Wednesday, September 21, 2022

తోడు... కథ లాంటి ఓ నిజం !

      ఆటో దిగి గబగబా ఇంటి వైపు కదిలింది సుజాత. ఆఫీస్ లో ఏదో మీటింగ్ ఉండి లేటయిపోయింది తనకు. దానికి తోడు ఆటో దొరకడం కూడా ఆలస్యం! ఇల్లు చేరి, గేటు తెరచిన సుజాతకు కనిపించిన దృశ్యం చూడగానే గుండె తరుక్కుపోయింది. మూడేళ్ల తన పాప మెట్ల మీదే  పడుకుని నిద్రపోతోంది. భుజాలకు తగిలించుకున్న  బ్యాగ్, కాళ్లకు షూ అలాగే ఉన్నాయి. ఒక్క ఉదుటున వెళ్లి, తాళం తీసి, పాపను భుజాన వేసుకుని లోపలికెళ్ళిపోయింది.
    రెండు నిమిషాల తర్వాత, పక్కింటావిడ బయటి నుండి వచ్చింది.
" వచ్చేశావా సుజాతా! అనుకోకుండా పనిబడి అలా బయటికి వెళ్లాల్సి వచ్చింది.."
అంటూ పలకరించింది.
" అమ్మా నాన్న ఎక్కడికెళ్లారు పిన్నీ?... "
 అసహనంగా అడిగింది సుజాత.
" అర్జంటుగా ఏదో కొనాలని, పాప వచ్చేసరికి తిరిగొస్తామని చెప్పి వెళ్లారు సుజాతా... ఒకవేళ రావడం లేటయితే.. కాస్త  పాపని కనిపెట్టుకుని ఉండమని నాతో చెప్పి వెళ్లారు.కానీ.. చెప్పానుగా.. నాకూ..అనుకోకుండా,బయటికెళ్లాల్సొచ్చింది...ఈ లోగానే పాపవచ్చేసినట్టుంది  "
కాస్త నొచ్చుకుంటున్న ధోరణిలో చెప్పిందావిడ. 
ఇక ఏమంటుంది సుజాత !
                  **         **           **
  సుజాత ! పేరే 'సుజాత' ! కానీ జాతకమే మంచిగా రాయలేదా దేవుడు ! ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న కృష్ణకుమార్ మూడేళ్లు తిరగక్కుండానే బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు. ఊహించనివి జరగడమేనేమో జీవితమంటే ! గుండె బద్దలయ్యేలా విలపించింది సుజాత. 
  మూడు  నెలల దాకా డిప్రెషన్ లో పడిపోయిన ఆమెను ఓవిధమైన  నిర్వేదం ఆవహించింది. సంవత్సరం నిండిన లోకం తెలియని పాప ఒడిలో కేరింతలు కొడుతున్నప్పుడూ, అమాయకంగా నిద్దరోతున్నప్పుడూ.... ఆ నిద్రలో తనలో తనే నవ్వుకుంటున్నప్పుడు... ఆమెకు భర్త అన్న మాటలు గుర్తొచ్చేవి.
" సుజా, పాప ముద్దుగా ఉంది కదూ ! ఆ  నవ్వు చూడు, ఎంత అందంగా ఉందో ! ఇదెప్పుడూ ఇలా నవ్వుతూనే  ఉండాలి..."
అనేవాడు. ఆ నవ్వు చూసే.. ఎంతో ప్రేమగా, మరింత ఇష్టంగా...'సుహాసిని' అని  పేరు పెట్టాడు. పాపను చూసినప్పుడల్లా.. సుజాతకు అతని మాటలే పదే పదే గుర్తొస్తూ... మనసంతా బాధతో నిండిపోసాగింది రానురానూ..! కానీ, అంత బాధనూ...పాప నవ్వు చూస్తూ మరిచిపోయేది. 
" నీవు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావనుకున్నా, కుమార్... కానీ.. లేదు.. పాపను నాకు తోడుగా ఉంచే వెళ్ళావు..."
అనుకునేది. అప్పుడే.. అలాంటి క్షణాలే ...ఆమెలో  బతకాలన్న కోరికా, అంతకుమించిన బాధ్యతా  తట్టి లేపాయి. అందుకే.. నైరాశ్యాన్ని పక్కకునెట్టి, తనను తాను సంభాళించుకుని,  గుండె దిటవు పరుచుకుంది. చేతిలో ఉన్న డిగ్రీ ఆమెకో  దారి చూపించింది. మరోపక్క,  విధి వెక్కిరించిన కూతురి బాధ్యత తల్లీదండ్రికి   తప్పలేదు. కానీ, మూడు పదులు నిండకుండానే మోడువారిపోయిన   బిడ్డను నిత్యం చూసుకుంటూ ఉండడమే వారికి బాధాకరమైపోయింది. తామెంత కాలం ఉంటారు ! ఆ పిదప  కూతురు పరిస్థితి ఏమిటి? ఆ ఆలోచనే  వాళ్లను కుంగదీయసాగింది.
   అలా రెండేళ్ళు గడిచిపోయాయి. పాపకు మూడేళ్ళు నిండి.. దగ్గర్లోనే ఉన్న ఓ  స్కూల్లో చేర్పించారు. ఓ ప్రైవేటు ఆఫీసులో క్లర్క్ గా చేస్తున్న సుజాత, ఉదయం వెళ్లి సాయంత్రానికంతా  వచ్చేస్తుంది. పాప బాగోగులు అందాకా తల్లీదండ్రే  చూసుకుంటూ ఉంటున్నారు. అలా సాగిపోతే బాగానే ఉండేది. కానీ వాళ్ళ బాధ్యత అనుక్షణం వేధిస్తుండగా... అనుకోని రీతిలో తెలిసిన వాళ్ల ద్వారా ఓ సంబంధం వాళ్ల దృష్టిలోకొచ్చింది.
              **           **              **
  " డైవోర్స్ అయ్యాక పెళ్లి గురించి నేనాలోచించలేదండీ.. ఐదేళ్ళయిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ! పైగా.. నాకూ ఈమధ్య లైఫ్ చాలా డ్రై  గా అనిపిస్తోంది. అందుకే మీ గురించి చెప్పాక ఓసారి మిమ్మల్ని కలుద్దామనిపించింది.. "
అమ్మనాన్నల బలవంతం మీద పార్కు లో అతన్ని కలిసిన సుజాతతో చెప్పాడు శిరీష్. 
" ఎన్నాళ్లిలా ఉంటావమ్మా ?  ఈ వయసులో మాకీ క్షోభ ఏమిటి ! పాప బాధ్యత మేం తీసుకుంటాం. నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు మళ్ళీ సెటిలైపోతే మాకు నిశ్చింత... "
