Sunday, September 24, 2023

తెలుగు చలనచిత్ర సీమకో గొప్ప వరం ' సూర్యకాంతం '

    చాలా సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, జమున నటించిన ' పూలరంగడు'. అందులో ఒక హాస్య సన్నివేశం. డైలాగ్స్ అంతగా గుర్తు లేవు గానీ దాని సారాంశం ఇదీ --

ఓ సందర్భంలో సూర్యకాంతం గారు గుమ్మడి గారితో అంటుందిలా ---

" ఏమండీ, అమ్మాయి పెళ్లవగానే కాశీ, రామేశ్వరం, తిరుపతి, కాళహస్తి, అన్నవరం, సింహాచలం పుణ్య క్షేత్రాలన్నీ వెళ్లి దేవుళ్ళను దర్శించుకుని వద్దామండీ.... "

 దానికాయన వెంటనే అందుకుని, 

".... ఇంకో పని కూడా చేద్దామే... ఆ కాస్తా సముద్రం దాటి అవతల లంకలో ఉన్న నీ అన్న రావణాసురుణ్ణి కూడా దర్శించుకుని వచ్చేద్దాం, ఓ పనైపోతుంది...... " అనేస్తాడు. 

 అంతే, హాలంతా ఒకటే నవ్వులే నవ్వులు! ఇందులో గుమ్మడి గాని, సూర్యకాంతం గానీ అసలు నవ్వరు. కేవలం వారి సంభాషణా చాతుర్యంతో, హావభావాలతోనే ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతారు. రావణాసురుడు నీ అన్న సుమా! అన్న మాట చాలు ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు తెలిసిపోవడానికి ! ఇలాంటి సన్నివేశాలు అలనాటి తెలుగు సినిమాల్లో  కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిని రక్తి కట్టించిన నటీనటులు ఈనాటికీ చిరస్మరణీయులు. అప్పటి తారల్లో ఘన కీర్తి వహించిన సూర్యకాంతం గారు తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ఈనాటికీ ఓ చెరగని ముద్ర!

    గుమ్మడి గారు ఓ ఇంటర్వ్యూలో ఆవిడతో ( హాస్య ధోరణిలోనే సుమా )...  

" నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అన్న చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు, "  

అని అన్నారట! నిజమే కదా ! చంద్ర కాంత, శిరీష, మల్లిక, రోజా... ఇలాంటి పేర్లు వినిపిస్తాయి గానీ సూర్యకాంతం అన్న పేరు దాదాపు ఎక్కడా వినం. గయ్యాళిగా అంతటి బలీయమైన ముద్ర వేసిన ఘనత ఆవిడది మరి ! ఎవరింట్లోనైనా ఇల్లాలు గడసరీ, గట్టి గట్టిగా మాట్లాడేదీ అయితే వెంటనే' అబ్బా, ఆవిడా, సూర్యకాంతం గాదూ !' అనేస్తారు వెంటనే. ఆఖరికి నోరు పెద్దదైన చిన్న పిల్లల్ని కూడా ఇది అచ్ఛం సూర్యకాంతమే బాబూ ! అనడం కద్దు !

   ఆవిడ పాత్ర స్వభావం గయ్యాళితనమే కావచ్చు. కానీ తెరపైన ఆవిడ ప్రవేశంతో అందరిలోనూ ఓ విధమైన చక్కటి అనుభూతి! అమ్మయ్య! సూర్యకాంతం వచ్చేసింది, అంటూ ఆమె నటనను ఆనందంగా ఆస్వాదించడానికి సిద్ధ పడేవాళ్లు అంతా! ఒకవైపు తిడుతూనే ఆవిడ సన్నివేశాల్ని ఎంతగానో కోరుకునే రోజులవి. నిర్మాతలు కూడా వారు నిర్మించే ప్రతి చిత్రంలో  " మా కాంతమ్మ గారికి పాత్ర ఉండే తీరాలని" పట్టుబట్టే వాళ్టట  ! అంతలా ఉండేది ఆమె క్రేజ్ అప్పట్లో మరి !

