Monday, June 28, 2021

సొంతంగా కొనుక్కో, సంతోషం సొంతం చేసుకో.... కథ లాంటి ఓ నిజం !

 "  ఇది లేటెస్ట్ మోడల్ టీవీ, ఈ సోఫా సెట్ ఏమో కిందటి నెల షాపులోకొచ్చిందట, ఇంకా ఆ డైనింగ్ టేబుల్, వాషింగ్ మెషిన్, కుక్కర్.... " 
" ఆగాగు.. "
చెప్పుకుంటూపోతున్న రాజేష్ ను మధ్యలోనే ఆపేశాడు విశాల్. 
"... ఏమిటీ, ఇవన్నీ ఇన్స్టాల్ మెంట్ బేసిస్ మీద కొన్నావా ఏమిటి? "
" ఆ అవసరం నాకేమిటి ! అన్నీ మా మామగారే ఇప్పించారు... "
" అవునా, కట్నం బాగానే ఇచ్చారన్నావుగా, మరి ఇవన్నీ..."
" కానుకలు... " నవ్వుతూ అన్నాడు రాజేష్. 
" అంతా కలిపి బాగానే కొట్టేసావ్, " లోలోపల అనుకున్నాడు విశాల్.
   రాజేష్ కు రెణ్ణెళ్ల క్రితం పెళ్లయింది. విశాల్ పెళ్ళికి వెళ్ళలేకపోయాడు. ఈరోజు ఆఫీస్ అయ్యాక విశాల్ ను  వెంటబెట్టుకుని ఇంటికి తీసుకు వచ్చాడు రాజేష్.మూడు నెలల క్రితం అతను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఓసారి వచ్చాడీ ఇంటికి విశాల్. అప్పుడు ఇల్లంతా ఖాళీగా ఉంది. రెండు కుర్చీలు, ఓ చిన్న టీ పాయ్ తప్ప.
" ఇప్పుడివన్నీ చూపించడానికే తనని బలవంతంగా లాక్కువచ్చాడులా  ఉంది " అనుకున్నాడు విశాల్.
 ఈలోగా రాజేష్ భార్య కాఫీ కప్పులతో వచ్చింది.
" నా మిసెస్..   ప్రమద.. " అంటూ పరిచయం చేశాడు రాజేష్. అతి మామూలుగా ఉన్నా ఎంతో ప్రసన్నంగా ఉంది ఆ అమ్మాయి. విశాల్ కు నమస్కరించి లోనికి వెళ్లి పోయింది ప్రమద. 
" అవునూ, నెల క్రితం పెళ్లిచూపులకెళ్లానన్నావ్, ఏమయిందీ, " అడిగాడు రాజేష్.
" దాదాపు సెటిల్  అయిపోయినట్లే. అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. టైపిస్ట్ గా చిన్న ఉద్యోగం కూడా చేస్తోంది. ఆయనకిద్దరూ అమ్మాయిలే. పెద్దగా కట్నం ఇచ్చుకోలేనని ముందే చెప్పేశాడు. కుటుంబం బాగుంది. నాకు అమ్మాయి నచ్చింది. ఇంట్లో కూడా ఒప్పుకున్నారు..."
" అయ్యో.. ఎందుకలా!.. ఇంకాస్త ఆగితే పెద్ద సంబంధమే వచ్చేదేమో కదా,.. " మధ్యలో అందుకుని అన్నాడు రాజేష్.
" వద్దు రాజేష్,.. అమ్మాయి నచ్చినప్పుడు మిగతా విషయాల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. అందుకే ఓకే చెప్పేసాను. " 
" మరీ, ఏమీ లేకుండా... ఎలా!" 
" నాకు ఉన్నదాంట్లోనే అన్నీ అమర్చుకుంటాను. భార్య తెచ్చేవేవీ  నేను ఆశించ దలుచుకోలేదు.. ఏదైనా ఎంత చిన్నదైనా సొంతంగా కొనుక్కుంటేనే నాకు తృప్తిగా, సంతోషంగా ఉంటుంది రాజేష్... ఇక వస్తా మరి..." అంటూ లేచాడు.
  రాజేష్ కు సూటిగా తగిలాయా మాటలు. అయినా లెక్క చేయనట్లు తల తిప్పుకున్నాడు.
   లోపల ప్రమదకు వీరి సంభాషణ అంతా చెవిని బడుతూనే ఉంది.
" ఇతన్ని చేసుకోబోయే ఆ అమ్మాయి  ఎంత  అదృష్టవంతురాలు ! నా పెళ్ళికి మా నాన్న చేసిన అప్పులు తీరాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఈలోగా చెల్లి తానూ పెళ్ళికి సిద్ధంగా ఉంటుంది. పైగా తమ్ముడి చదువొకటి ! " 
   తన పెళ్లి తర్వాత, కూతురి పెళ్లి చేశానన్న ఆనందం ఆయన మొహంలో ఎక్కడా తనకి కనిపించలేదు. తండ్రి దీన  వదనం గుర్తొచ్చిన ఆమె కళ్ళలో పల్చటి నీటి తెర !!

