Sunday, December 31, 2023

మనసారా స్వాగతిద్దాం...


🌷నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌷
2024

 

🥀 నూతనం...నిత్యనూతనం 🐦
 నూతన సంవత్సరం 
*****************
 క్షణం ఆగదు...అరక్షణం వెనక్కి చూడదు...          
    వేచి ఉండదు..విలువైనదాననంటుంది...
    వదులుకోవద్దు నను...వాడుకోమంటుంది...
    చేజార్చుకుని చింత చేయొద్దంటుంది...
    నడుస్తూ నడుస్తూ...నిత్యం..అనునిత్యం..
    సాగుతూ..సాగుతూ..ముందుకే పయనం !!🥀🌷

    బద్ధకం లేనిది...బడలిక ఎరుగనిది...
    ఎవరికీ తల వంచనిది...ఎవరికోసం నిలవనిది... 
    ఎవరూ ఊహించని ఉత్పాతాల్ని 
    ఉన్నట్టుండి సృష్టించేది తనే... 
    ఎన్నడూ ఆశించని ఆనందాల్ని 
    అందించేదీ మళ్ళీ తనే !!       🥀🦋

    తనువు గాయాలను 
    మందు రాసి మాన్పుతుంది...
    మనసు గాయాలను 
   'మరపు' తో మటుమాయం చేస్తుంది...
    గతం గతః...అంటుంది...
    ఊరడిస్తుంది... లాలిస్తుంది... 
    కొత్త ఊపిరులు పోస్తుంది...!🥀🤗

    క్షణాల్ని వత్సరాలుగా మారుస్తూ...
    వడివడిగా తడబడక.. కదుల్తూ కదుల్తూ 
    యుగాలుగా సాగుతున్న పయనమిది !
    అపూర్వ కాలగమనమది...!!
    పన్నెండు నెలలకోసారి
    సంతరించుకుంటుంది కొత్తదనం...
    అయినా.. ఎప్పటికప్పుడు
    నూతనమే...! నిత్యనూతనమే!! 🥀💐
    
    నూతనోత్సాహాన్ని మీలో నింపడమే
    నాధ్యేయమంటుంది...అదిగో... 
    అల్లదిగో... మళ్లీ అతి  సమీపాన...
    కదిలి వస్తోంది... మరో కొత్త సంవత్సరం...!!
    మన కోసమే... మనందరి కోసమే...
    పదండి... పచ్చతోరణాలు సిద్ధం చేద్దాం...
    పదుగురితో ఆడుదాం...పాడుదాం..
    మనసారా స్వాగతిద్దాం.... 🥀💐🦃

   🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

    




                         


Saturday, December 23, 2023

ఈ సమయం గడిచిపోతుంది...

🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🥀🌷🌷🥀🌷🌷

కష్టాలు... కన్నీళ్లు... అశాశ్వతం...
వస్తూపోయే చుట్టాలవి...ఇది నిజం... 
భగవానుడు సూచించిన దివ్య మంత్రం... 
"గడిచిపోతుందిలే ఈ సమయం" అనుకో నేస్తం...
తక్షణం పొందుతావు ఉపశమనం...!!

🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷

Sunday, December 17, 2023

అత్తగార్లూ...ఆలోచించండి.. కథ

 మాలిక పత్రిక డిసెంబర్ 2o23 సంచికలో 

" అత్తగార్లూ... ఆలోచించండి " కథ 

రచన : యం. ధరిత్రీ దేవి 

ఇంద్రభవనం !!

    " హైమా, మీ బావగారిది రెండు చేతులా ఆర్జించే ఉద్యోగం. వద్దంటే వచ్చి పడ్తున్న డబ్బు ! ఏంచేసుకోవాలో తోచక రెండంతస్థుల భవనం కట్టేశాడు. అది చూసి నువ్వు మీ అక్కతో నిన్ను పోల్చుకుంటూ ఫీలయిపోతున్నావేంటి ! నా జీతం గురించి నీకు బాగా తెలుసు. అయినా వస్తున్న దాంట్లోనే హ్యాపీగా ఉంటున్నాం కదా ..."
" అది కాదండీ... "
 భార్య మాట వినిపించుకోకుండా, 
"... చిన్న వయసులోనే మనం సొంత ఇల్లు కట్టుకోగలిగాం. ఎంతమందికి సాధ్యమవుతుంది చెప్పు! మూడు సెంట్లలో  అయినా చక్కగా అన్ని వసతులూ  ఉన్నాయి మనకు. లేనిపోని గొప్పలకు పోయి అప్పులపాలవుదామంటావా  చెప్పు!... "
 అన్నాడు ప్రసాదరావు. 
 హైమావతి, ప్రభావతి సొంత అక్కాచెల్లెళ్ళు. రెండు  రోజుల క్రితం ప్రభావతి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్లొచ్చారు హైమావతి దంపతులు.ఐదున్నర సెంట్లలో డ్యూప్లెక్స్  బిల్డింగ్... చాలా ఆడంబరంగా కట్టారు. ఆ వైభోగం..అదీ... చూసేసరికి... హైమావతికి కళ్ళు తిరిగాయి. 
     అంతేకాదు... రెణ్ణెల్ల  క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు శశిరేఖ కూడా తన గృహప్రవేశానికి పిలిచింది. అదీ  అంతే!  ఇంద్ర భవనాన్ని తలదన్నేలా ఉంది. ఈ రెండూ... హైమావతిలో తీవ్ర అసంతృప్తిని రేపాయి. అంతే ! అప్పట్నుంచీ.... భర్త దగ్గర ఒకటే నస! సణుగుడు !! 
" మనమూ అలాంటి ఇల్లు కట్టుకోవాలి.. ఇది చాలా చిన్నదిగా  ఉంది.. ఓల్డ్ ఫ్యాషన్ కూడా..."
అంటూ !
 " ఊరుకోండి,  మీరు మరీ చెప్తారు.. వాళ్లు లోన్ తీసుకునే  కట్టారట! అక్క చెప్పింది. మనమూ  అలాగే చేద్దాం. శశిరేఖ కూడా అంతే... చిన్నప్పట్నుంచీ  చూస్తున్నా దాన్ని... "
" ........... "
"... ఎలాగూ  మనకు ఇంటి స్థలం రెడీగానే ఉంది. ఏముంది.. నెల నెలా ఇంత చెల్లించుకోవచ్చు.. "
భర్త మాటలకు అడ్డుతగులుతూ తేలిగ్గా అనేసింది హైమావతి. 
" ఓహో, అదన్నమాట నీ  భరోసా! అది రేపటి అవసరాల కోసమంటూ తీసిపెట్టాను. నీకూ  తెలుసు. అయినా స్థలం ఉంటే చాలా... కట్టాలి కదా! ఓ వైపు పెరుగుతున్న పిల్లలు ! వాళ్ల చదువులు.. మిగతా ఖర్చులు! ఏ మాత్రం ఆలోచన అన్నది లేకుండా మాట్లాడకు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి ఎలా తీరుద్దామనుకుంటున్నావు !..... "
 భార్య నోటికి తాళం వేసే ప్రయత్నం చేశాడు వర ప్రసాదు. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది హైమావతి. అలా అలా ఈ సంభాషణ మరో నెల దాకా కొనసాగుతూనే ఉంది. చివరికి దిక్కు తోచని వర ప్రసాదు భార్య పంతానికి తలొగ్గక తప్పలేదు. 
" సరే... చూస్తాను... లోన్ ఎంతవరకు వస్తుందో కనుక్కుంటాను... ఆ ప్రయత్నాల్లోనే ఉంటానులే.. ఇంక సణుగుడు  ఆపు... "
అన్నాడో ఉదయాన ! భర్త నోటి నుండి ఆ మాట వెలువడేసరికి... అప్పుడే ఇల్లు కట్టుకున్నంతగా సంబరపడిపోయింది హైమావతి.
                **            **             **
    సాయంత్రం టీవీ చూస్తోంది హైమావతి.... భర్త, పిల్లలతో కలిసి. ఏ న్యూస్ ఛానల్ చూసినా.. ముంచెత్తుతున్న వర్షాలు.... వరదలు.. కాంక్రీట్ బిల్డింగుల్లోకి సైతం నీళ్లు దూసుకు వచ్చేసి, అతలాకుతలం చేసేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల గుడిసెలయితే దారుణం ! పై భాగం మాత్రం కనిపిస్తోంది.
     వారం రోజులుగా ఇవే దృశ్యాలు అంతటా. హైమావతి గుండె బరువెక్కి పోతోంది అదంతా చూస్తూ ఉంటే.
" దేవుడా, వీళ్ళ పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఎంతకాలమని పునరావాసం కల్పిస్తుంది? తిరిగి వాళ్లు సొంతగూటికి చేరాల్సిందే కదా... ఆ గుడిసెలు ఇంకెన్నాళ్లకు మామూలు స్థితికొస్తాయి ! వాళ్ళ జీవితాలు మళ్ళీ ఎప్పుడు గాడిలో పడతాయి ! అంతర్మధనం ప్రారంభమైంది ఆమెలో ! ఒకసారి తన ఇల్లు పరకాయించి చూసుకుంది. ఎత్తైన ప్రదేశంలో చక్కగా కట్టుకున్న రాతి  కట్టడం. చిన్నదే గానీ... చూడముచ్చటగా ఉంది. చుట్టూ అంతా తమ స్థాయికి తగ్గ వారే.
     భర్త పొదుపరితనంతో, ముందుచూపుతో ముప్ఫయి సంవత్సరాల వయసు లోపలే సొంతంగా ఏర్పరచుకున్న అందాల బొమ్మరిల్లు అది ! దీన్ని వదిలేసి ఎక్కడికో పరుగులు తీయాలనుకుంటోంది తను ! అంతేకాదు.. భర్త సహనానికీ పరీక్ష పెడుతోంది. ఇప్పటివరకూ చీకూ చింతా లేకుండా సాగిపోతోంది జీవన రధం...ఇకపై...!   సన్నగా అలజడి మొదలైంది హైమావతిలో.
    మరి ఈ గుడిసెవాసుల  పరిస్థితి ఏమిటి ?  మరోవైపు కోట్లు వెచ్చించి  అంత గొప్పగా కట్టుకున్న ఇళ్లలోకి కూడా ప్రవాహంలా వచ్చేస్తోందే  నీరు !! వారం నుండీ కలత నిద్రే దిక్కవుతోంది ఆమెకు.
               **              **           **
 " హైమా,  హైమా..లే.. ఈ వార్త  చూడు.."
 హడావుడిగా లేపాడు వరప్రసాద్. ఇంకా తెల్లారలేదు. భర్త కంగారు చూసి నిద్ర మత్తు ఎగిరిపోయి పేపర్ చూసింది హైమావతి. ఆమె బావ గారి ఫోటో ! దానికి సంబంధించిన న్యూస్ ! గబగబా చదివేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన ఇంటిని సోదా చేశారట ! అక్రమార్జన అంతా బయటపడిందట !.... ఇంకా చాలా చాలా రాశారు...
' దేవుడా!'
కళ్ళు తేలేసింది హైమావతి. మధ్యాహ్నం దాకా  కోలుకోలేక అన్యమనస్కంగానే వంట పూర్తి చేసింది. ఏమిటో ! మనసంతా దిగులుగా, గాభరాగా అనిపించింది. మెల్లిగా వెళ్లి, రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకుని అలా పడుకుండిపోయింది. వెంటనే ఓ స్థిరనిశ్చయానికొచ్చి లేచి ఫోన్ అందుకుంది.
" ఏవండీ, ఎక్కడున్నారు? "
" ఆఫీసులో.ఆ...హైమా, లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి. ఇక సబ్మిట్ చేయడమే. ఓ గంటలో  పనయిపోతుంది..."
" వద్దండీ.. ఏ లోన్ వద్దు. మీరు ఆ ప్రయత్నం మానేయండి.."
" అదేంటీ, అంతా రెడీ అయ్యాక.... !"
" మరేమీ  పర్వాలేదు. మనకున్న ఇల్లు చాలు. ఏ ఇంద్రభవనమూ అక్కర్లేదు.  మనకొద్దు.." 
 క్షణం విస్తుబోయినా.... వరప్రసాద్ కు విషయం వెంటనే బోధపడింది. అతని పెదవులపై చిన్నగా నవ్వు!!

