Friday, December 31, 2021

అదిగో అదిగో అడుగిడుతోంది నూతన సంవత్సరం..



🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

 పచ్చదనాల కొత్త కోక గట్టి
 పసిడి వర్ణం మేనిలో నింపి
 పరిమళాల పూదోట నుండి 
 పల్లవించే రాగాల తోడి 
 పరుగు పరుగున వస్తోంది 
 మన  కోసమే మన  కోసమే  !

  దోసిలి నిండా పూరేకులు
  దోబూచులాడే కొత్త ఊసులు
  కళ్ళ నిండా కోటి కాంతులు
  ఎదనిండా ప్రేమానురాగాలు
  ఒడి నిండా వరాల మూటలు
  మోస్తూ మోస్తూ వస్తోంది 
  మన  కోసమే మన  కోసమే !

   తెలతెలవారుతుండగా  
   పొగమంచు చీల్చుకుంటూ 
   వెలుగులు  వెదజల్లుతూ
   నిన్నటి చేదును మరిపిస్తూ
   రేపటి 'ఆశ 'కు పునాది వేస్తూ
   అదిగో అదిగో! అడుగిడుతోంది 
   నూతన సంవత్సరం! మన కోసమే!

 " విషాదాలెన్నుంటే నేమిగాక ! లెక్క చేయకు!
   మూసేయ్  గతాన్ని! ముందుకు కదులు !
   వర్తమానం నీ చేతిలోనే! ఆలోచించు"
   అంటూ ప్రగతి దారి పట్టమంటోంది !
   అదిగో అదిగో ! అడుగిడుతోంది 
      🌺నూతన సంవత్సరం 🌺
  స్వాగతిద్దాం సంబరాలు చేసుకుందాం
  నిరాశా నిస్పృహలు వదిలేద్దాం
  నీరసం నిశ్శబ్దం పక్కకునెడదాం !
  నవ్వుతూ నవ్విస్తూ జీవనయానం సాగిద్దాం !
  అదిగో అదిగో !నూతన సంవత్సరం!
  అడుగిడుతోంది మనందరికోసం 
  స్వాగతిద్దాం సంబరాలు చేసుకుందాం !!💐🌷

🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺🌷🌺


   





Thursday, December 30, 2021

స్వాగతం 🌄

      
                              🌺  2022🌺
                           🌺🌺🌺🌺🌺🌺
           నూతన సంవత్సరానికి  ఘన స్వాగతం


    🌷నూతన సంవత్సరం ఎప్పుడూ నిత్య నూతనమే కదా ! ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కడగండ్లు చుట్టుముట్టినా, మరెన్ని అవాంతరాలు వచ్చి అతలాకుతలం చేసినా వాటిమధ్య అంతో ఇంతో తీపిని కూడా రంగరిస్తూ ఉంటుంది  మరి ! అందుకేనేమో ! కొత్త సంవత్సరం వస్తోందంటే అందరికీ అంత ఆనందం ! 
     ఇది  జీవితం. సాఫీగా సాగితే అర్థమేముంది? సవ్యంగా సాగితే అది  జీవితం ఎలా అవుతుంది? ఎన్ని 'సునామీ'లొచ్చినా, ఎన్ని వరదలొచ్చినా,మరెన్ని 'కరోనా' లొచ్చి కష్టాలపాలైనా, భూకంపాలొచ్చినా, ఆకాశం బద్దలైనా కాలం  సాగుతూనే ఉందిగా! అంతే! అలా సాగుతూనే ఉంటుంది. ఎవరికోసం ఆగదు.           ఆప్తులు అసువులు బాసి కాల గర్భంలో కలిసి పోయినా, జ్ఞాపకాలు మిగిలిపోయి కళ్ళ తడి ఆరకున్నా  రేపటి పై  'ఆశ' మనలో నిత్యం సజీవంగానే ఉండాలి. ఉండితీరాలి. అప్పుడే అడుగు ముందుకేయగలం. అలా అడుగులు ముందుకు పడాలంటే నిరాశా నిస్పృహల్ని  వదిలేసి, నూతనో త్సాహాన్ని మదినిండా నింపుకుని శక్తి పుంజుకోవాలి. అటుపై కొత్త సంవత్సరాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. ఏమో ! సమస్యలతోపాటు సంతోష తరంగాల్నీ మనకందజేస్తుందేమో 😊🙂!
        🌷 ఈ  స్వాగత వచనాలందుకే 🌷
 నూతన సంవత్సరమా ! మా బాధల్ని  భరించే శక్తి మాకివ్వు. మా తీయని, తీరని కలల్ని నిజం చేసి  ఊరట నివ్వు. ఇదిగో అందుకో మరి!
          మా మనః పూర్వక స్వాగతం
         🌹🌹🌹🌹💐💐🌹🌹🌹🌹
  


