Saturday, February 26, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే...5... 'అభిలాష ' మంచిదే కదా !

 
🌺

    కొత్త పీ ఆర్ సీ వస్తే జీతాలు పెరుగుతాయనుకుని అంతా సంతోషంగా ఉన్న తరుణంలో... అదేమిటో ఆశ నిరాశ చేస్తూ జీతాలు తగ్గిపోయాయని ఉద్యోగస్తులంతా  డీలా పడిపోయారు ఇటీవల! అది కాసేపలా ఉంచితే.... పదోన్నతి వస్తే కూడా జీతం పెరుగుతుందంటారు..అది సహజమే కూడా. కానీ, చిత్రంగా, మరింత తమాషాగా నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి లభించినప్పుడు అప్పటిదాకా అందుకుంటున్న శాలరీ కంటే కాస్త తగ్గిపోయింది. కాకపోతే... ఇందులో చిత్రమేమీ లేదు...తమాషా అంతకంటే లేదు. ఎందుకంటే, అంతవరకూ చేస్తున్నది 20% HRA ప్లేస్ లో. ప్రమోషన్ తర్వాత బదిలీ జరిగింది 10% HRA  ప్లేస్ కు! ఇది ఓ కారణమైతే, అప్పటికే SG  Asst గా పది సంవత్సరాలు పైగా  సర్వీస్ ఉన్నందువల్ల స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పే  చేరుకుని ఉండడం మరో కారణం. దాంతో ఒకటీ అరా  ఇంక్రిమెంట్లు అదనంగా వచ్చి చేరినా మొత్తంమీద శాలరీ తగ్గిపోయింది.   
        అలాంటప్పుడు ఎందుకీ ' ప్రమోషన్ ' !అని కొందరు కామెంట్ చేశారు. కానీ నా అభీష్టం మరోలా ఉండేది. అదేమిటంటే ' క్యాడర్'  మారడం! జాబ్ లో  చేరినప్పుడు ఉన్న  కేడర్ లోనే రిటైర్ అవ్వకూడదు అనే అభిప్రాయం స్థిరంగా   నాలో ఉండడం ! పైగా పీజీ తో పాటు M.Ed  డిగ్రీ కూడా ఉన్న నాకు లెక్చరర్ గా వెళ్లే ఛాన్స్ భవిష్యత్తులో ఉంటుంది. అలా వెళ్లాలంటే ముందు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో తప్పనిసరిగా ఉండి తీరాలి. అందుకోసమైనా నేను వచ్చిన ప్రమోషన్  అంగీకరించక తప్పదు. అందుకే మరేమీ ఆలోచించకుండా  వెళ్లి జాయినై  పోయాను.
     ఫలితమే, జీతం తగ్గడం!! ఊహించినదే  కాబట్టి, నిరాశ పడలేదు నేను. ఆ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత నేను కోరుకున్న పదోన్నతి లెక్చరర్ గా నాకు లభించింది.అలా నా కోరిక నెరవేరి పది సంవత్సరాలపాటు లెక్చరర్ గా చేసి పదవీ విరమణ చేశాను. అదో సంతృప్తి ఎప్పటికీ !
    జీవితంలో ఎన్నెన్నో అనుకుంటాం. ఏదేదో కావాలనుకుంటాం. అన్నీ నెరవేరడమైతే జరగదు. కానీ, నా ఈ అభీష్టం నెరవేరింది. చిన్న ఉద్యోగమే !చిన్న పదోన్నతే !కానీ నా చిన్ని ప్రాణానికదే కొండంత ఆనందాన్నిచ్చింది. మొదట వచ్చిన ప్రమోషన్ వద్దనుకుని ఉంటే  కెరీర్ అక్కడే ఆగిపోయుండేది.  కాస్త శ్రమ పడ్డ మాట వాస్తవమే అయినా నా ఆశ మాత్రం తీరింది. అందుకే 'అభిలాష' అన్నది ఉండడం ఎవరికైనా మంచిదే కదా అనిపిస్తుంది నాకు. 🙂

                  🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺






       

 

Monday, February 21, 2022

చదవక మది నిలవదే !