******************************************


       

Thursday, December 14, 2023

ఇంద్రధనుస్సు...The Rainbow...ONE మరోసారి..

<><><><><><><><><><><><><><><><><><><>
                       🌈ఇంద్రధనుస్సు 🦃
                         🥀---The Rainbow 🦋
                ***  అంబరాన మెరిసిన వర్ణచిత్రం... 
                   అదృశ్యహస్తం అద్భుతవిన్యాసం🐦
<><><><><><><><><><><><><><><><><><><>
🌷
 ఇంద్రధనుస్సులో ఎన్నో రంగులుంటాయి.ఒక్కోరంగుదీ ఒక్కో ప్రత్యేకత...ఒక్కో అందం.అలాగే సాహిత్యంలో కూడా వివిధ ప్రక్రియలు...కథ, కవిత, వ్యాసం, పద్యం, నాటకం,గేయం,శ్లోకం,సుభాషితం..ఇంకా...సామెతలు, హాస్య సంభాషణలు, పదవినోదాలూ,పజిల్స్..అలా అలా...ఎన్నో..ఎన్నెన్నో.. వైవిధ్యమైన అంశాలు చోటుచేసుకుని అలరిస్తూ మనసుకు ఆహ్లాదాన్నీ, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ అందిస్తూ ఉంటాయి.    
   ఈ ఇంద్రధనుస్సులో...నేను అక్కడక్కడా చదివినవీ, నాకు తెలిసినవీ, ఇంకా నా సొంత ఆలోచనలతో(✍️) రూపు దిద్దుకున్నవీ...దర్శనమిస్తాయి🙏
====================================== ఇందులో...                                  
*  సుభాషితం...వాగ్భూషణం           
*  చిన్నకథ    ....అందని ద్రాక్ష.. 
*  స్ఫూర్తి...the greatest fault..
*  మనసు పలికిందిలా..మల్లెలివి..
*  చిన్నారి పజిల్స్🤷‍♀️👷తమాషా వాక్యాలు 
*  😄😀 🤗🤭       
మరిన్ని...
                                  ----సమర్పణ : యం.ధరిత్రీ దేవి 
===============================                          *  🌷 సుభాషితం 

     కేయూరాన విభూషయంతి పురుషం 
     హారాన చంద్రోజ్జ్వలా: 
     న స్నానం న విలేపనం న కుసుమం 
     నాలంకృతా మూర్ధజా:
     వాణ్యేకా సమలంకరోతి పురుషం 
     యాసంస్కృతా ధార్యతే 
     క్షీయంతే ఖలు భూషణాని సతతం 
     వాగ్భూషణం భూషణం 👌
    
 👉 భుజకీర్తులు, మెడలో మెరిసే హారాలు, కురులకు సొగసైన అలంకారాలు, పుష్పమాలలూ, పన్నీటి స్నానాలు... ఇవేవీ  మనిషికి  అసలైన అలంకారాలు కావు. వినయం, చక్కటి సంస్కారం, మృదువైన మాటలు... ఇవే మనిషికి ఆభరణాలు. మిగిలినవన్నీ నశించిపోతాయి. మృదువుగా మాట్లాడే మంచి మాట మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి ఎవరికైనా వాక్కు అనే భూషణమే అసలైన భూషణం. మనిషికి అదే అసలైన ఆభరణం...అలంకారం. 
   భర్తృహరి నీతి శతకం లోనిది ఈ శ్లోకం. ఏ ఆభరణమూ ఇవ్వలేని విలువ మనిషికి మంచి మాట ఇస్తుంది... ఎంత చక్కని మాట!!
         గూగుల్ లో ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది ఈ శ్లోకం. ముఖ్యంగా, మొదట్లో 'కేయూరాణి న విభూషయంతి' అని ఉంది. 'కేయూరాన విభూషయంతి'అని మరికొన్ని చోట్ల ఉంది.   . అలాగే మరికొన్ని పదాలూ...! ఇందులోని భావం నచ్చి పొందుపరిచాను. ( ఇదే శ్లోకం మరి కాస్త వివరంగా ఇదే బ్లాగులో 'వాగ్భూషణం భూషణం' అన్న పేరుతో 7.8.2020 న  రాశాను. )
======================================
                        *  చిన్న కథ ✍️

      ✴️ అందని ద్రాక్ష పండ్లు పుల్లన... ఈ కథ తెలియని వారుండరు, ఆ తరం నుండి ఈ తరం వరకూ... అందులో నక్క... దాని ఆలోచనా  సరళి ఎలా మారి పోతుందో తెలుసుగా...! ఈ క్రింది భార్యాభర్తల సంభాషణ చూడండి... ఏమైనా పోలికలు కనిపిస్తాయేమో!!
                            #         #         #
" ఏమే,ఇలారా.. పేరయ్య గారొక సంబంధం చెప్పారు. అబ్బాయి ఇంజనీరట. లక్ష పైగానే జీతం. ఒడ్డు, పొడుగూ, అందం చందం, ఆస్తి అంతస్తు అన్నీ బ్రహ్మాండంగా  ఉన్నాయి.ఒక్కడే కొడుకట !అక్కచెల్లెళ్లెవరూ లేరట ! లక్షలు కాదు కోట్ల ఆస్తి.. సరే చూద్దాం అన్నాను... ఏమంటావ్..."
కృష్ణారావు భార్య కాంతంతో ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. ఉబ్బి తబ్బిబ్బయిపోయింది కాంతం.
" మరే... ఆడబిడ్డల జంజాటం  ఉండదు. అత్తమామల దగ్గర ఉండే అవసరం లేదు. హాయిగా ఇద్దరే...! లక్షల్లో జీతం. ఎంత అదృష్టం! ఇదే కుదుర్చుకుందామండీ. కట్నం ఎంతైనా సరే ఇద్దాం. ఖర్చు ఎంతైనా సరే.."
ఇద్దరూ అప్పుడే ఆ సంబంధం కుదిరిపోయిందన్నంత సంబరపడిపోయారు.
                ***           ***             ***
" ఛ ఛ! ఎలాంటి మనుషులు! అమ్మాయి నలుపట! పొట్టిగా ఉందట! తన పక్కన బాగుండదన్నాడట ! ఫోటో చూసినప్పుడు తెలీలేదా అతగాడికి!!"
కృష్ణారావు ఇంతెత్తు  ఎగిరి పడ్డాడు భార్య దగ్గర... పేరయ్య చెప్పిన వార్త చెప్తూ. 
"...అయినా, బోడి సంబంధం. పోతే పోయిందిలే... అయినా,వాడు  మాత్రం పెద్ద అందగాడా ఏంటి! చప్పిడిముక్కు...కళలేని మొహం..తోలు ఎర్రగా ఉంటేసరా !   ఇక ఉద్యోగం.. సాఫ్ట్వేర్ వాళ్ళ ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటివి కాదూ ! ఎంచక్కా గవర్నమెంట్ జాబ్ అయితే ఢోకా  ఉండదు..."
"ఔనౌను... అయినా, ఒక్కడే కొడుకన్నారు.ఆ గారాల  కొడుకును మనమూ, మన పిల్లా భరించలేములెండి. ఎంతసేపూ తల్లి కొంగు పట్టుకునే ఉండే బాపతు కాదూ... ఇలాంటి కొడుకులు ! లక్షణంగా ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉండే సంబంధం చూసుకుందాం, "
వంత పాడింది కాంతం.
" అంతే అంతే. పేరయ్యకు చెప్తా, అలాంటి సంబంధం ఏదైనా ఉంటే చూడమని...అయినా ఏదో అనుకున్నాం గానీ ఏవో  లొసుగులున్నాయంటలే వాడిలో.."
కృష్ణారావు చెప్పులేసుకుంటూ బయటపడ్డాడు. 'అందని ద్రాక్ష పండ్లు పుల్లన...అన్న చందాన లేరూ వీళ్ళు !! 
====================================
                          *  స్ఫూర్తి 👌

👉  గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా.... దాన్ని చేరుకునే                 మార్గం  మాత్రం నీ పాదాల క్రింది నుంచే 
       మొదలవుతుంది.
👉   ప్రయత్నం చేసి ఓడిపో... కానీ... 
       ప్రయత్నం చేయడంలో  ఓడిపోకు.    
👉   The greatest fault is to think 
       that you are faultless.
=====================================
               *   మనసు పలికిందిలా ✍️
               🎶🎻🎺🎼🎸🎺🎷🎸🎶

                             * మల్లెలివి...
✴️
పగలంతా సడిసేయని మౌనం... 
రాత్రికి ముగ్ధమోహన సౌందర్యం...
మెల్లగా...మెల్లమెల్లగా విరిసి విరిసి 
విచ్చుకుంటూ వెదజల్లే సుగంధం... 
పరిమళభరితం...మదినిండా ప్రమోదం...
మల్లెలివి...శ్వేతవర్ణ కుసుమాలివి... 
గుదిగుచ్చిన మాలగ మారితే 
మగువ సిగకు సింగారం...
గుడిని జేరిందా... జన్మే ధన్యం !!🐦
=================================
                  * చిన్నారి పజిల్స్ 🧛🕵️‍

✴️ ( 'ఈనాడు' హాయ్!బుజ్జి'  లో ప్రచురితం ) ✍️

---- ఇలాంటివి సరదాగా ప్రయత్నించండి 🙂

=================================
                 🤗😄😁😃😀
( అక్కడక్కడా  మ్యాగజైన్స్ లో చదివిన జోక్స్, కార్టూన్స్ బాగా నవ్వు తెప్పిస్తుంటాయి.  అందులో కొన్ని...)  
🤗
ఇద్దరు మిత్రులు వాళ్ళ పనివాళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. 
" మా నౌకరు ఉట్టి దద్దమ్మ", ఒకతను చెప్పాడు. 
" మావాడు అంతకంటే చవట, " మరొకతను అన్నాడు. 
  ఎవరు ఎంత మూర్ఖులో పరీక్షిద్దామనుకున్నారు ఇద్దరూ.
  మొదటాయన తన పనివాణ్ణి పిలిచి, 
" ఈ పది రూపాయలు తీసుకెళ్లి టీవీ కొనుక్కునిరాపో.. "
  అన్నాడు. అలాగే అతని మిత్రుడు తన పని వాడిని            పిలిచి, 
" వెంటనే వెళ్లి, నేను ఆఫీసులో ఉన్నానో  లేదో కనుక్కొని     రా..." అని పురమాయించాడు. ఇద్దరు పనివాళ్ళు      తలలూపి వెళ్లారు. దారిలో ఒకరితో ఒకరు ఇలా   చెప్పుకున్నారు.
" ఇవాళ మంగళవారం. మా సారుకు  మంగళవారం నాడు  దుకాణాలు మూసి ఉంటాయని కూడా తెలీదు పాపం..!"
 అన్నాడొకడు. 
" మా బాసు ఒట్టి సోమరిపోతు. ఆయనే ఆఫీసుకు ఫోన్  చేసి తాను అక్కడ ఉన్నాడో  లేదో కనుక్కోవచ్చుగా..."
రెండోవాడి తెలివిది !!ఎవరెంత మూర్ఖులో తెలిసిందిగా !
 🤗
ప్రిన్సిపల్ తన విద్యార్థులతో చెబుతున్నాడు.
" మరేం పరవాలేదు.  కొత్త ల్యాబుకు ఉపకరణాలు కొనడానికి అవసరమైన నిధులు మన దగ్గరున్నాయి..."  
" మరేంటి సార్ ప్రాబ్లెమ్ !"
అడిగాడో విద్యార్థి. 
" కాకపోతే, అవి ఇంకా మీ జేబుల్లోనే ఉన్నాయి... "
😛
తెలుగు టీచర్ : "ఎద్దు, ఆవు గడ్డి మేస్తున్నారు", ఈ వాక్యాన్ని సరిచేయండి. 
ఓ విద్యార్థి : ఆవు, ఎద్దు గడ్డి మేస్తున్నారు. 
టీచర్ : అదెలా? 
విద్యార్థి : లేడీస్ ఫస్ట్ !
====================================
                 👉   *  మరిన్ని ...