     

Tuesday, December 21, 2021

స్థాయి....?

       టీ వీ లో ఏదో ఆడియో ఫంక్షన్ ప్రత్యక్ష ప్రసారం వస్తోంది.అంతా కోలాహలంగా, కన్నుల పండుగగా జరిగిపోతోంది. ఇంతలో ఆ చిత్రంలో నాయిక పాత్ర పోషించిన నటీమణి ప్రవేశించింది. అందరూ ఆమె చుట్టూ గుమికూడి, ఆమెతోపాటు నడుస్తూ ఏవేవో  ప్రశ్నలడుగుతూ వస్తున్నారు. అంతా బాగుంది, కానీ ఆ నటీమణి వస్త్రధారణ...!  ఏమిటో !.. అభ్యంతరకరంగా అనిపించింది ! అంత  ఎక్స్పోజింగ్ దుస్తులు అవసరమా? అని అందరూ అనుకునేలా ఉన్నాయాకాస్ట్యూమ్స్ !    సినిమాల్లో అయితే సీన్ కు తగినట్లు చేస్తున్నాం, సిచువేషన్స్ డిమాండ్ చేస్తే తప్పదు కదా! అంటుంటారు వీళ్ళు ! మరి ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్లలో ఏ సిచువేషన్స్ డిమాండ్ చేస్తాయో వాళ్లని? అర్థం కాదు. కొందరైతే సినిమాలో కూడా అంత ఎక్స్పోజింగ్ చేయరు, కానీ బయటికి వస్తే చాలు ఇలా తయారై వస్తారు. చుట్టూ జనం ఉండగా అలాంటి దుస్తుల్లో కొందరు  బాగా ఇబ్బంది పడడం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది.
    వేలాది మంది వస్తారు ఇలాంటి సందర్భాలకి. ఆహుతులూ  ఎందరో ఉంటారు. వేదికపై గౌరవనీయ పెద్దలూ ఉంటారు. అలాంటి చోట్లకి   సినిమా తారలైనంత   మాత్రాన అలా రావాలని ఉందా? అందువల్ల చూసే జనాలకి వాళ్ల మీద సదభిప్రాయం తొలగిపోయే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచన రాదా వీళ్ళకి!
     ఇలాగైతేనే సినిమా అవకాశాలు ఇంకా వస్తాయన్న   అభిప్రాయం ఏమైనా వాళ్లకు ఉంటే అది అపోహ, భ్రమ మాత్రమే !  అది కొంత కాలం ఉంటే ఉండవచ్చు. ప్రేక్షకాదరణ పొందాలంటే ముఖ్యంగా నటీమణులు కొన్ని పరిమితులు పాటించాలి. ఒక స్థాయికిచేరుకోవడం ఎంత కష్టమో... దాన్ని నిలుపుకోవడం అంతకన్నా కష్టం. బాధాకరమైన విషయం ఏమిటంటే కొందరు హీరోయిన్ లు అగ్ర స్థానానికి చేరిన తర్వాత అది  నిలుపుకునే ప్రయత్నాలు చేయడం లేదు.
    ' శంకరాభరణం'  చిత్రానికి ముందు నటీమణి మంజుభార్గవి వ్యాంప్ పాత్రలు, డాన్స్ చేయడాలూ వరకే పరిమితమై ఉండేది. ఆ చిత్రం తర్వాత ఒక్కసారిగా ఆమె స్థాయి  ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. కానీ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే--- అటు పిమ్మట ఆ స్థాయిని దిగజార్చుకోలేదావిడ! దర్శకనిర్మాతలు కూడా నాయిక పాత్రలూ, ప్రధాన పాత్రలూ మాత్రమే  ఇవ్వడం మొదలెట్టారు.. ఆ విధంగా ఆమె స్థానాన్ని పదిల పరుచుకున్నారామె. 
  "  దర్శకులు విశ్వనాధ్ గారు నాకిచ్చిన గౌరవం, స్థాయి కాపాడుకోవాలి. వారి పేరు ఎప్పటికీ చెడగొట్టను  నేను" అంటూ మంచి అవకాశాలు మాత్రమే అంగీకరిస్తూ వచ్చారు. ఇప్పటికీ సినిమాల్లో, సీరియల్స్ లో అడపాదడపా తనకు దగ్గ హుందా   గల పాత్రలు మాత్రమే చేస్తూ అందరి హృదయాల్లో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. అదీ.. చేరుకున్న స్థాయిని నిలుపుకోవడం అంటే !
    ఇప్పటి తారల్లో కూడా  అలాంటి కోవకు చెందినవారు కొందరు లేకపోలేదు. మీనా, రమ్యకృష్ణ, ఆమని, భూమిక మొదలగువారు వివాహానంతరం కూడా వారికి తగ్గ పాత్రల్లో  నటిస్తూ చక్కటి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. నేటి తరం నాయికలు వారందరినీ ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందేమో !!