   ఆరోజుల్లో  వచ్చిన అన్ని సినిమాల్లో ఆమె లేనివి దాదాపు లేవనే చెప్పవచ్చు. ఎస్. వీ. ఆర్, గుమ్మడి, రేలంగి, నాగభూషణం, అల్లు రామలింగయ్య లాంటి దిగ్గజాలతో తెర పంచుకుని వారితో పోటాపోటీగా నటించి మెప్పించిన ఘనత ఆమెది! ఇక, పద్మనాభం, రాజబాబు, చలం మొదలైన నటులకు తల్లిగా, అత్తగా వారినో ఆట ఆడుకుందనే చెప్పాలి. అక్కా చెల్లెలు ( ANR, షావుకారు జానకి నటించినది ) సినిమాలో రాజ బాబు గారికి జోడీగా కొద్ది నిమిషాలు తెరపై కనిపించి నవ్వులు పూయించారు. 

   ఆవిడ నటనలో విశేషం ఏంటంటే ఆమె నవ్వదు, కేవలం హావభావాలతో, ముఖంలో ఓ విధమైన అమాయకత్వంతో హాస్యం ప్రతిఫలించేలా చేస్తుంది. ఆవిడ చీర కట్టు, ఆమె పర్సనాలిటీ, చక్కటి తలకట్టుతో ఉన్న కొప్పు --- ఈ ఆహార్యం చాలు ఆవిడ పాత్రకి ! మనిషి కాస్త భారీగా కనిపించినా, విసవిసా నడవడం, చేతులూపుతూ మాట్లాడడం, కల్లబొల్లి ఏడుపులు ఏడవడం ! --- ఇవీ ఆవిడ నటనలో ప్రత్యేకతలు !

  ఆవిడ నటించిన వందలాది చిత్రాల్లోని పాత్రలు ఎన్నని గుర్తు చేసుకోగలం? ఎన్నని ఉదాహరించగలం ! నాకు జ్ఞాపకమున్నంత వరకు నేను అప్పట్లో చూసిన కొన్ని సినిమాల్లోని పాత్రల్ని ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. 

* తోడికోడళ్లు --- సగటు ఇల్లాలుగా, ఉమ్మడి కుటుంబంలో ఓ కోడలిగా అమాయకంగా కనిపించే ముఖంతో, రాగద్వేషాలు కలబోసుకున్న ఓ గృహిణి అనసూయ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అచ్చెరువునొందించక మానదు. 

* మంచి మనసులు--- ఎస్. వీ. ఆర్  భార్య. ఆయనేమో ఉదారస్వభావులు. ఈవిడ దానికి బద్ధ వ్యతిరేకి. ఆవిడకు తెలియకుండా ఆయన కప్పిపుచ్చే విషయాలెన్నో. ఈవిడేమో అన్నీ నమ్మేస్తూ ఉండే ఓ సరదా పాత్ర.

* రక్తసంబంధం --- కరకుదనానికి మారుపేరు. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ వారిని నట్టేట ముంచే నైజం. అవతలివాళ్ళ మంచితనాన్ని అసమర్థతగా భావిస్తూ, ఆ మంచితనాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే కుటిల పాత్ర.

* అత్తగారు-- కొత్త కోడలు, 

 అత్తలు - కోడళ్ళు --- రెండింటిలోనూ అత్త పాత్ర. ఇక వేరే చెప్పాలా?  ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండే!

* దసరా బుల్లోడు--- బుల్లెమ్మ! పరమ పిసినారి. కనీసం భర్తక్కూడా సరైన తిండి పెట్టని ఆడది. భర్త చూస్తే ఈవిడ మాట జవదాటడు. దాంతో అతనికి నరకం చూపిస్తూ ఉంటుంది.

* అందాల రాముడు -- అట్లమ్ముకునే ఆవిడ. అడపాదడపా మంచితనం కూడా కనిపిస్తూ ఉంటుంది.

* కార్తీకదీపం -- కూతురు కాపురం కోసం సలహాలు ఇస్తూ ఓ తల్లిగా ఆరాట పడుతూ ఉంటుంది.

* సెక్రెటరీ -- వయస్సు మళ్ళినా పడుచు దానిలాగే ఉండాలన్న కోరిక! ఇందులోANR గారితో ఓ పాటలో కాసేపు స్టెప్స్ కూడా వేయడం చూస్తామండోయ్ !

* గుండమ్మ కథ -- NTR, ANR లాంటి హేమాహేమీలు కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో ఆమె ధరించిన పాత్ర పేరే సినిమా పేరుగా పెట్టడంలో ఆమె ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోతుంది.

    గయ్యాళి పాత్రలే కాదు, సాత్విక పాత్రలు అడపాదడపా పోషించారని చెప్పొచ్చు. నాకు తెలిసి నేను చూసిన వాటిలో రెండే రెండు సినిమాల్లో అలాంటి పాత్ర పోషణ చేశారామె. 

* మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుని తల్లి' హిడింబి'పాత్ర. ' పుత్రా, సుపుత్రా ' అంటూ ఆమె పలికే తీరు హాస్యధోరణి లోనే కాక విలక్షణంగా కూడా అనిపిస్తుంది. 

* అలాగే' బ్రహ్మచారి' ( ANR, జయలలిత నటించినది ) లో  నాగభూషణంగారి భార్యగా నటించింది. ప్రతీ సినిమాలో భర్తపై అజమాయిషీ చలాయించే ఈవిడ అందులో భర్తకు భయపడుతూ అణిగి మణిగి ఉండే పాత్ర పోషించింది. సూర్యకాంతంలో ఈ కోణం కూడా ఉందే అనిపిస్తుంది అందులో వారిద్దరి సన్నివేశాల్ని చూస్తోంటే !

  ఆవిడ గయ్యాళి తనం తెర వరకే. రీల్ లైఫ్ లో గంప గయ్యాళిగా ముద్ర పడిన ఆమె రియల్ లైఫ్ లో ఎంతో మృదుస్వభావి అనీ, అందర్నీ ఎంతో ఆత్మీయంగా చూస్తారని చెప్తుంటారు. షూటింగ్ సమయాల్లో ఇంటి నుండి వంటలు, పిండి వంటలు తెచ్చి అందరికీ తినిపించేవారట ! తనది కాని స్వభావంతో తెరపైన అంతటి అద్వితీయ నటనను ప్రదర్శించడం అంటే ఎంత గొప్ప విషయం ! ఈనాటికీ తెలుగు చలన చిత్ర సీమలో ఆవిడ స్థానాన్ని భర్తీ చేసే నటీమణి రాలేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అందుకు తార్కాణంగా ఓ విషయం ఇక్కడ చెప్పవచ్చు. గుండమ్మ కథ చిత్రాన్ని బాలకృష్ణ, నాగార్జున గారలతో పునర్నిర్మించాలని ఒకరిద్దరు నిర్మాతలు అన్ని ప్రయత్నాలు చేసుకుని తీరా గుండమ్మ పాత్రకు ఎవర్ని పెట్టుకోవాలో తెలియక సందిగ్ధంలో పడి చివరకు ఆ సినిమా తీసే ప్రయత్నమే విరమించుకున్నారట ! సూర్యకాంతం గారి విశిష్టత ఏమిటో తెలియజెప్పడానికి  ఈ ఒక్క ఉదాహరణ చాలు ! విలనీని పోషించే నటీమణులు ఎందరో పుట్టుకొచ్చారు గానీ  " ఈ నటి సూర్యకాంతంలా చేస్తోంది సుమా ! " అని అనిపించుకున్నవాళ్ళెవరూ ఇంతవరకు కానరాలేదు.

   అక్టోబర్, 28, 1924 లో జన్మించిన సూర్యకాంతం గారు తల్లిదండ్రులకు పధ్నాలుగవ సంతానమట ! డిసెంబర్, 17, 1996లో పరమపదించిన ఆమె కీర్తి ఎప్పటికీ తెలుగు చలన చిత్ర సీమలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ఆమె తెలుగు చలనచిత్ర సీమకో గొప్ప వరం అనడంలో సందేహమేముంది? 

*******************************************

                   

2 comments:

  1. అటువంటి పాత్రలకు అటువంటి నటి నభూతో నభవిష్యతి.

    ఎడమ చేతి వాటం కూడా కదా 🙂?

    సాత్విక పాత్ర “చదువుకున్న అమ్మాయిలు” సినిమాలో కూడా … అని గుర్తు.

    మా మేనత్తల్లో ఒకావిడ పేరు సూర్యకాంతం. గయ్యాళి కాదు లెండి 🙂. సినిమా సూర్యకాంతం గారి కన్నా వయసులో పెద్దది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు సూర్యకాంతం పేరు అరుదేమీ కాదు.
    ———————-
    ఇవాళ (సెప్టెంబర్ 25) SP బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. వారి గురించి ఓ బ్లాగ్ పోస్ట్ వ్రాస్తే బాగుండేదేమో?

    ReplyDelete
  2. నిజంగా నభూతో నభవిష్యతి అండీ...సూర్యకాంతం గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి 26.92020 న " ఆ గంధర్వగానానికి మరణం లేదు" అన్న పోస్ట్ నా బ్లాగ్ లో రాశాను. 🙏

    ReplyDelete