Monday, October 31, 2022

NO MASK... NO ENTRY.. !

   సాయంత్రం అయిదు దాటింది నేను బయట పడేసరికి. దాదాపు నెల తర్వాతనుకుంటాను, ఇలా ఇల్లు దాటి రోడ్డు ఎక్కడం ! అదేమిటో ! వెంట వెంటనే వెళ్తూ ఉంటే  రోజూ  కాసేపు బయటకి వెళ్లి అలా తిరిగి రావాలనిపిస్తూ ఉంటుంది. బద్ధకించో లేక ఇంట్లో వేరే పనుల వల్లో  బ్రేక్ పడిందా... ఇక అంతే ! ఆ విధంగా ఓ  వారం గ్యాప్ వచ్చిందంటే చాలు... విపరీతమైన బద్ధకం ఆవహించి, ససేమిరా ఇల్లు కదల  బుద్ధి అవదు. ఆ బద్ధకం వదిలించుకుని,  ఎలాగైనా బయటపడి అలా నాలుగు వీధులూ చుట్టి రావాలని రెండు రోజుల క్రితం గట్టిగా నిశ్చయించుకుని... ఇదిగో ఈ రోజిలా ఆచరణలో పెట్టగలిగాను. 
     హ్యాండ్ బ్యాగ్ లో నాలుగైదు వందలదాకా ఉన్నట్టు గుర్తు. కొనాల్సినవైతే  ఏమీ లేవు.ఉబుసుపోక అలా తిరగడమే ! ఆటో దిగి, ఓసారి తేరిపారజూసి, ఎదురుగా కనిపిస్తున్న ఓ ఫాన్సీ షాపు దగ్గరికి దారి తీశాను. లోపలికి ప్రవేశిస్తూ ఉండగా... ఎదురుగా ఓ బోర్డు నాకంటబడింది.
NO MASK.. NO ENTRY..  
  నవ్వుకున్నాను. అరె ! ఈ బోర్డు ఇంకా తీసివేయలేదా!  వెంటనే నాకు రెండున్నర సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న దారుణమైన, దయనీయ దుస్థితి కళ్ళ ముందు కదలాడింది. ఎంత అల్లల్లాడిపోయింది యావత్ప్రపంచం !! చాప కింద నీరులా  ప్రవేశించి, ఒక్కసారిగా విజృంభించి, మనుషుల్ని పీడించి, మానసికంగా నిర్వీర్యుల్ని చేసి, వికటాట్టహాసం చేస్తూ మొత్తం ప్రపంచ జనావళినే అయోమయ స్థితిలో పడవేసిన మహమ్మారి 'కరోనా' ఏదీ? ఇప్పుడెక్కడ  ? నన్ను నేను ప్రశ్నించుకుంటూ లోపల అడుగు పెట్టాను. అక్కడ ఏవేవో చూస్తున్నాను గానీ, నా ఆలోచనలన్నీ కరోనాను చుట్టుముట్టేశాయి.
    బయట కాలు పెడితే చాలు... ముక్కు, మూతి కవర్ చేస్తూ 'మాస్క్' ! ఏది ఉన్నా లేకపోయినా అది మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే ! లేకుండా తిరిగే వాళ్ళకి జరిమానాలు ! ఎంత విడ్డూరం ! 
" ఎన్నడైనా కనీ వినీ  ఎరుగుదుమా !"
 అంటూ తాత ముత్తాతలు కూడా ముక్కున వేలేసుకున్నారు గదా... అనుకోని ఆ  ఉత్పాతానికి !
   బయట నుండి ఇంట్లో అడుగుపెడితే చాలు... సబ్బుతో   ముఖం, చేతులు శుభ్రపరుచుకోవడం!చేతులకు శానిటైజర్ తప్పనిసరి !   దీని పుణ్యమాని అప్పట్లో రకరకాల మాస్కులు పుట్టుకొచ్చాయి గదా! ఆ దెబ్బతో మాస్క్ ల , శానిటైజర్ ల వ్యాపారం మహ జోరుగా సాగిపోయిందిగా ! మొత్తానికి ఎంత అలజడి రేపింది ! కొన్ని నెలల క్రితం...  ఒక్కటి కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా తల క్రిందులైయిపోయిన పరిస్థితి! హుటాహుటిన వ్యాక్సిన్ ల తయారీ! ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోస్ అంటూ...
   పదినిమిషాలు అన్యమనస్కంగా తిరిగా. లోపలికి వెళ్ళినా కరోనా నన్ను వదలదే ! ఏమీ కొనాలనిపించక
అందులోనుండి బయటకొచ్చేశా. మరో షాపు కనిపిస్తే, అసంకల్పితంగానే నా అడుగులు అటువైపు పడ్డాయి. అప్రయత్నంగా నాచూపు షాపు ఎంట్రెన్స్ వద్ద గోడ మీద పడింది. మళ్లీ అదే !!
No mask... no entry !!
 తల పట్టుకుని
 "అప్పటి ఛాయలు మర్చిపోకుండా ఈ రాతలు  జనాలకి బాగానే గుర్తు చేస్తున్నాయిలే "
