Wednesday, May 31, 2023

మధుమతి... కథలాంటి ఓ నిజం !

 🌷

 ఆదివారం మధ్యాహ్నం. సమయం ఒంటిగంట దాటుతోంది. వంటింట్లో బాగా బిజీగా ఉంది మధుమతి. హాల్లోనేమో ఫోన్ రింగవుతూ ఉంది. ఎవరో ఏమిటో...! ఏ టైం లో ఫోన్ చేయాలో బొత్తిగా తెలిసిచావదు జనాలకి... అనుకుంటూ వెళ్లి చూసింది. ఏదో కంపెనీ కాల్. ఛీ ఛీ.. వీళ్ళ ఆగడం పాడుగానూ !గాఢ నిద్రలో ఉన్నవాళ్ళను కూడా తట్టిలేపి మరీ వాళ్ళ బిజినెస్ చేసుకోవడం ! తిట్టుకుంటూ వెనుదిరిగింది. నిమిషం తర్వాత మళ్ళీ రింగ్ ! నీ సంగతి నాకు తెలుసులే... అనుకుని కదల్లేదీసారి. రెండోసారి మళ్ళీ... ఓవైపు పప్పు, మరోవైపు కూర.. ! తప్పదనుకుంటూ విసవిసా వెళ్లి చూసింది. రామేశ్వరి!
అరే.. ఇప్పుడెందుకు  చేసిందబ్బా! అనుకుంటూ తీసింది. 
"ఏమిటే మధూ, నిన్న పెళ్లికి రాలేదు? మనవాళ్లంతా వచ్చారు, నువ్వు తప్ప.. "
అంది. ఓ క్షణం నివ్వెర పోయింది మధుమతి. 
" పెళ్ళా? ఎవరిదే?.. "
"ఎవరిదేంటి... ! మన సరోజిని కూతురిది.. మరిచిపోయావా ఏంటి!"
".. సరోజ కూతురిదా... ! వచ్చే శనివారంకదే... !"
" నీ మొహం.. ! నిన్ననేనే  తల్లీ... భలే దానివే. !"
".. ఔనా ! ఉండు... "
అంటూ వెళ్లి ఫ్రిజ్ మీది కవర్ కింద పెట్టిన శుభలేఖ తీసి, డేట్ చూసింది.. 
"ఔనేవ్.. ! ఈ శనివారమే.. నిన్ననే,. ! ఎంత పనైయిపోయింది!నేనింకా వచ్చే శనివారం అనుకుంటూ.. .ఏ చీర కట్టుకోవాలా... ఏదండ వేసుకోవాలా... ఎలా తయారవ్వాలా అని ఒకటే ప్లానింగ్ లో ఉన్నా.... "
"... అఘోరించావ్ !నువ్వూ నీ మతిమరపూ ! సరూ నీకోసం అడిగింది కూడాతెలుసా !"
తల పట్టుకుంది మధుమతి. దేవుడా... ! తన కూతురి పెళ్ళికి వచ్చి, మంచి గిఫ్ట్ కూడా ఇచ్చింది సరోజ. తనేమో... ఛ ఛ ! వెంటనే ఫోన్ చేయాలి.ఇంకా ... ఈరోజు సాయంత్రమే వెళ్లి కలవాలి... లేకుంటే సంబంధాలే చెడి కూర్చుంటాయ్ ! అనుకుంటూ సోఫాలో కూలబడింది. వంటింట్లో ఏదో మాడుతున్న వాసన వచ్చి ముక్కుపుటాల్ని  సోకింది... ఛ ఛ !కూర మాడికూర్చున్నట్టుంది ! ఈ మతిమరుపు రోగం ఏమిటో నాకు! రానురాను శృతి మించుతోంది... అనుకుంటూ వంటింట్లోకి పరుగు తీసింది.
                **               **            **
   మధుమతికి ఈమధ్యే యాభైఐదు నిండాయి. కూతురి  పెళ్లి చేశారు. కొడుకు చదువైపోయి ఉద్యోగంలో కుదిరాడు. భర్త ఓ గవర్నమెంట్ ఉద్యోగి. ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఫ్రెండ్ సర్కిలూ ఎక్కువే. అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఎందుకో  ఏమిటో మతిమరుపు జాడ్యం మొదలైంది ఆమెలో. ఒక చోట పెట్టి మరో చోట వెతకడం! కింద పెట్టి పైన పాకులాడ్డం అంటారే అలా.. ! చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం! ఉన్నట్టుండి చేయవలసిన పనులు మర్చిపోవడం!! అలాగన్నమాట!
   మొన్నటికిమొన్న.. సాయంత్రం ఏవో కొనాలని బజారుకు బయలుదేరింది. ఓ గంట పాటు తిరిగి అంతా పూర్తి చేసుకుని, ఆటో ఎక్కబోతుండగా... ఎదురుగా వేడి వేడి సమోసాలు వేస్తూ కనిపించిందో చిన్నపాటి హోటల్.ఠక్కున  ఆగిపోయింది. 
"సరే.. ఆయన ఇంటికి వచ్చే టైం అయింది..తీసికెళ్తేపోలా... ఇప్పుడెళ్లి స్నాక్స్ కోసం మళ్ళీ తంటాలు పడ్డమెందుకు !ఎంచక్కా ఇద్దరం కూర్చునితింటూ, టీ తాగుతూ కబుర్లాడుకోవచ్చు .. "
అంతే! ఆమె కాళ్ళు అటువైపు లాగాయి. వెళ్లి ఓ నాలుగు సమోసాలు ప్యాక్  చేయించింది.షాపతను ప్యాకెట్ చేతికిచ్చాడు. తీసుకుని ఓపక్కగా కౌంటర్ మీద పెట్టేసి, బ్యాగ్ లో చేయి పెట్టింది డబ్బు కోసం. చిల్లర నోట్లు కనిపించక లోపలి జిప్ తెరిచి, 200|- నోట్ ఇచ్చింది. అతను తిరిగిచ్చిన నోట్లు జాగ్రత్తగా తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో  పెట్టుకుంటూ టైం చూసుకుంది.  ఆరవుతోంది . 
" బాబోయ్.! ఆయన వచ్చేస్తుంటారు.."
 అనుకుంటూ గబగబా  వెళ్లి రెడీగా ఉన్న ఆటో ఎక్కేసింది. ఇల్లు చేరేసరికి భర్త వచ్చేసి, సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. అమ్మయ్య అనుకుంటూ, 
" వచ్చేశారా...నిమిషం.. టీ  పెట్టి తెస్తాను... ఈలోగా ఇదిగో... సమోసాలు తింటూ ఉండండి..."
అంటూ బ్యాగులో  చెయ్యి పెట్టింది. ప్యాకెట్ తగల్లేదు. కంగారుగా అన్ని అరలూ  వెతికింది. అహ !! ఏమైంది! ఆటోలో జారి  పడిపోయిందా! ఓరి దేవుడో! ఓ నిమిషం తర్వాత... మెల్లిగా సీన్ రివైండ్ అయింది. ఫ్లాష్ వెలిగింది. షాపతనిచ్చిన ప్యాకెట్ అక్కడే కౌంటర్ మీద పెట్టి, డబ్బు అయితే ఇచ్చేసింది... ప్యాకెట్ తిరిగి తీసుకోవడం మాత్రం మరిచింది...! అదీ  జరిగింది!!
తిరిగి వెళ్లి తెస్తానంటూ బయలుదేరబోయింది.
".. బాగుందే  నీ తెలివి! అరవై రూపాయల సమోసాల కోసం మరో అరవై ఆటోకు తగలెయ్యడం... అవసరమంటావా!"
గయ్యిమన్నాడు. బిక్కచచ్చిపోయి 'నిజమేస్మీ' అనుకుని నోరెళ్ళబెట్టింది.. 
"..మధుమతి కాదే... మందమతి... మందమతి అని పెట్టి ఉండాల్సింది మీ వాళ్ళు..."
చిన్నబుచ్చుకుని డీలాపడిపోయింది మధుమతి. 
" సరేలే.. సమోసాలెటూ లేవు.. కాస్త టీ నీళ్లయినా నా మోహన కొడతావా...లేదా !"
"అయ్యో... ! కొడతానండీ.... "
చప్పున నాలిక్కరుచుకుని, చెంగున వంటింట్లోకి దూరింది.ఆతర్వాత ఓవారం పాటు...కొనీ తినలేకపోయిన ఆ సమోసాలే మాటిమాటికీ  ఆమె కల్లోకి వస్తూ, వెక్కిరిస్తూ నిద్రకు  దూరం చేశాయి. 
