Monday, October 30, 2023

ఏదీ? ఎక్కడ? మరో సూర్యకాంతం? !

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

 పైకి తిడుతూ... 
లోన స్వాగతించే జనాలు...
ఆమె రాక ఎప్పుడెప్పుడంటూ 
ఎదురుచూసే క్షణాలు!
ఆమెకోసమే సినిమా దారి పట్టే 
అలనాటి రోజులు !!
ఎవరు? ఎవరామె? 
ఇంకెవరు? సూర్యకాంతం...!
చలనచిత్ర కళామతల్లికి అందిన వరం... 
ఎన్టీఆర్ కయినా..ఏన్నార్ కయినా... 
ఎస్వీఆర్ కయినా...ఎదురొడ్డి..
సవాల్ విసిరి నిలిచిన నట శిరోమణి...!
హీరోలకు..హీరోయిన్లకు...అమ్మ... 
కోడళ్లను జడిపించే జగడాలమారి అత్తమ్మ... 
రేలంగి..రమణారెడ్డి లను 
ఓ ఆట ఆడుకున్న భార్యామణి... 
పద్మనాభం...రాజబాబులకు 
చుక్కలు చూపించిన మహాతల్లి !!
విలన్లను సైతం హడలెత్తించిన 'విల్లీ '!
ఇదంతా...తెర మీద...
ఆ తెర తీస్తే...ఆ వెనుక... 
ఆమె ఓ బంగారు తల్లి...!
మనసు వెన్న...మాట సున్నితం.. 
తనది కాని స్వభావం... 
పాత్రల్లో పరకాయ ప్రవేశం... 
అచ్చెరువొందించే ఆ గడసరితనం !
మరువగలరా ఆనాటి తరం జనం !!
ఆమె ధరించిన పాత్రలు సజీవం...
ఆ చిత్రాలకు లేదు అపజయం...  
ఆమె కీర్తి అజరామరం....
ఆమె గయ్యాళి గంగమ్మ... 
ఎవరూ పోషించ సాహసించని 'గుండమ్మ' !!
సాహసించినా...మెప్పించడమెవరితరమమ్మ !
దశాబ్దాలు వెండితెరపై వెలిగిపోయిన 
ఘనత నీదమ్మ 'కాంతమ్మ...!'
దశాబ్దాలు దాటినా వెలిసిపోని..వాడిపోని... 
వన్నె తరగని...మరువలేని చరిత నీదే గదమ్మ !!
ఆనాటి నాయికలకందింది ప్రత్యామ్నాయం...
కానీ...ఏదీ ? ఎక్కడ ? ఎక్కడ ? 
మరో 'సూర్యకాంతం'...? !!
భర్తీ అవలేదే ఇప్పటిదాకా ఆమె స్థానం...!!

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

                                              ~~ యం. ధరిత్రీ దేవి ~~
             
                                       



Tuesday, October 24, 2023

శుభోదయం

🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀

                                             ~~ యం. ధరిత్రీ దేవి ~~



ఇంటిముంగిట ముచ్చటగా పచ్చదనం... 
ఇల్లాలికదే చిన్ని  బృందావనం....
అదో అంతులేని మానసికానందం....
ఆ గాలి సోకితే చాలు...
అందరికీ చక్కటి  ఆరోగ్యం...
అంతా వైద్యులకు  కడుదూరం...
అందుకే ...మనమందరం...
పచ్చదనానికి పలుకుదాం
ప్రతీ  ఉదయం  శుభోదయం...🐦

🍀🌱🌿🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲




Monday, October 16, 2023

నా ఆశాదీపం...