******************************************
            🌺   భువి భావనలు , 🌺
******************************************






Sunday, June 20, 2021

She & periods..... ఓ షార్ట్ ఫిల్మ్ చూశాక....

   కొద్ది రోజుల క్రితం అనుకోకుండా ఓ షార్ట్ ఫిల్మ్ చూశాను. అనుకోకుండా అని  ఎందుకంటున్నానంటే స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూడటం కొద్దికాలంగా బాగా తగ్గించేశాను. అయిష్టతతో కాదు, నా కంటి చూపు గురించీ, ఇంకా నా శారీరక ఆరోగ్యం గురించీ ఆందోళనతో!  అందుకే రోజులో  ఏ కొద్ది సమయమో దాని కై కేటాయించేశాను. అలా... ఓ మధ్యాహ్నం తీరిక దొరికి యూట్యూబ్ తిప్పుతూ ఓ చోట ఆగిపోయాను. అదో షార్ట్ ఫిల్మ్. చూడడం మొదలెట్టాక చివరిదాకా వదలకుండా ఎంతో ఆసక్తిగా చూసేశాను. 
    నలుగురున్నపుడు మాట్లాడుకోవడానికి కూడా సంశయించే, బిడియపడే  ఓ విషయం ! పైగా స్త్రీలకు సంబంధించిన సున్నితమైన విషయం కథావస్తువుగా తీసుకోవడం ఓ విశేషమైతే, దానికి దృశ్యరూపమిచ్చిన రచయిత, నిర్మాత, దర్శకుడు -- ముగ్గురూ మగవారే కావడం మరో గొప్ప విశేషమని నేను అభిప్రాయపడుతున్నాను. వారికి అభినందనలు చెప్పక తప్పదు.
 ఇంతకీ, ఆ షార్ట్ ఫిలిం -- she & periods. 
 విషయంలోకెళ్తే -- మూడే మూడు పాత్రలు-- భార్య, భర్త, ఓ సహోద్యోగి -- కేవలం పదినిమిషాల వ్యవధి -- అంతే ! క్లుప్తంగా చెప్పాలంటే --
 🌹భర్త సిద్ధు ఆఫీసుకు బయలుదేరుతూ, భార్యనేదో  అడిగితే ఆమె చిరాగ్గా సమాధానమిస్తుంది. దేనికి అంత కోపంగా ఉన్నావంటే " నేనేమీ కోపంగా లేను"అని ఇంకా  చిరాగ్గా అంటుంది. ఎందుకలా ఉన్నావంటే " ఏమీ లేదు " అంటుంది విసుగ్గా. సరేనంటూ అతను బయటికెళ్ళిపోతాడు. దారిలో అతని కొలీగ్ కోసం ఆగి, " నిన్నెందుకు ఆఫీస్ కు రాలేదు, వచ్చిఉంటే నిన్ననే పని పూర్తయేది కదా, " అంటాడు. 
" రమ్యకు పర్సనల్ ప్రాబ్లెమ్, తనని వదిలి రావాలనిపించలేదు, " అంటాడతను. 
   దాంతో అకస్మాత్తుగా సిద్ధు కేదో స్ఫురిస్తుంది. అతని పెదాలపై చిరునవ్వు ! వెంటనే బైక్ కొలీగ్ కిచ్చేసి, పరిగెత్తుకుంటూ ఇంటికెళ్తాడు. దారిలో, కేర్ ఫ్రీ పాకెట్, భార్య కిష్టమైన చాక్లెట్స్ కొని పట్టుకెళ్తాడు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని లాలనగా మాట్లాడతాడు. 
" ఎప్పుడైతే ఏమైందీ అని అడిగితే మీరేమీ చెప్పరో అప్పుడే అర్థం చేసుకోవాలంట, అమ్మ చెప్పింది..."
అంటూ వాళ్ళమ్మ స్త్రీ సమస్య గురించి చెప్పిన మాటలు ఆమెతో పంచుకుంటాడు. ఇంకా --