                 **            **            **
  శ్రావణమాసం సమీపిస్తోంది. ప్రతీసారి భర్త నడిగి చీర కోసం డబ్బు తీసుకునేది. ఇప్పుడు కొడుకూ సంపాదనపరుడయ్యాడాయె ! ఇద్దరూ చెరో ఐదు వేలు చేతిలో పెట్టేసి, 'నీ ఇష్టం'  అనేశారు. మధుమతి ఉప్పొంగిపోయి మరుసటి రోజే షాపింగ్ కార్యక్రమం పెట్టేసుకుంది. పనంతా  అయ్యాక రెడీ అయిపోయి, బ్యాగ్ లో డబ్బు జాగ్రత్తగా పెట్టుకొని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంది. టైం చూస్తే పదకొండయింది. భర్త ఆరింటికి గానీ  రాడు... కొడుకేమో వేరే ఊర్లో ఉద్యోగం.. ఇంకేముంది.! నిదానంగా టెన్షన్ లేకుండా అన్ని షాపులూ చుట్టేయొచ్చు... ఎంచక్కా.. ! అనుకుంటూ చక చకా  బయటపడింది.
    ఎండ మండుతూ ఉంది. మెయిన్ రోడ్డు దాకా వెళ్తే గానీ  ఆటోలు ఉండవు. పది నిమిషాల నడక తర్వాత ఆటో ఎక్కేసి 'అమ్మయ్య ఇక హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు' అనుకుంది. ఆటో దూసుకుపోతోంది. నిండా  సంతోషంగా ఉన్న మధుమతికి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది. 
"ఇంతకీ ఇంటికి బయట తాళం వేశానా  లేదా!"
అంతే! అనుమానం పెనుభూతం! తొలిచేయసాగింది. బ్యాగులో డబ్బు పెట్టుకోవడం, బీరువా తాళం వేయడం గుర్తుంది,  కానీ... బయట మెయిన్ డోర్..!అహ! అసలే దొంగలు పట్టపగలే హల్ చల్ చేస్తున్న వైనాలు! ఇంట్లో పదిహేను తులాల పైనే బంగారు నగలు!గుండెజారింది. 
" బాబూ,  కాస్త ఆపవా.."
దాదాపు గెంతేసి,  చేతిలో డబ్బులు కుక్కేసి, అదోలా చూస్తున్న అతన్ని  పట్టించుకోకుండా, తిరిగి చూడకుండా వెంటనే మరో ఆటోఎక్కింది. తీరా చూస్తే.. తాళం సలక్షణంగా వేసే  ఉంది. తల పట్టుకుని.. నా మతిమరపు మండా... అనుకుంటూ..
" సరే... ఎలాగూ వచ్చాను.. నాలుక పిడచగట్టుకుపోతూ ఉంది. కాసిని చల్లటి నీళ్లు తాగి వెళ్దాం.."
అని, తాళం తీసి, హ్యాండ్ బ్యాగ్ సోఫా లో  పడేసి, ఫ్రిజ్లో బాటిల్ తీసి, తాగుతూ టైం చూసింది.పన్నెండు !
"ఛ ఛ ! టైం అంతా వేస్ట్.."
కంగారుగా బయటికి వచ్చి, ఈసారి చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటూ, తాళం వేసేసి, ఒకటికి నాలుగు సార్లు లాగి లాగి చూసి సంతృప్తి పడింది. సరిగ్గా అప్పుడే ఎదురింటి మీనాక్షి గారి అబ్బాయి.. బీటెక్ కుర్రాడు... ప్రేమ్, 
" ఆంటీ, బజారుకా? రండి, డ్రాప్ చేస్తా.."
 అన్నాడు.
" అమ్మయ్య, ఈ ఎండకు మళ్లీ ఆటో కోసం ఆయాస పడుతూ నడవడం తప్పించాడు. సమయానికి భలే దొరికాడులే ..." 
వెంటనే ఎక్కి కూర్చుంది. మెయిన్ రోడ్డు వద్ద డ్రాప్ చేసి ప్రేమ్  వెళ్ళిపోయాడు. పట్టు చీరల బజారు కోసం మళ్లీ ఆటో ఎక్కాలి, తప్పదు.. అనుకుంటూ ఖాళీగా వెళ్తున్న ఆటోను పిలిచి, బేరమాడుతూ భుజం తడుముకుంది. అంతే ! గుండె గుభేల్ మంది. 
"..బ్యాగ్... అయ్యో, నా హ్యాండ్  బ్యాగ్ !ఏదీ? ఎక్కడ? "
కొద్దికాలంగా మధుమతి ఓ అలవాటు చేసుకుంది. బ్యాగ్  లోపల డబ్బులు అన్నీ  పెట్టుకుంటే ఆటోలకు ఇంకా ఇతర వాటికి చిల్లర నాణాలు, చిన్న నోట్లు ఒక పట్టాన దొరికేవి కావు. అందుకని ఓ చిన్న పర్సులో కొద్ది చిల్లర నోట్లు పెట్టుకొని అది మాత్రం చేత్తో పట్టుకుని, బ్యాగ్ భుజానికి తగిలించుకొనేది..ఆ  అలవాటు ఇప్పుడు బెడిసి  కొట్టింది దారుణంగా మరి !!మళ్ళీ సీన్ రివైండ్ అయింది. 
  ఇంట్లోకి వెళ్ళగానే, మంచినీళ్లు తాగడానికి ఫ్రిజ్ దగ్గరికి  హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి, పర్సు మాత్రం అలానే చేత్తో పట్టుకొనివెళ్ళింది.. తిరిగి వస్తూ టైం చూసుకుంటూ ఆ కంగారులో బ్యాగ్ సంగతి మరిచి, బయటికి వచ్చేసింది. తాళం వేసి కదిలేసరికి... ఎదురుగా... ప్రేమ్! అసలు విషయం మర్చిపోయి, అప్రయత్నంగా తాళం చెవి పర్సులో వేసేసుకుని, బైక్ ఎక్కి కూర్చుంది తాపీగా..!  ఆ సమయంలో ఆమె 'కాన్సన్ట్రేషన్' అంతా తాళం వేయడం మీదే ఉండిపోయింది మరి! అదీ జరిగింది !! మళ్లీ తల పట్టుకుంది.
" ఛ ఛ.. ! ఈరోజు ముహూర్తం బొత్తిగా బాగున్నట్టు లేదు పట్టు చీర కొనడానికి! ఇప్పుడేం  చేయను ! డబ్బుల్లేకుండా షాపింగేంటి నా ఖర్మ!"
తనని తానే తిట్టుకుంటూ పర్సు తెరిచింది.
"ఏంచేస్తావ్ ! పద పద..కొంపకి... "
అంటూ వెక్కిరిస్తూ పకపక నవ్వాయి అందులోని  చిల్లర నోట్లు ! చేష్టలుడిగి నిలుచున్న మధుమతి ముందు ఆటో వచ్చి ఆగింది.
"అమ్మా, ఆటో... "
పళ్ళికిలిస్తూ చూశాడు ఆటో వాడు. తీరా చూస్తే... ఇందాక ఎక్కి, తాళం సంగతి గుర్తొచ్చి దిగిన ఆటో వాడే..! మామూలుగా ఉన్నట్లయితే ఆ ఇకిలింపుకు దులిపేసేదే ! కానీ... ఇప్పటి ఆమె'కండిషన్' వేరే ! నిరాశ కమ్మేసి, నీరసం ముంచుకు వచ్చిన మధుమతి మరో మాట చెప్పే ఓపిక లేక గబుక్కున ఎక్కి సీట్లో కూలబడింది.
" ఎంత పని చేసావే...! ముదనష్టపు నా మతిమరుపా! పని జరక్కపోగా.. ఆటో డబ్బులు బొక్క.! మండుటెండలో అనవసర శ్రమ! అంతకుమించి... అంతకుమించి..... "
అనుకున్న పని అనుకున్నట్లుగా అనుకున్న టైంలో జరగక ఆగిపోయినందుకు పిచ్చెక్కినట్లయి తిట్టుకుంటూ, గొణుక్కుంటూ మొహమంతా ముడుచుకుపోయి కూర్చుండిపోయింది పాపం !మధుమతి...మతిమరపు మధుమతి !!