                    🌺🌺🌺🌺🌺🌺🌺🌺

 

Thursday, December 16, 2021

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..2.. పసి మనసులు.. పసిడి మనసులే.. !

🌺
      పసితనం ఎంత కల్మష రహితం ! ఆ చిరునవ్వుల్లో ఎంత స్వచ్ఛత ! కల్లాకపటం ఎరుగని ఆ చూపులు వారికే సొంతమనుకుంటా. ఏనాడో చెప్పాడో సినీకవి--
     "  పుట్టినపుడు మనిషి మనసు తెరచి ఉండునూ 
        ఆ పురిటికందు మనసులో దైవముండునూ 
        మాయ మర్మమేమి లేని బాలలందరూ
        ఈ భూమి పైన వెలసిన పుణ్య మూర్తులే
        పిల్లలూ దేవుడూ చల్లనివారే
        కల్లకపటమెరుగనీ కరుణామయులే "
--- అని 
     అక్షరాలా నిజం ! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నా ఉద్యోగ జీవితం ప్రారంభమైనది ఓ ప్రాథమిక పాఠశాల స్థాయి పిల్లలకు బోధించడం తోనే. చదువు పూర్తయిన వెంటనే ఒకటవ తరగతి విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు బోధించే  చక్కటి అవకాశం నాకు లభించింది. మొదట్లో ఇంత చిన్న పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలి, అసలు వీళ్లకు అ ఆ లు, గుణింతాలు ఎలా నేర్పాలి రా దేవుడా, అని ఫీలయినా, కొద్ది రోజుల్లోనే ఆ అభిప్రాయం నాలో తుడిచిపెట్టుకుపోయింది. కాస్త దగ్గరకు తీస్తే చాలు, టీచర్ ను  అల్లుకుపోయే సున్నిత మనస్కులు ఆ వయసు పిల్లలంతా ! 
   ఓ  విద్యాధికారి అప్పట్లో స్కూల్ ను సందర్శించి, ఆ సందర్భంగా ఓ మాటన్నారు, 
First class teachers are 'first class👌 ' teachers అని --  
 ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయులు ప్రధమ శ్రేణికి చెందిన ఉపాధ్యాయులనీ వారిని చిన్న చూపు చూడడం, తక్కువగా అంచనా వేయడం తగదనీ  అన్నారు. అభివృద్ధి చెందిన అగ్రదేశాల్లో ఎలిమెంటరీస్కూల్ టీచర్లకు కళాశాల అధ్యాపకుల కంటే లభించే గౌరవం సముచితంగా ఉంటుందని ఆ సందర్భంగా అందరికీ చెప్పారు.
    ఇక -- చిన్న పిల్లలే కదా అని వాళ్లను తక్కువగా అంచనా వేశామంటే పప్పులో కాలేసినట్టే నండోయ్ ! టీచర్ ను నఖశిఖ పర్యంతం నిశితంగా గమనించడంలో వాళ్ళు దిట్టలు సుమండీ! టీచర్ ఈ రోజు ఏ చీర కట్టుకుందీ, సార్ ఈరోజు ఏ డ్రెస్ తో వచ్చాడు -- దగ్గర్నుండీ వాళ్ళ ప్రతీ  కదలికనూ ఆ చిన్నారులు గమనించడం నా అనుభవంలో చవి చూశాను.మరొక్క  విషయం... గురువుల్ని అభిమానించడం లో, ఇష్టపడడం లో వారికి వారే సాటి!
