Tuesday, July 26, 2022

నిజం ! అదో 'ఆపద్బాంధవి' !...?


" ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తోనే బ్రతికేస్తున్నార్రా..? "
 థియేటర్లో ఒక్కసారిగా నవ్వులే నవ్వులు !! మహేష్ బాబు సినిమాలోని ఓ  డైలాగ్ఇది. కలిసినప్పుడల్లా 'ఏం టిఫిన్? ' అనడిగితే 'ఉప్మా ' అని చెప్తుంటారా అక్కాతమ్ముళ్లు. ఆ 'సిచువేషన్' కు ఆ డైలాగు 100% సరిపోయింది కాబట్టి ఓకే... 
  కానీ.. నిజం చెప్పొద్దూ... మనలో చాలా మందికి ఉప్మా అంటే ఏంటో అదో  చిన్న చూపు... కానీ.. గృహిణులకు... మరీ ముఖ్యంగా ఉద్యోగినులైన  వాళ్లకు అదో 'ఆపద్బాంధవి' !
   నిమిషాల్లో తయారై పోయేది.. ముందస్తు ప్రణాళికలు, సంసిద్ధతలూ అవసరం లేనిది... అప్పటికప్పుడు అనుకుని చేసుకోగలిగేది... టెన్షన్ లకు చోటివ్వనిదీ... కాస్త మనసు పెట్టి చేస్తే అత్యంత రుచికరమైనదీ, బలవర్ధకమైనదీనూ !! కాదంటారా !
   ఆకస్మాత్తుగా ఉదయం పూట అయిదారుగురు చుట్టాలూడిపడితే... ఇంతకన్నా ఆదుకునే టిఫిన్ మరొకటుంటుందా ఆ ఇల్లాలికి ! అందుకే ఇది వారికి 'ఆపద్బాంధవి'. ఆ విధంగా వారికి ప్రియబాంధవి కూడా !
                   **        **          **
" అబ్బ, ఈరోజూ ఉప్మా యేనా? మొన్ననేగా చేశావు, ఏంటి సరూ... "
 డైనింగ్ టేబుల్ మీద ఉప్మా ప్లేట్ చూసి విసుక్కున్నాడు ప్రభాకర్. 
" మొన్నేమిటి, నాల్గు  రోజులైంది తెలుసా... "
నాల్గు నెలలయింది అన్నట్లు నొక్కి చెప్పింది సరోజ
" అమ్మా, నాకొద్దు... "
 ఇద్దరు కొడుకులు ఒక్కసారిగా అనేసి బుంగమూతి పెట్టేశారు. 
" మూసుకొని తినండి... చూస్తున్నారుగా.. వారం రోజులయింది పని మనిషి రాక.. ఇంటి పనులు,  బయటి పనులు,  ఈ వంట పనులు, మీ పనులు... అవి చాలవన్నట్లు నాపనులు ! అన్నీ అవగొట్టి, తొమ్మిదింటికి బయటపడి ఆఫీసు చేరుకునేసరికి నా తల ప్రాణం తోకకొస్తోంది. రోజుకో రకం టిఫిన్ చేసి పెట్టాలంటే నేనేమన్నా యంత్రాన్నా? లేక ఇదేమన్నా టిఫిన్ సెంటరా?... పోనీ ఓ చేయి వేస్తారా అంటే..ఊహూ.. అర్థం చేసుకోరూ..."
గయ్యిమని లేచి దండకం అందుకుంది సరోజ. ఠక్కున నోరు మూసుకుని ప్లేట్లు ముందుకు లాక్కున్నారు  ముగ్గురూ !
                     **        **        **
" ఈరోజు బ్రేక్ ఫాస్ట్ దోశ  అన్నట్టున్నావ్... !"
ప్లేట్లో ఉప్మా ప్రత్యక్షమవడం చూసి ఓరగా భార్యను చూస్తూ మెల్లిగా అన్నాడు సురేష్. 
