Thursday, April 30, 2020

మరణం ఎంత దారుణం !

'కరోనా ' ఉధృతి తగ్గడం కాదుగదా ఇంకా పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో....... 

మరణం ఎంత దారుణం !
----------------------------------
ఈ క్లిష్ట సమయాన
మరణం ఎంత దారుణం !
అయినవాళ్ల ఆఖరిచూపుకూ 
నోచుకోని దౌర్భాగ్యం 
కాటిదాకా నడిచే తోడు లేక
 ఆఖరి ప్రయాణం!
' ఆ నలుగురు' సైతం
 దొరకని వైనం' !
ఇది చాలదంటూ 
 ఆరడుగుల నేల కోసం
 వాదులాటలు వ్యతిరేకతలు!
 నశించిన మానవత్వం
 అదృశ్యమైన సంస్కారం
 పగవాడిక్కూడా వద్దీప్రారబ్ధం !
 వందలు వేలు లక్షలు
 ఇంకెంతకాలమీ అనాధ శవాల 
 తరలింపులు ? 
 భగవంతుడా  ! ఈ క్లిష్ట సమయాన 
 మరణం ఎంత దారుణం !

 ఇది ప్రకృతి ప్రకోపమా, శాపమా ? 
 భారం మోయలేని భూమాత 
 ఆక్రోశమా, ఆగ్రహమా ? 
 లేక విధి వైపరీత్యమా ? 
 అన్నీ కలిసి ' కరోనా ' మహమ్మారిగా
 మారిన విచిత్ర ఉదంతమా  ?
 గతి తప్పిన ఈ గుండె చప్పుడు
 గాడిన పడే ఘడియలెప్పుడు ? 

--------------------------------------------------------
మళ్ళీ కలుద్దాం 
యం. ధరిత్రీ దేవి 
********

Wednesday, April 29, 2020

మంచి మాట --నిన్న, నేడు

మంచి మాట --నిన్న, నేడు 
*********************
నిన్నటి మంచి మాట 
*****************
*   కలిసుంటే కలదు సుఖం 
*   బయట తిరిగితే ఆరోగ్యం 
*   అంటరానితనం నేరం 
*   స్వచ్ఛమైన గాలి పీల్చండి 

నేటి మంచి మాట 
**************
*   విడివిడిగా ఉండండి 
*   ఇంటిపట్టున ఉండండి, క్షేమంగా ఉండండి. 
*   ఎవరినీ తాకొద్దు, రోగం తెచ్చుకోవద్దు. 
*   ముక్కుకూ, మూతికీ మాస్క్ తగిలించండి. 

------------------------------------------------------------------
' కరోనా ' ఉధృతి ఇంకా తగ్గని నేపథ్యంలో వ్రాసుకున్న మాటలివి. 
కానీ --' నేటి మంచి మాట ' త్వరగా సమసిపోయి మళ్ళీ ' నిన్నటి మంచి మాట ' రావాలని అందరం ఆశిద్దాం  🌹🌺🌷🌺🌷
-------------------------------------------------------------------మళ్ళీ కలుద్దాం 👃👃👃
యం. ధరిత్రీ దేవి 
*

Tuesday, April 28, 2020

అవనిలో వనిత  🌷🌹🌷
*****************************************

                      ఈతరం స్త్రీ 
                      *********

    ' ఏమండీ, ' తలుపు మీద చిన్నగా శబ్దం చేస్తూ పిలిచింది కవిత. లోలోపల విసుక్కుంటూ చదువుతున్న నవల పక్కన పడేసి తలుపు తీసింది కల్పన. ఎదురుగా నిలుచున్న కవితను చూసి, ' ఓ ! మీరా, రండి ' అంటూ ముఖాన కాస్త నవ్వు పులుముకుంటూ లోనికి ఆహ్వానించింది. 
 కల్పనా వాళ్ళ పక్క పోర్షన్లో రెండు రోజుల క్రితం చేరారు కవిత వాళ్ళు. ఇంతవరకూ పరిచయం చేసుకోడానికి కుదరలేదు. మధ్యాహ్నం కాస్త తీరిక దొరకగానే ఈరోజు కల్పనతో కాస్త మాటలు కలుపుదామని బయలుదేరింది కవిత. " ఏమిటో చదువుతున్నట్లున్నారు? డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను,"
 నొచ్చుకుంటూ అంది కవిత. 
    ' ఆ, ఏదో నవల, అన్నట్లు మీరు నవలలు చదువుతారా?  "
         " ఏదో కొద్దిగా, ఈ మధ్య ఇంటర్ ప్రైవేటుగా కట్టిన తర్వాత ఇతర పుస్తకాలు చదవటానికి టైం ఉండటం లేదండి, " 
      " ఏమిటీ ! ఇంటర్ కు కట్టారా? ఎందుకండీ బాబు పెళ్లయి కూడా చదవడం అవసరం గాను, నేను బి ఏ సెకండ్ ఇయర్ చదువుతూ మానేశాను, పెళ్లవడంతో.... " 
       " అలాగా! మరి ఇప్పుడు పూర్తి చేయలేక పోయారా, ఏదైనా జాబ్ కు ట్రై చేయొచ్చు కదా..... "
   ఆమె మాట మధ్యలోనే అందుకుంది కల్పన,
    " ఇంకా నయం, నాకేం ఖర్మఅండీ ఉద్యోగం చేయడానికి? లక్షణంగా ఆయన సంపాదిస్తారు, నేనెందుకు బయటకి వెళ్లి కష్టపడ్డం? కొంపదీసి మీరు ఉద్యోగం చేయడానికే మళ్లీ చదువు మొదలెట్టారా ఏమిటి?, తిరస్కారంగా అంది కల్పన. 
    " ఏదో వేణ్ణీళ్లకి చన్నీళ్ళు తోడు అన్నట్లుగా ఆయన సంపాదనకు నాదీ జత చేద్దామని ఉంది. ఈ రోజుల్లో ఒక్కరి సంపాదనతో సంసారం జరగడం చాలా కష్టంగా ఉంది కదండీ, " ఒకింత ఇబ్బందిగానే అంది కవిత. 
    " ఏమో బాబు, మాకన్నీ మా ఊరి నుండే వస్తాయి. సంసారం జరగకపోవడం అన్న ప్రశ్నే ఉండదు, " ధీమాగా అంది కల్పన. 
    ఆమె మాటల్లో తలెత్తిన అహానికి కించిత్ నొచ్చుకుంది కవిత, కానీ వెంటనే సర్దుకుని,'పోనీలెండి, ఎవరి అభిప్రాయాలు వారివి, ' అంది లేస్తూ. 
                       *******************
     సాయంత్రం స్కూల్ నుండి బయటపడి రోడ్డు మీదకు వచ్చింది కవిత. రోడ్డుకి అవతల నిలబడ్డ ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, " అరే! ఈమె కల్పనలా ఉందే అనుకుంటూ రోడ్డు క్రాస్ చేసి ఆమెను సమీపించింది. 
" హలో, కల్పన గారూ బావున్నారా! " అంటూ చేయి ఊపింది. పిలుపు విని ఇటు తిరిగిన కల్పన కూడా కవితను చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. 
   " మీరా, కవిత గారు, చాలాకాలానికి కనిపించారు. బాగా మారారు కూడాను. " అంది ఆనందంగా చూస్తూ. " అవును, మీలో కూడా మార్పు స్పష్టంగా తెలుస్తోంది సుమా! ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు? 
    " బయలుదేరడం కాదు, ఇంటికి వెళుతున్నాను, స్కూల్ నుండి" అన్నది కల్పన. 
     " స్కూల్ నుండా! అంటే.... "  అర్ధోక్తిలో ఆగిపోయింది కవిత. 
     " అవును, స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మీకు నమ్మకం కలగడం లేదు కదూ! కానీ, ఇది నిజం, రండి, అలా నడుస్తూ మాట్లాడుకుందాం, " అంటూ దారితీసింది కల్పన. దగ్గర్లోని ఓ కాఫీ షాప్ లో కూర్చున్నారిద్దరూ
     " అప్పట్లో మీ మాట చాలా తేలిగ్గా కొట్టిపారేశాను. కానీ, కాలం గడిచే కొద్దీ నాకు పరిస్థితి అర్థం అవసాగింది. పెరిగే సంసారం, పెరిగే ధరలు. ఈ లోగా నా ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం మా వాళ్ళు పొలాలు అమ్మేయాల్సి వచ్చింది. దాంతో అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చేవన్నీ ఆగిపోయాయి. అన్నీ కొనాల్సి వచ్చింది. దాంతో మా వారి సంపాదన ఎందుకూ సరిపోక పరిస్థితులన్నీ ఎదురు తిరిగాయి. చేసేదేమీలేక ఇక తప్పనిసరై తక్కువ జీతం పై కాన్వెంట్ లో చేరాను. ఏమి చేయను మరి? పెళ్లయిన తర్వాత విలువైన సమయమంతా వృధాగా గడిపేసాను. ఇప్పుడు బియ్యే పూర్తి చేద్దాం అంటే నాకు తీరికనేదే కరువై పోయింది. ముగ్గురు పిల్లల తల్లిగా, ఓ గృహిణిగా, మరోపక్క ఉద్యోగినిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికే నాకు ఎక్కడ లేని టైం సరిపోవడం లేదు, " తలదించుకుని చెప్తున్నదల్లా గొంతు జీరబోవడం వల్ల క్షణంపాటు ఆగింది. ఆమె కళ్ళలో పల్చటి కన్నీటి ధర! అది గమనించిన కవిత మనసంతా అదోలా అయిపోయింది. అంతలోనే తన అనుభవం కళ్ళముందు కదలాడింది. 
      ఎంత కష్టపడింది తను! పెళ్లయిన తర్వాత మూడేళ్ల దాకా పిల్లలు వద్దనుకున్నారు. తను ఎంతో శ్రమపడి ఇంటర్ పాసయింది. తర్వాత సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు లక్షణమైన ఉద్యోగం సంపాదించుకుంది. ఇద్దరు పిల్లలతో ఇంటినో స్వర్గధామంగా తీర్చిదిద్దుకుంది. 
     కానీ, దీని వెనుక ఎంత కృషి, ఎంత పట్టుదల, మరెంత ముందుచూపు, ఎంతటి నిగ్రహం దాగి ఉన్నాయో తనకూ, తన భర్తకూ మాత్రమే తెలుసు. ఇప్పుడు కల్పన ను చూసి జాలి పడ్డం, ఓ నిట్టూర్పు విడవటం తప్ప తనేం చేయగలదు? 
       " అందుకే, ఈనాడు అమ్మాయిలు కేవలం వర్తమానాన్నే గాక భవిష్యత్తును కూడా ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి, " 
         తనలో తాను అనుకుంటూ ఓదార్పుగా కల్పన చేతిని తన చేతిలోకి తీసుకుంది కవిత. ఆ క్షణం ఆమె వదనంలో ఈతరం స్త్రీలో ఉండాల్సిన ధైర్యం, ఆత్మస్థైర్యం స్పష్టంగా అగుపించాయి. 
                        *******************

