఎక్కడో ఆ కామెడీలో ఏదో వెలితిగా తోచింది. అలా అలా చూస్తుండగా నాకు పాత తెలుగు సినిమాల్లో తమ అద్భుత నటనా చాతుర్యంతో హాస్యానికి భాష్యం చెప్పిన అలనాటి నటీనటులు కొందరు ఠక్కున గుర్తొచ్చారు

    ఇదివరకు నేను రాసిన పోస్టుల్లో నటీమణి సూర్యకాంతం గారి గురించినదొకటుంది. ఆవిడ నటనా వైదుష్యం ఎంత చెప్పుకున్నా తక్కువే. తెరపై తను ఏమాత్రం నవ్వక చూసే అందర్నీ నవ్వించే అద్భుత నటనా పటిమ ఆమె సొంతం. అదే కోవకు చెందిన మరో విలక్షణ నటుడు నాగభూషణం గారు.' రక్త కన్నీరు' నాగభూషణం గా సుప్రసిద్ధుడైన ఈయన అప్పట్లో తెలుగు చిత్రసీమను రెండు దశాబ్దాలు పైగా ఏలా రని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఆయన లేని తెలుగు సినిమా దాదాపు లేదన్నా అతిశయోక్తేమీ కాదు. 
    ముఖంలో హావభావాల్ని అలవోకగా పలికిస్తూ సన్నివేశాల్ని హృద్యంగా పండించే  నటనాచాతుర్యం పుణికిపుచ్చుకున్న అరుదైన నటుడాయన ! హాస్యం, వినోదం, క్రూరత్వం, గాంభీర్యం, రౌద్రం, విచారం, సరసం , కుటిలత్వం, బీభత్సము -- ఇలా అన్ని రసాల్ని  పోషించడంలో దిట్ట అనిపించుకున్న ఘనత వీరి సొంతం !  అంతటి ప్రతిభావంతుడైన నాగభూషణం చిత్రసీమలో ప్రవేశించక ముందు రంగస్థల నటులు. తమిళంలో M.R.రాధా గారి నాటకాన్ని' రక్త కన్నీరు' గా తెలుగులోనికి అనువదింపజేసి కొన్ని వేల ప్రదర్శనలిచ్చారని విన్నాను. క్రమేణా ఆయన ఇంటి పేరే ' రక్త కన్నీరు' గా రూపుదిద్దుకుంది.
  తెలుగులో వారి మొదటి సినిమా( 1952) ' పల్లెటూరు'. చిన్నతనంలో' ' మాయాబజార్' సినిమా చూస్తున్నప్పుడు తెలియలేదు గానీ తర్వాతి రోజుల్లో టీవీలో చూస్తున్నప్పుడు అందులో సాత్యకిగా ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించేది నాగభూషణం గారే అని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా బాగా గుర్తింపు నిచ్చి సినీరంగంలో దూసుకుపోవడానికి తలుపులు తెరిచిన చిత్రం మాత్రం' మంచి మనసులు' ( ANR, సావిత్రి, షావుకారు జానకి ) అనే చెప్పాలి. అందులో ఓ అంధురాలికి అన్నగా అతని నటన ఎంతగానో అందరినీ ఆకట్టుకుని తెలుగు తెరకు ఓ అద్భుత క్యారెక్టర్ నటుణ్ని అందించింది. ఆతర్వాత రెండు దశాబ్దాలకు పైనే వారి సినీ ప్రయాణం అప్రతిహతంగా సాగిపోయింది. 
    విలన్ గా, కామెడీ విలన్ గానే గాక  సాత్విక పాత్రల్లో కూడా తనకు తానే సాటి అనిపించిన ఘనతవీరిది. 
* ఆదర్శ కుటుంబం లో నలుగురు అన్నదమ్ముల్లో ఒకరైన ఈయనది MLA  పాత్ర. ఎప్పుడూ తాను కన్ఫ్యూజ్అవుతూ తమ్ముణ్ణి " తమ్ముడూ నువ్వు confuse అవుతూ నన్ను confuse చేయకు " అంటూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతూ ఉంటాడు. 