"... మీరింత బాధ ఎలా భరిస్తారు? మాకు అసలు ఏమీ తెలీదు. తెలిసేసరికి జీవితకాలం పూర్తయిపోతుంది.." అంటాడు.🌺
  తక్కువ పదాలతో హృదయాన్ని హత్తుకునే  విధంగా విషయాన్ని వ్యక్తీకరించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. నటించిన ఇద్దరూ తమ సహజ హావభావాలతో సన్నివేశాన్ని హృద్యంగా పండించారు. ఎవరా అని ఆసక్తిగా  టైటిల్స్ చూశాను. పవన్ సిద్ధు & సోనియా సింగ్.
   అభిరుచి కలిగిన చలన చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల ద్వారా జనాలకు ఏదో ఒక సందేశాన్ని తరచూ అందజేస్తుంటారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో కూడా నేటి పెళ్లికాని యువకులకు, ( అయిన వాళ్లకు కూడా ) ఓ చక్కటి సందేశం అంతర్లీనంగా ఉంది.
   పీరియడ్స్ అన్నది అనారోగ్యం కాదు. కానీ, ఆ రోజుల్లో శారీరకంగా ఆమెకు విశ్రాంతి అవసరం. ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే  -- ఓవైపు విశ్రాంతి కరువై, మరోవైపు పని ఒత్తిడి ఎక్కువై ఫలితంగా కోపం, అసహనం, చిరాకు అన్నీ తోడై ఆమెను వేధిస్తుంటాయి. అందుకేనేమో, పూర్వపు రోజుల్లో తాక రాదంటూ దూరంగా ఉంచేవాళ్లు. ఇది మూఢాచారమని కొట్టి పారేస్తుంటారు. కానీ స్త్రీ మానసిక స్థితి పట్ల అవగాహనతో అలా చేసేవారనిపిస్తుంది. 
      పెళ్లి కావలసిన యువకులు ఇలాంటి వీడియోలు చూస్తే కొందరిలో నైనా భార్య పట్ల ఆలోచన మొదలయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ, అమ్మాయిలు చూడ్డం వల్ల ఓ ప్రమాదమూ లేకపోలేదండోయ్ ! తనకు రాబోయే భర్త కూడా ఇంత ' కేరింగ్ ' గా ఉండాలంటూ ఆమె ఆశించిందంటే పాపం ఆ ' పిచ్చి పిల్ల' పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే, అందరికీ అలాంటి పతిదేవుడు దొరకడు గాక దొరకడు!  మానసిక పరిపక్వత గల్గిన అమ్మాయిలు అర్థం చేసుకోగలిగితే ఓకే. అలాంటి మగవాళ్ళు  మొత్తం మీద ఏ ఐదు శాతమో ఉండొచ్చు ! ఇంటిపనీ, వంట పనీ అంతా ఎంతో ఓపిక చేసుకుని ముగించి, అన్నీ టేబుల్ పై సిద్ధం చేసి పెడితే కనీసం ఆమె ముఖంలోని అలసట నైనా గుర్తించక, 
" ఏమిటీ, ఈరోజు వంటిలా తగలడిందీ... " అనే పురుష పుంగవులూ లేకపోలేదు. ఇలాంటి వీడియోస్ వల్ల కొద్ది శాతం మగవాళ్లయినా మార్పు దిశగా ఆలోచించవచ్చేమో !అదే జరిగితే ఇలాంటి వీడియోలు తీసిన ప్రయోజనం సిద్దించినట్లే !
    షార్ట్ ఫిల్మ్ ద్వారా చక్కటి ఆలోచనకు ప్రాణం పోసిన నిర్వాహకులకు, నటీనటులకు మరోసారి అభినందనలు. 
 ఇకపోతే -- 
ఈ వీడియో అలా చూశానో లేదో వెంటవెంటనే ఇదే కోవకు చెందిన మరికొన్ని వీడియోలు ఇతర భాషలవి కూడా టపటపా మంటూ వచ్చి పడిపోయాయి ! అది వేరే విషయం !

