Wednesday, September 13, 2023

చందమామ అందినరోజు...చందమామ పాటలు విందామా... .

  🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌝


  చంద్రయాన్ - 3 చంద్రునిపై దిగింది. భారతదేశ పతాకం ఎగురవేసింది. చరిత్రాత్మక విజయం !! ఈ సందర్భంగా...మూడు సంవత్సరాల క్రితం "వెండితెర వీడని బంధం... అందాల చందమామ" అనే పోస్ట్ ను   నా బ్లాగు లో ప్రచురించిన నాకు... ఓసారి అందులోకి తొంగి చూడాలనిపించింది... అలాగే... అందాల జాబిల్లి.. చందమామపై వచ్చిన సినీ గీతాల్ని మరోసారి...అందరితోపంచుకోవాలనిపించింది. అందుకే ... 

 వెండితెరతో గొప్ప అనుబంధాన్ని పెనవేసుకున్న వెన్నెల రేడు, జాబిల్లిగా చిరపరిచితుడు, జగమంతటికీ అందాల చందమామ-- ఈ చల్లని రాజుపై వచ్చిన మధురాతి మధురమైన సినీ గీతాలెన్నో, ఎన్నెన్నో. అసలు జాబిల్లిపై ఇలా పాటలల్లాలని కవులకు ఎందుకనిపించిందో గానీ అవన్నీ తరాలు మారుతున్నా అజరామరమై అందరి మదిలో మెదుల్తూ, జనాల నోళ్ళలో నానుతూ భాసిల్లుతూనే ఉన్నాయి. వారి కలాల నుండి అద్భుత పదజాలం జాలు వారగా, దిగ్గజాలైన సంగీత దర్శకులు అత్యంత మాధుర్యం ఒలికించే స్వరాలు కూర్చగా, అంతకుమించిన మాధుర్యంతో తేనెలు చిందిస్తూ ఆలపించిన గాయనీ గాయకులు ధన్యజీవులు. ఆ మహత్తరమైన సృష్టికర్తల అద్భుత సృష్టి ఓసారి మననం చేసుకుందాం మనసారా--

   వెన్నెల రాత్రి. పది గంటలు దాటినవేళ... ఆరుబయట మంచం మీద వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తుంటే బంగారు వర్ణంలో గుండ్రంగా మెరిసిపోతూ అందాల చందమామ ఆహ్లాదకరంగా దర్శనమిచ్చి మనసంతా పులకించిపోతూఉంటుంది . అదలా ఉంటే...చల్ల గాలి మెల్లగా కదిలి,  వస్తూ వస్తూ దూరాన ఎక్కడనుండో మృదుమధురంగా సాగిపోతున్న తీయని రాగాల ఓ గీతాన్ని మోసుకొచ్చి వీనులకు విందు సమకూరుస్తూ ఉంటుంది . అలాంటి పాటల్లో ఓ  పాట ఇదిగో--

  🌷 చల్లని రాజా ఓ చందమామ 

       నీ కథలన్ని తెలిశాయి

       ఓ చందమామ నా చందమామ...

అంతేనా --- అలా అలా...ఒకటా...రెండా.. ! ఒకదానితో ఒకటి పోటీలు పడుతూ, రకరకాలుగా సంభాషణలు జరుపుతూ, చిత్ర విచిత్రమైన భావనలతో మది నుక్కిరిబిక్కిరి చేసే మధుర గీతాలు మరెన్నో !! ఓసారి మననం చేసుకుంటే చాలు.... మరు క్షణం ఆ పాట మన మనోఫలకం మీద ప్రత్యక్షమైపోతుంది.. కావాలంటే... ఈ పాటల్ని చూడండి మరి !

 మిస్సమ్మ సినిమా లో ఏ. ఎం. రాజా, లీల గారలు పాడిన ఈ పాట చూడండి. 

🌷  నాతో తగవులు పడుటే

      అతనికి ముచ్చట లేమో 

      ఈ విధి కాపురమెటులో 

      నీవొక కంటను గనుమా

      రావోయి చందమామ 

      మా వింత గాధ వినుమా!

-- భార్యాభర్తల మధ్య తగవులు తీర్చటానికి కూడా ఆకాశంలోని చందమామను పిలుస్తారన్న మాట !