ఈ మాటలు సంవత్సరకాలంగా వాళ్ళ నోటినుండి వింటూనే ఉంది... కానీ పాప ! తన దారి తాను చూసుకుంటే  ఎలా! కృష్ణ కుమార్ గుర్తొచ్చే వాడు తనకు. కానీ ఈసారి ఎందుకో వాళ్ల ఆరాటం కూడా సబబే అనిపించిందామెకు.
"... సంవత్సరన్నరపాటు సాగింది మా వైవాహిక జీవితం. ఇద్దరికీ ఎందులోనూ పొత్తు  కుదరలేదు. పరస్పర అంగీకారంతో విడిపోయాం. సంతానం లేదు.. గతాన్ని పక్కన పెట్టేసి, కొత్తగా  లైఫ్ మొదలెట్టాలని మీకూ  అనిపిస్తే... స్టెప్  ముందుకేద్దాం..."
 తలదించుకుని కూర్చున్న సుజాతనే  చూస్తూ కొనసాగించాడతను. 
" అమ్మా  వాళ్ళు చెప్పారనుకుంటాను...నాకోపాప.. "
 నోరు విప్పింది సుజాత.
" చెప్పారండీ.. అదేమీ ఆటంకం కాదనుకుంటున్నా."
 వెంటనే అన్నాడతను. సుజాతకు ఆ  మాటలు పూర్తిగా అవగతం కాలేదు. అంటే ఏమిటి? పాపను తమతోనే ఉంచుకోవడం ఓకేనా కాదా?.. ఊగిసలాడింది ఆమె అంతరంగం. పావుగంట తర్వాత మళ్ళీ కలుద్దామనుకుని  లేచారిద్దరూ.
                **          **            **
  రాత్రి పడుకుని... ఆ  సాయంత్రం ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ మళ్ళీ మళ్ళీ మననం  చేసుకుంది సుజాత. అతని మాటల ద్వారా సుజాత గ్రహించిన విషయం.... త్వరలో అతను కెనడా వెళ్తున్నాడు ఉద్యోగరీత్యా.. అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు. పాపను సుజాత తల్లిదండ్రుల వద్దే కొంతకాలం ఉంచితే మంచిదన్న తన అభిప్రాయాన్ని స్పష్టంగానే వెలిబుచ్చాడు. తొలుత ఆమె మనసు ఎదురు తిరిగింది. తల్లిదండ్రులు గుర్తొచ్చి...వారి కోణంలో కూడా ఆలోచించడం మొదలెట్టింది. నెమ్మది నెమ్మదిగా.. మనసు వారి వైపు మొగ్గసాగింది..... 
     రెండు వారాలు గడిచాయి. రిజిస్టర్ మ్యారేజ్ కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆఫీసులో చెప్పేసింది సుజాత రిజైన్ చేస్తానని.. శిరీష్ ఇద్దరికీ కెనడా వెళ్లే ఏర్పాట్లు చూడడంలో నిమగ్నమయ్యాడు. 
   ఓ వారం దాకా సుజాత కాస్త ఉల్లాసంగానే ఉంది. నెమ్మదిగా ఆమెలో ఏదో గుబులు మొదలై, క్రమంగా  పెరిగిపోతూ మనసంతా ఆవరించుకుంది . పాపను చూస్తుంటే అది  రెట్టింపై తనని అచేతనంగా మార్చేస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట... తనను  గట్టిగా వాటేసుకొని పడుకున్నప్పుడు..! ఇలా ఇంక కొన్ని రోజులే కదా..! ఆ తరువాత అమ్మ కనిపించక ఎంత అల్లాడిపోతుందో  కదా ఈ పసిది... ! ఇదే ఆలోచన ఆమెను పట్టి వేధించసాగింది.
    ఆమెను కలచివేసిన మరో అంశం ! రెండు రోజుల క్రితం శిరీష్ ఇంటికి వచ్చాడు, ఏదో పనిమీద. పాప ఓపక్కగా కూచుని బొమ్మల్తో ఆడుకుంటోంది. అతను అటువేపు ఓ చూపు చూసి తను వచ్చిన పని గురించి చెప్పడంలో నిమగ్నమయ్యాడు.. పాపను పిలవడం గానీ, ఎత్తుకోవడం గానీ చేయకపోగా... బొత్తిగా ఆ స్పృహే  లేనట్లున్న ఆతని తీరు సుజాతకు ముల్లు గుచ్చుకున్నట్లయింది. ఆ క్షణంలో ఆమెకు కృష్ణ కుమార్ మదిలో మెదిలి బాధ రెట్టింపైంది.
    పైగా ఈ రెండు వారాల్లో శిరీష్  గురించి ఆమె గ్రహించిన విషయం...పూర్తిగా యాంత్రికమైన అతని మనస్తత్వం ! ఎంతసేపూ... అతని ఉద్యోగం, సంపాదన.. అతని కెరీర్ .. పూర్తిగా తన గురించిన ఆలోచనే! పక్కనున్న వారి ఊసే పట్టనంత స్వార్థం ! కృష్ణ కుమార్ అతనికి పూర్తిగా విరుద్ధం !అతన్ని  చూస్తుంటే పాపపట్ల కేరింగ్ గా  ఉంటాడా, అన్న అనుమానం ఆమెలో కలగసాగింది. తనకు తాను ఎంత సర్ది చెప్పుకున్నా ఎందుకో తన భర్త స్థానాన్ని శిరీష్ భర్తీ చేస్తాడన్న నమ్మకం ఆమెకు కలగడం లేదు.   ప్రతిక్షణం అలా పోల్చుకోవడంతో ఆమెలో తీవ్ర సంఘర్షణ చెలరేగడం మొదలైంది.
              **            **                **
   పెళ్లి తేదీ దగ్గర పడే కొద్దీ సుజాతలో ఉత్సాహం, సంతోషం పూర్తిగా మసకబారసాగాయి. ఆమె మన స్థితి అలా కొట్టుమిట్టాడుతున్న దశలోనే,  ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన ఆమెను పూర్తిగా ఇరకాటంలో పడవేసింది.
    మరణించిన తన భర్త ఏ దుర్మార్గుడో, శాడిస్టో అయి ఉంటే.. ఈపాటికి అతన్ని మరిచిపోయి ఆలోచించేదేమో! గడిపింది మూడు సంవత్సరాలే అయినా ...ఆ  జ్ఞాపకాలు పచ్చగా,  పదిలంగా తనలో సజీవంగా ఉన్నాయి ఇప్పటికీ ! పోనీ.. చేసుకోవాలనుకుంటున్నవాడు అతన్ని మరిపించేలా ఉంటాడన్న దాఖలాలేవీ  తనకు కనిపించడం లేదు. ముఖ్యంగా పాపకు తండ్రి స్థానాన్ని ఇస్తాడన్న నమ్మకం తనకసలు కలగటం లేదు. ఇక ఏ భరోసాతో అతనితో పెళ్లికి సంసిద్ధురాలు కాగలదు ! తన గుండెల్లో తలదాచుకుని పడుకున్న సుహా ని గట్టిగా అదుముకుంటూ ఆలోచనలో పడిపోయింది సుజాత.