   వాళ్లకి టీచర్ ఏది చెప్తే అది రైటు. అంతే! ఏదైనా ఒక పదం సరిగ్గా పలకకపోతే ఇంట్లో అమ్మో, నాన్నో--
" అలా కాదమ్మా, తప్పు,  ఇలా పలకాలి" అంటే
" పోమ్మా, నీకేం తెలీదు, మా టీచర్ ఇలాగే చెప్పింది "
 అనే గడుగ్గాయిలు  వాళ్ళు. అంటే, టీచర్ మీద అంత నమ్మకం అన్నమాట! అందుకే బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా అప్పట్లో నేను గ్రహించాను. ఎందుకంటే--- ఆ లేత వయసులో సమాచారం తప్పుగా వాళ్లకు చేరిందంటే అది వాళ్ల మెదడులో అలాగే స్థిరంగా నిలిచి పోతుంది మరి ! అది  చెరిగిపోవడమూ అంత సులభం కాదు.
   ప్రభుత్వ ఉపాధ్యాయినిగా చేరాక ఓ చిన్న గ్రామంలో కొంత కాలం పాటు పని చేశాన్నేను. అక్కడ సాయంత్రం బడి వదలగానే 4, 5 తరగతుల పిల్లలు టీచర్ల బ్యాగులు చటుక్కున లాక్కుని వాళ్ల భుజాలకు తగిలించుకుని మా ముందు నడుస్తూ, బస్సు దాకా వచ్చి, మమ్మల్ని ఎక్కించాక  గానీ వెనుదిరిగే వారు కాదు. వాళ్ళకదో  ఆనందం! 
    ఈ అమాయకత్వం, కల్లాకపటం లేనితనం, గురువుల పట్ల ప్రేమాభిమానాలు ప్రాథమిక విద్య ముగిసేదాకా మాత్రమే ఉంటాయనేది కూడా నిజంగా నిజం! హై స్కూల్ పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు. వయసు పెరుగుతోంది కదా, కాస్త  మొహమాటం, భేషజం వచ్చి చేరడం మొదలవుతుంద న్నమాట !
    అలాగే, అంతవరకూ బుద్ధిగా ఉన్న పిల్లలు మెల్లి మెల్లిగా క్లాసులో అల్లరి చేయడం కూడా నేర్చేసుకుంటారు. బాగా గమనిస్తే, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, హై స్కూల్ విద్యార్థులకు ఈ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వయసు ప్రభావం మరి ! క్రమంగా వారిలో పసితనపు  ఛాయలు తొలగిపోతూ ఆ స్థానంలో ఒకలాంటి గడుసుదనం, ఆరిందాతనం అలా అలా ఇంకా ఎన్నెన్నో వచ్చి చేరిపోతాయి! ఫలితంగా -- లోకం పోకడ వంట బట్టి వాళ్లూ మామూలు మనుషుల కేటగిరీలోకి వచ్చేస్తారు ! 
      " వయసు పెరిగి  ఈసు కలిగి మదము హెచ్చితే 
         అంత మనిషిలోని దేవుడే మాయమగునులే "