🌷   చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావూ 

       నీవు లేక చుక్కలన్నీ బిక్కు మన్నాయి

-- చందమామ కనిపించక బిక్కమొహం వేశాయి చుక్కలన్నీ...  భార్యాబిడ్డలు చిత్రంలో చిన్నపిల్లలు వాళ్ళ అన్నయ్యను వెతుకుతూ పాడే పాట అన్న మాట. 

🌷  చందమామా... అందాల మామ 

      నీ ఎదుట నేను... నా యెదుట నీవు

      మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావో? 

-- ఒకరినొకరం మనమిద్దరమే చూసుకుంటున్నాం గానీ... మా ఇద్దరి ఎదుట నీవు ఎప్పుడు ఉంటావు? అని ప్రశ్నిస్తున్న ఓ కన్నె మనసు. గాయని సుశీల గారు. 

🌷   చందమామ బాగుంది చూడు

        చల్ల గాలి వీస్తోంది చూడు

        ఆపైన.. ఆపైన.....

        నువ్వు నా కళ్ళలో తొంగి చూడు..

-- నాయిక అమాయకుడైన కథానాయకుని ఆటపట్టిస్తూ ఇలా పాడుతుంది మరి! గానము: ఘంటసాల, సుశీల

🌷   చందమామ వస్తున్నాడూ 

       చందమామ వచ్చేను.. 

       నిన్ను నన్ను చూసేను 

       ఎక్కడైన దాగుందామా 

       చక్కనైన చిన్నదానా.... 

-- తమని చూసే చందమామ చూపుల్ని తప్పించుకోవడానికి ఎక్కడైనా దాగుందామంటూ -- గానం: ఘంటసాల, సుశీల

 --- తమ బాధల్ని, సమస్యల్ని సైతం చందమామతో చెప్పుకునే వారు ఉంటారన్నమాట ఈ విధంగా--

 🌷  మామా.. చందమామా.. వినరావా నా కథ

       వింటే.. మనసు ఉంటే... కలిసేవూ నా జత

-- సంబరాల రాంబాబు-- లోని ఈ పాట విని తీరాల్సిందే. 

🌷    నిండు చందమామ.. నిగనిగలా భామ 

         ఒంటరిగా సాగలేవు... కలసిమెలసి పోదామా.. ఓ.. 

-- జేసుదాస్ పాడిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. 

🌷    చందమామ రావే... జాబిల్లి రావే

         అమ్మాయి అలిగింది... అలక తీర్చి పోవే....

-- చెలి అలక తీర్చడానికి కూడా చందమామ రావాల్సిందే నా? 

-- గానం: సుశీల, రామకృష్ణ

----  తను ప్రేమించిన వాడు ఎంతో ఉన్నతుడు. తానేమో కడు బీద. ఈ పాట చూడండి--

 🌷   నీలాల నింగి మెరిసి పడే నిండు చందురుడా

        నిరుపేద కలువ వేచెననీ మరిచిపోకుమా 

-- గానం: పి. సుశీల

🌷   చందమామ రావే జాబిల్లి రావే

        కొండెక్కి రావే గోగు పూలు తేవే

-- ఓ చిన్న పాప రాత్రివేళ చందమామను పిలుస్తూ ఆనందంగా పాడుతుంది సిరివెన్నెల సినిమాలో. 

🌷   చందురుని మించు అందమొలికించు 

       చిట్టి పాపాయి జో... నిన్ను కన్న వారింట

       కష్టముల నీడ తొలగిపయేనులే... 

-- చందమామ ను మించిన అందం నీదంటూ పాపకు పాడే జోల. రక్తసంబంధం-- సినిమాలో సుశీల ఆలపించిన పాట. 

---- జానపద సొగసులు రంగరిస్తూ లయ బద్ధంగా సాగే ఈ పాట భక్త కన్నప్ప లో సుశీల, రామకృష్ణ పాడారు.

🌷  అత్తారింటికి దారేదమ్మ సందమామ 

       ఆమడ దూరం ఉందోలమ్మాసందమామ 

       ఆమడ దూరం అయినా గానీ ఎల్లాలమ్మా..  వుయ్.. 

       ఎన్నీయల్లో ఎన్నీయల్లో సందమామ.. 

       సిన్నాదానీ మనువూ సెయ్యి సందమామ... 

 --- చందమామకు మరో పేరు జాబిల్లి. అలా సంబోధిస్తూ వచ్చిన పాటలకూ కొదవలేదు. 