******************************************
యం. ధరిత్రీ దేవి, 🌹🌹🌹మళ్ళీ కలుద్దాం 
*****************

Saturday, April 25, 2020

--- ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో

--- బంతిపూల రధాలు మా ఆడపడుచులూ 

--- భామా భామా బంతి పువ్వా

--- బంతిపూల జానకీ జానకీ 

----- ఇలా సినీ కవుల కలం ఈ బంతిపూల మీదకు మళ్లడానికి ఆపువ్వుయొక్క ముగ్ధ మనోహర అందమే నంటే అతిశయోక్తి కాదేమో ! కన్నెపిల్లల వాలు జడలో ఒక్క పువ్వు పెట్టినా చాలు, ఆ జడ కే కొత్త అందాన్నిచ్చి అలరించే ఈ ముద్దబంతి పువ్వు ఇంతులందరికీ ఇష్టసఖి అంటే వింతేముంది? ఒక సిగ సింగారానికికేనా, పండగ పబ్బాలొస్తేచాలు వీధుల్లో రాశులుగా దర్శనమిచ్చే ఈ పసుపు ఎరుపు వర్ణాల బంతిపూలు మన గుమ్మాలకు తోరణాలుగా, సంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తాయి మరి! ఓ సంక్రాంతి పర్వదినాన బుట్ట నిండుగా మా ఇంటికికొచ్చిన ఈ పరిమళ భరిత బంతి పూలను చూడగానే---- వెంటనే ఇలా అడగాలనిపించింది...... 

 ముద్దబంతి పువ్వా...... 


 పచ్చాపచ్చాని ముద్దబంతివే 
 ఏ తోటలో ఏ కొమ్మను విరబూసితివే? 
 ఏదోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు నడిచి 
 ఏతెంచితివే? 
 మా ఇంటికొచ్చి వెలుగులు వెదజల్లి
 పసుపు రాసిన మా గడపకు
 పచ్చ పచ్చని అందాలు అద్ది నావే !
 గుది గుచ్చిన మాలవై గుభాళిస్తూ 
మాగుమ్మానికి తోరణమైనావే !
 ఇంతకీ---
 ఏతోటలో ఏకొమ్మను విరబూసితివే ? 
 ఏ దోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు నడిచి 
 ఇటకేతెంచితివే ! 

 ముంగిట ముచ్చట గొలిపే ముత్యాలముగ్గమ్మ !
ఆమధ్యన ముద్దులొలికే గొబ్బెమ్మ 
ఆపైన ఠీవి గ నిలిచిన నీసోయగమమ్మ !
ఆసొగసు వర్ణించతరమా, ముద్దబంతమ్మ ! 
ఇంతకీ ----
ఏతోటలో ఏకొమ్మను విరబూసితివే 
ఏదోసిలినిండి ఎన్నెన్ని దూరాలు నడిచి 
ఇటకేతెంచితివే ? 

వాలుజడ వయ్యారి సిగను ఒదిగి 
మబ్బులమాటున చందమామను బోలి 
వేయిరేకులొక్కపరి విప్పి 
వినూత్నరీతిని శోభిల్లినావే !
ముద్దబంతిపువ్వా, ముద్దరాలి ముద్దుమోము 
నీముందే పాటిదమ్మ !
ఇంతకీ ---
ఏతోటలో ఏకొమ్మను విరబూసితివే !
ఏదోసిలి నిండి ఎన్నెన్ని దూరాలు నడిచి 
ఇటకేతెంచితివే !!

******************************************
మళ్ళీ కలుద్దాం 
యం. ధరిత్రీ దేవి 
******************************************

CATEGORIES  that I am following : 