అనుకున్నాను. ఓ దశలో దీనికి అంతం ఎప్పుడు? అసలు ఉంటుందా? దీన్నుంచి బయటపడే రోజంటూ వస్తుందా! అని  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన క్షణాలు గుర్తుకొచ్చాయి ఒక్కసారిగా ! కరోనా సోకి తల్లడిల్లుతూ, హోమ్ క్వారంటైన్ లో గడుపుతూ, వండి పెట్టే వారు లేక, బయటివారు ఎవ్వరూ వారిని సమీపించే పరిస్థితి లేక... అంటురోగగ్రస్తులై నరకం అనుభవించిన వారు కోకొల్లలు !!
   అదో రకమయితే... దాని బారినిబడి ప్రాణాలు సైతం కోల్పోయినవారు ప్రముఖుల నుండీ సామాన్యులు, అతి సామాన్యుల వరకూ ఎందరో ! ఆప్తుల్నీ, కుటుంబానికి ఆధారమైన వ్యక్తుల్నీ కోల్పోయి, విషాదంలో మునిగిపోయి, ఇప్పటికీ ఇంకా కోలుకోలేని దురవస్థలో ఉన్నవారు కొందరైతే... ప్రాణాలు మాత్రం దక్కించుకుని , జీవశ్చవాలుగా మారి, అది మిగిల్చిపోయిన అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా బాధలు పడుతున్నవారు మరికొందరు !   
   ఆశ్చర్యమేస్తుంది.. తలుచుకుంటుంటే! కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో ఇంత వ్యధ అనుభవించామా అని! దీనివల్ల ఎదుర్కొన్న సమస్యలు ఒకటా,  రెండా! కనీ విని ఎరుగని రీతిలో పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లల చదువులు అటకెక్కాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. కూరగాయలమ్మి బ్రతికిన వాళ్లూ ఉన్నారు. జనజీవనం దారుణంగా గాడి తప్పిన క్షణాలవి! ముఖ్యంగా ఎక్కడి వారక్కడ బందీలుగా చిక్కిపోవడం! ఇతర దేశాల్లో ఉన్నవాళ్లు ఇక్కడకి రాలేక, ఇక్కడివారు అక్కడికి పోలేక.... ఇప్పటికీ ఇంకా ఆ సమస్య కొనసాగుతూనే ఉంది.
    ఇదంతా కొద్దికాలం క్రితం అనుభవించిన వేదన. ప్రస్తుతం లోకి వస్తే.. ఆ ఆనవాళ్లు కనిపించడం బాగా తగ్గిపోయింది. జనజీవనం 'నార్మల్' అయిపోయినట్లుగా ఉంది. మాస్కులతో ఉన్న మొహాలు మాయమైపోయాయి. శానిటైజర్లు షాపుల ముందు, బ్యాంకుల ముందు కనిపించడం లేదు. ఆ వాతావరణం పూర్తిగా అదృశ్యమై ప్రజలంతా కరోనాను పూర్తిగా మర్చిపోయారు. మర్చిపోయారో... మరి విసిగిపోయి, ఓ విధమైన తెగింపు ధోరణిలో కొచ్చారో !
తీవ్రత బాగా ఎక్కువైన రోజుల్లో పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఇతర అలంకరణలతో పాటు ముఖానికి మాస్క్ కూడా అలంకరణలో ఓ భాగంగా ఉండింది. ఇప్పుడు ఆఛాయలు  లేవు. అప్పట్లో హాస్పిటల్స్ లో అయితే డాక్టర్లు, నర్సులు.. వారి వేషధారణ వ్యోమగాముల్ని తలపించేది అంటే అతిశయోక్తి ఏమీ లేదనుకునే వాళ్ళు.. కానీ ఇప్పుడు అక్కడా..అంతా.. 'నార్మల్' ! అలా ఉంది కదా అని కరోనా సమసి  పోయింది.. ఇక డోంట్ వర్రీ.. అని అనుకోవడానికి లేదట ! మనం మాత్రం జాగ్రత్తగానే ఉండాలని హెచ్చరికలు !
   ఏదేమైనా... ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. కాకపోతే...అత్యవసరానికి పనికొస్తాయని రెండు, మూడు హ్యాండ్ బాగ్ లలో   వేసిఉంచుకున్న ఒకటీ అరా మాస్క్ లు బాగ్ తెరిచినప్పుడల్లా దర్శనమిస్తూ ఆ 'చేదు'ను కళ్ల ముందుకు తెస్తూ కలవరపరుస్తూ ఉంటాయి !!
  గత ఆలోచనలను బలవంతంగా పక్కకు నెట్టి, షాపు నుండి మళ్ళీ బయటపడ్డాను. ఎలాగూ  వచ్చాను.. కనీసం రెండు కర్చీఫ్స్ అయినా కొందామని నాలుగడుగులు వేసి, ఓ రెడీమేడ్ షాప్ కనిపిస్తే అందులోకి దారి తీశాను. యధాలాపంగా పక్కకు చూసిన నా కంటికి మళ్లీప్రత్యక్షం !!
NO MASK... NO ENTRY  !!