********************************************
                  🌺 భువి భావనలు 🌺
********************************************











Friday, June 11, 2021

నీలాల నింగిలో తిరిగేటి జాబిల్లి నింగికేమిస్తుంది ఓలి? వరకట్నం, అదనపు కట్నం.....?. ఆలోచిద్దాం

    ప్రేమతో తమకుతామే ఇష్టపూర్వకంగా ఎదుటివారికిచ్చేది ' కానుక '.పీడించి, బలవంతంగా తీసుకునేది కానుక ఎలా అవుతుంది? కట్నకానుకలనేవి పరస్పరం ప్రేమాభిమానాలతో ఇచ్చిపుచ్చుకునేవిగా ఉండాలి.  అంతేగానీ మనసుల్ని గుచ్చేలా ఉండకూడదు.  ఈ అంశం గురించి కాసేపు ---
 అదనపు కట్నం కోసం భార్యను వేధించి చివరికి హత్య చేసిన ఓ భర్తకు ఉరి శిక్ష విధించారంటూ కొద్దిరోజులక్రితం ఓ వార్త వచ్చింది. హత్యానంతరం మూడు సంవత్సరాలకు ఈ తీర్పు ఇచ్చారంటూ కథనం !
  పెళ్లయి మూణ్ణెళ్లు తిరక్కుండానే అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు హింసిస్తూ కోడల్ని పుట్టింటికి తరిమేశారంటూ ఒక చోట, ఇద్దరు పిల్లల తల్లిని కట్నం కోసం వేధిస్తూ తల్లిదండ్రుల వద్దకు పంపారంటూ మరో ఘనుడి ఘనత గురించి మరోచోట! వరుసగా ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావని దూషించి, వారి ఖర్చులు పుట్టింటి వారే భరించాలంటూ ఇంటి నుంచి గెంటేసిన భర్త-- అంటూ ఇంకోచోట !  ఇలా రకరకాల వార్తాకథనాలు ! ప్రదేశాలు వేరైనా దాని అంతర్లీన సారాంశం ఒక్కటే !
  వరకట్నమే  నేరమని ప్రభుత్వం నిషేధిస్తే, మరీ అదనపు కట్నం గోలేమిటి? సంసారమనే బండికి భార్య, భర్త రెండు చక్రాల వంటివారు అంటారు . రెండూ సజావుగా సాగితేనే బండి కదులుతుంది. భర్తలో సగం భార్య అంటారు.జీవితభాగస్వామి అంటారు. కష్టసుఖాల్లో ప్రతిక్షణం భాగం పంచుకునే అలాంటి ఇల్లాలి కి ఎంత విలువ ఇవ్వాలి! ఎలా గౌరవించాలి! 
  పెళ్లి తర్వాత పుట్టి పెరిగిన ఇంటినీ, ఊరిని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రుల్నీ వదలిపెట్టి, ముక్కూ మొహం తెలీని ఓ మగాడి  చేయిపట్టుకుని అమాయకంగా అతని వెంట నడిచి మరో ఇంటికి ఓ ఆడపిల్ల తరలివెళ్తోందంటే కేవలం అతని పై నమ్మకం! అన్ని వేళలా తనకు తోడునీడగా, రక్షణగా ఉంటాడన్న కొండంత నమ్మకం! ఆ భరోసా ఆమెకు కల్గించడం భర్తగా అతని  బాధ్యత. ఒకప్పుడైతే కుటుంబ విలువలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. చిన్న వాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్లు సర్ది చెప్పేవాళ్లు. కానీ, కాలక్రమేణా విలువలన్నవి పతనావస్థకు చేరుకుని మనుషుల్ని దిగజార్చేశాయి. 
  భార్య అంటే ఏమిటో  ఓ చక్కటి నిర్వచనం ఓ చలన చిత్రంలో బహు చక్కగా తెలియజేశారు.