***************************************

*  స్పందన ---------వ్యాసాలు

*   హృదయగానం --కవితాసుమాలు 

*   కథ        -----కథలాంటి నిజం 

*  ' చిన్నారి ' కథ ----పెద్దలకుకూడా 

*   అవనిలో వనిత ----వనితకు వందనం 

*   గీతాంజలి ----గేయమాలిక 


******************************************
యం. ధరిత్రీ దేవి 
******************************************

Tuesday, April 21, 2020

                           🌹🌺🌺
                      🌺  స్పందన  🌺
                            🌺🌹🌺
    
         నేటి సినీ కథానాయిక --దర్శకుల ధోరణి 
        ********************************


    చక్కటి అందం, అద్భుతమైన నటనాకౌశలం, అంతకుమించిన వాక్చాతుర్య ప్రతిభ---- వీటన్నింటి కలబోత నేటి సినీ కథానాయిక అంటే అతిశయోక్తి కాదు. భాష తెలియకపోయినా పాత్ర స్వభావాన్ని నూటికి నూరుపాళ్లు అర్థం చేసుకుని నటించడం, వివిధ నాట్య భంగిమలు అలవోకగా ఆకళింపు చేసుకుని నర్తించడం సామాన్యమైన విషయమేమీకాదు. కానీ, హృదయం కళుక్కుమనేలా చేసే విషయమేమిటంటే తెరపై వారి వస్త్రధారణ! ఇంతటి ప్రతిభ గల నటీమణుల్ని అరకొర దుస్తుల్లో చూపిస్తూ వారిపై సదభిప్రాయాన్ని తుడిచి వేయడం, కొన్నిసార్లు ఆయా పాత్రల ఔచిత్యాన్నే దెబ్బతీయడం విజ్ఞులైన సినీ దర్శకులకు భావ్యమేనా? 
    ఒకప్పుడు నాయిక అంటే చూడచక్కటి ఆహార్యంతో అందరికీ గౌరవభావం కలిగించేలా ఉండేది. హీరోయిన్, సైడ్ హీరోయిన్, వ్యాంప్ -- ఇలా వారికంటూ ప్రత్యేకించి పరిధులుండేవి. ఇప్పుడు నాయికే అన్నిరకాలూ భర్తీ చేస్తోంది మరి! 
     ఈమధ్య థియేటర్ కెళ్ళి ఓ సినిమా చూడటం తటస్థించింది. అందులో నాయిక పాత్రధారిణి ఆధునిక దుస్తులు అనబడే చిన్న గుడ్డ పీలికలు ధరించడం చూసి ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. 
 కొద్ది రోజుల క్రితం ఇదే నటీమణిని చక్కటి చీరకట్టుతో ఓ దర్శకుడు తన చిత్రంలో నటింపజేసిన విషయం గుర్తొచ్చి, ఇద్దరు నటీమణులూ ఒకరేనా అన్న అనుమానం తో పాటు కించిత్ బాధ కూడా కలిగింది. 
    ఒక్కోసారి పిల్లలతో కలిసి థియేటర్లో అటుంచి, ఇంట్లో టి. వి లో సైతం చూడలేనంత జుగుప్సాకరమైన దుస్తుల్లో వారు కనిపిస్తూ ఉంటే
' హతవిధీ' ఏమిటీ ప్రారబ్ధం ! అనిపిస్తుంది. కథానాయిక పాత్రను మరీ ఇంతగా దిగజార్చి చూపించడం అవసరమా! అది ఎంతవరకు సమంజసం? ఇలాంటి ప్రశ్నలు వేధిస్తుంటాయి. 
      నాయిక పాత్రల్ని ఎంతో సమున్నతంగా చూపించిన విశ్వనాధ్, బాపు, బాలచందర్  లాంటి దర్శకుల చిత్రాలు అద్వితీయ కళాఖండాలుగా చిరస్థాయిగా అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. వ్యాంప్ పాత్రలకు మాత్రమే పరిమితమైపోయున్న మంజు భార్గవి ' కళా తపస్వి ' ' శంకరాభరణం '  ద్వారా పరిశ్రమలో గౌరవనీయమైన స్థాయిని చేరుకోవడం విధితమే కదా ! 
    కేవలం నాయికల అందాల ఆరబోతకే జనాలు సినిమా చూడ్డానికి వస్తారన్న అపోహ నేటి తరం దర్శకులు తొలగించుకుంటే మంచిది. అదేవిధంగా అందాల ప్రదర్శన చేస్తే అవకాశాలు వెల్లువెత్తుతాయన్న ధోరణి నేటి తరం నాయికలూ మానుకోవాలి. అది కేవలం తాత్కాలికమే. ప్రేక్షకుల మదిలో వారిపట్ల దురభిప్రాయం ఏర్పడి, అసలుకే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని ఈ తారలు ఎందుకు గ్రహించరో మరి ! 
      చౌకబారు తనాన్ని ఇష్టపడే వర్గం ప్రేక్షకుల్లో అతి తక్కువ శాతం మాత్రమే ఉంటారు అన్న వాస్తవాన్ని దర్శకులు గ్రహించి తీరాలి, అదేమంటే--- అలా తీస్తే ఈ రోజుల్లో సినిమాలు ఆడతాయా? కోట్లు గుమ్మరించి, అంతకుమించి శ్రమకోర్చి మేం సినిమాలు తీసేది నష్టాల్ని మూట గట్టు కోడానికి కాదు కదా! పైగా, టి. వి లు వచ్చాక ప్రతి ఇల్లు ఓ మినీ థియేటర్ అయిపోయి, జనాలు బయట థియేటర్ల దాకా రావడమే గగనమై పోయిన ఈ రోజుల్లో యువతని ఆకర్షించాలంటే అన్ని హంగులు గుప్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, అంటూ నిట్టూరుస్తారు దర్శక నిర్మాతలు. వాళ్ల కోణంలో అదీ కరెక్టే. వారి బాధలు వాళ్ళవి మరి!
     అయితే, ప్రస్తుతం ఈ ప్రభంజనంలో మంచి సినిమాలే రావడం లేదా అంటే అడపాదడపా వస్తున్నాయని ఒప్పుకోవాల్సిందే. చక్కటి కళాత్మక విలువలతో, ఒకింత సందేశాన్ని జోడిస్తూ తీస్తున్న దర్శకులూ లేకపోలేదు. వారి ప్రయత్నానికి జోహార్లు. ఏదేమైనా, వాస్తవ దృష్టితో ఆలోచిస్తే వాణిజ్యపరంగా తీసే సినిమాలు పది కాలాల పాటు మదిలో నిలిచిపోయే ప్రసక్తి ఎంత మాత్రమూ ఉండదు. విజ్ఞులైన దర్శకులు ఆ దిశగా ఆలోచించాలి. 

*****************************************
మళ్ళీ కలుద్దాం. 
యం. ధరిత్రీ దేవి 
***********

Sunday, April 19, 2020

' చిన్నారి ' కథ 
😊😊😇😇🙂🙂

  చిన్నప్పుడు----- స్కూల్లో చదివే రోజుల్లో చిన్న పిల్లల కథల పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండేది. అందులో ముఖ్యమైనవి ' చందమామ ',  ' బాలమిత్ర
 మాస పత్రికలు. చిన్నప్పటి ఆ అలవాటు బాగా పెరిగి పెద్దయ్యాక కూడా అలాగే కొనసాగింది. ఏమిటీ, ఇంకా చిన్న పిల్లలా ఈ పిల్లల కథలు..... అన్నవాళ్ళున్నారు. కానీ, ఆ ఆసక్తి మాత్రం నా నుండి దూరం కాలేదు. నాలాగే ఈ అలవాటు ఇంకా చాలా మందికి ఉంటుందని నాకు తెలుసు. అందుకే మరి , ఈరోజు ఈ  ' చిన్నారి' కథ. 
    