******************************************

   






 

Monday, October 24, 2022

నాడు... నేడు... ఎంత తేడా !ఎంత మార్పు !!

    దాదాపు నలభై  సంవత్సరాల క్రితం... పెళ్లయిన కొత్తలో అప్పుడప్పుడూ ఏదైనా హోటల్ కెళ్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో కర్నూల్ లో ELITE  అని ఓ రెస్టారెంట్ లాంటిది ఉండేది. అది నాన్ వెజ్ వంటకాలకు చాలా ప్రత్యేకం అని చెప్పుకునేవారు. అక్కడ చికెన్ బిర్యాని నాలుగు రూపాయల యాభై పైసలు..అదీ రెండు ఎగ్స్ తో.. ! ఎంతో నాణ్యతగా, రుచిగా ఉండేది. ఇప్పుడు వందలు పెట్టాల్సి వస్తోంది. ఫ్యామిలీతో వెళ్తే వేలే ! ఇప్పుడు ఆ రెస్టారెంట్ అయితే లేదు. ఎందుకు చెప్తున్నానంటే... అప్పటికీ, ఇప్పటికీ ధరల్లో ఈ మార్పు ( కాలానుగుణంగా సహజమే కావొచ్చు,అయినా.. ) ఎంతలా  అబ్బురపరుస్తున్నదో... నన్నే కాదు. నాలా మరెందరినో !
     నాన్ వెజ్ మాత్రమే కాదు.. వెజ్ వంటకాలు కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంత వెచ్చిస్తున్నా.. చెప్పుకునే అంత స్థాయిలో రుచి గానీ, నాణ్యత గానీ ఉండటం లేదు మరి ! 
  ఈమధ్య ఆన్లైన్ డెలివరీలు బాగా ఎక్కువైపోయాయి. ఎప్పుడూ ఇంట్లోనేనా, ఒక్కసారి అలా బయటి తిండి కూడా  రుచి చూద్దాం, కాస్త  రెస్ట్ అయినా దొరుకుతుంది అన్న ఆశతో రెండు మూడు సార్లు ఆన్లైన్లో తెప్పించుకున్నాం. మొదట్లో అయినందుకో  ఏమో.... పర్వాలేదనిపించింది. కానీ.. నాలుగైదు సార్లు అయ్యేసరికి... మొహం మొత్తడం మొదలైంది. ఓసారైతే.. కూరల్లో, రైస్ లో ఆఖరికి.. రైతా ( పెరుగు పచ్చడి) లో కూడా అంతా ఉప్పుమయం! తినవశం కాక.. 'ఇక చాలు బాబోయ్' అని  ఆన్లైన్ ఆర్డర్ లకు గుడ్ బై చెప్పేశాము. దానికి తోడు ఆ మధ్య... ఒక చోట చదివాను.. రెస్టారెంట్లలో ముందురోజు మిగిలిన కర్రీస్ ఫ్రిజ్  లో భద్రపరిచి, వాటిని మరుసటి రోజు వేడి చేసి వడ్డిస్తుంటారని ! ఎంతవరకు నిజమో తెలీదుగానీ... సందేహం మాత్రం పీడించడం మొదలైంది. అదంతా ఎందుకు బాబు! హాయిగా కాస్త శ్రమ అయినా, ఇంట్లోనే వండుకుని తింటే, రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం ! ఇంకా డబ్బు ఆదా. అనిపిస్తోంది ఈమధ్య. 
    ఉద్యోగస్తుల జీతాలు బాగా పెరిగాయి. దానికి తగ్గట్టు ఖర్చులూ పెరిగాయి. యాభై  ఏళ్ల క్రితం నాలుగు వందల జీతమొచ్చే వాళ్లని చాలా ఘనంగా అనుకునేవారు. వెయ్యి  వస్తే.. అబ్బో ! ఆ స్థాయే వేరు! అనేలా ఉండేది. ! మరి ఇప్పుడు!చెప్పాల్సిన అవసరమే లేదు. లక్షల్లో  అందుకునే వాళ్లూ ఉంటున్నారు. ఇదీ ఒక మార్పే !అది  పక్కన పెడితే... 