**************************************









Wednesday, May 24, 2023

ఆ చిన్నిపెట్టె... ఓ జ్ఞాపకం... ఓ ప్రయోజనం 🌷

    కొత్త చీర. కొని రెణ్నెళ్లు కాలేదు. తీగ మీద నుంచి లాగ బోతే కాస్త చిరిగింది. పాప డ్రెస్. అంతా చక్కగా ఉంది. కానీ కుట్లు ఊడిపోయాయి. ఇంకా షర్ట్స్... గుండీలు వదులయి, కొన్ని పగిలి.... అలా అలా.... ప్రతీ ఇంట్లో జరిగే భాగోతమే కదా! పోనీలే అంటూ పక్కన పడేయలేం. కాస్త చేత్తో కుట్టడం తెలిసి, రిపేర్లు చేసుకోగలిగిన ఇల్లాలయితే పరవాలేదు, అలాంటివి వెంటనే మళ్ళీ వాడకంలోకి వచ్చేస్తాయి. కానీ... అది చేతగాని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వెంటనే ఏ టైలర్ వద్దకో పరిగెత్తు కెళ్ళాలి. సమయం లేకపోతే నిదానంగా చూద్దాంలే అని పక్కకు పెట్టేయాల్సి వస్తుంది. అంతే కదా! వాటికి మళ్లీ ఎప్పుడు మోక్షం వస్తుందో చెప్పలేం. ఇంతకీ, ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? చెప్తాను. 
    చాలా సంవత్సరాల క్రితం నాటి మాట. నేను హైస్కూల్లో చదివే రోజులవి. అప్పట్లో మిగతా అన్ని సబ్జెక్టులతో పాటు రెండు మూడు అదనపు విషయాలు కూడా తప్పనిసరిగా ఉండేవి. అయితే వాటికి వారానికి ఒక్క పీరియడ్ మాత్రమే కేటాయించేవారు. అవి డ్రాయింగ్, సూయింగ్, డ్రిల్ క్లాసులు. డ్రాయింగ్ పీరియడ్ టైం టేబుల్ లో చూపించేవారు గానీ ప్రత్యేకించి టీచర్ అంటూ సరిగా ఉండేవారు కాదు. డ్రిల్ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా ఉండేవారు. వారంలో ఒకరోజు సాయంత్రం చివరి పీరియడ్ గ్రౌండ్ లో అందర్నీ నిలబెట్టి వ్యాయామాలు చేయించేవారు మాస్టర్ గారు. ఒక్కోసారి ఏమైనా ఆటలాడించేవారు. ఈ పీరియడ్ అంటే మా అమ్మాయిలు ఉత్సాహంగానే ఉండేవారు. కానీ పైన చెప్పిన వాటిలో సూయింగ్ అనేదుందే --- అదంటేనే అందరికీ ఓ మూల చిరాకు! ఆడపిల్లలమైనా, ఉండేది వారానికి ఒక్కసారైనా ఎందుకో ఆ క్లాస్ మీద ఆసక్తి కనబరిచే వాళ్ళం కాదు. అబ్బా! ఏమిటి! బళ్లో కూడా ఈ కుట్లు అల్లికలు! అంటూ అందరూ తెగ విసుక్కునే వాళ్ళు. మాకు ప్రత్యేకించి సూయింగ్ క్లాస్ టీచర్ ఉండేవారు. ఆవిడ సన్నగా, పొట్టిగా, చిన్న ముడితో అతి సాధారణంగా ఉండి, చాలా చిన్నగా, మితంగా మాట్లాడేవారు. కానీ, చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఆ పీరియడ్ వచ్చేసరికి అందరి దగ్గరా సూది, దారం, ఏదో ఒక క్లాత్ ఉండి తీరాల్సిందే. సమయానికి లేకపోతే పక్క క్లాస్ కెళ్ళి  వేరేవాళ్ళ దగ్గర తెచ్చేసుకునేవాళ్ళు కొందరు భయస్థులు ! అంతా లోలోపల విసుక్కుంటూనే మాట వినే వాళ్ళం. నిజానికి ఆవిడ నేర్పించినవి అతి సామాన్యమైనవి. ఇవి కూడా స్కూల్లో నేర్చుకోవాలా? అనుకునేవాళ్లం, కానీ, చదువులూ, పెళ్లిళ్లూ అయిపోయి, సంసారాల్లో స్థిరపడ్డాక నిత్యజీవితంలో ఆనాడు బడిలో నేర్పించిన చిన్న చిన్ని కుట్లు ఆడవాళ్లు గా మాకు ఇంట్లో ఎంత ఉపయోగపడుతున్నాయో అనుభవం మీద తెలిసొచ్చింది. ఈ పాటి కుట్లు అలవోకగా వచ్చేయవా అనుకుంటాం గానీ ఆ చిన్న పనిలో కూడా ఎంతో నేర్పరితనం కావాలని ఇలాంటివి చేతకాక ప్రతి దానికి టైలర్ ల మీద ఆధారపడే కొందరిని చూస్తే తెలిసొస్తుంది. 
    A stitch intime saves nine అన్నట్లు ఏవైనా దుస్తులు కొద్దిగా చిరిగినా, కుట్లు ఊడినా వెంటనే కుట్టేయకపోతే కొద్ది రోజులకి చిరిగి చాటంత అయి పనికి రాకుండా పోతాయి. అలా అని చెప్పి ఆ కాస్త దానికి టైలర్ దాకా పరిగెత్త లేము. 
   ఆడపిల్లల స్కూళ్లల్లో సూయింగ్ క్లాసులు ఆ రోజుల్లో ఎందుకు పెట్టారో తర్వాత రోజుల్లో నాకు బాగా అవగతమైంది. అప్పట్లో టీచర్ గారి మీద అకారణంగా విసుక్కున్నా ఇప్పుడు తలుచుకుంటే ఆవిడ పై ఎంతో గౌరవం కల్గుతుంది. గట్టికుట్టు, హెమింగ్, కాడకుట్టు --- ఇలాంటి అత్యవసరమైనవి అప్పుడు నేర్చుకున్నవే! ఇప్పుడు ఇంట్లో నాకు ఎప్పుడూ ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు స్కూళ్లల్లో సూయింగ్ క్లాసులున్న దాఖలాలు కనిపించవు !
    ఇకపోతే దీనికోసం కాస్త సరంజామా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే, ముఖ్యంగా మా మహిళామణులకు. చిన్న, పెద్ద సైజుల సూదులు రెండు మూడు, కొన్ని రకాల రంగుల దారాల ఉండలు, కొన్ని హుక్స్, కొన్ని గుండీలు ( buttons ) వీటితో పాటు ఓ చిన్ని కత్తెర, ఇంకా ఓ బ్లేడు -- ఇవన్నీ పెట్టుకోడానికి ఓ చిన్న బాక్స్, అంతే! ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటే సౌకర్యంగా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడూ ఓ చిన్ని పెట్టె వీటితో సిద్ధంగా ఉంటుంది. వినడానికి చాలా చిన్న విషయంగా, ఓస్, ఇంతేనా! అనిపించొచ్చు గానీ దీని ఉపయోగం మాత్రం అపారం. ఇది మా మహిళలందరూ ఎరిగినదే అయినా ఇది చదివాక నిజమే సుమా! అనుకోక మానరు. 
   చిరిగినవీ, కుట్లూడినవి కుట్టుకోవడమే  కాదు, చేతి రుమాళ్లు లాంటివీ తయారుచేసుకోవచ్చు మనక్కావలసినట్లుగా...ఇంకా కరోనా వచ్చిన కొత్తలో  అత్యవసరమైన మాస్క్ లు   చేతితో కుట్టుకున్న రోజులున్నాయి....అవునా, కాదా ! 
     ఇంతటి ప్రయోజనం, ప్రత్యేకత కలిగిన ఈ చిన్నిపెట్టె గురించి నా ఆలోచనలు మా సోదరీమణులతో పంచుకోవాలన్న కోరికతో రాయాలనిపించింది. 🙂

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Friday, May 19, 2023

ఆచూపు ఎదురుతిరిగిన వేళ...!?