                             పరివర్తన
                            ********
     ఉదయం హాజరు నమోదు చేస్తున్న వసుంధర తలెత్తి చూసింది. వంశీ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు విసుక్కుంటూ వెళ్లికూర్చోమన్నట్లుగా తల పంకించి, మళ్లీ హాజరు పట్టీలోకి దృష్టి సారించబోయింది. ఇంతలో వంశీ లోనికి వచ్చి, గదంతా ఓసారి పరికించి, విసవిసా వెళ్ళి వెనక బెంచీలో కూర్చున్నాడు. 
   అది గమనించిన వసుంధర, " అదేమిటి వంశీ? ఇక్కడ హరి పక్కన ఖాళీ ఉండగా వెళ్లి అంత వెనకగా కూర్చున్నావే?  " అని ప్రశ్నించింది. వంశీ పలకలేదు. వాడి నిర్లక్ష్య వైఖరికి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. కారణం, గతంలో కూడా వాడు అదేవిధంగా ఒకటి రెండుసార్లు ప్రవర్తించడమే. గమనించదగ్గ విషయమేమిటంటే, అప్పుడు కూడా వాడు ఇలాగే హరి అనే అబ్బాయి పక్కన ఖాళీ ఉన్నా కూర్చోకుండా వెళ్లడమే!
    ఆ మధ్యాహ్నం భోజనాలయింతర్వాత వంశీని మెల్లిగా పిలిచి, అనునయంగా అడిగింది. " ఏరా, హరి పక్కన కూర్చోవటానికి నీకేమిటి అభ్యంతరం? " చాలాసేపు గుచ్చిగుచ్చి అడిగింతర్వాత వాడు తల మరోవైపు తిప్పుకుంటూ ఆటం బాంబు లాంటి మాటొకటి పేల్చాడు. 
   "...  వాడు... వాడు అంటరానివాడు టీచర్.... " 
    వాడి నోటి నుండి అలాంటి మాట ఊహించని ఆ పంతులమ్మ ఒక్క క్షణం అవాక్కయింది. 
    ఇంత లేత వయసులో వారి మెదడులో ఇలాంటి ఆలోచన పాతుకుపోయిందంటే కేవలం వాడు మాత్రమే దానికి బాధ్యుడు కావడానికి ఆస్కారం లేదని ఆమెకు అనిపించింది. అదే అడిగింది కూడా. 
  " అలా అని నీకెవరు చెప్పారు? " 
  " మా అమ్మానాన్న. వాడు మా ఇంట్లో పశువుల పాక ఊడ్చే రామి గాడి కొడుకు. వాడి తండ్రినీ, వాడినీ మా ఇంట్లో అడుగు పెట్టనివ్వరు.. ఏమంటే వాళ్లను మేం తాకకూడదని చెప్పారు.. ..  "
    వాడు ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు. కానీ వసుంధర మస్తిష్కం మరో కోణంలోకి తిరిగింది. నిజమే! పిల్లల ద్వారా తనోసారి విన్నది, హరి వీళ్ళింట్లో పని చేస్తుంటాడ ట ! వాళ్ళ నాన్నకు వీలుకానప్పుడల్లా గొడ్లను కాయడం, పశువుల పాక శుభ్రం చేయడం, ఇంకా వాళ్లు చెప్పిన బయటి పనులన్నీ చేయడం---- ఇత్యాది పనులన్నీ చేస్తుంటాడట ! అందుకే వాడంటే వంశీకి చిన్నచూపు. హరి క్లాసులో బాగా చదివి మంచి మార్కులు పొందినా, వంశీ మాత్రం అత్తెసరు మార్కులే తెచ్చుకుంటుంటాడు. అయినా వాడిలో హరిపై ఏహ్యభావం పెరుగుతోందే తప్ప తరగడం లేదు. పైగా వాడంటే ఒకింత అసూయ కూడా చోటు చేసుకోవడం మొదలైంది. 
     ఈ పరిస్థితి ఎలా మార్చాలి? వసుంధర ఆలోచనలో పడిపోయింది. సనాతన భావాలతో మలినమైపోయిన వాడి పెద్దల మనస్తత్వాలను మార్చడం తనతరమయ్యే పనికాదు. కనీసం ఉపాధ్యాయినిగా, తన వంతు కర్తవ్యంగా ఆ విద్యార్థి మదిలో అయినా పరివర్తన ఎలా తేగలదు తాను? ఏ అద్భుతమో జరిగితే తప్ప అది సాధ్యపడదు. ఆ రాత్రంతా ఇదే ఆలోచిస్తూ ఉండిపోయింది. 
     ఏమైందో ఏమో గాని, మరుసటి రోజు ఉదయం వంశీ, హరి ఇద్దరూ స్కూలుకు రాలేదు. వసుంధర కూడా అన్యమనస్కంగా ఉండి పట్టించుకోలేదు. 
     ఆ మధ్యాహ్నం వంశీ బెల్లయింతర్వాత బిక్క మొగం వేసుకుని వచ్చాడు. 
    " ఏరా, మళ్లీ లేటా! " యధాలాపంగా అడిగింది వసుంధర. సమాధానంగా వాడి కళ్ళ నిండా నీళ్ళు! ఆమె కలవరపడుతూ వాడిని దగ్గరికి పిలిచి, ప్రశ్నార్థకంగా చూసింది. 
   " టీచర్! హరి హాస్పిటల్లో ఉన్నాడు..... " అంటూ ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం మొదలెట్టాడు. నిటారుగా అయిపోయింది వసుంధర. తెప్పరిల్లింతర్వాత వాడు నిదానంగా వివరించాడు. 
      "... ... నిన్న సాయంత్రం, నేను మా చెల్లి మా పెరట్లో దాగుడు మూతలాట ఆడుకుంటున్నాం. హరి అక్కడే పశువుల పాక శుభ్రం చేస్తున్నాడు. నేవెళ్ళి పాకకు ఆవల గుబురుగా ఉన్న చెట్ల మధ్య దాక్కున్నాను. ఊహించని విధంగా అందులో చుట్టలు చుట్టుకుని ఉన్న ఓ పాము బుస్సున లేచి, నా కాలిపై కాటు వేసింది..... " అంటూ ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు కాసేపు ఆగాడు. అప్పుడు గమనించింది వసుంధర, వాడి ఎడమ కాలి పిక్క మీద కట్టు కట్టబడి ఉన్నది. కొనసాగించాడు వంశీ, 
". ... అక్కడే ఉన్న హరి ఇది గమనించి పరుగున వచ్చి, విల విల లాడి పోతున్న నన్ను కింద పడుకోబెట్టి నా కాలిపై గాటువద్ద తన నోటితో రక్తాన్ని పీల్చి ఉమ్మేయసాగాడు........ "
 అంతే! వసుంధరకు దిగ్భ్రాంతితో నోట మాట రాలేదు. ఆ తర్వాత వంశీ చెప్పేది వినకుండానే ఆమెకు అంతా అవగతమైపోయింది. 
    " టీచర్, నన్ను కాపాడబోయి వాడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లు అంటరాని వాడని క్లాసులో వాడి పక్కన కూర్చోవడానిక్కూడా ఇష్టపడే వాణ్ణి కాదు. కానీ ఈనాడు వాడే నాకు ప్రాణదాత అయ్యాడు... "
     వసుంధర వంశీనే చూస్తోంది. ఏదో ఒక అద్భుతం జరిగితేగానీ వంశీలో మార్పు సాధ్యపడదు అనుకున్నది తను. భగవాన్! ఆ అద్భుతం ఇదా ! 
     " ఇంకెప్పుడూ హరికి దూరంగా కూర్చోను టీచర్, మా అమ్మానాన్న కూడా వాడి దగ్గరుండి వైద్యం చేయిస్తున్నారు.... " 
    ఆర్ద్రత నిండిన వాడి కళ్ళలోపశ్చాత్తాపపు ఛాయలు చూసి, వసుంధర తృప్తిగా నిట్టూర్చింది

*****************************************
యం. ధరిత్రీ దేవి 
మళ్ళీ కలుద్దాం !
*************

Monday, April 13, 2020

మొదలై ఇన్నాళ్లయినా కరోనా వైరస్ సమసి పోవటం అటుంచి మరింతగా విజృంభిస్తోంది. విదేశాల నుంచి మన దాకా పాకిన ఈ మహమ్మారి అంతం కోసం అందరం ఎదురు చూస్తున్నాం. జనజీవనం స్తంభించిపోయి వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా, భీతావహంగా మారిపోయింది. క్లిష్టసమయాన ప్రాణాలు పణంగా పెట్టి వైద్యులు, నర్సులు, రక్షకభటులు ఇంకా పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు గణనీయమైనవి. ఈ సందర్భంగా పరిపాలకులు చేస్తున్న విజ్ఞప్తులు పాటించడం ప్రతి పౌరుడి కనీస కర్తవ్యం. ఎందుకంటే వీరంతా మన రక్షకులు, సంరక్షకులు. వారందరికి జోహార్లు. 

 రక్షకులు
*******
      సంరక్షకులు 
      *********
 వినండి బాబు వినండి పెద్దల మాట
 నడవండి బాబు నడవండి ప్రధానుల బాట 
 వీడండి విద్వేషాల కీచులాట
 కక్షలు కార్పణ్యాలు మనకెందుకంట? 
 పట్టండి ప్రేమానురాగాలు గుప్పిట
 విపత్తు ఎదురైన ఈ పూట 
 వివాదాలు వద్దే వద్దంటా 
 ఎందుకో ఒకింత ఆలకించమంట !

 జగమంతా ఆదమరిచి నిశ్చింతగ నిర్భీతిగా
 నిదురించే వేళల కునుకు మరిచి
 కనులు తెరిచి సరిహద్దుల నిలిచి
 పోరాటం సాగిస్తూ రక్షకుడైనాడు 
 త్యాగధనుడు మన సోదర సైనికుడు!
 ప్రణమిల్లుదాం ఒకపరి మనమందరం!

 నిన్నటిదాకా అనుకున్నాం
 ఈ ఒక్కడే మనకు రక్షకుడని
 మరి నేడు---
 కరోనా రక్కసి కబంధహస్తాల జిక్కి
 తల్లడిల్లుతున్న తరుణాన మేమున్నామంటూ
 కదిలివచ్చి కంటికి రెప్పలైనారు 
 వైద్య నారాయణులు వారి సహాయకులు
 ప్రాణాలు సైతం లెక్కచేయని అపర ధన్వంతరులు 
 నేడు నిరంతరం మన రక్షకులు సంరక్షకులు
 ప్రణమిల్లుదాం ఒకపరి మనమందరం!

 మరోపక్క---
 కన్న బిడ్డల ఆలనాపాలన పక్కకు నెట్టి
 పరుల కోసం ప్రతి క్షణం లాఠీ పట్టి 
 పరుగులు తీస్తూ పరితపిస్తూ
 అనునిత్యం సేవకంకితమంటూ 
 విసుగు పడక విధి పాటిస్తూ మన రక్షకభటులు
 నేడు నిరంతరం మన రక్షకులు సంరక్షకులు
ప్రణమిల్లుదాం ఒకపరి మనమందరం!
ఇంకోవేపు ----
 చెత్తాచెదారం అంటూ చీదరించుకో క
 అశుద్ధం అంటూ ఆమడదూరం
 పారిపోయే మనుషుల కోసం
 స్వీయ రక్షణ సైతం మరిచి
 వీధులన్నీ శుభ్రపరుస్తూ
 అలుపెరుగని సేవకు ఆద్యులు గా నిలుస్తూ
 పారిశుద్ధ్య కార్మికులు!
 నేడు నిరంతరం మన రక్షకులు సంరక్షకులు
 ప్రణమిల్లుదాం ఒకపరి మనమందరం!