    నా చిన్నతనంలో ఒక రూపాయికి నాలుగు పళ్ళు బొరుగులు ( మరమరాలు ) వచ్చేవి. ఇప్పుడు పడి 8 నుండి 10 రూపాయల వరకూ ఉంది. రూపాయి విలువ అంతలా ఉండేది అప్పట్లో ! పాతికేళ్ల క్రితం వరకూ కంది బేడలు కిలో ఐదు రూపాయలకు వచ్చేవి. ఇప్పుడు వంద  దాటిపోయింది. ( మూడు, నాల్గు ఏళ్ల క్రితం ఒక్కసారిగా 220/- కూడా దాటిన సందర్భాలున్నాయి.) ఇలా ఒకటీ అరా కాదు... చాలా చాలా ఉంటాయి చెప్పుకుంటూపోతే. ప్రతీ  దినుసూ ఆకాశాన్నంటుతూ ఉంది. ఇది  ఒక ఉదాహరణ మాత్రమే.
   అప్పట్లో 100 లేదా 150 పెడితే మంచి నాణ్యత కలిగిన చీరలు లభించేవి. ఇప్పుడు మామూలు ఫ్యాన్సీ చీరలు కూడా మూడు, నాల్గు వేలు పలుకుతున్నాయి. పట్టు చీరల సంగతి.. ఇక అడగక్కర్లేదు. అంత పోసి కొనడానికైనా సిద్ధంగా ఉన్నామా... కాళ్లరిగేలా పది షాపులు తిరిగినా క్వాలిటీ అన్నదీ ఇంకా  మనసుకు నచ్చినదీ కాగడా పెట్టి వెతికినా దొరకదు. ఇలాంటప్పుడే పాత రోజులు పదేపదే గుర్తొస్తుంటాయి. అంత మార్పు! విపరీతమైన మార్పు !!
     అంతేనా ! సినిమాకి వెళ్తే అప్పుడు ( నలభై ఏళ్ల క్రితం ) 2-30 టికెట్ ! ఏసీ అయితే 3-00 రూపాయలు !ఇప్పుడు... అందరికీ విదితమే! అసలు థియేటర్కు వెళ్లే  జనం ఎందరు? ఆడడం లేదు... ఆడడం లేదు.. జనాలు రావడం లేదు.. అంటున్నారు గానీ... అప్పట్లో తీసిందే  తీసినా .. చూసిందే  పదేపదే చూడ్డం జరగలేదా ! ఇది కూడా ఒక మార్పు అని అనుకోవచ్చు. అప్పుడు సినిమా తీయాలంటే లక్షల ఖర్చు. ఇప్పుడు కోట్లలో ! 
    మా అక్క పెళ్లి జరిగినప్పుడు బంగారం తులం ధర 300 /-. అదే నా పెళ్లి నాటికి...వెయ్యి అయి కూర్చుంది. మా పిల్లల పెళ్లిళ్లు జరిగేనాటికి... పది నుండి పదిహేను వేలకు ఎగబాకింది. మరి ఇప్పుడు...!?  యాభై ఎప్పుడో దాటేసిందిగా ! ఇలా ఈ మార్పుల గురించి రాస్తూ పోతే పేజీలు పేజీలు నిండిపోతాయి.
    ప్రస్తుతం యాభై ఏళ్ళు దాటిన అందరూ ఎరిగినదే ఇదంతాను.... ఒకసారి ఆ రోజులు తలపుకు వస్తాయి అన్న ఆలోచనతో రాయాలనిపించింది ఇదంతా!  
     ఏమైనా  రోజులు మారాయి... దానికి తగ్గట్టు అన్నీ మారాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ! ఇంకేముంది ! మనం కూడా.. 🙂 మారామండోయ్🙂!!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷



Wednesday, October 19, 2022

మృగాలు సైతం !!

👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩👩

ఆడపిల్లంటే ఆదిశక్తి అంటూ 
మహాలక్ష్మి స్వరూపమంటూ 
సిరి నట్టింట వెలిసిందంటూ 
మహదానందపడే రోజులా ఇవి  !!

అదెప్పుడూ 'ఆడ' పిల్లేనంటూ 
శని నెత్తిన దాపురించిందంటూ 
తెగటార్చడానికి సిద్ధపడే తండ్రులు 
తయారైన కసాయి రాజ్యం ప్రస్తుత మిది !

వావివరుసలు వయోభేదాలు మరిచి
కన్నుమిన్ను గానక చెడిన 
కామాంధులకాలవాలమై పోయి 
మైలపడ్డ మృత్యు కుహరమిది !

మానవమృగాలంటే మృగాలు సైతం 
సిగ్గుతో చితికిపోయే దుస్థితికి 
దిగజార్చిన అమానవీయ దుశ్చర్యల 
పరంపర కడకేతీరం చేరి కడతేరుతుందో మరి !!

👩👩😔😔👩👩😔😔👩👩😔😔👩👩😔😔





Thursday, October 13, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 11.. పెద్దపులికి తోకగా ఉండడం కంటే చిన్న చీమకు... !

