Wednesday, November 12, 2025

పాప జననాన్ని కోరుకుందాం...

    'పాప' పుట్టింది అనగానే పెదవి విరిచే సమాజం మనది."అయ్యో! ఆడపిల్లా" అంటూ అసంతృప్తి
 వెలిబుచ్చడం," మళ్లీ పాపేనా" అని సానుభూతులు కురిపించడం  నిత్యం చూస్తున్న మనకు ఇలాంటి వ్యాఖ్యానాలు కొత్తేమీ కాదు. గతచరిత్ర  తిరగేస్తే.. ఎందరో..ఎందరెందరో శక్తివంతమైన మహిళల్ని చూసిన  నేల మనది. దేశాలనేలిన ధీరవనితలు, కత్తి చేతబట్టి కదనరంగంలో వీరవిహారం చేసిన స్త్రీ మూర్తులకు కొదవలేదు. అయినా, ఆడపిల్ల పుట్టిందంటే ఆనందించలేకపోతున్న దౌర్భాగ్యస్థితిలో ఉన్న మన సమాజంలో స్త్రీలపట్ల వివక్ష ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు... పాపపుడితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు, పాపే కావాలి  అని కోరుకునేవాళ్ళూ ఉంటున్నారు. కానీ బహు తక్కువ.. ఎందుకని ఇలా!!
   ఈ దురభిప్రాయాలన్నింటికీ  'ఫుల్ స్టాప్'  పెడుతూ.. ప్రపంచ కప్ విజేతలై భారతదేశం ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసి, భారత జాతీయపతాకాన్ని ఎగురవేసి, " చూడండి,మేం ఆడపిల్లలం.. కానీ, ఎందులోనూ తీసిపోము. అందుకు ఇదే నిదర్శనం.. " అంటూ ప్రపంచ క్రికెట్ గెలిచి, కప్పు కైవసం చేసుకుని  వచ్చి, దేశానికి కానుకగా ఒసగిన హర్మన్ ప్రీత్ కౌర్ మహిళా క్రికెట్ సేన ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తూ ఆడపిల్లల పట్ల సమాజానికి ఉన్న చిన్నచూపును పటాపంచలు చేసేసింది. ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ కల! ఎందరు మహిళా క్రికెటర్ల మధురాతిమధురమైన కల!! 
      1978 నుండి భారతజట్టు ప్రయత్నిస్తూనేఉంది. 2005 లో, 2017 లో మిథాలీ రాజ్ సారథ్యంలో రెండు సార్లూ తలపడినా.. కప్పు చేజిక్కలేదు. మునుపెన్నడూ లేని ఆశలు, అంచనాల నడుమ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో అడుగుపెట్టిన భారతబృందం.. పదకొండుమందీ ప్రాణంపెట్టి, చేయి చేయి కలిపి, జూలు విదిలించి, కదం తొక్కి, సంకల్పదీక్షతో అద్భుత విజయంతో మొట్టమొదటిసారి భారతగడ్డ కీర్తిప్రతిష్టల్ని విశ్వమంతా ఎలుగెత్తి చాటింది. దేశమంతా గర్వపడేలా చేసి ప్రముఖుల మన్ననలు పొందింది. తామంటే ఏమిటో నిరూపించడానికి ఇంతకన్నా రుజువు ఏమి కావాలి!? అన్నట్టు మరో గొప్ప విశేషం.. జట్టులోని అమ్మాయిల్లో కడపకు చెందిన మన తెలుగమ్మాయి శ్రీ చరణి కూడా ఉండడం, విజయంలో కీలకపాత్ర పోషించడం...మనసారా అందరం అభినందించవలసిన తరుణం కూడా..
   "ప్చ్..ఆడపిల్లలు..వీళ్లేం చేయగలరు! అంత సత్తా ఎక్కడిదిలే.. అనే వాళ్లనే చూస్తుంటాం. కానీ తలచుకోవాలే గానీ ఆడపిల్ల ఆదిశక్తిగా మారగలదు. దేన్నైనా సాధించగలదు. అన్న సత్యం నిరూపణ అయిన క్షణాలే మన మహిళా క్రికెట్  జట్టు ప్రపంచ కప్ గెలిచి నిలిచిన ఆ మధురక్షణాలు!! అందుకే ఆడపిల్లను అవమానించకండి.. ప్రోత్సహించండి.. ఏమో..! ఏ పుట్టలో ఏ పాముందో ! ఎవరి వల్ల ఏ ఊహించని ఘనత రానున్నదో! ఏ అద్భుతం సాక్షాత్కరించనున్నదో! అందులకై పాపాయిని సగర్వంగా, సాదరంగా ఆహ్వానిస్తూ ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని ముద్దాడే రోజు రావాలి.. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని అనడం కాదు.. అంగీకరిస్తూ పాప జననాన్ని కోరుకోవాలి...  

No comments:

Post a Comment