Thursday, April 25, 2024

బాలగేయం --- అమ్మ నాకు తినిపించే......

🙆🙂😊😇
   🌹🌺🌷🌹

అమ్మ నాకు తినిపించే
అల్లిబిల్లి కబుర్లతో
ఆకాశం చూపిస్తూ
అపరంజిని నేనంటూ         " అమ్మ "

ఇలకు దిగిన ఇలవేల్పునట !
ఈశ్వరవర ప్రసాదినట !
ఉన్నదంత నాదంటూ 
ఊర్వశివీ నీవంటూ !              " అమ్మ "

ఎన్నడూ లేదంట
ఏలోటూ నాకంట
ఐశ్వర్యం నాదంట !            " అమ్మ "

ఒరులెవరూ సాటిరారంట !
ఓనాటికి నేనవనికి
ఔతానట మహారాణిని !       " అమ్మ "

అందలాలు ఎక్కేనట
అః ! అహహ !
నేనే ఒక నియంతనట !!

🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺💐

Saturday, April 20, 2024

నాణెం.... అటూ... ఇటూ

    కొడుకు తెచ్చిన నోట్ల కట్టలు అతి జాగ్రత్తగా లెక్క పెట్టింది పార్వతమ్మ. వెంటనే  " ఇదేమిట్రా, ఐదొందలుతగ్గాయేమిటి?  " నిశితంగా అతన్నే చూస్తూ అడిగింది. 
   " తనకేదో అవసరమంటూ తీసుకుందమ్మా సుగుణ... " నాన్చుతూ చెప్పాడు ఆనంద్. 
  " బాగుంది వరుస ! స్కూలు దగ్గరేగా నడిచి వెడుతుంది, భోజనం పట్టుకెళ్తుంది, సినిమాలు, షికార్లు నీవు తిప్పుతూనే ఉంటావాయే ! ఇంకా ఆవిడ గారికి అవసరాలంటూ ఏముంటాయి? ' దీర్ఘం తీస్తూ నిలదీసింది. 
  " అదేంటమ్మా, పది మందిలో కెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు నలుగురిలో బాగుండాలంటే ఏవో చిన్న చిన్న సరదాలు, అవసరాలు ఉండవా?.... "
 మధ్యలోనే అడ్డుకోబోయిన ఆవిడకి గేటు తీసుకుని వస్తూ కనిపించింది సుగుణ. రుసరుసలాడుతూ సణుగుడు ఆపి లోనికెళ్ళిపోయింది పార్వతమ్మ. చెట్టంత ఎదిగినా ఇంకా తన అదుపాజ్ఞలలో ఉంటూ తనదే కాకుండా భార్య జీతం కూడా తెచ్చి తల్లి చేతిలో పోసే కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉంటుందావిడ !
   అక్కడే కూర్చుని చదువుకుంటున్న ఆమె చిన్న కొడుకు ప్రశాంత్, చిన్న కూతురు ప్రసూన తల్లి మాటలు వింటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ! వాళ్ళిద్దరూ ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్నారు. 
                          *********
    దసరా పండక్కి వచ్చిన పెద్ద కూతురు సునంద ను కాలు కింద పెట్ట నీయకుండా అపురూపంగా చూసుకుంటోంది పార్వతమ్మ. సునందకు పెళ్లి చేసి రెండేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. డిగ్రీ దాకా చదివి ఏదో ప్రైవేటు కంపెనీలో టైపిస్ట్ గా చేస్తోంది. 
    ఆ రోజు సాయంత్రం ఆనంద్ సుగుణలు ఏవో సరుకులు కొనడానికి బజారెళ్ళారు. ప్రసూన, ప్రశాంత్ లు కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నారు. సునంద అక్కడే సోఫాలో కూర్చుని వీక్లీ తిరిగేస్తోంది. 
    ముంగిట్లో చెట్టుకు కాసిన మల్లె మొగ్గలు కోసుకొచ్చి చక్కగా మాలకట్టి మురిపెంగా కూతురు జడలో తురిమింది పార్వతమ్మ. వెంటనే లోనికెళ్లి చిక్కటి కాఫీ కలుపుకొచ్చి వేడివేడిగా కూతురికి అందించి, మెల్లిగా మొదలెట్టింది. 
   " ఏమే, సునందా, నీ జీతం గురించి మీ అత్తగారు ఏమైనా అడుగుతుందా? " 
    " అబ్బే, ఆవిడకి అలాంటి ఆశలు ఏమి ఉన్నట్టు లేదమ్మా, పైగా ప్రతి పండక్కీ ఆవిడే నాకు చీర కొనిస్తుంది తెలుసా!... ఈసారి కూడా కొనుక్కో మంటూ రెండు వేలు చేతిలో పెట్టి పంపించింది... " తల్లికి భరోసా ఇచ్చింది సునంద. 
   " అలా అయితే మంచిదే మరి! మీ ఆయన్ని మాత్రం ఎప్పుడూ చేయి జారి పోనీకు. ఎప్పుడూ కొంగున ముడి వేసుకుని ఉండాలి సుమా ! "
    కొడుకు నా మాట జవదాటకూడదు, అల్లుడు మాత్రం నా కూతురి అదుపాజ్ఞల్లో ఉండాలి అనే బాపతు ఆవిడ! 
  ".... నేనూ మరో రెండు వేలు ఇస్తాను, రేపెళ్లి నాలుగు వేలు పెట్టి నీకు నచ్చిన పట్టు చీర ఏదైనా కొనుక్కో... " లోలోపల మురిసిపోతూ దగ్గరగా వచ్చి తగ్గు స్వరంతో అందావిడ. 
     అక్కడే ఉన్న ప్రసూన, ప్రశాంత్ ల చెవుల్లో వీళ్ల సంభాషణ ఎంత వద్దనుకున్నా దూరిపోతోంది. తల్లి ధోరణికి ఆ ఇద్దరూ విస్తుపోయి తెల్లమొహాలేశారు. 
  పాపం! వదిన! అయిదు వందలు, అదీ తన జీతం డబ్బుల్లో నుండి తీసుకుంటేనే రాద్ధాంతం చేసిన అమ్మ ఇప్పుడు అక్కకు ధారాళంగా రెండు వేలిస్తానంటోంది ! 
   వదిన తెల్లవారుజామునే లేస్తుంది. ఇంటిపని, వంట పని అంతా దాదాపు తనే పూర్తిచేసి, డ్యూటీ కెళ్ళిపోతుంది. అలసి సొలసి సాయంత్రానికి ఇంటికి వస్తే ఏనాడైనా ఇలా కాఫీ తన చేతికందించిందా? ఎప్పుడైనా ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడిందా? అక్కకు మాత్రం రాచమర్యాదలు చేస్తోంది!
   కూతురికో ధర్మం, కోడలికో ధర్మమా! ఎందుకో ఏమో గాని ఆ లేత మనసులు రెండూ ఒకింత ఆలోచనలోపడి అయోమయంలో కాసేపు కొట్టుమిట్టాడాయి. 
     నాణెం ఒకటే అయినా దానికి ఒక వైపు బొమ్మ, మరోవైపు బొరుసు ఉన్నట్లుగానే ఒక స్త్రీలో అమ్మ, అత్త అనే రెండు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన మనసులు ఒదిగి ఉంటాయన్న లోకం పోకడ ఆ పసి హృదయాలకు తెలియాలంటే వాళ్లకు ఈ వయసు చాలదు. ఇంకొంతకాలం ఆగాలి మరి !


🌺🌹🌷🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌺🌹🌷🌷

( ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితం )

Wednesday, April 17, 2024

చినుకులు కావవి... పన్నీటి జల్లులు..

🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚... 


అదిగదిగో ఆకాశాన....
కమ్ముకుంటూ నల్ల నల్లని మబ్బులు...
దోబూచులాడుతూ... పరుగులు తీస్తూ..
అటు ఇటు సాగుతూ... సాగుతూ...
సృష్టిస్తున్నాయి అంబరాన
మౌనంగా అలజడులు....
నీలాల నింగి.. అంతలో అయ్యింది కడలి...
చల్లగాలి సోకి... అదిగదిగో... మొదలవుతోంది...చిరుజల్లుల చిలకరింపుల
పలకరింపులతో  పరవశింప చేస్తూ...
చిటపట చినుకుల తాళం వేస్తూ...
పగుళ్లు వారిన నేలను పదును చేస్తూ...
సకల జనుల్ని సేదదీరుస్తూ...
అరెరే...!! వచ్చేసిందిగా...వాన !!
ఇదిగిదిగో... అయింది మౌనంగా జడివాన..!!
పన్నీటి జల్లులు కురిశాయి హృదయాన...!!

🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦


                      

Sunday, April 14, 2024

కట్టుబాట్లు

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦 
                        కట్టుబాట్లు 
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

 ప్రేమించుకున్నామంటారు... 
 ప్రేమికులం మేం అంటారు...!
 పెళ్లంటే వద్దూ వద్దంటారు... !
 సహజీవనం ముద్దంటారు...!!
 స్వేచ్ఛాజీవనం కావాలంటారు...
 కొత్తదనంలోనే ఆనందమంటారు...
 రోజులు గడుస్తాయి....
 మోజులు తీరతాయి...
 'మైనస్ ' లు  బయటపడి...
'ప్లస్ '  లు మరుగునబడి... 
కలహాలు మొదలై... కష్టాలపాలై... 
కలల సౌధం కూలిపోయి...
విషాదంమూటగట్టుకుని...విడిపోయి... 
వీధినిబడుతున్న ఆధునిక యువత...!
ప్రశ్నార్ధకమవుతున్న బంగరు భవిత !
కన్ను మిన్ను గానక చరించిన ఫలితమిది  !!
గతి తప్పిన దారుల వెంట ...
గమ్యం లేని బ్రతుకులివి .... ! 
సజావుగా సాగాలంటే జీవితాలు... 
ఉండాలిగా మరి నీతినియమాలు.... !!
కట్టుబాట్లతో కూడిన ఆ పెట్టని గోడలు.. 
నిరంతరం హెచ్చరించే లక్ష్మణరేఖలు !!
నిత్యం ఆదుకునే రక్షణకవచాలు...!!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦



Tuesday, April 9, 2024

ఓ ' ఫోబియా ' కథ !