🌺

    జీవితమంటే కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు సహజమే. ప్రతి మనిషికీ ఇది తప్పనిదే. ఇంటాబయటా తీపి,  చేదు అనుభవాలు లేని వారుండరు. ఉద్యోగస్తులకైతే.. ఆ ఉద్యోగపర్వంలో మరిన్ని  జ్ఞాపకాల దొంతరలు !
                      **           **           **

    ఓ హెడ్ మాస్టర్ గారు అంటుండేవారు...
" పెద్దపులికి తోకగా ఉండే కంటే చిన్న చీమకు తలకాయగా ఉండడం చాలా మేలు అని..."
   అప్పట్లో నాకు ఆయన మాటలు బుర్రకెక్క లేదు. కానీ కాలగర్భంలో కొన్నేళ్ళు గడిచిపోయాక... ఎదుర్కొన్న కొన్ని స్వానుభవాలతో అప్పుడు... అప్పుడు ఫ్లాష్ వెలిగింది మెదడులో..! అదెలాగంటే... కొంత ఉపోద్ఘాతం అవసరం మరి !
    ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంటే... నేనే రాజు, నేనే మంత్రి.. నేనే అటెండర్,  నేనే ప్యూన్.. అన్న చందాన  ఉంటుంది ఆ 'కుర్చీ' పరిస్థితి ! అవటానికి చిన్నబడే. కానీ సవాలక్ష బరువులూ బాధ్యతలు.. అయితేనేం ! ప్రధానోపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడే ! పెద్ద సారు! పెద్ద టీచరు ! అన్న పెద్ద  హోదా ! పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా ప్రత్యేక దృష్టితో చూడడం విశేషం! అదో  చిన్న చీమ ! దానికి తల హెడ్మాస్టర్ / హెడ్ మిస్ట్రెస్ !
   నేను ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలల
HM గా పది సంవత్సరాలు పైగానే పనిచేశాను. రెండింటికీ పెద్ద తేడా ఏమీ  కనిపించలేదు నాకు. రెండింటి అడ్మినిస్ట్రేషన్ ఒకలాగే ఉండేది. అసిస్టెంట్ లకు తమ తరగతుల బాధ్యత ఒక్కటి మాత్రమే. కానీ.. HM కు స్కూలు వ్యవహారాలతో పాటు తన తరగతి బోధనా బాధ్యత కూడా అదనంగా ఉండేది. అబ్బో ! తలనొప్పి వ్యవహారాలు చాలా చాలానే ఉండేవి. (ఇప్పుడైతే పెరిగిపోయిన  టెక్నాలజీ పుణ్యమా అని  మరిన్ని కొత్త కొత్త ఆధునిక బాధ్యతలు వచ్చి పడ్డాయనుకోండి.. ). 
     అయినా చాలామంది హెడ్ మాస్టర్ లుగా ఉండటానికి ఇష్టపడేవారు. కొందరు అదో బరువు అనుకుంటే మరికొందరికి అది మహదానందంగా ఉండేది. అదో  గొప్ప హోదా అని ఫీలయిపోయి... అసిస్టెంట్ల మీద పెత్తనాలు చేసే వాళ్ళని చూశాన్నేను. ఈ తరహా వ్యవహారం హైస్కూల్ హెడ్ మాస్టర్ల దగ్గర, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్  దగ్గరా ఎక్కువగా  గమనించాను. కొందరైతే అదేదో ఆ కుర్చీీ, ఆ హోదాని మరీ గొప్పగా ఊహించుకొని, అది శాశ్వతమని భ్రమపడి సబార్డినేట్స్, అటెండర్, ప్యూన్... ఇలా అందరిమీద అవసరానికి మించిిన పెత్తనాలు  చేసే వాళ్లూ ఉండేవారు. పాపం ! రిటైర్ అయిపోయాక... పలకరించే దిక్కులేక వీళ్ళ పరిస్థితి ఏమిటో కదా... అనిపించేది !