 తెల్లారింది !
 అదిగో దిన పత్రిక వచ్చేసింది!
 వార్తల్ని మోసుకొచ్చింది
 కానీ -- తెరవాలంటే భయం!
 నిండా వెక్కిరించే సమస్యల తోరణాలు!
 మింగుడుపడని నమ్మలేని నిజాలు!
 అయినా, తెలుసుకోవాలన్న కుతూహలం!
 చదవక కుదుటబడదు
 ఆపై మదనపడక మానదు 
 పిచ్చి అంతరంగం !
 పదవుల కోసం కుమ్ములాటలంటూ ఒక చోట
 రాజకీయ చదరంగపు ఎత్తుగడలంటూ
 కుట్రలు కుతంత్రాలంటూ మరోచోట!
 రక్తసిక్తమైన రహదారులంట!దుర్మరణాలంట !
 దోపిడీ దొంగల దురాగతాలంట 
 దుర్మార్గుల అరాచకాలట !
 ఇంకా -- హత్యలు ! ఆత్మహత్యలు!
 పరువు హత్యలు ! ఇవి చాలవన్నట్లు--
 అడుగడుగునా సంచరించే మానవ మృగాలు!
 రక్షణ కరువై రోదించే అబలల ఆర్తనాదాలు!😔
 'అయ్యో!మమ్ముల మరిచావా'అంటూ, 
 అదిగో, అంతుబట్టని వైరస్ మహమ్మారులు, 
 వాటి 'వేరియంట్లు' !!😅 అంతేనా !
 రగిలిపోతూ కుల మత విభేదాల కార్చిచ్చులు !
 ముందుకు కాదు వెనక్కి నడుద్దామంటూ 
 దుస్సాంప్రదాయాలు !దురభిప్రాయాలు ! 
 రకరకాల రంగురంగుల చిత్ర విచిత్ర 
 విన్యాసాలు ! విపరీతాలు !
 ఆసాంతం వెక్కిరించే సమస్యల తోరణాలే !!
 కానరావే ఏ మూలనా ఆశాకిరణాల చిరుదివ్వెలు !
 నక్కినక్కి ఏ మూలనో ఒకటీ అరా దాగినా 
 అన్నింటి నడుమా చిక్కిపోయి అందిన 
 ఆవగింజంత ఆనందం కాస్తా 
 ఆవిరైపోతుంది కదా ! 
 అందుకే భయం, తెరవాలంటే భయం !
 అదిగో, మళ్ళీ తెల్లవారింది !
 దిన పత్రిక మళ్లీ వచ్చేసింది !
 వార్తలెన్నో  మోసుకొచ్చింది
 మళ్లీ మామూలే! తెరవాలంటే భయం!
 కానీ.. చదవక ఉండలేరే పిచ్చి జనం !!

       ****      *****       ****      ****
 



Monday, February 14, 2022

గుసగుసలు...!..?