    మూడు పదులు దాటిన తమ కూతురి జీవితం గురించి తపించిపోతున్నారు తన అమ్మనాన్న ! నిండా  మూడు సంవత్సరాలు కూడా లేని తన బిడ్డ గురించి తను ఆలోచిస్తోందా? ఏం చేయబోతోంది తాను!! డెబ్భై కి చేరువలో ఉన్న అమ్మమ్మ,  తాతయ్య ఎంతవరకూ  దాని బాగోగులు  చూసుకోగలరు ! ఈరోజుతో ఆ నమ్మకం కూడా పోయింది తనకు ! కళ్లు మూసినా, తెరచినా.... అలసిపోయి,  మెట్లమీద దిక్కులేని దానిలా పడి నిద్రపోతున్న తన పాపే మెదులుతూ ఆమె తల్లి మనసు తట్టుకోలేకపోతోంది. ఇక ఏ దైర్యంతో దానికి దూరంగా తాను నిశ్చింతగా ఉండగలదు ! 
                 **           **           **
    "  ఇంతదాకా వచ్చాక వద్దంటావేమిటే ! మేం నీకోసం, నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటే... నీవేమో నోటిదాకా వచ్చిందాన్ని కాలదన్నుకుంటానంటా వేమిటే!.."
రాజ్యలక్ష్మి ఏడుపు  లంకించుకుంది. 
"ఔనమ్మా, ఉన్నట్టుండి ఎందుకిలా మనసు మార్చుకున్నావు? చెప్పు తల్లీ... "
విశ్వనాధం గారు కూతురి పక్కన జేరి అనునయంగా అడిగారు. 
"...అసలు తోడు లేకుండా ఎలా బ్రతగ్గలననుకుంటున్నావే ? అదృష్టం కొద్దీ ఈ సంబంధం వచ్చిందని మేం సంబరపడుతుంటే..... "
" ఏమిటమ్మా తోడు ! అసలెవరికి... ఎవరికి తోడు అవసరం? బయట నుండి ఇంట్లో కాలు పెడితే మంచినీళ్లు కూడా ఒకరందిస్తే గానీ తాగలేని అశక్తుడు మగవాడు. అతనికవసరమమ్మా తోడు ! ఆకలేస్తే వండిపెట్టడానికి, జబ్బు చేస్తే సేవలు చేయడానికి.. మగాడికి కావాలి తోడు !అతని అవసరాలన్నీ తీర్చడానికి, ఆఖరికి....ఇల్లు ఊడ్చడానికి, ఇంట్లో దీపం పెట్టడానికీ.. మళ్లీ ఆడదే కావాలి మగాడికి...!"
"..........................."
" అనుక్షణం అతనో  డిపెండెంట్ ఆడదానిపైన !. మరి ఆడది! ఇంట అన్నింటినీ  సంభాలించుకుంటూ, బయటకెళ్ళి ఉద్యోగాలు కూడా చేస్తూ, ఒంటి చేత్తో అన్నీ చక్కబెట్టగల సమర్థురాలు ! చెప్పమ్మా... తోడు ఎవరికి అవసరం? మగాడికా?  ఆడదానికా?.... "
కొద్దిరోజులుగా పడుతున్న వేదన సుజాతలో ఒక్కసారిగా పెల్లుబికింది. 
".................."
" ఈ సమాజంలో ఆడది  బ్రతకడానికి కావాల్సింది మగతోడు కాదమ్మా... గుండెనిండా ధైర్యం, కొండంత ఆత్మ విశ్వాసం ! అది నాకు ఉందనే  నమ్మకం నాకు కలిగింది... చాలు.. నాకు నా పాప  తోడు చాలమ్మా.."
"...................."
".. గతించిన నా భర్త జ్ఞాపకాలు చాలు ఈ జన్మంతా నేను గడిపేయడానికి.. మరో పెళ్లి పేరిట నన్ను నేను మరో కొత్త సమస్యను నెత్తికెత్తుకోలేను. అర్థం చేసుకోండి.."
గొంతు గాద్గదికమై వెక్కి వెక్కి ఏడుస్తూ కూలబడిపోయింది సుజాత. విశ్వనాధం,రాజ్యలక్ష్మి కంగారుగా కూతురు దగ్గరకు చేరుకున్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తోందో తెలియని పాప తల్లి ఒడిలోకి చేరి, గట్టిగా వాటేసుకుంది.
" ఏడవద్దమ్మా, నీకోదారి చూపాలన్న  తాపత్రయంలో నీలో గూడుకట్టుకున్న బాధను చూడలేక పోయాము. సరే, నీకు ఇష్టం లేకుండా ఏదీ  జరగదు. మేము ఉన్నంతకాలం మేమే నీకు తోడు. ఆ తర్వాత ఇదిగో... నీ పాప  సుహా.. నీ భర్త ప్రతి రూపం!  "
కూతురి తల నిమురుతూ ఆర్ద్రంగా అన్నాడు విశ్వనాధం.తేరుకుని, కన్నీళ్ళు తుడుచుకుంటూ, తలెత్తింది సుజాత.
" జీవితాంతం ఎవరూ ఎవరికీ తోడుండరు నాన్నా!చివరికి మనిషెప్పుడూ ఒంటరే ! ఒంటరిగానే పోతాడు.."
 ఓ క్షణం అప్రతిభుడైన ఆయనకళ్ళలో నీళ్లు తిరిగాయి. మానసికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన కూతురి దృఢత్వం చూసి చలించిపోయి...ఆపై సంతృప్తిచెంది  స్థిమితపడ్డాడు.
" శిరీష్ గారితో నా జీవితం సవ్యంగా సాగుతుందన్న నమ్మకం నాకు కలగటం లేదు నాన్నా. పాపకు దూరమైపోయే ఈ కొత్త  బంధం నాకు అవసరమా అనిపిస్తోంది.... "
"...అయినా నాతోపాటు నా కూతుర్నీ ఆమోదించగల వ్యక్తి తారసపడితే తప్పక ఆలోచిస్తాను...నా  గురించి మీరేమీ బెంగ పడకండి.."
తండ్రి చేతులు పట్టుకుంది  సుజాత.
"నిజమే ! కూతురి జీవితం సంతోషంగా సాగితేనే కదా తమకైనా నిశ్చింత !" 
ఆయన  కూడా ఆలోచనలో పడ్డాడు. రాజ్యలక్ష్మికూడా  కూతుర్ని దగ్గరికి తీసుకుని అనునయించింది. 
   నెల దినాలుగా రేయింబవళ్లు సుజాత పడుతున్న మానసిక సంఘర్షణకు తెర పడినట్లయింది. 