* కొడుకన్న వాడికి కష్టం వస్తే అతని కోసం తల్లిదండ్రీ, తోబుట్టువులు బాధపడటం, విపరీతంగా ఆవేదన చెందడం అత్యంత సహజం. ఎందుకంటే వారి మధ్య రక్త సంబంధమన్నది ఉంటుంది కాబట్టి. కానీ, ఏ సంబంధం లేకుండా తనతో మూడుముళ్ల బంధం మాత్రమే ఉన్న మనిషి భర్త అన్న వాడికోసం బాధపడ్డం, తన సర్వస్వం  ధారపోయడమన్నది చాలా గొప్ప విషయం! అదే భార్య అంటే "! నిజంగా ఎంత గొప్పగా చెప్పారు భార్య స్థానం గురించి! 
   అలాగే -- వరుసగా ఆడపిల్లల్ని కన్నదని భార్యను పుట్టింట్లో దిగబెట్టిన ఓ బావ గారితో అంటాడు ఓ బావమరిది, 
* నీకు జన్మనివ్వడానికి ఓ ఆడది కావాలి. నీకు భార్య గా  ఓ ఆడది కావాలి. నీకు తండ్రి హోదా ఇవ్వాలంటే ఆడది కావాలి. కానీ కూతురిగా మాత్రం ఆడపిల్లవద్దా"
   -- సిగ్గుతో తలవంచుకుంటాడా బావగారు. 
  ఎన్ని సినిమాల్లో ఎన్ని సందేశాలిచ్చినా మారుతున్నారా  జనాలు! ఎన్ని చట్టాలు, శాసనాలు చేసినా మారుతున్నారా? ఎవరి ధోరణి వారిదే ! 
  ఇంతకీ, ఈ అదనపు కట్నం ఎలా పుట్టుకొచ్చిందో ఆలోచిస్తే ఒకటే బోధపడుతుంది. పెళ్లి సమయంలో ఇచ్చినది  వారికి సరిపోయినట్లు అనిపించకపోయినా లేక ఇతరులతో పోల్చుకున్నా కొన్ని అసంతృప్తులు బయలుదేరుతాయి వారిలో. ఫలితంగా, అసహనంతో అదంతా భార్యమీద చూపించడం మొదలెడతారు. ఆమె స్థానానికున్న విలువ, ప్రత్యేకత తెలిసినా కట్నకానుకల కోసం వేధించడం, హింసించడం, హతమార్చడం చేస్తున్న కొందరి అమానుష ప్రవర్తన ఎంత హేయమైన చర్య!  నేటి సమాజంలో ఇలాంటి వారి శాతం పెరిగిపోవడానికి కారణమేమిటి? 
   పూర్వం పెళ్లయిన కొత్త జంటకు అవసరాల కోసమై కొంత పైకం, వస్తు సామాగ్రి అమ్మాయి తరపు వారు తమకు తాముగా ఇష్టపూర్వకంగా ఇవ్వడం మొదలైనదని చెప్తూ ఉంటారు. అదే క్రమక్రమంగా కాలక్రమేణా ఓ  ఆచారమై రాన్రానూ  ఓ దుష్ట సాంప్రదాయంగా రూపాంతరం చెంది ఇలా ఆడపిల్లల పాలిటి శాపంగా పరిణమించిపోయింది. ఇరు కుటుంబాలవారూ ఇష్టపూర్వకంగా ఏ బలవంతం లేకుండా కట్నకానుకలు ఇ చ్చుకునేవాళ్లు లేకపోలేదు. పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఎంతో సఖ్యంగా, సంస్కారయుతంగా ఉండే కుటుంబాలు ఉంటున్నాయి, కానీ అలాంటి వారి శాతం బాగా తగ్గిందని చెప్పక తప్పదు.
   పూర్వం కన్యాశుల్కం ( ఓలి  ) పేరిట ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి ముక్కుపచ్చలారని బాలికల్ని వివాహం చేసుకునేవారట ! అమ్మాయికి  కట్నం ఇచ్చినా, అబ్బాయికి కట్నం ఇచ్చినా -- అప్పుడూ, ఇప్పుడూ అమ్మాయే బలి  పశువు  కావడం గమనార్హం !  
 ఇంతకీ-- ఈ కట్నమన్నది వరునికి ఎందుకు ఇవ్వాలి? 
 భార్యవిలువ తెలిసీ సంప్రదాయాల పేరిట ఈ ఆచారాలు ఎందుకు కొనసాగాలి?ఇద్దరూ సమానమే అయినప్పుడు, సంసారరథానికి ఇద్దరూ అవసరమే అయినప్పుడు పెళ్లి సమయంలో స్త్రీయే ఎందుకు కట్నమివ్వాలి? ఇది ఏ ఒక్కరి ప్రశ్నో కాదు, అనాదిగా ఎందరో...ఎందరెందరో స్త్రీల ఆవేదనతో కూడిన ప్రశ్న. 
  ఎప్పుడో, ఎన్నో ఏళ్ళ క్రితం రేడియో లలిత సంగీతంలో విన్న ఓ పాట ఈ సందర్భంగా తలపుకొస్తోంది. 