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦


నా రాతలు... 
నాలో మెదిలే భావాలు !
నా ఆలోచనల ప్రతిరూపాలు !
అందులో కొన్ని....
స్వానుభవాల సజీవ సాక్ష్యాలు !
మరికొన్ని కాల్పనిక అల్లికలు...
ఆహ్లాదంలో...
సంతోష తరంగాలుగా...  
ఆవేదనలో...
కన్నీటి కెరటాలుగా... 
ఉవ్వెత్తున ఎగిసిపడే ఉప్పెనలు !
అవి కవితలు కావు...
కమ్మని భావవీచికలు...
నిరంతర ప్రవాహాలు !
నేనవ్వితే ఆనందబాష్పాలై...
ఏడిస్తే విషాద గీతాలై...
కాగితాలపై అక్షరాలై... 
ఆపై...అన్నీ..అవన్నీ...
నిక్షిప్తమై నిలిచిపోతాయి 
హృదయఫలకంపై...
నా కలం నా తోడై 
నన్నూరడిస్తుంది ప్రతీక్షణం... 
నాతో నడుస్తూ 
భుజం తడుతుంది అనుక్షణం !!
జీవితం అంటే... కన్నీటి చారికలేనా !
శోధించు... చూడగలవు నిధినిక్షేపాలు !!
మైమరపించే కొత్త బంగారులోకాలు !
అంటూ  నా సృజన..   
అందిస్తుంది స్నేహ హస్తం...
అది నా ఆశాదీపం !!🙂
నా జీవనయానంలో అదో భాగం !!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦




Thursday, October 12, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..19..తొలిసారి అచ్చులో నా రచన...

  ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


    
    ఇంటర్ లో చేరినపుడు మాకాలేజిలో అన్నీ అరకొర సౌకర్యాలే... ఆసంవత్సరమే ఇంటర్మీడియట్ కోర్స్ ప్రవేశపెట్టడం  వల్ల, అమ్మాయిలకు ప్రత్యేకించి వెయిటింగ్ రూమ్ అన్నది లేకపోవడం వల్ల హైస్కూల్ లైబ్రరీ లోనే కూర్చోబెట్టేవారు యాజమాన్యం వారు. కొత్త కోర్స్ కాబట్టి, ఇంకా బుక్స్ అన్నీ రాలేదు. అన్ని సబ్జక్ట్స్ కు లెక్చరర్స్ కూడా నియమింపబడలేదు. అందుకని ఖాళీ సమయం చాలా ఉండేది.ఇంకేముంది..! ఎటు చూసినా పుస్తకాలే..! రకరకాలైనవి... అంతవరకూ చందమామ,  బాలమిత్ర కథలకే పరిమితమైన నేను మెల్లిగా ఆ పుస్తకాలు తెరవడం మొదలైంది. విశ్వనాథ సత్యనారాయణ, చలం.. అలాంటి వారివే కాదు. అప్పట్లో బాగా పాపులర్ అయిన రచయితలు, రచయిత్రుల కథలు, నవలలు కూడా కోకొల్లలుగా అందుబాటులో ఉండేవి.వాటిల్లో  యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు.... ఆ శైలి, కథనం, పాత్రల వర్ణనలు.. బాగా ఆకట్టుకునేవి. తర్వాతి  రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తిగారల రచనలు ఎక్కువగా చదవడం జరిగింది. అవన్నీ చదవడంవల్లనేమో... ఏదైనా ఆలోచన తడితే, కాగితంపై మెల్లిగా రాస్తూ ఉండేదాన్ని. అయితే ఎవరికీ చూపించేదాన్ని కాదు. కొన్నాళ్లు గడిచాక, చింపేసేదాన్ని.  

 

ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాక, నిద్రాణమైఉన్న ఆ సృజన మెల్లి మెల్లిగా స్పందించడం మొదలై చిన్న చిన్న కవితల్లాంటివి రాసి, పిల్లల చేత చదివించడం చేసేదాన్ని. అలా రోజులు గడుస్తూ ఉండగా... 'మయూరి' పేరుతో ఓ సచిత్ర వార పత్రిక కొత్తగా పబ్లిష్ అవడం మొదలైంది. అందులో సంపాదకులు ఓ కొత్త శీర్షిక పెట్టారు." పాఠకుల కథలు"... దాని పేరు. అంటే, బాగా పేరున్న, చేయి తిరిగిన రైటర్సే కాదు... చదివే అలవాటున్న పాఠకులు కూడా కథలు రాసి పంపొచ్చు. ప్రతీవారం ఓ టైటిల్ ఇస్తారు. దానికి తగినట్లు అరఠావు మించకుండా కథ రాసి పంపాలన్నమాట..! వాటిల్లో బాగున్న వాటిని ప్రచురిస్తామని ప్రకటన వెలువడింది. 
  అది చూడగానే, ఒక్కసారి ఎలాగైనా సరే, నేను రాసింది అచ్చులో చూసుకోవాలన్న కోరిక మొదలైంది నాలో. అనుకున్నదే  తడవుగా, కాగితం,  కలం పుచ్చుకుని రాసి పంపాను. పబ్లిష్ అవ్వలేదు. రెండో  వారం మరో టైటిల్ ఇచ్చారు.ముందే అనుకున్నట్లుగా మళ్ళీ రాసి పంపాను. అంతే..! పబ్లిష్ అయిపోయింది. ఎన్నోసార్లు ప్రయత్నించాల్సివస్తుందనుకున్న నాకు రెండోసారే  ప్రయత్నం ఫలించడం ! చాలా సంతోషమేసింది. మొదటిసారి.. అచ్చులో నా ఆలోచనలు...నా రాతలు...నా పేరు..! ఆ కథే ఇది...'ప్రయాణం'...పైన ఫొటోలో ఉన్నది...చాలా సంవత్సరాలు అయినందుకు సరిగ్గా కనిపించడం లేదు...చిన్న కథే ! అదీ..పాఠకుల కథ ! అయినా..ఏదో ఆనందం ! సంబరం ! అన్నట్లు దానికి 20/- రూపాయలు పారితోషికం కూడా అందింది 🙂.
  సరే.. పబ్లిష్ అయిందిగా ఒకసారి.. ఇక చాలు అనుకున్నా. కానీ..అప్రయత్నంగానే మళ్లీ రెండు మూడు ఆర్టికిల్స్ రాయడం, అవీ అచ్చవడం జరిగిపోయింది. అలా  మొదలైన ప్రయాణం అడపాదడపా మెల్లిగా కదులుతూ సాగుతూ పోయింది. అప్పట్లో 'వనితాజ్యోతి' అని మహిళల మాసపత్రిక వెలువడేది. అలాగే కర్నూల్ నుండి 'ఉజ్వల' అని ఓ దినపత్రిక కూడా వచ్చేది. వాటికి తీరిక సమయాల్లో రాసి, అప్పుడప్పుడు పంపించేదాన్ని.రాయాలనుకున్నప్పుడు,రాసేటప్పుడు, వాటిని పంపించాక...ఏదో తెలియని తృప్తి కలిగేది. వాటిని అచ్చులో  చూసుకున్నప్పుడు.. పరవాలేదు... నేను రాసినవి కూడా మ్యాగజైన్స్ లో వస్తున్నాయోచ్ అనిపించేది...చిన్న చిన్న రచనలే. కానీ...కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఉండేవి నా ఫీలింగ్స్!కొంతకాలం  గడిచాక ఆంధ్రభూమి వార్తాపత్రిక లోనూ కొన్ని రచనలు పబ్లిష్ అయ్యాయి. అలాగే... చిన్నప్పటినుంచీ నాకెంతో ఇష్టమైన బాలమిత్ర పిల్లల మాస పత్రికలో కూడా...
    బ్లాగులో రాయడం మొదలెట్టేవరకూ అలా మ్యాగజైన్స్ లో పబ్లిష్ అయినవి వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినవే. కానీ, బ్లాగ్ మొదలెట్టాక ఆ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పుడు బయట మ్యాగజైన్స్ రావడం బాగా తగ్గిపోయింది. పైగా...అన్ని ఆలోచనల్ని వాటిల్లో పెట్టడానికి అది సరైన వేదిక కూడా కాదు.ఒక్క బ్లాగింగ్ లోనే అది సాధ్యం. రాయాలన్న తపన, ఉత్సుకత ఉన్నవాళ్లకు బ్లాగ్ ఓ వరమనే చెప్పాలి. ఈ సందర్భంగా బ్లాగ్ అగ్రిగేటర్స్ మాలిక, శోధిని లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి...ఓ ఇష్టమైన వ్యాపకం మనిషికి మానసికంగా ఎంతో బలాన్నిస్తుంది ఖచ్చితంగా... అంతేకాదు...సంతోషాన్ని,సంతృప్తినీ తద్వారా,శారీరక ఆరోగ్యాన్నీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.జీవనయానంలో ఇలాంటి చిన్నచిన్న ఇష్టాలు, వ్యాపకాలు కూడా ఓ భాగమేగా. అందుకే నలుగురితో పంచుకోవాలనిపించింది.  