******************************************





 

Sunday, September 11, 2022

మమ్మీ, 'ఉత్తరం' అంటే...!?

     సాయంత్రం ఆరు గంటలవుతోంది. వైదేహి, శ్రీధరమూర్తి తేనీరు సేవించడం పూర్తయి, విశ్రాంతిగా కూర్చుని, ఆ రోజు న్యూస్ పేపర్ లో విశేషాలు ముచ్చటించుకుంటూ ఉన్నారు. మరోవైపు కొడుకు, కోడలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వారిద్దరి మధ్యలో ఏడో తరగతి చదువుతున్న మనవరాలు శ్రావ్య ! పుస్తకాల సంచీ  పక్కన పెట్టుకొని, హోంవర్క్ చేసుకుంటోంది. 
   అంతలో వైదేహి ఫోన్ నుండి ఏదో మెసేజ్ సౌండ్ వచ్చింది. తీసి చూసింది. స్నేహితురాలు పావని... శ్రావణమాసం.. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ఉన్న ఓ కార్డు  ఫోటో ఫార్వర్డ్ చేసింది. నిట్టూర్చింది  వైదేహి ! ఆ చెప్పేదేదో ఓ ఫోన్ కాల్ చేసి చెప్పి ఉండొచ్చు కదా! పోనీ కనీసం తన స్వహస్తాలతో టైపు చేసి, విషెస్ పంపినా సంతోషించేది. ఇదే కాదు... ఈమధ్య ప్రతీ సందర్భానికీ  ఇలాగే రెడీమేడ్ శుభాకాంక్షలు అందించడానికి బాగా  అలవాటు పడిపోయారంతా. ముఖా ముఖీ కలుసుకోకపోతే పోయె... ఎంచక్కా ఫోన్ లో రెండు మాటలు మాట్లాడుకుంటే ఎంత తృప్తిగా, సంతోషంగా ఉంటుంది ! 
" ఏమిటో వైదేహీ.. కాలం ఇలా మారిపోయింది ! పెళ్లి పిలుపులు కూడా వాట్సాప్ లో శుభలేఖ పెట్టి కానిచ్చేస్తున్నారు..."
రెండ్రోజుల క్రితం పక్కింటి శార్వరి వాపోయింది వైదేహి దగ్గర. వెంటనే పక్కనే ఉన్న పార్వతి..
" మంచిదే కదా.. రేపు మనం కూడా అదే ఫాలో అయితే సరి ! శ్రమ, ఖర్చు రెండూ ఆదా... !"
అనేసి, నవ్వింది.
" నిజంగానే రోజులు బాగా మారిపోయాయి సుమా ! శుభకార్యాలంటే ఎంత హంగామా! ఎంత సందడిగా ఉండేది ! పిలుపులకే కొన్ని రోజులు కేటాయించుకునేవాళ్లు."
మళ్లీ అందుకుంది శార్వరి.
"... ఇప్పుడన్నీ సులభ పద్ధతులొచ్చేశాయండీ... అంతా ఈపాడు  సెల్ ఫోన్లొచ్చాకే !! "
సాగదీస్తూ నిష్టూరంగా అంది పార్వతి. అలా మాట్లాడుకుంటూ ఉన్నారా ! తమాషా ఏంటంటే... అప్పుడు ఆ ముగ్గురి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ లు తళతళలాడుతూ ఒకదాన్ని మించి ఒకటి మెరిసిపోతున్నాయి..! వాళ్ళ మాటలు విని, అవి మూడూ పరస్పరం చూసుకుని... తెల్లబోయి, తర్వాత చిన్నబోయి .. ఆ వెంటనే తెప్పరిల్లి... 
" ఏం మనుషులు ! మనం లేకపోతే  క్షణం కూడా తోచని స్థితికి వచ్చారు ఈ జనాలంతా ! కానీ ప్రతిక్షణం తిట్టడం మాత్రం మానరు ! ఎప్పుడైనా బ్యాలెన్స్ లేకనో.. ఇంకే లోపం వల్లనో... కాసేపు మనం పని చేయకపోతే.. పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి !! చేతిలో ఆభరణమే అయిపోయాం కదా ! అయినా ఎందుకో ఈ నిందలు ! "
అనుకుంటూ నొచ్చుకున్నాయి కూడా. అంతలోనే శార్వరి కొనసాగిస్తూ...కాస్త  పాజిటివ్ ధోరణిలోకి వచ్చింది.
"... అయినా...నిజం చెప్పొద్దూ.. వయసు మీద పడి తిరగలేని వాళ్లకు ఓ విధంగా ఇది సౌలభ్యమే కదా! కాకపోతే అవతల అర్థం చేసుకోవాలి బంధుజనం మరి!.. "
పార్వతి అందుకుని, 
"...ఆ.. ఇప్పుడంతా ఫోన్ పిలుపులకు అలవాటుపడిపోయారు లెండి. ఏ ఫంక్షన్ కైనా  ఆ పిలుపులే! ఇది పరస్పర అవగాహన. అందులోనూ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చి, అందరికీ అదే ప్రాణానికి హాయిగా అనిపిస్తోంది. అందుకే ఏ అపార్థాలూ, అలగటాలూ ఉండక హ్యాపీగానే ఫీలవుతున్నారు  లెండి.."
( సెల్ ఫోన్ లు కాస్త స్థిమితపడ్డాయి. )
మళ్లీ శార్వరి మొదలెట్టింది. 
".. అయినా, ఈ ఫోన్లు వచ్చాక వార్తలు చేరవేయడాలు ఎంత ఈజీ అయిపోయిందో కదా ! ఒకప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, అర్జెంటయితే టెలిగ్రామ్ ఇచ్చుకోవడం ! ఇప్పుడు.. క్షణాల్లో.. ఎంత దూరాలకైనా, విదేశాలకైనా.. !"
" ఔను మరి ! అసలిప్పుడు ఉత్తరాలు రాసుకునేవారున్నారా అని ! నేను డిగ్రీ చదివే రోజుల్లో హాస్టల్లో ఉండేదాన్ని. క్షేమ సమాచారాలు తెలియజేసుకోడానికి ఉత్తరాలే  దిక్కు అప్పుడు! హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర ఓ టేబుల్ వేసి, దానిపై ఓ ట్రే పెట్టి, స్టూడెంట్స్ కు వచ్చిన లెటర్స్ అన్నీ మధ్యాహ్నం వేళ అందులో ఉంచేవారు మా వార్డెన్. ఆటైమ్ లో చూడాలి... మా అమ్మాయిల కోలాహలం ! లెటర్ వచ్చిన వాళ్ళ ఆనందం అబ్బో ! వర్ణనాతీతం ! అదేదో పెద్ద నిధి దొరికినట్టు !! సంతోషం పట్టలేక పరుగులు తీస్తూ రూమ్ కి ఉరికే వారు."
వైదేహి ఒక్క క్షణం కాలేజీ రోజుల్లోకి వెళ్ళింది.
" నిజమే! ఇప్పుడు ఉత్తరాల ఊసేలేదు.. అంతా ఫోన్ లో మెసేజిలే కదా !.."
శార్వరి అంది. 
   వైదేహికి రెండ్రోజుల క్రితం ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ మదిలో మెదిలి, చిన్నగా నవ్వుకుంది. ఇంతలో ఉన్నట్లుండి...
" మమ్మీ, ఇలా చూడు.. 'ఉత్తరం' అంటే ఏంటి మమ్మీ? మన  వీధిలో వినాయక చవితి పూజ, నిమజ్జనం ఎలా జరిగాయో వివరంగా మా ఫ్రెండ్ కు ఉత్తరం రాయాలట! సొంత వాక్యాల్లో...! రేపటికంతా రాసి తీసుకు రమ్మంది మా తెలుగు మిస్.. అసలు ఉత్తరం ఏంటి? ఎలా రాయాలి? డాడీ చెప్పవా..!"
కొడుకు, కోడలూ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు కూతురి ప్రశ్నకు ! వైదేహి కిసుక్కున నవ్వింది. శ్రీధరమూర్తి  కూడా శృతి కలుపుతూ, 
" శ్రావ్యా, ఇలా రా, ఉత్తరం ఎలా రాయాలో నేను చెప్తాను..."
అంటూ పిలిచాడు. పరుగున వచ్చిన శ్రావ్యను పక్కనే కూర్చోబెట్టుకుని, 
" ఉత్తరం అంటే... లేఖ  అని కూడా అంటారు దీన్ని.. అదెలా రాయాలంటే...."
కొనసాగించాడు శ్రీధరమూర్తి.
******************************************