       వారం రోజులుగా రామలక్ష్మికి చాలా   చిరాగ్గా, అసహనంగా ఉంటోంది. ఒంట్లో ఏదో తెలీని నలత ! చిన్నగా తలనొప్పి! ఇప్పుడే కాదు, దాదాపు ఒక సంవత్సర కాలం నుండీ ఆమెకిలాగే ఉంటోంది. కానీ చిత్రమేంటంటే ఆ పరిస్థితి ఏ వారమో , రెండు వారాలో ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది.మళ్ళీ కొద్దినెలల తర్వాత అదే పరిస్థితి ! కారణం రామ లక్ష్మికి   బోధపడదెంతకీ. 
     అరవింద కు డిగ్రీ పూర్తవగానే పెళ్లయిపోయింది. భర్త భరత్ ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్. పెళ్లయిన కొత్తలో అటువైపూ, ఇటువైపూవాళ్ళు ప్రతి పండక్కి ఎవరో ఒకరు ఇంటికి పిలుస్తూ ఉండేవాళ్లు. సంవత్సరం దాకా మహదానందంగా గడిచిపోయిందా  అమ్మాయికి. కొత్తదనం తగ్గిపోయి  ఇప్పుడు పండగలకి పిలవడం కూడా తగ్గిపోయింది. దాంతో చిక్కొచ్చిపడింది అరవిందకి ! పుట్టింట్లో గారాబం  ఎక్కువై ఏ పని చేయడం అలవాటు కాలేదు. ముఖ్యంగా పండగపూట! అన్నీ తల్లే చూసుకోవడం, ఆ పిల్లేమో అమ్మ ఉంది కదాని వంటింటి   మొహం వేపు కనీసం తొంగి  చూడకపోవడం ! అన్న పెళ్లయ్యాక వదిన వచ్చి  తల్లికి  సాయం చేయడం మొదలయ్యాక బాధ్యతారహితంగా తయారై మరీ బద్ధకస్థురాలై పోయింది. ఫలితం ! ఈరోజు ఏ పండగ ఎలా చేయాలో ఏ మాత్రం అవగాహన లేకపోవడం! కనీసం వంటల మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే అదీ లేదు. కానీ పండగ లంటే ఇష్టమే. ఇదిలాగుంటే, భర్తగారేమో భోజనప్రియుడు. పండగపూట మరీ హెవీ గా ఉండాలంటాడు. దాంతో మరో  పెద్ద సమస్యయింది  అరవిందకు. ఎంత పుట్టిల్లైనా మరీ పిలవకుండా వెళ్లడమంటే ఏదో నామోషీ ! అంతే! ఇంకేముంది! పండగలంటే  ఆసక్తి, సంతోషం చచ్చిపోయి ఆ స్థానంలో ఓ విధమైన బెంగ మొదలైంది. అందుకేనేమో, పండగ వారం ఉందనగానే ఆమెలో ఏదో గుబులు! ఎలాగోలా అది కాస్తా దాటి పోగానే పరిస్థితి మళ్ళీ మామూలై పోతోంది. 
     ముందుగా   ప్రస్తావించిన రామలక్ష్మి పరిస్థితీ  ఇదే. నలభై ఏళ్లదాకా రామలక్ష్మిచాలా  హుషారుగా ఉండేది. ఇంటి పనులూ, బయటి పనులు చక్కబెట్టుకుంటూ, మరోవైపు పిల్లల ఆలనాపాలనా ఇంట్లో మిగతా  వాళ్ల అవసరాలు అన్నీ చూసుకుంటూ అంతా  ఒంటిచేత్తో నెట్టుకొచ్చేది. వంటింట్లో అత్తగారేదైనా సాయం చేయబోయినా వారించేది. చేతికి కాలికి అడ్డం అనుకొంటూ ఎవరు సాయం అందించబోయినా సున్నితంగా తిరస్కరించేది. నలభై దాటి రెండేళ్లు గడిచాక నెమ్మదిగా ఆమెలో నిస్సత్తువ ఆవహించడం మొదలై మరో రెండేళ్లు గడిచేసరికి రెట్టింపైపోయింది. 
     ఏమిటో ఈమధ్య వంటింట్లో కాస్త ఎవరైనా పని అందుకుంటే బాగుంటుంది కదాని అన్పిస్తోందామెకి మెల్లిమెల్లిగా. అత్తగారేమో వంటింటి అలవాటు బాగా తప్పిపోయి విశ్రాంతికి అలవాటు పడి అటువేపు చూడ్డం బొత్తిగా మానేసింది. ఆవిడే కాదు ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఓరకమైన 'కంఫర్ట్ జోన్ ' లో పడిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. 
" ఖర్మ !చేజేతులా చేసుకున్నానాయె !తప్పుతుందా !"
అంటూ తల పట్టుకుంటోందా ఇల్లాలు !
" అన్నీ మీదేసుకుని చేయాలనుకుంటే చివరికిలాగే అవుతుంది మరి !"
ఆమె ఆపసోపాలు చూస్తూ భర్త గారు చేసే కామెంట్స్ ఆమెను మరీ ఆలోచనలో పడేస్తున్నాయి. మరీముఖ్యంగా ఈమధ్య పండగల పూట ఆమె అవస్థ చెప్పనలవి గావడం లేదు. పెద్ద సంసారం !తెల్లవారు ఝాము నుండి అన్నీ చక్కబెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనమైపోతోంది. దాంతో పండగ ఏదైనా వస్తోందంటే చాలు ఆమెలో ఏదో అలజడి ! ఈవిధంగా కొద్దికాలం గడిచాక నెమ్మదిగా ఆమెకు అసలు కారణం బోధపడసాగింది. ప్రస్తుతం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని సతమతమై పోతోందా అమాయకురాలు !
      వీరిద్దరి వ్యవహారం ఇలా ఉందా! ఇక భువనేశ్వరి దగ్గరికెళ్దాం. ఆవిడ హై స్కూల్ టీచర్ గా రిటైరై సంవత్సరం దాటింది. ముప్ఫై అయిదు  సంవత్సరాలుగా క్షణం తీరిక లేకుండా ఉద్యోగం చేసి అలసిన ఆమె శరీరం రిటైర్మెంట్ తర్వాత ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు లే అనుకుంటూ ఆ క్షణం కోసం ఎదురు చూసింది. తీరా  ఆ ఘడియలు రానే  వచ్చాయి. కానీ మూడు నెలలు గడిచీ  గడవకముందే ఆమె ఆశలు  ఎండమావులే అని ఆమెకు అవగతమైపోయింది. ఇప్పుడు ఆమెకు బయటకెళ్ళి జాబ్ చేసే పని మాత్రమే తప్పింది.అస్తమానం ఇంట్లోనే ఉంటున్నందుకు  ఇతరత్రా పనులన్నీ ముఖ్యంగా వంటింటి పనులురెట్టింపై పనిభారం విపరీతంగా పెరిగిపోయి, ఈ వయసులో ఆమె శరీరం తట్టుకోలేక బాగా డీలా పడిపోతోంది. ఫలితం! B.P, థైరాయిడ్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు మెల్లిగా చుట్టుముట్టి మీద పడి మరింత హైరానా పెట్టేస్తున్నాయి. మరి ఈవిడకి కూడా పై ఇద్దరి లాగే పండగ వస్తోందంటే గాభరా  ఉండకుండా ఉంటుందా? ప్రస్తుతం భువనేశ్వరి కూడా పనిభారం  ఎలా తగ్గించుకోవాలా అన్న ఆలోచనలో ఉంది.
    ఈ ముగ్గురే కాదు, ఇలాంటి కోవకు చెందిన ఆడాళ్లంతా తమ స్వల్పకాల అనారోగ్యాలకు కారణం అన్వేషిస్తే --- కేవలం ఒత్తిడి! మానసిక ఒత్తిడే 90% ఉంటుందన్న నిజం ఇట్టే ద్యోతకమౌతుంది. రకరకాల ఫోబియాల  గురించి మనకు తెలుసు. ఇదీ  ఒక రకం 'ఫోబియా' అనొచ్చేమో !
    దీనికి పరిష్కారం గురించి చెప్పాలంటే( నా మాటల్లో )---
 కాస్త కష్టమే అనుకోండి-- కానీ అసాధ్యం అయితే కాదు అనుకుంటున్నా---
* ఇంట్లో పని విభజన అన్నది ఉండాలి. ఇంట్లో ఉన్న అందరికీ ఎవరికి  చేతనైన పని వాళ్లకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి.. అలవాటు పడ్డ ప్రాణాలు కదా, మొదట్లో మొరాయిస్తాయి. అనుమానమే  లేదు. కానీ క్రమంగాదారిలో కొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చెప్పడం అయితే సునాయాసంగా చెప్పగలిగాను, ఆచరణలో మహా కష్టం సుమీ ! కానీ ప్రయత్నించడంలో తప్పేముంది?  
   అలా చెప్పలేమంటారా?  మొహమాటమడ్డొస్తోందా? ఆ ముసుగు తీసేస్తే అన్నీ సర్దుకుంటాయి నేస్తాలూ ! కొందరు తెలివైన ఆడవాళ్ళు మొదటి నుంచీ  ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు మరి! వాళ్లు ఎవరి మాటల్నీ పట్టించుకోరు. అందుకే ఏ 'టెన్షన్ ' లేకుండా ధీమాగా కన్పిస్తుంటారు. మనం కూడా అదే దారిని ఎంచుకుంటే ఈ ఫోబియాలూ గీబియాలు పరారవుతాయి గదా !
    మహా అయితే ఇంట్లో వాళ్ళు కొద్దిరోజులు మనమీద కారాలూ మిరియాలూ నూరతారు, అంతేగా ! మన క్షేమం కోసం ఆమాత్రం భరించాలి మరి !ఏమంటారు? 
    ఇకపోతే, ఇది  ఎక్కువ మంది  ఉన్న కుటుంబాలకు OK. మరి అరవింద లాగ ఇద్దరే ఉంటే ! ఇద్దరి మధ్య కూడా పని విభజన అన్నది ఉండొచ్చు.  అప్పుడు ఇద్దరూ పరస్పర అవగాహనతో, సర్దుబాటు ధోరణితో ఆలోచించాల్సి ఉంటుంది.     మహా కష్టమే అయినా' ప్రయత్నిద్దాం'అన్న  కోణంలో ఇదంతా  సాగాలి !! 

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

   






Thursday, April 4, 2024

అవును...గాలిమేడలే...అయితేనేమి...!

 

🌷

జూలై 2022 మాలిక పత్రికలో కవిత :

అవును.. గాలిమేడలే...అయితేనేమి..!

రచన : యం. ధరిత్రీ దేవి 

Tuesday, April 2, 2024

నాకు నచ్చిన పద్యం...పూరిత సద్గుణంబుగల....

పూరిత సద్గుణంబు గల పుణ్యునకించుక రూపసంపదల్ 
దూరములైన వానియెడ దొడ్డగ జూతురు బుద్ధిమంతు లె 
ట్లారయ గొగ్గులైన మరి అందుల మాధురి జూచిగాదె ఖ
ర్జూర ఫలంబులం బ్రియముజొప్పడ లోకులు గొంట భాస్కరా !

