Friday, December 12, 2025

భరతభూమి మనదిరా...

 పల్లవి :
 భరతభూమి మనదిరా 
 భరతజాతి మనదిరా 
 మహామహులు జనియించిన 
 మహిమాన్విత చరితగల 
 ధాత్రి మనది సోదరా 
 జోహార్ జోహార్ అనరా 
 జైహింద్ జైహింద్ అనరా సోదరా       // భరత//

 చరణం :
 శతాబ్దాల పరపీడన 
 సొంత ఇంట పరాయి భావన
 వేదనలకు యాతనలకు 
 సమాధులే కట్టిన కరంచంద్ గాంధీ 
 నడయాడిన ధరణి ఇదీ మనదిరా 
 భరతమాత ముద్దుబిడ్డ తానెరా
 జాతిపితగ ఇల నిలిచినాడురా
 జోహార్ జోహార్ అనరా 
 జైహింద్ జైహింద్ అనరా సోదరా       //భరత//

 చరణం :
 గుజరాతున పుట్టినాడు 
 గుండె ధైర్యమున్నవాడు 
 సర్దారై నడిచాడు   
 ఉక్కుమనిషి అయినాడు 
 సమగ్రతకు సమైక్యతకు 
 చెరిగిపోని చిహ్నమతడు 
 అతడే మన పటేలు 
 వల్లభ భాయ్ పటేలు
 జోహార్ జోహార్ అనరా 
 జై హింద్ జై హింద్ 
 అనరా సోదరా                                   //భరత//

 చరణం :
 జవహరంటె ఆభరణం
 జగతిని అతనో ఉజ్వల కిరణం 
 ఆనందభవనాన జనియించినాడు 
 అందరికీ ఇష్టుడు అయినాడు చూడు
 పగ్గాలు పట్టిన తొలి ప్రధాని అతడు
 స్వతంత్రభారతాన వెలుగులీనినాడు 
 గులాబీల అభిమాని బాలలంటే కడుప్రీతి 
 జోహార్ జోహార్ అనరా
 జైహింద్ జై హింద్ అనరా  సోదరా              //భరత //

 చరణం :
 తెలుగు వీర లేవరా అన్నాడు 
 మన్యం వీరుడు మన అల్లూరి 
 కదిలాడు కదనరంగమే సృష్టించాడు 
 ఆంగ్లేయుల గుండెల్లో నిదురించినాడు 
 గుండె తూట్లు పడుతున్నా ఎదురొడ్డి నిలిచాడు 
 వందేమాతరమంటూ నేలకొరిగాడు 
 జోహార్ జోహార్ అనరా
 జైహింద్ జైహింద్ అనరా సోదరా          // భరత //

 

 
 

No comments:

Post a Comment