🍀 ఊరట :
        ప్రపంచకప్ చేజారిపోయి, కొండంత ఆశ ఆవిరైపోయి భారత క్రికెట్ టీమ్ తల్లడిల్లుతున్న క్షణాన...మన ప్రధాని మోడీగారు డ్రెస్సింగ్ రూములో కెళ్ళి వారిని అక్కున జేర్చుకుని ఊరడించారట ! ఎంతటి ఉపశమనం ! 
" ప్రపంచకప్ ఆటలో మీ ప్రతిభ, పట్టుదల గణనీయమైనవి.గొప్ప ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసిన మీకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాం"
 అంటూ భుజం తట్టి, ప్రశంసలు కురిపించారట..!!👍
🍀 రివర్స్ :
  సాధారణంగా ఎక్కడైనా కోడళ్ళు ఆధునికంగా  (modern) ఉంటారు. అత్తగార్లేమో కాస్త సంప్రదాయబద్ధంగా ఉంటూ ఉంటారు. అవునా,  కాదా! కానీ, ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో పరిస్థితి తద్భిన్నంగా ఉందని ఓ వార్త వెలువడింది. అత్తగారేమో జీన్స్ వేస్తుందట! కోడలికేమో చీరలు కట్టడమే ఇష్టమట! పెళ్లయి అత్తగారింట అడుగు పెట్టాక... ఆ అత్తగారు  కోడల్ని జీన్స్ వేసుకోవాలంటూ ఒకటే ఒత్తిడి తెచ్చిందట! కోడలేమో పల్లెటూరి నుండి వచ్చిన కారణంగా ససేమిరా  అందట! ఆఖరికి అత్త ఒత్తిడి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందట ఆ కోడలు పిల్ల!
~~ కొసమెరుపు : ఆ అమ్మాయి భర్తతో విషయం చెప్పుకొని వాపోతే...ఆ మగడు తిరిగి  తననే కొడుతున్నాడని ఆ కోడలు  ఫిర్యాదు 🤔
🍀 మానవత్వం మంటగలిసిన వేళ :
మానవతాదృక్పథంతో ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగం కోసం జులాయిగా తిరుగుతున్న ఓ కొడుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన అతని తండ్రి మరణిస్తే... ఆ ఉద్యోగం తనకు వస్తుందని... కిరాయి హంతకులను పెట్టి తండ్రి పై కాల్పులు జరిపించాడట!! అదలాగుంటే....
🍀 మానవత్వం పరిమళించినవేళ :
తండ్రి జైలు పాలయ్యాడు. తల్లేమో అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండిపోయింది.వాళ్ళ నలుగురు పిల్లల్ని మహిళా పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. ముందుగా వారికి ఆహారం అందించారు, కానీ..వారిలో ఓ నాలుగు నెలల పసికందు ఆకలి ఎలా తీర్చాలో తెలియలేదు వాళ్లకు!అప్పుడు ఎం. ఎ.ఆర్య అనే తొమ్మిది నెలల పసిబిడ్డకు తల్లి అయిన ఓ మహిళా పోలీసు వెంటనే ఆ బిడ్డను అక్కున జేర్చుకుని తన పాలు పట్టించి ఆకలి తీర్చి, ఆ బిడ్డ ఏడుపు ఆపిందట !!కొచ్చిన్ లో జరిగిందట  ఈ సంఘటన !
రెండూ హృదయాన్ని కదిలించేవే ! ఒకటి బాధతో...ఒకటి కరుణతో..!🤔
                     --------------------------
<><><><><><><><><><><><><><><><><><><>
          🌷  అందరికీ ధన్యవాదాలు 🌷
                 🙏  మళ్ళీ కలుద్దాం 🙏
<><><><><><><><><><><><><><><><><>
      


 

Sunday, December 10, 2023

' దేవుడు లేనిదెక్కడ !

🐦 🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

దేవుడెక్కడ ? అసలున్నాడా ? 
ఉంటే ఎక్కడున్నాడు ? 
గుళ్ళూ గోపురాలు తిరిగాను...
పుణ్యక్షేత్రాలెన్నో  దర్శించాను... 
పండితులను ప్రశ్నించాను... 
పామరులతో ముచ్చటించాను... 
ఆస్తికులందర్నీ  ఆశగా చూశాను... 
ఎక్కడా జవాబు లేదు... !
ఇంతకీ---
దేవుడెక్కడ ? అసలున్నాడా ? 
ఉంటే ఎక్కడున్నాడు ? 
ఇంటి దారి పట్టాను విసిగి వేసారి.. 
ఆగుతూ ఆగుతూ..సాగుతూ సాగుతూ.. 
చూశాను అటూ ఇటూ ఓసారి... 
బీటలు వారిన భూమి !
పైనేమో మబ్బులు కమ్మిన ఆకాశం !
ఉన్నట్టుండి రాలిందో చల్లటి చినుకు !!
చూస్తున్నా... చూస్తూనే ఉన్నా...
చిరుజల్లు కాస్తా అయింది జడివాన !
పులకించిపోయింది పుడమి తల్లి...!
ఆపై ----
రోజుల వ్యవధిలో నేలతల్లి ఒడిని
చిన్ని చిన్ని మొలకలు !! 
పచ్చగా.. పచ్చపచ్చగా...! 
బీడు కాస్తా..  అయింది నేడు సస్యశ్యామలం !
అంతే ! ఎన్నో ఏళ్ల నా నిరీక్షణ
ఫలించెనో  ఏమో ! అయ్యాడు ప్రత్యక్షం
హఠాత్తుగా నా ముందు 'దేవుడు' !
'వానదేవుడు' !!
గాలికి తలలూపుతూ నులి వెచ్చని
సూర్యకిరణాల స్పర్శ అనుభవిస్తూ...
కనులవిందుగా దర్శనమిస్తూ.. పంట పొలాలు !
ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు మరో దేవుడు !
'సూర్య భగవానుడు' !
అదిగో !! కోతకొచ్చాయి పండిన పంటలు! 
రైతన్న కళ్ళలో కోటి కాంతులు !!
ఆరుగాలం శ్రమకు అందిన ప్రతిఫలాలు !
కళ్ళెదురుగా నిండైన ధాన్య రాశులు !
మళ్లీ ప్రత్యక్షం ! 
'అన్నదాత'గా మరో దేవుడు!
కనిపించే దేవుడు !!
మట్టి పిసుక్కునే ఆ మనిషే లేకుంటే...
మనిషికి మెతుకన్నదే లేదు కదా !
మరి ---
ఆ మట్టి 'మనిషి'.... 
దేవుడు కాక మరేమిటి ? 
కరిగాయి కంటిపొరలు... 
విడివడ్డాయి సందేహాలు...
గర్భ గుడిలో లేడు దేవుడు...
అంతటా ఉన్నాడు..! ఇక్కడా.. అక్కడా.. 
నా చుట్టూ.. నన్నావరించి...!
ఆపదలో నన్నాదుకునే ప్రతీ మనిషిలో.. 
పొరుగు వాడికి సాయమందించే క్షణాన...
స్వయానా నాలో.. నిండి ఉండేది..
దర్శనమిచ్చేదీ దైవత్వమే...!
నాలోనే కొలువై ఉన్న 'దేవుణ్ణి' 
గుర్తించజాలక... ఎక్కడెక్కడో తిరిగిన 
నా అజ్ఞానం పటాపంచలై..  
అయ్యిందొక్కసారిగా జ్ఞానోదయం !!
వెన్వెంటనే ---
నాలోనూ... నా ప్రశ్నలోనూ  మార్పు...!
'దేవుడెక్కడ?' కాదు...
'దేవుడు లేనిదెక్కడ?' అని !!
 చీకటి ముసిరిన నా మదిని
 వెలుగులు ప్రసరించి... గ్రహించాను 
 వెల లేని జీవిత సత్యాన్ని !! 🙏

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦




Thursday, December 7, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..20.. 'That is your seat''

🌺
    అవి నేను ఉద్యోగంలో చేరిన తొలిరోజులు. ఉపాధ్యాయినిగా ప్రైవేట్ స్కూల్లో నాలుగైదు సంవత్సరాల అనుభవమున్నా ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఇదే మొదలు. నాతో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. సంవత్సరం పాటు పనిచేశాక, అంతవరకూ HM గా పనిచేసినావిడ మరో చోటికి బదిలీ అయిపోయి, అనుకోని విధంగా నేను HM గా బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. అంతా కొత్త.. ! అవటానికది ప్రాథమిక పాఠశాలే అయినా.. రకరకాల పనులు... తెలియని విషయాలెన్నో ! మండల విద్యాధికారి, తనిఖీలంటూ మరికొందరు పాఠశాలను అడపాదడపా సందర్శించేవారు. ఏవేవో రికార్డులు చెక్ చేసేవారు. అలా అలా రెండేళ్లు గడిచాయి. ఒకరోజు...
మధ్యాహ్నం పన్నెండు అవుతోంది. నా గదిలో కూర్చుని ఏవో రికార్డులు చూసుకుంటున్నాను. తలుపు వద్ద ఓ వ్యక్తి నిలబడి ఉండడం చూసి, ఎవరా  అనుకునేంతలో, 
" నేను DEO ను... "
అంటూ లోపలకొచ్చాడు. అంతకుముందోసారి ఏదో మీటింగులో ఆయన్ని చూసిన గుర్తు. వెంటనే లేచి విష్ చేసి, ముందుకు కదిలి, నేను కూర్చున్న కుర్చీ చూపించి కూర్చోమన్నాను.
" ఎందుకమ్మా? That is your seat. నీవక్కడే కూర్చోవాలి...ఇక్కడికి ఎవరొచ్చినా నీ కుర్చీ నీదే..", 
అంటూ నా ఎదురుగా టేబుల్ ముందున్న మరో కుర్చీలో కూర్చున్నారు. ఓ క్షణం అప్రతిభురాలినైపోయాన్నేను. అంతకుముందు ఏ అధికారి వచ్చినా బరబరా వచ్చి దర్జాగా HM కుర్చీలో కూర్చోవడమే తెలుసు నాకు. నేనే కాదు...ఏ HM అయినా అలాగే తన కుర్చీ ఆఫర్ చేసేవారు.వాళ్ళూ నిరభ్యంతరంగా కూర్చునేవారు.
   ఈయన ఓ జిల్లా విద్యాశాఖాధికారి అయివుండీ ఏమాత్రం అహం అన్నది లేక ఓ చిన్న పాఠశాల ప్రధానోపాధ్యాయినికి ఎంతో గౌరవం ఇవ్వడం ఆశ్చర్యం గొలిపింది...అంతేకాదు...ఆ మాట నాలో ఏదో తెలీని ధైర్యాన్ని నింపింది. అంతవరకూ బెరుకుబెరుగ్గా ఎవరితో ఏ తంటా వస్తుందో అన్నట్లుగా డ్యూటీ చేస్తున్న నాకు ఓ కొత్త పాఠం నేర్చుకున్నట్లయింది. అప్పట్నుంచీ చిన్నచిన్న వాటికీ భయపడడం బాగా తగ్గించుకున్నాను. సమస్య ఏదైనా, ఎలాంటిదైనా సరే...ఎదురైనపుడు వెంటనే భయానికీ, ఆందోళనకీ లోనవక స్థిమితంగా ఆలోచించడం అలవడింది. అది భవిష్యత్కాలంలో నాకు ఎంతగానో ఉపయోగపడింది కూడా !! 
   ఆతర్వాత ఎన్నో సంవత్సరాలు పనిచేసినా, ఇప్పుడు రిటైరై ఇంతకాలం గడిచినా...ఆ DEO గారు, ఆయనన్న ఆ మాట "That is your seat " అన్నది ఇప్పటికీ ఇంకా నాకు గుర్తున్నాయంటే...అది వారి ఉన్నతమైన సంస్కారం...పై అధికారినన్న దర్పం ఏ కోశానా లేని ఆ వైఖరి !!
    ఉద్యోగవిరమణ జరిగి మనిషికీ, మెదడుకీ కాస్త తీరికచిక్కి, గతంలోకి తొంగిచూసుకుంటూ ఉంటే ... అప్పుడప్పుడూ     ఇలా ఒక్కో జ్ఞాపకం నిద్ర లేచి పలకరించిపోతూ ఉంటుంది. ఆ DEO గారు నాకు మళ్ళీ కనిపించిందిలేదు. పాఠశాలలోని తరగతి గదులన్నీ ఒకసారి విజిట్ చేస్తూ కొద్ది నిమిషాలపాటు సాగిన పయనం ! అయినా ...ఈరోజిలా రాయాలనిపించిందంటే...ఆ అధికారి అన్న ఆ ఒక్కమాట...That is your seat.. 
     కొందరు వ్యక్తులు యధాలాపంగా అన్న కొన్ని మాటలు మనం సరైన కోణంలోంచి చూస్తే...అవి  చక్కటి  సందేశాలే కాదు...మార్గదర్శకాలూ అవుతాయి.
******************************************
  