" అన్నాను... కానీ సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి లేటయిపోయింది . పప్పు,  బియ్యం నాన పెట్టడం కుదరలేదు. ఇన్స్పెక్షన్ రోజులండీ.. వర్క్ చాలా ఉంది. అన్నీ  ప్రిపేర్ చేసుకోవాలంటే టైం సరిపోవడం లేదు. కొద్ది రోజులు తప్పదిలా.... "
ఏదో తప్పు చేసినదాన్లా పాపం సంజాయిషీ ఇస్తున్న ధోరణిలో చెప్పింది  సునంద. 
" సరే...  టైం లేదు... ఉప్మా చేస్తే చేశావు... ఇందులోకి ఉల్లిపాయలు పొడుగ్గా కోసి, కాసిన్ని  అల్లం ముక్కలు సన్నగా తరిగి, తాలింపు గింజలు, కరివేపాకు బాగా దట్టించి, ఇంకాస్త నూనె  తగిలించి ఉంటే పసందుగా ఉండేది కదా... !"
ఎనిమిదింటికి గానీ పక్క దిగని బద్ధకపు  భర్త గారి 
బీపీ పెంచే కామెంట్స్  , జిహ్వచాపల్యం..!!చిర్రెత్తుకొచ్చి , 
"... ఉండేది.. కాకపోతే.. ఆ ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ అన్నీ తమరు పక్కనుండి తగిలించి ఉంటే... ఇంకా బాగుండేది..." 
పక్కనే ఉన్న శాంతి, శాన్వి కిసుక్కున నవ్వారు తల్లి మాటలకి.. 
                    **          **           **
   రెండు కుటుంబాల మధ్య ఉన్న పోర్షన్ లో ఉంటోంది రాజేశ్వరమ్మ ఫ్యామిలీ. ఆమె, ఆమె భర్త మాధవరావు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసి, రెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు. అప్పటికే సొంత ఇల్లు కట్టుకున్న ఆ దంపతులు అటూ ఇటూ ఉన్న పోర్షన్ లు రెంట్ కిచ్చేసి, మధ్యలో వారుంటున్నారు. 
  హాల్లో రెండువైపులా కిటికీలున్నందున ఆ రెండు కుటుంబాల మాటలు చెవిని పడుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ రోజూ  అదే జరిగింది. రాజేశ్వరమ్మ  చిన్నగా  నవ్వుకుంది ఆ రెండిళ్ళ ముచ్చట్లకి. అంతలో ఫోన్ మోగింది. 
" అమ్మా, ఎల్లుండి నా కొలీగ్ లాస్య మ్యారేజ్. అక్కడే, మన ఇంటికి దగ్గరలోనే.. నేనూ,  పిల్లలు ఈ రాత్రికి వస్తున్నాం... "
కూతురు రమ్య. 
" సరే సరే.. "
                       **       **         **
" అమ్మమ్మా, ఇదేం బ్రేక్ ఫాస్ట్? "
" చాలా బాగుంది టేస్టీగా, వెరైటీగా... "
 ఆ మరుసటి రోజు, చిన్నూ, సిరి రాజేశ్వరమ్మ చేసి పెట్టిన టిఫిన్ ఇష్టంగా తింటూ అడిగారు. 
" బాంధవీ బ్రేక్ ఫాస్టర్రా.. "
మాధవరావు ఠక్కున చెప్పాడు. 
" బాంధవి బ్రేక్ ఫాస్ట్!.. "
ఇద్దరూ వింతగా చూశారు,  కొత్తగా వినిపించిన ఆ పేరు మొదటిసారి విని.. 
" అవును మరి! మీ అమ్మమ్మ ఫేవరెట్ టిఫిన్.. అదో పెద్ద కథలే... "
" ఊరుకోండి..... "
 నవ్వింది  రాజేశ్వరమ్మ. 
" తాతయ్యా, చెప్పవా.. చెప్పవా.. "