🥀
అందచందాలు లేకపోయినా సద్గుణాలు గల్గిన మంచి వ్యక్తిని బుద్ధిమంతులైనవారు  మంచిగా చూస్తారు, గౌరవిస్తారు. అదెట్లాగంటే... ఖర్జూరఫలం నిండా ముడుతలు గలిగి చూడ్డానికి అందవికారంగా ఉన్నా...దానియొక్క తీపిదనాన్ని చూసి తినడానికందరూఎంతో ఇష్టపడతారు కదా...అని ఈ పద్య భావం. 
    నిజమే కదా ! ఎంతటి సుందరరూపులైనా ప్రవర్తన, మాటతీరు సరిగా లేకున్న ఎవరూ వారిని ఇష్టపడరు. గౌరవించరు. ఈ పద్యంలోని భావం నాకెంతగానో నచ్చింది.
 
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
 





 

Wednesday, March 20, 2024

పని'మనీ'షి

☺️
************************************************
ఇంటి మనిషి కాదు, కానీ...
ఇంటి ముందు పెడుతుంది 
ముచ్చటైన ముత్యాల ముగ్గు !
ఇల్లు తనది కాదు, అయినా...
ప్రతి మూలా తనకు తెలుసు !!
తెలతెలవారుతుండగా 
తలుపు తడుతుంది...
ఇంట్లో అందర్నీ తట్టిలేపుతుంది...
చీపురుతో మొదలెడుతుంది...
చెత్తాచెదారం వదిలిస్తుంది.. 
అద్దంలా మెరిపిస్తుంది... 
అంట్లగిన్నెల పనిపడుతుంది..
అవి నా నేస్తాలంటుంది...😊
చకచకా కదులుతుంది 
చలాకీ తనం తన సొంతమంటుంది
నాలుగిళ్లలో పనిచేస్తేనే కదా, 
నలుగురి కడుపూ నిండేదంటుంది !
బ్రతుకుదెరువు కిదే నా దారంటుంది !
అవసరానికి ఆదుకో మంటుంది 
మీ అవసరానికి 'నేను'న్నానంటుంది !
పాత చీరిస్తే పొంగిపోతుంది...
పట్టెడు మెతుకులతో సరిపెట్టుకుంటుంది 
పరామర్శించి పోయే చుట్టం కాదు 
పరిపరివిధాల సాయపడే నేస్తం  !🙂
ఆమె రానినాడు ఇల్లాలికి ఇక్కట్లే ! 
ఇల్లంతా అల్లకల్లోలమే !!
అవును, ఆమె ఇంటి పనిమనిషి !
నిజం ! ఒప్పుకుని తీరాలి సుమా !
ఆమె--- గృహిణులకు ఓ ఆసరా !
ఉద్యోగినులకు భరోసా !
పరస్పరం ఆధారపడ్డ జీవులు మరి !
'మనీ 'తో ముడివడ్డ బంధం వారిది !
అందుకే అయిందామె పని'మనీ'షి !!😊
*****************************************
 
 

 




Sunday, March 10, 2024

కొత్త కోణం....కథ

🌷🌹
     సెల్ లో  అలారం మోగింది. టైం చూస్తే నాలుగున్నర కావొస్తోంది. దిగ్గున లేచింది విశాలి. నిద్రమత్తు వదిలించుకుంటూ చకాచకా పనుల్లో చొరబడింది. ఏడున్నరకు మిగతావాళ్లూ లేచారు. టిఫిన్ టేబుల్ మీద పెట్టేసి, పిల్లలకు, భర్తకు, మరిదికీ, ఆడపడుచుకూ లంచ్ బాక్సులు సర్దేసింది. ఎనిమిదిన్నరకంతా పిల్లలు, తొమ్మిదింటికి భర్త ఆఫీస్ కూ, మిగతా ఇద్దరూ కాలేజీలకు బయలుదేరారు. అత్తమామలకు టిఫిన్లు పెట్టేసి, స్నానాదికాలు పూర్తి చేసుకుని, టిఫిన్ తిందామని బౌల్ తెరిచింది. ఒకే ఒక్క దోశ, గిన్నెలో అడుగున కాస్త చట్నీ దర్శనమిచ్చాయి. ఫ్రిజ్ లో దోసెల పిండి ఉంది. కానీ మళ్ళీ వేసుకునే ఓపికెక్కడ ?  ఉన్న ఆ ఒక్కటీ ఏదో తిన్నాననిపించి చేయి కడిగేసుకుంది. పన్నెండింటికి అత్తమామలకు  స్టవ్ మీద అన్నానికి పెట్టేసింది. ఉదయమే అందరితోపాటు వండితే... చల్లారిపోయింది తినలేమంటూ సణుగుడు మరి !
              ***      ***        ***
    సాయంత్రం ఆరయింది. అందరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. విశాలి వంటింట్లో బజ్జీలు వేస్తూ, మరో చేత్తో అందరికీ ప్లేట్లలో పెట్టి అందిస్తోంది. అంతా లొట్టలు వేసుకుంటూ తింటూ టీవీ ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తున్నారు. వంటింట్లో చెమటలు కారిపోతూ విశాలి ! రెండు రోజుల క్రితం భర్త శంకర్ మాటలు గుర్తొచ్చాయామెకు. 
" ఏంటీ, రోజూ ఈ మిక్సరేనా ! మరేదైనా చేసి పెట్టొచ్చు కదా! ఏం చేస్తుంటావు...! రోజంతా ఇంట్లోనేగా... పనీపాట ఏముంది నీకు...!!"
ఆ మాటలు శూలాల్లా  వచ్చి విశాలి గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. గుడ్ల నీరు కుక్కుకుందేగానీ, పెదవి విప్పలేదు. చిన్నా  పెద్దా... అంతాచూస్తున్నా చెవిటి వాళ్ళలా మౌనముద్ర దాల్చారు...! చేసేదేముంది ! ఈరోజు అందుకే ఈ బజ్జీల కార్యక్రమం..!
ఉన్నట్టుండి ఆడపడుచు మానస, 
" అమ్మా, మా కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ గల కొందరు స్త్రీలను సన్మానించాలనుకుంటున్నారు. అందుకోసం స్టూడెంట్స్ అందరినీ మాకు బాగా తెలిసిన కొందరి పేర్లను ఇవ్వమన్నారు. అందులో నుండి కొందరిని సెలెక్ట్ చేస్తారట. నేనేమో..మన  ఎదురింటి ఆంటీ శ్రీవిద్య గారి పేరు ఇద్దామనుకుంటున్నా.. వంటలు బాగా చేస్తుంది. కుట్లు అల్లికలు, టైలరింగ్ అంతా వచ్చు.. చక్కగా మాట్లాడుతుంది. ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి కదా ఆంటీ కి..."
" ఔనౌను, వెనక వీధిలో ఉంటుందే...రాధాబాయి... ఆవిడ పేరు కూడా ఇవ్వు. ఉద్యోగం చేస్తూ కూడా రకరకాలుగా అందరికీ సేవలు చేస్తూ ఉంటుంది..."
"... మరిచిపోయాను, బాగా గుర్తు చేశావు.."
 వద్దనుకున్నా ఆ మాటలు చెవుల్లో దూరి, 
" అంతేలే, గొడ్డు  చాకిరీ  చేస్తూ ఇంట్లో ఉన్న వదిన, కోడలు మాత్రం మీ కంటికి ఆనరు... "
అనుకుని నిట్టూర్చింది. నిజానికి తనకూ రకరకాల టాలెంట్స్  ఉన్నాయి. ఒకటి రెండు కంప్యూటర్ కోర్సులు కూడా చేసింది. ఇంగ్లీషులో చక్కటి పరిజ్ఞానమూ  ఉంది. కానీ ప్రస్తుతం అవన్నీ సమసిపోయి వీళ్ళ దృష్టిలో ఎందుకూ పనికిరాని దానిలా తాను మిగిలిపోయింది. పెరటి చెట్టు మందుకు పనికి రాదు కదా! పొరుగింటి పుల్లకూరే  రుచి మరి !! అలాగని సన్మానాలూ, సత్కారాలూ కోరుకోవడం లేదు తను. కాస్త గుర్తింపు.. అంతే! ఆమెలో బాధ, ఆవేదన అంచలంచెలుగా పెరిగిపోసాగాయి. ఇది ఒక నాటిది కాదు, పదేళ్లుగా గూడు కట్టుకున్న వ్యధ !
   ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునే వరకు తను లేనిదే క్షణం గడవదు వీళ్ళందరికీ. వదినకు కాస్త సాయపడమని చెప్పే ఆలోచన అత్తగారికి ఉండదు. రేపు తనూ ఒకింటి కోడలు కావాల్సిందే కదా ! అప్పుడెలా ఉంటుందో ! వెంటనే...
" తనలా మాత్రం ఉండదులే... ఆ గడుసుదనం, ఆ అతితెలివీ నాకెక్కడివి?  అవేవీ  లేకనే నేనిలా ఉన్నాను..."
అనుకుంది మళ్ళీ. డిగ్రీ దాకా చదివిన విశాలి పెళ్లికి ముందు ఓ ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత భర్త ససేమిరా వద్దన్నాడని మానేసింది. పది సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లల తల్లయింది. ఇంట్లో జీతభత్యాలు లేని పనిమనిషి పోస్టు సరే సరి !! 
   ఆమె దృష్టి పక్కనే కూర్చుని పుస్తకాలు ముందేసుకుని హోంవర్క్ చేసుకుంటున్న కూతురు, కొడుకు మీదకు మళ్ళింది. అమాయకంగా కనిపిస్తున్న కూతురు శృతిని చూస్తూ, 
" ఇంత గారాబంగా చూసుకుంటూ, ఇంత లేసి ఫీజులు కడుతూ చదివిస్తున్న ఈ పిల్ల గతి  కూడా రేపు ఇంతేనా ! నాలాగేనా ! అదేదో సినిమాలో ఓ ఆడపిల్ల తండ్రి, 
" ప్రాణప్రదంగా,  అడుగేస్తే ఎక్కడ కందిపోతుందో అని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వచ్చిన బిడ్డను పెళ్లి పేరిట మరో ఇంటికి   ఓ పనిమనిషిగా పంపిస్తున్నాం ."
అంటాడాయన ఓ సందర్భంలో ఆవేదనగా !! ఆమాత్రానికి అంతంత ఖర్చుపెట్టి వీళ్ళని అంత గొప్పగా చదివించడమెందుకో!తల పట్టుకుంది విశాలి.  టీవీలో పాట వస్తోంది.

