Tuesday, May 31, 2022

జనరేషన్ గ్యాపండీ బాబూ... !

   " జగతీ టీచర్, మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు ", 
అంటూ వచ్చింది అటెండర్ భాగ్యమ్మ. 
"హు !ఎందుకో ఏమిటో... "
ఒకలా మొహం పెట్టి లేచి వెళ్ళింది జగతి. 
ఓ అయిదు నిమిషాల తర్వాత వచ్చి, 
" భలే పనులు చెప్తారు... చేసే వాళ్ళుంటే.... "
అంటూ కూర్చుంది. పక్కనే ఉన్న జగదీశ్వరి, 
"  ఏమిటి జగతీ "అనడిగింది. 
" చూడండి మేడం, ఏదో మెటీరియల్ రఫ్ కాపీ ఇచ్చి, దాన్ని ఫెయిర్ కాపీ రాసిమ్మంటోంది... నా హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటుందట.. స్కూల్ వర్క్ చేయడానికే టైం ఉండటం లేదు, ఈ అదనపు వర్క్ చేయమంటే ఎలా చెప్పండి?... అందుకే సింపుల్ గా నో చెప్పి వచ్చాను, నా రైటింగ్ పెద్దగా బాగుండదు మేడం అంటూ... ఇలా ఒకసారి చేశామనుకోండి మొహమాటానికి పోయి.... ఇక అదే అదనుగా చేసుకుని మళ్లీ మళ్లీ అప్పగించేస్తారు...."
 ఆశ్చర్యపోవడం జగదీశ్వరి వంతయింది. ఆమె ఆలోచనలు పాతికేళ్లు వెనక్కి వెళ్ళాయి. అప్పుడో ప్రైవేటు స్కూల్లో చేసేది తను. ఏ రిటన్  వర్క్ ఉన్నా తనని పిలిచి అప్పగించేది ప్రిన్సిపాల్ మేడం.
" మీ రైటింగ్ చాలా చక్కగా, తప్పుల్లేకుండా ఉంటుందమ్మా జగదీశ్వరీ, ఇది కాస్త నీట్ గా రాసి తీసుకురా.."
అనేది. అదో కాంప్లిమెంట్ లా భావించేది తను. స్టాఫ్ అందరిలోనూ తనని ప్రత్యేకంగా చూస్తున్నట్లు అనిపించేది తనకు. రాత్రి పనులన్నీ అయ్యాక కూర్చుని రాసి, మరుసటి రోజుకంతా  అప్పగించేది. అంతే గానీ అదో అదనపు 'బర్డెన్' గా తలచేదే  కాదు.
   జగతి జాబ్ లో చేరి ఆరు నెలలు కూడా కాలేదు. నిజంగానే తన రైటింగ్ చాలా బాగుంటుంది.ఒకటి రెండు సార్లు తను కూడా మెచ్చుకుంది.  తననే కాదు, ఇంకా చాలా మంది యంగ్ స్టర్స్ ను చూస్తోంది ఇలా.  వర్క్ అంటే భారం గా భావించడం, ఎలా తగ్గించుకుందామా అని ఆలోచిస్తూ ప్లాన్స్ వేయడం, అతి సులభంగా అబద్ధాలాడేయడం!అతి తెలివిగా మాట్లాడడం   ! చూడబోతే అంతా కొత్తగా జాబ్స్ లో చేరిన వాళ్లే !
New broom sweeps well అంటారు. ఈ వయసులో ఎంత ఉత్సాహంగా ఉండాలి !ఇంకా ఇంకా పని చేయాలన్న తపన వాళ్లలో లేకపోగా ఎప్పుడెప్పుడు స్కూల్ టైం అవుతుందా, ఎంత త్వరగా ఇల్లు చేరతామా అన్నట్లు ఉంటోంది వాళ్ళ ధోరణి ! ఇలా జగదీశ్వరి ఆలోచనల్లో ఉండగా, బెల్ మోగింది. వర్తమానంలోకి వచ్చి పడింది తను.