   టీవీలో సీరియల్ కు బ్రేక్ వచ్చింది. యాడ్స్ మొదలయ్యాయి. ఒకదానెంట ఒకటి టక టకా వస్తూ పోతున్నాయి. అదిగో మరోటి మొదలైంది --- 
 ఇద్దరు చిన్నపిల్లలు.అన్నాచెల్లెళ్ళు. భోంచేస్తూ మెల్లిగా  వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అది  చూసిన వాళ్ళ అమ్మ నవ్వుకుంటూ, 
" మళ్లీ గుసగుసలు.. " అనుకుంది. 
  విషయానికొస్తే ---
 ఇలా చిన్న పిల్లలు గుసగుసలాడుకుంటుంటే చూడ్డానికి బాగానే ఉంటుంది. ఇంకా ముచ్చటేస్తుంది కూడా. కానీ... అదే పెద్దవాళ్లు ఇద్దరు లేక ముగ్గురు గుస గుస లాడుతూ, చెవులు కొరుక్కుంటూ ఉంటే... వాళ్లకు సమీపంలోనే ఉండి  చూస్తున్న వాళ్లకి ఎలా ఉంటుంది !
                  **          ****       **
   ఆ రోజు ఆదివారం. ఆరిన బట్టలన్నీ మడతలు వేయడం పూర్తి చేసి, అల్మరా లో సర్దుదామని హాల్లోకి వచ్చింది శ్రీవిద్య. అక్కడ సోఫాలో అత్తగారు, పక్కింటి పరమేశ్వరమ్మగారు ఇద్దరూ కూర్చుని గుసగుసలు పోతున్నారు.తను ' ఎంట్రీ ' ఇవ్వగానే ఆవిడ దూరంగా జరిగి  వెంటనే స్వరం పెంచి, 
" ఏమిటో అక్కా, చలి బాగా ఎక్కువైంది కదూ... "
 అనేసింది తనవైపు ఓరగా చూస్తూ..
" అవును మరి... కరోనా  కేసులు తగ్గాయట కదా... టీవీలో చెప్పారు..." 
అత్తగారు అందుకుంది. ఒకదానికొకటి  పొంతన లేని భాషణం ! బట్టలు సర్దేసి గదిలోకెళ్ళిపోయింది శ్రీవిద్య. హాల్లో మళ్ళీ గుసగుసలు మొదలు !
  గట్టిగా మాట్లాడుకోవచ్చు గదా ! నేనూ వింటాకదా ఆ విశేషాలు ! అనుకున్న శ్రీవిద్య మెదడులోకి , 
" కొంపదీసి నా గురించే కాదుకదా... " అన్న అనుమానం గబుక్కున దూరి క్షణం ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఆమెకు ఆశ్యర్యం గొలిపే అంశం ఏమిటంటే ఇద్దరూ  డెబ్భైకి చేరువలో ఉన్నారు.అంత 'లోవాల్యూమ్' ముచ్చట్లు వాళ్ళ చెవులకెలా ఎక్కుతున్నాయి? ఈ  వయసులో అంతటి వినికిడి శక్తి ఎలా వచ్చింది వీళ్ళకి !ఇదీ... ప్రతీసారీ తనకు తాను వేసుకునే ప్రశ్న. 
                   **       ****      **   
   క్లాసవగానే శ్రీవిద్య తర్వాత క్లాస్ లేనందువల్ల స్టాఫ్ రూమ్ కేసి నడిచింది. రూమ్ లో  అడుగిడగానే సివిక్స్ మేడం సంఘవి, బోటనీ మేడం హరిత వాళ్ళ  చైర్స్ నుండి ముందుకు వంగిపోయి ఏవో గుసగుసగా చెప్పుకుంటున్నారు. శ్రీవిద్యను చూడగానే ఠక్కున ఆపేసి, సర్దుక్కూర్చున్నారు. ఇలాంటి దృశ్యం అడపాదడపా తన