ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉంటుందని కనుగొన్నాడు. వాటికి మనసనేది కూడా ఉండి, ఆలోచించే శక్తి కూడా ఉండి ఉంటే బహుశా ఇలాగే ఉంటుందేమో! ఓ ఇల్లాలు బజారుకెళ్లి తిరిగి వస్తూ దారిలో రోడ్డు వారన క్రోటన్లు, పూల మొక్కలు అమ్ముతున్న ఒకతని వద్ద ఆగిపోయి వాటిల్లోనుంచి ఓ గులాబీ మొక్క ను ఎంచుకుని, కొని ఇంటికి తీసుకు వచ్చింది. కొద్ది రోజులు గడిచాక ఆ మొక్క స్పందన చూడండి, ఎలా ఉందో !
రోడ్డువార రద్దీ కూడలిని
దుమ్ము ధూళి అద్దుకుని
కళ తప్పిన నన్ను కొని తెచ్చి
కుండీలో పెట్టి నాకంటూ
ఓ సామ్రాజ్యాన్నిచ్చావు
నా అణువణువూ స్పృశిస్తూ
నేల తల్లిని మరిపించావు
నా తల్లీ ! నీకు వందనం!
గుప్పెడు నీళ్లకై తపించే నాకు
గుప్పిళ్ళతో పోషకాలందించి
కంటికి రెప్పలా కాపాడావు
చీడపీడల దరిజేరనీక
ఏపుగ పెరిగేలా చేసి
ఎంతందంగా తీర్చిదిద్దావు !
నా తల్లీ ! మళ్లీ నీకు వందనం !
దారీ తెన్నూ ఎరగని నన్ను
ఓరీతిగ సరిజేసి
కొమ్మ కొమ్మనూ
చిరు మొగ్గలతో నింపేసి
నా జన్మ ధన్యం చేసావు !
నా తల్లీ ! మరల మరల
నీకు వందనం!
ఇంత చేసిన నీకు
తిరిగి నేనేమివ్వగలను?
నీ దోసిలి నిండుగ
విరబూసిన నారెమ్మల
చిట్టి గులాబీ బాలల్ని దప్ప !
అర్పిస్తున్నా నా తల్లీ
స్వీకరించుమమ్మా !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పెంచిన వారి పట్ల మొక్కలు ఇలాగే కృతజ్ఞతలు చెల్లించుకుంటాయేమో !
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
No comments:
Post a Comment