* కథానాయకుడు ' లో సాఫ్ట్ విలన్ గా NTR గారికి దీటుగా నటించారు.NTR గారికి ఆయనపై ఉన్న ప్రత్యేక అభిమానంతో వారి సొంత సినిమాల్లో తప్పనిసరిగా నాగభూషణం గారికి పాత్ర ఉండేదట! అందులో కొన్ని --
 వరకట్నం, ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెళ్ళామా,.. 
* ' బాలరాజు కథ' లో పనిగండం  మల్లయ్య పాత్ర. పని చేస్తే చావు వస్తుందన్న నమ్మకంతో అసలు పని చేయకుండా ఎప్పుడూ బద్ధకంగా గడిపేసే పాత్ర నవ్వులు పూయిస్తుంది.
* ' బ్రహ్మచారి' ( ANR, జయలలిత ) లో సూర్యకాంతం గారి భర్త గా నటించారు. ఇందులో గయ్యాళి తనానికి మారుపేరుగా వినుతికెక్కిన సూర్యకాంతం గారినే గడగడలాడించే పాత్ర! విలనీకి, గడసరి తనానికి చిరునామాగా ప్రసిద్ధికెక్కిన ఆ ఇద్దరూ నెమ్మదైన పాత్రల్లో ఒదిగి పోవడం ముచ్చటగొల్పుతుంది. 
* ' కల్యాణమంటపం ' లో రమాప్రభ భర్తగా ఆమె కళ్ళు తెరిపించే సన్నివేశాల్లో అంధుడిగా ఆయన నటన అద్వితీయం! 
* ' ఇదాలోకం ' చిత్రంలో ఆయన ధరించిన దుష్ట పాత్ర మరిచిపోలేము. అందులో ఆయన అనుచరుని పాత్ర పోషించిన రావుగోపాలరావు గారు తర్వాతి రోజుల్లో నాగభూషణం గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారా అనేంతగా ఎదిగిపోయారు. కొంతకాలం వరకూ ఆయనలో ఆ ముద్ర కనిపిస్తూనే ఉండడం గమనార్హం. 
* ' దసరా బుల్లోడు' లో పిల్లికి కూడా బిచ్చం పెట్టని పరమ పిసినారి పాత్ర! 
* ' మాతృదేవత', ' భాగస్తులు'  లాంటి చిత్రాల్లో సాత్విక ధోరణిలో సాగే పాత్రపోషణ వారి నటన లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
 పైన ఉదాహరించిన వన్నీ కొన్ని మచ్చుతునకలుమాత్రమే.  వందలాది సినిమాల్లోని వైవిధ్యమైన వారి పాత్ర పోషణ వర్ణించడం సాధ్యమా!
   సినీరంగంలో తీరిక లేకుండా నటిస్తున్నా రక్తకన్నీరు. నాటకాన్ని ప్రదర్శిస్తూనే ఉండేవారట ! రవి ఆర్ట్స్ థియేటర్స్ పేరిట స్వీయనిర్మాణ సంస్థ నెలకొల్పి'నాటకాలరాయుడు', 'ఒకే కుటుంబం ' సినిమాలు తీశారు. కానీ, కథానాయకుడు గా నటించిన నాటకాలరాయుడు ఆశించినంత విజయం సాధించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ప్రేక్షకులు అయనకు బ్రహ్మరథం పట్టారు. ఏమైనా ఆ తరం వాళ్ళు నాగభూషణం గారినైతే మరిచిపోలేరన్నది వాస్తవం. 
   చివరగా ఆయన S.V. కృష్ణా రెడ్డి గారి 'నెం. 1' చిత్రం లో మరో అద్భుత నటుడు రాజనాల గారితో కలిసి రెండు మూడు సన్నివేశాల్లో కన్పించి పాత రోజుల్లో వారి ప్రాభవాన్ని తలపించారు. 'రక్తకన్నీరు' నాగభూషణం గా అశేష ప్రజానీకానికి సుపరిచితులైన చక్రవర్తుల నాగభూషణం గారు 5, మే, 1995 న కీర్తి శేషులైనారు. భౌతికంగా కనుమరుగైనా తెలుగు సినీ వినీలాకాశంలో ఓ తారగా చిరస్థాయిగా వెలుగొందుతూనే ఉంటారు. 