🌷   జాబిల్లి చూసేను నిన్ను నన్నూ 

       ఓయమ్మో, నీకింత సిగ్గేల బాలా రావా...

       నను చేర రావా......

-- మహాకవి క్షేత్రయ్య లోని ఈ పాట సుశీల, రామకృష్ణ మధురాతి మధురంగా గానం చేశారు. 

🌷   జాబిలమ్మ నీకు అంత కోపమా

        జాజిపూల మీద జాలి చూపవా.....

-- అంటూ ఓ ప్రియుడు తన ప్రేయసిని జాబిలి గా వర్ణిస్తూ పాడుతున్నాడు అన్నమాట!

-- పెళ్లి. చిత్రంలో ఎస్. పీ. బాల సుబ్రహ్మణ్యం గానం చేసిన పాట. 

🌷   జాబిల్లి వచ్చాడే పిల్ల నిన్నెంతో మెచ్చా డే

       నీకు మనసిచ్చా డే, ఎదురుచూస్తున్నాడే పిల్లా... 

-- తననే జాబిల్లి గా అనుకుంటూ మరదలితో సరసాలాడుతున్నాడు ఓ చిలిపి బావ. 

-- అల్లుడే మేనల్లుడు-- సినిమాలో  ఘంటసాల పాడిన పాట ఇది. 

🌷   జాబిలితో చెప్పనా, జామురాతిరి

       నీవు చేసిన అల్లరి, రోజా

-- వేటగాడు-- చిత్రంలో సుశీల, బాలసుబ్రమణ్యం హుషారుగా పాడిన ఈ పాట జనాల్ని ఎంతగా ఉర్రూతలూగించిందో అందరికీ విదితమే.    

 🌷 అలా మండిపడకే జాబిలీ

      చలీ ఎండ కాసే రాతిరీ 

      దాహమైన వెన్నెల రేయి

      దాయలేను ఇంతటి హాయి 

      ఎలా తెలుపు కోనూ ప్రేమనీ 

      ఎలా పిలుచుకోనూ రమ్మనీ..... 

-- ఓ అమ్మాయి తన ప్రేమను సఖునికి ఎలాతెలుపుకోవాలో తెలియడం లేదంటూ జాబిలితో మొర పెట్టుకునే ఈ పాట' 'జాకీ ' చిత్రంలో జానకి పాడినది. 

🌷   పగడాల జాబిలి చూడు

       గగనాన దాగెను నేడు

       కోటి అందాల నా రాణి

       అందిన ఈ రేయి... 

       ఎందుకులే నెలరేడు...

-- ఇక్కడ నాయకుడు ఘటికుడు. మరెంతో చతురుడు. 

 చెలి చెంతనుండగా నీవెందుకు అంటున్నాడు జాబిలితో. 

-🌷  చందమామ అందినరోజు ...

        బృందావని నవ్విన రోజు.... 

        తొలివలపులు చిలికిన రోజు...

        కులదైవం పలికిన రోజు....  

        భలేమంచిరోజు...పసందైన రోజు... 

        వసంతాలు పూచే నేటిరోజు.... 

 --- జరిగిన కథ లో ఘంటసాల గానం మరువగలమా !        

--- ఇలా చెప్తూ పోతుంటే కోకొల్లలుగా తడుతూనే ఉంటాయి అందాల చందమామ కబుర్లు, పాటలు.  ఏదేమైనా ఈ పాటలన్నీ చూస్తుంటే, వెండితెరకూ ఆకాశంలో చందమామకూ  ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపించడం లేదూ.....

  చంద్రయాన్ విజయం తర్వాత... ఈ పాటలన్నీ గుర్తొచ్చాయి...నేను ప్రస్తావించనివి ఇంకెన్నో ఉంటాయి.. 

  చివరగా రాసిన కవులకు, స్వరపరిచిన సంగీత దర్శకులకు ఇంకా వారి మధుర గానంతో చరితార్థులు, చిరస్మరణీయులు అయిన గాయకులకు మనఃపూర్వక నమస్సుమాంజలులు. 🙏

🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝


            

10 comments:

  1. చందమామ పాటలు భలే కలెక్షన్ ఉందే మీ దగ్గర 👌🙂. పాత సినిమాల్లో ఎక్కువగా విజయా వారి సినిమాల్లో పూర్ణబింబం చందమామ తరచుగా చూపించేవారు .... అందుకే అటువంటి చందమామని “విజయా వారి చందమామ” అనేవారు కూడా 🙂.