--- అలాగన్నమాట ! అది అత్యంత సహజం కూడా. వారికి తగినట్లుగా బోధించే ఉపాధ్యాయులు కూడా మారాల్సి వస్తుంది, తప్పదు ! దండించడం, క్రమశిక్షణ తెలియజేయడం, కాస్త రిజర్వుడు గా ఉండటం... ఇలా ఎన్నో వీళ్ళు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న, నేర్చుకున్న విషయాలే !
     నేను పనిచేసిన ప్రతీచోటా ఓ' బెస్ట్ బ్యాచ్' తప్పనిసరిగా ఉండేది. ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా చేస్తున్న రోజుల్లో అలాంటి ఓ బెస్ట్ బ్యాచ్ ఒకటి ఉండేది. ఆ బ్యాచ్ పిల్లలు ఐదవ తరగతి పూర్తయి పాఠశాల వదలి వెళుతున్న సందర్భంగా చిన్న పార్టీలాంటిది చేసుకుని  ఉపాధ్యాయులందరితో ఓ గ్రూప్ ఫోటో తీయించు కోవడం జరిగింది. వారి కోరిక మేరకు ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి ఆఫీస్ రూమ్ లో తగిలించాను. చాలా సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ స్కూలుకు వెళ్ళినప్పుడు, అదే రూమ్ లో గోడకున్న ఆ ఫోటో చూసి ఎంత సంతోషించానో ! కొన్ని జ్ఞాపకాలను ఫోటోల్లో బంధించడం ఎంత మంచి ప్రక్రియో కదా అనిపించింది నాకప్పుడు!
   ఏదిఏమైనా... అప్పుడప్పుడూ ఆనాటి పసి పిల్లలు పెద్దలై, జీవితంలో సెటిలై పోయి.. అనుకోకుండా ఏ దారిలోనో, లేదా ఇంకా ఏదో సందర్భంలో కలిసి అలనాటి ముచ్చట్లు నాతో ప్రస్తావించినప్పుడు కలిగే అనుభూతి, ఆనందం ఎంతో మధురం!సుమధురం !!😊🙂😊

                  🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺














Saturday, December 11, 2021

గాడి తప్పితే..... !


