Friday, December 31, 2021

అదిగో అదిగో అడుగిడుతోంది నూతన సంవత్సరం..



🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

 పచ్చదనాల కొత్త కోక గట్టి
 పసిడి వర్ణం మేనిలో నింపి
 పరిమళాల పూదోట నుండి 
 పల్లవించే రాగాల తోడి 
 పరుగు పరుగున వస్తోంది 
 మన  కోసమే మన  కోసమే  !

  దోసిలి నిండా పూరేకులు
  దోబూచులాడే కొత్త ఊసులు
  కళ్ళ నిండా కోటి కాంతులు
  ఎదనిండా ప్రేమానురాగాలు
  ఒడి నిండా వరాల మూటలు
  మోస్తూ మోస్తూ వస్తోంది 
  మన  కోసమే మన  కోసమే !

   తెలతెలవారుతుండగా  
   పొగమంచు చీల్చుకుంటూ 
   వెలుగులు  వెదజల్లుతూ
   నిన్నటి చేదును మరిపిస్తూ
   రేపటి 'ఆశ 'కు పునాది వేస్తూ
   అదిగో అదిగో! అడుగిడుతోంది 
   నూతన సంవత్సరం! మన కోసమే!

 " విషాదాలెన్నుంటే నేమిగాక ! లెక్క చేయకు!
   మూసేయ్  గతాన్ని! ముందుకు కదులు !
   వర్తమానం నీ చేతిలోనే! ఆలోచించు"
   అంటూ ప్రగతి దారి పట్టమంటోంది !
   అదిగో అదిగో ! అడుగిడుతోంది 
      🌺నూతన సంవత్సరం 🌺
  స్వాగతిద్దాం సంబరాలు చేసుకుందాం
  నిరాశా నిస్పృహలు వదిలేద్దాం
  నీరసం నిశ్శబ్దం పక్కకునెడదాం !
  నవ్వుతూ నవ్విస్తూ జీవనయానం సాగిద్దాం !
  అదిగో అదిగో !నూతన సంవత్సరం!
  అడుగిడుతోంది మనందరికోసం 
  స్వాగతిద్దాం సంబరాలు చేసుకుందాం !!💐🌷

🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺


   





Thursday, December 30, 2021

స్వాగతం 🌄

      
                              🌺  2022🌺
                           🌺🌺🌺🌺🌺🌺
           నూతన సంవత్సరానికి  ఘన స్వాగతం


    🌷నూతన సంవత్సరం ఎప్పుడూ నిత్య నూతనమే కదా ! ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కడగండ్లు చుట్టుముట్టినా, మరెన్ని అవాంతరాలు వచ్చి అతలాకుతలం చేసినా వాటిమధ్య అంతో ఇంతో తీపిని కూడా రంగరిస్తూ ఉంటుంది  మరి ! అందుకేనేమో ! కొత్త సంవత్సరం వస్తోందంటే అందరికీ అంత ఆనందం ! 
     ఇది  జీవితం. సాఫీగా సాగితే అర్థమేముంది? సవ్యంగా సాగితే అది  జీవితం ఎలా అవుతుంది? ఎన్ని 'సునామీ'లొచ్చినా, ఎన్ని వరదలొచ్చినా,మరెన్ని 'కరోనా' లొచ్చి కష్టాలపాలైనా, భూకంపాలొచ్చినా, ఆకాశం బద్దలైనా కాలం  సాగుతూనే ఉందిగా! అంతే! అలా సాగుతూనే ఉంటుంది. ఎవరికోసం ఆగదు.           ఆప్తులు అసువులు బాసి కాల గర్భంలో కలిసి పోయినా, జ్ఞాపకాలు మిగిలిపోయి కళ్ళ తడి ఆరకున్నా  రేపటి పై  'ఆశ' మనలో నిత్యం సజీవంగానే ఉండాలి. ఉండితీరాలి. అప్పుడే అడుగు ముందుకేయగలం. అలా అడుగులు ముందుకు పడాలంటే నిరాశా నిస్పృహల్ని  వదిలేసి, నూతనో త్సాహాన్ని మదినిండా నింపుకుని శక్తి పుంజుకోవాలి. అటుపై కొత్త సంవత్సరాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. ఏమో ! సమస్యలతోపాటు సంతోష తరంగాల్నీ మనకందజేస్తుందేమో 😊🙂!
        🌷 ఈ  స్వాగత వచనాలందుకే 🌷
 నూతన సంవత్సరమా ! మా బాధల్ని  భరించే శక్తి మాకివ్వు. మా తీయని, తీరని కలల్ని నిజం చేసి  ఊరట నివ్వు. ఇదిగో అందుకో మరి!
          మా మనః పూర్వక స్వాగతం
         🌹🌹🌹🌹💐💐🌹🌹🌹🌹
  


     

Tuesday, December 21, 2021

స్థాయి....?

       టీ వీ లో ఏదో ఆడియో ఫంక్షన్ ప్రత్యక్ష ప్రసారం వస్తోంది.అంతా కోలాహలంగా, కన్నుల పండుగగా జరిగిపోతోంది. ఇంతలో ఆ చిత్రంలో నాయిక పాత్ర పోషించిన నటీమణి ప్రవేశించింది. అందరూ ఆమె చుట్టూ గుమికూడి, ఆమెతోపాటు నడుస్తూ ఏవేవో  ప్రశ్నలడుగుతూ వస్తున్నారు. అంతా బాగుంది, కానీ ఆ నటీమణి వస్త్రధారణ...!  ఏమిటో !.. అభ్యంతరకరంగా అనిపించింది ! అంత  ఎక్స్పోజింగ్ దుస్తులు అవసరమా? అని అందరూ అనుకునేలా ఉన్నాయాకాస్ట్యూమ్స్ !    సినిమాల్లో అయితే సీన్ కు తగినట్లు చేస్తున్నాం, సిచువేషన్స్ డిమాండ్ చేస్తే తప్పదు కదా! అంటుంటారు వీళ్ళు ! మరి ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్లలో ఏ సిచువేషన్స్ డిమాండ్ చేస్తాయో వాళ్లని? అర్థం కాదు. కొందరైతే సినిమాలో కూడా అంత ఎక్స్పోజింగ్ చేయరు, కానీ బయటికి వస్తే చాలు ఇలా తయారై వస్తారు. చుట్టూ జనం ఉండగా అలాంటి దుస్తుల్లో కొందరు  బాగా ఇబ్బంది పడడం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది.
    వేలాది మంది వస్తారు ఇలాంటి సందర్భాలకి. ఆహుతులూ  ఎందరో ఉంటారు. వేదికపై గౌరవనీయ పెద్దలూ ఉంటారు. అలాంటి చోట్లకి   సినిమా తారలైనంత   మాత్రాన అలా రావాలని ఉందా? అందువల్ల చూసే జనాలకి వాళ్ల మీద సదభిప్రాయం తొలగిపోయే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచన రాదా వీళ్ళకి!
     ఇలాగైతేనే సినిమా అవకాశాలు ఇంకా వస్తాయన్న   అభిప్రాయం ఏమైనా వాళ్లకు ఉంటే అది అపోహ, భ్రమ మాత్రమే !  అది కొంత కాలం ఉంటే ఉండవచ్చు. ప్రేక్షకాదరణ పొందాలంటే ముఖ్యంగా నటీమణులు కొన్ని పరిమితులు పాటించాలి. ఒక స్థాయికిచేరుకోవడం ఎంత కష్టమో... దాన్ని నిలుపుకోవడం అంతకన్నా కష్టం. బాధాకరమైన విషయం ఏమిటంటే కొందరు హీరోయిన్ లు అగ్ర స్థానానికి చేరిన తర్వాత అది  నిలుపుకునే ప్రయత్నాలు చేయడం లేదు.
    ' శంకరాభరణం'  చిత్రానికి ముందు నటీమణి మంజుభార్గవి వ్యాంప్ పాత్రలు, డాన్స్ చేయడాలూ వరకే పరిమితమై ఉండేది. ఆ చిత్రం తర్వాత ఒక్కసారిగా ఆమె స్థాయి  ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. కానీ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే--- అటు పిమ్మట ఆ స్థాయిని దిగజార్చుకోలేదావిడ! దర్శకనిర్మాతలు కూడా నాయిక పాత్రలూ, ప్రధాన పాత్రలూ మాత్రమే  ఇవ్వడం మొదలెట్టారు.. ఆ విధంగా ఆమె స్థానాన్ని పదిల పరుచుకున్నారామె. 
  "  దర్శకులు విశ్వనాధ్ గారు నాకిచ్చిన గౌరవం, స్థాయి కాపాడుకోవాలి. వారి పేరు ఎప్పటికీ చెడగొట్టను  నేను" అంటూ మంచి అవకాశాలు మాత్రమే అంగీకరిస్తూ వచ్చారు. ఇప్పటికీ సినిమాల్లో, సీరియల్స్ లో అడపాదడపా తనకు దగ్గ హుందా   గల పాత్రలు మాత్రమే చేస్తూ అందరి హృదయాల్లో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. అదీ.. చేరుకున్న స్థాయిని నిలుపుకోవడం అంటే !
    ఇప్పటి తారల్లో కూడా  అలాంటి కోవకు చెందినవారు కొందరు లేకపోలేదు. మీనా, రమ్యకృష్ణ, ఆమని, భూమిక మొదలగువారు వివాహానంతరం కూడా వారికి తగ్గ పాత్రల్లో  నటిస్తూ చక్కటి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. నేటి తరం నాయికలు వారందరినీ ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందేమో !!

                    🌺🌺🌺🌺🌺🌺🌺🌺

 

Thursday, December 16, 2021

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..2.. పసి మనసులు.. పసిడి మనసులే.. !

🌺
      పసితనం ఎంత కల్మష రహితం ! ఆ చిరునవ్వుల్లో ఎంత స్వచ్ఛత ! కల్లాకపటం ఎరుగని ఆ చూపులు వారికే సొంతమనుకుంటా. ఏనాడో చెప్పాడో సినీకవి--
     "  పుట్టినపుడు మనిషి మనసు తెరచి ఉండునూ 
        ఆ పురిటికందు మనసులో దైవముండునూ 
        మాయ మర్మమేమి లేని బాలలందరూ
        ఈ భూమి పైన వెలసిన పుణ్య మూర్తులే
        పిల్లలూ దేవుడూ చల్లనివారే
        కల్లకపటమెరుగనీ కరుణామయులే "
--- అని 
     అక్షరాలా నిజం ! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నా ఉద్యోగ జీవితం ప్రారంభమైనది ఓ ప్రాథమిక పాఠశాల స్థాయి పిల్లలకు బోధించడం తోనే. చదువు పూర్తయిన వెంటనే ఒకటవ తరగతి విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు బోధించే  చక్కటి అవకాశం నాకు లభించింది. మొదట్లో ఇంత చిన్న పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలి, అసలు వీళ్లకు అ ఆ లు, గుణింతాలు ఎలా నేర్పాలి రా దేవుడా, అని ఫీలయినా, కొద్ది రోజుల్లోనే ఆ అభిప్రాయం నాలో తుడిచిపెట్టుకుపోయింది. కాస్త దగ్గరకు తీస్తే చాలు, టీచర్ ను  అల్లుకుపోయే సున్నిత మనస్కులు ఆ వయసు పిల్లలంతా ! 
   ఓ  విద్యాధికారి అప్పట్లో స్కూల్ ను సందర్శించి, ఆ సందర్భంగా ఓ మాటన్నారు, 
First class teachers are 'first class👌 ' teachers అని --  
 ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయులు ప్రధమ శ్రేణికి చెందిన ఉపాధ్యాయులనీ వారిని చిన్న చూపు చూడడం, తక్కువగా అంచనా వేయడం తగదనీ  అన్నారు. అభివృద్ధి చెందిన అగ్రదేశాల్లో ఎలిమెంటరీస్కూల్ టీచర్లకు కళాశాల అధ్యాపకుల కంటే లభించే గౌరవం సముచితంగా ఉంటుందని ఆ సందర్భంగా అందరికీ చెప్పారు.
    ఇక -- చిన్న పిల్లలే కదా అని వాళ్లను తక్కువగా అంచనా వేశామంటే పప్పులో కాలేసినట్టే నండోయ్ ! టీచర్ ను నఖశిఖ పర్యంతం నిశితంగా గమనించడంలో వాళ్ళు దిట్టలు సుమండీ! టీచర్ ఈ రోజు ఏ చీర కట్టుకుందీ, సార్ ఈరోజు ఏ డ్రెస్ తో వచ్చాడు -- దగ్గర్నుండీ వాళ్ళ ప్రతీ  కదలికనూ ఆ చిన్నారులు గమనించడం నా అనుభవంలో చవి చూశాను.మరొక్క  విషయం... గురువుల్ని అభిమానించడం లో, ఇష్టపడడం లో వారికి వారే సాటి!
   వాళ్లకి టీచర్ ఏది చెప్తే అది రైటు. అంతే! ఏదైనా ఒక పదం సరిగ్గా పలకకపోతే ఇంట్లో అమ్మో, నాన్నో--
" అలా కాదమ్మా, తప్పు,  ఇలా పలకాలి" అంటే
" పోమ్మా, నీకేం తెలీదు, మా టీచర్ ఇలాగే చెప్పింది "
 అనే గడుగ్గాయిలు  వాళ్ళు. అంటే, టీచర్ మీద అంత నమ్మకం అన్నమాట! అందుకే బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా అప్పట్లో నేను గ్రహించాను. ఎందుకంటే--- ఆ లేత వయసులో సమాచారం తప్పుగా వాళ్లకు చేరిందంటే అది వాళ్ల మెదడులో అలాగే స్థిరంగా నిలిచి పోతుంది మరి ! అది  చెరిగిపోవడమూ అంత సులభం కాదు.
   ప్రభుత్వ ఉపాధ్యాయినిగా చేరాక ఓ చిన్న గ్రామంలో కొంత కాలం పాటు పని చేశాన్నేను. అక్కడ సాయంత్రం బడి వదలగానే 4, 5 తరగతుల పిల్లలు టీచర్ల బ్యాగులు చటుక్కున లాక్కుని వాళ్ల భుజాలకు తగిలించుకుని మా ముందు నడుస్తూ, బస్సు దాకా వచ్చి, మమ్మల్ని ఎక్కించాక  గానీ వెనుదిరిగే వారు కాదు. వాళ్ళకదో  ఆనందం! 
    ఈ అమాయకత్వం, కల్లాకపటం లేనితనం, గురువుల పట్ల ప్రేమాభిమానాలు ప్రాథమిక విద్య ముగిసేదాకా మాత్రమే ఉంటాయనేది కూడా నిజంగా నిజం! హై స్కూల్ పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు. వయసు పెరుగుతోంది కదా, కాస్త  మొహమాటం, భేషజం వచ్చి చేరడం మొదలవుతుంద న్నమాట !
    అలాగే, అంతవరకూ బుద్ధిగా ఉన్న పిల్లలు మెల్లి మెల్లిగా క్లాసులో అల్లరి చేయడం కూడా నేర్చేసుకుంటారు. బాగా గమనిస్తే, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, హై స్కూల్ విద్యార్థులకు ఈ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వయసు ప్రభావం మరి ! క్రమంగా వారిలో పసితనపు  ఛాయలు తొలగిపోతూ ఆ స్థానంలో ఒకలాంటి గడుసుదనం, ఆరిందాతనం అలా అలా ఇంకా ఎన్నెన్నో వచ్చి చేరిపోతాయి! ఫలితంగా -- లోకం పోకడ వంట బట్టి వాళ్లూ మామూలు మనుషుల కేటగిరీలోకి వచ్చేస్తారు ! 
      " వయసు పెరిగి  ఈసు కలిగి మదము హెచ్చితే 
         అంత మనిషిలోని దేవుడే మాయమగునులే "