***************************
"ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి... ఆపై హత్య !"
   కొద్దికాలంగా రోజూ ఏదో ఒకచోట ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. అదీ బాగా పరిచయస్తులే !చుట్టుపక్కలవాళ్లే... ఈ దారుణాలకు పాల్పడుతున్న వైనాలు !!
     మధ్యాహ్నం దినపత్రికలో ఆ వార్త చూసిన సంయుక్తకు మనసంతా కకావికలమైపోయింది. ఇటీవల కొందరు సినీతారలు Me too Movement ద్వారా, కొన్ని సంధర్భాల్లో... మరికొందరు ప్రముఖ మహిళలు  తమ చిన్నతనంలో ఇంట్లోవాళ్ళ వల్ల ఇంకా సన్నిహిత బంధువుల నుండీ ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడిస్తూ, ఆ చేదు అనుభవాలు తాము పెరిగి పెద్దయ్యాక, వివాహితులై తల్లులయ్యాక కూడా వెంటాడుతూనే ఉంటూ తీవ్ర మానసిక క్షోభ ననుభవిస్తూ ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆ లేత వయసులో కనీసం తల్లికి కూడా చెప్పుకోలేక ఎంత వేదనకు గురి అయిఉంటారో కదా ఆ చిట్టి తల్లులు!!ఇంకా ఇలాంటివి వెలుగులోనికి రానివి కోకొల్లలు !  సంయుక్తకు ఆ క్షణంలో తన  చిన్ననాటి జ్ఞాపకమొకటి మదిలో మెదిలింది.ఆవెంటనే.. ఆ జ్ఞాపకాన్ని అల్లుకుని జరిగిన పరిణామాలు వరుసగా కళ్ళముందు కదలాడాయి.
              **                **             **
  బస్సు కదలబోతోంది. సంయుక్త,  ప్రకాష్ ఎక్కి కూర్చున్నారు. ఆమె ఒళ్లో రెండేళ్ల పాప. కిటికీ వేపు సర్దుకుని కూర్చున్న తర్వాత సంయుక్త యధాలాపంగా బయటికి చూసింది, ఓవైపు కాస్త దూరంగా... ఒకతను తననే చూస్తున్నాడు... అనుకోకుండా ఆమె చూపు అతని మీద పడింది... అంతే! వెంటనే అతను ఒకలా నవ్వుతూ కన్ను గీటాడు. అలా మళ్లీ.. మళ్లీ...! సంయుక్త అప్రతిభురాలై పోయింది. వెంటనే గుర్తు పట్టిందతన్ని. వాడు.. వాడు.. శివ... శివారెడ్డి! తను ఆరవ తరగతికి చదివేటప్పుడు తనకన్నా రెండేళ్లు సీనియర్. తమ ఊరి వాడే. పదేళ్ళుంటాయి సంయుక్త కప్పుడు. తనను క్లాసు బయట చూసినప్పుడల్లా వెంటనే అదోలా నవ్వడం.. ఆపై...కన్ను గీటడం ! పక్కనే మరికొందరు ఆడపిల్లలున్నా సంయుక్తతోనే అలా ప్రవర్తించేవాడు. చిన్న వయసైనా ఆ పిల్లకు  ఆ వంకర చూపులు అర్థమై జుగుప్స కలిగేది. కానీ పక్కన ఎవరితో చెప్పుకుందామన్నా... ఏదో బెరుకు! ఏమనుకుంటారో తన గురించి!  అందరిలో లోకువైపోతానో ఏమో! అన్న శంక !! చివరికి... ఇంట్లో తల్లికి చెబుదామన్నా... ఎలా చెప్పాలో... ఏమని చెప్పాలో ఆ పసిదాని బుర్రకు తట్టేది కాదు. అలా ఒకసారి, రెండుసార్లు కాదు... చాలాసార్లు జరిగింది. అంతే! వాడలా చూడ్డంతోనే ఆగిపోయింది.. తన స్కూల్ ఫైనల్ ముగిసి, ఇంటర్,  డిగ్రీ కూడా అయిపోయింది. ఆ తర్వాత పెళ్లయింది. పాప కూడా పుట్టింది. వాణ్ణి  పూర్తిగా మర్చిపోయింది కూడా...
   ఈరోజు... పండగ శెలవులకు పుట్టింటికి భర్తతోపాటు వచ్చి, తిరిగి వెళుతుండగా... చాలా ఏళ్ల తర్వాత వీడు మళ్లీ ఇలా...! ఒళ్లో పాప... పక్కనే భర్త !!అయినా  వీడి నైజం... వికృత చేష్టలు!!అసలేమనుకుంటున్నాడు నా గురించి ! ఆమెలో కోపం రగులుకుంది. మరుక్షణమే గుండె దడదడలాడింది. Thank God ! ఈయన చూడలేదు. ఈలోగా వాడిని దాటుకుని, బస్టాండ్ దాటి, బస్సు బయటికి వచ్చేసింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది సంయుక్త. అంతలో అనిపించిందామెకి...  ఇదేమిటి ! నేనేదో తప్పు చేసినట్లు ఇంతలా భయపడి పోతున్నాను!! అనుకుంటూ తల విదుల్చుకుని స్థిరంగా కూర్చుండిపోయింది.
                 **                **            **
    మరో మూడేళ్లు గడిచిపోయాయి. దసరా శెలవులకు పుట్టింటికి వచ్చింది సంయుక్త. ప్రకాష్ పండగ అవంగానే వెళ్లిపోయాడు. తను మరో నాలుగు రోజులయ్యాక పాపతో బయలుదేరి బస్టాండ్ చేరుకుంది. బస్సు ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నారు బెంచి మీద కూర్చుని. అంతలో అల్లంత దూరాన.. వాడే... వాడే!! మళ్లీ... అదే చూపు! అదే అసభ్య ప్రవర్తన!! 
   చిర్రెత్తుకొచ్చింది సంయుక్తకు. ఆ క్షణంలో ఆమెకు అనిపించింది.. ఏమిటో ! ఆలోచిస్తుంటే వీడు తనను ప్రతిసారీ ఇలా కావాలనే వెన్నంటి  వస్తున్నాడేమో ! తన మౌనం వాడికి మరింత బలాన్ని ఇస్తోందా ! ఈమె నన్నేమీ చేయలేదు అనుకుంటున్నాడా... పెళ్లయి ఇన్నేళ్లయినా.... పక్కనే అయిదేళ్ల పాప కనిపిస్తున్నా... వీడికి ఇంగితం అన్నది ఏమాత్రం ఉండటం లేదేమిటి  ! రానురానూ ఈమధ్య ఈ ఊరికి రావాలంటేనే లోలోపల ఏదో సంకోచం... బెరుకు !  ఒళ్లంతా కంపరంగా అనిపించింది సంయుక్తకు... తప్పదు.. ఏదో ఒకటి చేయాలి. తనిప్పుడు స్కూల్లో చదివే ఒకప్పటి చిన్నపిల్ల కాదు... అవివాహితా  కాదు..ముప్ఫై దాటి, మానసిక పరిపక్వత వచ్చిన ఒక స్త్రీ! ధైర్యం, స్థైర్యం నిండుగా సంతరించుకున్న ఓ పరిపూర్ణ ఆడది.!
  అంతే ! ఆనాటి అమాయకత్వం, భయం,  సంకోచం... ఇలాంటివన్నీ ఆ క్షణంలో అదృశ్యమైపోయాయామెలో... స్థిరంగా లేచి నిల్చుంది. 
చీర చెంగు తిప్పి బిగించింది.
" స్మితా, ఇక్కడే కూర్చుని ఉండు...కదలకు.. ఇప్పుడే వస్తా..."
అని పాపతో చెప్పి, ముందుకు కదిలింది. చరచరా వెళ్లి తన వైపే నవ్వుతూ చూస్తున్న అతని ముందు నిలబడింది. అనుకోని ఈ హఠాత్పరిణామానికి దిగ్భ్రమ చెందిన అతను అప్రయత్నంగా రెండు అడుగులు వెనక్కి వేశాడు. అతని మొహం లోకి సూటిగా చూస్తూ, 
" అన్నా ! ఏంటన్నా? నీకీ జబ్బు ఇంకా పోలేదా అన్నా! చిన్నప్పటినుంచీ  చూస్తున్నా.. ఆ కన్ను ఎందుకలా కొట్టుకుంటూ ఉంటుందన్నా? ఖచ్చితంగా ఇది జబ్బే.. ఎవరైనా డాక్టర్ కు చూపించుకో అన్నా..."
 అతని బుర్ర గిర్రున తిరిగిపోయింది ఒక్కసారిగా!! ఎన్నడూ నోరు విప్పని సంయుక్త... తన వైపు చూడ్డానికే జంకే ఈ సంయుక్త.. ! ఉన్నట్టుండి వచ్చి అనుకోని రీతిలో తన ముందు నిలబడ్డం ! అది  చాలదన్నట్టు... అంత ధైర్యంగా తన మొహంలోకి చూస్తూ మాట్లాడ్డం! 
  ఆమె నోటి నుండి మెత్తమెత్తని మాటలే అయినా...శూలాల్లా వెళ్లి అతని గుండెల్లో సూటిగా దిగబడ్డాయి..! అతనికి మరో పెద్ద షాక్! మాటకు ముందు ఓసారి... తర్వాత ఓసారి.. 'అన్నా'.. 'అన్నా' అని సంబోధించడం!!అసలు ఆమె నడిచిరావడంలోని ఊపు చూసిన అతను నేరుగా వచ్చి, తన చొక్కా పట్టుకుని నిలదీస్తుందేమో అనుకున్నాడు... కానీ... అంతకు వేయిరెట్లు పరాభవం ఎదురై అతని తల వాలిపోయింది. 
"...అన్నా, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బన్నా.... ఆడవాళ్లు అపార్థం చేసుకున్నారంటే.. నువ్వు చాలా చిక్కుల్లో పడిపోతావు, జాగ్రత్తన్నా... !"
మెల్లిగా షాక్  నుంచి తేరుకున్న శివారెడ్డి ... మారు మాట్లాడక, తలూపుతూ, 
"అ.. అ " అంటూ గబా గబా వెనక్కి తిరిగాడు. 
" అన్నా.. "
 వెళ్తున్న అతను ఠక్కున ఆగాడు.
"... డాక్టర్ దగ్గరికెళ్లడానికి నీవు మొహమాట పడితే చెప్పన్నా.. మా ఆయనకు తెలిసిన మంచి డాక్టరొకాయన  ఉన్నాడు... నేను చెప్తాను... తీసుకెళ్లి చూపిస్తాడు.."
అంతే!! పరుగు లాంటి నడకతో ఎదురొస్తున్నవాళ్లను తోసుకుంటూ  బస్టాండ్ దాటి క్షణాల్లో మాయమైపోయాడు వాడు... క్షణం ఆగి, బిగించిన కొంగు తీసేసింది సంయుక్త.   
" ఎదవ !  నేను ఆడపిల్లనురా... ఏ చూపు ఎలాంటిదో గ్రహించడం మా ఆడపిల్లలకు వెన్నతో పెట్టిన విద్య! ఈరోజేమిటి ! పదేళ్ల వయసులోనే నీ వికృత చూపులు అర్థమయ్యాయి నాకు...పాపం, నీకే అర్థం కాలేదు ఓ విషయం!ఆడపిల్ల ఎదురు తిరిగి, నోరు తెరిచిందంటే  నీలాంటి వెధవలు,  సంస్కారహీనులు నామరూపాల్లేకుండాపోతారని!
 అసలు...తాననుకున్నదొకటి.. జరిగింది మరొకటి!తనకొచ్చిన కోపానికి చరచరా వెళ్లి వాడి రెండు చెంపలూ వాయించాలన్న తలంపుతో దూసుకు వెళ్లింది  వాడి ముందుకు. కానీ.. ఠక్కున ఏమైందో ఏమో....! మొత్తం మారిపోయి అలా విచిత్రంగా నోటి నుండి జలజలా రాలిపడ్డాయి సుతిమెత్తని  మాటల తూటాలు.... అయినా.. ఛెళ్ళుఛెళ్ళున...కొరడా దెబ్బల్లాంటివి !వెళ్లి,  సరిగ్గా తగలాల్సిన చోట బాగానే తగిలాయి. 
     అదే మంచిదయింది... లేకుంటే అంతమందిలో అక్కడ పెద్ద సీనే క్రియేట్ అయి ఉండేది... వీడు నిజంగా మనిషే  అయితే... మళ్లీ నా వంక చూడ్డం కాదు గదా... నా దరిదాపుల్లోకి రావడానికి కూడా సాహసించడు. అసలు ఈ పని తాను ఎప్పుడో చేయాల్సిన మాట! ఇంత ధైర్యం, తెగింపు రావడానికి ఇన్నేళ్ల కాలం పట్టింది.  సరే... ఇప్పటికైనా తన సమస్య తానే పరిష్కరించుకోగలిగింది...అది చాలు.. పర్యవసానం ఏమైనా కానీ... ఎదుర్కోవడానికి సిద్ధం.."
  తనలో తాను జరిగింది మననం చేసుకుంటూ,  నెమ్మదిగా నార్మల్ అయిపోతూ అడుగులు ముందుకు వేసింది సంయుక్త.
" అమ్మా, ఎక్కడికెళ్లావు? "
" నాకు తెలిసిన ఓ అంకుల్ కనిపిస్తే... పలకరించి వస్తున్నా.. పదపద.. బస్సు వచ్చేసింది..వెళ్దాం.. "
 ఎదురు చూస్తున్న పాపకు చెప్తూ బ్యాగ్ పట్టుకుని బస్సు వేపు  కదిలింది సంయుక్త
      ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ఆ ఊరికి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో బస్టాండ్ కి  వచ్చాక అప్రయత్నంగానే ఆమె కళ్ళు వాడి కోసం వెతికేవి. కానీ, మళ్లీ ఆ జాడే లేదు. మరెప్పుడూ ఆమె కంట పడలేదు వాడు. వాడి గురించి తల్లి దగ్గర ఆరా తీద్దామా అనుకుంది గానీ... అనవసర చర్చకు తెర లేపినట్లవుతుందని మిన్నకుండిపోయింది.
  సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ జ్ఞాపకం తుడిచిపెట్టుకుపోయింది ఆమెలో. అలా అనుకుందిగానీ... ఈరోజు పేపర్లో వార్త చదివేసరికి, నిద్రాణస్థితిలో ఉన్నదేమో... అది మళ్ళీ పడగ విప్పింది. చెప్పాలంటే తనకు ఎదురయింది చాలా చిన్నది. వాడెన్నడూ తనను సమీపించలేదు.. వాడి  గాలి కూడా తనను సోకలేదు. దూరంగా ఉండి విసిరిన ఆ వక్రపుచూపులే తనని ఏళ్ళ తరబడి ఎంతగానో బాధించాయి... అలాంటప్పుడు అభం శుభం ఎరుగని పసిపాపలు ఈ మృగాల వికృతచేష్టల బారినిబడి ఎంత నలిగి పోతుంటారో గదా !! అలాంటి చిన్నారుల జీవితకాలవేదన ఎలా తీరుతుంది? ఈ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అన్నది ఎక్కడుంది  ?? 
  అలాంటి కీచకులను నడిబజార్లో నిలబెట్టి, వాడి తల్లి, పెళ్ళాం, బిడ్డలు, జనాలంతా చూస్తుండగా దేహశుద్ధి చేయాలి. కుటుంబ సభ్యులు సైతం చీదరించుకుని, అసహ్యించుకుంటేగానీ వాడెంత హీనుడో వాడికర్థం కాదు. చట్టాలు  కాదు... చుట్టాలు, చుట్టూ ఉన్నవాళ్లు వేసేదే ఈ మానవమృగాలకు  సరైన శిక్ష !
     ఎడతెగని ఆలోచనలతో సంయుక్త భారంగా కళ్ళు మూసుకుంది. 
*****************************************