 అన్నింటినీ మించి మూలస్తంభం
 సమగ్ర పరిశీలనాదృష్టి సమయస్ఫూర్తి
 సకాలంలో స్పందన పరిపాలనా దక్షత
 కలబోసుకున్న మన ప్రభుత ! 
 నిరంతర మన రక్షణ వ్యవస్థ!
ప్రణమిల్లుదాం ఒకపరి వీరందరికీ మనమందరం!
 అందుకే మరి----
 ఒకింత ఆలకించ మంటూ అంటున్నా
 వినండి బాబు వినండి పెద్దల మాట
 నడవండి బాబు నడవండి ప్రధానుల బాట 
 విపత్తు ఎదురైన ఈ పూట
 వివాదాలు వద్దే వద్దంట
 పట్టండీ ప్రేమ అనురాగాలు గుప్పిట!!

******************************************
 మళ్ళీ కలుద్దాం!
యం. ధరిత్రీ దేవి 
******************************************

Friday, April 10, 2020

నమస్తే, ఈ రోజు post పెట్టేముందు చిన్న మనవి. 5.4.20న ' కుసుమ పరాగం ' కవిత రెండవ లైనులో ' విరులు ' అని కాక ' వీరులు ' అని ప్రచురించబడింది. అచ్చు తప్పుకు క్షంతవ్యురాలిని. ఇక ఈరోజు ఓ కథ. 

ఇదీ దారి...... 