    చిన్నతనంలో చుట్టుపక్కల పిల్లలతో కలిసి హాయిగా గంతులువేస్తూ, పరుగులు పెడుతూ ఆడుకోవడం మహా ఇష్టంగా ఉండే విషయమే  ఎవరికైనా.. స్కూల్ నుండి సాయంత్రం రావడం ఆలస్యం, ఇక అదే పనిగా ఉండేది పిల్లలకి. 
--- ఇదంతా  నలభై, యాభై సంవత్సరాల క్రితం మాట! 
  అప్పట్లో మరో ఇతర వ్యాపకం అంటూ ఏదీ  ఉండేది కాదు మరి !నా  హైస్కూల్ విద్య ప్రారంభమయ్యేసరికి అక్కడక్కడా కొన్ని ఇళ్లలో రేడియో ప్రత్యక్షమైంది. అదో అద్భుతం ఆ రోజుల్లో !ఆ వయసు పిల్లలకి, ఇంకా పెద్దలకి కూడా కాలక్షేపం దొరికింది. 
    మరో పది సంవత్సరాలు గడిచేసరికి టీవీ అన్నది ఆవిర్భవించింది.  అది జనాల్లోకి చొచ్చుకుని రావడానికీ, ప్రతీ ఇంట్లో తిష్ట వేయడానికీ మరో పదేళ్లు పట్టింది. అది మరో అద్భుతం ! అంతవరకూ మాట మాత్రమే వినిపించేది కాస్తా, మాట్లాడే మనుషులు కూడా దర్శనమివ్వడం! ఆహా ! ఎంత విచిత్రం !అనుకున్నారు జనాలంతా. అందుకేనేమో, రామాయణ మహాభారతాలు సినిమాలుగా కోకొల్లలుగా వచ్చినా టీవీ రామాయణ మహాభారతాల్ని పడీ  పడీ చూశారు అంతా! 
   మెల్లిగా  రేడియో స్థానం,ప్రాబల్యం  తగ్గిపోయి ప్రతి ఇంటా బ్లాక్ అండ్ వైట్ టీవీ కొలువుదీరి పోయింది! ఆ ముచ్చట కొంతకాలం కొనసాగాక, కలర్ టీవీ పుట్టుకొచ్చి,  కొత్త వింత పాత రోత అన్నట్లు, బ్లాక్  అండ్ వైట్ టీవీ  కాస్తా మూలకు నెట్టివేయబడింది.అంతే ! అంతా రంగులమయం! అంతవరకూ ఒకే ఒక్క  ఛానల్ తో సరిపెట్టుకునే జనాలకు కన్నుల పండుగ అయింది. బోల్డన్ని చానల్స్! పుట్టుకొచ్చి, పాటలే పాటలు, సినిమాలే  సినిమాలు! అంతేనా, కార్యక్రమాల లిస్టు రాసుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది మరి!  దాంతో సినిమాల కోసం థియేటర్లకు పరుగులు తీసే జనాభా తగ్గుముఖం పట్టిందంటే ఒప్పుకొనే  తీరాలి.
   రేడియో ఒక అద్భుతం, టీవీ అంతకన్నా అద్భుతం! అంతటితో ఆగిందా! టెక్నాలజీ రోజురోజుకీ పెరిగి పెరిగి... సెల్ ఫోన్ లు  వచ్చేశాయ్. అంతక్రితం ఎక్కడో ఒకచోట ల్యాండ్ ఫోన్స్ ఉండే పరిస్థితి పోయి, ప్రతివారి చేతిలోకీ ఓ ఆభరణంలా సెల్ ఫోన్ వచ్చేసింది. ఎవరు ఎప్పుడు ఎక్కడున్నా ఎవరితోనైనా మాట్లాడే సౌలభ్యం వచ్చేసింది అందరికీ.
    సరే, ఇకనైనా ఫుల్ స్టాప్ పడిందా ! స్మార్ట్ ఫోన్ అవతరించింది ! ఇంకేముంది, అరచేతిలోనే సమస్త విశ్వదర్శనం ! రేడియో, టీవీలో... నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఆయా కార్యక్రమాలు వినగలం, చూడగలం. కానీ ఈ స్మార్ట్ ఫోన్లో -- ఏది కావలిస్తే అది, ఎప్పుడు  కావలిస్తే అప్పుడు చూసుకునే  సౌలభ్యం, వద్దు అనుకుంటే అప్పటికి ఆపడం, కావాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ నుండి' కంటిన్యూ' చేయడం ! ఆహా ! సాంకేతికతా ! నీకు జోహార్ ! అనుకున్నారంతా మళ్లీ!
🌷  * యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్..
...ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ! వాడుకున్న వారికి వాడుకున్నంత !
అంతెందుకు, ఇలా ఆర్టికల్స్ అన్నవి ఆన్లైన్ లో రాయాలన్నా, మన ఆలోచనలు నలుగురితో పంచుకోవాలనుకున్నా అరచేతిలో ఇమిడిపోయి చకచకా ఎవరికి వారే టైపు చేసుకుంటూపోయే ఓ అద్భుతమైన ప్రింటింగ్ మెషిన్ కూడా !  