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

                             
    






Wednesday, October 11, 2023

' టెంట్ ' సినిమా --- ఓ జ్ఞాపకం

   కొన్ని జ్ఞాపకాలు ఎంత వద్దనుకున్నా మదిలోంచి తొలగిపోవు. మరీ ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలు. వాటిల్లోంచి ఒకటి  ----

     నేను హైస్కూల్లో చదివే రోజుల్లో మేముండే  చిన్న పట్టణంలో ఓ ' టెంట్ ' ( డేరా ) సినిమా హాల్ ఉండేది. చిన్న పట్టణమన్నానుగానీ, అంతా పల్లె  వాతావరణమే అక్కడ ఉండేది. టెంట్ సినిమా  అంటే ఆ తరం వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. చుట్టూ డేరా బాగా ఎత్తుగా కట్టేస్తారు.  బయట ఉన్న వాళ్ళకి లోపల ఆడే సినిమా అస్సలు కనిపించదు. లోపల ముందు భాగాన తెర, వెనక భాగాన ప్రొజెక్టర్ రూము ఉంటాయి. కిందంతా కూర్చోవడానికి వీలుగా ఇసుక నింపబడి ఉంటుంది. ఇలాంటివి అప్పట్లో ప్రతీ చిన్న పట్టణాల్లో ఒకటి, రెండూ ఉంటూ ఉండేవి. చిన్నా, పెద్ద అందరికీ అవే పెద్ద కాలక్షేపం! 
      పెద్ద పెద్ద పట్టణాలలో విడుదలైన సినిమాలు అక్కడ ఆడి, బాగా పాతబడ్డాక చిన్న ఊర్లకు వచ్చేవి. అప్పటికే ఆ సినిమా కథ, సన్నివేశాలు, నటీనటులు కరతలామలకం అయిపోయుండేవి. పాటలు  సరేసరి! సుపరిచితం అయిపోయేవి.
 కొందరు ఔత్సాహికులు రాగం తప్పకుండా పాడేసేవారు కూడా ! అయినా మా ఆనందం వర్ణనాతీతం. పాత సినిమా అయితేనేమి, మాకు కొత్తే కదా అనుకుంటూ ఎంతో ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళం. సినిమా ప్రచారం భలే ఉండేది. ఓ  జట్కాబండికి రెండు వైపులా సినిమా పోస్టర్లు అంటించి, వీధి వీధి తిరుగుతూ మైకులో అరుస్తూ అందరికీ  తెలియజేసేవారు. అక్కడక్కడ ఆగుతూ, ఆ సినిమాకు సంబంధించిన కరపత్రాలు బండి  చుట్టూ మూగే  పిల్లలకు పంచిపెట్టేవారు. అందులో టూకీగా సినిమా కథ, నటీనటుల వివరాలు ఉండేవి. ఇప్పుడు మీడియా అనూహ్యమైన రీతిలో విస్తరించి పోయి అలాంటి పబ్లిసిటీ అంతరించిపోయింది.
     మా పిన్ని గారి అమ్మాయిలు, చుట్టుపక్కల వాళ్ళు, అప్పుడప్పుడూ క్లాస్మేట్స్ కలిసి వెళుతూ ఉండేవాళ్ళం. వెళ్లేప్పుడు పాత దుప్పటి లాంటిది పట్టు వెళ్ళేవాళ్ళం కింద పరుచుకుని  కూర్చోవడానికి!ఇంటినుండి పదిహేను, ఇరవై నిమిషాల నడక . సినిమా వేయడం మొదలెట్టే ముందు' రెగ్యులర్'గా ఓ పాట వేసేవారు. ఆ పాట వినగానే టెన్షన్ తో పరుగో పరుగు, ఎక్కడ స్టార్టింగ్ మిస్సవుతామేమో అని !  టికెట్ ధర 28 పైసలు ఉండేది. వెనకవైపు రెండు మూడు బెంచీలుండేవి. అక్కడ కూర్చోవాలంటే 40 పైసల టికెట్ తీసుకోవాలన్నమాట !