**************************************
              * భువి భావనలు *
**************************************

Monday, January 18, 2021

మార్పు

పచ్చపచ్చని చెట్ల గుబుర్లలో 
వెచ్చవెచ్చని జంట కౌగిళ్ళలో 
మిసమిస సొగసుల పొంగులో 
 గుసగుసలాడిరి కబుర్లతో
 నీ కులం ఆడ నా కులం మగ 
 లేదే అడ్డుగోడ మన ఇద్దరి నడుమ
 ఇకపై మనం ఒకరికొకరం తోడు నీడ
 అన్నాడా ప్రేమ పిపాసి 🌷

ఋతువులు మారాయి 
 ఆకులు రాలాయి 
 సొగసులు ఉడిగాయి 
 కబుర్లు మలిగాయి 
 కాంక్షలు తీరాయి 

 నీదోకులం నాదోకులం 
 నేను నింగి- నీవు నేల
 మన ఇరువురి నడుమ
 మా అమ్మా నాన్న పెట్టని గోడ!
 నీకూ నాకూ తీరిపోయె ఋణం !
 గుడ్ బై నేస్తం
 అన్నాడా కాముకుడు !! 😔😔

****************************
           🌹 భువి భావనలు 🌹
****************************

Tuesday, January 12, 2021

తప్పు

బ్రతుకు వెన్నెలనీ 
 బ్రతికేది వెలుగు కోసమనీ 
 అనుకోవడంలో లేదు తప్పు
 ఆశలు తీరాలనీ 
 కోర్కెలు నెరవేరాలనీ 
 ఆశించడంలో లేదు తప్పు
 బ్రతుకు చీకటై
 వెలుగు శూన్యమై
 ఆశలు ఆవిరై
 కోర్కెలు ఎండమావులై 
 ఎదుట నిలిచిననాడు 
 కృంగి పోవడమే తప్పు ! 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
              భువి భావనలు 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Monday, January 11, 2021

సంక్రాంతి సంబరాలు... సినీగీతాల్లో మాధుర్యాలు

సంక్రాంతి 🌄
నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అడుగిడుతున్న పర్వదినం. సంక్రాంతి అంటే నూతన కాంతి అని అర్థం. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో సంక్రమణం అనే అర్థం కూడా వస్తుంది. అందుకే మకరసంక్రాంతి అని కూడా అంటారు.  హేమంత రుతువులో వచ్చే ఈ సంక్రాంతి మాత్రమే ప్రాధాన్యత కలిగినదిగా చెప్పుకుంటారు. ఇంటికి కొత్త కాంతులను తీసుకు వస్తుందనే విశ్వాసంతో ఈ పండగ ఘనంగా నిర్వహించుకుంటారంతా. 
   ఇంకా రైతులు మహదానందంగా జరుపుకునే పండగిది. ఎందుకంటే పంట చేతికొచ్చి ధాన్య రాశుల సిరులతో ఇల్లంతా నిండి పోయి కళకళలాడుతూ ఉంటుంది గనుక!
    సంక్రాంతి అన్న పేరే సరి కొత్తగా అనిపిస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ.  ఏ పండుగకు లేని మరో విశేషం మరియు ప్రత్యేకత ఈ పండుగ సొంతం. అదేంటంటే -- ఇంటి ముందు ముత్యాల ముగ్గుల సందళ్ళు! ఇంటి ముందు ప్రతిరోజూ ఉంటుంది ముగ్గు. మిగతా పండగలకూ వేస్తారు చక్కటి ముగ్గులు. కానీ, రంగవల్లికలు సంక్రాంతికే సొంతం అనిపించేలా మగువలంతా పోటీలు పడి వేసే అరుదైన పండగ సంక్రాంతి ఒక్కటే మరి ! రంగురంగుల ముగ్గుల మధ్య గొబ్బిళ్ళు, వాటినలంకరిస్తూ నవధాన్యాలు, గొబ్బెమ్మల పైన ముద్దులొలికే ముద్దబంతులు, ముగ్ధ మనోహరంగా విచ్చుకొని చిరునవ్వులు చిందిస్తున్నట్లు కన్పట్టే ఎర్ర మందారాలు! గొబ్బెమ్మల చుట్టూ చందమామ చుట్టూ వెలుగుతున్న తారల్లా వెదజల్లబడ్డ రంగురంగుల పరిమళాల పూరేకులు! ఇక్కడ అతి ముఖ్యమైనది ముగ్గుల్ని రకరకాల రంగులతో అలంకరించి తీర్చిదిద్దడం. ప్రతి వీధి రంగుల మయమై ఆడపిల్లల కోలాహలంతో అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓహ్ ! కన్నుల పండుగే కదా ! 
    సరే, కాసేపు మరో ఆసక్తిదాయకమైన టాపిక్ లోకి వెళ్దాం. ఇంతవరకూ సంక్రాంతి పండుగ గురించి చెప్పుకున్నామా, ఇక మన తెలుగు చిత్రసీమలోకి ఈ పండుగ చొచ్చుకపోయిన వైనం  నిజంగా అచ్చెరువొందించక మానదు. అబ్బో ! ఆ పేరుతో వచ్చిన సినిమాలు,. అందులో
 పాటలూ ఒకటా, రెండా ! లెక్కపెట్టలేనన్ని ! అంతేకాదండోయ్, అందరికీ తెలిసిన విషయమే, మన తెలుగు సినిమాల్ని ఏరి కోరి సంక్రాంతి పండుగ నాటికి విడుదల చేస్తుంటారు మన దర్శక నిర్మాతలు. అదో సెంటిమెంట్ వాళ్లకి. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతాయన్న ప్రగాఢ నమ్మకం మాది అని ఢంకా బజాయించి చెప్తుంటారు. దానికి తగ్గట్లే అలా వచ్చినవన్నీ బాక్సాఫీస్ కలెక్షన్లు విపరీతంగా పెంచేస్తూ వారి అంచనాల్ని వమ్ము కాకుండా చేస్తున్నాయి మరి !
  ఇకపోతే సంక్రాంతి పండుగను కథలో భాగంగా చేస్తూ వచ్చిన సినిమాలూ తక్కువేం కాదు. అందులో కొన్ని గుర్తుచేసుకుందాం..