    నా  సర్వీసులో చివరి పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్ గా చేయడం జరిగింది. అంతవరకూ వివిధ రకాల   స్కూలు పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన నాకు ఒకవిధంగా రిలీఫ్ ని ఇచ్చింది ఈ గెజిటెడ్ పోస్ట్ ! చాలా ఎదురు చూశాను కూడా. ఇక్కడ కేవలం.. Time to time... Bell & Bill లా ఉండే సౌలభ్యం ! బోధన మీదే కాన్సెంట్రేట్ చేసే  అవకాశం ! అంతా బాగుంది. కానీ కొద్ది కాలం గడిచాక.. ఏదో మూల కాస్త వెలితి అనిపించించసాగింది.  స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు సీనియర్ మోస్ట్ అయిన నేను.. కాలేజీ ఎడ్యుకేషన్ కు  రాగానే, సర్వీస్ మళ్లీ కొత్తగా మొదలై జూనియర్ మోస్ట్ అయిపోయాను. 
    అవటానికదో పులే ! కానీ దాని తోక లాంటి పరిస్థితి! అంతవరకూ  అజమాయిషీ చేస్తూ వచ్చిన నేను..ఒక్కసారిగా  సైలెంట్ అయిపోయి, ప్యాసివ్ మెంబర్ అవడం ! కించిత్ బాధ కలిగించే విషయం అయిపోయింది నాకు ! అప్పటివరకూ స్కూల్లో ఏ కార్యక్రమమైనా అన్నింటినీ ముందుండి నడిపించిన నేను.. ఇప్పుడు ఏమీ పట్టనట్టు ఓ పక్కగా ఉండిపోవడం! ఓ ఇష్టం కోసం మరో ఇష్టాన్ని వదులు కోవడం అంటే ఇదేనేమో !!
    కాకపోతే ఓ సంతృప్తి ఏమిటంటే... నేను కోరుకున్న పోస్ట్ లోకి చేరుకున్నానన్న సంతోషం మిగతా అన్నింటినీ జయించింది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే.. సరిగ్గా అప్పుడే అవగతమైంది నా బుర్రకు.. ఒకప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు అన్న మాటకు అర్థం.. ! ఏమిటో.. ! ఈయన  మరీ విపరీతంగా చెప్తున్నాడు అనుకున్నానారోజుల్లో.. అదే.. 
" పెద్ద పులికి తోకగా ఉండడం కంటే చిన్న చీమకు తలకాయలా ఉండడం మేలు "
 ఒక విధంగా నిజమే కదా! అనిపించేది నాకు ఆరోజుల్లో ఒక్కోసారి ! అదలా ఉంచితే... 
  బోధన నాకు ఇష్టమైన అంశం. దానికి మాత్రమే పరిమితమై,  నా చిన్ని కోరిక నెరవేరినందుకు నాకు ఎప్పటికీ ఆనందమే !! ☺️

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Friday, October 7, 2022

అమ్మ కడుపు ఎంత చల్లన !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అమ్మ కడుపు నుండి 
అవనికి దిగి అల్లన కన్ను దెరిచి 
కెవ్వుమన్న ఆ పసిగుడ్డు 
సిరప్పులు మింగలేక 
సూదిపోట్లు తాళలేక 
భయపడి బేజారై వగచిందిలా....

అమ్మ కడుపు ఎంత చల్లన  !
నులివెచ్చని ఆ చిన్ని గది
ఇచ్చిన రక్షణ నాకెంతటి ఆలంబన !
అదో ఊయల  ! 
ఆ లాలన మరువగలన  !!
బరువులు బాధ్యతలు
బంధాలు బాదరబందీలు
మచ్చుకైన మది జేరలేదే అచట !
నెలలు నిండి నెలవు దప్పి 
ఇలకు జారి ఇక్కట్లపాలైతి గద !
తిరిగిపోవ తరమౌన !
మనిషినై పుడితి నకట !!
నిజముగ ---
అమ్మ కడుపు ఎంత చల్లన !!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