Monday, September 5, 2022

అతనో ప్రకాశించే 'ప్రభాకరుడు'.. ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా 🙏

" రాజయ్యా..."
"............ "
" రాజయ్యా.. "
" ఆబ్సెంట్ సార్... రాలేదు సార్.. "
 క్లాసులో పిల్లలంతా ఒకేసారి అన్నారు.
" అదేమిటీ, నాల్గు  రోజులైందిరాక... ఏమై ఉంటుంది? బ్రైట్ స్టూడెంట్.. చురుకైన వాడు..  సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎందుకిలా తరచుగా మానేస్తున్నాడు? "
 ఏడవ తరగతి క్లాస్ టీచరైన ప్రభాకర్ ఆలోచనలో  పడ్డాడు. ఇంటర్వెల్లో ఐదో తరగతి చదువుతున్న రాజయ్య చెల్లెల్ని అడగాలనుకున్నాడు. కాని ఆ పిల్ల కూడా బడికి రాలేదన్న సమాధానమే  వచ్చింది. కానీ వాడి తమ్ముడు శీనయ్య వచ్చాడని పిలుచుకొని వచ్చారు పిల్లలు.
" మా అన్నను పొలం పనులకు పిలుచుకొని  పోతున్నాడు సార్ మా నాన్న... ఇక బడికి రాడు.."
 వాడు చెప్పింది విని అవాక్కయ్యాడు ప్రభాకర్. అతను ఆ  ఊరి హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా చేరి రెండు సంవత్సరాలయింది. రాజు అని అందరూ పిలిచే రాజయ్య అంటే ప్రభాకర్ కు  చాలా ఇష్టం. చక్కగా చదవడమే కాకుండా వినయవిధేయతలతో ఉంటాడు. కానీ వాడి నాన్న  ఎందుకిలా చేశాడు !
    ప్రతిరోజూ  ఉదయం తన  బైక్ మీద వచ్చి సాయంత్రం తిరిగి వెళుతుంటాడు ప్రభాకర్ మాస్టర్. ఆ రోజు సాయంత్రం స్కూల్ అవగానే తను  వెళ్ళే దారిలోనే ఉన్న రాజయ్య ఇంటివద్ద ఆగాడతను . బయట మంచం మీద రాజు తాత, పక్కనే అరుగు మీద వాడి అవ్వ కూర్చుని ఉన్నారు. అలికిడి విని, రాజు తండ్రి గుడిసెలో నుండి  బయటకొచ్చాడు. అతన్ని చూసి, 
" రాజు బడికి రావడం లేదు, ఎందుకు? "
అనడిగాడు ప్రభాకర్. 
" అవును సారూ.. వాడిక  రాడు. రెడ్డి గారింట్లో పాలేరుగా కుదిర్చాను... "
షాక్ అయ్యాడు ప్రభాకర్ !
"...ఏంచేయను సారూ, నా  చిన్న చెల్లెలు పెళ్లికని ఐదేళ్ల నాడు పదిహేను వేలు అప్పు తీసుకున్నా. వడ్డీ  కడుతూనే ఉన్నా. ఇంతవరకూ తీరలేదు. ఇక నావల్ల కాక... రెడ్డి గారి మాట విని వాణ్ణి  పనిలో పెట్టినా... "
హతాశుడైన ప్రభాకర్ బైకు దిగి, రంగయ్యను కూర్చోబెట్టుకుని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అరగంట తర్వాత లేచి, 
" సరే.. రేపు రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నేనాయనతో మాట్లాడతా... "
 అని చెప్పి బయలుదేరాడు.
                **            **                **
" ఏంటి పంతులూ, బడి చెప్పడానికొచ్చినావు ... అంతవరకే నీ పని... ఇలాంటి పెత్తనాలు నీకెందుకు? "
మరుసటి రోజు రంగయ్యతో ఆయన ఇంటికి వెళ్ళిన ప్రభాకర్ ను వీరభద్రారెడ్డి గద్దించాడు.
" అది కాదు రెడ్డి గారూ... తెలివైన కుర్రాడు. మంచి భవిష్యత్తు ఉంది వాడికి...".
" అయితే... నువ్వు నా అప్పు  కడతానంటావు..పదైదు వేలు పైమాటే... ! అప్పనంగా పోగొట్టుకుంటావా ! సరే... కడతావు...వాణ్ణి చదివిస్తావా?  కలెక్టర్ని చేస్తావా? నీవు  చదివించే నాలుగు అక్షరం ముక్కలకి వాడికి బంట్రోతు ఉద్యోగం  కూడా రాదు. అర్థమయితందా?.... ఆఖరికి రెంటికీ  చెడ్డ రేవడౌతాడు వాడు ... "
"... అలా అనకండి... ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? మీక్కావలసింది రంగయ్య అప్పు తీర్చడమే కదా... అది  నేను తీరుస్తాను..."
 నిజానికి అతనున్న  పరిస్థితిలో అప్పటికప్పుడు అంత మొత్తం కట్టడం ప్రభాకర్ కు అలవిగానిదే. కానీ ఏదైనా అనుకున్న తర్వాత వెనక్కి తగ్గడం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేని పని !
వీరభద్రారెడ్డి పకపకా నవ్వాడు.