* అంతే కాదు, ఎక్కడో ఖండాతరాలలో ఉన్న ఆప్తులను ఎదురెదురుగా చూస్తూ మాట్లాడుకోవడం!
*  ఇంకా ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో పొందే సౌలభ్యం. 
*  ఇంటినుంచి కదలకుండా ఆన్లైన్ లో షాపింగ్ లూ, బిల్లులు చెల్లించడాలూనూ ! 
---- ఒకటా, రెండా... లెక్కలేనన్ని సౌకర్యాలు ! ఉదాహరించినవి కొన్ని మాత్రమే !సరే,  ఇంతవరకూ టెక్నాలజీ పరుగు ప్రగతి పథంలో దూసుకుపోవడం హర్షణీయం. సదా అభిలషణీయం కూడా..
కానీ --- ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అనూహ్యంగా పెరిగిపోయిన ఈ సాంకేతికత మానవాళికి ఎంత ఉపయోగకారిగా ఉంటున్నదో అంత ప్రమాదకారిగా కూడా అయి కూర్చోవడం అత్యంత బాధాకరంగా పరిణమించిందన్నది కూడా పచ్చి నిజం ! 
*  చేతిలో ఉంది కదాని దుర్వినియోగం చేయడం, సైబర్ నేరాలకు పాల్పడడం, అమాయకుల్ని ఉచ్చు లోకి లాగడం, ఎన్నెన్నో మోసాలకు దారులు వెతకడం...నిత్యం చూస్తున్నాం. ఇది అందరికీ విదితమే. 
*  మరోవైపు.. యువతే గాదు.. చిన్న పిల్లలు సైతం వీటివల్ల చెడు మార్గాల్ని అనుసరిస్తూ  విపరీత ప్రవర్తనలకు లోనుకావడం! అశ్లీల వీడియోలు చూడ్డమనే వ్యసనానికి బానిసలై చిన్నపిల్లల్ని' 'బలిచేయడం'!
*  మైనర్ బాలికలతో'నీలి ' చిత్రాలు తీసి వాటితో కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారని  ఇటీవలి వార్త !
*  ఇంకా.. స్త్రీల పై లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ చేయడాలూ... వీటికి కొదువే లేదు. 
 ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంకా వెలుగులోకి వస్తున్నవి చాలానే ఉన్నాయి.--- ఇదంతా సాంకేతికను దుర్వినియోగం చేయడం కాదా !
---  ఇది నాణేనికి మరో వైపు !  ఏదైనా హద్దుల్లో ఉంటేనే మంచిగా, పద్ధతిగా ఉంటుంది. సాంకేతికత ప్రగతి పథంలో నడవాలి తప్ప పెడదారిలో కాదు. అది 
గాడి తప్పితే పెను ప్రమాదమే అని వర్తమానంలో జరుగుతున్న ఎన్నో విపరీత పోకడలు నిత్యం రుజువు చేస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తు సమాజాన్ని ఊహించలేం..!!
     సాంకేతికత అన్నది అభివృద్ధికి సోపానం. అత్యవసరం కూడా.  సదా ఆహ్వానం పలకాల్సిందే. కానీ, దుర్వినియోగం తగదు. నేర ప్రవృత్తి నివారించాలి. నిర్మూలించే దిశగా ప్రయత్నాలు  జరగాలి. 
                           🌹🌹🌹🌹🌹
         


 

  


 

Wednesday, December 8, 2021

మేధస్సు

క్షయమన్నదెరుగదు  
అదో  అక్షయ పాత్ర  !
ఎంత తోడినా తరగని 
ఆలోచనల పుట్ట  !
అదే  మనిషి మెదడు ! 
అది  నిత్యం మండుతున్న  కొలిమి !
జ్ఞాపకాల దొంతరలెన్నో దాగిన నిధి 
కదిలిస్తే చాలు అదో తేనెతుట్టే  !
ఆపై చుట్టుముట్టే ఆలోచనల వృష్టి 
కవిచే కలం పట్టిస్తుంది  !
కథకునితో కథ రాయిస్తుంది  ! 
వక్తల నోట మాటల తూటాల్ని 
సంధింపజేస్తుంది ! ఇంకా, ఇంకా 
నూతన ఆవిష్కరణలకు 
నాంది పలుకుతుంది  !!
అవును మరి ! అది మనిషి మేధస్సు  !
మనిషికి దేవుడిచ్చిన దివ్య  వరం 
మనిషికే పరిమితమైన  మహాద్భుతం !!
                🌹🌹🌹🌹🌹🌹🌹