" మీ అమ్మమ్మ, నేనూ ఉద్యోగాలు చేసే రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా ఉప్మా అనే  టిఫిన్ చేసి పెట్టేది. అలా  ఆ వంటకం తరచూ దర్శనమిచ్చేది డైనింగ్ టేబుల్ మీద.... రాన్రాను  అందరం విసుక్కోవడం మొదలెట్టేసరికి... దాన్నే మరికాస్త మోడిఫై చేసి, ఇదిగో... ఇలా వడ్డించడం మొదలెట్టింది. రూపం మారింది.. ఇంగ్రిడియన్స్ పెరిగాయి... దాంతో టేస్టూ  పెరిగింది.. అందరూ గొణగడం ఆగింది... "
 శ్రద్ధగా వింటున్నారు ఇద్దరూ. 
" అంటే ఇది ఉప్మా యేనా !  మై గాడ్ ! ఇంత రుచి ఎట్లా? మమ్మీ కూడా చేస్తుందిది.. కానీ యాక్..!"
 వెనకనే ఉన్న రమ్య చిన్నూ  గాడినెత్తిన ఒక్కటిచ్చింది. 
" అదేదో మీ అమ్మమ్మే చెప్తుంది అడుగు.... "
అని మాధవరావు అనంగానే ఇద్దరూ రాజేశ్వరమ్మ వంక చూశారు.
" మరేమీ లేదర్రా.. అందరికీ తెలిసిందే. చాలా పాతదే.. మరో పది నిమిషాలు పడుతుందంతే... ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా తరిగి, తాలింపు గింజలు మరిన్ని వేసి వాటితోపాటు ఓ టమాట కూడా తరిగి వేస్తే చాలు.. కాస్త పసుపు జోడిస్తే కలర్ ఫుల్  లుక్ వచ్చేస్తుంది.ఎసట్లో  బొంబాయిరవ్వ పోసేసి కలిపేస్తే సరి...  కాసిన్ని జీడిపలుకులు వేశామంటే  రుచి అదిరిపోతుంది. అంతే ! రుచికర మైన వేడివేడి టమాటో బాత్... అదే.. ఉప్మా రెడీ, ఇదిగో ఇలాగన్నమాట ! త్వరగా అయిపోతుంది కాబట్టి ఇది నా ఫేవరెట్. అందుకే మీ తాతయ్యేమో ఇది నాకు ప్రియ బాంధవి అంటారు. షార్ట్ కట్ లో 'బాంధవి' బ్రేక్ ఫాస్ట్ అన్నమాట!!"
 అమ్మమ్మ వివరణకు అబ్బురపడ్డారిద్దరూ. వెంటనే, 
" మమ్మీ, నీవు  నోట్ చేసుకోవా.. ఇలాగే చేయవా.."
 అంటూ మొదలెట్టారు. రమ్యకు అప్పటి రోజులు గుర్తొచ్చాయి. అమ్మ తమ కోసం ఓపిగ్గా అవీ ఇవీ చేసి పెట్టడం తలచుకుంది. ఉదయం పూట బిజీబిజీగా సతమతమవుతూ ఉన్న టైంలో ఠక్కున ఓ ముగ్గురు చుట్టాలు దిగారంటే.... దోసెల పిండిగిన్నె అలా పక్కకు నెట్టేసి, వెంటనే ఉప్మా రవ్వ డబ్బా తీసేది అమ్మ.సమయానుకూలంగా తల్లి పాటించే కొన్ని మార్పులూ, చేర్పులూ తనకూ అబ్బాయి అప్రయత్నంగానే.  అది గుర్తొచ్చి, నవ్వుకుని, పిల్లలతో, 
" సరే సరే... చూద్దాంలే... అలా చేయాలంటే తీరికా,  ఓపిక రెండూ  ఉండాలి... మీరూ  కిచెన్ లోకి వస్తే.. ఓకే... సరేనా..? "
" ఓకే మమ్మీ, షూర్..."
 అంటూ లేచి, రాజేశ్వరమ్మను హగ్  చేసుకుని, 
" థాంక్యూ అమ్మమ్మా, బాంధవి బ్రేక్ఫాస్ట్ పరిచయం చేసినందుకు..."
అన్నారిద్దరూ ఒకేసారి.  నవ్వుకుని, 
" నాకు పాత గానీ ఈ పసివాళ్లకు కొత్తే గదా... "
 అనుకుంటూ దగ్గరకి తీసుకుంది. 