" ఎక్కడో పిచ్చి పంతులు లాగుండావే  !... ఏంటయ్యా నీ భరోసా? రేపు వీడు ఎందుకూ  పనికి రాకుండా తయారైతే... అప్పుడు బాధపడేది నువ్వు కాదు..ఇదిగో... వీడూ...వీడి నాయన... అర్థమయితందా? అయినా చదువుకున్న వాళ్లంతా రోడ్లు పట్టుకుని దేవుళ్ళాడుతున్నారు ఉద్యోగాలు దొరక్క. నువ్వు మహా  చదివిస్తే.. ఒక సంవత్సరం చదివిస్తావు, లేదా రెండు సంవత్సరాలు చదివిస్తావు. ఆ తర్వాత ఏంటి వీడి గతి !"
"..లేదండీ.. అలా  జరగనివ్వను... చదువు విలువ తెలిస్తే మీరిలా అనరు.. "
"... అంటే. నాకు చదువు రాదనా ఏంది అంటుండావు...? "
దిగ్గున లేచాడు వీరభద్రారెడ్డి.
" అయ్యో! నేనలా అనలేదండి...."
 అలా చాలాసేపు ఇద్దరి మధ్య.. కాసేపు అనునయంగా,  మరి కాసేపు కాస్త గట్టిగా మాటలు సాగాయి. ఆఖరికి ప్రభాకర్ మాటల ప్రభావమో ఏమో... వీరభద్రారెడ్డి సామరస్య ధోరణిలో పడిపోయి దిగి వచ్చాడు. ప్రభాకర్ ఆయన చేతిలో డబ్బు పెట్టి, దస్తావేజులు ఇమ్మని అడిగాడు. వీరభద్రారెడ్డి కళ్ళు ఎరుపెక్కాయి. కానీ అప్పటికే గ్రామస్తులు చాలామంది అక్కడ గుమికూడారు. ఇక,  బాగుండదని లోపలికి వెళ్ళి కాగితాలు  పట్టుకొచ్చి రంగయ్య చేతిలో పెట్టేశాడు.  ప్రభాకర్ కు రెండు చేతులెత్తి దండం పెట్టాడు రంగయ్య.
               **               **          **
   మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు పదవ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అదే సంవత్సరం ప్రభాకర్ కు అక్కడ నుండి బదిలీ అయింది. రంగయ్యకు ఇచ్చిన మాట ప్రకారం.. రాజును తనతో తీసుకెళ్ళాడు ప్రభాకర్. హాస్టల్ లో చేర్పించి, అతనికి కావలసిన అవసరాలన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఇంటర్ పూర్తయింది. ఏదైనా డిగ్రీలో చేరి, ఉద్యోగం చూసుకుంటానన్నాడు రాజు. కానీ ప్రభాకర్ ఒప్పుకోలేదు. ఎంసెట్ రాయించాడు. ప్రభాకర్ నమ్మకం వమ్ము కాలేదు. రాజు అకుంఠిత  దీక్షకు అతని కఠోర  శ్రమతోడై మెడిసిన్ లో  ఫ్రీ సీట్ వచ్చింది. రాజుకంటే, అతని తల్లిదండ్రుల కంటే కూడా  ఎక్కువగా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు ప్రభాకర్ ! రాజుకు  స్కాలర్ షిప్ వచ్చింది. ఎడ్యుకేషన్ లోను కూడా తీసుకున్నాడు. ఇంకేముంది ! ప్రభాకర్ మాస్టర్ చేయూత   ఎలాగూ  ఉంది. PG  కూడా చేసేసి డాక్టర్ రాజయ్య అయిపోయాడు. ప్రస్తుతం సిటీలో ఓ పెద్ద హాస్పిటల్ లో అతను కార్డియాలజిస్ట్ !
                **              **                 **
" సర్, హార్ట్ అటాక్ తో ఓ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు..."
అంటూ నర్స్ డాక్టర్ రాజు చేతిలో ఓ కేస్ షీట్ పెట్టింది. అందులో వివరాలు చూసిన రాజు భృకుటి ముడివడింది. వెంటనే అతని పెదాలపై చిరు దరహాసం విరిసింది. వెంటనే వెళ్లి అటెండయాడు. 
       మూడు రోజుల తర్వాత ICU నుండి రూంలోకి షిఫ్ట్ చేశారు పేషెంట్ ని. గండం గడిచినందుకు అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం భర్తను  నెమ్మదిగాలేపి, కూర్చుండబెట్టి, పాలు తాగిస్తోంది అతని భార్య. అంతలోనే డాక్టర్ గారు వస్తున్నారంటూ సిస్టర్ రూమ్ లోకి ప్రవేశించింది. డాక్టర్ ను అనుసరిస్తూ మరో ఇద్దరు నర్సులు లోపలికి వచ్చారు... వారితో పాటు మరో వ్యక్తి ! 
" ఎలా ఉందండీ..?  " అడిగాడు డాక్టర్ పేషెంట్ ని.
" బాగుంది సార్.."
డాక్టర్ అతన్ని   పరీక్షిస్తున్నప్పుడు  అప్రయత్నంగా పక్కనే ఉన్న వ్యక్తిని చూశాడు. ఎక్కడో చూసిన మొహంలా అనిపించి, అదే మాట పైకి అనేశాడు కూడా.