    ఆరాత్రి పక్కలు సర్దుతున్న రాజేశ్వరికి మనసంతా వికలమై పోయింది. తన భర్త ఇంత కఠినంగా మాట్లాడగలడని ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్న తను ఎంత మాత్రము ఊహించలేకపోయింది. ఇంతకీ తను బాధ పడుతున్న దల్లా జ్యోతిర్మయి గురించే. పాపం! ఆ సమయంలో ఆమె మొహం చూస్తే పగవాడికి కూడా గుండెకరగక పోదు. ఛీ ఛీ, ఈయనకు ఏమైందివాల ! అన్యమనస్కంగానే పనులన్నీ ముగించుకుని ఇవతలకు రాబోతుండగా, అప్పుడే బాలసుబ్రహ్మణ్యం, అదే ఆమె భర్త ఎదురు తగిలి, విసురుగా వెళ్ళి పోతున్న ఆమె చేయి పట్టి లాక్కు వచ్చి మంచం మీద బలవంతాన కూర్చోబెట్టాడు. లేవటానికి శత ప్రయత్నిస్తోన్న ఆమె భుజాల్ని వత్తి పెట్టి, " చూడు, నా మనోగతం నా చెల్లెలు జ్యోతిర్మయి కి అర్థం కాలేదంటే అర్థం ఉంది. కానీ భార్య వైయుండి నీవు ఇలా అయిపోతే ఎలా?.... "
     పెదవి విప్పి ఏదో అడ్డుతగుల బోతున్న ఆమెను మరి మాట్లాడనీయకుండా వెంటనే అందుకుని తన ఆలోచనలన్నీ ఏకరువు పెట్టసాగాడు, బాల సుబ్రహ్మణ్యం. 
                              *****
    అవతల పిల్లలిద్దర్నీ చెరో పక్క వేసుకుని పడుకున్న జ్యోతిర్మయి మెదడంతా కుత కుత ఉడికి పోతూ ఉంది. ఇదేమిటి? తన తోడబుట్టిన అన్నేనా ఇలా మాటలనింది? ఈ ఇంట్లో తనతోపాటు కలిసి పెరిగి, కలిసి జీవించి, అన్ని రకాల అనుభవాలు కలిసి పంచుకున్న తనతో అంత నిర్మొహమాటంగా ఎలా మాట్లాడ గలిగాడు? ఎంత కాదనుకున్నా ఆ సాయంత్రం జరిగినదే ఆమె కళ్ళల్లో పదేపదే కదలాడ సాగింది. 
      " జ్యోతి, నీవిలా వచ్చేయడం, నాకెందుకో నచ్చటం లేదమ్మా, " ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కాఫీ తాగుతూ కూతురికి జడ వేస్తున్న జ్యోతిర్మయి నుద్దేశించి బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా మొదలెట్టాడు. ఊహించని మాట ఎదురయ్యేసరికి ఆమెలో చిన్నగా ప్రకంపనం చెలరేగింది. అన్న కళ్ళల్లోకి చూడాలని ప్రయత్నించింది. బాలసుబ్రహ్మణ్యం చెప్పుకు పోయాడు, " నీ భర్త అకాల మరణం పొందటం, నీ భవిష్యత్తు ఇలా శూన్యంగా మారిపోవడం-- నిజమే! ఇవన్నీ జరగకూడని వే! అయినా పెళ్లి అయిన స్త్రీకి భర్త గారిల్లే శాశ్వతమనే మాట నీవు మరచి పోయావు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీ పిల్లల కోసమైనా అన్ని భరించాల్సి ఉంది. కానీ.... ఇలా వచ్చేస్తే, అంతంత మాత్రం జీతాలతో బ్రతుకుతూ ఉన్న నేను రెండు సంసారాల్ని పోషించగలనని ఎలా అనుకున్నావు?....... "
     ' అన్నయ్యా !' పక్కలో పిడుగు పడినట్లు అదిరిపడింది. ఎన్నడూ చూడని, తాను ఎన్నడూ ఎరుగని అన్నను ఈనాడు తను చూస్తోంది. అమ్మ నాన్న తనను ఏ చిన్న మాట అన్నా కూడా వారినే మందలించి, తనని వెనకేసుకొచ్చిన తన అన్నయ్య ఈనాడు ఇలా ఈటెల్లాంటి మాటలతో తన హృదయాన్ని తూట్లు పొడవటానికి వెనుకాడటం లేదు. 
      ఆమె మనసు చదివిన బాలసుబ్రహ్మణ్యం మెల్లిగా తల పంకించి మళ్లీ మొదలెట్టాడు. " ఇలా అని నిన్ను బాధ పెడుతున్నాను అని తెలుసు. కానీ వాస్తవం నీవు తెలుసుకోక తప్పదు. ఓ అన్నగా నీకో చక్కటి సలహా ఇస్తాను. నీవు అర్థం చేసుకొని పాటిస్తే సరి, లేదా నీవు నీ అత్తగారింటికి వెళ్లే ఏర్పాటు చేస్తాను,... "
      జ్యోతిర్మయి రోషంగా తలెత్తింది..... " నీవు మరొకరి మీద ఆధారపడకుండా, నీ జీవితాన్ని చక్క దిద్దుకుంటూ, నీ పిల్లల భవిష్యత్తు నీవే నిర్ణయించటానికి నీకు దారి చూపిస్తాను. ఆగిపోయిన నీ చదువు మళ్ళీ కొనసాగేలా చేస్తాను. నీ కాళ్ళ మీద నీవే నిలబడగల ఆత్మస్థైర్యం నీకు కలిగేలా చేస్తాను.... "
    అయోమయంగా చూసిందామె, ఈ వయసులో, ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత తను చదువుకోవడం........ హు ! అది అయ్యే పనేనా? అన్నయ్య తనను ఎందుకలాహింసించాలని చూస్తున్నాడు? అమ్మానాన్న పోగానే మరిమరీ ఇలా మారిపోవాలా! 
"... ... ఇందుకు నీవు సమ్మతిస్తే కొంతకాలం పాటు ఇక్కడే ఉండవచ్చు. అదీ నీ చదువు పూర్తయ్యే దాకానే, లేదా రేపే నీ అత్తవారింటికి వెళ్ళిపోవచ్చు... " సమాధానం కోసం ఎదురు చూడకుండా, కనీసం ఆమె ముఖంలో భావాలైనా గమనించకుండా బయటకు వెళ్ళిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. 
    ఆ దృశ్యం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆమె కళ్ళనుండి నీరు ధారలుగా కారిపోతోంది. " రేపే నీ అత్త వారి ఇంటికి వెళ్ళిపోవచ్చు" అన్న మాటలే ప్రతిధ్వనిస్తూ ఆమెను కుదురుగా పడుకోనీయకుండా చేయసాగాయి. అటూ ఇటూ ఊగిసలాడుతూ ఏ అర్ధరాత్రి దాటాకో ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చి కంటి మీద కునుకు పట్టింది. 
    మరునాటి ఉదయం ఆమెను వారించడానికి రాజేశ్వరి శతవిధాల ప్రయత్నించింది. కానీ జ్యోతిర్మయి వినలేదు. పిల్లలిద్దరినీ తీసుకుని తన తాలూకు పెట్టే బేడా చేతపట్టుకుని బయటకు నడిచింది. వెళ్లేముందు వెనుదిరిగి అన్నా వదినల్ని ఉద్దేశించి ఒక మాట అన్నది.   
" ఆడపిల్లకు పుట్టిల్లు అన్నది అమ్మానాన్న ఉన్నంతవరకే అని మీరు చాలా చక్కగా నిరూపించారు. చాలా సంతోషం... "  వెక్కిళ్ళు ఆమెను మరి మాట్లాడనీయలేదు. ఆ మాటలు బాలసుబ్రమణ్యం హృదయాన్ని శూలాల్లా తాకినా అతి కష్టం మీద నిభాయించు కున్నాడు. కారణం, అతని దృష్టి అంతా వర్తమానం మీద కాక ఆమె భవిష్యత్తు మీదే కేంద్రీకృతమై ఉండడమే. 
                       **  **  **
    అత్తవారింట్లో జ్యోతిర్మయి జీవనం తిరిగి ప్రారంభమయింది. తెల్లవారుజామున నిద్ర లేవటం తో మొదలైన ఆమె దినచర్య రాత్రి బాగా పొద్దు పోయాక వంటింట్లోనే నడుం వాల్చటంతో ముగిసేది. అత్తామామల కన్నీ అందించటం, ఆడబిడ్డలు, మరుదులకూ వడ్డించడం, వారి పిల్లల ఆలనా పాలనా--- వీటన్నింటితో పాటు ఇంటి పని వంట పని-- క్షణం తీరిక ఉండేది కాదు. ఈ పరుగు పందెంలో మునిగితేలుతున్న ఆమెకు తన పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో, కనీసం బడికి వెళ్తున్నారో లేదో అని చూసుకోవడానికి కూడా సమయం చిక్కేది కాదు. భర్త ఉన్న రోజుల్లోనూ ఈ పనులన్నీ యధావిధిగా నే ఉండేవి. కానీ అప్పుడు తన స్థానం మరోలా ఉండేది. ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి నేనే యజమానురాలిని అన్న భావాలు ఆమెలో గూడుకట్టుకుని ఉండేవి. కానీ ఇప్పుడు భర్త లేని ఆ ఇంట్లో ఆమెకు ఉన్న స్థానం పునాదులు క్రమంగా సడలి పోనారంభించాయి. దినాలు గడిచేకొద్దీ కేవలం ఆ ఇంట్లో అందరికీ వండి వార్చే ఓ పనిమనిషిలా ఆమె మారిపోయింది.
     హఠాత్తుగా ఓ రోజు అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూసుకుంది. భర్త పోయి సంవత్సరం తిరగకముందే తనలో ఇంత మార్పా! ఓ పదేళ్లు పై బడిన దానిలా మారిపోయిన తన రూపం తనను చూసి పరిహసిస్తూ ఉన్నట్లుగా అనిపించింది.
      ఆ రాత్రి వంటింటి గడప మీద తల ఆనించి,
కళ్ళు మూసుకున్న ఆమె మస్తిష్కంలో ఆమె అన్న బాలసుబ్రహ్మణ్యం చాలా రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఆనాడు ఆయనన్న మాటలు ఈటెల్లా అనిపించినా అవి ఎంతో ముందుచూపు తో తన భవిష్యత్తుకు సరైన బాట వేయాలన్న తలంపు తోనే అన్నాడని ఈనాడు తనకు తెలిసి వస్తోంది. ఈవయసులో చదువు తనకు సాధ్యమా అని ఆరోజు ఏవగించుకుంది. కానీ, మనసుంటే మార్గముండదా అని ఈరోజు అనిపిస్తోంది. తన అన్న తనను చదివిస్తాను అన్నాడు. తనకు జీవనాధారం కల్పిస్తానన్నాడు. తన జీవితం తానే జీవించేలా చేస్తానని భరోసా ఇచ్చాడు. కానీ అపార్థం చేసుకుని దూషించి వచ్చేసింది.
     ఇక్కడ! తన స్థానం ఏమిటి? బ్రతుకంతా అందరికీ అన్నీ చేస్తూ, ఎవరికీ ఏమీ కాకుండా, చివరికి అనామకంగా రాలి పోవటమే గా! తనకంటూ ఓ వ్యక్తిత్వం ఆపాదిస్తానన్న కాదనుకుని వచ్చి, ఈ నరకంలో కూరుకుపోయి, తన పిల్లల బ్రతుకు కూడా రేపు మరో నరకంలోకి తోయ పోతోంది. ఇంత కాలంగా ఆమె మనసును కప్పుకున్న మబ్బు తెరలు నెమ్మదిగా విడివడసాగాయి. అంతే! క్రమంగా ఆమె ఆలోచనలు మరో దారిలో పయనించ సాగాయి.
                    ** ** ** **
    తలుపు తెరిచిన బాలసుబ్రహ్మణ్యం జీవచ్ఛవంలా నిలబడ్డ చెల్లెల్ని చూసి, ఒకింత కంగారు పడ్డాడు. కానీ ఆమె కళ్ళల్లో మెరుస్తున్న కాంతిని చూసి, కాస్త నెమ్మదించాడు. గడప లో అడుగు పెట్టిన జ్యోతిర్మయి అన్న చేతుల్లో వాలి పోయి బావురుమంది. ఆమెలో కరుడుగట్టిన భారమంతా తీరేదాకా ఊరుకున్నాడతను.
      " వేళ్ళూనుకుని పాతుకుపోయిన సాంప్రదాయాల్ని కాదనుకుని ముందుకు వచ్చే స్త్రీలు మన సమాజంలో చాలా తక్కువ అమ్మా. కఠినంగా మాట్లాడకపోతే నీ ఆలోచనల్లో మార్పు రావడం అసాధ్యం. అందుకే నేను పాషాణంలా మారి పోవాల్సి వచ్చింది. కానీ ఆ రోజు నుండి ఈ క్షణం దాకా నేను అనుభవించిన ఆత్మ క్షోభ వర్ణించలేను. నా ప్రవర్తనకు భంగపడి నీవెలాంటిఅఘాయిత్యం చేస్తావో అన్న భయం ఒకవైపు, అటు అత్తింట్లో పడే వేదన తో ఏ క్షణం ఏమవుతావో అన్న బెంగతో మరోవైపు తల్లడిల్లి పోతూ అనుక్షణం ప్రత్యక్ష నరకమే అనుభవించాను. చివరకు నా నిరీక్షణ ఫలించి, నేనాశించిన లక్ష్యం చేకూరింది.... " గద్గద స్వరంతో చెల్లెలి తల నిమురుతూ అన్నాడతను.
     ధారలుగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకోవడం కూడా మరిచిపోయి అన్న నే దిగ్భ్రమ గా చూస్తూ ఉండిపోయింది జ్యోతిర్మయి. మోడై పోయిన తన జీవితాన్ని గూర్చి తలపోస్తూ ఎన్నో రాత్రులు మౌనంగా రోదించింది. గతించిన భర్త తాలూకు జ్ఞాపకాలు మనసు అట్టడుగు పొరల్లో పడిపోయినా ఆ స్మృతుల సజీవ రూపాలైన పాప, బాబు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే వారి బంగారు భవిష్యత్తు కూలదోసే హక్కు తనకు ఎక్కడిది అని ప్రతిక్షణం అంతరాత్మ ఎదురు తిరిగేది. భర్త నీడ తొలగి పోగానే నా అనుకున్న వాళ్లే కరువైపోయారు అనుకుని కుమిలిపోయిన తను, తోడబుట్టిన వాడు ఒకడు తన కోసం ఇంతగా పరితపించి పోతున్నాడని ఊహించుకో లేకపోయింది. ఆ క్షణంలోనే ఆమెకు అంతులేని ఆలంబన దొరికినట్లయింది.
       అది మొదలు జ్యోతిర్మయి మరి వెనక్కు తిరిగి చూసే అవసరం రాలేదు. దుమ్ము పట్టి, శిథిలమై పోవడానికి సిద్ధంగా ఉన్న ఆమె స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్టు ఆమె ఆశయానికి నాంది పలికింది. అన్నా వదినలకు ఆదరణతో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అనతికాలంలోనే ఉన్నత విద్యార్హతల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ఒక ఉద్యోగిని. అనుక్షణం అందరికీ భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన అవసరం ఆమెకి క లేదు మరి రాదు.
     ఒకప్పుడు మాసిన చీర తో, రేగిన జుట్టుతో, బోసి నొసలు తో దీనాతిదీనంగా అద్దంలో అగుపించిన ఆమె ప్రతిబింబం ఇప్పుడు కొత్త రూపం సంతరించుకొంది. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలనిపించేంత సమున్నత స్థితికి ఆమె ఎదిగింది. దీనికంతా కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం బాలసుబ్రహ్మణ్యం!
    " నా చెల్లెల్ని  ' పోషించటం' కాదు నేను చేయవలసింది, అంతకంటే ముందుగా నేర్పించాల్సింది ఆమె' జీవించటం' జీవించడం ఎలాగో నేర్పించితే ఆమే పదిమందిని పోషించగలదు. మార్గం చూపడం వరకే నా బాధ్యత. ఆ మార్గం గుండా నడిచి వెళ్లడం ఆమె కర్తవ్యం. అందుకు ఇదే సరైన దారి. "
    ఇవీ ఆనాడు అతను అందరితో అన్న మాటలు. అందుకు చెల్లెలు తో పాటు అతను అనుభవించిన తీవ్ర మనోవేదన అంతులేనిది. కానీ ఒక శాశ్వత పరిష్కారం కోసం అది సబబే అన్నది అతని నిశ్చితాభిప్రాయం. అప్పుడు ఇంటాబయటా నిరసనలు ఎదుర్కొన్న అతనే ఇప్పుడు వారి చేతనే నీరాజనాలందుకుంటున్నాడు. దటీజ్ బాల సుబ్రహ్మణ్యం! 
  " ఇప్పుడేమంటావ్ రాజేశ్వరీ.... నేను చేసింది తప్పంటావా, ఒప్పంటావా? " భార్యను తదేకంగా చూస్తూ ప్రశ్నించాడు బాలసుబ్రహ్మణ్యం ఓ రోజు రాత్రి, జ్యోతిర్మయి జీవితంలో పూర్తిగా స్థిరపడ్డాక. భర్తను ఆరాధనగా చూడటం మినహా మరేమీ బదులు చెప్పలేదా ఇల్లాలు. కానీ, ఓ స్త్రీగా ఆమెకు తెలుసు, తన ఆడపడుచు పడ్డ మనోవేదన, ఆమె దీక్ష, సాధన చివరికి ఆమె గమ్యం చేరిన వైనం--- అన్నీను ! వీటన్నింటికీ చేయూత తన భర్తే అనుకుంటే ఆమె పెదాలపై గర్వ రేఖ!
                *** *** ** ** 
    కాలచక్రం నిర్విరామంగా పరిభ్రమిస్తూనేఉంది. ఆగమనంలో జ్యోతిర్మయి బతుకు బండి గతుకుల మాట గట్టెక్కి చక్కటి దారిలో ప్రవేశించింది. అప్పుడు ఒకనాటి రాత్రి తన ఇంటిలో ఆదమరచి నిద్రపోతున్న పిల్లలిద్దరినీ సంతృప్తిగా చూసుకుంటూ, మనశ్శాంతి తో నిట్టూర్పు విడుస్తూ అనుకుంది జ్యోతిర్మయి, " భగవాన్! నీవు ఉన్నావో లేవో అని కొందరికి అనుమానం. కానీ నాలాంటి అభాగినులకు దారి చూపే నా అన్న లాంటివాళ్ళల్లో నిత్యం నీవు కొలువుంటావని ఎందరికి తెలుస్తుంది..... " 