Sunday, May 14, 2023

పువ్వులతో మాటలు... పసందైన పాటలు..

🌷              🌹             💐                🌹                 🌷
************************************************
🌹 సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
     చిన్నారి చిలకమ్మా నావారు ఎవరే
     నా తోడు ఎవరే ఎన్నాళ్లకొస్తాడే  🌹

--- ఉయ్యాల ఊగుతూ ఊహల్లో తేలిపోతూ  పాడుకుంటున్న శ్రీదేవి గుర్తొస్తోంది కదూ ! ఆ ముద్దు మోము, అందాల చిరునవ్వు, అమాయకత్వం, ముగ్ధత్వం కలబోసుకున్న ఆ సోయగం వెన్వెంటనే మన కళ్ళముందు కదలాడి  తీరతాయి అంటే అతిశయోక్తి అని ఎవరైనా అనగలరా! పాట... పాటను మించిన అభినయం.... దాన్ని మించిన చిత్రీకరణ  ! అత్యద్భుతం  ! ఇంతకీ... సిరిమల్లెను ప్రశ్నించడం ఏమిటి తన తోడు ఎన్నాళ్ళకొస్తాడని ? అదంతా కవి భావన అని అందరికీ తెలిసిందే. తనలో చెలరేగే  భావాల్ని, కోరికల్ని, ఇంకా చెప్పుకోలేని ఎన్నెన్నో ఆలోచనల్ని ఓ  ఆడపిల్ల వ్యక్తీకరించాలంటే మనుషులతో సాధ్యం కానప్పుడు ఇలా ఓ పువ్వును ఆశ్రయించాల్సిందే.. అంతే కదా !
-- ఇలా పూల మీద కవులు, రచయితల కలం నుండి జాలువారిన గీతాలెన్నో.... ఎన్నెన్నో.. ! ప్రకృతికి సొబగులద్దడానికి పువ్వుల్ని మించినవేమున్నాయి !ఆ వర్ణాలు, ఆ సోయగాలు వర్ణనాతీతం ! సృష్టించిన విధాత  ఎంత సృజనశీలియో కదా ! ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క రూపం, ఒక్కొక్క పరిమళం అద్ది  దేని ప్రత్యేకత దానిదే అన్నాడు. 
    ఏ కాస్త కవితా హృదయమున్న మనిషికైనా పూలను చూస్తే ఆహ్లాదం పుట్టుకొచ్చి కవిత్వం దానికదే పెల్లుబుకుతుందేమో ! అందుకేనేమో మన సినీ కవులు రకరకాల పుష్పాల వర్ణనలో మునిగితేలుతూ, వాటితో కబుర్లాడుతూ అద్భుతమైన, మధురాతి మధురమైన గీతాల్ని సృష్టించగలిగారు. గాయనీ గాయకులు వారల గళ మాధుర్యంతో వీనులవిందుగా ఆలపించారు. అలాంటి పాటల్ని ఓ సారి మననం చేసుకోవాలని పిస్తోంది నాకీరోజు.   మీకూ మరికొన్ని మస్తిష్కంలో మెదలవచ్చు. ప్రయత్నించండి.