" అవునండీ, నన్ను మీరు చూశారు.. మీరు నాకు బాగా తెలుసు.. నా పేరు ప్రభాకర్. మీఊళ్ళోటీచర్ గా ఐదేళ్లు పనిచేశాను... "
అన్నాడతను.చప్పున గుర్తొచిందతనికి. 
" ఔనా.. ! ప్రభాకర్ పంతులు ! చాలా కాలమైంది కదూ.. వెంటనే పోల్చుకోలేక పోయాను.."
".. నన్ను సరే.. ఈ డాక్టర్ గారిని చూడండి. గుర్తుపట్టగలరేమో..!"
 అన్నాడు ప్రభాకర్ పక్కనే ఉన్న రాజును చూపిస్తూ...
"... ... .......... "
 అతని సాధ్యం కాలేదు. డాక్టర్ నవ్వుతూ, 
".. రెడ్డిగారు.. నేనండీ.. రాజయ్యను... మీ ఊరే.. శివపురం.. రంగయ్య పెద్ద కొడుకును."
 నోట మాట రాక,స్థాణువులా అయిపోయాడతను !
" నువ్వు..నువ్వు.. ! రంగయ్య కొడుకువా ! డాక్టర్ అయినావా!..."
" అవునండీ.. అయ్యాడు.. ఆరోజు దేనికీ పనికిరాకుండా పోతాడు అన్నారు కదా. చూడండి. ప్రాణాలు పోసే వైద్యుడే అయ్యాడు.. !"
అందుకుని  అన్నాడు ప్రభాకర్. 
 గతంలో తన ప్రవర్తన, మాటలు గుర్తొచ్చి, మనసంతా కుంచించుకుపోయింది రెడ్డి గారికి !
"...ఆరోజన్నాను నేను.... ఏ పుట్టలో ఏ పాముంటుందో... ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని !   "
"... నిజమే పంతులూ.. తెలివి లేకుండా మాట్లాడినా. చదువు విలువ ఏంటో  తెలియజెప్పినావు . నీవే గనక పూనుకోకపోయుంటే రాజు పాలేరుగానే మిగిలి, ఆ ఊరికే పరిమితమై పోయుండేవాడు. ఈరోజిలా... నా ప్రాణాలు కాపాడే దేవుడిలా చేసింది నువ్వే పంతులూ... "
ఆయన కళ్ళల్లో సన్నగా నీటి తడి ! 
"...ఊరుకోండి రెడ్డిగారూ.. ఆరోజు నా మాట విని, అర్థం చేసుకుని రాజును మీరు వదిలేశారు.. లేకపోతే ఇంత స్థాయికి వచ్చేవాడు గాదు. తమ్ముణ్ణీ, చెల్లెల్నీ బాగా చదివించాడు. ఇప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. తల్లిదండ్రుల్ని తన వద్దే ఉంచుకున్నాడు... నిన్న ఫోన్ చేసి చెప్పాడు, ఇలా మీరు హాస్పిటల్ ల్లో ఉన్న సంగతి... చూద్దామని వెంటనే ఇలా వచ్చాను... "
ఆయన్ని అనునయిస్తూ అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాక, రంగయ్య కుటుంబం ఊరొదిలి టౌన్ కెళ్ళిపోవడం గుర్తొచ్చింది వీరభద్రారెడ్డికి. అందుకే.. వాళ్ళ గురించిన విషయాలేవీ తర్వాత ఆయనకి తెలిసిరాలేదు.మూడు రోజుల క్రితం మనవరాలి పుట్టినరోజుకని సిటీ కొచ్చిన ఆయన అస్వస్థతకు లోనై ఇలా హాస్పిటల్లో చేరాల్సొచ్చింది.   రాజు వేపు ఆర్ద్రంగా చూస్తూ రెండు చేతులూ జోడించాడు వీరభద్రారెడ్డి. 
" అయ్యో ! మీరు పెద్దవారు.. "
 అంటూ ఆయన రెండుచేతులూ పట్టుకున్నాడు రాజు.. అదే... డాక్టర్ రాజయ్య. 
".. పంతులూ, చదవడం రాని నాకు, అక్షరం విలువేమిటో ఎరుకపరిచారు. మీలాంటి ఉపాధ్యాయులు ఉండడం చాలా అవసరం.."
 ప్రభాకర్ ను మనః పూర్వకంగా అభినందించాడు వీరభద్రారెడ్డి.
" అవును, అనుక్షణం నా వెన్ను తడుతూ, ప్రోత్సహిస్తూ నన్నీ స్థాయిలో  నిలబెట్టారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. రెడ్డిగారూ.. మీకు తెలియని మరో విషయం... చాలా కాలం తర్వాత గానీ నాకూ తెలియలేదు...సార్ నన్నే  అనుకున్నానుగానీ.. మరో నలుగురు పేద విద్యార్థులను కూడా ఫీజులు కట్టి మరీ  చదివించారు...ఆ అలవాటును ఇప్పటికీ   అలా కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగని ఆయనకు కుటుంబం లేదా.. అనుకుంటే పొరపాటే... భార్య ఇద్దరు పిల్లలతో సలక్షణంగా ఉన్న జీవితం వారిది ! మరెందుకిలా...అంటే.. అదాయన స్వభావం!అదంతే!"
నవ్వుతూ చెప్పాడు రాజు. లోపల మాత్రం..... 
" ఆయన ప్రకాశించే 'ప్రభాకరుడు' రెడ్డిగారూ... నలుగురికీ వెలుగులు పంచడం ఆయన నైజం!అంతే!"
అనుకున్నాడు. 