    సుజాత టీచర్ క్లాస్ నుండి వచ్చింది. తన సీట్లో కూర్చుంటూ, 
" ఏంటి జగతీ, ఈరోజు షాపింగ్ కి రెడీయేనా? "
అనడిగింది జగతి వేపు కళ్ళెగరేస్తూ 
" ఓయస్, లాస్ట్ పీరియడ్ అవగానే ఇట్నుంచిటే  వెళ్దాం.. "
 అంటూ లేచి క్లాసుకు  బయలుదేరింది. ప్రతినెలా ఒకటో తారీకు జీతాలు అందుకోవడం,  రెండో తేదీన షాపింగ్ కి వెళ్లడం, ఒకటో రెండో చీరలు, వాటితో పాటు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, రోజుకో రకం చీర కట్టడం... ఎలా సాధ్యమవుతోంది వీళ్ళకి !!
" సుజాతా, మీరిద్దరూ అత్తగారింట్లో కలిసే ఉంటున్నారుకదా, మీ శాలరీస్ గురించి వాళ్లేమీ అడగరా? "
ఉండబట్టలేక ఎన్నాళ్ల నుంచో అడగాలనుకుంటున్న ప్రశ్న సుజాతనడిగేసింది జగదీశ్వరి.
" ఎందుకడుగుతారు మేడం? మా హస్బెండ్స్  శాలరీ ఎలాగూ  వాళ్ళకు ఇస్తారాయె. అయినా లేదనకుండా అప్పుడప్పుడూ  ఏదో కాస్త ఇస్తూనే ఉంటాం లెండి. నెలంతా ఇంత కష్టపడి సంపాదించిందంతా వాళ్ల చేతిల్లో  పెడితే మనకెవరు ఇస్తారండీ ! మనకూ అవసరాలంటూ  ఉంటాయి కదా. వాటికోసం మళ్లీ వాళ్లను దేబిరించాలంటారా... ఏమంటారు? "
 అని తిరిగి తననే ప్రశ్నించింది సుజాత. ఆ చురుకైన చూపులు చూసి నోరెళ్ళ బెట్టింది జగదీశ్వరి. తన వయసులో సగం కూడా లేని ఆ  అమ్మాయి మాటలు ఎక్కడో చురుక్కుమనిపించి, తొలిసారి... అదీ చాలా... చాలా ఆలస్యంగా జ్ఞానోదయమైన ఓ అజ్ఞానిలా తెల్లబోయి  చూసింది క్షణ కాలం ! మరుక్షణమే 'నిజమే సుమీ' అనుకోకుండా ఉండలేకపోయింది. 
     అప్పట్లో పెళ్లయ్యాక అత్తమామలు, ఆడబిడ్డలు, మరదులు...ఇలా అందరి తోటి కలిసే  ఉండేది తాను. వచ్చిన జీతమంతా తీసుకెళ్లి భర్త చేతిలో పెట్టడం, ఆయన గారేమో మరుక్షణమే అది కాస్తా పట్టుకెళ్ళి తల్లి చేతిలో పెట్టేయడం ! ఓ పది రూపాయలు అయినా తనకోసం  ఉంచుకోవాలని తాననుకోక పోవడం ! కనీసం భర్త క్కూడా తన చేతిలో ఇంత పెట్టాలి అన్న ఆలోచన రాకపోవడం ! అయినా తను పల్లెత్తు మాట నోరు తెరిచి'ఇదేమిటి'అని అడక్కపోవడం ! ఏదైనా అవసరమైతే తిరిగి  వాళ్లని అడగాల్సి రావడం! ఎంత అమాయకంగా ఉండేది ఆ రోజుల్లో! అయినా గుర్తింపు శూన్యం. ఒక్క ప్రశంసా వాక్యానికి కూడా నోచుకునేది కాదు. అదేదో కోడలి సంపాదన తమ జన్మహక్కుగా భావించే వాళ్లంతా. పైగా, 
" ఇది నీ బాధ్యత. అందరూ చేసేదేగా, "