🌹 మల్లియలారా మాలికలారా 
      మౌనముగా ఉన్నారా  🌹

 ఘంటసాల గారి గళంలో ప్రాణం పోసుకున్న ' నిర్దోషి'
 చిత్రంలోని ఈ పాట ఆ తరం వాళ్ళకు  సుపరిచితం. తన గోడు వినే వాళ్ళు లేనప్పుడు చుట్టూ ఉన్న పూలతో అన్యాపదేశంగా సందేశాల్ని  పంపించవచ్చని కవి భావన కాబోలు ! 
   మల్లెలేనా ! మేమేం తీసి పోయామంటూ గులాబీలు  పోటీపడుతూ వచ్చిన పాటలు  కోకొల్లలు.

🌹  ఓహో గులాబి  బాలా
       అందాల ప్రేమమాలా 
       సొగసైన కనులదానా
       సొంపైన మనసు దానా 
       నీ వారెవరో తెలుసుకో  🌹

 -- పాట వినగానే పీ. బి. శ్రీనివాస్ గారు గుర్తుకు రాకమానరు. తను ప్రేమించిన అమ్మాయి ఓ మోసగాడి వలలో చిక్కుకొని పోతున్నదన్న బాధతో తనకు తెలిసేటట్లు, గులాబీని ఉద్దేశించి పాడుతూ ఆమెను హెచ్చరిస్తున్నాడన్నమాట ! అప్పట్లో ఎందరి హృదయాల్నో అలరించిన పాట ఇది.

🌹  ఈ ఎర్ర గులాబీ విరిసినదోయీ 
       మకరందమంత నీదోయి  రావోయీ  🌹

🌹   ఈ ఎర్ర గులాబీ విరిసినదీ 
        తొలిసారీ నినుకోరీ  🌹

-- అమ్మాయిలు తమని తాము గులాబీలుగా చెప్పుకుంటూ పాడిన పాటలివి. 

🌹   రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా  రోజా పువ్వా 
        రోజూ రోజూ పూస్తూ ఉన్న రోజా నువ్వా  🌹

-- పాట వినగానే గుర్తొచ్చేది హీరో రాజశేఖరే ! అతని స్టెప్స్, స్మైల్ అనుకరిస్తూ ఎందరు  ఎంత కామెడీ సృష్టించారో... సృష్టిస్తూ ఉన్నారో... తెలియంది కాదు. అలా మరింత గొప్పగా పాపులర్ అయింది ఈ'రోజ్'పాట !
  గులాబీ పూలపై  మరిన్ని పాటలు మీ మదిలో మెదిలే  ఉంటాయి ఈ పాటికి ! 🙂

🌹   చిన్నారి పాపల పొన్నారి తోటలో
        విరిసిందో ఎర్రగులాబీ 
        విరబూసిందో  చిన్ని గులాబీ  🌹

--- మళ్లీ శ్రీదేవి ! కాకపోతే బేబీ శ్రీదేవి ! ఆ చిన్ని వయసులోనే ఎంతటి హావభావాలు పలికించిందో  కదా ! ఒకసారి చూస్తే చాలు... ఎప్పటికీ మరపురాని ఆ ముఖారవిందం ! పోటీపడుతూ అభినయం !!
 --- ఆడపిల్ల మనసు గులాబీలా సుతిమెత్తని దంటూ  ఉంటారు. అలాగే అమ్మాయిల్ని బంతిపూలతో పోలుస్తుంటారు కూడా. నిజమే ! బంతి పువ్వు ఎంత ముద్దుగా ముచ్చటగొలుపుతూ ఉంటుంది ! పదహారేళ్లొచ్చిన  ప్రతీ  అమ్మాయి ఓ ముద్దబంతి పువ్వే!  అలాగే... చామంతులు... వీటి మీద వచ్చిన పాటలూ తక్కువేమీ కాదు.

🌹  బంతిపూల రథాలు మా ఆడపడుచులు
       పులి బిడ్డలు మా వాడ రైతు బిడ్డలు 🌹
🌹   భామా భామా బంతీ పువ్వా..... 🌹
🌹   చామంతి పువ్వా పువ్వా.....🌹
🌹   బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే.. 🌹
---ఇక విషాద గీతాల్లో మేటి ----

🌹   ముద్దబంతి పూవులో 
        మూగకళ్ల ఊసులో 
        ఎనక జనమ బాసలూ 
        ఎందరికీ తెలుసులే.. 🌹

-- ఈ పాటల్ని  ఓ సారి మననం చేసుకుని మీలో మీరే పాడుకోండి చూద్దాం.... 🙂 

🌹   ముద్దుకే ముద్దొచ్చే మందారం ముద్దమందారం🌹

 జంధ్యాల గారి 'ముద్దమందారం'.... అందులోని  ఈ పాట బహుళ ప్రాచుర్యం పొందిందారోజుల్లో ! ఇప్పటికీ మందారం అంటే జంధ్యాలగారి ముద్దమందారమే గుర్తొస్తుంది. కాదంటారా  !
----- ఇలా ఎన్నెన్ని పాటలుద్భవించాయో  ! అన్నీ  సుమధురగీతాలే. అందరికీ సుపరిచితాలే. అలా పూలతో మాట్లాడుతూ, పువ్వుల్ని  వర్ణిస్తూ,  అమ్మాయిలతో పోలుస్తూ కవి తన భావనల్ని అక్షరాలుగా మారుస్తూ ఆ సౌరభాల్ని అందరికీ పంచు తూ అలరిస్తున్నందుకు మనసారా అభినందనలు.
     ఇలా పూలపై చాలా చాలా పాటలొచ్చాయి. నేను కొన్ని మాత్రమే ప్రస్తావించగలిగాను. ఆలోచిస్తే మీక్కూడా మరికొన్ని బుర్రలో తళుక్కున మెరుస్తాయి.  --- ఇది కేవలం సరదా కోసమే... కాసేపు కాలక్షేపం కూడా. 🙂🙂🙂

*********************************









      