******************🙏**********************
(గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు 💐)
******************************************















 

Thursday, September 1, 2022

కౌసల్య అన్నదిలా... !..?

 🌷
        ఆమె పేరు కౌసల్య. ఓ గృహిణి. ఉబుసుపోక ఓరోజు బయలుదేరింది బజారుకు. వీధీ వీధీ తిరిగి 'విండో షాపింగ్ ' చేసింది. కొన్నదేమీ లేదు. కానీ మానసికోల్లాసంతో కొండంత హుషారొచ్చింది. అయితేనేం ! ఎంతసేపని తిరగ్గలదు ! తిరుగుముఖం పట్టింది. దార్లో ఓచోట ఆమె చూపు చిక్కుకుంది. ఫుట్ పాత్ మీద వరుసగా పేర్చబడ్డ ప్లాస్టిక్ సామాన్లు !ఒకదాంతో ఒకటి పోటీబడుతూ,  రంగురంగుల్లో మెరిసిపోతూ కొలువుదీరిన రకరకాల 'మోడ్రన్' ప్లాస్టిక్ సొగసులు !! ఆగలేక అడుగిడిందటువేపు. పరకాయించి చూసింది.. ఆమెను ఆకర్షించింది... ఆకుపచ్చ, పసుపు రంగుల మిళితమైన ఓ చిన్ని బకెట్టు ! ఎన్నో రకాలు అక్కడ రారమ్మంటున్నా... ఎందుకో కౌసల్య చూపు దాన్ని వదిలి పక్కకు రానంటే రానంది ! పైగా... ఏదైనా కొంటే అది ఉపయోగపడాలన్నది కౌసల్య భావన! అందుకే అప్పటికి దాని అవసరం లేకున్నా... బేరమాడక యాభై ఇచ్చి పుచ్చుకుంది. 
      ఇంటికెళ్ళాక అటకెక్కించింది. కాలం గడిచింది. అవసరం పిలిచింది. చిన్ని బకెట్ అటక దిగింది. ఆరోజు నుండీ కౌసల్యకు  అన్నివిధాలా సహకరిస్తూ  చేదోడు వాదోడయింది.  ఇల్లు తుడిచేటప్పుడు.. అంట్లు తోమేటప్పుడు.. మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు...అలా.. అలా.. ! ముచ్చటపడి కొన్న  కౌసల్య మక్కువ తీరేలా వాడింది దాన్ని అన్ని వేళలా...
      సంవత్సరం... మరో సంవత్సరం... గడిచిపోయాయి అలవోకగా.. వానకాలం వచ్చింది. భారీ వర్షాలు..! ఇంటికి మరమ్మతులు అవసరం అయ్యాయి. ఓరోజు వచ్చాడు మేస్త్రీ... పనివాళ్లను వెంటబెట్టుకుని... అవసరమంటూ అతనడిగితే, సగం పాతబడ్డ తన చిన్ని బకెట్టునిచ్చింది... మరోటి దొరక్క. వారం తర్వాత తిరిగొచ్చిందది కొత్తరూపు సంతరించుకుని... సిమెంటు మరకలతో, దుమ్ము ధూళి అద్దుకుని !! చివుక్కుమన్నది కౌసల్య అంతరంగం !
విధిలేక, అది  చెత్త బుట్టగా మారిపోయి  స్థానభ్రంశం పొందింది పాపం ! 
     రోజులు.. నెలలు.. గడిచాయి. హ్యాండిల్ కూడా పోగొట్టుకుని మరింత దిగజారింది దాని పరిస్థితి !
" అక్కా, పాడయింది, పడేయనా...? ", పనావిడ !
" అమ్మా, పట్టుకెళ్ళనా..? ",  పాత సామాన్లవాడు !
 తల అడ్డంగా ఊపిందందరికీ కౌసల్య. కొన్ననాటి రూపం మెదిలింది ఆమె మదిలో. హృదయం ద్రవించింది... ఆలోచించింది... ఓ అందమైన ఉదయం... మొదలెట్టింది తన పథకం. తొలగించింది అందలి  చెత్తాచెదారం. శుభ్రపరిచి, ఇంట్లో మిగిలిన రంగులు, బ్రష్ తెచ్చి చేసింది దానికి సింగారం ! అంతే ! మరో సరికొత్త రూపం... అరగంటలో సిద్ధమై కౌసల్య ముందు నిలిచింది. ప్రియతమ బకెట్ అందాల కుండీగ మారి, నవ్వింది మనసారా...! మట్టితో నింపి, నాటింది కొని తెచ్చిన నందివర్ధనం ! చిలకరించింది నీటి జల్లు... పులకరించింది పూలమొక్క...! 
     నెల... మరో నెల... కౌసల్య అభీష్టం తీరింది. నందివర్ధనం నిండా మారాకులు !! గుత్తులు గుత్తులుగా చిన్ని చిన్ని మొగ్గలు ! వెలుగులీనుతూ శ్వేతవర్ణ పుష్పాలు !! అద్భుతం అనిపించింది కౌసల్యకు. ఆమె ముంగిటి  బృందావనాన... మరో కొత్త మెంబరై ఠీవిగా కూర్చుంది కుండీలో నందివర్ధనం !
     ఓ ఉషోదయాన...కళ్లార్పక దాన్నే చూస్తూ... కౌసల్య అనుకున్నదిలా...

"వ్యర్థమనుకుంటే వ్యర్థం వ్యర్థమే... 
ఆలోచిస్తే అందులో ఉంది 'అర్థం' ! 
ఆ అర్థంలో దాగి ఉంది ఆనందం.. !
పాడైందని పడేస్తే... కనుమరుగే !
కావాలనుకుంటే... కళ్ళముందే.. !
ఇదిగో ఇలా... కళకళలాడుతూ... 
కనువిందు చేస్తూ... కళ్ళు చెదిరేలా...!
అదిగో....! నా అందాల పూలకుంపటి.. !
మరోజన్మ ఎత్తి... నను రంజింపజేస్తూ... !! "

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