--- అలాగన్నమాట ! అది అత్యంత సహజం కూడా. వారికి తగినట్లుగా బోధించే ఉపాధ్యాయులు కూడా మారాల్సి వస్తుంది, తప్పదు ! దండించడం, క్రమశిక్షణ తెలియజేయడం, కాస్త రిజర్వుడు గా ఉండటం... ఇలా ఎన్నో వీళ్ళు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న, నేర్చుకున్న విషయాలే !
     నేను పనిచేసిన ప్రతీచోటా ఓ' బెస్ట్ బ్యాచ్' తప్పనిసరిగా ఉండేది. ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా చేస్తున్న రోజుల్లో అలాంటి ఓ బెస్ట్ బ్యాచ్ ఒకటి ఉండేది. ఆ బ్యాచ్ పిల్లలు ఐదవ తరగతి పూర్తయి పాఠశాల వదలి వెళుతున్న సందర్భంగా చిన్న పార్టీలాంటిది చేసుకుని  ఉపాధ్యాయులందరితో ఓ గ్రూప్ ఫోటో తీయించు కోవడం జరిగింది. వారి కోరిక మేరకు ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి ఆఫీస్ రూమ్ లో తగిలించాను. చాలా సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ స్కూలుకు వెళ్ళినప్పుడు, అదే రూమ్ లో గోడకున్న ఆ ఫోటో చూసి ఎంత సంతోషించానో ! కొన్ని జ్ఞాపకాలను ఫోటోల్లో బంధించడం ఎంత మంచి ప్రక్రియో కదా అనిపించింది నాకప్పుడు!
   ఏదిఏమైనా... అప్పుడప్పుడూ ఆనాటి పసి పిల్లలు పెద్దలై, జీవితంలో సెటిలై పోయి.. అనుకోకుండా ఏ దారిలోనో, లేదా ఇంకా ఏదో సందర్భంలో కలిసి అలనాటి ముచ్చట్లు నాతో ప్రస్తావించినప్పుడు కలిగే అనుభూతి, ఆనందం ఎంతో మధురం!సుమధురం !!😊🙂😊

                  🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺














Saturday, December 11, 2021

గాడి తప్పితే..... !


    చిన్నతనంలో చుట్టుపక్కల పిల్లలతో కలిసి హాయిగా గంతులువేస్తూ, పరుగులు పెడుతూ ఆడుకోవడం మహా ఇష్టంగా ఉండే విషయమే  ఎవరికైనా.. స్కూల్ నుండి సాయంత్రం రావడం ఆలస్యం, ఇక అదే పనిగా ఉండేది పిల్లలకి. 
--- ఇదంతా  నలభై, యాభై సంవత్సరాల క్రితం మాట! 
  అప్పట్లో మరో ఇతర వ్యాపకం అంటూ ఏదీ  ఉండేది కాదు మరి !నా  హైస్కూల్ విద్య ప్రారంభమయ్యేసరికి అక్కడక్కడా కొన్ని ఇళ్లలో రేడియో ప్రత్యక్షమైంది. అదో అద్భుతం ఆ రోజుల్లో !ఆ వయసు పిల్లలకి, ఇంకా పెద్దలకి కూడా కాలక్షేపం దొరికింది. 
    మరో పది సంవత్సరాలు గడిచేసరికి టీవీ అన్నది ఆవిర్భవించింది.  అది జనాల్లోకి చొచ్చుకుని రావడానికీ, ప్రతీ ఇంట్లో తిష్ట వేయడానికీ మరో పదేళ్లు పట్టింది. అది మరో అద్భుతం ! అంతవరకూ మాట మాత్రమే వినిపించేది కాస్తా, మాట్లాడే మనుషులు కూడా దర్శనమివ్వడం! ఆహా ! ఎంత విచిత్రం !అనుకున్నారు జనాలంతా. అందుకేనేమో, రామాయణ మహాభారతాలు సినిమాలుగా కోకొల్లలుగా వచ్చినా టీవీ రామాయణ మహాభారతాల్ని పడీ  పడీ చూశారు అంతా! 
   మెల్లిగా  రేడియో స్థానం,ప్రాబల్యం  తగ్గిపోయి ప్రతి ఇంటా బ్లాక్ అండ్ వైట్ టీవీ కొలువుదీరి పోయింది! ఆ ముచ్చట కొంతకాలం కొనసాగాక, కలర్ టీవీ పుట్టుకొచ్చి,  కొత్త వింత పాత రోత అన్నట్లు, బ్లాక్  అండ్ వైట్ టీవీ  కాస్తా మూలకు నెట్టివేయబడింది.అంతే ! అంతా రంగులమయం! అంతవరకూ ఒకే ఒక్క  ఛానల్ తో సరిపెట్టుకునే జనాలకు కన్నుల పండుగ అయింది. బోల్డన్ని చానల్స్! పుట్టుకొచ్చి, పాటలే పాటలు, సినిమాలే  సినిమాలు! అంతేనా, కార్యక్రమాల లిస్టు రాసుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది మరి!  దాంతో సినిమాల కోసం థియేటర్లకు పరుగులు తీసే జనాభా తగ్గుముఖం పట్టిందంటే ఒప్పుకొనే  తీరాలి.
   రేడియో ఒక అద్భుతం, టీవీ అంతకన్నా అద్భుతం! అంతటితో ఆగిందా! టెక్నాలజీ రోజురోజుకీ పెరిగి పెరిగి... సెల్ ఫోన్ లు  వచ్చేశాయ్. అంతక్రితం ఎక్కడో ఒకచోట ల్యాండ్ ఫోన్స్ ఉండే పరిస్థితి పోయి, ప్రతివారి చేతిలోకీ ఓ ఆభరణంలా సెల్ ఫోన్ వచ్చేసింది. ఎవరు ఎప్పుడు ఎక్కడున్నా ఎవరితోనైనా మాట్లాడే సౌలభ్యం వచ్చేసింది అందరికీ.
    సరే, ఇకనైనా ఫుల్ స్టాప్ పడిందా ! స్మార్ట్ ఫోన్ అవతరించింది ! ఇంకేముంది, అరచేతిలోనే సమస్త విశ్వదర్శనం ! రేడియో, టీవీలో... నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఆయా కార్యక్రమాలు వినగలం, చూడగలం. కానీ ఈ స్మార్ట్ ఫోన్లో -- ఏది కావలిస్తే అది, ఎప్పుడు  కావలిస్తే అప్పుడు చూసుకునే  సౌలభ్యం, వద్దు అనుకుంటే అప్పటికి ఆపడం, కావాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ నుండి' కంటిన్యూ' చేయడం ! ఆహా ! సాంకేతికతా ! నీకు జోహార్ ! అనుకున్నారంతా మళ్లీ!
🌷  * యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్..
...ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ! వాడుకున్న వారికి వాడుకున్నంత !
అంతెందుకు, ఇలా ఆర్టికల్స్ అన్నవి ఆన్లైన్ లో రాయాలన్నా, మన ఆలోచనలు నలుగురితో పంచుకోవాలనుకున్నా అరచేతిలో ఇమిడిపోయి చకచకా ఎవరికి వారే టైపు చేసుకుంటూపోయే ఓ అద్భుతమైన ప్రింటింగ్ మెషిన్ కూడా !  
* అంతే కాదు, ఎక్కడో ఖండాతరాలలో ఉన్న ఆప్తులను ఎదురెదురుగా చూస్తూ మాట్లాడుకోవడం!
*  ఇంకా ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో పొందే సౌలభ్యం. 
*  ఇంటినుంచి కదలకుండా ఆన్లైన్ లో షాపింగ్ లూ, బిల్లులు చెల్లించడాలూనూ ! 
---- ఒకటా, రెండా... లెక్కలేనన్ని సౌకర్యాలు ! ఉదాహరించినవి కొన్ని మాత్రమే !సరే,  ఇంతవరకూ టెక్నాలజీ పరుగు ప్రగతి పథంలో దూసుకుపోవడం హర్షణీయం. సదా అభిలషణీయం కూడా..
కానీ --- ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అనూహ్యంగా పెరిగిపోయిన ఈ సాంకేతికత మానవాళికి ఎంత ఉపయోగకారిగా ఉంటున్నదో అంత ప్రమాదకారిగా కూడా అయి కూర్చోవడం అత్యంత బాధాకరంగా పరిణమించిందన్నది కూడా పచ్చి నిజం ! 
*  చేతిలో ఉంది కదాని దుర్వినియోగం చేయడం, సైబర్ నేరాలకు పాల్పడడం, అమాయకుల్ని ఉచ్చు లోకి లాగడం, ఎన్నెన్నో మోసాలకు దారులు వెతకడం...నిత్యం చూస్తున్నాం. ఇది అందరికీ విదితమే. 
*  మరోవైపు.. యువతే గాదు.. చిన్న పిల్లలు సైతం వీటివల్ల చెడు మార్గాల్ని అనుసరిస్తూ  విపరీత ప్రవర్తనలకు లోనుకావడం! అశ్లీల వీడియోలు చూడ్డమనే వ్యసనానికి బానిసలై చిన్నపిల్లల్ని' 'బలిచేయడం'!
*  మైనర్ బాలికలతో'నీలి ' చిత్రాలు తీసి వాటితో కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారని  ఇటీవలి వార్త !
*  ఇంకా.. స్త్రీల పై లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ చేయడాలూ... వీటికి కొదువే లేదు. 
 ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా వెలుగులోకి వస్తున్నవి చాలానే ఉన్నాయి.--- ఇదంతా సాంకేతికను దుర్వినియోగం చేయడం కాదా !
---  ఇది నాణేనికి మరో వైపు !  ఏదైనా హద్దుల్లో ఉంటేనే మంచిగా, పద్ధతిగా ఉంటుంది. సాంకేతికత ప్రగతి పథంలో నడవాలి తప్ప పెడదారిలో కాదు. అది 
గాడి తప్పితే పెను ప్రమాదమే అని వర్తమానంలో జరుగుతున్న ఎన్నో విపరీత పోకడలు నిత్యం రుజువు చేస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తు సమాజాన్ని ఊహించలేం..!!
     సాంకేతికత అన్నది అభివృద్ధికి సోపానం. అత్యవసరం కూడా.  సదా ఆహ్వానం పలకాల్సిందే. కానీ, దుర్వినియోగం తగదు. నేర ప్రవృత్తి నివారించాలి. నిర్మూలించే దిశగా ప్రయత్నాలు  జరగాలి. 
                           🌹🌹🌹🌹🌹
         


 

  


 

Wednesday, December 8, 2021

మేధస్సు

క్షయమన్నదెరుగదు  
అదో  అక్షయ పాత్ర  !
ఎంత తోడినా తరగని 
ఆలోచనల పుట్ట  !
అదే  మనిషి మెదడు ! 
అది  నిత్యం మండుతున్న  కొలిమి !
జ్ఞాపకాల దొంతరలెన్నో దాగిన నిధి 
కదిలిస్తే చాలు అదో తేనెతుట్టే  !
ఆపై చుట్టుముట్టే ఆలోచనల వృష్టి 
కవిచే కలం పట్టిస్తుంది  !
కథకునితో కథ రాయిస్తుంది  ! 
వక్తల నోట మాటల తూటాల్ని 
సంధింపజేస్తుంది ! ఇంకా, ఇంకా 
నూతన ఆవిష్కరణలకు 
నాంది పలుకుతుంది  !!
అవును మరి ! అది మనిషి మేధస్సు  !
మనిషికి దేవుడిచ్చిన దివ్య  వరం 
మనిషికే పరిమితమైన  మహాద్భుతం !!
                🌹🌹🌹🌹🌹🌹🌹

Saturday, November 20, 2021

చినుకులు వరదలైతే...