"మగువా మగువా 
లోకానికి తెలుసా నీ విలువా 
మగువా మగువా 
నీ సహనానికి సరిహద్దులు కలవా.. "

నిజమే! సహనం ఉండాలి. ఆ సహనానికి హద్దులూ ఉండాలి. ఇంట్లో వాళ్లకే తన విలువ తెలియదు. లోకానికంతా  తెలుసా అనడుగుతున్నాడు. పాటలు ఎంత బాగా రాస్తారు ! పాడేవాళ్లు అంతకన్నా అద్భుతంగా పాడుతారు... కానీ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది... అసలు బాధ..!
  మహిళా దినోత్సవం అనేసరికి గుర్తొచ్చింది ఆమెకు, రెండు సంవత్సరాల క్రితం తను తీసుకున్న ఓ నిర్ణయం గురించి... అది  తను మళ్లీ ఉద్యోగం చేయాలని..! ఏ చిన్నదైనా సరే....చేయాలి..!  తప్పదు.. అనుకుంది. రెండు మహిళా  దినోత్సవాలు గడిచిపోయాయి గానీ, అనుకున్నది మాత్రం జరగలేదు.
    ఎలా ఉండేది చదువుకునే రోజుల్లో ! ఎప్పుడూ  చుట్టూ  పదిమంది ఫ్రెండ్స్! రకరకాల వ్యాపకాలు! ఆ విశాలి ఇప్పుడేదీ? ఎక్కడ ? ఆ గలగల నవ్వులేవీ ? ఏమైపోయాయి? ఇలా మూగగా మిగిలిపోయిందేమిటి!
ఆరాత్రి ఆమె కన్నీటితో చెంపలు తడిసిపోయాయి. ఆ తడి ఆమెకో  పాఠం నేర్పింది. ఆ పాఠమే ఆమెకో దిక్సూచి అయింది . కరడు గట్టిన ఆమె గుండె స్థిరత్వం సంతరించుకుంది.
                 ***       ***           ***
  మూడు నెలలు గడిచిపోయాయి. ఆఉదయం.... పిల్లలిద్దరూ ఆటోలో స్కూల్ కి వెళ్ళిపోయారు. మరిది, ఆడపడుచు కాలేజీకి బయలుదేరుతున్నారు. భర్త షూ వేసుకుంటున్నాడు. అత్తమామలిద్దరూ టిఫిన్ చేస్తున్నారు. ఇంతలో విశాలి రెడీ అయి, బ్యాగ్ భుజానికి తగిలించుకుని వచ్చింది. 
" నేనూ మీతో వస్తున్నా.... నన్ను నవోదయ స్కూలు దగ్గర డ్రాప్ చేయండి. ఈరోజు నుండీ నేను ప్రీ  ప్రైమరీ క్లాస్ టీచర్ గా జాయిన్ అవుతున్నానక్కడ...."
అంతా ఒక్కసారిగా ఆమె వంక చూశారు చిత్రంగా. 
 విస్తు పోయిన శంకర్, 
" అదేంటీ ! చెప్పా  పెట్టకుండా..."
" చెబితే ఏం జరుగుతుందో తెలుసు.. పదండి"
భర్త ముఖం చూడకుండా బయటికి దారి తీసింది విశాలి.
" అది  కాదే... నీవిలా వెళ్ళిపోతే, ఇంట్లో ఎలా? " 
కాస్త దూరంలో రోడ్డు మీద నిలబడి ఉన్న విశాలి పక్కన బండి ఆపాడు శంకర్. 
" ఎలా ఏమిటి? నలుగురున్నారు.. పనులన్నీ తలా కాస్త షేర్ చేసుకోండి... చేతకాకపోతే.. ఓ మనిషిని పెట్టుకోండి.. నేను లేకపోతే ఇంట్లో అంతా స్తంభించిపోతుందని మాత్రం  అనుకోకండి. చూస్తూ ఉండండి. అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి... "
మరో మాటకవకాశం లేకుండా ఎక్కి కూర్చుంది విశాలి. ఆ స్వరంలో, ఆ మొహంలో మునుపెన్నడూ లేని స్థిరత్వాన్ని గమనించిన శంకర్ కు భార్యలో ఇంతవరకూ తానెరుగని ఓ కొత్తకోణం గోచరించింది. క్షణం అతని గుండె రెపరెపలాడింది. మరుక్షణం దీనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.... తనూ కారణమా అనిపించి, ఏదో మూల అతనిలో ' గిల్టీ ఫీలింగ్'!! వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుంటూ, బండి స్టార్ట్ చేశాడు.
    విశాలి పెదాలపై చిరునవ్వు ! ఆమెలో ఈ ప్రపంచాన్నే జయించినంత తృప్తి !!

******************************************
[ ప్రతీ ఆడదీ ఉద్యోగమే చేయాలనేమీ లేదు. ఇంట్లో ఆమె శ్రమను గుర్తిస్తే చాలు. ఆమె సహనాన్ని అభినందించాలి. సేవాగుణాన్ని, సర్దుబాటుతత్వాన్ని కొనియాడాలి. ఆమె విలువ  తెలుసుకుని గౌరవించాలి. ప్రతీ ఇంట్లో ఇది జరిగితే... అల్పసంతోషి అయిన స్త్రీ ఆనందానికి అవధులుండవు. ఆమె కంట కన్నీరన్నది అసలుండదు.  ]
******************************************



   