" నీలాల నింగిలో తిరిగేటి జాబిల్లి
  నింగికేమిస్తుంది ఓలి 
  బ్రతుకులో వెన్నెలై వెలిగేటి మగనాలి 
  ఎందుకివ్వాలి ఓలి ? "
                    -------*--------

(వరకట్న  వేధింపులు, అత్తింటి ఆరళ్ళు, హత్యలూ -- నిత్యం దినపత్రికల్లో వచ్చే వార్తలు  -- ఆ స్పందనతో  )


**********************************
            🌺 భువి భావనలు  🌺
**********************************



  






 





Saturday, June 5, 2021

'కరోనా ' సోకని కరోనా బాధితులు

      ' కరోనా ' మహమ్మారి ఈ భూతలాన్ని ఆక్రమించి మానవాళినంతా అతలాకుతలం చేసి ఎన్నడూ కనీవినీ ఎరుగని చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఎందర్నో  బలి తీసుకుని ఎన్నో కుటుంబాల్ని కృంగదీసి కోలుకోలేని దెబ్బ తీసింది.ఇదో ఊహించని ఉత్పాతం! ఏమాత్రం అనుకోని అశనిపాతం. ప్రశాంతంగా ఉండే సరస్సులో ఓ రాయి విసిరితే అక్కడ అలజడి  ఎలా ఉంటుందో అలాంటి స్థితి ప్రపంచాన్ని కమ్మేసింది. సరస్సు కాసేపటికి మునుపటి స్థితి పొందుతుంది. కానీ, కరోనా కనీవినీ ఎరుగని రీతిని పాకిపోయి అందరి అంచనాలను తలకిందులు చేసేసింది. ఇక అయిపోయింది లే అనుకొని కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకున్నామో లేదో అంతలోనే హఠాత్తుగా మళ్లీ పుట్టుకొచ్చింది. ఇది సెకండ్ వేవ్ అట ! మొదటిసారి కంటే ఉధృతంగా   వచ్చేసింది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.  వైరస్ తో విగతజీవులుగా అవుతున్నవారి సంగతి సరే, అది  సోకని వారు కూడా దాని తాకిడికి బలై తీవ్రంగా నష్టపోతున్నారు. వీళ్లంతా కరోనా సోకకున్నా దాని తాలూకు బాధితులే. ఎవరెవరంటే ----
* వ్యాపారస్తులు :  చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు వ్యాపారస్తులూ బేరాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నవాళ్లే. లాక్ డౌన్ వల్ల పరిమిత సమయమే వారి వ్యాపారానికి దక్కుతోంది. కొనే వాళ్లూ బాగా తగ్గిపోయారు, బయటకు రావడానికి, గుంపుల్లో కలవడానికీ భయపడుతూ. కూరగాయల వ్యాపారుల పరిస్థితీ అంతే. చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి మరీ దయనీయమైపోయింది. 