    చినుకు రాలందే భూమి తడవదు. భూమి తడవందే గింజ మొలవదు. పంటలు పండవు. అవి లేకపోతే జనాలకి తిండిగింజలుండవు. ఆకలి తీరే  మార్గం లేక అలమటించాల్సిందే! 
    నిజమే ! చినుకులు వర్షపు ధారలై అందర్నీ పరవశింపజేయాలి. బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలి. రైతన్నల కలల్ని పండించాలి. కానీ -- ఆ చినుకులన్నవి వరదలయితే ! భీభత్సాల్ని సృష్టిస్తే !
         ప్రస్తుతం విపరీత వర్షాలు, వరదలు సృష్టిస్తున్న అల్లకల్లోలం చూస్తుంటే ఏమిటీ  ప్రకృతి  వైపరీత్యం ! అనిపించక మానదు ఎవరికైనా. అసలే చలి కాలం. రెండు మూడు రోజులు ఎడతెగకుండా వర్షం కురిస్తేనే తట్టుకోలేని పరిస్థితి ! అలాంటిది రోజుల తరబడి ఈ కురిసే వానలతో, తుఫాన్ వాతావరణం తో కొన్ని ప్రాంతాల ప్రజలు పడుతున్న పాట్లు చూస్తుంటే చాలా  బాధనిపిస్తుంది. చూసేవాళ్ళకే  ఇలా ఉంటే అనుభవిస్తున్న వాళ్ల సంగతేమిటి ? 
      పక్కాగా కట్టుకున్న కాంక్రీటు భవనాలు కూడా  పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు, వరద నీళ్లలో ఇళ్లన్నీ జలమయమై వస్తు వాహనాలు సైతం కొట్టుకు పోతున్న దృశ్యాలు టీవీల్లో చూస్తున్నాం. గుడిసె వాసుల దైన్యం సరే సరి  ! ఊహించడమూ దుర్భరమే! అంతా కోలుకుని, మళ్లీ కూడగట్టుకొని స్థిరపడడానికి ఎంత కాలం పడుతుందో ఏమో ! 
       మరోపక్క రైతన్నల దుస్థితి! పంట చేతికి వచ్చిన తరుణం. అంతా ఆరబోసుకున్న  ధాన్యం రాశులు నీటి పాలై కొట్టుకుపోతుంటే కన్నీళ్ళ పర్యంతమై చేష్టలుడిగి చూస్తున్న తీరు బాధాకరం. పంట చేలన్నీ  నీట మునిగి కడుపు తరుక్కుపోయి విలవిలలాడుతూ దిక్కు తోచక ఆకాశం వైపు చూస్తున్నారు రైతు సోదరులు ! 
     నీరు ప్రాణాధారం అంటాం.గుక్కెడు నీటికై తహ తహ లాడి పోతుంటాం. గుప్పెడు నీరు ప్రాణాల్ని నిలబెడుతుంది కూడా.  కానీ అదే నీరు ఇలా విజృంభించి వరదలై పారితే మనిషి పరిస్థితి ఇంత  భయానకంగా, దారుణంగా, దయనీయంగాఉంటుందా!
     అందమైన జలపాతాలను, నదులను  చూసి ఆనందిస్తాం. జల జల పారే జలపాతాల్ని, ఆ హోరునీ ఎంతగానో ఆస్వాదిస్తారు జనం ! కానీ శృతి మించితే  అది ఘోషగా,కర్ణకఠోరంగా కూడా అనిపిస్తుందని ప్రస్తుత వరద బీభత్సాలు నిరూపిస్తున్నాయి.ఏది ఏమైనా బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. 

*******************************
      *తెలుగు కథలు కవితలు వ్యాసాలు *
*******************************

 



 

Thursday, November 18, 2021

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే -1-- జీవనయానం లో పరిమళించిన స్నేహకుసుమాలు

        ప్రయాణమంటే బస్ లోనో, రైల్లోనో ప్రయాణిస్తేనే ప్రయాణమా? జీవితం కూడా ఓ ప్రయాణమే కాదా?  పుట్టినప్పటినుంచీ మరణించే దాకా మనం వేసే ప్రతీ అడుగూ ప్రయాణమే అని నా అభిప్రాయం. ఈ ప్రయాణం లో ఎన్ని ఒడుదుడుకులో!ఎన్ని మలుపులో, మరెన్ని ఆనందాలో! ఇంకా ఎన్నెన్ని అద్భుతాలో చోటుచేసుకుంటూ మనిషికి ఒక్కోసారి ఆనందానుభూతినీ, మరోసారి విషాదాన్నీ చవిచూపిస్తూ ఉంటాయి. ప్రతీ మనిషి జీవితం లో ఇవి మామూలే ! అత్యంత సహజమే ! అలాంటివి... కొన్ని నా ప్రయాణంలో  -----
   ఒకటి నుండి అయిదు తరగతుల దాకా ఓ మున్సిపల్ స్కూల్లో సాగింది నా చదువు.6, 7 తరగతులు మా  స్వగ్రామంలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్లో పూర్తయినాయి. అక్కడ క్లాసులో ముగ్గురమే అమ్మాయిలం  ఉండేవాళ్లం. ఆ వయసులో ఊరికే మాట్లాడుకోవడం తప్పించి స్నేహం గురించి పెద్దగా తెలియదు మాకు. ఏడో తరగతి పూర్తయి, పక్కనే ఉన్న టౌన్ లో గర్ల్స్  హై స్కూల్ లో ఇద్దరం  మాత్రమే చేరాం. ఒక అమ్మాయి చదువు మానేసింది. అంతవరకూ ముగ్గురమే ఉన్న స్కూల్ నుండి ఒక్కసారిగా క్లాసులో క్రిక్కిరిసి ఉన్న అమ్మాయిలతో కూర్చుని పాఠాలు వినడం చాలా కొత్తగా ఉండేది. కొత్త ముఖాలు, కొత్త స్నేహాలు, కొత్త టీచర్లు! కొందరు ఇప్పటికీ బాగా గుర్తే ! టెన్త్ తర్వాత ఇంటర్లో కో ఎడ్యుకేషన్. అక్కడ మళ్లీ ముగ్గురమే అమ్మాయిలం! అదో  అనుభవం మళ్ళీ. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి జూనియర్ అమ్మాయిలు ఓ పదిమంది దాకా చేరిపోయారు. అమ్మాయిలకు వెయిటింగ్ రూమ్ లేక స్కూల్ లైబ్రరీ లో కూర్చోబెట్టేవారు. అక్కడ అంతా కలిసి ఉండడం, కొత్త స్నేహాలవడం --  అదో చిన్న  ప్రపంచం అనిపించేది.
   ఇంటర్ దాకా పెద్దగా ప్రభావితమైన స్నేహాలేవీ  లేవనే  చెప్పాలి నాకు. అంతవరకూ ఓ ఎత్తు ! డిగ్రీలో చేరాక పరిచయమైన స్నేహాలన్నీ ఒక ఎత్తు! అలాగే BEd చేసే రోజుల్లో కూడా.ఆ  నాలుగు సంవత్సరాలు హాస్టల్ లోనే ఉన్నందువల్ల రూమ్మేట్స్ తో పాటు పక్క రూమ్మేట్స్ తో  కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. 
   గుంటూరు ఉమెన్స్ కాలేజీ లో BSc చదువుతున్న రోజుల్లో సాయి కుమారి అనే స్నేహితురాలు ఉండేది. చేరిన కొద్ది రోజుల్లోనే నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. నవ్వుతూ, చక్కగా జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించడం ఆమె ప్రత్యేకత. మనకు  పరిచయాలన్నవి చాలా మంది తోనే ఉంటాయి కానీ అన్ని విషయాలు పంచుకునే స్నేహాల్ని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి స్నేహమే మా మధ్య ఉండేదా రోజుల్లో! నేను హాస్టల్ లో ఉన్నందున అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళేది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యాక కూడా ఓ సంవత్సరం పాటు మా మధ్య ఉత్తరాలు నడిచాయి. ఆ తర్వాత... ఏముంది, మామూలుగానే ఆగిపోయాయి. అలాగే---
  గుంటూరు St.Joseph college for Education లో BEd చేసే రోజులు కూడా బాగా గుర్తు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ను మరిపించేలా చూసుకునేవారు నా రూమ్మేట్స్ ! ఆ కోర్స్ చేస్తున్న రోజుల్లో రెండు సార్లు నేను మలేరియా జ్వరంతో బాధపడ్డాను. ఆ సమయంలోనా రూమ్మేట్స్-- సరస్వతి, భాగ్యలత, అనంతలక్ష్మి -- ఈ ముగ్గురూ నాకు చేసిన సపర్యలు ఎప్పటికీ మర్చిపోలేను. బత్తాయి జ్యూస్ తీసి తాగించడం, టైమ్ కు టాబ్లెట్స్ వేయించడం, సరిగ్గా తినేలా చూడ్డం... అలా.. ఇంట్లో వాళ్లు కూడా చేయలేరేమో అన్నట్లుగా చూసుకున్నారు నన్ను! 
  కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే-- ఆ స్నేహాలూ, ఆ స్నేహితులూ మళ్లీ ఇంత వరకూ కనిపించకపోవడం ! ఇప్పటిలా సెల్ ఫోన్లు అప్పుడు లేవు కదా!  చివరి పరీక్షలు రాశాక, బై చెప్పుకుని ఎవరి ఊళ్లకు వాళ్ళం వచ్చేశాం.  ఆ బంధాలు అంతటితోనే  ముగిసిపోయాయి.
    కానీ,ఆ  జ్ఞాపకాలు మాత్రం మదిలో పదిలంగా నిక్షిప్తమయే  ఉన్నాయి ఇప్పటికీ! అలా, నా విద్యాభ్యాస కాలంలో పరిమళించిన ఆ స్నేహ కుసుమాలు ఇప్పటికీ తాజాగా ఉండి, గుర్తొచ్చినప్పుడల్లా సౌరభాలను వెదజల్లుతూనే ఉన్నాయి !! 
      రైల్లో ప్రయాణించేటప్పుడు, అంత వరకూ ఎంతో పరిచయమున్నవారిలా కబుర్లాడినతోటి ప్రయాణీకులు వారి  స్టేషన్ రాగానే దిగిపోతారు. మళ్ళీ జీవితంలో వాళ్ళు కనిపించడమన్నది జరగదు. ఈ స్నేహాలూ అంతే కదా అనిపిస్తుంది. వాళ్లంతా ఎవరి జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయిపోయి బిజీగా ఉంటారు. వాళ్లలో ఎవరికైనా నాలా ఆన్ లైన్ లో బ్లాగులు చూసే అలవాటు ఉండి ఉంటే గనక నా ఈ పోస్ట్ చూసే అవకాశం ఉండొచ్చేమో ! ఇది నా భావన ! అసంభవమైనా లోలోన ఏదో ఆశ కూడా ! 😊

***********************************
        * తెలుగు కథలు కవితలు వ్యాసాలు *
***********************************






 

Sunday, November 14, 2021

ఓ విన్నపం

   నమస్తే ! నా బ్లాగు చదువుతున్నవారికి ఓ విన్నపం. నిన్నటి దాకా " తెలుగు కథలు కవితలు వ్యాసాలు " అన్న పేరుతో వస్తున్న నా బ్లాగు నేటినుండి " భువి భావనలు" గా మార్చబడినదని మనవి చేసుకుంటున్నాను. 🙏
                                                 --- యం. ధరిత్రీ దేవి 

Saturday, November 13, 2021

ఎర్ర గులాబీ

                                          🌷🌷🌷🌷🌷🌷🌷
                                             భువి భావనలు🐦
                                         🌷🌷🌷🌷🌷🌷🌷


🌹
తెలతెలవారుతూ 
తొలి కిరణాలు తాకి
ఎర్రగులాబీ విచ్చుకుంటూ 
విరబూసింది మెల్లిమెల్లిగా !
వెదజల్లుతూ సౌరభాల్ని 
ఆకర్షిస్తూ అందర్నీ 
పలకరించింది తీయగా !
అంతలో ఏదో గుర్తొచ్చి 
ఎదురుచూడసాగింది ఆశగా !
అదుగో, నిరీక్షణ ఫలించింది 🙂
అటుగా వస్తూ కనిపించిందో చిన్నారి ! 🙎
కానీ, ఆగక ముందుకు సాగింది. 
స్పందన జాడలేని ఆ మోము గని 
అచ్చెరువొంది ఆపి అడిగింది గులాబీ, 
" పాపా, నీ నవ్వుల గలగలలెక్కడ? 
 ముచ్చటైన ఆ చిలుకపలుకులు 
ఎక్కడ చిక్కుకున్నవి ? 
తళతళ మెరిసే నీ కళ్ళు 
నీళ్లతో నిండినవేమి ? 
నను చూసీ నవ్వవేమి ? 
చిట్టితల్లీ, దేనికి ఈ విచారం ? 
బాలల దినోత్సవం కదా, 
నెహ్రూ మామయ్యకు 
నను కాన్కగా ఇవ్వవా ఏమి ! " 
కదిలే కొమ్మల్ని ముందుకు సాచి 
రారమ్మంటూ గారంగా పిలిచింది. 😊
చివ్వున తలెత్తింది చిన్నారి !!🙎
" బడులే లేవు, బాలల పండగెక్కడ ? 
పంతుళ్లు రారు, పాఠాల ఊసు లేదు 
నేస్తాలు లేరు, ఆటపాటలు లేవు 
మొక్కుబడి చదువులు 
మౌనంగా రోదిస్తూ నడుస్తున్నాయి  రోజులు !
పరీక్షలు లేవు, పై తరగతులైతే ఉన్నాయి !
చదవలేము రాయలేము లెక్కలు రానేరావు 
అన్నీ తీసివేతలే మిగిలాయి !
'కరోనా 'అంట !కాలనాగై కాటేసింది !
మా చిరునవ్వుల్ని చిదిమేసి 
మా భవిష్యత్తును కాలరాసింది !
ఇంకెక్కడి బాలల పండగ !
ఎన్నడూ లేదంట, ఇలాంటి దురవస్థ !
అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది.. "
ఎర్రబడ్డ ఆ పాలబుగ్గల మీద 
జలజలా కన్నీటి ధారలు "😔
 నివ్వెరపోయి క్షణం -- మరుక్షణం 
చలించిపోయింది గులాబి !
ఆపై విరిసిన ఆ పూరేకలు 
ముడుచుకుపోయి మూగబోయాయి !!

                    ************







 

Saturday, November 6, 2021

ఆడపిల్ల.. పెళ్లికి ముందు.. ఆతర్వాత..!