 అంటూ నీవేమీ ప్రత్యేకం కాదు అన్నట్లు మాట్లాడడం!తన సహనాన్నీ, మంచితనాన్నీ ఇంటాబయటా అంతా బాగా వాడుకున్నవాళ్లే. ఇప్పుడు వీళ్ళందర్నీ చూస్తుంటే, 
"ఈ తెలివి నాకెందుకు లేకపోయింది? "
అన్న బాధ ఆమెను తొలిచి వేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ తరం వాళ్ళను చూస్తుంటే ఒకింత ఈర్ష్య గానూ లోలోపల ఫీలవుతూ ఉంటుంది. 
    ఇదే విషయం తన ఈడుదే  అయిన సోషల్ స్టడీస్ టీచర్ లలితాంబ తో ప్రస్తావించింది ఓసారి. 
" లలితా, వీళ్ళు ఇలా ఉంటున్నారే ! మనం వాళ్ళలా  ఎందుకు లేకపోయామంటారూ? "
తనూ ఇంచుమించు తన లాంటి బాధితురాలే ! ఆమె వెంటనే, 
" అయ్యో,  జగదీశ్వరీ, జనరేషన్ గ్యాపండీ బాబూ ! అప్పటి తరం వాళ్ళం అన్నింటికీ తలలూపుతూ, ప్రతిదానికీ  తలదించుకుంటూ, ఎవర్ని ఏమంటే ఏం ముంచుకొస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ నోరు మూసుకుని కాలం వెళ్లదీశాము. ఇప్పటి వాళ్ళు మనకు పూర్తిగా వ్యతిరేకం. ఇంట్లో పెద్ద వాళ్లే వాళ్లకు అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది..."
"... అయినా,  జగదీశ్వరీ.. మనం పిచ్చివాళ్ళం గానీ, మన కాలంలో మాత్రం తెలివిగా, గడుసుగా ఉన్న వాళ్ళు లేరంటారా ! ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి... పని  తప్పించుకుని తిరిగే వాళ్ళు ఇప్పుడే కాదు అప్పుడూ ఉన్నారు. ఔనా, కాదా? అలాగే సిన్సియర్ గా  చేసేవాళ్ళు ఇప్పుడూ అక్కడక్కడా  కనిపిస్తూనే ఉంటారు.కాదంటారా?... "
 దాంతో జగదీశ్వరి కి చప్పున  స్ఫురించింది.  అప్పట్లో తనతోపాటు పని చేసేవాళ్ళలో  కొందరి హ్యాండ్ రైటింగ్ బాగానే ఉండేది. కానీ తనకు మాత్రమే రిటన్ వర్క్ అప్పజెప్పేది ప్రిన్సిపల్. దానికి కారణం తను వేరేగా ఊహించుకుని  సంబరపడింది. కానీ నిదానంగా అసలు విషయం బోధపడింది.ఆసరికి పుణ్యకాలం కాస్తా గడిచేపోయింది. అది గుర్తొచ్చి....
"  నిజమే సుమీ !" అనుకుంది. వెంటనే ఏదోతట్టి, 
" అయినా, లలితా, జనరేషన్ గ్యాప్ అన్నది వాస్తవమే. కానీ కాలంతో సంబంధం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా.. వారి వారి నైజాల్ని బట్టి కూడా మనిషి ప్రవర్తన ఉంటూ ఉంటుందని నాకనిపిస్తుంది..."
 సాలోచనగా అంది.
" అవునవును.. అదీ నిజమే..... "
 ఏకీభవించింది లలితాంబ.. 
                 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