* చిరుద్యోగులు :  ప్రైవేటు సంస్థల్లో పని చేసేవారు, ముఖ్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బడులు మూతబడి జీతాలు అందక కుటుంబం జరిగే దారిలేక కూరగాయల వ్యాపారులు గా కూడా మారిన వైనాలు వార్తల్లో చదివాం, చదువుతున్నాం. ఫస్ట్ వేవ్ లో సగం జీతాలన్నా  ఇచ్చే పాఠశాల నిర్వాహకులు ఇప్పుడు అది కూడా మానేసి నట్లు ఉన్నారు. పాఠశాలలు మూతబడి, ఫీజులు లేక, ఆదాయం కరువై వాళ్లు మాత్రం ఎంతకాలమని జీతాలు ఇవ్వగలరు? మరి వీరంతా కరోనా సోకని కరోనా బాధితులే  కదా!
* విద్యార్థులు : లాక్ డౌన్ వల్ల పాఠశాలలు, కళాశాలలు మూతబడి పోయి, చదువులు  చతికిలబడి పోయాయి. ఆన్లైన్ పాఠాలు అటకెక్కేశాయి. అయినా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలంతా స్మార్ట్ ఫోన్లు వినియోగించే స్థాయి  ఎక్కడిది మనకు? ఇదివరకు తెల్లారగానే చకచకా లేచి తయారై, ఉల్లాసంగా, ఉత్సాహంగా బడికి ఉరికే పిల్లలు ఇప్పుడు ఆ సమయం లో బద్ధకంగా, నీరసంగా డీలా పడిపోయి కనిపిస్తున్నారు. బడి లేకుంటే ఆనందమే పిల్లలకు. కానీ ప్రతీ రోజు లేకపోతే ఎలా? ఏదో కోల్పోయిన భావనవాళ్ల ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే కళాశాలలకు వెళ్లే వయసు పిల్లలకు వారి భవితవ్యం ఏమిటో అవగతం కాక మ్రాన్పడిపోతున్నారు. 
* ఉద్యోగార్థులు :  చదువుపూర్తయి ఉద్యోగాన్వేషణలో ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. వ్యవస్థలన్నీ సజావుగా నడుస్తుంటే కదా, ఉద్యోగ ప్రకటనలూ, నియామకాలు! ఇంకా, ఉద్యోగాలు ఉండీ ఊడి పోయినవాళ్లు, పనిచేసినా జీతాలు రానివాళ్లు  కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నవాళ్ళు లెక్కకు మించే ఉంటున్నారు. ఎవరైనా ఎంతని, ఎన్నాళ్ళని సహాయపడగలరు? వీళ్లంతా మరో రకమైన కరోనా బాధితులే. 
* వలస కూలీలు: ఉన్న ఊర్లో పనులు లేక ఎక్కడో దూర ప్రాంతాలకు కుటుంబాలతో పాటు తరలి వెళ్లి జీవనోపాధి వెతుక్కుని బ్రతుకులీడుస్తున్న వీళ్లు కరోనా మహమ్మారి పుణ్యమాని లాక్ డౌన్ ల వల్ల ఉపాధి కోల్పోయి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మనసున్న వాళ్లంతా వీళ్ల దుస్థితికి చలించి ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టడం గత సంవత్సరం చూశాము. పూటగడవాలంటే పని చేయాలి, పని చేద్దాం అంటే దొరకదు. అలా ఉంది ఈ వలస జీవుల ప్రస్తుత దీనావస్థ ! 
* అనాధలై పోయిన బాలలు : ఇంతటి దయనీయ స్థితి మునుపెన్నడూ చూసి ఉండము. తల్లిదండ్రులిద్దరూ కరోనా కాటుకు బలైపోయి హఠాత్తుగా మరణిస్తే, దిక్కులేక అనాధలుగా మారిన అభాగ్యులీ చిన్నారులు ! ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా నా అన్న వారు లేని బ్రతుకు శూన్యమే కదా! పగవారికి కూడా ఈ  దుర్గతి రాకూడదు. 