                                             🌷🌷🌷🌷🌷🌷🌷
                                                భువి భావనలు🐦
                                            🌷🌷🌷🌷🌷🌷🌷               

       పాత తెలుగు సినిమాల్లో బాగా గమనిస్తే హీరోయిన్ల విషయంలో ఒక అంశం గమనించవచ్చు. అదేంటంటే... పెళ్లికి ముందు అమ్మాయి.... లంగా వోణీ, పొడుగాటి జడ, దాని చివర జడకుప్పెలు, తల్లో  ఓ బంతి పువ్వు, లేదా ఏదో ఒక పూల దండ తో చెంగు చెంగు మంటూ చెట్ల వెంటా పుట్టల వెంటా తుళ్ళుతూ, లేడి పిల్లలా  గంతులు వేస్తూ హాయిగా పాట పాడుతూ కనిపిస్తుంది.ఒకటి రెండు సీన్ల తర్వాత పెళ్లయిపోతుంది ఆ పిల్లకి.. అంతే! నెక్స్ట్ సీన్లో పెద్ద ముత్తయిదువులా నిండుగా చీర, నుదుట  కాసంత బొట్టు, చేతినిండా గాజులు, మరీ ముఖ్యంగా ఇంత  పెద్ద కొప్పు వేసుకుని పెద్ద ఆరిందాలా హుందా గా మారిపోయి కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే..... 
     ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి  తర్వాత ఎలా ఉండాలో సినిమాల్లో అప్పట్లో చూపించేవారు. అంటే పెళ్లికి ముందు పుట్టింట్లో ఎంత గారాబంగా ఉన్నా పెళ్లి తర్వాత బాధ్యతగా ఉండాలన్నది దానర్థమేమో !అప్పట్లో ఆ ట్రెండు నడిచేది ఆహార్యం విషయంలో. ఆహార్యం సరే, ఆమె జీవితం గురించిన మాటేమిటి? అసలు ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు ఉన్నట్లు పెళ్లి తర్వాత కూడా నిశ్చింతగా ఉండే అవకాశం లేదా? ఖచ్చితంగా లేదనే జవాబు వస్తుంది కాస్త ఈ ఉదాహరణలు చూస్తే  --

* రజని  డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా చేరింది. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. తన కంటూ కొన్ని అభిరుచులు, జీవితం పట్ల కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. కానీ అదృష్టమో దురదృష్టమో జాబ్ లో చేరిన కొన్ని నెలలకే పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి తర్వాతా భర్త ఉన్నచోటే ఏదైనా జాబ్ వెతుక్కోవచ్చు లే అనుకున్న ఆమె ఆశ తీరే  దారిఎంత మాత్రమూ  లేదని కొద్దిరోజుల్లోనే అర్థమైపోయింది ఆమెకి. కారణం, భార్య ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేకపోవడం!  పైగా ఆమె అభిరుచులు అన్నింటి మీద నిరసన ప్రదర్శిస్తూ ఆమె ఆశలన్నింటి మీద నీళ్లు చల్లడం! భార్య అంటే వండి వార్చే  ఓ మర మనిషి మాత్రమే అన్న సంకుచిత స్వభావి అతను కావడం! అంతే, రజని  ఆశలన్నీ ఆవిరైపోయి జీవితం నిస్సారంగా, నిస్తేజంగా మారిపోయింది. 
* పావని ది  మరోరకం! పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయవచ్చన్నారు అత్తింటివారు. బాగానే ఉంది. కానీ నెల జీతం అంతా నయా పైసల్తో  సహా తెచ్చి వాళ్ళ చేతిలో పెడితే గానీ ఊరుకునే వారు కాదు. భర్త తల్లి మాటకు తాన తందాన అనే రకం! సంపాదిస్తున్నా, పది రూపాయలు ఖర్చు పెట్టుకునే స్వాతంత్ర్యం లేని బ్రతుకై  పోయిందిపావనిది ! పెళ్లికి ముందు ఆమె కన్న కలలన్నీ.
 కల్లలై పోయి శూన్యం మిగిలిపోయింది. 
* సమీర ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెరిగిన ఆ పిల్ల అత్తగారింటికొచ్చి ఊహించని విధంగా ఆ ఇంట్లో జీతభత్యాలు లేని ఓ పని మనిషి గా మారిపోయింది. కాలు కదిపితే కంది పోతుందేమో అన్న  చందాన పెంచుకున్న బిడ్డ ఓ అనాగరిక  కుటుంబంలో పడిఅల్లాడి పోతున్నందుకు  తల్లీ దండ్రీ  నెత్తి నోరూ  బాదుకుంటూ చింతించని  క్షణం లేదు. అల్లుడు ఉద్యోగే  కానీ తల్లిదండ్రుల మాట జవదాటడు. భార్యకు అండగా ఉండాలన్న ధ్యాస ఉండకపోగా మాటలతో హింసించే  రకం! ఫలితం! సమీర మొహంలో నవ్వు అన్నది మటు మాయమైపోయింది.
      అందరి పరిస్థితీ ఇలాగే ఉందనీ  చెప్పలేం. కొందరు అదృష్టవంతులూ  ఉంటారు. ఆ కోవకు చెందిందే కమల. 
* ఇంటర్ దాకా  చదివిన కమలకు మోహన్ తో పెళ్లయింది. అతను ఓ ప్రైవేటు యాజమాన్యంలో ఓ చిరుద్యోగి. భార్య చదువులో చురుగ్గా ఉండటం గమనించిన అతను ప్రైవేట్ గా డిగ్రీ కట్టించాడు ముందుచూపుతో. అతని ప్రోత్సాహంతో చదువు కొనసాగించిన కమల నాలుగేళ్లలో బీఈడీ కూడా పూర్తి చేసి, లక్షణంగా  ఉద్యోగంలో చేరి పోయింది. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ఆమె  సంసారం హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఇదంతా కేవలం భర్త సహృదయత, ఆతని అవగాహన వల్లే సాధ్యమైందని చెప్పక్కర్లేదు కదా ! 
* స్నిగ్ధ  బాగా చదువుకుంది, కానీ నోట్లో నాలుక లేని పిల్ల. పెళ్లయి, పోయి పోయి ఓ ఉమ్మడి కుటుంబం లో పడి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అత్తగారు, ఆడపడుచు, తోడికోడలు మాటలతో హింసించడం, పనంతా ఆమె నెత్తినే వేయడం, ఉన్నవీ లేనివీ కల్పించి ఆమె పై దుష్ప్రచారం చేయడం సాగించారు. అంతా భరిస్తూ  మౌనంగా రోదిస్తున్న భార్య పరిస్థితి గమనించిన భర్త కుమార్ అదును చూసి వేరింటి కాపురం పెట్టేసి, ఆమెను ఆ ఇక్కట్ల బారినుండి తప్పించేశాడు.
--- ఇలా, కమల, స్నిగ్ధ -- ఇద్దరూ పెళ్లి తర్వాతా సంతోషంగా జీవనం గడిపే అదృష్టం దక్కించుకున్నారు. అది కేవలం వారికి లభించిన భర్తల సహకారం, అవగాహన వల్ల మాత్రమే సాధ్యమైంది మరి !
    దీన్ని బట్టి చూస్తుంటే ఆడపిల్ల అదృష్టవంతురాలా లేక దురదృష్టవంతురాలా అన్నది లభించిన భర్త మీదే ఆధారపడి ఉంటుందన్నది స్పష్టమవుతున్నది. కమల, స్నిగ్ధ లాంటి అదృష్టవంతుల శాతం బహు తక్కువ అనే చెప్పాలి. అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు కాబోయే భార్య గురించి ఏవేవో ఊహించుకోవడం సహజమే! వారు కోరుకున్న విధంగా కూడా జరగని వాళ్ళూ  ఉంటారు. కానీ అబ్బాయి లకున్న  సౌలభ్యాలు అమ్మాయిలకు పెళ్లి తర్వాత ఉండే అవకాశం  మన సమాజంలో పూర్వపు రోజుల్లో నే కాదు ఈ ఆధునిక రోజుల్లో కూడా ఎంత మాత్రం ఉండడం లేదంటే అతిశయోక్తేమీ కాదు. 
      అంతవరకూ పుట్టిపెరిగిన ఇల్లు, ఆ వాతావరణం, కన్న తల్లీ దండ్రీ, తోబుట్టువులు... ఈ అందర్నీ ఒక్కసారిగా వదిలేసి ఓ కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకి తరలివెళ్లాల్సిఉంటుంది ఆడపిల్ల ! అక్కడ ఆ వాతావరణం, ఆ మనుషులు ఈ అమ్మాయిని సాదరంగా తమలో కలుపుకోగలిగితే అదృష్టవంతురాలే. కానీ ఏమాత్రం తేడా వచ్చినా ఆ పిల్లకు సంకటమే. దానికి తోడు కట్టుకున్న భర్త అన్నవాడు కూడా అర్ధం చేసుకోలేని మనస్తత్వం గలవాడైతే అది మరీ నరక సదృశంగా ఉంటుందా కొత్త ఇంటిలో ! 
     అదే మగవాడైతే ఉన్న చోటు నుండి ఎక్కడికీ కదలాల్సిన పనే ఉండదు. అతని ఇష్టాలు, రుచులు, అభిరుచులు, ఆశయాలు,  తన కెరీర్ గురించిన  లక్ష్యాలు ఏవీ మార్చుకోవాల్సిన  అవసరం ఎంతమాత్రమూ ఉండదు. అందుకోసం ఎవరి అనుమతీ  అవసరం లేదు ఎంచక్కా తన మనుషుల మధ్య యథాతధంగా ఉండవచ్చు. కానీ భార్యగా  ఆ ఇంట  కాలు పెట్టిన ఆడది మాత్రం అన్నీ మార్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ విధంగా తన అభిరుచుల్నీ, అనుకున్న లక్ష్యాల్నీ చంపుకుని జీవచ్ఛవంలా కేవలం కుటుంబం కోసం ఓ ప్రాణంలేని యంత్రంలా  బతకాల్సి వస్తుంది. 
    పూజ కొద్దీ పురుషుడు అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయి  అంటారు. అదంతా ఏమోగానీ, ఆడపిల్ల జీవితం మాత్రం నుదుటి రాత ప్రకారం నడుస్తుంది అన్నది నిర్వివాదాంశమే అనిపిస్తుంది ఇలాంటివి  వింటుంటే.
     దృఢ  సంకల్పం, ఆత్మవిశ్వాసం, భర్తను ఆకట్టుకోగలిగిన  చాకచక్యం, సమస్యల్ని   సొంతంగా పరిష్కరించుకోగల నైపుణ్యం, వీటన్నింటితో పాటు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం -- ఇవన్నీ ఉన్న అమ్మాయిలు తమ అభిరుచుల్ని, లక్ష్యాల్ని సమాధి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటినీ అధిగమించి తమకంటూ ఓ మంచి భవిష్యత్తును సృష్టించుకో గలరు. అలా నెగ్గుకొస్తున్నవాళ్ళు కూడా ప్రస్తుత సమాజంలో ఉంటున్నారు. ఎటొచ్చీ, ఆ సామర్ధ్యాలు లేకుంటేనే సమస్య!
                             🌹🌹🌹🌹🌹

.
                           







  












Tuesday, November 2, 2021

శ్రమైక జీవనం

                                          🌷🌷🌷🌷🌷🌷🌷
                                             భువి భావనలు🐦
                                         🌷🌷🌷🌷🌷🌷🌷

         మీరెప్పుడైనా ఇల్లు కట్టించారా? లేదా! పోనీ ఎక్కడైనా కడుతున్న ఇంటిని గమనించారా? నాకైతే కొద్ది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని బాగా దగ్గరగా చూసే అవకాశం లభించింది.
" ఇల్లు కట్టి చూడు,  "పెళ్లి చేసి చూడు", అని మన పెద్ద వాళ్ళు ఎందుకన్నారో  నాకు అప్పుడు తెలిసి వచ్చింది. మొదలుపెట్టినప్పటి నుంచీ పూర్తయ్యేదాకా ఎన్ని రకాల అంశాలు అందులో చోటు చేసుకుంటాయో గదా అనిపించింది. వాటన్నింటిలో నన్ను బాగా ఆకర్షించింనదీ, ఎక్కువగా ఆసక్తి గొలిపినదీ ఏంటంటే-
    -- అక్కడ మేస్త్రీల దగ్గర పని చేసే పని వారు! మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు!తాము  ఆడవాళ్ళం, శారీరకంగా బలహీనులం అన్న ఆలోచన ఏ మాత్రం దరిజేరనీయకుండా వాళ్ళు  చేసే కష్టం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ఇంతకీ విషయం లోకి వస్తే-
    ఉదయం ఆరు ఆరున్నర కంతా పనిలోకి వస్తారు ఆడ, మగ  పనివాళ్ళు. ఆడవాళ్ళయితే వచ్చేటప్పుడు ఓ మోస్తరు చీరలో చక్కగానే వస్తారు. కేవలం ఓ  పది నిమిషాల్లో వాళ్ళ వేషధారణ మొత్తం మారిపోతుంది. చీరను ఎగదోపి దాని చుట్టూ ఓ పాత వస్త్రం చుట్టేసుకుని పైన ఓ షర్టు వేసుకుంటారు. ఆపై తలకో  గుడ్డ కట్టుకుంటారు. అసలు పది  నిమిషాల క్రితం వచ్చింది వీళ్లేనా అన్న అనుమానం వచ్చేలా ఉంటుంది వాళ్ళ ఆహార్యం ! మగవాళ్లూ దాదాపు ఇంతే. మంచి డ్రెస్ తీసేసి, పాత దుస్తులేవో వేసుకుని ఇక పనిలోకి దిగుతారు. గోడ నిర్మాణంలాంటి పనులు మగవాళ్ళు చేస్తుంటే ఆడవాళ్ళు ఇటుకలు అందించడం, ఇసుక, సిమెంటు, కంకర కలిపేసి తట్టల్లో  నింపి మోయడం లాంటి పనులు చకచకా చేసేస్తుంటారు. కొందరు ఆడవాళ్లు గడ్డపారల్తో గుంతలు తవ్వడం కూడా చేస్తుంటారు. మట్టి పనులు చేయడం వాళ్లకు కరతలామలకమేమో అనిపిస్తుంది వాళ్ల నైపుణ్యం చూస్తుంటే. వాళ్లను చూస్తూ ఇంతటి శక్తి సామర్థ్యం వీళ్ళకెలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోయాన్నేను ! 
     కులాసాగా నవ్వుకుంటూ చలాకీగా కదులుతూ ఉంటారు అలుపన్నది తెలియకుండా ఉండేందుకో ఏమో ! పని భారం ఎక్కువైనప్పుడు ఒకరిమీద ఒకరు గయ్యి గయ్యి మంటూ అరుచుకుంటూ ఉంటారు. మళ్లీ అంతలోనే సర్దుకుని మామూలయిపోతుంటారు.
     తెచ్చుకున్న భోజనాలు అందరూ గుంపుగా కూర్చుని, కబుర్లాడుకుంటూ తింటారు. కాసేపు అలా కూర్చుంటారోలేదో మళ్లీ యధాలాపంగా పనిలోకి దిగుతారు. అంతే! సాయంత్రం ఆరైనా ఆరోజు నిర్ణయింపబడిన పని పూర్తయ్యేదాకా వాళ్లకదే ధ్యాస !
    వెళ్లేటప్పుడు మళ్ళీ వాళ్ళ వేషధారణ మారిపోతుంది. చుట్టుకున్న పాత వస్త్రం, వేసుకున్న షర్టు అన్నీ  తీసేసి  ఉదయం వచ్చేటప్పుడు ఎలా వచ్చారో అలాగే తయారైపోయి, శుభ్రంగా ఇళ్లకు కదులుతారు.  రోజు అలా ముగుస్తుంది వాళ్ళకి! మరుసటిరోజు తెల్లారేసరికి మళ్లీ ప్రత్యక్షమయేవారు. ఆ విధంగా వారానికి ఐదు రోజులు శ్రమిస్తూనే ఉంటారు.
      ఈ శ్రమజీవులు కార్చే చెమట ధారలే వారికి కాసులు కురిపిస్తాయి. అవే వారి జీవనాధారాలు మరి !