*****************************************
మళ్ళీ కలుద్దాం 
యం. ధరిత్రీ దేవి 
****************

Monday, April 6, 2020

అవనిలో వనిత

ఈ భువిలో స్త్రీ పాత్ర బహు గణనీయమైనది, ఎంతో ప్రాధాన్యత గలిగినది. ఇంటా బయటా ఆమె పనులు చక్కబెడుతున్న తీరు చూస్తే ఎవరికైనా అవగతమౌతుందీ విషయం. వనిత, మగువ, అతివ, ఆడది ---ఇత్యాది ఎన్నో పేర్లతో పిలువబడుతున్న స్త్రీ మూర్తికి తగిన గౌరవం ఎంతవరకు దక్కుతోంది? ప్రశ్నార్థకమే !
    
ప్రతీ ఇంటా.... ప్రతీ చోట.... 
 ----------------------------------
    అప్పుడు ఉదయం ఏడు గంటలు. ప్రమద నిద్ర లేచి రెండు గంటలయింది. అలవాటైన ప్రాణం, అలారం అవసరం లేకుండానే మెదడు ఠక్కున లేవగొడుతుంది మరి ! ఈ రెండు గంటల్లో తను చేసే పనులు ఒకటా రెండా, లెక్కపెట్టలేనన్ని!
    ఓ గంట వ్యవధిలో--- ఇల్లు ఊడవటాలు, వంటావార్పు చూడటాలు, మరోవైపు దంతధావనం వగైరా వగైరా---- ఊపిరి పీల్చుకోవడానికి కూడా తెరిపి లేకుండా అటు ఇటూ అష్టావధానం చేస్తూ పనులన్నీ ఒంటి చేత్తో నే ఒక కొలిక్కి తీసుకొచ్చి ' అమ్మయ్య' అంటూ నిట్టూర్పు విడిచేసరికి --- తీరిగ్గా అప్పుడు ఇంట్లో మిగతా జీవుల అలికిడి, దాంతోపాటు అలజడి ప్రారంభం! 
      ఇంకా నిద్ర మత్తు వీడని పిల్లల్ని బరబరా లాక్కొచ్చి బాత్రూం వైపు తరిమింది ప్రమద. శ్రీవారి సంగతి సరేసరి! ఆయన గారు లేచాక న్యూస్ పేపర్ అంతా కంఠతా పెట్టాక గాని, పిడుగులు పడినా సరే నిత్యకృత్యాల్లోకి దిగరు. 
       ముగ్గురు పిల్లల్ని( ఆయనతో కలిపి) సిద్ధం చేసాక, మధ్యాహ్నానికి క్యారియర్లు నలుగురికీ సర్ది, టేబుల్ మీద టిఫిన్ తో పాటు ప్లేట్లు పెట్టేసి, అప్పుడు స్నానానికి బయలు దేరింది, ప్రమద. మరుసటిరోజు వంటకు కావలసిన వన్నీ, ఇంకా కట్టుకోవలసిన చీర తో పాటు ముందు  రోజు రాత్రే సిద్ధం చేసుకోవడం ఆమె పాటించే ముందు జాగ్రత్త చర్యల్లో అతి ముఖ్యమైనవి. కాసింత ముందుచూపుతో, ఇంకా చెప్పాలంటే మునుపు ఎదుర్కొన్న చిరు చేదు అనుభవాలతో ఆమెకు అలవడిన ఓ అద్భుతమైన అలవాటు అది. దీనికి తోడు ఆమె గురుతర బాధ్యతల్లో భాగంగా అంతా ఆదమరిచి నిద్రపోయాక, మరుసటి రోజు పాఠాల 'ప్రిపరేషన్ ' కార్యక్రమం షరా మామూలే!
      మొత్తానికి ఎనిమిదిన్నరకల్లా రెడీ అయిపోయి, మొక్కుబడిగా దేవుడికో దండం పెట్టేసుకుని, నలుగురు బయటపడి, బండి మీద బయలుదేరాక ఒక క్షణం గాఢంగా ఊపిరి తీసుకుందిప్రమద. ఎలాగైతేనేం, పిల్లల్ని స్కూల్ గేట్ వద్ద, ప్రమదను ఆటోవద్ద దింపేసి, హడావుడిగా తన ఆఫీసు వేపు బండి ఉరికించాడతను. వారిద్దరూ పనిచేసే కార్యాలయం, స్కూలు చెరో దిక్కుకు ఉన్నాయి మరి ! గబగబా ఆటో లో దూరి కూర్చున్నప్రమద ఒక్కసారి వాచీ చూసుకుంది. ఐదు నిమిషాలు! బాప్ రే ! 
       స్కూల్ గేట్ వద్ద చెంగున దూకి, పరుగులాంటి నడకతో పడుతూ, లేస్తూ వెళ్లేసరికి ' జన గణ మన' చివరలో ఉంది. ' ఈ రోజుకి బ్రతికి పోయా', అనుకుంటూ వెనగ్గా వెళ్లి, కొలీగ్స్ పక్కన చేరి, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ, సాయంత్రం వరకు మరో పాత్ర నిర్వహణకు సమాయత్తం అయిపోయిందా ఇంతి, కాదు కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి! అలా ఎందుకంటారా? 
     ఇంటి నిర్వహణలో, ఇంటిల్లిపాదీ సంరక్షణలో, పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే ఓ సమర్థురాలైన మంత్రిణిగా, గడప దాటి మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ, అబ్బురపరిచే ఉద్యోగినిగా--- ఇంటా బయటా సమస్తం చక్కబెడుతూ, ఇంతా చేస్తూ, అంతా భరిస్తూన్నా --- ప్రశాంత జీవనదిలా సాగే ప్రతి మగువా అది కాక మరేమిటి? నిజమా, కాదా !