Monday, May 8, 2023

రేపటికోసం... 'చిన్నారి'కథ

🙎🙋👷😅😇🙂 

"టీచర్స్, మనకోపని పడిందమ్మా...మండల కార్యాలయం నుండి ఆర్డర్స్! పిల్లల చేత బడి దగ్గర,  ఊరిలో అనువైన చోట్ల మొక్కలు నాటించాలట ! అందుకోసం రకరకాల మొక్కల్ని సప్లై చేస్తామని చెప్పారు. రేపు వాటిని తీసుకొస్తాను. ఈ విషయం పిల్లలకు తెలియజేసి, రేపు ఉదయానికంతా వాళ్లతో పాటు మీరూ  సిద్ధంగా ఉండండి. మీకు మన రమణ సార్  హెల్ప్ చేస్తారు... "
స్టాఫ్ రూమ్ కు  టీచర్లందరినీ  పిలిపించి, చేయవలసిన కార్యక్రమము గురించి వివరాలు తెలియజేశారు హెడ్మాస్టర్ మూర్తిగారు. రమణ ఆ ఊరి వాడే. డిగ్రీ దాకా చదివాడు. ఖాళీగా ఉండడం ఎందుకని స్కూలుకు వచ్చి  పాఠాలు  చెబుతుంటాడు. సాధన మిగతా టీచర్లతో కలిసి రమణతో కాసేపు మాట్లాడింది. ఊరిలో ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో అనువైనచోట్లు  చూసే పని అతనికి అప్పగించి క్లాసులకు బయలుదేరారు.
                      **             **            **
   మరుసటి రోజు మొక్కలన్నీ వచ్చాయి. ముందే విషయం తెలిసిన పిల్లలు రెడీగా ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ బెల్లయింది. పిల్లలంతా  భోజనాలు కానిచ్చి బడికి ఓ పక్కన కూర్చుని, పళ్ళు అమ్ముకునే కిట్టయ్య తాత దగ్గర చేరారు. అతను రకరకాల పండ్లు తెచ్చి ప్రతిరోజూ  అమ్ముతుంటాడు. వరుసగా పేర్చబడ్డ నర్సరీ మొక్కల్ని చూసి, 
" ఎందుకర్రా  ఇవన్నీ..? "
 అని అడిగాడు పిల్లల్ని.
" మేం నాటాలి తాతా... ఇవన్నీ రకరకాల మొక్కలు. చింత, వేప, నిమ్మ, సుంకేసుల, మందారం, జామ.. చాలా చాలా ఉన్నాయి తెలుసా...!"
 అన్నారు పిల్లలు.
" ఓశోశ్ ! ఇవన్నీ మీరు నాటితే... అవి ఎప్పుడు కాయలు కాయాలేంటి?  మీరు తింటారా పెడతారా? "
కిట్టయ్య పక్కపకా నవ్వి, అదో అనవసరశ్రమ అన్నట్టు తీసి పారేశాడు. కాస్త దూరంగా ఉన్న సాధన చెవిని ఆ సంభాషణ అంతా పడనే పడింది. కాసేపటి క్రితం కూరగాయలమ్ముకునే సూరమ్మ కూడా ఇదే మాట అంటూ వెళ్ళింది. విసుగొచ్చింది సాధనకు.. ఉండబట్టలేక మెల్లిగా అతని దగ్గరకు వచ్చి, 
" నువ్వు రోజూ  పండ్లు తెస్తున్నావు కదన్నా... అవి ఎక్కడ నుంచి వస్తున్నాయంటావ్? "
 అవాక్కయిన అతను, 
"... మార్కెట్లో కొనుక్కొచ్చి అమ్ముతానుగదమ్మ... !"
" కదా ! ఎవరో ఎప్పుడో నాటిన చెట్లకు కాసిన  కాయలు నీకు ఉపయోగపడుతున్నాయి. అప్పుడు వాళ్లు నాటినవి ఇప్పుడు నీకూ, నీలాంటి వాళ్లకు ఉపయోగపడుతున్నట్టే.. ఈరోజు ఈ పిల్లలు నాటేవి రేపు వేరే ఎందరికో ఉపయోగపడొచ్చు కదా...!"
" అవునమ్మోయ్... !", 
నాలిక్కరుచుకున్నాడు కిట్టయ్య. పిల్లలంతా నవ్వేశారు. ఓ అరగంట తర్వాత... మొక్కలు తీసుకుని,  రమణ సార్ తెచ్చిన చిన్న చిన్న పనిముట్లు పట్టుకొని టీచర్లతో కలిసి ఊర్లోకి బయలుదేరారు. రమణ ఎక్కడెక్కడ నాటాలో చెప్పి, అక్కడ పాదులు తవ్వించడం మొదలెట్టాడు. రచ్చబండ దగ్గర ఊర్లోని పెద్దలు కొందరు కూర్చుని,బాతాఖానీ  కొడుతున్నారు. పక్కనే పెద్ద వేప చెట్టు... దాని చుట్టూ పెద్ద అరుగు.... దానిమీద గుంపులు గుంపులుగా మరికొందరు కూర్చుని లోకాభిరామాయణం మొదలుకొని రాజకీయాల వరకు తీవ్రంగా చర్చించుకుంటున్నారు... మరోవైపు వీధిలో, టీనేజ్ నుండి పాతికేళ్ల వయసున్న వాళ్ళు ఏడెనిమిది మంది క్రికెట్ ఆడుతున్నారు. పిల్లలంతా ఒక్కసారిగా బిలలమంటూ సైన్యంలా వచ్చేసరికి అందరి దృష్టి వాళ్లపైనా, వెనకే వస్తున్న టీచర్లపైనా పడింది.
" ఏంటిరో.. ఏం చేస్తున్నారిక్కడ?... దేనికలా తవ్వుతున్నారు? "
ఒకాయన తలతిప్పి అడిగాడు పిల్లల్ని. రమణ వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు.
" సరి సరి ! బాగుంది వరస! వీళ్లు నాటడం... అవి పెరిగి పెద్దవై చింతకాయలు, నిమ్మకాయలు, కాయడం!"
 అందరూ నసిగారు. క్రికెట్ ఆడుతున్న వాళ్లంతా గొల్లున నవ్వేశారు ఒక్కసారిగా. పిల్లల మొహాల్లో అసంతృప్తి చోటు చేసుకుంది. టీచర్లు అసహనంగా ఇంకా వాళ్ల ధోరణికి అవమానంగా ఫీలయ్యారు. రమణ వాళ్లకేదో సర్ది చెప్పబోయాడు. సాధనకు కోపం ముంచుకొచ్చింది. కిట్టయ్య, సూరమ్మ నిరక్షరాస్యులు.. వయసు పైబడ్డవారు... ఊర్లో పెద్దలూ వాళ్ల లాగే మాట్లాడడం ఆమెకు బాధ అనిపించింది. ఇక ఆగలేక ముందుకు కదిలింది.
" చూడండన్నా... ఈ వేప చెట్టు ఎవరు నాటారో ఎప్పుడు నాటారో మీకు తెలుసా? "
"................"
"... తెలీదు. కానీ ఈరోజు మీ అందరికీ నీడనిస్తోంది. చల్లటి, ఆరోగ్యకరమైన గాలి నిస్తోంది.ఆ నాటినవాళ్లు ఎవరూ  ఇప్పుడు లేరే ! మనం చేసే ప్రతి మంచి పని మనకే  ఉపయోగపడాలని ఉందా? ! చెప్పండి.."
అంతా మొహమొహాలు చూసుకున్నారు. ఒకాయన ముందుకొచ్చి, 
" ఇదివరకూ  కొందరు ఇలా వచ్చి నాటి పోయారమ్మా. కానీ మూడు రోజుల తర్వాత చూస్తే ఎండిపోయాయి. లాభమేముందీ  అని !"
అన్నాడు. 
" వాళ్లంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు.. వీటికి చుట్టూ కంచెలు  వేయిస్తాం. ఒక్కో విద్యార్థికీ మూడు నాలుగు మొక్కలు అప్పజెబుతాం. వాళ్లు రోజూ  నీళ్లు పోస్తారు. వాటి సంరక్షణ బాధ్యత ఇక వాళ్లదే... "
".............."
"... నాటినవన్నీ బ్రతకాలని లేదు కదా... కొన్ని నిలిచినా  మేలే కదన్నా... ప్రభుత్వం ఓ పని చేపట్టి మాకు అప్పగించింది. పెద్దలు మీరు మాతో సహకరించాలి. పిల్లల్ని ఇలా నిరుత్సాహపరిస్తే ఎలా"? సరేనమ్మా అంటూ పక్కకు తప్పుకున్నారు అంతా.వాళ్లలో మార్పు ఆశించలేదు సాధన. మౌనంగా ఉండి పోవటం మంచిది కాదనిపించి నోరు తెరిచింది, అంతే! కానీ పర్వాలేదు. వాళ్లు వాదనకు దిగలేదు.. అది చాలు అనుకుందామె. ఓ పక్క నిలబడి చోద్యం చూస్తున్న క్రికెట్ బ్యాచ్ వాళ్ళని చూస్తూ, 
" బాబూ,  మీరు ఈ తరం వాళ్లు.. పిల్లలకు చేయూత నివ్వాలి  కదా!హేళన చేయొచ్చా !"
అన్నది. వాళ్లు ఏమనుకున్నారో ఏమో... బ్యాట్స్ పక్కన పెట్టేసి, పిల్లల వైపు నడిచారు. సాధన మాటతీరుకు అచ్చెరువొందాడు రమణ. టీచర్లు ఆమెవైపు అభినందనగా చూశారు. పిల్లలు హుషారుగా పనుల్లో నిమగ్నమయ్యారు.సాధన చిరునవ్వుతో వెళ్లి తనూ వాళ్ళతో చేయి కలిపింది. 

🙂😇👧🙋😇🙂👧🙋🙆😇🙂👧🙎🙂👷👧🙂🙋



Wednesday, May 3, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే-16-కవిత్రయం ..