Sunday, May 29, 2022

వినిపించని రాగాలు

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

ఉప్పొంగే ఊహల ఊసులు 
భాషకు అందని భావాలై 
అలలు అలలుగా సాగి  
వినిపించని రాగాలై 
కనిపించే అక్షరాలుగా మారి 
కాగితంపై బారులు బారులై 
పరుగులు తీస్తూ 
నా హృదయపు తంత్రుల్ని మీటి 
పరవశింపజేస్తున్నాయే !
ఇది నిజమా !
ఔను, నిజమేనంటూ 
అదిగో, మరో భావవీచిక !!
నా గుండె తలుపు తట్టుతోంది 
మస్తిష్కంలో జొరబడి 
వినిపించని రాగాలేవో 
పలికిస్తోంది మరి... !!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

Sunday, May 22, 2022

ఇష్టం, నాకెంతో ఇష్టం !


                                                                          
                            🌷🐦
మండే  ఎండలు 
చల్లారుతున్న ఓ సాయంత్రం
చల్లగ వీచే చిరు గాలి 
అలా అలా తేలివచ్చి
నా చెంతజేరి నను తాకి 
సేదదీర్చుతున్న ఆ క్షణం !
ఇష్టం నాకెంతో  ఇష్టం !! 🙂
చిటపట చినుకులు చిరుజల్లులై 
ఎండిన నేల తడిసి 
మెల్లగా,  మెల్లమెల్లగా పైకెగసిన 
ఆ కమ్మటి మట్టి వాసన !
ఇష్టం,  ఇంకా ఇంకా ఇష్టం !
పదునెక్కిన భూమిని ఒదిగిన 
నేనాటిన ఓ చిన్ని విత్తనం 
అంకురమై దర్శనమిచ్చిన ఆ తరుణం !
రెప్ప వాల్చక వీక్షించే ఆ అపురూప దృశ్యం !
ఇష్టం, మరెంతో ఇష్టం !
తొలి పూతతో తనువంతా పులకింపజేసి 
కాయగ మారి పరిపక్వమై పండై  నిలిచి 
నను అబ్బురపరచిన ఆ నిమిషం 
ఆస్వాదిస్తూ పురివిప్పి నాట్యమాడెనే, 
నా మానసం ! ' ఔరా' ! అనుభవిస్తేనే గాని 
అవగతం గాని ఆ 'అద్భుతం' !!
తలచి తలచి పరవశించడం !
నాకెంతో ఇష్టం, మరీ మరీ ఇష్టం !! 😊 🐦