Saturday, March 9, 2024

హోమ్ మినిస్టర్....కథ

  🌷                                         ~~యం.ధరిత్రీ దేవి~~
   
    కిటికీలోంచి సూర్యకిరణాలు చురుక్కుమని తగిలేసరికి కళ్ళు నులుముకుంటూ బద్ధకంగా లేచి కూర్చున్నాడు సాంబశివరావు. అప్రయత్నంగా గోడకేసి చూసిన అతనికి గడియారం ఎనిమిది గంటలు చూపించింది. 'మై గాడ్' అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి హాలు లోకెళ్ళిన అతనికి అడ్డదిడ్డంగా పడి ఇంకా లేవని ఇంటర్, డిగ్రీ చదువుతున్న సుపుత్రులు వంశీ, వరుణ్ దర్శనమిచ్చారు. తండ్రి అరుపులకు దిగ్గున లేచి బాత్రూంలోకి దూరిపోయారిద్దరూ. 
   హడావుడిగా కిచెన్ లో అడుగుపెట్టిన అతనికి రాత్రి తిని పడేసిన ఎంగిలి కంచాలు, అంట్లగిన్నెలు వాసన కొడుతూ కనిపించేసరికి ఒక్కసారిగా నీరసం కమ్ముకొచ్చి ఠక్కున ఇల్లాలు గుర్తొచ్చింది.
    నిన్న ఉదయం వాళ్ళనాన్న బాత్రూంలో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంటుగా రమ్మని వాళ్ళ అమ్మ ఫోన్ ! అంతే!గబగబా వంట చేసేసి, రెండు చీరలు ఓ  సంచీలో కుక్కుకుని ముక్కు చీదుకుంటూ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయింది జానకి...అతని అర్ధాంగి. ప్రస్తుతం ఇంటి  దీన పరిస్థితికి అదీ కారణం...
   అరగంటలో స్నానాలు, గీనాలు ముగించేసి బయటపడ్డారు ముగ్గురూ.అలా అలా నాలుగు రోజులు గడిచాయి. సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం భయంగా ఉంటోంది సాంబశివరావుకి... ఇల్లంతా దుమ్ము...! ఎక్కడి  సామాన్లు అక్కడే! విడిచి బట్టలన్నీ మంచాల మీద !! వంటిల్లయితే చెప్పనలవికానట్లుంది... ఇంటి బయట ఎండిన ఆకులు, దుమ్ము ధూళి.. అంతా పరుచుకొని కంపరంగా అనిపిస్తోంది. వాటి కింద నుండి జానకి వెళ్లే రోజు ఉదయం వేసిన ముగ్గు దీనంగా తొంగి చూస్తూ కనిపిస్తోంది. ప్చ్ ! ఎలా ఉంచేది ఇల్లు!! అద్దంలా... ముట్టుకుంటే మాసిపోతుందా అన్నట్లు..!
    వారం దాటింది. జానకి జాడలేదు. ఫోన్ చేస్తే... "వయసు బాగా మీద పడింది కదా... నాలుగైదుచోట్ల కాలి  ఎముకలు విరిగాయట...రెండు ఆపరేషన్లు అయ్యాయి. మరో వారం దాకా హాస్పిటల్లోనే ఉండాలట... మా అమ్మ ఒక్కతే ఇంట్లో, హాస్పిటల్లో చూసుకోలేకపోతోంది. వచ్చేవారం మా అన్నా,   వదిన వస్తామన్నారు. అందాక నేను రాలేను... ఎలాగోలా మీరే సర్దుకోండి..."
 అంటూ చెప్పేసింది జానకి. గుండెల్లో రాయి పడింది సాంబశివరావుకి. ఇద్దరు  కొడుకులు తల వేలాడేసుకుని, మౌనంగా ఉండి పోయారు. చేసేదేముంది... అనుకుంటూ.. ఉదయం కాఫీలు మాత్రమే ఇంట్లో... టిఫిన్లు, మధ్యాహ్న భోజనం... బయట. రాత్రి మాత్రం ఏ ఉప్మానో, చపాతీనో చేసుకుని చట్నీలతో, కారంపొడులతో కానిచ్చేస్తున్నారు. 
    సాంబశివరావుకి వంట బొత్తిగా రాదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్  తీసుకొని ఉండేవారు. అప్పుడు కాస్త అలవాటు అయినవే..ఈ ఉప్మా, చపాతీ ప్రిపరేషన్లు... భార్య వచ్చాక, ఇక వంటింట్లో అడుగు పెట్టే అవసరం నాకేంటి.... అన్న ఫీలింగుతో కాలర్ ఎగరేసి తిరిగాడు.అంతేనా !  ఇద్దరూ కొడుకులే పుట్టారని తెగ మురిసిపోయాడింతవరకూ. కానీ.. ఇప్పుడు తెలిసి వస్తోందతనికి... ఆడపిల్ల లేని లోటు..! దేవుడా! నిజంగా ఆడది లేని ఇల్లు ఇంత దారుణంగా ఉంటుందా..! ఇంటికి దూరంగా ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు జానకి... కాన్పుల సమయంలో కూడా వాళ్ల ఊర్లో వైద్య సౌకర్యం సరిగా ఉండదని ఇక్కడే ఉండిపోయింది మరి... నిస్సహాయ స్థితిలో పడిపోయిన సాంబశివరావుకి పదేపదే పెళ్ళాం గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేముంది...!
    ఎలా ఉండేది ఇల్లు జానకి చేతిలో! ఉదయం ఎప్పుడు నిద్ర లేచేదో ఏమిటో... ఎనిమిదింటికంతా ఒంటిచేత్తో అన్నీ  సిద్ధం చేసి ఉంచేది. పనిమనిషి కూడా వద్దని సర్వం తనే చేసుకునేది. అందరి బట్టలూ ఉతికి ఇస్త్రీ చేసి టైంకు రెడీగా ఉంచేది. సాయంత్రం ఇంట్లో అడుగు  పెట్టేసరికి.... ఇల్లంతా ఆహ్లాదకరంగా. హాయిగొల్పుతూ ఉండేది. ఇప్పుడు..! తను లేని ఇల్లు బావురుమంటూ భారంగా అనిపించింది సాంబశివరావుకి! ఉన్నప్పుడు తెలియలేదు గానీ తన విలువ...ఎంతైనా ఆడవాళ్లు గ్రేట్ !! అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో 'ఇల్లాలు', 'ఇల్లాలే దేవత ', 'ఇంటికి దీపం ఇల్లాలు '...లాంటి సినిమా టైటిల్స్ అన్నీ గుర్తొచ్చాయి. దాంతోపాటు... 
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, 
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి  "
"ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం "
లాంటి సినిమా పాటలు కూడా గుర్తొచ్చి, గుచ్చి గుచ్చి మరీ వేధించాయి. 
   ఆ సాయంత్రం వంటింట్లో అడుగు పెట్టిన అతని చూపు అప్రయత్నంగా ఆ పక్కనే ఉన్న దేవుని గూడుపై పడింది. జానకి వెళ్లేరోజు పూజ చేస్తూ పెట్టిన పూలు, వాడి ఎండిపోయాయి. అగరొత్తుల తాలూకు ఆనవాళ్లు అక్కడ గూటినిండా పరుచుకుని ఉన్నాయి. అతని మనసంతా కలచివేసినట్లయింది. వెంటనే చీపురు తీసుకుని ముందు వంటిల్లంతా  శుభ్రం చేశాడు.అలవాటు లేని పని !దేహం మొరాయించింది. అయినా,  అలాగే మిగతా రూములూ అయిందనిపించాడు. .. కొడుకులు అది  చూసి లేచారు. పక్క బట్టలన్నీ సర్దేశారు.
    లోపల ఎలాగోలా అయిపోయింది... మరి గేటు బయట సంగతి! ఊడ్చడానికి నామోషీ ఒకటి! తల పట్టుకుని, "ఈ  ఇల్లు అద్దెకిస్తారా " అని ఎవరూ  అడగకముందే జానకి వచ్చేస్తే బాగుండు అనుకున్నాడు లోలోపల సాంబశివరావు. పోనీ, ఎవరైనా పనిమనిషిని చూద్దామా అనుకుంటే అంత అర్జెంటుగా దొరకడం గగన కుసుమమే! ఫోన్ చేసి భార్యను రమ్మనేద్దామా అనుకున్నాడో క్షణం. అత్తింటి వాళ్ళు ఎన్నడూ తన సహాయం కోరింది లేదు ఇప్పటివరకూ. లేక లేక అవసరమొస్తే తానలా చేయడం నచ్చక ఆ ఆలోచన విరమించుకున్నాడు వెంటనే..వారం అన్న జానకి మరో వారం దాకా రాలేదు. వాళ్ళ అన్నకు సెలవు దొరకలేదట..డీలా పడిపోయి జ్వరం వచ్చినంత పనయింది సాంబశివరావుకి.
   ఆరోజు ఉదయం తెలతెలవారుతుండగా గేటు చప్పుడయింది. జానకి రెండు సంచులతో ఇంట్లో అడుగు పెట్టింది. వంటింట్లో పాలు మరగబెట్టే పనిలో ఉన్న సాంబశివరావు అది గమనించి, అకస్మాత్తుగా దేవత ప్రత్యక్షమైనట్లు సంబరపడిపోయాడు..
" జానకీ, వచ్చేశావా...! ఫోనయినా చేయలేదే!.."
 అంటూ సంచులు అందుకున్నాడు.
" అవునండీ, అన్న, వదిన నిన్న సాయంత్రం వచ్చేశారు. ఇప్పటికే లేటయిందని నేను రాత్రి బస్సుకే బయలుదేరాను...ఏమిటీ, వీళ్ళింకా లేవలేదా..!"
అంటూ పిల్లల గదిలోకి తొంగి చూసింది. తల్లి గొంతు వినిపించి ఇద్దరూ గబగబా లేచి వచ్చారు వంశీ, వరుణ్. ఇల్లంతా ఓసారి పరికించి చూసిన జానకికి అంతా అర్ధమైపోయింది. అప్పటికప్పుడు ఏమీ  అనాలనిపించలేదామెకు. చీర కొంగు బిగించి, చీపురు అందుకుంది. అరగంటలో ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఇన్నేళ్లుగా తాను చేస్తున్న తప్పిదం బాగా తెలిసి వచ్చిందామెకు. దాంతోపాటు తన కర్తవ్యం కూడా బోధపడింది. ఇదంతా ఏమీ పట్టని సాంబశివరావు ఊపిరి పీల్చుకొని ఈజీ చైర్ లో రిలాక్స్ అయ్యాడు. 
    ఆ సాయంత్రం...
" రేయ్ఎక్కడికి బయల్దేరారు?... "
 కాలేజీ నుండి వచ్చి బ్యాట్లు పుచ్చుకుని బయటకు దారి తీయబోతున్న వంశీ, వరుణ్ తల్లి వైపు బ్యాట్లు  చూపిస్తూ, 
" క్రికెట్ ప్రాక్టీస్ కు మమ్మీ.."
 అన్నారు ఒకేసారి.
" అవన్నీ తర్వాత. ముందు అవి పక్కన పెట్టి ఇలా రండి, మీతో మాట్లాడాలి"
" అబ్బా,మమ్మీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రాక్టీస్ కు లేట్ అవుతుంది..."
"కుదరదు, నోరు మూసుకుని రండి."
 గద్దించేసరికి అలాగే బ్యాట్లు పట్టుకొని వచ్చి సణుగుతూ కూర్చున్నారు..
" జాగ్రత్తగా వినండి. ఈరోజు నుండీ కొన్ని అలవాట్లు మార్చుకోండి ఇద్దరూ . మీ పనులు మీరే చేసుకోవాలి.అంటే మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. మీ పుస్తకాలు అన్నీ మీరే సర్దుకోవాలి. ఇంటిపనులతోపాటు చిన్న చిన్న వంటపనులూ చేయాలి.... "
"...................."
"...రేపేదో మీ పెళ్ళాలకు చేసిపెట్టాలని కాదు, ఇదిగో, ఇప్పుడొచ్చిపడిందే గడ్డు పరిస్థితి...!అలాంటపుడు ఇబ్బంది పడకూడదని....! కనీసం కొంతలోకొంతైనా ఎవరికోసం చూడకుండా చేసుకోగలగాలని... అంతే.."
తలెత్తి చూశారిద్దరూ. 
"...అయినా మీ తప్పేమీ లేదులే. అంతా నాదే నాదే. మీకు మొయ్యకుండా ప్రతీదీ అమర్చిపెడుతున్నా చూడండీ... నాదీ.. నాదీ తప్పు. మగపిల్లలు మహారాజులూ... వాళ్ళు ఆడపనులు చేయకూడదూ అని మా అవ్వ, ముత్తవ్వ కాలం నాటి చాదస్తాలన్నీ నేనూ పాటించాను చూడూ...నాదీ..నాదే తప్పంతా. బుద్దొచ్చింది. ఉదయం మీఇద్దర్నీ చూశాక బాగా బుద్ధొచ్చింది. నాన్న వంటింట్లో ఒక్కడే అవస్థ పడుతుంటే మీరేమో హాయిగా గుర్రుపెట్టి నిద్దరోతున్నారు. సిగ్గుగా లేదురా మీకు !.."
"మమ్మీ, అదీ... "
" ముయ్యండి నోరు. ఇకనుంచీ నేను చెప్పినట్టు చేసితీరాల్సిందే.. "
"సరే మమ్మీ, ఈరోజు ప్రాక్టీస్ కెళతాం. రేపటినుండీ... "
"...కుదరదు. ఈరోజే ఇప్పుడే. మొదలెట్టాలి. మిగతావన్నీ తర్వాత.. "
తల్లి గొంతులో, ప్రవర్తనలో ఇదివరకెన్నడూ చూడని కాఠిన్యం చూశారిద్దరూ. మెల్లిగా బ్యాట్లు మూలన పెట్టి మాసిన బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు నడిచారు. టీ తాగుతున్న సాంబశివరావుకు భార్య ఏమిటో కొత్తగా కనిపించిందా క్షణంలో.
 " మొక్కై వంగనిది మానై వంగదండీ. అలవాటు పడాలి వీళ్ళు, తప్పదు. కొద్ది రోజులు నేను లేకపోయేసరికి ఇల్లు చూడండి ఎలా తయారైందో... !"
భార్య పరోక్షంగా తననూ అంటోందా అనిపించింది సాంబశివరావుకు. అయినా,సబబుగానే తోచింది అతనికి. ఈ మూడు వారాలూ తను పడ్డ కష్టం తలుచుకుంటే...! ప్రతీ ఇంట్లో చిన్నప్పట్నుంచీ మగపిల్లలకు తల్లో, అమ్మమ్మో, నాయనమ్మో లేకుంటే అక్కో, చెల్లో... ప్రతిదీ అందిస్తూ, అన్నీ అమరుస్తూ వాళ్ళను సోమరులుగా, ఏపనీ చేతగానివాళ్ళలా తయారుచేస్తున్నారు. ఇది ఆడపని..మేమెలా చేస్తాం అన్న ధోరణిలో పెరుగుతున్నారు. డిపెండెంట్ నేచర్ డెవలప్ అవుతోందని వాళ్ళకర్థం కావడం లేదు. వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ముందు తల్లులు మారాలి.. ఇదిగో...ఇలా...జానకిలా...! మనసులోనే భార్యను అభినందించాడు. కానీ, పైకి మాత్రం, 
" అది సరే వింటారంటావా... !"
అంటూ తటపటాయిస్తూనే సందేహం వెలిబుచ్చాడు. 
" తమరు వీళ్లకు వత్తాసు పలక్కుండా ఉండండి చాలు.. "
దండం పెట్టింది జానకి. 
" ఓకే ఓకే. హోమ్ మినిస్టర్ ఆదేశించాక తప్పుతుందా మరి !"
నవ్వుతూ, మరి ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని మెల్లిగా లేచి,అలా బయటికెళ్ళొస్తా... అంటూ గేటు దాటాడు. అక్కడ ఇంటి ముందు ముచ్చటగా ఓ కొత్త ముగ్గు..! మురిపెంగా కనిపించింది. అక్కడ నిన్న పరుచుకున్న చెత్త ఇప్పుడు మచ్చుకైనా లేదు.
"ఆహా ! ఆడది  ఉన్న ఇంటికీ లేని ఇంటికీ ఎంత తేడా! ఇదంతా ఇల్లాలి మహిమే కదా!"
 భార్యపై ప్రేమతో పాటు గౌరవమూ కలిగింది సాంబశివరావుకి.అంతలో ఠక్కున ఏదో స్ఫురించింది. బాపురే !ఈరోజు ఏదో విశేషమున్నట్లుందే !ఏమిటబ్బా!
బుర్ర గోక్కున్నాడు. మార్చ్, 8. Women's Day. మహిళాదినోత్సవం..! మరిచేపోయా... ఈ సందర్భంగా నా ప్రియమైన శ్రీమతికి ఓ చక్కటి బహుమతి ఇచ్చి తీరాల్సిందే... తృప్తిగా,  సంతోషంగా ముందుకు కదిలాడు సాంబశివరావు.
🌷💐🌹🌷💐🌹🌷🌹💐🌷🌹💐🌷🌹💐🌷🌹💐

 




      

Friday, March 8, 2024

పాప పుట్టింది

🤗

 పాప పుట్టింది
 ఓ జీవితం మొదలైంది
 ఈ ఇంటి దీపం
 ఆ ఇంట వెలుగవుతుంది 
 మరో తరానికి ఊపిరి పోస్తుంది
 తనను తాను మరుస్తుంది
 తన వారి గురించే తలుస్తుంది
 బ్రతుకంతా త్యాగాల మయం
 తరుణీ ! నీకు వందనం.... 🌷

Thursday, February 29, 2024

పెద్దకొడుకు....కథ

 జూన్, 2022 మాలిక పత్రికలో కథ : పెద్దకొడుకు 

రచన : యం. ధరిత్రీ దేవి 

Monday, February 26, 2024

మళ్ళీ వస్తుంది....