     మామూలుగా సినిమాకు ఒకే  ఇంటర్వెల్ ఉంటుందికదా,  కానీ ఈ టెంట్  సినిమాకు నాలుగైదు ఇన్ ట్రవెల్స్ ఉండేవి.1, 2 రీల్స్ అవగానే ఓ ఇంట్రవెల్! అలా ఉండేది. అలా ఇంటర్వెల్  రాగానే అందరం కాస్త రిలాక్స్ అయ్యేవాళ్ళం, పైన ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు చూస్తూ ! ఈలోగా జరిగిన దాని మీద, జరగబోయే దాని మీద డిస్కషన్స్! మళ్లీ మొదలవగానే ఠక్కున సర్దుక్కూర్చుని కథలో లీనమై పోయే వాళ్ళం. అప్పట్లో అదో అనిర్వచనీయమైన ఆనందం, అనుభూతి మా అందరికీ! 
    ఓసారి అలాగే వెళ్లి కూర్చున్నాం. సినిమా మొదలైంది. అరగంట గడిచీ  గడవకముందే టపటప మంటూ చినుకులు రాలడం మొదలయింది. "ఆ, ఏముందిలే తగ్గి పోతుంది"అనుకున్నాం. అలాగే తలపై చేతులు ఉంచుకుని చూస్తూ ఉన్నాం. కానీ ఉండేకొద్దీ వాన కాస్తా పెద్దదై పోయింది. అయినా ఆశ చావక అలాగే తడుస్తూ చూస్తూ ఉండిపోయాం. కానీ, ఠక్కున సినిమా ఆగిపోయింది. ఓ నిమిషం చూశాం, మళ్ళీ  వేస్తాడేమో  అని! వర్షం ఉధృతి  ఎక్కువైపోయి లాభం లేదనుకుని జనాలంతా లేచి, పొలోమంటూ బయటికి పరుగులు తీశారు. వాళ్లతో పాటు మేమూ. ఆ రాత్రి వేళ, ఆ వర్షంలో, ఆ బురదలో ఇంటికి ఎలా వచ్చి పడ్డామో  ఆ దేవుడికెరుక !
      అలా మొదట్లోనే సినిమా ఆగిపోతే మరుసటిరోజు ఫ్రీగా చూపించేవాళ్ళు ఓనర్లు. అదో ఆనవాయితీ అక్కడ. అలాగే మరునాడు అంతా వెళ్ళాం. కింద ఇసుక కాబట్టి అంత వర్షం కురిసినా బాగా ఆరిపోయిఉంది. పైగా మా పాత దుప్పటి ఎలాగూ ఉండనే ఉంటుందాయె ! అలా మళ్ళీ సినిమా మొదటినుండీ చూస్తూ ' ఎంజాయ్ 'చేశాం. మరే ! మాకున్న ఒకేఒక్క వినోదం, ఆటవిడుపూ అదొక్కటేనాయే ! ఆనాటి ఆ ముచ్చట ఇప్పటికీ మనోఫలకం మీద చెరగని ముద్రగా మిగిలిపోయింది. 
     త్రైమాసిక, అర్ధసంవత్సర, ఇంకా సంవత్సరాంత పరీక్షలుంటాయి గదా --- అవి ముగిసిన చివరిరోజు మొదటాటకి ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. కష్టపడి చదివి పరీక్షల పర్వం ముగిశాక మాకందరికీ అదో 'రిలాక్సేషన్ ' అన్నమాట ! అలా వెళ్లి ఓ సినిమా చూసేస్తేగానీ మనసుకి  సంతృప్తి అనేది ఉండేది కాదు.
    స్కూల్ చదువు పూర్తయ్యాక ఓ పెద్ద మార్పు వచ్చింది. అదేంటంటే టెంట్  స్థానంలో థియేటర్ రావడం! ఆ  ఊర్లో ఓ సంపన్న కుటుంబం ఉండేది. వాళ్ళు కట్టించారని అంతా అనుకునేవాళ్ళు. అలా అలా టెంట్ సినిమా క్రమంగా మాయమై థియేటర్ సినిమా వచ్చేసి, కాస్త నాగరికత అలవాటయిపోయింది జనాలకి! ఆ విధంగా టెంట్ సినిమాల హవా కనుమరుగైపోయింది.ఇప్పటి తరాలకు అదంటే ఏమిటో అవగాహన ఎంతమాత్రం ఉండదు కూడా. ప్రస్తుతం పెద్ద పెద్ద మోడర్న్ థియటర్స్ లో వందల రూపాయలు పోసి టికెట్స్ కొని చూసే సినిమాలే వాళ్లకు తెలుసు.
     ఏది ఏమైనా.. రోజులు గతించవచ్చు... కానీ.. గతంలోని జ్ఞాపకాలు..వాటితాలూకు అనుభూతులు గతించవుగా...!అలా...చిన్ననాటి జ్ఞాపకాల్లో టెంట్ సినిమా ఓ  మధురస్మృతిగా ఇప్పటికీ మదిలో నిలిచిపోయింది.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
       