                        🌹🌹🌹🌹🌹🌹








Tuesday, May 17, 2022

పెరటి చెట్టు


     " డాడీ, రేపటి నుండి నేను పింకీ వాళ్ళ మమ్మీ ట్యూషన్ లో జాయిన్ అవుతాను. మ్యాథ్స్ లో మార్క్స్  బాగా తగ్గిపోతున్నాయి. ఆంటీ దగ్గరికి మా క్లాస్మేట్స్ చాలామంది వెళ్తున్నారు... "
 ఉదయం  స్కూలుకు వెళ్ళబోతూ తండ్రి రాజశేఖర్  తో చెప్పేసింది విజ్జి. 
" అదేంట్రా, ఇంట్లోనే ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ టీచర్ ని పెట్టుకుని వేరే ఎక్కడికో వెళ్తానంటావు? మొన్న టీచర్స్ డే కి బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా వచ్చింది... !"
"... ఎవరూ ! మమ్మీనా ! వద్దు డాడీ,  మమ్మీ చాలా స్పీడ్.. అర్థం కావు... వద్దు.. నేను అక్కడికే వెళ్తాను.. "
   లోపల గదిలో ఉన్న రాగిణి చెవిలో ఆ మాటలు దూరాయి. మనసు చివుక్కుమంది. అంతలోనే సర్దుకుని, ఏదో గుర్తొచ్చి  నవ్వుకుంది. చిన్నతనంలో తానూ అంతే. తండ్రి ఆరోజుల్లోనే బి ఏ గ్రాడ్యుయేట్. ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడేవాడు. చుట్టుపక్కల పిల్లలంతా ఆయన వద్దకు వచ్చి పాఠాలు చెప్పించు కునే వారు. తనను పిలిచి, 
" ఏవైనా తెలియనివుంటే  చెప్తాను రామ్మా... " అంటే, 
".. పో నాన్నా..నీకేం తెలీదు... మా సార్ వాళ్లను అడుగుతా లే... " అనేది. 
                                ****
  రాత్రి భోజనాలయ్యాక అంతా హాల్లో కూర్చున్నారు. మాధవరావు కూడా వచ్చేసి, ఛైర్  లో కూర్చుని, జేబులోనుండి కాయితం తీశాడు. అది గమనించిన భార్య, పిల్లలిద్దరూ మెల్లిగా లేవబోయారు. 
".. అరె !.. ఎక్కడికి లేస్తున్నారు? కూర్చోండి.. రెండు రోజుల క్రితం  రాశానీ కవిత... అందరూ విని అభిప్రాయం చెప్పండి... "
అంటూ మడత విప్పాడు. 
" అబ్బ !నాన్నా, ఇప్పుడే తిన్నాం. ఎందుకు మమ్మల్ని హింసిస్తావు?  "
అంటూ లేచారు పిల్లలిద్దరూ. 
" అరె ! మా ఆఫీస్ లో తెగ మెచ్చుకుంటారు. అందరూ అడిగి మరీ చదివించుకుంటారు నా కవితల్ని. మీరేంటిలా !.. "
" అయితే వాళ్ళకే వినిపించండి.... "
 అంటూ భార్య కూడా లేచి వంటింట్లోకి నడిచింది. 
"..ఛ ఛ ! బొత్తిగా  టేస్ట్  అన్నది లేదు వీళ్ళకి... "
 అనుకుంటూ కాగితం మడిచి మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు మాధవరావు. అతని రచనలు  అడపాదడపా మ్యాగజైన్స్ లో వస్తుంటాయి. ఆఫీసులో అంతా బాగా రాస్తాడన్న గుర్తింపు కూడా ఆతనికుంది. కానీ... ఇంట్లోనేమో ఇలా..... !
                             ****
" ఒరే, అన్నయ్యా, కాస్త ఆ గోల ఆపుతావా ! "
 చెవులు మూసుకుంటూ గట్టిగా అరిచింది సంగీత. 
" అబ్బ ! నీకు సంగీత అని  ఎలా పెట్టారే పేరు ! అమ్మా నాన్నల్ని అనాలి... ప్రతీ  సంవత్సరం మా కాలేజీలో మ్యూజిక్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ వస్తాను.... నీకు మాత్రం నేను పాడితే అస్సలు నచ్చదు.... నేను కూనిరాగం తీసినా చాలు... నీకు గోలగా అనిపిస్తుంది... "
తనకెంతో ఇష్టమైన పాటను తన్మయత్వంతో పాడుకుంటున్న కార్తీక్ ఠక్కున ఆపేసి,  కినుకగా అన్నాడు. 
" సరె సర్లే... !"
అంటూ మూతి తిప్పుకుంటూ అటు తిరిగింది సంగీత.
చిన్నబుచ్చుకున్నాడు కార్తీక్. పోనీ, అమ్మ,  నాన్న యినా  మెచ్చుకుంటారా అంటే... వాళ్ళదీ ఇదే మాట ! 
" రేయ్, ఈ పాటలు, ఆటలు, సంగీతాలూ కూడు పెడతాయిట్రా?  బుద్ధిగా చదువుకో.... "
అంటూ తన టాలెంట్ మీద నీళ్ళుచల్లేస్తారు ! బయట అంతా తన గొంతు చాలా బాగుందంటారు. కానీ... వీళ్ళేమో ఇలా !  ఎందుకు తనని ప్రోత్సహించరు? మెచ్చుకోరు?  తనలో తనే గొణుక్కున్నాడు కార్తీక్. 
                              *****
  బాబూ ! పెరటి చెట్టు మందుకు పనికి రాదంటారు. ఇంట్లో వాళ్ళు మన టాలెంట్స్ గుర్తించరు. గుర్తించినా ఒప్పుకోరు గాక ఒప్పుకోరు. ఒప్పుకున్నా ప్రోత్సహించే ప్రశ్నే ఉండదు. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మన భుజం మనమే తట్టుకోవాలి... తెలిసిందా ! అంతే మరి ! ... సరేనా... ! 👌


                             🙂🙂🙂🙂🙂

Monday, May 9, 2022

ముద్దబంతి పువ్వా !!

👌

పచ్చా  పచ్చని ముద్దబంతివే !
పరుచుకున్న పసిడి వర్ణం పరిమళభరితమే !
ఏ తోటలో ఏ కొమ్మను విరబూసితివే !
ఏ దోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు దాటి
ఇట కేతెంచితివే !!