* గొబ్బియల్లో గొబ్బియల్లో ఓ లచ్చా గుమ్మడి
 ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మడి
 ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చా గుమ్మడి
( ముత్యాల ముగ్గు )
* సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచిందీ 
 ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి బొబ్బిళ్లూ 
 ఆడ మగా ఆడి పాడే పాటల్లో 
 ఏడాదికో పండగా బ్రతుకంతా తొలి పండుగ
( ఊరంతా సంక్రాంతి )
* సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
 సంబరాలు తెచ్చిందే తుమ్మెద
 కొత్త ధాన్యాలతో కోడి పందేలతో
 సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
( సోగ్గాడి పెళ్ళాం  )
* డోలి డోలి డోలీరే 
  ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన
  అనురాగాలే నిండిపోవా గుండె లోన
  మనమంతా చేరి ఆడి పాడి 
  సంక్రాంతి పండుగ చేద్దామా
( సంక్రాంతి )
 ----- ఇవి కొన్ని మాత్రమే. 
 ఆయా పాటలు రాసిన వారు, సంగీత బాణీలు కట్టినవారు, ఆలపించిన గాయనీ గాయకులు అంతా ధన్యులే. అన్నీ బాగా ప్రాచుర్యం పొందినవే. పాటలకు తగినట్లుగా తెరపై చిత్రీకరణ కూడా అద్భుతంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆడపిల్లల ఆనందోత్సాహాలు, ముత్తయిదువుల ముచ్చట్లు, యువతరం కోలాహలాలు, డూ డూ బసవన్నలు, హరిదాసులు ఇంకా ఇంకా ఎన్నో సంబరాలు! పాటల్లో బహు చక్కగా చూపిస్తూ ఓ దృశ్య కావ్యంలా మలిచే దర్శకుల, కొరియోగ్రాఫర్ల అద్భుత ప్రతిభకు పట్టం గట్టాల్సిందే. 
    గత సంవత్సరమంతా ' కరోనా ' మహమ్మారి పీడితుల మై ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణాన ఈ ' సంక్రాంతి' అందరి జీవితాల్లోకి కొత్త కాంతిని తెస్తుందని ఆశిస్తూ అందరికీ మనః పూర్వక పర్వదిన శుభాకాంక్షలు💐

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                 🌷భువి భావనలు 🌷
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Tuesday, January 5, 2021

పరువంటే ఏమిటి?......