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
       



          

Monday, October 25, 2021

అవని... కథ లాంటి ఓ నిజం !

                                               🌷🌷🌷🌷🌷🌷🌷
                                                   భువి భావనలు🐦
                                                  🌷🌷🌷🌷🌷🌷🌷
    

" అవనీ, ఇలా అవుతుందనుకోలేదు. మా చెల్లెలు సుధ తెలుసు కదా, మూణ్ణెల్ల  క్రితం తనకి ఓ సంబంధం వచ్చింది. పెళ్లిచూపులు కూడా జరిగాయి... కానీ వాళ్లు ఏ  సంగతీ అప్పుడు స్పష్టంగా  చెప్పలేదు.   దాని గురించి అంతా మర్చిపోయాం  కూడా.  సడన్ గా మొన్న సాయంత్రం ఫోన్ చేసి, మీ సంబంధం మాకు ఇష్టమే, మీరూ  సరేనంటే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పారు. అనుకోని ఆనందం ఇంట్లో చోటు చేసుకుని, అంతా వెంటనే ఓకే చెప్పారు. వాళ్లు నిన్ననే వచ్చి, ఇప్పటికే ఆలస్యం చేశామంటూ తాంబూలాలు పుచ్చుకుని  వెళ్ళిపోయారు... మరో పది రోజుల్లోనే పెళ్లి!."
" సంతోషమేగా, అయితే మరి ఏంటి.? "
 మధ్యలో ఆపి అడిగింది అవని. 
"... అదే చెప్పబోతున్నా,  ఇదంతా మొన్న నేను నీకు ఫోన్ చేశాక జరిగింది. బాగా ఆలోచించాను, మనం అనుకున్న ప్రకారం ఇప్పుడు వెళ్ళిపోవడం సబబుగా తోచలేదు. ఈ విషయం నీకు డైరెక్టుగా చెప్తే బాగుంటుందనిపించి, ఫోన్ చేయలేదు..."
 తదేకంగా అతన్నే  చూస్తూ ఉండిపోయింది అవని.
".. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోయామంటే, కుదిరిన పెళ్లి కాస్తా చెడిపోతుంది. దాని జీవితం చిక్కుల్లో పడి పోతుంది... అందుకే మనం కొద్ది రోజులు.. అంటే చెల్లి  పెళ్లయిపోయేదాక... ఆగుదాం.."
నాన్చుతూ విషయం బయట పెట్టేశాడు గిరీష్.మ్రాన్పడిపోయింది అవని !
" అదేంటి గిరీష్,ఇవతల  నా పెళ్లి కూడా ఖాయమయిపోయింది. నాలుగు రోజుల్లో పెళ్లి. నా సంగతేంటి?.. "
" ఇంట్లో చెప్పేయ్ అవనీ, క్యాన్సిల్  చేయించు..."
 వెంటనే అతని నుండి వచ్చిన ఆ మాటకు అవాక్కయిపోయింది అవని !
".. సారీ, అవనీ, ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే మా చెల్లెలి పెళ్ళి జరగడం కష్టమైపోతుంది. అమ్మ నాన్న తట్టుకోలేరు. పైగా  కుదిరిన పెళ్లి ఆగిపోయింది అంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు.. మన విషయంలో ఆ సమస్య ఉండదు. నీవు  పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా మనం పెళ్లి చేసుకుంటాం.."
   షాక్ తగిలినట్లుగా అచేతనంగా  మారిపోయింది అవని. ఆమెలో  మెల్లిగా ప్రకంపనలు! నిజమే! కుదిరిన పెళ్లి ఆగిపోయిందంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. మరి నాకూ ఇదే సూత్రం వర్తిస్తుంది కదా! గిరీష్ మగవాడు. అయినా ఎంతో వివేకంగా తన చెల్లి గురించి, తన  కుటుంబ పరువు  గురించీ ఆలోచిస్తున్నాడు. మరి, తను  ఆడపిల్ల అయి ఉండీ ఈ ఇంగితం తనకు లేకుండాపోయిందే ! నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఎవడితోనో లేచిపోయింది అనే అపవాదు తన తల్లీదండ్రీ మాత్రం    భరించగలరా ! తన తర్వాత తన  చెల్లి పరిస్థితి ఏమిటి? 
     ఇంటి నుండి బయలుదేరే ముందు అమ్మతో, 
" అమ్మా, పనుంది, బయటికెళ్తున్నా " అని చెప్పింది. తను ఎక్కడికని గానీ, ఏంపని అని గానీ అడగలేదు. త్వరగా వచ్చేయ్ అని మాత్రమే అనింది. అంటే తన మీద అంత నమ్మకం అన్నమాట! తన కూతురు గాడి తప్పదన్న భరోసా! కానీ... తనేం  చేసింది! మై గాడ్!
     నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే, గిరీష్ లో కూడా రెండు కోణాలు చూస్తోంది అవని  ఇప్పుడు! తన చెల్లి గురించి, తన కుటుంబం పరువు గురించీ ఆలోచించాడు. అంతవరకూ బాగానే ఉంది, కానీ అదే సమయంలో తను ప్రేమించిన అమ్మాయి జీవితం గురించీ, ఆమె తల్లిదండ్రుల గురించీ ఏ మాత్రం ఆలోచించలేక పోతున్నాడు. అక్కడే  ఏదో తేడాగా అనిపించి క్షణకాలం ఆలోచనలో పడింది అవని.  
 ఎంత తేలికగా చెప్పేశాడు, పెళ్లి క్యాన్సిల్  చేయించు అని ! తనను పెళ్లయితే చేసుకుంటాడట, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు! కానీ చిత్రంగా, అవనికి అతనిపై కోపం రావడం లేదు, పైగా వక్రమార్గంలో అడుగులు వేయబోతున్న తనను సరైన దారిలోకి మళ్ళించడానికి వచ్చిన ఓ దూతలా కనిపిస్తున్నాడు! అందుకే అతన్నేమాత్రం తప్పు పట్టలేకపోయింది. కాస్త ఆలోచిస్తే తన వైఖరి లోనే  లోపం ఉన్నట్లు తెలుసుకోవడానికి మరో క్షణం పట్టిందా అమ్మాయికి.
    క్షణాల్లో ఆ పిల్ల మదిలో స్థిర నిర్ణయం చోటు చేసుకుంది. అంతే ! వెంటనే లేచి, బ్యాగ్ పట్టుకుని ముందుకు పరుగుతీసింది. ఈ హఠాత్పరిణామానికి గిరీష్ విస్తుబోయి ఆమె వెనకాలే పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న  అవని ఉన్నట్టుండి ఆగింది, వెనకే వస్తున్న గిరీష్ వైపు గబగబా నడిచి, అతని చేతులు పట్టుకుని, 
" థాంక్యూ గిరీ, నా కళ్ళు తెరిపించావు. నీకు జన్మంతా రుణపడి ఉంటాను. బై..." 
అంటూ వెళ్లబోయి, ఏదో గుర్తొచ్చి  వెనక్కి తిరిగి, 
".... నాలుగు రోజుల్లో నా పెళ్లి, నీకు వీలైతే తప్పకుండా రా, బై.. "
 అనేసి, అవాక్కై నిల్చుండిపోయిన గిరీష్ ను  అలా   వదిలేసి,  అటుగా వెళ్తున్న ఆటోలో ఎక్కి కూర్చుని, లోపల మాత్రం "బై ఫరెవర్ " అనుకుంది. తల్లిదండ్రుల ప్రేమ, పెంపకం, ఇంటి పరువు ప్రతిష్టల ముందు రెండు సంవత్సరాల తన ప్రేమ చాలా అల్పంగా, పేలవంగాతోస్తోందిప్పుడు ఆ అమ్మాయికి!చుట్టూ అంతా    చీకట్లు ముసురుకున్నాయి. అవని  మనసులో అప్పుడే వెలుగు పొడసూపడం  మొదలైంది.
                          *************
      మరో పావుగంటలో ఇంటిముందుంది అవని. మేనత్త, పిల్లలు వచ్చినట్టున్నారు, గేట్ చప్పుడు విని, బిలబిలమంటూ బయటికి వచ్చి, అవనిని చుట్టేసి, లోపలికి తీసుకెళ్లారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నాన్న,  బాబాయ్, నానమ్మ భోంచేస్తున్నారు. అమ్మ, పిన్ని వడ్డిస్తున్నారు. అంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మానాన్న. ఈ ఆనందాన్నంతా ఒక్కరోజులో సర్వ నాశనం చేయ బోయింది. భగవంతుడా! ఎంత ఉపద్రవం  నుండి నన్ను కాపాడావు తండ్రీ ! గిరీష్ తో వెళ్ళిపోయుంటే మహా అయితే కొద్దిరోజుల పాటు బాగుండేదేమో! ఆ తర్వాత,..? తలచుకుంటేనే వణుకు పుట్టింది అవనికి. 
      " అక్కా, ఏమిటింత లేటు? ఎక్కడికెళ్ళావ్? జాకెట్లకోసమా?   రెడీ అయ్యాయా? తెచ్చేసుకున్నావా? ఏవీ, చూడనియ్.." 
 అక్కను చూడగానే అనిత ప్రశ్నల వర్షం కురిపించింది.
" అవన్నీ తర్వాత. ముందు పద, ఆకలి దంచేస్తోంది.."
 అంటూ బ్యాగ్ బీరువా లోకి తోసేసి, వంటింట్లోకి నడిచింది అవని. వివాహం నిశ్చయం అయిన క్షణం నుండీ తిండీ, నిద్ర రెండూ  కరువై స్థిమితం అన్నది లేని అవని ఆ రాత్రి  కడుపారా తిని, కంటినిండా నిద్రపోయింది. అవును మరి! తను నేటితరం అతి  సాధారణమైన ఆడపిల్ల!!
                           
                      🌹శుభం 🌹



                    

అవని... కథ లాంటి ఓ నిజం !

                                           🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                                                 భువి భావనలు🐦
                                           🌷🌷🌷🌷🌷🌷🌷🌷