                 




 


సృష్టికర్తా...నీకు వందనం...


                                                ~~ యం. ధరిత్రీ దేవి ~~
******************************************


రంగురంగుల పూలు... 
రకరకాల పూలు... 
ఎన్నెన్ని అందాలు.. !
మరెన్నెన్ని ఆకృతులు !!
సృష్టిలోని అందమంతా 
పోగుచేసుకున్నట్టు ఆ సోయగాలు !!
అవి వెదజల్లే సుగంధపరిమళాలు !
మా నయనాలకు విందులు... 
తుమ్మెదలకు పసందులు... 
మది పరవశిస్తూ 
వీక్షించు ఆ మధుర క్షణాలు !!
మరువలేము...పదిలం..పదిలం...
అవి మాకెంతో పదిలం !!
దివి నుండి దిగివచ్చిన 
మనోజ్ఞ కోమల కుసుమాలు...
మాకోసమే విరిసి 
పలుకుతాయి స్వాగతాలు !!
అలవోకగా విసిరే 
ఆ దరహాస వీచికలు !!
కురిపిస్తాయి వీనుల విందుగ 
సరిగమల సంగీతాలు !!
సృష్టికర్తా ! నీ సృజనకు 
శతకోటి వందనాలు...

*********************************




Thursday, October 5, 2023

ఓహో గులాబిబాల....


    

*****************************************


ఓహో గులాబిబాల
అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా
సొంపైన మనసుదానా... 