Friday, November 24, 2023

క్రాంతి... కథ లాంటి ఓ నిజం !

     " ఆ హైదరాబాద్ సంబంధం వాళ్లు ఇందాకా ఫోన్ చేశారే....  "
 ఇంట్లోకి వస్తూ శ్రీనివాస రావు భార్యనూ, కూతుర్ని ఉద్దేశించి చెప్పాడు. అక్కడే ఉన్న ఆ ఇద్దరూ ఒకరినొకరు ఓసారి చూసుకుని విషయం ఏమిటన్నట్లు ఆయన వైపు చూశారు. 
".. అదే.. కొన్ని సడలింపులు చేస్తూ, అలాగైతే  మాకు ఓకే, ఆలోచించుకోండి... అని  అబ్బాయి తండ్రి కాల్ చేసి చెప్పాడు. "
   నెల క్రితం ఆయన కూతురు క్రాంతిని చూసుకోవడానికి పెళ్లి వారొచ్చారు . తను మెడిసిన్ చేసి, పీజీ కూడా కంప్లీట్ చేసి, సంవత్సరం క్రితమే ఓ హాస్పిటల్ లో డాక్టర్ గా జాయిన్ అయింది. ఇప్పటికి ఏడెనిమిది  సంబంధాలు చూశారు. అన్నీ డాక్టర్ సంబంధాలే. కానీ ఏవీ  కుదరడం లేదు. క్రాంతి మరీ గొప్ప  అందంగా లేకపోయినా పరవాలేదనిపించే అందమే. చాలా విషయాల్లో వీళ్లే రాజీ పడుతున్నారు గానీ, అవతలే సమస్యగా ఉంది. అంతా ఓకే అనుకున్నాక కట్నాల దగ్గర బ్రేక్ పడుతూ విషయం ఆగిపోతోంది. ఎంతో ఖర్చు భరించి, డాక్టర్ చదువు చదివి, పైగా ఉద్యోగం కూడా చేస్తూ తిరిగి అంతలేసి కట్నాలివ్వడం, ఇంకా వాళ్ల గొంతెమ్మ కోరికలకి ఊకొట్టడం క్రాంతికి  అసలు నచ్చడం లేదు. 
" ఏమిటి నాన్న! ఇంత చదివినా ఇలా భర్త అనేవాడిని కొనుక్కోవాల్సిందేనా !అదీ మన స్థాయికి మించి ధార పోయాలా? వద్దు నాన్నా.. "
అంటూ వాదిస్తూ వస్తోంది. తల్లిదండ్రీ ' తప్పదమ్మా ' అని నచ్చజెబుతున్నా ఆమె మనసంగీకరించక అన్నీ  వెనక్కి వెళ్ళిపోయాయి.  ఎలాగోలా నచ్చజెప్పి, నెల క్రితం ఓ సంబంధం చూడడం జరిగింది. 
   అతనూ డాక్టరే. హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేస్తున్నాడట. పేరు బాలగంగాధర్. క్రాంతి ని చూడగానే మామూలుగానే అతనికి నచ్చింది. క్రాంతికి అర్ధాంగీకారమే ! తర్వాతేముంది ! షరా మామూలే... 
    నాలుగు రోజుల తర్వాత ఇచ్చి పుచ్చుకోవడాల్ని  గురించి చర్చించుకున్నారు. నలభై  లక్షల కట్నం, ముప్ఫై తులాల బంగారం, అతని ఇద్దరు ఆడపడుచులకు చెరో ఇరవై వేలు లాంఛనాలు, దీనితో పాటు పెళ్లి మీరే చేయాలి అంటూ పెద్ద లిస్ట్ చదివారు. 
     "క్రాంతికి పిచ్చెక్కిపోయింది. ససేమిరా అంటూ తండ్రితో వాదన మొదలెట్టింది. ఈసారి ఆయన క్కూడా సబబుగా తోచక... వెంటనే నో  చెప్పక ఆలోచించి చెప్తామని అప్పటికి  దాటవేశాడు. 
 " రాను రాను ఇలా తయారయి పోతున్నారేంటి  జనం! ఆలోచిస్తూ ఉంటే ఆడపిల్లల్ని పెద్దపెద్ద చదువులు చదివించడం అపరాధంలా  భావించే రోజులొచ్చాయి  తల్లిదండ్రులకి. ఏదో కాస్త చదివిన వాళ్ళకి వాళ్లకు దగ్గ సంబంధాలు కష్టపడకుండా కుదిరి  పోతున్నాయి. బంధువుల్లో క్రాంతి ఈడు  వాళ్లంతా ఎప్పుడో పెళ్లిళ్లు అయిపోయి, పిల్లల తల్లులు కూడా అయిపోయారు. ఈ పిల్లకేమో ముప్పై దాటబోతున్నాయి".
అలా వగస్తూ తల్లిదండ్రీ తల పట్టుకోవడం చూసి,వాళ్ళ  మనోగతం గ్రహించిన క్రాంతికి మనసంతా వికలమై పోయింది.
    తండ్రి అంతంత మాత్రం ఉద్యోగస్తుడు. రిటైర్ అయ్యే లోగా కూతురి పెళ్లి చేయాలని ఆరాట పడ్డాడు కానీ, కుదరలేదు. అక్కడికీ తను అప్పుడప్పుడూ కూడబెట్టిన డబ్బుతో రెండు చోట్ల ప్లాట్లు తీసి పెట్టాడు. అంతో ఇంతో బంగారం చేయించి ఉంచాడు. చదువులో హుషారుగా ఉంది కదా అని కూతుర్ని ప్రోత్సహిస్తూ, అనుకోని విధంగా మెడిసిన్ సీటు తెచ్చుకుంటే భారమనుకోకుండా చదివించాడు. చూస్తూ చూస్తూ డాక్టర్ చదివిన అమ్మాయికి అరకొర సంబంధం ఎలా చేయాలి, అన్నది ఆయన బాధ ! అక్కడికీ ఉన్నదంతా ఊడ్చి పెట్టి ఇద్దామనే  అనుకుంటున్నాడు, కానీ డాక్టర్ పెళ్ళికొడుకులు ఆకాశం లో ఉంటున్నారు ! 
   నెల దాటాక దాదాపు ఇక ఆ సంబంధం మీద ఆశలు వదిలేసుకున్నారు తల్లిదండ్రులిద్దరూ. ఇప్పుడు సడన్ గా   ఈ ఫోన్ ! సడలింపులట ! అవేంటో మరి ! 
    భార్యనూ, కూతుర్నీ కూర్చోబెట్టి చెప్పాడు  శ్రీనివాసరావు, 
" ముప్ఫై లక్షల కట్నం, పాతిక తులాల బంగారం, ఆడబిడ్డల కట్నాలలోనూ కాస్త తగ్గింపు... పెళ్లి మాత్రం మనదే నట.అదీ గ్రాండ్ గా వాళ్ళ బంధువుల్లో పలుచన  కాకుండా చేయాలట ! మన అమ్మాయి వాళ్ళ అబ్బాయికి బాగా నచ్చిందట, అందుకని మళ్ళీ ఆలోచించి, ఫోన్ చేస్తున్నాం అంటూ చెప్పారాయన. అదీ విషయం..." 
 ముగించి ఏమంటారు, అన్నట్లు చూశాడాయన ఇద్దరి వైపు.
 కుర్చీలోంచి దిగ్గున లేచింది క్రాంతి.
" నాన్నా, నాకు రెండు రోజులు టైమిస్తారా?.... "
 కూతురిమాట  కాదనటం ఎప్పుడూ ఆయనకు అలవాటు లేదు.
" సరేనమ్మా, నీ ఇష్టం..." అన్నాడు
 వెంటనే గదిలోకెళ్ళి పెళ్లి చూపులకు ముందు వాళ్ళు పంపించిన అబ్బాయి బయోడేటా పేపర్ తీసింది క్రాంతి. ఆమె చూపు చివర్లో కాంటాక్ట్ నెంబర్ అన్న చోట ఉన్న మొబైల్ నెంబర్ మీద నిలిచింది.
                      *******************