🥀
                                               ~~ యం. ధరిత్రీ దేవి   


ఆకులన్నీ రాలుతున్నవేళ...చింతించనేల...!
కొత్త చివురులు వస్తాయి...మురిపిస్తాయి...
మది నిండుగ మోదము కురిపిస్తాయి...
మోడు మోడుగానే మిగిలిపోదు... 
మళ్ళీ వస్తుందిగా వసంత శోభ.... 🥀🙂
జీవితానికి మాత్రం...వర్తించదా ఏమి ఈ సూత్రం!
ప్రయత్నించి చూద్దాం...పొందగలమేమో ఉపశమనం!!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦




 

Sunday, February 18, 2024

తనదాకా వస్తేగానీ..... ( కథ )

     మధ్యాహ్నం భోంచేసి, వంటిల్లు సర్దేసుకుని ఉస్సురంటూ అలా వెళ్లి నడుం వాల్చింది రాగిణి. భర్త గిరిబాబు, పాప, బాబు ఉదయం క్యారేజీలు తీసుకునే వెళ్తారు. సాయంత్రానిగ్గానీ తిరిగి రారు. పడుకుని కాస్త రిలాక్స్ అవుదామని కళ్ళు మూసుకున్న రాగిణి.. గేటు చప్పుడై విసుగ్గా లేచింది. 
రాఘవమ్మ ! ఇంటి ఓనరు. ఈసారి మూడింటికే దిగిందేమిటీవిడ ! అనుకుంటూ ముఖాన నవ్వు పులుముకుంటూ, 
" రండి రండి.. "
అంటూ ఆహ్వానించింది. ఆవిడో రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్. తప్పులెంచడం నా జన్మహక్కు అన్నట్లుంటుంది ఆవిడ వాలకం ! ప్రతి నెలా రెండో తారీఖు ఇంటి అద్దె కోసం స్వయానా తనే  వస్తుంది. 
" మీకెందుకండీ శ్రమ ! నేనే తెచ్చిస్తాను గదా, "
అని గిరిబాబు మొదటి నెలే అన్నాడు... కానీ ఆవిడ, 
" అయ్యో పర్వాలేదండి.. ఈ పక్క వీధిలోనే మా అమ్మాయి వాళ్ళు ఉంటున్నారు. నెలకోసారి వాళ్లనీ చూసినట్టు ఉంటుంది... "
అనేసింది. కానీ కొద్ది నెలలకే ఆవిడ ఆంతర్యం అవగతమైపోయింది గిరిబాబు దంపతులకు... అద్దె వసూలు చేసుకునే నెపంతో,  ఇల్లు ఎలా ఉంచుకుంటున్నారో చూడాలన్న  ఆదుర్దాతోనే ఆవిడ వస్తోందని !
    వచ్చినప్పుడల్లా ఇల్లంతా ఓ సారి కలయదిరుగుతుంది. ఏదో ఒకటి పట్టేస్తుంది. 
" గోడ మీద ఈ  గీతలేంటి రాగిణి గారూ ! పిల్లలకు కాస్త చెప్పుకోరాదూ... !" 
అని ఓ సలహా పారేస్తుంది. 
" పనిమనిషిని పెట్టుకోలేదా? "
అంటూ పైన వేలాడుతున్న బూజులు చూస్తుంది. అలా ఏదోఒకటి అనకుండా బయట అడుగు పెట్టదు. ఈసారి ఏం లాగుతుందో... అనుకుంటూ ఆవిణ్ణి కూర్చోమని చెప్పి, టీ తెస్తానంటూ లోపలికెళ్ళింది రాగిణి. పది నిమిషాల తర్వాత అద్దె  డబ్బు పుచ్చుకుని బయలుదేరింది రాఘవమ్మ. 
" అమ్మయ్య! ఈరోజు ఈవిడ కంట ఏదీ పడలేదు... "
నిట్టూర్పు విడవబోయింది రాగిణి. అంతలోనే... 
" అయ్యో.. అయ్యో.. పెయింట్ కొట్టించి సంవత్సరం తిరగలేదు. అప్పుడే గేటు ఇలా తయారయిందేంటి !ఎంతలా గీసుకుపోయిందో చూడు... !"
రాగిణి వైపు అదోలా చూస్తూ అంది. ఏమనాలో తోచక వెర్రి నవ్వు నవ్వింది రాగిణి. విసుగ్గా మొగం  పెట్టి వెళ్ళిపోయిందావిడ. అలసట రెట్టింపై నీరసం కమ్ముకొచ్చింది రాగిణికి. 
                     **          **          **
  " ఏమిటే, బాబూ.. ఈ పన్నెండేళ్లలో ఆరు ఇళ్లు మారాము. నీళ్లు సరిగా రావంటూ ఒకటి ! పిల్లలకు బడి దూరమని ఒకటి ! ఇరుగుపొరుగు బాగా లేరంటూ మరొకటి! అసలు ఓనర్సే మంచి వాళ్లు కాదని ఇంకొకటి ! ఎన్నని  మారతాము? ఎలాగోలా సర్దుకుపోవాలి గానీ.... "
అసహనంగా అన్నాడు గిరిబాబు ఆ రాత్రి భార్య చెప్పిందంతా విని.
" అది  కాదండీ, వచ్చినప్పుడంతా ఆవిడ నసుగుడు, అనుమానం చూపులూ... మరీ అతి అనిపిస్తోంది.."
".. పక్కనే ఉంటే ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటారనే కదా... ఓనరు ఎక్కడో దూరంగా ఉండే ఇల్లని దీంట్లో చేరాము..!"
".. అవునండీ.. కానీ దూరంగా ఉన్నదన్న మాటే గానీ... పక్కనున్న వాళ్ళకంటే ఎక్కువ చేస్తోందండీ ఈవిడ !"
రెండు మూడు సార్లు గిరిబాబున్నప్పుడు  కూడావచ్చింది రాఘవమ్మ. ఆమె తీరు అతనికీ నచ్చడం లేదు. కానీ ఏం చేయగలడు  ! మధ్యతరగతి జీవి! సొంతిల్లు అన్నది  వాళ్ళకి గగన కుసుమమే ! తప్పదు. నెట్టుకు రావాలి ఎలాగోలా.. భార్యకు సర్ది చెప్పాడు.. కొంతకాలం ఓపిక పట్టమని !
               **            **           **
   పదేళ్ళు గడిచిపోయాయి. ఆరోజు  గిరిబాబు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న ప్రమోషన్ వచ్చేసింది అతనికి UDC గా .ఆర్డర్ కాగితాలు పదేపదే చూసుకుంటూ సంబరపడిపోయాడు తన కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు! వెంటనే అతనికి మరో కల గుర్తొచ్చింది.అదే ! సొంతింటి కల ! ఇప్పుడు జీతం పెరుగుతుంది.. లోన్ కు అప్లై చేయాలి. ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఉండనే ఉంటుంది. ఎలాగైనా సరే ఇల్లు కట్టుకోవడమో, కొనడమో చేయాలి... భార్య గుర్తొచ్చి, 
" పాపం,  పిచ్చిది ! ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తూ ఉందో కదా సొంతింటి కోసం! "
అనుకుంటూ ఆనందంగా ఇల్లు చేరాడు.
                  **          **             **
   మరుసటి రోజు నుండే తన ఆలోచన అమల్లో పెట్టడం మొదలెట్టాడు.  ఆఫీసులో కొలీగ్స్ నీ, తెలిసినవాళ్లనీ సంప్రదించాడు. కట్టించడం అంటే రిస్క్ తో  కూడిన పని. ఆల్రెడీ కట్టినది తీసుకోవడం బెటర్ అని చాలామంది అభిప్రాయం వెలిబుచ్చారు. ఓ రోజు కొలీగ్ భాస్కర్ ద్వారా ఓ ఇంటి గురించి తెలిసింది. మరుసటి రోజు అతన్ని  వెంట పెట్టుకుని, రాగిణిని కూడా తీసుకుని వెళ్లి చూశాడు. రెండు పోర్షన్ల ఇల్లు ! బాగానే ఉంది. కట్టి రెండు  సంవత్సరాలే అయిందట! లొకాలిటీ కూడా పరవాలేదు. పిల్లలు కాలేజీ చదువులకొచ్చారుగాబట్టి... తనకూ వాళ్లకూ కాస్త దూరం అనిపించినా తిరగ్గలరు. రాగిణికి కూడా తెగ నచ్చేసింది. భాస్కర్ కూడా వంత పాడాడు. ధర కూడా వారికి అందుబాటులోనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని, ఓనర్ ను కలిసి... ముగ్గురూ బేరసారాలు జరిపి చెప్పిన దానికంటే ఓ ఐదు లక్షలు తగ్గించుచేసుకుని... మరో వారానికంతా రాతకోతలు పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది! గృహం గిరిబాబు దంపతుల సొంతమై స్వగృహం యజమానులై పోయారు. మరో నెలకంతా... గృహప్రవేశం.. పాలు పొంగించడం...అన్నీ పూర్తయిపోయి, ఒక పోర్షన్ లో చేరిపోయారు. ఆరోజు రాత్రి మొదటిసారిగా సొంతింట్లో  నిద్రిస్తూ, 