      ఆటో బస్టాండ్ వైపు సాగిపోతోంది. అందులో కూర్చున్న అవనికి గుండె దడ దడ లాడుతోంది. ఓవైపు చల్లగాలి వీస్తున్నా చెమటలు కారిపోతున్నాయి. మరో ఐదు నిమిషాల్లో ఆటో బస్టాండ్ వద్ద ఆగింది. దిగి, ఆటో వాడి చేతిలో యాభై  నోటు పెట్టి చిల్లర కోసం కూడా చూడకుండా పరుగులాంటి నడకతో బస్టాండ్ లోపలికొచ్చి  పడింది. ఓ నిమిషం పాటు ఊపిరి పీల్చుకుని, చుట్టూ కలయ  చూసింది గిరీష్ కోసం. ఎక్కడా కనిపించలేదు.
    " అదేంటీ, ఐదింటికే  వస్తానన్నాడే , ఐదున్నర కూడా దాటింది, ఇంకా రాలేదేంటీ !"  అనుకుంటూ, వచ్చి  ఎక్కడైనా కూర్చుని ఉన్నాడేమో అని  ఓ సారి ఈ చివరి నుండి ఆ చివర దాకా చుట్టేసింది. నిట్టూరుస్తూ వెళ్లి ఓ మూలనున్న బెంచీమీద కూర్చుండిపోయింది.
   అవని, గిరీష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఈ మధ్యే  డిగ్రీ పూర్తయింది. గిరీష్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అవని  తండ్రి రాజారావు ప్రతిపాదన మేరకు పి. జీ చేయాలనుకుంటోంది. ఆయన అలా అన్నాడే  గానీ మరోవైపు సంబంధాలు చూడటం కూడా మొదలెట్టాడు. కారణం, అవని  తర్వాత మరో కూతురు కూడా ఉండడమే. రెండు మూడు సంబంధాలు వాకబు చేయడం, వాటిగురించి ఇంట్లో చర్చలు జరగడం చూసిన అవనికి ఆందోళన మొదలైంది. ధైర్యం చేసి గిరీష్ గురించి చెప్పాలనుకుంది గానీ, తండ్రికి ఈ ప్రేమలూ,  దోమలు అసలు నచ్చవు. పైగా గిరీష్ కులం కూడా  వేరేనాయె!అంతకన్నా ముఖ్యమైనది ప్రస్తుతం జాబ్ అన్నది లేకపోవడం.  ఇలాంటి విషయాల్లో ఆయన చాలా కఠినంగా ఉంటాడు. వేరే దారి కనిపించక అవని గిరీష్ తో చెప్పేసింది విషయం. అలా కొద్దిరోజులు గడిచిపోయాయి. 
      ఉన్నట్టుండి ఓరోజు అవనిని చూడ్డానికి పెళ్లివారొచ్చారు.అబ్బాయి బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కాస్తో కూస్తో స్థితిపరులే. బాదరబందీలేవీ లేవు . తల్లీ దండ్రికీ, అబ్బాయికీ అవని  నచ్చేసింది. వంకలు పెట్టడానికీ, అభ్యంతరం చెప్పడానికీ ఏమీ లేవనిపించింది అవని తల్లిదండ్రులకి. అంతా చాలా సంతృప్తిగా ఫీలయ్యారు. అయినా అవనిని  కూడా ఓ మాట అడిగాడు రాజారావు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఏం చెప్పాలో తోచక, గాభరాగా ఏదో తలాడించేసింది.
    అంతే! ఇంక ఆలస్యం దేనికి అనుకుంటూ ఇరు పక్షాల వారూ మర్నాడే కూర్చుని మాట్లాడుకుని అబ్బాయి కి సెలవు ఎక్కువగా లేదనుకుంటూ పెళ్లి కి మరో పది రోజుల్లో ముహూర్తం నిశ్చయించేశారు. అవన్నీ గుండెల్లో రాయి పడింది. ఇంత త్వరగా అంత మంచి సంబంధం, పెద్దగా కట్నకానుకలు కూడా ఆశించకుండా కుదిరి నందుకు తల్లిదండ్రీ మహదానందంగా ఉన్నారు. మరోవైపు చెల్లెలు అనిత హడావుడీ ! ఇప్పుడు తన ప్రేమ విషయం చెప్తే ఇంట్లో పరిస్థితి అంతా తారుమారయిపోతుంది. పైగా గిరీష్ కంటే అన్ని విధాల ఎన్నోరెట్లు గొప్పదైన సంబంధమాయె ! కానీ రెండు సంవత్సరాల ప్రేమను కాదనడానికి ఆమె అంతరంగం ఒప్పుకోవడం లేదు. గిరి తో పరిచయం, స్నేహం, ప్రేమ మరీ మరీ గుర్తొచ్చి మనసు సమాధాన పడలేక పోతోంది. బాగా ఆలోచించి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి గిరీష్ కు  విషయం తెలియజేసింది. జవాబుగా ఓ గంటాగి  ఫోన్ చేస్తానన్నాడు గిరీష్. అలాగే మరో గంట తర్వాత మాట్లాడాడు.
" మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అవనీ, నేను కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను కదా, ఏదో ఒక జాబ్ దొరక్కపోదు. ఎల్లుండి సాయంత్రం వెళ్లి ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నీవు ఓకేనా? అయితే ఎల్లుండి సాయంత్రం అయిదింటికి బస్టాండ్ కు  వచ్చేయ్... "
 ఠక్కున  ఫోన్ కట్ చేసింది. ఓ క్షణం గుండె వేగం పెరిగింది అవనికి. తర్వాత సర్దుకుని, కాస్త  సంతోషంగా అనిపించినా, ఏదో సంకోచం తొలిచేయసాగిందామెని. కానీ, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడ్డం ఎందుకో సముచితంగా అనిపించటం లేదు. కాస్త  టైం అడుగుదామంటే వారం రోజుల్లోపే పెళ్లి ! ఆలస్యం చేస్తే ప్రేమించినవాడికి దూరమైపోయిజీవితమంతా .....ఇక ఆలోచించలేక పోయింది. వెంటనే ఫోన్ చేసి సరేనని చెప్పేసింది.    
         చెప్పడం అయితే సులభంగా చెప్పేసింది గానీ, ఆ క్షణం నుండే మొదలైందాపిల్లకి అసలైన నరకం ! పెళ్లికి ఎక్కువ సమయం లేదని కుదిరిన రోజునుండీ ఏవేవో షాపింగ్ లు మొదలెట్టారు ఇంట్లో వాళ్ళు. చీరలు కొనాలంటూ, నగలు కొనాలంటూ బయలుదేరదీసే  వాళ్ళు ముగ్గురూ. దానికితోడు దగ్గరి  చుట్టాలంతా దిగిపోతున్నారు మెల్లి మెల్లిగా. మనసంతా వ్యాకులత ఓవైపు, తప్పేమైనా చేస్తున్నానా అన్న ఆందోళన మరోవైపు-- అవనిని అతలాకుతలం చేయసాగాయి. అలా ఒకరోజు గడిచి, రెండో రోజు మధ్యాహ్నం కూడా దాటిపోయింది. షాపింగ్ నుంచి ఇంటికి వచ్చి, ఏదో తిన్నాననిపించి అలా మంచం మీద వాలిపోయింది. అంతలోనే గిరీష్ ఫోన్! 
" అవనీ, ఏంటి, రెడీయేనా... వస్తున్నావా?... "
 దిగ్గున లేచింది అవని. ఏదో తెలీని  ధైర్యం ఆ వహించినట్లయి,గబగబా  ఓ చిన్న బ్యాగులో రెండు మూడు జతలుబట్టలు,  ఖర్చులకంటూ  నాన్న ఇచ్చిన పదివేలక్యాష్ కుక్కే సుకుని, లేచి తయారైపోయింది. సమయం నాలుగున్నర అయింది. ఓ సారి రూమ్ నుండి బయటకు వచ్చి, తొంగి చూసింది. అమ్మ,  పిన్ని, నాయనమ్మ విశ్రాంతిగా పడుకుని ఉన్నారు. చెల్లి అనిత కాలేజీ కి వెళ్ళినట్టుంది. గుండెదడను కాస్త అదుపులో పెట్టుకొని, ఎలాగో గొంతు పెగల్చుకుని, 
" అమ్మా, బయటికెళ్తున్నా, పనుంది..." 
 అంటూ అమ్మనుద్దేశించి అనడం, 
" సరేలే, త్వరగా వచ్చేయ్.."
 అని తల్లి బదులివ్వడం జరిగిపోయింది.  'బ్రతుకు జీవుడా'అనుకుంటూ బయట పడింది రెండు నిమిషాల్లో.
    బెంచి మీద అటూ  ఇటూ  విసుగ్గా కదిలింది అవని. తనేమో అంత టెన్షన్ లో కొట్టుమిట్టాడుతుంటే ఈ మనిషి ఇంకా రాడేమిటి? అప్పుడే తనొచ్చి  అరగంట దాటిపోయింది. హైదరాబాద్ వెళ్లే బస్సులు   రెండు వెళ్ళిపోయాయి తను చూస్తుండగానే. మరోటి కదలడానికి సిద్ధంగా ఉంది.
" ఆలస్యం చేసే వాడు కాదే, ఎందుకిలా?. కొంపదీసి వస్తోంటే  ఏ ఆక్సిడెంట్ అయినా...." 
 అవనిలో అనవసర ఆందోళనలు.. అనుమానాలు !.. అంతలోనే....
" ఛ ఛ !.. అలా ఏమయి  ఉండదు.." 
 అనుకుని  సర్ది చెప్పుకుంది. తన ఆలోచనల్లో తానుండగా మూడో బస్సు మెల్లిగా స్టార్ట్ అయింది. కంగారుగా లేచి నిలుచుంది అవని. 
" ఇలా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు నన్ను చూశారంటే ఇంకేమైనా ఉందా!" 
 క్షణక్షణానికి ఆ పిల్లలో టెన్షన్ అధికమై పోతోంది. బస్సు కదిలింది. ఉస్సురని నిట్టూర్చి, మళ్లీ బెంచీ  వైపు నడవబోయింది. అంతలో దూరంగా వస్తూ కనిపించాడు గిరీష్!.
' అమ్మయ్య'
 అనుకుంటూ గబగబా వెళ్లి, అతన్ని సమీపించి, 
" ఏమిటింత  ఆలస్యం.... పద పద.. బస్సు వెళ్ళిపోతోంది.... " 
 అంటూ అతని చెయ్యి పట్టుకుని ముందుకు కదిలింది. కానీ గిరీష్ ఆమెను వారిస్తూ, 
" అవనీ, కాస్తాగు, నీతో మాట్లాడాలి..."
 అంటూ వెనక్కి లాగాడు.
" బస్సులో కూర్చుని మాట్లాడుకుందాం, ముందు పద.... "
" లేదు అవనీ,... మనం వెళ్ళటం లేదు.."
ఠక్కున అతని  చెయ్యి వదిలేసింది అవని విస్తుబోతూ. 
" అవును,రా,  ఇలా కూర్చో.."
 అంటూ బెంచీ  వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.

                                --- ముగింపు తర్వాతి పోస్టులో---










 

Thursday, October 14, 2021

విధాత సృజన... !

                                              🌷🌷🌷🌷🌷🌷🌷
                                                    భువి భావనలు🐦
                                               🌷🌷🌷🌷🌷🌷🌷


 ఆకుపచ్చని లతలతో అల్లుకున్న ముచ్చటైన పందిరి
 పరచుకున్న పత్రదళాలపై వెదజల్లబడ్డ వజ్రాలకు మల్లె
 విచ్చుకొన్న ఆ జాజిమల్లెల సోయగాల సందడి !
 చిరుగాలికి అల్లనల్లనఊగే ఆ కొమ్మల ఊయల 
 అమ్మ ఒడిలా తోచెనో ఏమో 
 ఒదిగిపోయి కురిపిస్తున్నాయి 
 చిరునవ్వుల పసిడికాంతుల ! 
 అవి విరజిమ్మే సౌరభాల గుభాళింపులతో 
 నిండిన మా లోగిలి తెచ్చిపెట్టింది మా ముంగిట 
 అంతులేని ఆహ్లాదపు  సిరిని !
 ఆస్వాదిస్తూన్న  నామదిని చుట్టుముట్టి 
 ఆ తెల్లని మల్లెలు తలపిస్తున్నాయి
 నింగిని నల్ల నల్లని మేఘాలకు 
 మెరుపులద్దుతూ మిణుకు మిణుకుమంటూ 
 చిక్కగా పరచుకున్న చక్కనైన చుక్కల్ని !
 ఈ మల్లెలకెవరు నేర్పిరో కదా 
 అలా విచ్చుకొమ్మని ! మరి, 
 ఆ చుక్కల కెవరు చెప్పిరో  ఏమో, 
 ఇలా ఇలనంతా రంజింపజేయమని !
 ఆహా ! పరుల కోసం ప్రతీ  నిమిషం
 పరితపించే ఈ ప్రకృతి రీతి  !
 సృష్టించి మనిషికొసగిన 
 ఆ విధాత ఎంతటి సృజనశీలి !

💐💐💐💐🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏
 



Thursday, September 30, 2021

అందరికీ పండుగే !


                                           🌷🌷🌷🌷🌷🌷🌷
                                               భువి  భావనలు
                                            🌷🌷🌷🌷🌷🌷🌷


 బోసినవ్వుల బాపూజీ
 జాతిపిత మన  గాంధీజీ
 ఆ నవ్వులో ఏ మహత్తు దాగి ఉన్నదో !
 ఆ మాటల్లో ఏ మర్మమున్నదో !
 ఆ పిలుపే  ఓ ప్రభంజనంలా
 యావత్తు జనావళి కదిలి 
 నడిచిందాయన అడుగుజాడల్లో!
 బానిస బ్రతుకు వద్దన్నాడు
 భయం వీడి పోరాడమన్నాడు
 అహింసా మార్గం ఎంచుకున్నాడు
 దేశమాత దాస్యశృంఖలాల్ని తెంచాడు 
 మానవతా మూర్తిగా నిలిచాడు
 నిస్వార్థ  జీవి నిరంతర శ్రామికుడు
 కొల్లాయి గట్టిన ఈ  నిరాడంబరుడు
 తెల్లవారిని తరిమికొట్టిన ఘనుడు!
 భరతావని పుట్టి విశ్వవిఖ్యాతి గాంచినాడు 
 చరిత్ర పుటలకెక్కి చరితార్థుడైనాడు !
 కారణజన్ముడు మరెందునా కానరాడు!
 నా జీవితమే నా సందేశమన్నాడు !
 ఏ బిరుదు సరిపోదీ 'మహామనీషి 'కి 
' జాతిపిత' తనొక్కరే ఈ దేశానికి !
 ఆయన పుట్టిన దినం మనందరికీ పండుగ దినం
మరణం తర్వాతా జీవించడం
 మహామహులకే  సాధ్యం !!

💐💐💐💐💐💐🌹🌹🌹💐💐💐💐💐💐

Saturday, September 25, 2021

పాప వేదన !అమ్మ సాంత్వన !... వర్తమానంలో ఓ సజీవ రూపకల్పన !

                                         🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                                               భువి భావనలు🐦
                                       🌷🌷🌷🌷🌷🌷🌷🌷