🌺
  
     ఇంటర్ అయ్యాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ విజయవాడ మేరీస్టెల్లా (Maris stella) కాలేజీలో చేర్పించారు మా నాన్నగారు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్.. అమ్మాయిల కోసమే. చాలా పెద్ద కాలేజీ. చుట్టూ పెద్ద కాంపౌండ్... ముందువైపు మూడంతస్తుల బిల్డింగ్. లోపల వెనకవైపు హాస్టల్.. అదీ మూడంతస్తులే. పటమట, బెంజి సర్కిల్ లో ఉండేది. మంచి పేరున్న కాలేజీ అని చేర్పించారు... కానీ, అక్కడి వాతావరణం నాకు అలవాటు కావడానికి కొంత సమయం పట్టింది. నెల రోజులు గడిచాక, కాలేజీలో, హాస్టల్లో నలుగురైదుగురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. 
   ఉదయం బ్రేక్  ఫాస్ట్ అయ్యాక తొమ్మిదింటికి కాలేజీకి వెళ్లడం, మధ్యాహ్నం 12.30 కు లంచ్ కు హాస్టల్ కు రావడం ! డైనింగ్ హాల్ చాలా పెద్దదిగా, బాగా మోడర్న్ గా ఉండేది. పెద్దపెద్ద టేబుల్స్, చుట్టూ ఛైర్స్! దానికి తగ్గట్టే ఫుడ్ ! గంటలో తినడం, తిరిగి మధ్యాహ్నం క్లాసులకు పరుగులు తీయడం !నాలుగున్నరకనుకుంటా...క్లాసులవంగానే హాస్టల్ రూమ్ కి చేరుకోవడం..కాలేజీకి, హాస్టల్ కూ మధ్యలో ఓ కాంటీన్ ఉండేది. చాక్లెట్స్ దగ్గర్నుండి సమోసాలూ, అన్నీ తక్కువ ధరలకే ఇచ్చేవారు. స్టూడెంట్స్ కోసమే ఆ వెసులుబాటు ! పావలాకు ఓ పొట్లం నిండా మిక్చర్, రూపాయి, రెండు రూపాయలకు కేక్స్... అలా ఉండేవి ధరలు!మాకు నచ్చినవి కొనుక్కుని తింటూ రూమ్ కెళ్ళేవాళ్ళం. ఈ దినచర్య అలవాటయ్యాక బాగానే ఉందనిపించింది నాకు. ఆ తర్వాత రోజులు చకచకా జరిగిపోవడం కూడా జరిగింది.
   ఇంతకీ... ఇదంతా ఇప్పుడు ఎందుకు రాయాలని అనిపించింది అంటే... ఫస్ట్ ఇయర్ మొదట్లో క్లాసులో ఎదురైన ఓ చిన్న అనుభవం... ఇప్పటికీ  అలా నా మదిలో నిలిచిపోయింది. అది గుర్తొచ్చినప్పుడల్లా నాలో ఏదో ఆహ్లాదకరమైన భావన!
  చేరి వారమై ఉంటుందేమో! మెల్లి మెల్లిగా క్లాసులు మొదలై పుంజుకుంటున్నాయి. ఆరోజు మధ్యాహ్నం సెకండ్ పీరియడ్. తెలుగు క్లాసు మొదలవబోతోంది.లాంగ్వేజి క్లాస్ కాబట్టి అన్ని గ్రూపులవాళ్లూ కలుస్తారు. అలాగే మా గ్రూప్ వాళ్ళం కూడా వచ్చాము. అప్పటికే మిగతా గ్రూపులవాళ్లంతా వచ్చేసి, క్లాస్ రూమంతా ఆక్రమించేశారు. పెద్ద హాలు !గ్యాలరీస్ తో ! ముందంతా నిండిపోయిఉంది. వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెనక్కి వెళ్లి, అక్కడ మిగిలిపోయిన ఖాళీ సీట్లలో సర్దుక్కూర్చున్నాం. అసలే ఆడపిల్లలు ! గలగల మాటలు, కిలకిల నవ్వుల్తో క్లాసంతా గోలగోలగా ఉంది. అంత గోలా ఠక్కున ఆగి,  నిశ్శబ్దం అలుముకుంది  ఒక్క క్షణంపాటు ! మరుక్షణంలో.... ఒకావిడ నెమ్మదిగా నడుస్తూ వచ్చి స్టేజి ఎక్కి నిల్చుంది. మరీ  ఎత్తు మరీ పొడుగు కాక కాస్త బొద్దుగా ఉంది. గుండ్రటి ముఖం. ముడి వేసుకుని  చాలా హుందాగా ఉంది. అందర్నీ చూస్తూ చిన్నగా నవ్వి, 
" హాయ్! అమ్మాయిలూ, నా పేరు రమాదేవి. తెలుగు లెక్చరర్ని..."
 అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ మొదలెట్టారావిడ. 
"... ఇది మన మొదటి క్లాసు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. ఎలా చెప్తారో చూద్దాం...ప్రశ్నలంటే భయపడకండే .అయితే  నేను అడిగిన వాళ్లు మాత్రమే చెప్పాలి..."
 అంటూ క్లాసంతా తేరిపారజూసింది.ఆచూపులు అటూ ఇటూ, ఇటూ అటూ కలయదిరిగి చివరికి  సరిగ్గా వచ్చి చిట్ట చివర్లో కూర్చున్న నా మీద పడ్డాయి. అంతే !వెంటనే, నావేపు వేలు చూపిస్తూ, 
" అమ్మాయ్, నువ్వు చెప్పు.. కవిత్రయం ఎవరు? "
ముందున్న వాళ్లంతా తలలు వెనక్కి తిప్పి ఎవరా అని నావేపు చూపులు సారించారు.  ఒక్కసారిగా గుండె దడదడలాడింది నాకు.మొదటి క్లాసు. అంతమందిలో లేచి చెప్పాలంటే బిడియంగా అనిపించింది. పైగా చివరిగా దూరంగా ఉన్నాను. జవాబు అయితే బాగా తెలిసినదే... కానీ తప్పదనుకుంటూ బెరుగ్గానే లేచాను. అందరికీ వినబడాలి కదా... ముఖ్యంగా మేడమ్ గారికి !నీళ్లు నములుతూ నిల్చోక,  గట్టిగా గడగడా చెప్పేశాను. (అలా ఎలా చెప్పగలిగానో.. ! తర్వాత నాకే  ఆశ్చర్యం కలిగింది). దీనికే అంత ధైర్యం కావాలా! అనిపించొచ్చు. కానీ ఆ వయసు... ఆ 'సిచువేషన్' అలాంటిది మరి నాకు!! 
" నన్నయ భట్టు , తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ "
చెప్పీచెప్పగానే, 
" గుడ్... వెరీ గుడ్.."
అనేసి, 
"... నీ పేరేంటమ్మాయ్? "
అనడిగారు. చెప్పాను. 
" చక్కటి పేరు..."
అని అందరి వైపు చూస్తూ, 
" ధరిత్రికి కవిత్రయం అంటే చాలా గౌరవంలాగా ఉంది. కవిత్రయం ఎవరు అనడిగితే  అందరూ నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అని  సింపుల్ గా వాళ్లు ముగ్గురూ అదేదో వాళ్ల క్లోజ్ ఫ్రెండ్స్ అయినట్లు చెప్తుంటారు. కానీ ఈ అమ్మాయి నన్నయ భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ అని పూర్తిగా చెప్పేసింది. అలా ఉండాలి రెస్పెక్ట్ అంటే...!"
అని నవ్వేశారామె. క్లాస్ అంతా శృతి కలిపింది. 'అమ్మయ్య' అని నిట్టూర్చి చటుక్కున కూర్చుండిపోయాను. అనూహ్యంగా నాలో ఏదో తెలీని సంతోషం ! అలా  మొత్తం క్లాసంతా అనుకోని విధంగా మొదటి రోజే నా పేరు తెలిసిపోయింది. ఆ రోజు నుండీ క్లాసు బయట ఆ మేడంగారు ఎక్కడ కనిపించినా, నన్ను చూసి పలకరింపుగా నవ్వేవారు. అలా  ఆరోజు జరిగింది నా స్మృతిపథంలో చక్కటి జ్ఞాపకంలా నిలిచిపోయింది. నా  కాలేజీ రోజుల్లోని మరపురాని ఓ మధురస్మృతి అది !! కవిత్రయం అన్న మాట ఎవరి నోట విన్నా, ఎక్కడ చదివినా నాకదే గుర్తొస్తూ ఉంటుంది. 🙂
*****************************************