పరువు హత్య !
ఇది  ఇటీవల కాలంలో తరచుగా అదీ ప్రముఖంగా విన్పిస్తోన్న ఓ వార్త ! చదువుతుంటూనే హృదయ విదారకంగా అనిపిస్తూ మనసుల్ని కలచివేస్తుంది. 
   అసలు పరువు అంటే ఏమిటి? 
 విభిన్న నేపధ్యాల్లో పుట్టి పెరిగిన ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం అంత నేరమా? చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో ఓ డైలాగ్ గుర్తుకొస్తోంది. అందులో కథానాయకుడు నాయికతో ఇలా అంటాడు, 
" ప్రేమించుకోడానికి ఇద్దరి మనసులు చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి.... "
ఓ విధంగా ఇది నిజమే అయినా అన్ని సందర్భాల్లోనూ ఇదే మాటను అన్వయించడం తగ్గదేమో!
   కులం, మతం చూసుకునే ప్రేమించుకోవడం జరగాలా? నిజమే, కుల మతాల్ని బట్టి ఆయా కుటుంబాల సంప్రదాయాలు, అలవాట్లు, ఆహార నియమాలు వేర్వేరుగా ఉండవచ్చు. రెండు కుటుంబాలూ ఈ విషయాల్లో కలవడం సాధ్యపడకపోవచ్చు. పెద్దలు నిర్ణయించి ఒకే కులంలో చేసిన పెళ్లిళ్లే ఈ విషయాల్లో సర్దుకు పోలేక విచ్ఛిన్నమవుతున్నవి కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం ఒకటుంది. ప్రేమించి పెళ్లాడిన జంట సుఖసంతోషాలు. ముఖ్యంగా ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళు సహించ లేక పోవడం విచారించ దగ్గ విషయమే. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బంగారు తల్లి తమను కాదని తన అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరో కులంకాని వాణ్ణి వివాహమాడటం వాళ్ళు జీర్ణించుకోలేని విషయమే మరి! కానీ కాస్త విచక్షణతో ఆలోచించే సహనం వారికుంటే బాగుంటుందనిపిస్తుంది. అమ్మాయి ఇష్టపడి చేసుకున్నతన్ని దారుణంగా చంపించడం ద్వారా కూతురు జీవితం ఎడారి చేసినట్లే కదా! ఆమెకు మళ్లీ పెళ్లి చేయగలరా? ఆమె సమ్మతిస్తుందా? జీవితాంతం విధవరాలిగా చూస్తూ ఉండాల్సిందేనా? ఒకవేళ బిడ్డ కూడా ఉండి ఉంటే ఆ బిడ్డ పోషణ, పెంపకం, బాధ్యత ఆమెకు అదనపు భారం కాదా! మళ్లీ ఆమె ముఖంలో నవ్వు అన్నది ఆ తల్లిదండ్రులు జన్మలో చూడగలరా? పోనీ, అలా ఓ నిండు ప్రాణం తీశాక వాళ్లు మనశ్శాంతిగా బ్రతక గలరా? ఇలాంటి ఓ సంఘటనలో హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాల పిదప అమ్మాయి తండ్రి ఆత్మహత్య చేసుకోవడం విదితమే. మరి సాధించిందేమిటి? జీవితకాలం ఆ కుటుంబం అశాంతి పాలు గావడం దప్ప !
    కూతురి జీవితం గురించి ఆందోళన, ఆదుర్దా ఉండడం సహజమే. చేసుకుంటున్న వాడు ఎలాంటివాడో, ఆమెను సరిగా చూసుకుంటాడో లేదో అని వాళ్ల భయం కావచ్చు! కానీ, అతనే పంచ ప్రాణాలుగా భావించిన ఆమె కళ్ళముందే భర్త అన్నవాడిని కిరాతకంగా చంపేస్తే ఆమె మానసిక పరిస్థితి ఏమిటి? ఆ తల్లిదండ్రులను ఏనాటికైనా క్షమించగలదా? 
   కూతురి సుఖసంతోషాల కంటే పరువు అన్నదేమీ గొప్ప కాదు కదా ! ఇలా చేయడం వల్ల పోయిన పరువు తిరిగి వస్తుందా? హంతకులుగా ముద్రపడి మరింత దిగజారడం దప్ప ! 
   చెప్పడం చాలా సులువు అని కొందరు అనుకోవచ్చు. నరనరానా జీర్ణించుకుపోయిన నమ్మకాలు, భావాలు మాసిపోయి మనుషులు మారాలంటే చాలా కష్టం. కానీ జీవితాలు నిలబడాలంటే కొని సర్దుబాట్లు అవసరమేమో!
  ఎవర్నీ నొప్పించాలని నా ఉద్దేశం కాదు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. 

********************************
         భువి భావనలు 
********************************