" అమ్మయ్య ! ఇంతకాలానికి మన సొంతింటి కల నెరవేరింది"
అనుకుని సంతోష పడిపోయింది రాగిణి . అసలు కష్టాలు స్వాగతం పలకబోతున్నాయని ఎరగని ఆ ఇల్లాలు  ఆదమరచి నిద్రపోయింది ప్రశాంతంగా..
                 **               **             **
      టులెట్ బోర్డు చూసి, అద్దె  ఇంటి కోసం అడగడం మొదలైంది  . కానీ,  కాస్త ఆలస్యమైనా.. సరైన వాళ్ళకి ఇచ్చుకోవాలని చూస్తున్నారిద్దరూ. ఓ నెలకంతా ఓ ఫ్యామిలీ దిగిపోయింది. భార్య,  భర్త, ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు.. ఓకే అనుకున్నారు.
  ఓ నెల గడిచింది. బయట శుభ్రం చేసుకోవడం, నీళ్లు జల్లి ముగ్గులు పెట్టుకోవడం.. పర్వాలేదు, పద్ధతిగానే ఉన్నారు.. అనుకుంది  రాగిణి. ఆమెకు వాళ్ళు దిగిన పోర్షన్ లోకి వెళ్లి ఒకసారి  చూడాలనిపించినా, ఏమనుకుంటారోనన్న మొహమాటంతో మిన్నకుండి పోయింది. అయినా ఉండబట్టలేక ఓ రోజు పలకరించే నెపంతో లోపల అడుగుపెట్టింది. అలా వెళ్ళిన రాగిణికి... అర్థమైపోయింది.. వాళ్ల శుభ్రత ఏమిటో! హాలంతా చెల్లాచెదురుగా వస్తువులు! ఊడ్చిన కసవు ఓ మూలన అలాగే ఉంది. దాంతోపాటే నిలబడ్డ చీపురుకట్ట ! వంటింట్లో సింకు నిండా అంట్ల  గిన్నెలు.. అది సరే! అందరిళ్లలో దర్శనమిచ్చేదే అని సరిపెట్టుకుని ముందుకెళ్లింది. అక్కడ ఓ మంచం, దానిమీద పడుకుని పెద్దాయన! పక్కనే కూర్చుని ఆయన భార్య! ఆమె చూపులు  పక్కకు తిరిగాయి. అక్కడ గోడలు చూసి ఒక్కసారిగా షాకయింది. తాంబూలం సేవించి, అదంతా ఊసిన ఎర్రటి మరకలు! 
"దేవుడా ! ఏమిటిదంతా!"
 రాగిణి  ముఖకవళికలు గమనించిన ఆమె, 
" ఈయనకి తాంబూలం అలవాటమ్మా, అది  లేకపోతే తోచదాయనకు.. ఏదైనా డబ్బా ఇచ్చినా అది వాడడు.. "
అంది సంజాయిషీగా. 
" ఆయన అలవాటు మాకు గ్రహపాటులా ఉంది"
అని  లోపల అనుకుని, నీరసంగా కదిలింది బయటకు. అద్దె  ఇంట్లో ఉన్నా తానెంత నీట్ గా ఉంచుకునేది! ఆ రాత్రి భర్త తో  విషయం చెబితే. విని  తలాడించాడు, అంతే!
   మొదట్లో సఖ్యంగా ఉన్నవాళ్లు రాను రాను ముభావంగా తయారైపోయారు రాగిణితో.  ఆర్నెల్లు తిరిగేసరికి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారా అని ఎదురు చూడసాగింది రాగిణి. అదృష్టవశాత్తు త్వరలోనే  అతనికి ట్రాన్స్ఫర్ అయి  వెళ్లిపోయారు.టులెట్ బోర్డు మళ్లీ ప్రత్యక్షం!
     ఈసారి ఎలాంటి వారు వస్తారో అన్న బెంగతో ఉంది రాగిణి. అద్దె  తక్కువైనా పర్వాలేదు, ఇల్లు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు దేవుడా అని  కోరుకుంది పదే పదే. నెల రోజులు అయ్యాక మరో జంట దిగింది. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఓ బాబు. చేరేటప్పుడు అన్నీ చూసుకునే ఓకే అన్నారు. కానీ చేరిన  వారం నుండీ అన్నీ ఫిర్యాదులే!
" ఏంటండీ, బెడ్ రూమ్  లో ఫ్యాన్ సరిగా తిరగడం లేదు. బాత్రూంలో నీళ్ళూ అంతే !..."
" టాయిలెట్ సరిగా పనిచేయడం లేదండీ.. రిపేరు చేయించండి."
" గీజర్ లేకపోతే ఎలాగండీ? పెట్టించండి.."
అంటూ ఒకటే నస! రాగిణి  బయట కనిపించినప్పుడల్లా! తల పట్టుకుంది ! మళ్ళీ మొదలైంది లోపల రొద !
" అబ్బ ! వీళ్ళతో మరో రకం బాధ! ఎప్పుడు పోతారో  ఏమిటో! అయినా అద్దె ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది బాబూ, సొంతిల్లు వచ్చాక అన్నీ తిప్పలే !"
              **           **             **
     గిరిబాబు ఓ క్షణం విచిత్రంగా భార్య వైపు చూసి, మరుక్షణం పకపకా నవ్వేశాడు. ఉడుక్కుంది రాగిణి. ఆమె కోపం చూసి,
 " లేకపోతే ఏమిటే, అద్దె ఇంట్లో ఉన్నన్నాళ్లూ.. సొంత ఇల్లు సొంత ఇల్లు అంటూ కలవరించావు. అది కాస్తా  వచ్చాక...అద్దిల్లే బాగుంది అంటున్నావు... "
" అది కాదండీ, మనమిలాగే ఉండేవాళ్ళమా చెప్పండి. ఎంత బాగా చూసుకునేవాళ్ళం ఇంటిని సొంతింటిలాగా!ఓనర్లతో ఎంత మర్యాదగా ఉండేవాళ్ళం!ఇప్పుడున్నవాళ్లయితే... చెప్పానుగా వాళ్ళ ఫిర్యాదులూ,  వగైరాలూ...ఇంతకుముందున్న వాళ్ళూ... ఇల్లంతా పాడుచేసి పోయారు చూస్తూ ఎలా ఉండాలి? "
" ఉండాలి,  తప్పదు. చూడు, మన ఒంట్లో బాగా లేకపోతే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళతాం. మందు వాడతాం. బాగుచేసుకుంటాం. కాస్త ఖర్చవుతుంది.. ఔనా ! అలాగే ఇల్లు కూడా.. ఇప్పుడున్నవాళ్ళు వెళ్ళిపోతే, మరొకరికిచ్చేలోగా పాడయినచోట బాగు చేయించుకుంటే సరి ! దానికీ అంతో ఇంతో ఖర్చవుతుంది.. అంతేగా ! ఆమాత్రం దానికి.. ఎందుకు టెన్షన్ పడుతూ.. ఆలోచిస్తూ.. మనసంతా పాడుచేసుకోవడం ..!"
చిత్రంగా చూసింది భర్త వేపు రాగిణి.
" అద్దె ఇంట్లో ఉన్నప్పుడు, ఓనర్ వస్తే.. నువ్వెంత విసుక్కునే దానివి!గుర్తు తెచ్చుకో. ఇప్పుడు వీళ్లూ అంతే అనుకోరాదూ.. తన దాకా వస్తే గానీ ఆ నొప్పి, దాని తీవ్రత తెలియదంటారు  అన్నట్లుంది నీ ధోరణి !"
"................."
"...పోతే, ఇప్పుడున్న వాళ్ళు ఏవైనా కావాలంటే చేయిద్దాం. లేదా వాళ్లనే చేయించుకోమందాం. అద్దె డబ్బుల్లో పట్టుకోమందాం. అంతేగా !"
"... సమస్య ప్రతీ చోటా ఉంటుందే పిచ్చి మొహమా !తమాషా ఏంటంటే... దాని పక్కనే పరిష్కారం కూడా ఉంటూ ఉంటుంది . అదే.. ఇప్పుడు నేను చెప్పినట్టన్నమాట ! అది తెలుసుకోలేక ఒకటే గుంజాటన పడుతుంటాం... "
కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది రాగిణి. 
" అందుకే.. నేచెప్పొచ్చేదేంటంటే.. అటువేపు చూడకు. వాళ్ళ మానాన వాళ్ళని వదిలెయ్. వాళ్ళు ఖాళీ చేసిన రోజు వెళ్లి.... అంతా తనిఖీ చేసుకుని... అవసరమైన చోట రిపేర్లు చేయించుకుందాం. ఖర్చంటావా !అవుతుంది !భరిద్దాం. ఈ టెన్షన్ తో వచ్చే మనస్తాపం కంటే అది ఎక్కువేమీ కాదులే.. కాబట్టి నా సలహా పాటించి నిశ్చింతగా ఉండు.. "
చెప్పడం ఆపి, సుదీర్ఘంగా నిట్టూర్చి,చిద్విలాసంగా  నవ్వాడు గిరిబాబు. రాగిణి కళ్ళు మెరిశాయి.
" అవును కదా! చిదంబర రహస్యం చిటికెలో ఎంత సూక్ష్మంగా చెప్పేశాడు! పాటించడం కాస్త కష్టమే! కానీ అసాధ్యమయితే కాదు!"
అనుకుంటూ వెళ్లి భర్త పక్కన కూర్చుంది. ఆక్షణంలో గిరిబాబు ఆమెకు జ్ఞాన బోధ చేస్తున్న గౌతమ బుద్ధుడిలా గోచరించాడు. 