అమ్మా 😔, 
    కలలు గంటున్నావా అమ్మా ! నీ చేతి స్పర్శ లోపలున్నా నాకెంత  హాయినిస్తోందో   తెలుసా! నులివెచ్చగా నున్న  ఈ చిన్ని  గది నాకెంత సౌకర్యంగా ఉందో, ఇంకా ఎంత రక్షణగా  అనిపిస్తోందో !.... కానీ... ఎందుకో  భయం భయంగా ఉందమ్మా.... ఈ నిశ్చింత ఇంక  కొద్ది రోజులేనని తలుచుకుంటుంటే... తర్వాత ఈ భూమి మీద కొచ్చి పడతాను కదా! ఇంత వరకు నన్ను చూడాలని నీవెంతగా ఎదురు చూస్తున్నావో, నాకూ నిన్ను చూడాలని అంతకంటే కోరికగా ఉందమ్మా... కానీ ఇప్పుడు ఎందుకనో ఆ కోరిక అణగారిపోతోందమ్మా ! వద్దమ్మా వద్దు,  కలలుగనడం మానెయ్యి... 
     ఈ భూమిపై  కాలు మోపాలనీ, నీ ఒడిలో బజ్జో వాలనీ ఆశగా ఎదురు చూశానింతవరకూ. కానీ బయట జరుగుతున్న ఘోరాలు వింటుంటే వణుకు పుడుతోందమ్మా. కారణం నీకూ  తెలుసు. నేటి సమాజంలో ఆడవాళ్ళ దుస్థితి తెలీని ఆడదుంటుందా? మగ తోడుంటే స్త్రీకి రక్షణ ఉంటుందనే వారు. కానీ అది ఒకప్పటి మాట.'నిర్భయ' చట్టం ఎలా వచ్చిందో ఎరుకే కదా! పశువుల నాడి తెలిసిన ఆ వైద్యురాలు పశువుల మధ్య ఉన్నంతవరకూ సురక్షితంగానే ఉండింది. క్రూర మృగాల కంటే భయంకరమైన మనుషుల నాడి మాత్రం పసిగట్టలేక బలైపోయింది. ఫలితంగానే కదమ్మా'దిశ ' చట్టం వచ్చింది! ఎన్ని చట్టాలొస్తేనేమి గాక ! ఆగు తున్నాయా  అకృత్యాలు ఆడవాళ్ళ పైన! పసి మొగ్గలని  కూడా చూడక, కనికరం లేక నికృష్టంగా ప్రవర్తిస్తూ, ప్రాణాలు సైతం తీసేస్తున్నారు కదమ్మా! మొన్న ఓ రమ్య! నిన్న ఓ చైత్ర ! ఎలాగమ్మా? అందుకే ఈ భయం!
     తొలిసారి నన్ను చూసి నువ్వు మురిసిపోతావు, గుండెలకు హత్తుకుంటావు. పాలిచ్చి  కడుపు నింపుతావు. ముద్దులిస్తావు, గోరుముద్దలు తినిపిస్తావు. రంగు రంగుల బట్టలేస్తావు. బుట్ట బొమ్మలా అలంకరిస్తావు. నాన్నేమో నన్ను బడిలో చేర్పిస్తాడు. ఇద్దరూ కలిసి నా చుట్టూ ఎన్నో ఆశలకలల  సౌధాలు కట్టుకుంటారు. తీరా ఫలం చేతికందే క్షణానికి ఏ దుండగీడి వక్ర చూపో నాపై సోకి, నన్ను చిదిమేస్తుంది ! వద్దమ్మా, ఆ నరకం నేను భరించలేను.
    పోనీ, అలా కాకున్నా... పెళ్లి చేసి ఓ ' అయ్య ' చేతిలో పెట్టి  బరువు బాధ్యతలు తీరిపోయాయని నిట్టూర్చి, నిశ్చింతగా ఉండే పరిస్థితి కూడా ప్రస్తుతం కానరావడం లేదు కదమ్మా! అక్కడ అత్తింటి ఆరళ్లు, గృహహింసలు, ఆగడాలు, అదనపు కట్నం వేధింపులు.... ఆపై హత్యలు!... చివరకు ఏ  ఉరితాడు నా ఊపిరి తీస్తుందో, ఏ సజీవదహనం నన్ను బూడిదగా మార్చేస్తుందో.... ! అంత మాత్రానికెందుకమ్మా నేనీభూమ్మీదకు రావడం! దానికన్నా ఏ అడవిలో నైనా మానై పుట్టడం నయం కదా ! ఎందరు తల్లుల గర్భశోకం ప్రతినిత్యం నువ్వు చూడడం లేదు చెప్పు! అంతా సవ్యంగా ఉంటే సరే !కానీ నిత్యం అకృత్యాలతో అరాచకంగా మారిపోయిన ఈ సమాజం ఆడపిల్లలకు ఆ భరోసా ఇస్తుందా  చెప్పు? 
    అనుక్షణం నువ్వు నా పక్కనుండలేవు. ప్రతి చోటా నాన్న నాకు పహరా కాయలేడు. స్వీయ రక్షణకా,  నా లేత వయసు సరిపోదు! మరెలాగమ్మా? మీ ఆశలన్నీ ఆవిరై  తీరని వేదన బ్రతుకంతా మిగిలిపోతుంది. ఇదంతా ఎందుకమ్మా ! అసలు నేనే లేకుంటే ఏ బాధా మిమ్మల్ని తాకలేదు కదా! అందుకే వద్దమ్మా, చెప్తున్నా, కలలు కనడం మానేయ్, నన్ను పూత లోనే చిదిమేయ్! ఇది పాపమే కావచ్చు! కానీ రేపటి నరకం కన్నా ఇది ఎంతో నయం కదా! నా మాట వినమ్మా, నా గోడు అర్థం చేసుకో...! 😔
      అర్ధరాత్రి ఆదమరిచి నిద్రిస్తున్న ఆ తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఎక్కడో వెక్కివెక్కి ఏడుస్తూన్న ధ్వని ! కళ్ళు తెరిచి అటూ ఇటూ  చూసింది. పసిపాప ఏడుపు! ఎవరిదో !అంతటా నిశ్శబ్దం!ఓక్షణం నివ్వెరపోయినా, వెంటనే తమాయించుకుని సర్దుక్కూర్చుంది. ఆ సవ్వడి తన కడుపులోంచే వస్తున్న భావన ఆమెలో...  అప్రమత్తమై ఎత్తుగా ఉన్న తన కడుపు మీద రెండు చేతులూ ఉంచి, నెమ్మదిగా నిమురుతూ, జో కొడుతున్నట్టుగా అనునయించింది, లోపలున్న  పాపకు తెలిసేట్లుగా... 
    " నిజమే, కొద్దిరోజులుగా సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న విపరీత పోకడలు తనని మానసికంగా విచలితురాల్ని చేస్తున్న మాట వాస్తవమే. అది కాస్తా తన గర్భస్థ శిశువుపై పడినదా ఏమిటి ? దాని ఫలితమా ఇది ! అయినా తరచూ జరుగుతున్న అకృత్యాల్ని పదే పదే మనసులోకి తీసుకోవడం కూడా సరికాదేమో!"
    ఆ భావన మది లోకి రాగానే,  తన కర్తవ్యం ఏమిటో బోధపడి వెంటనే స్పందించిందా మాతృ హృదయం! 
" చిట్టి తల్లీ ! వద్దమ్మా, అలా అనకు. నీ కోసం వేయి  కళ్లతో నేనూ, మీ నాన్న ఎదురుచూస్తున్నామురా  కన్నా! చుట్టూ జరుగుతున్న అకృత్యాలకు వెరచి అలా ఆలోచించకు తల్లీ, నీకు మేమున్నాము. జీవితంఅంటే  సమస్యలు అతి సహజం. వాటినెదుర్కొంటూ సాగిపోవడం లోనే ఉంది అంతా. మానసిక స్థైర్యం అన్నది మనిషికి చాలా అవసరంరా నా బంగారుతల్లీ ! సమాజం పట్ల, బ్రతుకు పట్ల వ్యతిరేక భావన పెంచుకొని భీతిల్లకు.... 
... మంచీ, చెడూ ఎక్కడైనా ఉంటాయి. చెడును మాత్రమే చూడడం, ఆడపిల్లగా పుట్టడమే వద్దనుకోవడం కూడదమ్మా.  చెడు తో పాటు మంచి కూడా ఉంటుందని లేకుంటే ఈ జగత్తంతా ఎప్పుడో అంతరించి ఉండేదని తెలుసుకో నా చిట్టి తల్లీ ! 
.... జీవితమంటేనే  పోరాటం. ధైర్యం గా ఉండటం అలవరచుకోవాలి. అదే మనకు సదా రక్ష !మన ఆత్మవిశ్వాసమే మనకు పెట్టని కోట ! కష్టాలకు భయపడీ, సమస్యలతో బాధపడీ బ్రతుకులోని తీపిని ఆస్వాదించడం మరువకూడదమ్మా! నీ కోసం ఈ సృష్టిలో ఎన్నెన్నో అందాలు, మరెన్నో ఆనందాలు సిద్ధంగా ఉన్నాయి, నీ రాకకై వేచి చూస్తున్నాయి. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. సరేనా..."
 ఓదారుస్తున్నట్లుగా, అనునయంగా అంది రెండు చేతులతో తడుతూ. తల్లి  మాటలు సాంత్వన నిచ్చాయోఏమో, లోపల ఏడుపు మెల్లిగా ఆగిపోయిన భావన ఆ తల్లిలో ! మెల్లిగా జోకొడుతూ అలా కళ్లు మూసుకుంది. శిశువుకేమర్థమయిందో ఏమోమరి !తల్లిని నిరాశపరచకూడదనుకుందో, లేక పరిస్థితులకు రాజీ పడాలనుకుందో లేక 'అమ్మ 'లాలన సాంత్వన నిచ్చి నిజంగానే ధైర్యం కలిగి శక్తి పుంజుకుందో --  లోపల అలజడి మాత్రం తగ్గిపోయింది. కుదుటబడ్డ ఆ తల్లి మనసు మెల్లిగా నిద్రలోకి జారుకుంది.
    --- ఇది ఓ గర్భస్థశిశువు వేదన ! ఓ తల్లి సాంత్వన ! ఏదిఏమైనా, నేడు ప్రతీ ఆడపిల్లకూ ఈ ధైర్యవచనాలు చాలా... చాలా అవసరం !!👋


👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋







Thursday, September 16, 2021

ఆక్రోశిస్తున్న అంతరంగం

 ముక్కుపచ్చలారని పసిపాపల్లోనూ             
 ఆడతనాన్ని వెతికే నీచనికృష్టులు !
 తల్లి వయసు ఆడదాని లోనూ
 అమ్మను చూడలేని కామాంధులు!
 అడుగడుగునా పుట్టుకొచ్చి 
 అరాచకంగా మారిపోయి మచ్చపడ్డ 
 సమాజం ప్రస్తుతం మనది ! 
 వయోబేధాలు, వావి వరుసలు              
 ఎరుగని మానవమృగాలు ! 
 విలువలు  మరిచి వీధి వీధినీ 
 విచ్చలవిడిగా విహరిస్తూ 
 పడతులకూ, పసిపాపలకేగాదు 
 స్త్రీజాతి  మొత్తానికే రక్షణ లేదని
 నిరూపిస్తున్న నిత్యం జరుగుతున్న అకృత్యాలు!
 మృగాలతో పోలిస్తే మృగాలు సైతం 
 సిగ్గుతో తల దించుకునే దారుణ ఉదంతాలు ! 
 భారతదేశం పవిత్రతకు మారుపేరన్న 
 పరదేశీయుల ప్రగాఢ నమ్మకం 
 నానాటికీ దిగజార్చుతూ 
 పెచ్చరిల్లుతున్న పైశాచికకాండలు ! 
 ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ నిలదీస్తున్నాయి 
 చట్టాలకు వెరవని, శిక్షలకు లొంగని 
 కరడు గట్టిన క్రూర మానవుల 
ఈ మారణకాండలు భరించాల్సిందేనా?
భరించి సహించాల్సిందేనా? 
ఎప్పటికైనా  మారునా  ఈ మనుషుల నైజాలు !
 అసలొస్తాయా మారే ఆ రోజులు !
 నేడు  ----
 ఆక్రోశిస్తున్న ప్రతీ అంతరంగం అడుగుతున్న 
 జవాబు దొరకని ప్రశ్న ఇది !!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                
                 🌹భువి భావనలు 🌹

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷





Saturday, September 4, 2021

గురువులకు వందనం...చిన్నారులకో బాలగేయం

                                         🌺భువి భావనలు 🌺🐦
                                             ************

[ గురు పూజోత్సవం సందర్భంగా చిన్నారులకోబాలగేయం 🌷]

చదువుల బడిలో 'అ ఆ' లు 
 దేవుని గుడిలో బాజాలు
 జీవన గతిలో జేజేలు! 
 అ ఆ లు, బాజాలు, జేజేలు
 భవితకు అవియే బంగరు  బాటలు
 వెయ్ రా అడుగులు ముందుకు 
 వేరే వాదం ఎందుకు పదరా తోసుకు  " చదువుల"

 తూరుపు  దిక్కున తెల్లారేను 
 పడమటి దిక్కున పొద్దారేను 
 అటు ఇటు తిరిగి చూసేలోగా
 కాలం హరించి పోయేను 
 బుడగ వంటిదీ బ్రతుకు
 చితికేలోగా మెరుపై  మెరిసీ 
 కథగా నిలిచీ తరించి  పోరా
 వెయ్ రా అడుగులు ముందుకు
 వేరే వాదం ఎందుకు పదరా తోసుకు  " చదువుల"

 ఆడే వయసున అక్షరమాలతో
 పునాది వేసే పాఠశాలలు 
 మనిషిగ నిన్ను తీరిచిదిద్ది 
 నిలబెట్టే కళాశాలలు 
 తీర్చలేనిదా ఋణము 
 కరములు రెండూ  జోడించి
 నమస్కరించిన చాలునూ 
 వెయ్ రా అడుగులు ముందుకు
 వేరే వాదం ఎందుకు పదరా తోసుకు   " చదువుల"

 బాలలు  మీరు భావితరాలకు
 దూతలుగా వెలుగొందాలీ 
 భాషకు అందని బాధలు ఎరుగని
 మరో జగతియే జనియించాలీ 
 దీక్షా కంకణబద్ధులై
 ధీశాలురు మీరందరూ
 వెలుగూనీడల పోరాటంలో
 అదరక ముందుకు సాగాలీ 
 వెయ్ రా అడుగులు  ముందుకు 
 వేరే వాదం ఎందుకు పదరా తోసుకు " చదువుల"

😇😊😇😊😇😊😇😊😇😊😇😊😇😊😇




                          

Friday, September 3, 2021

గురువులకు వందనం... ఓ జ్ఞాపకం

                                           🌺భువి భావనలు 🌺🐦                                                     *************
        