       పాత పేషంట్లందర్నీ ఓసారి పరామర్శించి, కొత్త పేషెంట్ల సమస్యల్ని తెలుసుకొని, పని ముగించుకుని లంచ్ టైం అవడంతో తన రూమ్ లో కొచ్చి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు డాక్టర్ గంగాధర్. అంతలో ఫోన్ రింగ్ అయింది. ఏదో కొత్త నెంబర్. అన్నోన్ నెంబర్ అనుకుంటూ పట్టించుకోలేదు. కానీ ఓ నిమిషం తరువాత మళ్ళీ  రింగ్ అయింది. ఎవరో తెలిసిన వాళ్లే అయి ఉంటారనుకుంటూ ఎత్తాడు.
" హలో... డాక్టర్ బాల  గంగాధర్..!"
" ఎస్...."
" నేను క్రాంతి, డాక్టర్ క్రాంతి..."
 క్షణం అతని భృకుటి ముడివడింది. వెంటనే స్ఫురించి, 
" ఓ క్రాంతి, మీరా..!"
" అవునండీ నేనే. మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి, వీలవుతుందా?... "
" ఓ... విత్ ప్లెజర్,. చెప్పండి... ఫ్రీ గానే ఉన్నాను..."
" మీ నాన్నగారు ఫోన్ చేశారట..."
" అవును.. ఇంట్లో అంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది... "
" నేను మీకు బాగా నచ్చానన్నారట !.. కాబట్టి..."
"... అవునండీ  అందుకే..."
"... ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి ప్లీజ్.. నేను మీకు నచ్చానంటున్నారు,.. బాగానే ఉంది.. కానీ మీరు నాకు నచ్చారో  లేదో అడగాలనిపించలేదా?.. "
అప్రతిభుడయ్యాడు గంగాధర్! ఏమాత్రం ఊహించని ఈ ప్రశ్నకు క్షణకాలం నివ్వెరపోయాడు. వెంటనే తేరుకుని, 
".. మీ ఇంట్లో అడిగే ఉంటారని అనుకున్నా నండీ... "
"... సారీ.. మనదేశంలో ఆడపిల్ల తండ్రులకు ఆ అలవాటు అసలు ఉండదండీ.. అబ్బాయి తరఫు వాళ్లకు నచ్చిందంటే చాలు, తెగ సంబరపడిపోయే అల్పసంతోషులు వీళ్లంతా.. "
 తికమకగా, కాస్త గాభరాగా ఇంకా ఏదో భిన్నంగా అనిపించి, " ఏమిటీ  అమ్మాయి ! ఇలా మాట్లాడుతోందేమిటి? " అనుకున్నాడు.
".. సారీ అండీ, ఇలా మాట్లాడుతోందేమిటీ, అనుకుంటున్నారు గదూ.."
 నిటారుగా అయ్యాడతను !
".. విషయానికొస్తాను. మీరు వేరే స్టేట్లో డొనేషన్ కట్టి మెడిసిన్ చదివి, డాక్టర్ అయ్యారని చెప్పారు, పెళ్లి చూపులకు ముందు. ఇప్పుడు బాగానే ఉంటుంది సంపాదన. ఆస్తులు కూడా చాలానే ఉన్నాయన్నారు. మరెందుకండీ, ఇంతలేసి కట్నాలు కానుకలు ఆశిస్తున్నారు? మగ  వాడిగా పుట్టినందుకు కట్నం తీసుకునే తీరాలా? అలా రూల్  ఏమైనా ఉందా? పైగా పెళ్లి మేమే చేసుకోవాలా? అదీ, ఘనంగా, మీ బంధువులు మెచ్చే  విధంగా.ఏ, ఆ మాత్రం కూడా మీరు చేసుకో లేరా?.. ఆ ఖర్చు కూడా కాబోయే పెళ్ళామే భరించాలా?.. "
 పక్కన పిడుగు పడినట్లుగా ఉలిక్కిపడ్డాడు గంగాధర్ ! ఇంత  డైరెక్ట్ గా, ఇంత నిర్మొహమాటంగా ఇప్పుడు మాట్లాడుతున్న ఆ అమ్మాయి పెళ్ళిచూపుల నాడు ఎంత ఒద్దికగా  కూర్చుని ఉంది ! చిత్రంగా అతనికి కోపం రాక, చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకో  ఆ అమ్మాయి వైఖరి కొత్తగా ఉన్నా, లోలోపల అతనికి నచ్చిన భావన! పైగా ఇంకా ఏం చెప్తుందో వినాలన్న కుతూహలం కూడా కలిగిందతనికి !
"... నేను మీకు బాగా నచ్చినప్పుడు ఇక ఈ కట్నాల గోలేమిటి? నేనూ మీలా ఓ డాక్టర్ నే కదా, మీలానే సంపాదిస్తున్నా కదా, చదవడానికి మాకూ అయ్యుంటుంది కదా బోలెడు ఖర్చు!  మగ పిల్లవాడి కైతే, పెళ్లి పేరు చెప్పి, అంతా కాబోయే వియ్యంకుల నుండి రాబట్టుకోవచ్చు. మరి ఆడపిల్లల తల్లిదండ్రుల మాటేమిటండీ?.. ఈ ఆచారాలు, సంప్రదాయాలు తీసి గట్టున పెట్టాలని మీ లాంటి వాళ్ళ కనిపించదా?... "
 అసలే ఈ కట్నాల గోల అసలునచ్చదు క్రాంతికి. దానికి తోడు ఇంతకు ముందు చూసిన సంబంధాలూ దాదాపు ఇలానే ఉండడంతో ఆ అమ్మాయికి విసుగూ, చిరాకూ ముంచుకొచ్చి " అసలేం  మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఇంకా అవతల ఎవరితో మాట్లాడుతున్నాను,... ఆవైపు కూడా సీరియస్ అయితే నా పరిస్థితి ఏమిటి?.. " అన్న విచక్షణ, ఆలోచన పూర్తిగా కోల్పోయిందా క్షణాల్లో ఆ అమ్మాయి ! 
    కానీ గంగాధర్ స్వతహాగా కాస్త నెమ్మదస్తుడు. అందుకేనేమో, ఎడాపెడా వాయిస్తున్నా ఆ  అమ్మాయి మాటల్ని మౌనంగా వింటూ కూర్చున్నాడు.
" బాబోయ్! పైకి కనిపించరు  గానీ, పెళ్లి సమయంలో అమ్మాయిలు ఎంత అక్కసు అణిచి పెట్టుకుంటారోగదా కాబోయే మొగుడనేవాడి  మీద, ఇంకా అత్తింటి  వాళ్ల మీద!
 అందుకే నేమొ, ఇంకా అడుగుపెట్టక ముందే అత్తారిల్లు అంటే అంత వ్యతిరేక భావన ఉంటుంది ఆడపిల్లల్లో! అనిపించిందతనికి. 
" అసలే మా అమ్మకు చాదస్తమెక్కువ. ఈవిడ గనక కోడలిగా ఇంట్లో అడుగు పెడితే అత్తా కోడళ్లిద్దరికీ రోజూ ప్రచ్ఛన్న యుద్ధమే ఉండే లాగుంది, " అని కూడా అనిపించింది గంగాధర్ కు. 
   ఏదేమైనా కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే చూసిన తనతో ఇంత  నిర్మొహమాటంగా, ఇంకా చెప్పాలంటే ఎంతో కాలంగా పరిచయమున్న వాళ్ళతో మాట్లాడినట్లు(పోట్లాడినట్లు) అంత ఫ్రీగా మాట్లాడుతోందంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ప్రత్యేకమే! అనుకున్నాడు లోలోపల గట్టిగా!అదే క్షణంలో ఏమైనా ఈ అమ్మాయిని వదులుకోకూడదని కూడా పించిందతనికి . అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ, 
"... దయతో మీరిచ్చిన సడలింపులు మాకొద్దని చెప్పాలనిపించింది. ఈ విషయం మా నాన్న తోనే మీ నాన్నగారికి చెప్పించొచ్చు. కానీ, చెప్పానుగా ఆడపిల్లల తల్లిదండ్రుల వైఖరి! పెళ్ళంటే ఆహ్లాదకరంగా, అంతా సంతోషంగా జరగాలి. నా ఉద్దేశంలో ఇష్టపూర్వకంగా, ఒత్తిడి అన్నది లేకుండా ఇచ్చిపుచ్చుకునే లా ఉండాలి కట్నకానుకలు. ఇలా బేరసారాలు నాకు నచ్చవు..."
 ఆవేశం లో ఉన్న తనకి సంబంధం తప్పిపోయినా మరేం పర్వాలేదన్న ధీమా, ఇంకా, ఒకరిద్దరు ఇలా తెగించి మాట్లాడితే కొందరిలో నైనా చలనం కలగదా  అన్న ఆలోచన చోటుచేసుకున్నాయి.
"... అయినా, ఒక వైపు అమ్మాయి నచ్చిందని చెప్తూ, మిగతా విషయాలన్నీ తల్లిదండ్రులకి వదిలేయడమేంటండీ మీ అబ్బాయిలు?... మీకంటూ ఓ వ్యక్తిత్వం ఉండదా ఏమిటి? అలా లేకుంటే నాకు ఓకే కాదు, ఇది  చెప్పడానికే ఈ ఫోన్ కాల్ !...బై.. "
"  ఆగండాగండి..."
 వెంటనే ఆపాడు  గంగాధర్.
" అమ్మో! ఏమిటా తొందర? అయినా మీరు చాలా ఫాస్ట్ అండీ... "
" అవునండీ, నా పేరే క్రాంతి, అంటే అర్థం తెలుస నుకుంటాను. లేకుంటే గూగుల్లో వెతకండి. కానీ, ఒకటి, మీరు మాత్రం చాలా స్లో.."
" ఎలా?.. "
" ఏమో, మీరే ఆలోచించుకోండి..."
 ఫోన్ కట్ అయింది. ఫోన్ పక్కన పెట్టేసి, తేలిగ్గా  ఊపిరి పీల్చుకున్నాడు, గంగాధర్. ఏదో కొత్తగా, భలేగా అనిపించి, 
" ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురయి ఉండదనుకుంటా.." అనుకున్నాడు.
    కానీ, ఆ మాటల ప్రభావమో ఏమో, మెల్లిగా అతనిలో   ఆలోచన మొదలై పెదాలపై నవ్వు విరిసింది.  అంతలో ఠక్కున ఏదో స్ఫురించింది. 
" అవునూ, ఇంతకీ, క్రాంతి అంటే ఏమిటబ్బా... "
ముందుకు చూస్తే టేబుల్ మీద సెల్ ! వెంటనే చేతిలోకి తీసుకుని ' గూగుల్ ' లోకి వెళ్ళాడు. చూడగానే క్షణం గగుర్పాటు ! 
             "విప్లవం "
      ఆవెంటనే అతని కళ్ళు మిలమిల మెరిశాయి. 

  *****************************************
          తెలుగు కథలు కవితలు వ్యాసాలు  
  *****************************************
          

 












Monday, November 20, 2023

జయాపజయాలు దైవాధీనాలు...

 

    నిజమే కదా ! జయాపజయాలన్నవి మన చేతుల్లో ఉండవన్నది ఎంతైనా నిజం. కాకపోతే...ఎవరైనా, ఎప్పుడైనా చేయవలసింది...కృషిని నమ్ముకుని పట్టుదలతో పోరాడడమే...! ఫలితం ఆ తర్వాతే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్ నిన్నటిదినం మనవాళ్ల  చేజారిపోయి ఆస్ట్రేలియాను వరించింది. ఓ అద్భుత అవకాశం తృటిలో అనూహ్యంగా అదృశ్యమై అంతులేని నిరాశలో కూరుకుపోయేలా చేసేసింది. 
    ఆశ్చర్యమేమంటే...ఎవరూ జట్టును నిందించలేదు. అవహేళన చేయలేదు. కారణం తెలిసిందే... అంతవరకూ అజేయంగా పది మ్యాచ్ లు గెలిచి, అందరికీ ఎంతో సంతోషాన్ని అందించిన ప్రతిభావంతమైన జట్టిది. అందరూ జగత్ జెట్టీలే ! రోహిత్ సారధ్యాన్ని తప్పు పట్టలేము. విరాట్ కోహ్లీ...సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టేశాడు. షమీ సరేసరి...! వికెట్ వీరుడయ్యాడు. మిగతా వాళ్ళనీ తీసిపారేయలేం. అంత సాధించిన జట్టు ఫైనల్ లో కూడా ఆషామాషీగా ఆడలేదు. అయినా...విధి బలీయం...అవతల కంగారూలు విజృంభించడం ఊహలకందని పరిణామమే !! 
   స్టేడియంలో అలుముకున్న నిశ్శబ్దం ప్రత్యర్థులకు సంతృప్తి నిచ్చిందట ! బాధాకరంగా ఉంది ఈ వ్యాఖ్య. ఏదిఏమైనా...రోహిత్ సేనది పేలవమైన ఆట అనలేము. టైం కలిసిరాలేదనుకుందాం. అయినా, ఇప్పుడు  విమర్శనాస్త్రాలు కాదు...సాంత్వనవచనాలు పలకాలి.   అంతకుముందు వారు  గెలిచిన మ్యాచ్ లు మననం చేసుకుందాం. మనసారా అభినందిద్దాం.     ఇంకా ఉత్సాహపరుద్దాం...ఎందుకంటే, పడ్డవాడెప్పుడూ    చెడ్డవాడు కాదు గనుక !అపజయాలు విజయానికి మెట్లు... అన్న సంగతి మరువరాదు...Better luck next time...
                      ****************

Friday, November 17, 2023

కాలుష్యం...తగ్గేదెలా !