కంటబడుతూ ఉండడం శ్రీ విద్యకు అలవాటే. ఆమెకు అర్థం కానిది  ఏంటంటే అలా వాళ్ళు అంత రహస్యంగా ఏమి చెప్పుకుంటుంటారు? ఎవరి గురించి చెప్పుకుంటూ ఉంటారు? అనేదే !. అదేమిటో ! తను రాగానే ఠక్కున ఆపేసి సైలెంట్ అయిపోతారు. మొదట్లో పట్టించుకునేది కాదు గానీ, రాను రానూ ఏమిటో వాళ్లు తన గురించే ఏమైనా  చెప్పుకుంటున్నారేమో అన్న శంక మొదలైంది శ్రీవిద్యకు. ఇది కేవలం ఆమె అపోహే కావచ్చు. క్రమేపీ ఇదో మానసిక సమస్యగా మారే ప్రమాదమూ ఉంటుందేమో కర్మ అని కాస్త టెన్షన్అవుతూ ఉంటుందీ మధ్య శ్రీవిద్య.    ! కొందరైతే మరీ పక్కన ఎవరైనా ఉన్నా సరే వాళ్ల ఉనికే పట్టనట్లు గుసగుసలాడుతూ ఉంటారు.ప్చ్ ! ఇంట్లో అంటే   పెద్ద వయసు వాళ్ళు, పొద్దుపోక  కాలక్షేపానికి'ఏదోలే 'అనుకుంటే... వీళ్ళకేమిటి ఈ జబ్బు !అనుకుంటూ ఉంటుంది శ్రీవిద్య ఇలాంటి వాళ్ళను చూసినప్పుడల్లా.
    బెల్లయింది.తర్వాతి క్లాసుకు బయలుదేరుతూ అప్రయత్నంగా పక్కనే ఉన్న జెంట్స్ స్టాఫ్ రూమ్ లోకి తల తిప్పింది . అక్కడ ఎకనామిక్స్ లెక్చరర్ టేబుల్ మీదకు వంగి చైర్ లో కూర్చున్న ఫిజిక్స్ లెక్చరర్ చెవిలో ఏదో గుసగుసగా చెప్తున్నాడు. ఆయనేమో ఈయన వేపు చెవి ఆనించి వింటూ నవ్వుతున్నాడు. ఠక్కున తల తిప్పేసుకుంది శ్రీవిద్య. 
" బాబోయ్ ! వీళ్లూ గుసగుసలా ! ఇంతవరకూ ఆడాళ్ళకే ఈ జబ్బు సొంతమనుకున్నానే !"
అనుకుంటూ గబగబా క్లాస్ రూమ్ కేసి నడిచింది. అంతలో వెనకనుంచి, 
" మేడం, క్లాస్ కా? "
అని వినిపించి, తిరిగి చూసింది. ఫిజికల్ డైరెక్టర్ కనక దుర్గ !
" ఏం ప్రశ్న ! కాలేజీలో ఉన్నా, క్లాస్ కు  కాక సినిమా చూడ్డానికెళ్తానా.. "
అనుకుంటూ ఆగింది.  సమీపించి, 
"మేడం, ఇది విన్నారా?.. "
అంటూ మెల్లిగా చెవిలో ఏదో ఊదింది. అప్రయత్నంగానే కుతూహలంగా తనూ తల వంచి చెవి ఒగ్గింది. ఠక్కున ఏదో స్ఫురించి, 
" మై గాడ్ ! నాకూ అంటుకుందా ఈ జబ్బు !"
అనుకుంటూ ముందుకు దృష్టి సారించింది. సరిగ్గా అప్పుడే ఆర్ట్స్ క్లాస్ నుండి బయటకొస్తూన్న తెలుగు లెక్చరర్ శ్రీవల్లి కంటబడ్డారిద్దరూ. ఆమె నవ్వేస్తూ, 
" ఏమిటీ గుసగుసలు !..." అనేసింది. 😊
' ద్యావుడా !" నిటారుగా అయిపోయింది శ్రీవిద్య !
                     **       ****      **
  మొత్తానికి ఈ గుసగుసలు కొందరికి మహాఇష్టం.మరికొందరికి అయిష్టం. ఎంత అయిష్టమయినా ఒక్కోసారి తప్పవు శ్రీవిద్య కు లాగా !

       😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊



   

 







Monday, February 7, 2022

ఏది కష్టం ? ఏది సులభం ?



🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఓ కట్టడం కూల్చడం ఎంత సులభం !
అదే కట్టి చూడు తెలుస్తుంది కష్టం 
క్షణం చాలు విత్తు విత్తడానికి
వత్సరాలు గడవాలి వృక్షమవడానికి  !
పఠించగలం అవలీలగా ఓ పుస్తకం 
సృష్టికర్త ఆ రచయిత శ్రమే అమూల్యం !
ఏదోలా బ్రతకడం సులభం
విలువలతో నిలవడమే కష్టం !
అలా బ్రతికి చూడు జన్మ ధన్యం !!

 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
 

Thursday, February 3, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..4.. మళ్ళీ చూడాలని ఉంది.. !

🌺

     జీవితమనే ఈ ప్రయాణంలో ఏ చీకూ చింతలూ, బరువూ బాధ్యతలు లేనిదంటూ ఉన్నదంటే అది  బాల్య దశే ! ఆ తర్వాత చదువులు, పాఠాలు, పరీక్షలు, వాటి తాలూకు వత్తిడులు ప్రవేశించి ఒకింత భారం నెత్తిన పడిపోతుంది. అయినా, బాధ్యతలు అంటూ ఏమీ ఉండవు కాబట్టి అది కూడా ఓకే! ప్రతీ మనిషికీ ఆనందాలు, అనుభూతులంటూ ఉండేదీ ఈ అధ్యాయాల్లోనే. పుస్తకాలు, పాఠాలతో పాటు స్నేహితులు, సినిమాలు, షికార్లు చోటుచేసుకునేదీ ఈ వయసులోనే  ! ఆతర్వాతేముందీ, అంతా బాధ్యతలూ, బాదరబందీలే కదా !
    అలా విద్యార్థి దశలో చిన్న చిన్న సరదాలు ప్రతివారి జీవనయానంలో తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. అలాంటి సరదాల్లో మనం ఎంత వద్దనుకున్నా సినిమా లన్నవి  చోటుచేసుకుంటుంటాయి. 
    నేను డిగ్రీ చదివే రోజుల్లో సాయి కుమారి అనే స్నేహితురాలుండేదని ఇదివరకు చెప్పాను. తనకు హిందీ సినిమాలంటే మహాపిచ్చి. నాకేమో వాటిమీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులవి. ఏదైనా పండగ రోజుల్లో లేదా ఆదివారం నాడో బంధువులు లేదా స్నేహితుల ఇళ్లకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేవారు హాస్టల్లో. అలా ఓ ఆదివారం నాడు నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లడానికొచ్చింది నా ఫ్రెండ్ సాయి. తన మాట కాదనలేక తనతో బయలుదేరాను నేను. ఇల్లు దగ్గరే కదాని నడిచి వెళ్తున్నామిద్దరం.  వెళ్లే దారిలో ఓ బ్రిడ్జి ఉండేది. అటునుండి కిందకి చూస్తే రెండు సినిమా థియేటర్లు పక్క పక్కనే  ! రంగ మహల్, శేష మహల్  ( పేర్లు సరిగా గుర్తు లేవు ). ముందుభాగాన సినిమా పోస్టర్స్ ఆకర్షణీయంగా అతికించబడి వస్తూ పోయేవాళ్లను ఆహ్వానిస్తూ ఉంటాయి. అలా వెళ్తున్నామా, ఉన్నట్టుండి మా సాయి నా చేయి పట్టుకొని గబగబా అటువేపు దారితీసింది. నాకర్థమయేలోగా థియేటర్ దగ్గరున్నాము. నాకు హిందీ ఇంట్రెస్ట్ లేదు మొర్రో అంటున్నా వినక, 
" ఓ సారి చూడు తెలుస్తుంది, ఆ తర్వాత అన్నీ హిందీ సినిమాలే  చూస్తావు.."