    మరో పాట ఉందండి .... అందాలు చిందెడీ చందమామ నీవనీ, ఓ జాబిలీ ఓ ఆ తారకా నవ్వునోయీ నిను గనీ .... అని “చండీరాణి” లో పాట (భానుమతి, రామారావు). చాలా బాగుంటుంది 👇.

    https://m.youtube.com/watch?v=NcCanl78qsU

    ReplyDelete
    Replies
    1. ఆ తారకా నవ్వునోయి నిను గని పాట ఒక అజరామరమైన, ఇళయరాజాకు అత్యంత ఇష్టమైన పాట. ఆయన ఎన్నో పాటలు స్వర పరిచాను కానీ ఆ తారకా ,( తమిళం లో వాన్ మేదిలే ) పాటను మాత్రం అందుకోలేక పోయాను అని చెప్పారు.

      Delete
    2. విన్నకోట నరసింహారావు సర్, నమస్తే.విద్యార్ధి దశ నుండీ నేను విన్న సినీగీతాల్లో చందమామపై వచ్చినవి నాకు గుర్తున్నంతవరకూ ప్రస్తావించాను. చండీరాణి లో పాట నా స్మృతిపథంలో లేదు. మీరు గుర్తు చేశారు.సంతోషం. 👃

      Delete
  2. చాలా ఆహ్లాదకర మైన వ్యాసం వ్రాశారు ధరిత్రి దేవి గారు.

    ReplyDelete
  3. అందమైన ‌పగలే. "వెననన్నెల జగగమే ఊఊయల" పాట మరిచావా చెల్లీ. ఇంకా జాాబిల్లలితో ఆకాశ దీపం
    -----LRSR

    ReplyDelete
  4. "ఆకాశవీధిలో అందాల జాబిలి వయ్యారి తారను జేరి ఉయ్యాల లూగెనే సయ్యాట లాడెనే" మీరు మరచారు, నేనూ మరచాను.కదా!ఇంకా బండరాముడు చిత్రంలో "సాగిపోయే ఓ చందమామా, ఆగుమా!.ఒకసారి ఆగుమా! ఓ చందమామ" అట్లే భట్టివిక్రమార్క లో. "ఓఓ నెలరాజా వెన్నెల రాజా" క్షణక్షణంలో "జామురాతరి జాబిలమ్మ" అబ్బో ఎన్ని మెలోడీ సాంగ్సో!

    ReplyDelete
  5. ఇంకా పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలో "వెన్నెలలో మాయయేమో" పెళ్లతాంబూలంలో "చక్కని ఓ జాబిల్లి పలుక వేలనే నీ వలపులతో నా మదినే చిలుకవేలనే"

    "నీలాలనింగిలో మేఘాల చాటున---" "వెన్నెలలోని చందమామ వెచ్చగ నున్నది మామ మనసేదోలాగున్నది"
    మదనకామరాజు కథలో "నీలిమేఘ మాలవో నీలాలతారవో" "చందమామ బాగుంది చూడు చల్లగాలి వీచిందినేడు ఆపైన---" ఆరాధనలో
    "వెన్నెలలోని వికాస --- వెలిగించెద నీ కనులా---" "విశాల గగనములో చందమామ....ప్రశాంత సమయమునన కలువ లమా"

    ReplyDelete
  6. చాలా మంచి పాటలు ప్రస్తావించారండీ. వాటన్నితోపాటు, జయం మనదే లో ఘంటసాల పాడిన "ఓ చందమామ అందాల భామ" పాట కూడా జత చేస్కోండి. జాబిల్లి అనగానే, ఎక్కడో చదివిన ఒక విషయం గుర్తొచ్చింది. సుఖ్వీందర్ సింగ్ ఒక తెలుగు పాట రికార్డ్ చెయ్యబోతూ, సంగీత దర్శకుడితో "ఇది ప్రేమగీతం అంటున్నారు కదా, మరి జాబిల్లీ అని ఎందుకు పాడుతున్నాను" అని సందేహం వ్యక్తపరిచాడుట. జా-బిల్లీ అంటే హిందీలో పో పిల్లీ అని :-)

    ReplyDelete
  7. మంచిదండీ. నాక్కూడా మరికొన్ని పాటలు గుర్తొస్తున్నాయి. Thanks for the comment.

    ReplyDelete