☘️🍀☘️🍀☘️🍀☘️🍀🌿🍀🌿🍀🌿🍀☘️🍀☘️🍀

   ప్రస్తుతం...మన రాజధానీ  నగరమైన ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందన్న వార్త వింటున్నాం.. దానికి కారణమేమిటి ? చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలు కాల్చేస్తూ ఉండటం వల్ల ఆ కలుషిత గాలి వ్యాపించి ఢిల్లీ దాకా పాకి అక్కడ కాలుష్యం పేరుకు పోతూ అనారోగ్యానికి కారణభూతమవుతోందట ! మరి నిర్మూలన ఎలా? కృత్రిమ వర్షాలు కురిపించడం ఒక మార్గమనీ దానికి ఖర్చు చాలా అవుతుందని అంటున్నారు. అక్కడి స్కూళ్లకు కొద్దిరోజులు సెలవులు ప్రకటించారు. అలా ఎంత కాలం! తీవ్ర ప్రయత్నాల తదుపరి కాస్త అదుపులోకి వచ్చిందనుకునే లోగా దీపావళి పండగ వచ్చి టపాకాయల ఉధృతితో పరిస్థితి మొదటికొచ్చిందని వాపోతున్నారు. 
  ఢిల్లీ దాకా ఎందుకు ! చిన్న చిన్న పట్టణాల్లో కూడా మొన్న జరిగిన దీపావళి పండుగ సందర్భంగా కాల్చిన టపాసుల వల్ల ఒకేసారి వాయు కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయిందని వార్తలు వెలుపడ్డాయి. ఇందువల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులూ వాయు కాలుష్యం, శబ్దకాలుష్యాల బారినిబడి  మరింత అస్వస్థతకు గురి అవుతున్నారు.
  ఇప్పటికే రకరకాల వ్యర్థాల వల్ల వాతావరణ కాలుష్యం, పరిసరాల కాలుష్యం పరిమితిని దాటి పెరిగిపోయింది. అందులో కొన్నింటిని నివారించడం మన చేతుల్లోని పనే... అందులో అతి  ముఖ్యమైనది ఈ టపాకాయలు కాల్చడమన్నది.. ఏదైనా పరిమితి దాటితే అంతే కదా..! సరదా మితిమీరి తమతో పాటు చుట్టుపక్కల అందరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని తెలుసుకోకపోతే ఎలా ! ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కాస్తో కూస్తో అలవర్చుకోవాలి. మన తాత్కాలిక సరదా దీర్ఘకాలంలో అందరితో పాటు మనకూ చేటు తెస్తుందన్న విచక్షణ అందరిలో రావాలి.. ముఖ్యంగా యువతలో...! చేటు కలిగించే సంప్రదాయాలు, సరదాలూ తగ్గించుకుంటే కొన్ని సమస్యలు వాటంతటవే సమసి పోతాయి కదా... 

       🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

Monday, November 13, 2023

జవహర్

 



 🌹 బాలలంటే ఆయనకి ఇష్టం. బాలలకు ఆయనంటే ఇష్టం. అందుకే అయ్యాడు నెహ్రూ మామయ్య వారికి. ఆయన జన్మదినం బాలల దినోత్సవం. ఎర్ర గులాబీ ఎంత పుణ్యం చేసుకున్నదో ! ఆయన కోటుపై పొందింది స్థానం... గొప్పగా జీవించాడు. ప్రధానిగా వినుతికెక్కాడు. చెదరదు ఆ చిరునవ్వు... భరతమాత గన్న ముద్దు బిడ్డ నెహ్రూ. జవహర్ అంటే ఆభరణం. నిజంగా ఆయన ఓ ఆభరణమే.. నిజమే కదా ! బాలలందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు 🌷




Thursday, November 9, 2023

పండుగ సంతోషంగా జరుపుకుందాం...

                                            ~~ యం.ధరిత్రీదేవి~~

        🌷దీపావళి శుభాకాంక్షలు 🌷


   🌷 దీపావళి పండుగ పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. మరీ ముఖ్యంగా పిల్లలు ఎంతగానో కోరుకుంటారు. ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే టపాకాయలు కాల్చవచ్చని...కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు...ఇలారకరకాలు. అబ్బాయిలైతే... టపాకాయలు చాలా ఇష్టపడతారు. అమ్మాయిలైతే వాటికి కాస్త దూరమనే చెప్పాలి. వాళ్ళకి ఇంట్లో అమ్మలతో, అక్కలతో కలిసి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఇష్టం. 

     నరక చతుర్దశి, దీపావళి...ఈ రెండు రోజులూ సాయంత్రమవగానే ఈ దీపాల సందడి మొదలౌతుంది. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్న వేళ ప్రమిదల్ని ఇంటిముంగిట వరుసల్లో అమర్చి చూస్తే...ఆ అలంకరణ, ఆ వెలుగుల దివ్వెలు కన్నులపండుగగా కన్పిస్తూ మురిపిస్తాయి. ఆ పిదప అసలైన కార్యక్రమం...కాకరపూలు, చిచ్చుబుడ్లు కాల్చడం మొదలౌతుంది. కాకరపూలు అందరికీ ఇష్టమైనవి, భయం లేకుండా కాల్చగలిగేవి. చిచ్చుబుడ్లు మెల్లిగా మొదలై పైకి ఎగసి వెలుగుల పూలు రాల్చడం చూసి తీరాల్సిందే. రాకెట్లు ఆకాశంలోకి దూసుకుపోతుంటాయి. చిన్నతనంలో ఇలాంటివి నేనూ ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే ప్రమిదలు వెలిగించడం ప్రతిసారీ ఆనవాయితీగా మారింది. ఈ వెలుగుల పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..!
  కాకపోతే... అంతా బాగుంటుంది కానీ, చెవులు చిల్లులు పడేలా పెద్ద పెద్ద శబ్దాలు చేసే ఆ ఆటం బాంబులు అంటే నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. కొందరైతే అర్ధరాత్రయినా కాలుస్తూనే ఉంటారు. పండగ సరదాగా గడిచిపోవాలి గానీ... అందరూ విసుక్కునేలా, భయంగొలిపేలా ఉండకూడదు కదా!
  పైగా... వీటిని కాల్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి కూడా.. లేకపోతే కాకరపువ్వొత్తులు కాల్చినా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. చివరగా,  మరొక్క  విషయం.. ఒకప్పుడు ఈ టపాకాయలు కాల్చే  సంస్కృతి దీపావళి పండుగకు మాత్రమే పరిమితమై ఉండేది. దీపావళి అంటే దీపాల పండగ..టపాకాయలు కాల్చే పండగ..  అంతే.. కానీ ఇప్పుడు... అదేమిటో! ఇదీ, అదీ అని లేకుండా సందర్భం ఏదైనా సరే, కాల్చేస్తున్నారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, అన్ని రకాల ఊరేగింపులకు, అన్నింటికీ...! వాళ్ల సంతోషాన్ని ప్రదర్శించడానికి !! అవసరమా... అనిపిస్తూ ఉంటుంది. కొండొకచో...( క్షమించాలి) శవయాత్రల్లో  కూడా...!
    అన్నింటినీ మించి వాటి వల్ల వెలువడే పొగ.. ప్రమాదకరమై వాతావరణ కాలుష్యానికి కారణభూతమవుతోంది.ఇది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది.  అతి ఎప్పుడూ అనర్ధదాయకం కనుక ఓ పద్ధతిగా,  మితంగా కాల్చడమన్నది గమనించవలసిన విషయం.
   ఏదేమైనా, పండుగను పండుగలా,  ప్రమాదాలు దరిజేరకుండా జరుపుకుందాం... అందరికీ దీపావళి శుభాకాంక్షలు.💐

🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇🎆🎇

Sunday, November 5, 2023

మట్టిగాజులు

🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷🐦🌷

[ స్త్రీలకూ, గాజులకూ ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఎన్ని అలంకరణలుచేసుకున్నా....చేతుల నిండుగా గాజులన్నవి లేకుంటే ఆ అలంకరణ అసంపూర్ణమే! గాజులంటే ఖరీదైన బంగారుగాజుల గురించి కాదు ప్రస్తుతం నేను ప్రస్తావిస్తున్నది....అతి చవగ్గా లభ్యమయే మట్టిగాజుల ప్రాశస్త్యం గురించన్నమాట !నడుమ మట్టిగాజులుంటేనే ఆ బంగారుగాజుల అందం ఇనుమడించేది. పైగా అదో ప్రత్యేకతానూ ! అలాంటి మట్టిగాజుల్ని ఇష్టపడని ఆడవాళ్ళుంటారా !! ఆధునికత పేరుతో కొందరు యువతులు దూరం పెట్టినా....ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా కాంతులీనాల్సిందే... మెరిసిపోవాల్సిందే ! మగువల మనసులు దోచేసే ఆ మట్టిగాజులను తలచుకున్నపుడు నాలో మెదిలిన మరిన్ని మాటల ముత్యాలు...! ]
                                              ~~ యం. ధరిత్రీ దేవి~~
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

గాజులండీ ... గాజులు... 
మట్టిగాజులు..
లగల సవ్వడుల  గాజులు...
మురిపిస్తూ... మైమరపిస్తూ... 
మగువల  మనసులు 
దోచేసే గాజులు !!
రంగురంగుల గాజులు... 
రకరకాల గాజులు... 
రమ్యమైన గాజులు... 
రమణులకే సొంతమీగాజులు !
ముదురునీలం...ఆకాశనీలం.... ఓవంక... 
పచ్చపచ్చగా ... ఆకుపచ్చగా...మరోవంక  ! 
పసుపూఎరుపుల వర్ణమిశ్రమం !!ఇంకోవంక  !
అంబరాన ఇంద్రధనుస్సు 
విరిసి మెరిసిన చందాన... 
ఎంత శోభాయమానం !!
పగడాలు పొదిగినట్లు...
ముత్యాలు జాలువారినట్టు...
పుప్పొడి రేణువులు వెదజల్లినట్లు.. !
కళకళలాడుతూ... కనువిందు చేస్తూ...
చుక్కలు పొదిగిన గాజులు..
చుక్కలకే ఈసు పుట్టించే గాజులు..!
చక్కనమ్మల చూపుల్లో... 
చటుక్కున చిక్కుకునే గాజులు !
రంగురంగుల గాజులు..
రకరకాల గాజులు...
వన్నె తరగని గాజులు... 
వనితలిష్టపడే గాజులు .... 
అట్టపెట్టెల్లో ఒదిగి ఒదిగి ఉన్నా... 
అద్దాల మాటున దాగినా.. 
అతివల దృష్టిని దాటలేవుగా !
ఆకర్షణే ఆహ్వానమైపోదా ....
ఆగగలరా ఇంతులిక ... 
వాలిపోరా అంగళ్ల ముంగిట !
అందాల విందు ఆస్వాదిస్తూ 
నిలువగలరా అరక్షణమైన !!
వడివడిగ అడుగిడి బేరమాడకయే 
అయిపోరా సొంతదారులు !! 
సరసమైన ఆ ధరలు... నిజంగా... 
సంతోషానికి చిరునామాలు గదా !