 అంటూ టికెట్స్ తీసేసింది. చేసేదేమీలేక ఒకసారికి ఎలాగోలా భరిద్దాంలే అనుకుంటూ వెళ్లి కూర్చున్నా. మెల్లగా టైటిల్స్ మొదలయ్యాయి. అది, ' యాదోం కీ బారాత్ '. పావుగంట గడిచింది. ఆశ్చర్యం ! నాకే నమ్మశక్యం గానంతగా అందులో లీనమైపోయాను. సాయి చెప్పింది నిజమే సుమా, అనిపించింది. అందులో పాటలు... ఈనాటికీ మర్చిపోలేనంత 'పాపులర్ ' !
    సినిమా అంతటికీ నాకే కాదు అందర్నీ ఆకట్టుకున్న ఒక సీన్... అందులో ధర్మేంద్ర ఓ క్రిమినల్.ఓ వంతెన మీద పరిగెత్తుతూ ఉంటాడు. వెనక ఎవరో తరుముకొస్తుంటారతన్ని. వారి నుండి తప్పించుకోవడం ఎలాగా అనుకుంటూ కిందకి చూస్తాడు. సరిగ్గా అప్పుడే కింద ఓ ట్రైన్ పోతుంటుంది. అంతే! వెంటనే పై నుండి కిందకి దూకేస్తాడు ఆ ట్రైన్ మీద ! దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడ్డం,ఆ  ట్రైన్ అలాగే కదులుతూ పోవడం! థియేటర్ అంతా ఒకటే ఈలలు, చప్పట్లు ! చాలా ఎక్సైటింగ్ సీన్ !😊😊
    సినిమా మొత్తం బాగా ఎంజాయ్ చేశాం. విసుగ్గా వెళ్ళిన నేను చాలా హ్యాపీగా బయటకొచ్చాను. 
" బాగా తిట్టుకున్నావ్ కదానన్ను... "
 నా చేయి పట్టుకుని అన్నది  నా ఫ్రెండ్.
" లేదు, మళ్లీ చూడాలని ఉంది, ఎప్పుడెళ్దాం..? "
అన్నా. "
విస్తుబోయి, నవ్వేసింది. అలా అలా అప్పుడప్పుడూ హిందీ సినిమాలు చూడ్డం అలవాటయ్యింది నాకు.
  అదే  సినిమా కొన్నాళ్ళకి తెలుగులో ' అన్నదమ్ముల అనుబంధం' పేరిట రీమేక్ అయింది. అందులో ధర్మేంద్ర పాత్ర మన ఎన్టీఆర్ పోషించారు. రీమేక్ సినిమాల్ని ఒరిజినల్స్ తో పోల్చి చూడడం అందరికీ అదో అలవాటుగా ఉండేది అప్పట్లో.( ఇప్పుడు కూడా అంతే కదా!)
   ముఖ్యంగా ధర్మేంద్ర ట్రైన్ మీద దూకే సీన్ తెలుగులో మన ఎన్టీఆర్ ఎలా చేస్తాడో చూడాలి అనిపించింది. అదేపనిగా నేను మరో ఇద్దరు ఫ్రెండ్స్  కలిసి వెళ్లి థియేటర్లో కూర్చున్నాము. ఆత్రంగా ఎదురు చూస్తున్నాం ఆ సీన్  కోసం ! అదిగో, అదిగో.. వస్తోంది... వస్తోంది.. వచ్చేసింది.. దూకేశాడు.. అంతే! మళ్లీ హాలంతా చప్పట్లే చప్పట్లు ! ఈలలు !😊😊😊
" పర్వాలేదే, మన ఎన్టీఆర్ కూడా బాగానే దూకాడే.. " అనుకున్నాం. ఇందులో మరో విశేషం ! హిందీలో ధర్మేంద్ర, విజయ్ అరోరా, తారీక్ అన్నదమ్ములయితే మన  తెలుగులో ఎన్టీఆర్, మురళీమోహన్ చిన్న తమ్ముడిగా బాలకృష్ణ నటించారు. అప్పుడప్పుడే  ఎంట్రీ అనుకుంటా, బాలయ్య బాబు కూడా ముద్దుముద్దుగా, ఎంచక్కా కనిపించాడు. 
   ఏమిటో! అప్పట్లో అదో  ముచ్చట స్టూడెంట్స్ అందరికీ. ఇప్పుడవన్నీ తలుచుకుంటుంటే నవ్వొస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మన జీవన యానంలో ఇలాంటివి కూడా అప్పుడప్పుడూ కలిసి పయనిస్తూ ఉంటాయి కదా అనిపిస్తుంది ఒక్కోసారి...😊😊😊

                            🌷🌷🌷🌷🌷