 ఐదేళ్ల  వయసుకు ముందు నా మస్తిష్కంలో పెద్దగా నిక్షిప్తమైన జ్ఞాపకాలేవీ లేవనే చెప్పాలి. కానీ మా నాన్నగారు ఓ కొత్త పలక, బలపం నా చేతికిచ్చి నా చేయి పట్టుకుని తీసుకెళ్లి ఓ మున్సిపల్ పాఠశాలలో కూర్చోబెట్టిన రోజు మాత్రం బాగా గుర్తుంది. కాసేపయ్యాక ఓ  పంతులమ్మ వచ్చి నా వద్ద కూర్చుని పలక మీద'అ ఆ' అక్షరాలు రాసి నా చేయి పట్టుకుని దిద్దించింది. ఆమె చాలా ప్రశాంతంగా, ఆప్యాయంగా ఇంకా ప్రసన్నంగా కనిపించింది. ఆమె పేరు అయితే గుర్తులేదు గానీ ఆ రోజు అక్షరాలు దిద్దించిన ఆ పంతులమ్మ నా స్మృతి పథంలో ఈనాటికీ నిలిచి  ఉంది. అలా మొదలైన నా ప్రాథమిక విద్య మరో రెండు స్కూళ్లు మారాక పూర్తయింది.
  అప్పట్లో కొందరు ఉపాధ్యాయులు ట్యూషన్ ఫీజ్ అంటూ ఏమీ ఆశించకుండా సాయంత్రాలు వాళ్ళ ఇంటి వద్ద పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండేవారు. అలా ట్యూషన్  చెప్పే ఓ మాస్టర్ గారి వద్దకు నేనూ  వెళ్లేదాన్ని. ఎక్కాల పుస్తకాలు ప్రింటెడ్ వి అప్పట్లో విరివిగా దొరికేవి కావు. అందువల్ల ఆయన, తెల్ల కాగితాలతో చిన్న పుస్తకాలు కుట్టి, వాటిలో ఎక్కాలు  సొంతంగా చేత్తో రాసి పిల్లలకు ఇచ్చే వారు. ఓ సారి ఆయన ఇచ్చిన ఎక్కాల పుస్తకం పోగొట్టుకుని ట్యూషన్ కెళ్ళా. మాస్టారు బాగా కోప్పడతాడేమో అనుకుని బిక్క మొహం వేసుకుని భయపడుతూ ఓ మూల కూర్చున్నాను. విషయం తెలిసిన ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనక వెంటనే మరో పుస్తకం తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఆ సహన మూర్తి ఆనాటి నా జ్ఞాపకాల్లో ఓ చెరగని ముద్ర.
   ఐదవ తరగతి దాకా నేను స్కూల్ లో నేర్చుకున్న ఇంగ్లీషు కంటే ఇంటి వద్ద మా నాన్నగారు నేర్పించినదే చాలా ఎక్కువ. చార్టులు, స్కెచ్ పెన్నులు లేని    కాలమది. ప్రింటెడ్ చార్టులు  కూడా ఉండేవి  కాదు. అందువల్ల నాకు ఆంగ్ల అక్షరాలు నేర్పించడానికి ఆయన చేసిన పని ఒకటుంది. ఇంట్లో ఏదో ఒక ప్యాకేజీకి  వచ్చిన అట్టపెట్టెను  కత్తిరించి దానిపై తెల్లకాగితాలు అంటించారు. ఓ పుల్లను బ్రష్ లా   మలిచి దాన్ని సిరాలో అద్ది ఆ అట్టపై నాలుగు తరహాలు ABCD లు వ్రాశారు. దాన్ని  గోడకు తగిలించి, ప్రతిరోజు నాతో పలికిస్తూ రాయించేవారు. అదేవిధంగా ఆంగ్ల పాఠాలన్నీ స్కూల్లో కంటే ముందుగా ఇంట్లోనే బోధించేవారు. ఆ విధంగా తొలి రోజుల్లో మా నాన్నగారే నా తొలి ఆంగ్ల ఉపాధ్యాయుడయ్యాడు. 
   6, 7 తరగతులు చదివేటప్పుడు ఆ పాఠశాల హెడ్మాస్టర్ గారు ఇంటింటికీ  తిరిగి కథల పుస్తకాలు, మ్యాగజైన్ లు సేకరించి స్కూల్లోఓ  అలమరలో వాటిని ఉంచి చిన్న సైజు లైబ్రరీ తయారు చేశారు. ప్రతీరోజూ  సాయంత్రం మమ్మల్ని కూర్చోబెట్టి  చదివించేవారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవారు. ఆయన సుబ్బారాయుడు మాస్టర్ గారు. ఇంట్లో మా నాన్నగారు కూడా ' చందమామ' తెలుగు, ఇంగ్లీష్ పిల్లల మాస పత్రికలు చందా కట్టి తెప్పించి నాతో చదివించేవారు. అలా పుస్తక పఠనం బాగా అలవాటైపో యింది.
   హైస్కూల్లో చేరాక అక్కడ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అలాగే ఉపాధ్యాయులు కూడా. సుశీలమ్మ గారని సైన్స్ టీచర్ ఉండేవారు. ఆవిడ అంటే అందరికీ హడల్. ఆవిడ బోధించిన సైన్స్ పాఠాలు ఇప్పటికీ నాకు గుర్తే! ఎందుకో అప్పట్లో  ఆమెను చూసి నాకూ టీచర్ అయితే బాగుండేది అనిపించేది.
    ఇంటర్లో శ్రీ రాములు గారని తెలుగు లెక్చరర్ పద్య పఠనం, బోధన అమోఘంగా ఉండేవి. తెలుగు భాషపై మమకారం నాకు ఏర్పడింది ఆరోజుల్లోనే  ! చిన్న చిన్న కవితలు, కథలూ వ్రాసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఎవరికీ చూపించేదాన్ని మాత్రం కాదు.
        మూడేళ్ల డిగ్రీ చదువు చకచకా ముగిసిపోయింది. ఆ పీరియడ్ లో ఒకరని కాదు గానీ లెక్చరర్స్ ను   చూసినప్పుడు భవిష్యత్ లో నాకూ లెక్చరర్ కావాలన్న కోరిక మాత్రం కలిగేది. డిగ్రీ తర్వాత అనుకోని విధంగా BEd  లో చేరి  పోయాను. అలా అలా ఉపాధ్యాయ వృత్తి నన్నాహ్వానించి క్రమంగా అదే నా బ్రతుకు తెరువైపోయింది. క్రమంగా నా  ఉద్యోగం మీద ఇష్టం బాగా పెరిగిపోయి అది  విద్యార్థులపై అవ్యాజానురాగంగా మారిన సందర్భాలూ లేకపోలేదు. తర్వాతికాలంలో  క్వాలిఫికేషన్ పెంచుకుని లెక్చరర్ నీ అయిపోయాను. 
     ఎందుకో,  ఈ గురు పూజోత్సవం రోజు [ o5.09.21]ఆ రోజులూ, నాకు చదువు చెప్పిన నా  గురువులు గుర్తుకొచ్చి ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. 

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
   గురుపూజోత్సవం సందర్భంగా
          ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

                                                        
                                      

Monday, August 30, 2021

ఆ పాటలు స్ఫూర్తి నిస్తాయి, జీవితాల్నీ నిలబెడతాయి !

                                               🌺భువి భావనలు🐦🌷
                                                    *************


     చాలా ఏళ్ళ క్రితం ఓ ఆర్టికల్ చదివాను. అది  ఓ సినిమా పాట గురించి. అందులో నిజంగా జరిగిన ఓ సంఘటన  చెప్పడం విశేషం !దాని సారాంశం --
 జీవితంలో అన్ని విధాలా ఎదురు దెబ్బలు తిని, మనోధైర్యాన్ని కోల్పోయి, విరక్తి చెంది, విధిలేని పరిస్థితుల్లో ఓ వ్యక్తి తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని నిర్ణయించుకుని అందుకై ఉద్యుక్తుడవుతుండగా అల్లంత దూరంలో ఆకాశవాణి( రేడియో) నుండి ఓ పాట అతని చెవుల్ని తాకింది.. నిమిషాల వ్యవధిలోనే అది ఆతని గుండెల్నీ తాకింది. అంతే! ఎంతోకాలంగా అతన్ని వేధిస్తున్న గడ్డు సమస్యలు గడ్డిపరకలుగా తోచాయతనికి ! ఆశ్చర్యకరంగా మనసంతా తేలికై పోయి,  అతని నిర్ణయం సడలిపోయి అనూహ్యంగా మారిపోయింది.
 "చచ్చి సాధించేది ఏముంది, జీవితం అంతమైపోతుంది. సమస్యలు పరిష్కారం కావు కదా! ఏదైనా బ్రతికే సాధించుకోవాలి, "
 అన్న స్థిర నిశ్చయంతో మనసును సరైన దారిలోకి మళ్ళించుకున్నాడట ! ఆ విధంగా అతని జీవితం నిలబడింది. తర్వాత అతని సమస్యలు తీరాయా లేదా అన్నది వేరే సంగతి. దేహంలో ప్రాణం నిలబడటమన్నది అతి ముఖ్యం. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా సాధించగలం!
 ఇంతకీ ఆ పాట-- ' వెలుగునీడలు' చిత్రంలో శ్రీ శ్రీ గారిచే విరచితమై, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు అత్యద్భుతంగా ఎంతో ఆర్ద్రతతో ఆలపించిన ---
కలకానిదీ విలువైనదీ బ్రతుకు
 కన్నీటి ధారలలోనే బలి చేయకూ 
 *అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
 కలతలకే లొంగిపోయి కలవరించనేల !
 సాహసమను  జ్యోతినీ చేకొని సాగిపో
* అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
 శోకాల మరుగున దాగీ సుఖమున్నదిలే
 ఏది తనంత తానై నీ దరికి రాదు
 శోధించి సాధించాలీ అదియే ధీర గుణం!
ఆరోజుల్లోనే కాదు ఇప్పుడూ ఎప్పుడూ అజరామరంగా నిలిచి ఎందరికో స్ఫూర్తి నిచ్చే అద్భుతమైన పాట ఇది ! ఇలాంటి  సినీ గీతాలు ఇంకా ఉన్నాయి. కేవలం కాలక్షేపాన్ని, మానసికానందాన్ని ఇచ్చే పాటలు లక్ష లాది ఉంటాయి కానీ, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గీతాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇవి మానవాళికి దివ్య వరాలనే  చెప్పాలి! అలాంటిదే మరొకటి ---
 ఘంటసాల గారు పాడినదే, కొసరాజు సాహిత్యం' శభాష్ రాముడు' చిత్రంలోనిది.
* కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునూ 
 ఈ లోకమందు సోమరులై  ఉండకూడదూ 
 పవిత్రమైన ఆశయాలు మరువకూడదూ 
 * గాఢాంధకారమలముకొన్న భీతి  చెందకూ 
  సందేహ పడక వెలుగు చూపి   సాగు ముందుకు
  నిరాశలోన  జీవితాన్ని కృంగదీయకూ 
  జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
  జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా
తర్వాతి తరంలో వచ్చిన మరో రెండు మరపురాని గీతాలు - ఈ రెండూ  చంద్రబోస్ గారు రాసినవే !రెండింటికీ  కీరవాణి గారు చక్కటి బాణీలు కట్టడం మరో విశేషం! ఈ పాటలు నేటి తరాన్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాయనడంలో  ఎలాంటి సందేహం లేదు. అందులో ఒకటి -- ' నేనున్నాను' చిత్రంలోనిది. కీరవాణి,  సునీత గారలు గానం చేసినది. 
  తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
  తరిమే వాళ్ళని  హితులుగ తలచి ముందుకెళ్లాలనీ 
  కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ 
  కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ 
  గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను
  అడుగుతో గమ్యం చెప్పెను
  నేనున్నాననీ నీకేం కాదనీ 
  నిన్నటి రాతని మార్చేస్తానని
--నా బ్రతుకింతే, నా తల రాతను ఎవరూ మార్చలేరు అనుకునేవాళ్లకు ఈపాట ఓ చక్కటి జవాబు. ఓ మార్గదర్శి." నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్" చిత్రంలోని ఈ పాట వినని వారు ఉండరేమో! 
  చెమట నీరు చిందగా నుదుటి  రాత మార్చుకో
  మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
  పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
  మారిపోని కథలే లేవని గమనించుకో
  తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
  నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ 
  నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
  నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా 
  నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ 
  అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలి
 * మౌనంగానే ఎదగమనీ
    మొక్క నీకు చెబుతుంది
   ఎదిగిన కొద్దీ ఒదగమనే
   అర్థమందులో ఉంది
   అపజయాలు కలిగిన చోటే 
   గెలుపు పిలుపు వినిపిస్తుంది
   ఆకులన్ని రాలిన చోటే
   కొత్త చిగురు కనిపిస్తుంది 
--- ఈ పాట గురించి చంద్రబోస్ గారు స్వయానా చెప్పిన మాటలు ఓ  చోట చదివాను. ఓ పాఠశాలలో ఉదయం ప్రార్థనా  గీతంగా ఈ పాటను ప్రతిరోజూ విద్యార్థుల చేత పాడిస్తారట ! ఓ రచయిత లేదా కవికి ఇంతకుమించిన మహద్భాగ్యం బహుశా ఉండదేమో! ఏ పురస్కారం దీనితో సరితూగదు అంటే అతిశయోక్తి కానే కాదు.
  అలాగే ఈ చిత్ర దర్శకుడు, ప్రముఖ ఛాయాగ్రహకులు ఎస్. గోపాల్ రెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో ఈమధ్య చెప్పగా విన్నాను, కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఈ పాటలోని పల్లవిని ఓ పెద్ద చెట్టు మొదట్లో బ్లాక్ బోర్డ్ మీద వ్రాసి ఉంచారట! వచ్చేపోయే వాళ్లు, ముఖ్యంగా  రైతులు ప్రతిరోజూ ఆ మాటలు  చదువుతూ స్ఫూర్తి పొందాలని వారి ఉద్దేశమట ! ఎంత గొప్ప ఆలోచన! ఓ పాట ఇంతలా ప్రాచుర్యం పొందడమే గాక ఎందరికో  స్ఫూర్తి నివ్వడం నిజంగా సర్వదా హర్షణీయం. రాసిన వారు, సంగీతకర్తలు, గాయని చిత్ర గారూ ధన్యులు! 
  --- ఇలాంటి పాటలు ఇప్పుడే కాదు, భావి  తరాలనూ ఉత్తేజపరుస్తాయి. నేను నాలుగింటిని  మాత్రమే ప్రస్తావించాను. ఇంకా ఉంటాయి, ఆ.... అదిగో... గుర్తుకొస్తోంది,... మరో మధుర గేయం... 
    కడలి నడుమ పడవ మునిగితే
    కడదాకా ఈదాలి
    నీళ్ళు లేని ఎడారిలో
    కన్నీళ్లయినతాగి బ్రతకాలి
    ఏ  తోడు లేని నాడు
     నీనీడే  నీకు తోడు
     జగమంతా దగా చేసినా 
     చిగురంత ఆశను చూడు 
     చిగురంత ఆశ జగమంత వెలుగు 
     గోరంతదీపం కొండంత వెలుగు. 
బాపుగారి 'గోరంతదీపం ' చిత్రం లో సుశీల, బాలసుబ్రహ్మణ్యం గారలు గానం చేసినది. సి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం, కె. వి. మహదేవన్ సంగీతం. 
ఇవన్నీ నిరాశలో ఉన్నవారికే కాదు  ప్రతివారిలోనూ స్ఫూర్తి నింపుతాయి.సరైన దారిలో నడిచేలా పురికొల్పుతాయి  కర్తవ్యాన్ని బోధిస్తూ జీవితాల్నీ నిలబెడతాయి. 
   అద్భుతమైన ఆలోచనలకు అక్షరరూపమిచ్చిన ఆయా కవులకు,  ఉత్తేజపూరితమైన స్వరాలందించిన సంగీత దర్శకులకు, ప్రాణం పోసిన గాయనీగాయకులకు నమస్సులు 🙏

**********************************