మా ఇంటికొచ్చి  వెలుగులు  వెదజల్లి 
పసుపు రాసిన మా గడపకు
వెలలేని  అందాలు అద్దినావే !
గుదిగుచ్చిన మాలవై గుభాళిస్తూ 
మా గుమ్మానికి తోరణమైనావే !
ఇంతకీ ---
ఏ తోటలో ఏ కొమ్మను విరబూసితివే ? 
ఏ దోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు దాటి
ఇటకేతెంచితివే 

ముంగిట ముచ్చట గొలిపే 
ముత్యాల ముగ్గు అదిగో, చూడరమ్మ !
ఆ మధ్యన ముద్దులొలికే గొబ్బెమ్మ !
పైన ఠీవిగా నీ సోయగం! అద్భుతమమ్మ !!
ఆ సొగసు వర్ణింప నా తరమా! ముద్దబంతమ్మ !
ఇంతకీ ---
ఏ తోటలో ఏ కొమ్మను పూసితివో ? 
మరి, ఏ దోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు
దాటి మా ముంగిట నిలిచితివో  ? 

వాలుజడ వయ్యారి సిగను ఒదిగి 
మబ్బుల మాటున చందమామను బోలి 
వేయి రేకులొక్కపరి విప్పుకుని 
వినూత్నరీతిని శోభిల్లినావే  !!
ముద్దబంతి పువ్వా ! ముద్దరాలి
ముద్దుమోము నీ ముందేపాటిదమ్మ  !
ఇంతకీ, చెప్పవా, 
ఏ తోటలో ఏ కొమ్మను విరబూసితివి ? 
ఏ దోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు 
దాటి మమ్ముల మురిపింప 
మా ముంగిలి జేరితివి ? 🙂

                       🐦🐦🐦🐦🐦🐦🐦






Tuesday, May 3, 2022

ఎంత మార్పు ! ఎంత మార్పు... !