*****************************************




Friday, July 22, 2022

మాట.. ! మౌనం.. !

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మాట  !   🐦
మౌనం !   🐦
మాటకు అర్థం ఒకటే 
మౌనానికి వేయి !
మాటలోని  భావం సుస్పష్టం 
మరి... మౌనం.. సంక్లిష్టం !!
మాట... గలగలపారే సెలయేరు
మౌనం... లోతైన సముద్రం !
మాటకారి మానసం
తెరచిన పుస్తకం
మౌనముని మోము ప్రశ్నార్థకం...
అవగతం కానిది 
అంతుబట్టనిది 
ఆ అంతరంగం.. ఎంతకీ... 
నిజం సుమీ... 
అదో విడివడని చిక్కుముడి ! 🙂

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Monday, July 18, 2022

శ్రేయోభిలాషులు... !..? ఆలోచించాలి...

****************************************

      తల్లిదండ్రుల్ని మించిన శ్రేయోభిలాషులు పిల్లలకు ఇంకెవరుంటారు? అది  గ్రహించని పిల్లల్ని ఏమనాలి? 
        చిన్నచిన్న కారణాలకే... తల్లి మందలించిందనీ, తండ్రి కోప్పడ్డాడనీ... ఉరేసుకుని చావడాలు, రైలు కింద తల పెట్టడాలూ... ఇలాంటి విపరీత చేష్టలకు పాల్పడుతున్న వార్తలు ఇటీవల పెరిగిపోయాయి. కారణం...! క్షణికావేశం...! కాస్త స్థిమితంగా ఆలోచిస్తే అదెంత  అవివేకపు చర్యో వాళ్ళకి తెలిసొస్తుంది. కానీ ఆలోచించరు. అదేమీ పట్టదు. తల్లిదండ్రులు వాళ్ళ శత్రువులైనట్లు ఫీలవడం, వాళ్లేదో  కావాలనే తమ కోరికలకు అడ్డుతగులుతున్నారని  భావించడం..!
   వాళ్లకు శిక్ష వేస్తున్నామన్నట్లు తమను తామే బలి పెట్టుకోవడం ! తల్లిదండ్రులకు జీవిత పర్యంతం తీరని ఆవేదన కలిగిస్తున్నామనే స్పృహ వాళ్లకు లేకపోవడం దురదృష్టకరం. 
     చెడుస్నేహాలు వద్దురా చెడిపోతావు బిడ్డా.. అని హెచ్చరించడం తప్పా ? పిల్లలు పెడదారిన నడుస్తుంటే సరిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత కాదా? తాహతుకు మించిన వస్తువు కొనివ్వలేమంటే నేరమా? చివరికి సెల్ ఫోన్  ఎక్కువ సేపు వాడొద్దు అంటే కూడా తప్పే..! పిల్లల బాగోగులు తల్లిదండ్రులకు కాక మరి ఎవరికి పడతాయి? తమ మంచి కోసమే చెబుతున్నారని ఎందుకు అనుకోరు? 
   ఇదిలాగుంటే... అభిమాన హీరో సినిమా బాగాలేదని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాట్ట  !! అది అభిమానమా, దురభిమానమా? మూర్ఖత్వమా? అసలైన అభిమాని అయితే అతనియొక్క ఆ  చర్య వల్ల ఆ సినిమా పట్ల జనాల్లో నెగటివ్ పబ్లిసిటీ జరుగుతుందని భావించడా? అభిమాన హీరో పట్ల ఓ అభిమాని చూపించే అభిమానం ఇలా ఉండాలా !
     అదంతా పక్కనపెడితే..తన కన్న తల్లిదండ్రుల పట్ల అతనికి బాధ్యత ఏమీ  ఉండదా? వాళ్ల రోదనలు తనకు పట్టవా? 
     స్కూల్లో చదివే టీనేజీ పిల్లల దగ్గర్నుండీ యువ తరం వరకూ కొందరి ఆలోచనా ధోరణి ఇలాగే ఉంటోంది. తల్లిదండ్రుల పట్లనే కాకుండా స్వయానా తమ గురించి కూడా ఆలోచన, అవగాహన లేని బాధ్యతారాహిత్యమిది. వారంతా మనసుపెట్టి ఆలోచించాల్సిన విషయమిది... 

***************************************

 

Wednesday, July 13, 2022

వర్షం కురిశాక....

అదిగో వర్షం !
మొదలైంది చిరుజల్లుగా 
తడుస్తోంది నేల మెల్లమెల్లగా... 
పుడమితల్లి పరవశిస్తూ
మట్టి వాసనల కమ్మదనాన్ని అందిస్తూ
పులకరించిపోయింది ఒక్కసారిగా !
అల్లదిగో.. మొలకలు! చిట్టి చిట్టి మొలకలు!
నేలంతా పరుచుకుని !!
తల్లి ఒడి నుండి తొంగి చూస్తూ... !
చూస్తున్నా మైమరచి... చూస్తూనే ఉన్నా...
మొలకలు పెరిగాయి
పెరిగి పెరిగి పెద్దయి చెట్లయినాయి..!
ఆహా ! ఆ చెట్ల నిండుగ పూలు !!
రకరకాల పూలు! రంగు రంగుల పూలు!
పరిమళాలు వెదజల్లుతూ...
కొత్త కొత్త సొబగులేవో అద్ది 
ప్రకృతిని రమణీయం చేస్తూ...
తీపి తీపి తేనియలు స్రవిస్తూ...
అదిగో..! గ్రోలుతూ  తుమ్మెదలు!!
ఝుమ్మంటూ అవి చేసే నాదాలు !
వింత వింత సంగీత తరంగాలై
హృదిని  తాకుతూ పలికిస్తూన్నాయి 
ఏవో..ఏవేవో   మధుర స్వరాలు !!
ఏ సంగీతకారుడూ కట్టలేని బాణీలవి !
ఏ గాయకుడూ  ఆలపించజాలని
కమ్మ కమ్మని గీతాలవి !!
ప్రకృతితో మమేకమై ఆస్వాదించగల
మదికి  మాత్రమే వినిపించే రాగాలవి !!
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦


 



Friday, July 8, 2022

అంతేగా ! పెత్తనం మారితే అంతేగా !!