సంప్రదాయానికి ప్రతీకలు... 
సౌభాగ్యానికి చిహ్నాలు !!
ముత్తైదువుల, ముద్దుగుమ్మల, 
ముద్దులొలికే పాపల ముంజేతుల 
ముచ్చటైన  అలంకారాలు  !
పుట్టీపుట్టగానే అయిపోయే 
హక్కుదారులు మరి ఈ పడతులు !
మరెన్నెన్ని ఉన్నా ఆభరణాలు..
నెలతలకివే కదా... 
అసలైన సిరులూ సంపదలు...!!
పసిడి గాజుల నడుమ కాంతులీనుతూ 
పసిడికే వన్నెలద్ది విరాజిల్లే మట్టి గాజులు !
ఏ శ్రమజీవి చెమటోడ్చి సృష్టించునో.. !
ఏ సృజనాత్మకత సజీవశిల్పమై 
ఇటకేతెంచి  కొలువుదీరునో .. !!
చిత్రమే ! అతివ చేతికంది 
మది  రంజింపజేస్తున్నవే !!
గోరింటతో పండిన అందాల చేతులు 
అద్దుకొనునే... కొత్త అందాలతో 
సరికొత్త సొగసులు !
పట్టుచీరల గరగరలతో... 
మేళతాళాల ధ్వనితరంగాలతో... 
కళకళలాడుతూ శోభిల్లు 
వివాహాది శుభకార్యాలు 
వెలవెల బోవా...వెలలేని 
ఈ మట్టిగాజుల చిరుచిరు సవ్వడుల   
సందళ్ళు వినిపించక  !!
అమోఘం ! అద్భుతం !
ఆ గలగల సరిగమల సంగీతం... 
వింటే చాలు మనసంతా మధురిమలు... 
ఆ సౌందర్య శోభ కంటే చాలు 
కళ్ళనిండా కోటికాంతులు !!.
అవి గాజులు...మట్టిగాజులు... 
రంగురంగుల గాజులు... 
రమ్యమైన గాజులు.. 
మగువల మనసులు దోచేసే గాజులు... 
రమణులకే  సొంతమైన గాజులు !! 

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦




 





 

Wednesday, November 1, 2023

పూలమొక్క...కథ


🌹

     " ఆముక్తా, ఒక్క నిమిషం.. ఓ మొక్క కొనాలి..."
ఆటో ఆపబోతున్న ఆముక్త ఆగిపోయి, జయంతితో బయలుదేరింది. ఆ ఇద్దరూ ఆఫీసులో కొలీగ్స్. ఇద్దరి ఇళ్లూ ఒకే దారిలో కాబట్టి, రావడం, వెళ్లడం రోజూ ఒకే ఆటోలోనే. 
     పావుగంట తర్వాత, ఓ గులాబీ మొక్క కొని ఇద్దరూ ఆటో ఎక్కారు. జయంతికి మొక్కల పిచ్చి. ఇంటి కాంపౌండ్ లో ఉన్న కాస్త స్థలంలోనే రకరకాల మొక్కల్ని కుండీల్లో  పెంచుతూ ఉంటుంది. మరో పావుగంట తర్వాత రోడ్డు మీద ఇద్దరూ  ఆటో దిగారు. జయంతి తన ఇల్లు రాగానే బై  చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆముక్త  ఇల్లు ఇంకాస్త ముందు... తనూ బై చెప్పి వెళ్ళిపోయింది. 
                  ++                ++           ++
   నెల తర్వాత.. జయంతి ఆరోజు సెలవు పెట్టింది... ఒంట్లో బాగోలేదంటూ. సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ, ఆముక్త జయంతిని చూద్దామని గేటు తీసుకుని లోపల అడుగు పెట్టింది. కాంపౌండ్ లో పది పన్నెండు తొట్లు...వాటిలో రకరకాల మొక్కలు... దర్శనమిచ్చాయి. అందులో ఒకదానిపై ఆముక్త దృష్టి.నిలిచింది. అది  నెల క్రితం జయంతి కొన్న గులాబీ మొక్కే నేమో ! ఎదుగూ బొదుగూ  లేకుండా ఉంది... పైగా ఆకులన్నీ దాదాపు రాలిపోయాయి. కానీ పచ్చగానే ఉంది. గేటు చప్పుడు విని, జయంతి బయటకు వచ్చింది.
" ఆముక్తా, నువ్వా, రా,  "
అంటూ లోపలికి తీసుకెళ్లింది. 
" ఏమీ లేదు,  ఉదయం జ్వరమన్నావు గదా... ఎలా ఉన్నావో  చూద్దామని వచ్చాను..."
అంది ఆముక్త సోఫాలో కూర్చుంటూ. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అటూఇటూ చూస్తూ... 
" ఏమిటీ, కోడలు లేదా ఇంట్లో.. !"
అడిగింది ఆముక్త. రెండు నిముషాలు పలకలేదు జయంతి. లోపలికెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చింది. 
" ఏమిటోలే ఆముక్తా, ఎందుకు పెళ్లి చేశామా అనిపిస్తోంది మా వాడికి.."
జయంతి కొడుక్కి ఆరు నెలల క్రితం పెళ్లయింది. కోడలు సుమ డిగ్రీ దాకా చదువుకుంది. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కట్నం బాగానే ముట్టిందని తనతో చెప్పింది పెళ్ళికి ముందు.  జయంతి భర్త కూడా ఇంకా సర్వీస్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆమె మాటలకు ఒకింత విస్తుబోతూ చూసింది ఆముక్త... 
" ఒక్కపనీ చేతగాదు...కనీసం టీ పెట్టడం కూడా రాదంటే నమ్ము..ప్రతీది పదిసార్లు చెప్పాలి. చదువొస్తే చాలనుకుంటారు అమ్మాబాబు.. పనిపాటు అక్కర్లేదా చెప్పు.. ఎలా పెంచుతారో...ఎలా పెరుగుతారో..!కోడలొచ్చినా...నా చావు నాకు తప్పట్లేదు. ఒకవైపు ఇల్లు... ఒకవైపు ఆఫీసు...జ్వరాలు రాకుండా ఉంటాయా...!"
విషయం అర్థమైంది ఆముక్తకు. 
" ఇంటిపనులు సరే... మొగుడి గురించైనా పట్టించుకుంటుందా...అన్నీ అడగాలి..చెప్పి చెప్పి చేయించుకోవాలి..ఉట్టి మొద్దు మొహమనుకో... "
చెప్పుకుంటూ పోతోంది జయంతి. 
"...మావాడికీ విసుగొచ్చిందనుకో దానితో..వెళ్లి పనులు చేయడం నేర్చుకునిరాపో...లేకుంటే అక్కడే ఉండిపో.. అంటూ పుట్టింటికి పంపేశాడు.. "
ఆముక్తకు చాలా బాధనిపించింది.ఇంతలో, లోపల గదిలో అలికిడి వినిపించి అటువేపు చూసింది. 
" ప్రదీపేలే... ఏదో పనుందంటూ ఆఫీసుకు వెళ్ళలేదు ఈవేళ... "
 అహ.. అలాగా..అనుకుని ఏదో అనబోయి, ఏమనుకుంటుందో అని మిన్నకుండిపోయింది ఆముక్త. ప్రదీప్ పెళ్లికి ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్లారు. పెళ్లికూతురు బాగా గుర్తు. తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఇంట్లో కూడా చూసింది. తనను చూసి నవ్వుతూ పలకరించింది కూడా. మల్లెపువ్వులా  ఉంటుంది.. నెమ్మదైన పిల్ల ! వీళ్లకెందుకు నచ్చడం లేదో ! ఆరు నెలలకే మొహం మొత్తిందా !! అనుకుంది..
" నెమ్మదిగా అలవాటవుతుందిలే జయంతీ.. కాస్త ఓపిక పట్టాలి..పెద్దవాళ్ళం...మనమే  సర్దుకు పోతే సరి.."
 ఓదారుస్తున్న ధోరణిలో అంది.
" ఆ... ఎంతకని ఎదురు చూస్తాం.. ఎంతకని సర్దుకుంటాం! అన్నీ  నేర్పించుకోవాలంటే అయినట్లే.!"
ఆముక్త మాటలకు అడ్డుపడింది జయంతి వెంటనే. ఇంకేమంటుంది ఆముక్త ! కొడుకు పెళ్లి చేయకముందు వరకూ అన్ని పనులూ తనే చేసుకునే ఈవిడ కోడలు రాగానే.. అత్తగారి హోదా, జులుం ప్రదర్శిస్తోంది..భేష్ ! కొడుకుల్ని గన్న తల్లుల్లారా... వర్ధిల్లండి.! అనుకుంటూ టీ తాగడం ముగించి, 
" సరే జయంతీ, నేవెళ్తా.. రేపొస్తావా ఆఫీస్ కి? "
లేస్తూ అడిగింది. 
" చూస్తాను, రాగలిగితే  వస్తా..."
అంటూ తనూ లేచి బయటికి వచ్చింది జయంతి. గేటు వైపు వెళ్లబోతూ ఓ క్షణం ఆగింది ఆముక్త. ఆమె  దృష్టి వద్దనుకున్నా వాడుపట్టిన గులాబీ మొక్కపై పడింది...అప్రయత్నంగానే నోరు తెరిచింది.
" జయంతీ..ఇది..ఆరోజు నువ్వు కొన్న గులాబీ మొక్కేనా ! ఎండిపోయిపోయినట్లుందే..! తీసేసి వేరేది నాటక పోయావా!"
" ఆమొక్కే. కానీ, ఎండిపోలేదు ఆముక్తా, దానివేళ్లు కుండీలో నిలదొక్కుకుని కొత్త ఆకులు రావడానికి కాస్త టైం పడుతుంది. ఈ పక్కనున్నవన్నీ నాటిన మొదట్లో ఇలా ఉన్నవే.. ఇప్పుడు చూడు, నిండా ఆకులతో, పూలతో ఎలా కళకళలాడుతున్నాయో.!"
పాయింట్ దొరికింది ఆముక్తకు. తల తిప్పి జయంతిని చూస్తూ, 
" కదా జయంతీ, ఏమనుకోనంటే ఓ మాట.. చనువు కొద్దీ చెప్తున్నా. నోరులేని పూల మొక్కల్ని అంత బాగా అర్థం చేసుకున్నావు.. మనసున్న మనిషి... కోడలు పిల్లను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు !"
ఎక్కడో గుచ్చుకుంది జయంతికి.
"... కొత్తగా పెళ్లయిన ఆడపిల్ల కూడా పూల మొక్క లాంటిదే జయంతీ.. పుట్టి పెరిగిన ఇంటినీ, తన వాళ్ళని అందర్నీ ఒక్కసారిగా వదిలేసి, కొత్త ఇంట్లోకి.. కొత్త మనుషుల మధ్యకి వచ్చేస్తుంది. ఎందుకని! భర్త అన్నవాడు తన వాడు అనే నమ్మకంతో... ఇక్కడి మనుషులు, ఇల్లు అలవాటు కావడానికి కాస్త సమయం పడుతుంది. ఆ  అవకాశం ఆ పిల్లకి పెద్దవాళ్లుగా మనం ఇవ్వాలి. వచ్చి రాగానే అన్నీ అందుకుని సాగాలంటే ఎలా! పెళ్లయిన కొత్తలో మనం ఎలా ఉండే వాళ్ళమో ఓసారి గుర్తు తెచ్చుకోవాలి.."
"................."
"... సారీ, ఎక్కువగా మాట్లాడాననుకుంటా.. మళ్లీ చెబుతున్నా,  చనువు తీసుకున్నందుకు క్షమించు.."
అనుకోని ఈ ప్రస్తావనకు మొహం చిట్లించుకుంది జయంతి. వెళ్లబోతూ  వెనక్కి తిరిగిన ఆముక్తకు వరండాలో నిలబడ్డ ప్రదీప్ కనిపించాడు.
" విన్నాడా ! విననీ.. మంచిదేగా..! ఏముంది! నన్ను నాలుగు తిట్టుకుంటాడు... అంతేగా...!"
అనుకుంటూ గేటు తీసుకుని వెళ్ళిపోయింది ఆముక్త. 
                 ++                ++                ++
  మరుసటి రోజు ఉదయం... తొమ్మిది గంటలు.. ప్రదీప్ టిఫిన్ ముగించి, ఆఫీసుకు బయలుదేరుతూ, చెప్పాడు తల్లితో, 
" అమ్మా, నాకు క్యారియర్ వద్దు. మధ్యాహ్నం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సాయంత్రం సుమను తీసుకుని వస్తా.. "
టిఫిన్ తింటున్న తండ్రి తలెత్తి కొడుకు వైపు చూశాడు. జయంతి నోట మాట రాక చూస్తూ ఉండిపోయింది. వాళ్ల ముఖాల్లోని హావభావాల్ని పట్టించుకోకుండా గేటు దాటాడు ప్రదీప్.
   బైక్ స్టార్ట్ చేస్తున్న అతనికి క్రితం రోజు ఆముక్త అన్న మాటలు మరోసారి గుర్తుకొచ్చాయి. రాత్రంతా నిద్ర లేక ఆలోచిస్తూనే ఉన్నాడు. పదేపదే ఆ మాటలే సుతిమెత్తని బాణాల్లా వచ్చి గుచ్చుకొంటూ అతన్ని కలవరపెట్టాయి. ఆంటీ మాటలు సూటిగా ఉన్నా, అందులో ఎంతో నిజం ఉందనిపించింది అతనికి.
   " నిజమే! సుమ చేసిన తప్పేమిటి? ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించాడు తనపట్ల ! పెళ్లికి ముందు లేని అలవాట్లన్నీ నిదానంగా నేర్చుకుంటూనే ఉంది. చివరికి తన బట్టలు కూడా తనే ఉతికి పెట్టేది. తల్లిదండ్రులకి ఆమె నిదానం నచ్చలేదు.తను కూడా అర్థం చేసుకోకుండా కోపం పెంచుకున్నాడు.
  తండ్రికి కొడుకు సంసారం పట్ల ఆందోళన లేదు. తల్లీ అదే టైపు. చక్కదిద్దాల్సిన వాళ్లు తనని మరింత రెచ్చగొట్టడం చేశారు... ఫలితం ! తామిద్దరి మధ్య దూరం ! ఎంత అవివేకంగా మారిపోయాను నేను...!"  
   తెల్లారేసరికి మబ్బులన్నీ విడిపోయి అతని మనసు తేలికగా అయిపోయి, కర్తవ్యం గుర్తొచ్చింది.. ప్రస్తుతం అదే అమలుపరుస్తున్నాడు.
  " ఏమైనా ఆముక్త ఆంటీకి కృతజ్ఞతలు. సరైన టైంలో సరైన దారికి నన్ను మళ్లించింది, " 
అనుకుంటూ బండి ముందుకు పోనిచ్చాడు.
              ++            ++               ++
  మూడు నెలల తర్వాత... ఓ సెలవు రోజున.. ఆముక్త షాపింగ్ కెళ్ళి, పనయ్యాక ఆటో కోసం రోడ్డు వారగా నిలుచుని ఉంది. వెనగ్గా ఓ బైక్ వచ్చి ఆగిన చప్పుడుకు తిరిగి చూసింది. ప్రదీప్ ! ఆ  వెనక భార్య సుమ! ఇద్దరూ బైక్ దిగి పలకరించారు ఆముక్తను. 
" ఆంటీ, మీకు చాలా థాంక్స్..."
 అంటూ, ఆరోజు తనన్న  మాటలు విన్న తర్వాత... జరిగిందంతా చెప్పాడు. ఓ క్షణం సుమ మీద దృష్టి నిలిపింది ఆముక్త. అప్పట్లో వాళ్ళింట్లో తనని చూసినప్పుడు ఆ పిల్ల మొహంలో కనిపించిన ఆందోళన ఇప్పుడు మచ్చుకైనా లేదు. ఆ కళ్ళల్లో కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ నవ్వులో ఏ వెలితీ  లేదు. అదంతా భర్త ప్రదీప్ వల్లే... అని  స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రదీప్ ను   ప్రశంసాపూర్వకంగా చూసింది ఆముక్త.  
" చాలా సంతోషం బాబూ.. మీ ఇద్దరినీ ఇలా హ్యాపీగా చూస్తున్నాను.."
అంది తృప్తిగా.
" ఆ  క్రెడిట్ అంతా మీదే ఆంటీ.."
 అన్నాడు ప్రదీప్ మళ్లీ.
" అయ్యో.. మంచి మాటలు చెప్తే వినేవాళ్లు, ఫాలో అయ్యే వాళ్ళు ఎందరుంటారు చెప్పు! నువ్వు పాజిటివ్ గా తీసుకున్నావు గాబట్టి...ఆ  క్రెడిట్ అంతా నీదే. పేరెంట్స్ మాటల్ని గౌరవించాలి.. నిజమే.. కానీ, అందులో ఏది మంచి,  ఏది చెడు అని కూడా పిల్లలు గ్రహించాలి. పెళ్లయాక  ప్రతి అమ్మాయి అంతవరకూ ముక్కు మొహం తెలియకపోయినా... భర్త వేలు పట్టుకుని అత్తారింట్లో అడుగుపెడుతుంది. ఎందుకు! అతను తన మనిషనీ,  అన్నివేళలా తనకు అండగా ఉంటాడనీ... ఏ కష్టం వచ్చినా ఆ భుజం తనకు ఆసరాగా ఉంటుందన్న నమ్మకంతో.. ఆమె నమ్మకాన్ని నిజం చేయడం భర్తగా అతని బాధ్యత.. అది  నీవు సంపూర్తిగా నెరవేర్చావు. అందరూ నీలాగే ఉంటే అమ్మాయిలు పెళ్లి గురించి భయపడాల్సిన పనే ఉండదు..."
అంది నవ్వుతూ. రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ బై  చెప్పి బయలుదేరారు. నవ్వుతూ వెళ్తున్న ఆ  జంట ఎంతో ముచ్చటగా అనిపించింది ఆముక్తకు... 
  ఆరోజు జయంతి మాటలు విని ఎంతో బాధపడింది. అత్తమామల కరకుదనంతో, భర్త అవగాహనా రాహిత్యంతో జీవితం బలైపోయి, ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయిన తనలాగే ఈ అమ్మాయీ అవబోతోందా !! అన్న తలంపు కలిగిన ఆ క్షణం గుర్తొచ్చింది ఆముక్తకు.. ఆ ఆవేదనలో తనన్న నాలుగు మాటలు ఇతనిపై అంతటి ప్రభావాన్ని చూపడం... నిజంగా తాను ఊహించని పరిణామమే ! థాంక్ గాడ్ ! సుమ మరో ఆముక్త కాకుండా సుమగానే ఉంటున్నందుకు...!! ఆముక్త పెదాలపై నవ్వు విరిసింది...ఓ లేత పూలమొక్క వాడి, ఎండిపోకుండా చెట్టుగా ఎదిగినందుకు ! ఆక్షణంలో తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, మలుపులు మెదిలి, 
" ఈ సుమకూ,  నాకూ ఒకటే తేడా...తనకు అర్థం చేసుకోగలిగిన భర్త లభించాడు. తనకా అదృష్టం లేకపోయింది..."
నిర్లిప్తంగా ఆటో ఎక్కికూర్చుంది. ఆమె మనసులో ఓమూల చిన్న సంతృప్తి... 