ఇక -- 
* గృహిణులు  :  వీరిది మరో రకం సమస్య. ఇది కూడా సమస్యేనా అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇది బయటికి కనిపించని బాధ!  కరోనా భయంతో అంతా ఇంట్లోనే ఉండడంతో ఇల్లాలికి పని వత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఇదివరకైతే పిల్లలు, భర్త బయటకెళ్ళిపోతే పని తర్వాత ఇల్లాలికి కాస్త తీరిక సమయం చిక్కేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో పిల్లల అల్లరి భరించడం ఒక ఎత్తయితే, ఇంటిల్లిపాదికీ వండివార్చడం, వడ్డించడం, అన్నీ  కూర్చున్నచోటికే అందించడం ఒక ఎత్తు. వంటే కదా, అదీ కష్టమేనా అంటారేమో ! అలా అనేవాళ్ళని  ఓ వారం... కనీసం ఓ మూడు రోజులు మూడు పూటలా అందరికీ వంట చేసి పెట్టమనండి తెలుస్తుంది. జన్మలో మళ్ళీ ఆ మాట అనరు !గృహిణికి ఒక్క వంట పనేనా, రకరకాల పనులు ఎన్నెన్నో. రాస్తే పెద్ద లిస్టే అవుతుంది.  ఇదివరకైతే పనులయ్యాక ఇరుగూ పొరుగుతో కాసేపు కబుర్లతో మనసు తేలికపరుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వెసులుబాటేదీ? బొత్తిగా ' ప్రైవసీ ' అన్నది కరువై అన్నింటికీ నోటికి తాళం వేసుకొని ఉండాల్సి వస్తోంది. ఈమధ్య దినపత్రికలన్నీ ఈ విషయమే ఘోషిస్తున్నాయి. ఇంట్లో భర్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువై గృహహింసకు దారి తీస్తున్నాయని ! తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోయి, మెదడుపై వత్తిడి పెరిగి, అందరిమీదా చీటికీ మాటికీ అరిచేస్తూ, ఎంత సహనశీలురైనా బి. పి పెంచేసుకుంటున్నారట ! నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ కరోనా బాధితుల్లో పై అందరితో పాటు గృహిణుల్ని కూడా చేర్చాల్సిఉంటుందని !
--- అందుకే అంటున్నా, వీళ్లంతా కరోనా బారిన పడకున్నా దాని ప్రభావం సోకి కరోనా బాధితులై పోయారని ! 
  ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరి జీవితాల్ని కమ్ముకున్న ఈ కరోనా మబ్బులు ఎప్పటికి తొలగిపోతాయో? ఎప్పుడు పూర్వపు స్థితి వచ్చి స్వేచ్ఛగా, ఇంటా బయటా అందరం కలిసి భయమన్నది లేకుండా తిరుగుతామో? 

****************************************
            🌺 భువి భావనలు 🌺
****************************************