    రాత్రి ఏడు దాటింది. కరుణ లోనికెళ్లి స్టవ్ వెలిగించి వంట ప్రయత్నాలు మొదలెట్టబోయింది. అంతలోనే.. అంతవరకూ బయట పక్కింటావిడతో బాతాఖానీ చేస్తున్న అత్తగారు ఎప్పుడొచ్చిందో ఏమో ఠక్కున స్టవ్ ఆర్పేసింది. 
" అప్పుడే  మొదలెట్టావేంటమ్మా ! తినే టైమ్ కంతా చల్లారిపోదూ... ఇంకో గంటాగి మొదలెడదాంలే .. "
అంటూ కోడల్ని వారించి, మళ్ళీ బయటికెళ్లి కూర్చుంది. 
    కరుణ ఉసూరుమంటూ రూములో కెళ్ళి కూర్చుంది. తను సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికే 5.30 దాటిపోతుంది. ఇల్లు ఊడ్చటాలు, టీ లు అందించటాలు అన్నీ అయ్యేసరికి మరో గంట ! తనకేమో త్వరగా వంట పనులు కూడా ముగించుకొని మర్నాడు లెసన్స్ ప్రిపరేషన్ గానీ, పేపర్ కరెక్షన్ గానీ చూసుకోవాలని ఉంటుంది. కానీ అత్తగారు పడనీయదు. రోజూ ఇదే తంతు ! తనకేమో వంటింట్లో పనంతా అలాగే ఉంచుకొని స్కూల్ వర్క్ చేసుకోవాలంటే ఏకాగ్రత కుదరక మనస్కరించదు. ఆవిడేమో అర్థం చేసుకోదు. పోనీలే, తానే ఏమైనా చేస్తుందా అంటే అదీ లేదు. అన్నింటికీ కోడలు పక్కన ఉండాల్సిందే.. పెళ్లయి కాపురానికి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే తంటా ఆవిడతో. తనకు నచ్చిన విధంగా, తనకు వీలైన సమయంలో చేసుకునే స్వేచ్ఛ ఏ కోశానా ఉండడం లేదు. విసుగ్గా తలపట్టుకుంది కరుణ.
     ఒకటో తేదీ వచ్చింది. జీతాలొచ్చాయి. స్కూల్లో తీసుకున్నకవరు తెచ్చి భర్త చేతిలో  పెట్టింది కరుణ. వెంటనే అతను అది తీసుకెళ్ళి తల్లి చేతిలో పెట్టేశాడు. రెండు సంవత్సరాలుగా జరుగుతున్నదిదే. ఇందులో మార్పన్నదుండడం లేదు. అంతా అత్త  పెత్తనం! చదువుకున్న నేరానికి ఇంటాబయటా చాకిరీ తప్పడం లేదు. ఆర్థిక స్వాతంత్ర్యం అస్సలు  లేదు. స్వతంత్రంగా కనీసం ఓ చిన్న వస్తువు కొనడానికి కూడా వీలు లేదు.
   ఇక... మామగారు అదో టైపు ! చూసీ  చూడనట్లుంటారు. కానీ పూర్తిగా భార్య పక్షమే. ఇంట్లో అంతా సజావుగా జరుగుతూ ఉందా లేదా అని సైలెంట్ గా పైనుండి పర్యవేక్షిస్తుంటారు. ఏదైనా తేడాగా కనిపిస్తే 'ఇండైరెక్ట్ ' గా చర్య తీసుకునే రకం ! ఆయన  పద్ధతులు ఆయనకు ఉన్నాయి మరి ! కొడుకు సంపాదనాపరుడైనా, పెళ్లి చేసుకుని ఇంటివాడైనా తన కనుసన్నల్లోనే ఉండాలనుకునే మనస్తత్వం ! కోడలంటే సంపాదించే ఓ యంత్రం,  ఆ సంపాదన మాకే సొంతం, అన్న ప్రగాఢమైన అభిప్రాయాలు వారివి! ఆ గీత దాటే  ఆలోచన తన భర్తకు లేకపోవడం కరుణ దురదృష్టం. ఏదో ఆశగా  భర్త వైపు చూసినప్పుడల్లా 'నేను అశక్తుణ్ణి' అన్నట్లు చూస్తాడతను !
                         **        **       **   