                            🦋🦋🦋🦋🦋

Monday, October 30, 2023

ఏదీ? ఎక్కడ? మరో సూర్యకాంతం? !

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

 పైకి తిడుతూ... 
లోన స్వాగతించే జనాలు...
ఆమె రాక ఎప్పుడెప్పుడంటూ 
ఎదురుచూసే క్షణాలు!
ఆమెకోసమే సినిమా దారి పట్టే 
అలనాటి రోజులు !!
ఎవరు? ఎవరామె? 
ఇంకెవరు? సూర్యకాంతం...!
చలనచిత్ర కళామతల్లికి అందిన వరం... 
ఎన్టీఆర్ కయినా..ఏన్నార్ కయినా... 
ఎస్వీఆర్ కయినా...ఎదురొడ్డి..
సవాల్ విసిరి నిలిచిన నట శిరోమణి...!
హీరోలకు..హీరోయిన్లకు...అమ్మ... 
కోడళ్లను జడిపించే జగడాలమారి అత్తమ్మ... 
రేలంగి..రమణారెడ్డి లను 
ఓ ఆట ఆడుకున్న భార్యామణి... 
పద్మనాభం...రాజబాబులకు 
చుక్కలు చూపించిన మహాతల్లి !!
విలన్లను సైతం హడలెత్తించిన 'విల్లీ '!
ఇదంతా...తెర మీద...
ఆ తెర తీస్తే...ఆ వెనుక... 
ఆమె ఓ బంగారు తల్లి...!
మనసు వెన్న...మాట సున్నితం.. 
తనది కాని స్వభావం... 
పాత్రల్లో పరకాయ ప్రవేశం... 
అచ్చెరువొందించే ఆ గడసరితనం !
మరువగలరా ఆనాటి తరం జనం !!
ఆమె ధరించిన పాత్రలు సజీవం...
ఆ చిత్రాలకు లేదు అపజయం...  
ఆమె కీర్తి అజరామరం....
ఆమె గయ్యాళి గంగమ్మ... 
ఎవరూ పోషించ సాహసించని 'గుండమ్మ' !!
సాహసించినా...మెప్పించడమెవరితరమమ్మ !
దశాబ్దాలు వెండితెరపై వెలిగిపోయిన 
ఘనత నీదమ్మ 'కాంతమ్మ...!'
దశాబ్దాలు దాటినా వెలిసిపోని..వాడిపోని... 
వన్నె తరగని...మరువలేని చరిత నీదే గదమ్మ !!
ఆనాటి నాయికలకందింది ప్రత్యామ్నాయం...
కానీ...ఏదీ ? ఎక్కడ ? ఎక్కడ ? 
మరో 'సూర్యకాంతం'...? !!
భర్తీ అవలేదే ఇప్పటిదాకా ఆమె స్థానం...!!

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

                                              ~~ యం. ధరిత్రీ దేవి ~~
             
                                       



Tuesday, October 24, 2023

శుభోదయం

🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀

                                             ~~ యం. ధరిత్రీ దేవి ~~



ఇంటిముంగిట ముచ్చటగా పచ్చదనం... 
ఇల్లాలికదే చిన్ని  బృందావనం....
అదో అంతులేని మానసికానందం....
ఆ గాలి సోకితే చాలు...
అందరికీ చక్కటి  ఆరోగ్యం...
అంతా వైద్యులకు  కడుదూరం...
అందుకే ...మనమందరం...
పచ్చదనానికి పలుకుదాం
ప్రతీ  ఉదయం  శుభోదయం...🐦

🍀🌱🌿🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲🍀🌿🌱🌲