--- ఈ గులాబీని చూస్తే..పి. బి. శ్రీనివాస్ గారు పాడిన అలనాటి పాట గుర్తొస్తోంది నాకు. మల్లెపువ్వు తెలుపు  రంగుతో స్వచ్ఛతకు చిహ్నంగా ఉంటుంది. కానీ.. అందం విషయానికి వస్తే... గులాబీనే ప్రస్తావించాల్సివస్తుంది . నిజంగా... రకరకాల రంగుల్లో సువాసన కూడా రంగరించుకుని అతివలనే కాదు.. చూసే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తూ... అలరిస్తూ.. ఓహ్ !! ఒక్క  గులాబీకే సొంతమేమో అనిపించదూ ! ఆ మాటకొస్తే.. సృష్టిలోని పూలన్నీ అందమైనవే... కాకపోతే.. 'గులాబి' మరి కాస్త ఎక్కువ అందమైనదన్నమాట...🙂అరచేతిలో ఇమిడిపోతూ, ముట్టుకుంటే మాసిపోతాయేమో... అన్నట్లుగా వలయాకారంలో ఒద్దికగా అమరిన ఆ పూరేకలు!! చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తోంది...
  ఓ ఉషోదయాన మా ఇంటి ముంగిట కుండీలో విరిసి విచ్చుకున్న ఈ  గులాబీ రంగు గులాబీని చూడగానే 'క్లిక్' మనిపించాలనిపించింది... అలా చిక్కుకుని పదిలంగా ఉండిపోయింది నా చెంత..... 

*******************************************

Tuesday, October 3, 2023

'విత్తనం నేను' !!

🌳🌴🌳🌴🌳🌴☘️🌿🌲🌳🌴🌲🌳🌴🌲☘️🌳
                                 
                                             యం. ధరిత్రీ దేవి ~~
                                            
'విత్తనం' నేను ! 
వింతలెన్నో సృష్టిస్తా !! 🙂
మట్టిలో పెడితే.. 
మొలకనై వస్తా !
చారెడు నీళ్లిస్తే.. 
చిగురిస్తా.. చెట్టునవుతా !
విరబూస్తా...విరులిస్తా..
వనితల నేస్తాన్నవుతా.. 
ఫలాలిస్తా..ఆకలి తీరుస్తా..
అందరిదాననవుతా !
ధాన్యమిస్తా..ధనమిస్తా..
రైతు నేస్తాన్నవుతా.. 
నీడనిస్తా..సేద దీరుస్తా..
సేవలందిస్తూ..సాయపడతా...
గాలినిస్తా..ప్రాణంపోస్తా..
ప్రాణదాతనవుతా... 
ఔషధాన్నవుతా...
ఆయుర్వేదమై..ఆయువుపోస్తా... 
దేవతనవుతా..వరాలిస్తా..
వర్షాలూ కురిపిస్తా..
ఎండిపోతే.. కలప నవుతా..
నీ ఇంటి మూల స్తంభాన్నవుతా... 
రకరకాలుగా అలరిస్తా.... 
మీకోసమే జీవిస్తా.... 
మీకోసమే మరణిస్తా.... 
ప్రకృతిలో కలిసుంటా.. 
ప్రతీ చోటా ప్రత్యక్షమవుతా !
నా ఉనికే ఊరికి ఓ అందం...
నేనుంటే చాలు... 
అందరికీ ఆహ్లాదం !!
పచ్చదనానికి నేనే 
చిరునామా నంట !!
పరిసరాల కాలుష్యం 
పరుగో పరుగంట..
అందుకే...అంటున్నా...🙂
"విత్తనాలు నాటండి...
  మొక్కల్ని పెంచండి...
  చెట్లను కాపాడండి.."🙏

🌳🌴🌳🌴🌳🌴🌴🌴🌳🌴🌳🌴🌳🌴🌳🌴🌳🌴






Sunday, October 1, 2023

జాతిపిత ఒక్కడే....


 🙏                                       ~~ యం.ధరిత్రీ దేవి ~~  
   
🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🌹🥀🥀🌹🥀🥀

ఈ ధరణిపై ఇప్పటిదాకా
ఎందరో పుట్టారు... 
సామాన్యులు...అసామాన్యులు...
కొందరు మహానుభావులయ్యారు...
కొందరు అమరజీవులయ్యారు...
మరికొందరు....
చిరస్మరణీయులయ్యారు...
మహాత్ములూ... జాతిపితలూ మాత్రం 
ఎవరూ అవలేదు...
ఒక్క గాంధీజీ తప్ప...!!

                                                           
🥀🌷🌹🥀🌷🥀🌷🥀🌷🥀🌹🥀🌷🌹🥀🌷🥀