    పది సంవత్సరాలు గడిచాయి. ఇద్దరు పిల్లల తల్లి అయింది కరుణ. కొలీగ్స్ ను చూసి  కొంత, స్వానుభవంతో కొంత 'లౌక్యం' అన్నది అలవరుచుకొని, లోకజ్ఞానం పెంపొందించుకుని ఇంకా చెప్పాలంటే... మేలుకొని... కాస్త బుర్ర ఉపయోగించడం నేర్చుకుంది. క్రమంగా వచ్చిన జీతమంతా తెచ్చి వాళ్ల చేతిలో పెట్టడం మానేసి, తనకంటూ ఇంత,  పిల్లల కోసం అంటూ కొంత ఉంచేసుకోవడం మొదలెట్టింది. ఇదేమిటని ప్రశ్నించే అత్తగారికి సమాధానం చెప్పడం కూడా అలవరచుకుంది. భర్త చెప్పిన ప్రతిదానికీ తలాడించడం మానేసింది. అలా అలా.. మౌనంగానే అయినా కాస్త గడుసుదనం వచ్చి చేరిందామెలో !! ఫలితం ! కాస్త మనశ్శాంతికి నోచుకుంటోంది. 
                  **         **         **
    పెళ్లయి ముప్ఫయి ఏళ్ళు  దాటాయి.  ఈ మధ్యకాలంలో చాలా జరిగిపోయాయి. కొడుకు చదువు పూర్తయి ఉద్యోగంలో ప్రవేశించాడు. కూతురి పెళ్లి చేసి అత్తారింటికి పంపేశారు. మామ గారు కాలం చేశారు.అత్తగారు గట్టిగానే ఉంది, ఆరోగ్యపరంగా ! కాకపోతే ఓ చిన్న మార్పు... కరుణ దృష్టిలో అది పెనుమార్పే !!
    పెత్తనం చేతులు మారింది. ఇప్పుడంతా కరుణదే రాజ్యం ! అత్తగారి పెద్దరికం అంతా గడప అవతలే! ఆవిడకి మరోదారి లేదు. ఉన్న ఒక్క కొడుకే దిక్కు ! అత్యంత శక్తివంతమైన పదవి కోల్పోయిన నాయకురాలిలాగా అయిపోయిందామె  పరిస్థితి ప్రస్తుతం! కొడుకు వంక చూస్తే...
"చెలాయించినన్నాళ్ళూ చెలాయించావు గదా, ఇంకెన్నాళ్లు ! కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు తప్పు కోవాల్సిందే... ఈ విషయంలో నేను నిస్సహాయుణ్ణి.."
అన్న ధోరణిలో చూస్తాడు.ఇక కోడలి చూపుల్లో అయితే మరేవేవో అర్థాలు!"
" అత్తనన్న ఆధిపత్యంతో, ఇదంతా నాదీ.. నాదేనన్న అహంకారంతో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మాటలతో హింసించి నన్ను మానసికక్షోభకు గురి చేసినందుకు ప్రతిఫలం !"
అన్నట్లుండే ఆ చూపులు చురుక్కుమని ఎక్కడో గుచ్చుకునేవావిడకి. 
 " ఆ రోజుల్లో ముందుచూపుతో వ్యవహరించి ఉంటే ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు గదా... ఎంత అణకువగా ఉండేది! ఎంత సతాయించింది తను   ఆ పిల్లని ప్రతీ విషయంలో ! నా వల్లే కదా, ఏకులా ఉండే కోడలు మేకులా తయారైపోయింది !ఎవరైనా ఏదైనా ఎంత కాలమని భరిస్తారు ! అయినా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? గడిచిన కాలం తిరిగి రాదు కదా! కోడలు తనకిచ్చిన గౌరవాన్ని చేజేతులా తనే కాలరాసుకుంది. చేతులారా చేసుకున్న కర్మ !"
 అనుకుంటూ మౌనముద్ర దాల్చడం అలవాటు చేసుకుంది.అలాంటపుడు  అంతేగా మరి ! పెత్తనం మారితే అంతేగా !!
              ****************************