      అరవింద, అమర్ నాథ్ ల పెళ్లయి మూడు నెలలయింది. ఇద్దరూ చెరో  ప్రైవేటు కంపెనీల్లో చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కొత్త సంసారం... ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఉదయం వెళ్లడం, సాయంత్రం తిరిగి రావడం... హాయిగా కబుర్లాడుకుంటూ పనులు చేసుకోవడం... కలిసి భోంచేయడం..ఇదీ వాళ్ళ దినచర్య ! ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఏదో ఒక సినిమా కు వెళ్ళిపోవడం వాళ్ళ హాబీ. ఇంకా.. సెలవులు, పండగలప్పుడు ఆటవిడుపుగా ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడిపి రావడం.. చీకూ చింతా లేకుండా సాగిపోతోంది వాళ్ళ వైవాహిక జీవితం. అన్నింట్లోనూ వాళ్లకు బాగా నచ్చే విషయం ఏంటంటే..ప్రతీ  ఆదివారం వెళ్లే సినిమా ప్రోగ్రాం. ఇద్దరి అభిరుచి అదే కావడం ఇద్దరికీ నచ్చిన మరో అంశం. ఆ రోజుకోసం మరీ మరీ ఎదురుచూస్తుంటారు ఇద్దరూను... థియేటర్ దగ్గరే అయితే హాయిగా నడిచిపోయి నడిచి రావడం.. దూరమైతే రిక్షా ఎక్కడం. వస్తూ  వస్తూ  ఏ హోటల్లోనో ఇష్టమైన టిఫిన్ లాగించి రావడం ! అలా అలా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్నాయి రోజులు... 
 🌺  పది  సంవత్సరాల తర్వాత ---
 ఇద్దరు పిల్లలు... ఇద్దరూ ఆడపిల్లలే.. ఉదయాన్నే వాళ్ళను తయారు చేయడం, టిఫిన్లు,  భోజనాలు క్యారియర్లు.. సర్దేయడం.. ఇంకా... తామిద్దరూ తయారవడం.. అబ్బబ్బ ! బేజారయిపోతోంది ఇద్దరికీ. అరవింద అయితే మరీ అలసిపోతోంది. చేతకాక విసుగూ  ఎక్కువైంది పని ఒత్తిడితో. వారానికోసారి వెళ్లే సినిమా ప్రోగ్రాం నెలకోసారి కూడా గగనమైపోయింది. అప్పుడైనా ఓపిక ఉండడంలేదు. ఆదివారం వస్తే చాలు.. పనులు ఇంకా అధికమై పోతుంటాయి. ఇక సినిమా ప్రోగ్రామ్ పెట్టుకున్నారంటే  సాయంత్రం త్వరగా తెమిలి వంటావార్పు చూసుకుని... పిల్లలతో సహా బయట పడేసరికి నీరసం ముంచుకొస్తుంది.  ఇక సినిమా 'ఎంజాయ్' చేసే ఓపికేది? అదయ్యాక తిరిగి ఇల్లు చేరి తినడాలు పూర్తయి, పక్క చేరేసరికి ఏ పదకొండో.. ! తెల్లారి మళ్ళీ హడావుడి.... ! 
" వద్దురా బాబూ ఈ సినిమా.. !"
 అనుకోవడం.. కానీ మరీ ఓ అచ్చటా ముచ్చట.. సరదా,  షికారు... లేకుంటే ఎలా? పిల్లల కోసమైనా తప్పదు కదా.. పైగా మన మధ్యతరగతి జీవితాలకు ఎనలేని సంతోషాన్ని, వినోదాన్నీ ఇచ్చే ఏకైక ఔషధం ఈ సినిమా అన్నదే కదా... ! దాన్నీ  వద్దనుకుంటే ఇక బ్రతుకు నిస్సారమే  కదా! అనిపిస్తుంది ఇద్దరికీ. పోనీ.. ఆ రోజుకు  వంట మానేసి, బయట కానిద్దామా అంటే బడ్జెట్ ససేమిరా ఒప్పుకోనంటే ఒప్పుకోదే.. !అందుకే.. లేని ఓపిక, హుషారు కొనితెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారిద్దరూ... 
🌺 -- మరో ఇరవై సంవత్సరాల తర్వాత ---
 ఉద్యోగాల్లో  స్థిరత్వం వచ్చింది. పిల్లల చదువులు పూర్తయి, పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఇద్దరే మిగిలారు. మునుపటి హడావుడి లేకపోయినా, ఏదో వెలితి ! తీరిక బాగానే ఉంది... మునుపటి ఉత్సాహమే లోపించింది. సినిమా అంటే ఇష్టం తగ్గలేదు గానీ, మూడు గంటలపాటు కుర్చీల్లో బందీలై కూర్చుని చూడాలంటేనే ఒకింత ఆలోచించాల్సి వస్తోంది. ఎంతైనా వయసు మహిమ !
🌺 మరో పది సంవత్సరాల తర్వాత ---