*****************************************
మళ్ళీ కలుద్దాం 
యం. ధరిత్రీ దేవి 
*******

Sunday, April 5, 2020

నమస్తే, మొన్నటి దినం నా మొదటి టపా లో ప్రస్తావించిన ' కరోనా కలకలం ' వల్ల కలిగిన వ్యాకులత రవంత తొలగించి మనసుకు కాస్త ఆహ్లాదాన్ని కలిగించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ కుసుమపరాగం.
 కుసుమపరాగం
🌺🌺🌺🌺🌺🌺
 నా ఇంటి ముంగిట విరిసిందో అందాల బృందావనం
 ఆవని లో వీరులు చేసే నిశ్శబ్ద కోలాహలం
 ప్రతినిత్యం ఆమనియే నా ముందు ప్రత్యక్షం!
 తెలతెలవారుతుండగా ఉషాకిరణాల మెరిసి
 తుషార బిందువుల తడిసి పూలన్నీ ప్రతిదినం
 పలుకుతాయి నాకు శుభోదయం
 మున్ముందుగా ----
 ముద్దులొలికే ముద్ద మందారాల సోయగాలు
 మురిపిస్తూ నన్నలరించే సుస్వరాలు

గుభాళించే రంగురంగుల గులాబీ బాలలు
 గుసగుసలాడి చెబుతున్నాయెన్నెన్నో ఊసులు

 విరబూసిన సన్నజాజులు విరజిమ్మే పరిమళాలు
 వెన్నెల్లో సడిసేయని సన్నాయి రాగాలు

 ఎరుపు పసుపు మేళవించిన ముద్దబంతులు
 ముద్దుగుమ్మలకివియే కదా ఇష్ట సఖులు!

 నవ్య కాంతుల శ్వేత వర్ణ నందివర్ధనాలు
 పూజకు వేళాయెనంటూ చేస్తాయి సైగలు!

 ప్రకృతి ప్రసాదిత వరాలీ పుష్పాలు
 ఏ ప్రయోగశాల సృష్టింప జాలని అద్భుతాలు
 సరితూగలేవు ఏ వజ్రవైడూర్యాలు
 సకల సంపదల కివి నిధి నిక్షేపాలు!
 అదిగో----
 ఆ నిధులన్నీ నా ముంగిట కొలువుదీరి
 తెలతెలవారుతుండగా ఉషాకిరణాల మెరిసి
 తుషార బిందువుల తడిసి ఒకపరి నన్ను గాంచి 
 పలుకుతున్నాయి చూడు నాకు శుభోదయం!!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

మళ్ళీ కలుద్దాం 
యం. ధరిత్రీ దేవి 

Friday, April 3, 2020

కరోనా కలకలం 

      యావత్ప్రపంచాన్నీ గడగడలాడిస్తూ భీతావహుల్ని చేసేసిన ' కరోనా ' మహమ్మారి విశృంఖలంగా ప్రబలిన సమయాన నా మొదటి బ్లాగు రాయడం ఒకింత బాధను కలిగిస్తున్నా ' పెరుగుట విరుగుట కొరకేలే ' అన్న సానుకూల ధోరణితో మొదలెడుతున్నా. 
      ప్రస్తుతం ఈ కరోనా కలకలం అంతాఇంతా కాదు. ఎనభై నుండి తొంభై సంవత్సరాల వృద్దులు కూడా ఇలాంటి వైనం కనీవినీ ఎరగం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. చెప్పాలంటే ఈ వైరస్ ఉదంతం బహుశా ఇదే ప్రథమమేమో కూడా ! 
      రోజుల వ్యవధిలో అనూహ్యంగా ఇంతగా ప్రబలిపోయిన ఈ మహమ్మారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతవరకుIT కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తారంటే ఓహో అనుకున్నాము. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో చేసేవాళ్లు కూడా ఇంటి నుండి పనులు నిర్వహించే రోజులొస్తాయని ఊహించామా ఎన్నడైనా? 
        పిల్లలకు బడులు బంద్, పరీక్షలు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు. పండగలు పబ్బాల మాట అసలే లేదు. సరదాగా కబుర్లు చెబుతూ కూర్చుందామా, ససేమిరా వీల్లేదంటున్నారు. బయటికెక్కడికెళ్ళినా బారెడు దూరంలో అదీ ముక్కుకూ మూతికీ మాస్క్ తగిలించుకుని నిలబడాలంటున్నారు. కూరగాయలు, సరుకులు, పండ్లు అన్నీ బంద్ !ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. దీనికి తోడు వదంతులు !అవి తినొద్దు ఇవి తినొద్దు అంటూ. ఇప్పట్లో ఇది అంతం అయిపోయేది కాదు కొన్ని నెలలు లేదా ఇంకా ఎక్కువ పట్టినా పట్టొచ్చు అంటూ. TV ఆన్ చేస్తే చాలు కరోనా కరోనా కరోనా !ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకోవడం అవసరమైనా ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోనని హడలెత్తిపోతున్నారు జనం. ఇక పిల్లలు ఏ అమెరికా లాంటి ఇతర దేశాల్లో ఉన్నవాళ్లయితే వాళ్ళ క్షేమం గురించిన ఆందోళన !వాళ్ళకేమో ఇక్కడి వాళ్ళ గురించి టెన్షన్ !ఎక్కడివారక్కడ నిలిచిపోయి మొత్తం ప్రపంచమే స్తంభించి పోయిందిమరి !
     సరే! దీనివల్ల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కాసేపు పక్కన పెట్టి, దీని మరో కోణాన్ని వీక్షిద్దాం. ఈ గందరగోళ పరిస్థితిలో మనమంతా గమనించడం లేదు గానీ కాస్త లోతుగా ఆలోచిస్తే' మహమ్మారి' అంటున్నాం గానీ ఈ కరోనా మానవాళికి చేస్తున్న మంచి కూడా ఏదో అంతర్లీనంగా ఉన్నట్లు అనిపిస్తోందే, అన్న సందేహం రాక మానదు. ఎలాగంటే కోపగించక కాస్త చదవండి మరి!
    అదేమిటంటే-- ఎన్నడూ ఊహించని మంచి అలవాట్లు మనకు తెలియకుండానే మన సొంత మవుతున్నాయి! అందులో మొట్టమొదటిది---
 శుభ్రత  : ఇదివరకు బయటికి వెళ్లి వస్తే బరబరా వెళ్లి కాళ్ల మీద కాసిని నీళ్ళు గుమ్మరించుకొని, తినడానికి కూర్చునే వాళ్లంతా ఇప్పుడు కాళ్లతో పాటు ముఖం, చేతులు సబ్బుతో అదీ మోచేతుల దాకా శుభ్రపరుచుకుని గానీ భోజనానికి ఉపక్రమించడం లేదు. అంతేకాదు, వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు ఇల్లు ఇంటి చుట్టూ అంతా శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇది మంచి అలవాటే కదా!
 తరువాత పొదుపు  : నిత్యావసరాలైన సరుకులు, కూరగాయలు, దుబారా చేయడం తగ్గింది. ఈ' లాక్ డౌన్ ' వల్ల బయటికి వెళ్ళే దారులు మూసుకుపోయి బయటికి ఖర్చులన్నీ తగ్గి' సేవింగ్స్' పెరిగింది.
 ఆరోగ్యం  : పనివాళ్ళ మీద ఆధారపడడం మాని సొంతంగా చేసుకోవడం వల్ల కెలొరీలు ఖర్చయి ఆరోగ్యం చేకూరింది.
 కాలుష్యం తగ్గుదల  : ఈ రోజు పేపర్లో చదివిన ఓ తాజా వార్త ప్రకారం, రోడ్లపై కాలుష్యం శాతం బాగా తగ్గిపోయింది అట!
 అందరూ బాగుండాలి  : ముఖ్యంగా ఈ ధోరణి బాగా పెరిగిపోయి నట్లు అనిపిస్తోంది. చుట్టుపక్కలంతా బాగుంటేనే నేనూ బాగుంటాను అన్న స్వార్థ చింతన ఇందులో నిబిడీకృతమై ఉందండోయ్! 
 ఇవీ నాకు తోచిన కొన్ని! ఈ మంచి అలవాట్లు అలాగే కొనసాగితే అంతకంటే కావలసింది ఏముంది! కానీ వైరస్ మాయం అవగానే ఇవీ మాయమవుతాయో  ఏమో చెప్పలేం మరి !!
 ఈరోజుకి ఉంటాను మరి!
యం. ధరిత్రీ దేవి, కర్నూలు 
03.04.2020
శుక్రవారం