 చూస్తూ చూస్తుండగానే అరవింద అమర్ నాథ్ ల జీవనయానంలో మరో పది సంవత్సరాలు ఇట్టే దొర్లి పోయాయి. ఇద్దరూ రిటైర్ అయిపోయారు. పిల్లలు వాళ్ల వాళ్ల సంసారాల్తో బిజీ బిజీ.. ఇక వృద్ధ దంపతులు..! అవసరాలకు మించి వచ్చే పెన్షన్ డబ్బులు ! ఒకప్పుడు ప్రతి రూపాయికీ వెతుక్కోవడమే.. ప్రతి పైసా ప్రాణంతో సమానమే..! ఇప్పుడో.. ! చేతినిండా నోట్లే ! కానీ అనుభవించే వయసే  దాటి పోయింది ఇద్దరికీ ! ఎదురెదురుగా కూర్చుని కబుర్లాడుకుంటూ గతాన్ని నెమరేసుకుంటూ ఉండడం  బాగా అలవాటైపోయింది ఆజంటకి ! 
  'కరోనా ' జనజీవనాల్లోకి ప్రవేశించక ముందు ఏ మూణ్ణెల్లకో  ఇద్దరూ బయటపడి ఆటో ఎక్కి,  ఇష్టమైన, చూడాలనుకున్న సినిమా చూసేసి వచ్చేవాళ్లు. కరోనా పుణ్యమాని... అది కాస్తా మూలనపడి పోయింది. అయినా చిత్రంగా..... వాళ్ళు ఆ విషయంలో ఏమాత్రం బాధ పడడం లేదు ! ఎందుకంటే.... నిరంతరం కాలక్షేపాన్ని అందించే టీవీ ఇంట్లోనే ఎదురుగా పుట్టుకొచ్చిందికదా ! 
    అయినా.. క్యూలో కాళ్లు లాగుతున్నా నిలబడి టికెట్స్ కొని ఈ వయసులో మూడు గంటలు ఏకధాటిగా సినిమా చూడాల్సిన బాధ మనకెందుకండీ? పైసా ఖర్చు లేకుండా, బ్రేకు బ్రేకుకీ లేస్తూ ఎంచక్కా  అటూ  ఇటూ తిరుగుతూ... మధ్య మధ్యలో అవీ  ఇవీ  తింటూ... తాగుతూ... హాయిగా కొత్త కొత్త సినిమాలు ఇంట్లోనే చూసే భాగ్యం వచ్చేసిందిగా మనకు..! 
   ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే....
" ఔరా! ఎంత మారిపోయింది కాలం ! అప్పట్లో రిలీజ్ అయిన సినిమా చూడాలంటే ఎంత శ్రమ  పడేవాళ్ళం!ఇప్పుడో ! వారం వారం ఏమిటి,ఓపిక, కంటి చూపు బాగుండాలే గానీ... ప్రతీ రోజు కొత్త సినిమానే కదా! అదీ  ఇంట్లో తాపీగా  కూర్చుని ! ఎంత మార్పు ! చిన్న మార్పు కాదిది ! పెను మార్పు! "
  అరవింద అమర్ నాథ్ ల  చర్చల్లో ఎప్పుడూ ప్రముఖంగా దొర్లేదీ ఈ అంశమే !
" అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! ఎంత మార్పు!"
అని !
  ఓరోజు అమర్ నాథ్  సాలోచనగా అరవింద నే చూస్తూ, 
" అయినా, ఈ మార్పు అన్నది ఒక్క  సినిమా విషయంలోనే అంటావా అరవిందా.. ఎన్నింటి లో లేదంటావు చెప్పు..? చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది... కాదంటావా!"
అన్నాడు. 
" అవును సుమండీ! మన పెళ్లయిన కొత్తలో అందరూ మనల్ని చూసి  ముచ్చటైన జంట అనుకునే వాళ్ళు కదా! ఓ పదేళ్లు గడిచాక కొందరు నన్ను 'అక్కా అక్కా'అని పిలిచేవాళ్ళు. నలభై దాటాక ఇద్దర్నీ ఆంటీ, అంకుల్ అనడం  మొదలెట్టారు...ఇదీ  మార్పే  కదా.. "
 నవ్వుకున్నారిద్దరూ. 
" ఇప్పుడు అరవై  దాటాయా ఇద్దరికీ.. బయట నా తెల్ల జుట్టు  చూసి కొందరేమో 'తాతా ' అంటున్నారు తెలుసా..."
అందుకున్నాడు అమర్ నాథ్. 
"... నన్ను కూడా నండోయ్... కూరగాయలమ్మే వాడు మొన్న నన్ను, అవ్వా రెండు రూపాయలు చిల్లర ఉంటే ఇవ్వు...అన్నాడు తెలుసా... "
భారంగా మారిన శరీరాన్నీ, తలపై మెరుస్తూన్న వెండి తీగల్ని తడుముకుంటూ, బుగ్గలు నొక్కుకుంటూ అంది అరవింద. కిసుక్కున నవ్వాడతను. 
" కాలం తో పాటు ఎన్నెన్నో మారాయి అనుకుంటాం గానీ మన శరీరాల్లో కూడా ఎన్నో మార్పులొస్తూనే ఉంటాయి.... కాకపోతే గమనించుకోము.. అంతే..  "
ముసి ముసిగా నవ్వుతూ అన్నాడు అమర్ నాథ్. 
" నిజమే కదా !"
అంటూ లేచింది అరవింద. 
                     😊😊😊😊😊😊😊