******************************************










ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 8.. ' వైద్యో నారాయణో హరిః '

 🌺

        "వైద్యో నారాయణో హరిః"  -- ఈ మాటకు నూటికిి  నూరు పాళ్లూ సరిపోయే ఇద్దరు వైద్య నారాయణులు నా జీవనయానంలో నేనున్నంత వరకూ చెరగని గురుతులే. 
    అది నా మొదటి డెలివరీ సమయం. అప్పుడు నేను ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేస్తుండేదాన్ని. కర్నూల్లో అప్పట్లో బాలాంబ గారనే గైనకాలజిస్ట్ ఉండేవారు. నెల నెలా చెకప్ కు ఆమె వద్దకే వెళ్లేదాన్ని. ఐదవ నెల నడుస్తుండగా కొన్ని టెస్ట్ లు చేయించమన్నారావిడ. ఆ పరీక్షల్లో RH ఫాక్టర్ నెగటివ్ గా వచ్చింది. అలా వస్తే డెలివరీ అయ్యాక 48 గంటల్లో పల ఓ ఇంజక్షన్ తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారామె. మరో రెండు నెలలు గడిచాక ఆ డాక్టర్ గారికి హైదరాబాద్ బదిలీ జరిగింది. వెళ్తూ వెళ్తూ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, డెలివరీ తర్వాత ఇంజక్షన్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలంటూ దాని పేరు కూడా నాకు రాసి ఇచ్చారు. మంచి డాక్టర్ వెళ్లి పోతున్నందుకు చాలా బాధపడ్డానారోజు.
    నెలలు గడిచి, మరో డాక్టర్ పర్యవేక్షణలో సిజేరియన్ అయింది నాకు. పాప పుట్టింది. బాలాంబ గారు చెప్పినట్లు గానే ఇంజక్షన్ ఇవ్వడం కూడా జరిగింది.  ఐదారు నెలల తర్వాతనుకుంటా... ఓ రోజు నేను స్కూల్లో క్లాసులో ఉండగా... ప్రిన్సిపాల్ గారు పిలిపిస్తే ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్లాను.
  ఆశ్చర్యం! సంతోషం ! రెండూ  ఒకేసారి నాలో ! అక్కడ బాలాంబగారు !! నా పేరు గుర్తు పెట్టుకుని పిలిపించి, పరామర్శించి డెలివరీ గురించి అడిగారు. ఆవిడ నన్నంత  బాగా గుర్తుపెట్టుకోవడానికి మరో కారణం కూడా ఉంది. నేను చెకప్ కు తనవద్దకు  వెళ్తున్నప్పుడు డాక్టర్ గారి కుమారుడు అప్పుడు నేను పని చేస్తున్న ఈ స్కూల్లోనే రెండవ తరగతి చదువుతూ ఉండేవాడు. ఆ క్లాస్ టీచర్ నేనే. మొదటిసారి నేను చెకప్ కి వెళ్ళినప్పుడు నా గురించి వివరాలడిగారామె.పరీక్షించాక ఫీజు  ఇవ్వబోతే, 
" మా వాడి టీచర్ నువ్వు. నీ దగ్గర ఫీజు తీసుకుంటానా... "
 అంటూ సున్నితంగా వద్దనేశారు. ఓ పెద్ద పేరున్న డాక్టర్ చాలా రోజుల తర్వాత నన్ను పేరుతో సహా గుర్తు పెట్టుకుని నన్ను చూడాలని ఇలా పిలిపించడం ! మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇది జరిగి చాలా సంవత్సరాలయింది. ఈరోజు నేను వారికి గుర్తు ఉండకపోవచ్చు. కానీ నాకు మాత్రం నిన్నా మొన్నా జరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
    అలాగే బాలాంబ గారు హైదరాబాద్ వెళ్ళాక, మరో డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యానని చెప్పాను కదా,  ఆయన డాక్టర్ శ్రీనివాసన్  గారు. గైనకాలజిస్ట్. ఎంత నైపుణ్యం కలిగిన వైద్యుడంటే... మాటల్లో చెప్పలేను.  అప్పట్లో వారిగురించి అక్కడి పేషంట్లే కాక  హాస్పిటల్లో పనిచేసే ఇతర  డాక్టర్లు, నర్సులు  కూడా   చాలా గొప్పగా చెప్పేవారు.ఆతర్వాత డాక్టర్ గారిని   ఎప్పుడు కలిసినా  నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆరోగ్యం గురించి అడిగే వారు. నేను నాకు తెలిసిన వాళ్ళనూ, బంధువుల పిల్లల్ని ఆయన వద్దకు పిలుచుకొని వెళ్లి చూపించేదాన్ని కూడా. నన్ను చూసి,  ఫీజు వాళ్ళు ఇవ్వబోయినా తీసుకునేవారు కాదు. ఇప్పుడా  డాక్టర్ గారు లేరు. కానీ నా స్మృతిపథంలో ఎప్పటికీ సజీవంగా  నిలిచే  ఉంటారు. . వీరంతా పెద్ద పెద్ద డాక్టర్లు.. కానీ ఈ సందర్భంగా మరొకరి గురించి చెప్పాలి నేను.
---నా చిన్నతనంలో  మా ఊర్లో శివయ్య గారని ఉండేవారు. అప్పుడు నేను స్కూల్లో చదువుతుండేదాన్ని. ఆయనకు యాభై  పైనే ఉండేది వయసు. ఎంబిబిఎస్ డాక్టర్ కాదాయన. కానీ ఏ  చిన్న అనారోగ్యం ఎవరికి  పొడసూపినా వెంటనే ఆయన కోసం కబురు పెట్టేవారు ఊర్లో ప్రతి ఒక్కరూ. ఆయనేమో క్షణాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. అల్లోపతి,  హోమియోపతి మందులు ఆయనే  ఇచ్చేవారు. ఆయన వచ్చి  చేయి పట్టి చూసి, వెంటనే తన వద్ద ఉన్న  టాబ్లెట్స్ చేతిలో పెట్టి వేసుకోమనేవారు. అంతే ! మరుసటి రోజుకంతా నార్మల్ అయిపోయేది  పరిస్థితి ! అంత గొప్ప హస్తవాసి ఆయనది  !! ఆ ఊరి జనాలకు ఆయనే తిరుగులేని వైద్యుడు ! పైసా ఆశించడు. అలా నిస్వార్ధంగా సేవలందించే వాళ్లని ఈరోజుల్లో చూడగలమా ! అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు !  నా మస్తిష్కంలో మరపురాని గొప్ప వ్యక్తులువీరంతా🙏
     వీరి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించానంటే --
 ఇటీవలి కాలంలో కొందరు డాక్టర్ల తీరు చూస్తే చాలా బాధపడాల్సివస్తోంది. అప్పుడప్పుడు కాదు సరికదా.. రెగ్యులర్ గా  చెకప్ కు వెళ్లే పేషంట్లను కూడా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లుగా ప్రవర్తించడం! ఏదో మొక్కుబడిగా చూడడం. అవసరం లేకున్నా ఏవేవో పరీక్షలు చేయించండంటూ రాయడం.. అవసరానికి మించి రకరకాల టాబ్లెట్స్ రాసేయడం.. అవి వేసుకుని రోగి హరాయించుకోగలడా అని ఏమాత్రం  ఆలోచించక పోవడం..! చిన్న అనారోగ్యాన్ని కూడా పెద్దదిగా చూపిస్తూ మానసికంగా భయభ్రాంతుల్ని చేయడం ! 
     డాక్టర్ ను చూడగానే... వారి  చక్కని మాటతీరు వల్లే సగం జబ్బు నయం అవుతుందంటారు. ఆ పరిస్థితి ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా గోచరిస్తోంది. వ్యాపార ధోరణి బాగా పెరిగిపోయింది కూడా.వైద్యరంగంలో ఇలాంటి ధోరణి సమంజసం కాదు కదా !!
                      *****************

                    

      





Monday, February 12, 2024

ఓటుకు నోటు ( చిన్న కథ )


🌷

    సాయంత్రం  ఆరు దాటిపోయింది. శీతాకాలం. చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి. ఆఫీసులో పని ఒత్తిడి వల్ల ఈ రోజు కాస్త ఆలస్యం అయిపోయింది. అదిగో, ఆ మలుపు తిరిగి నాలుగడుగులు వేస్తే మా ఇల్లు. ఆటో దిగి వడివడిగా నడుస్తున్న నేను సరిగ్గా మలుపు దగ్గర ఠక్కున ఆగిపోయాను. అటువైపు చివర కొన్ని గుడిసెల్లో చిన్నాచితక పనులు చేసుకునే వాళ్లు కాపురముంటున్నారు. ఈ రోజెందుకో అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారు. సాధారణంగా పదిమంది కూడారంటే కలకలం రేగుతుంది. అలాంటిది ఎందుకో ఈ రోజు అక్కడ వాతావరణం చాలా గంభీరంగా ఉంది. సహజమైన కుతూహలంతో విషయం ఏమై ఉంటుందా అన్న ఆలోచనతో ఓ క్షణం ఆగిపోయాను. ఇంతలోనే మరో ఐదారుగురు గుంపుగా నా ముందు నుండే అటువైపు వెళ్లిపోయారు. నాలో మరింత ఆత్రుత! అక్కడికైతే వెళ్ళలేను, కానీ, తెలుసుకోవాలన్న ఉత్సుకత ! ఏం చేయాలో పాలుబోక అటూ ఇటూ దృష్టి సారించాను. సరిగ్గా అప్పుడే భాగ్యమ్మ హడావుడిగా వస్తూ కనిపించింది. తను మా వెనక వీధిలో మూడిళ్లలో పాచి పనులు చేస్తూ ఉంటుంది. అవసరమున్నా లేకున్నా కల్పించుకుని మాట్లాడే రకం. ఆ గుడిసెల్లో ఒకదాంట్లో ఆమె నివాసం. నేను నిలబడ్డం చూసి, 

" ఏందమ్మా, నిలబడి పోయావు? "అని అడిగేసింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయి, 

" ఆ, ఏమీ లేదు, అక్కడేదో జనాలు గుంపులుగా ఉంటే ఏమిటాని చూస్తున్నాను. " అన్నా. ఖచ్చితంగా ఆమె నుండి ' ఇన్ఫర్మేషన్ ' లభిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇక్కడుండే మూడు నాలుగు వీధుల సమాచారమంతా ఈ కాలనీకంతా డప్పు వేసేది ఈ భాగ్యమే కనక! 

" అదా, ", అంటూ, నాకు దగ్గరగా జరిగి,"ఎలచ్చన్లు గదమ్మా, పార్టీవోల్లు గుడిసెలోళ్ళకి డబ్బులు పంచుతున్నార్లెండి. నిన్న సాయంత్రం వేరే పార్టీవోల్లు పంచెల్లారు. ఈరోజు వీళ్లు. రేపు ఇంకొకరు కూడా రావచ్చేమో మరి!.... " అంది చేతులూపుకుంటూ. 

' అదేంటీ? ' అన్నా విస్తుబోతూ. 

" అవునమ్మా, ఈళ్ళు పోటీలుబడి ఇస్తా ఉండారు మరి!"

' ఎంతేమిటీ? '

 నాకు మరింత దగ్గరగా జరిగి గుసగుసగా అన్నట్లు చేతి వేళ్ళు ఐదు చూపించింది. ఇంకా దగ్గరగా జరిగి, 

" ఈళ్ళు ఇంకాస్త ఎక్కువిచ్చినా ఇస్తారు..." అంది. 

" అదేమిటి, అందరి వద్దా తీసుకుని ఓటెవరికేస్తారట? 

నాది అమాయకత్వమనుకుందేమో లోపల, పైకి మాత్రం

" భలేగుండావమ్మా, అదిసెప్తారా ఏంటి? మా లెక్కలు మాకు ఉంటాయ్ మరి ! అయినాలచ్చింతల్లి నేరుగా ఇంట్లోకి నడిసొస్తావుంటే ఎల్లిపొమ్మంటారామ్మా ఎవరైనా? " 

 ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన నన్ను సూటిగా చూడకుండా,

"....పోతానమ్మ, నా ఇంట్లో అయిదు ఓట్లుండాయ్ మరి !జల్దీ ఎల్లాలి... " 

 అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.

     కొద్దిరోజులుగా ఆనోటా ఈనోటా ఈ వార్త చెవిని బడుతూనే ఉంది. కానీ ఇంత బాహాటంగా చూస్తున్నది ఇప్పుడే. చూస్తుండగానే అటూ ఇటూ దారుల నుండి పదిహేను మంది దాకా గబగబా నడుచుకుంటూ అటువైపే వెళ్ళిపోయారు. నిట్టూర్పు విడిచి ఇంటి దారి పట్టాను. 

   రాత్రి పడుకున్నానన్న మాటే గానీ సాయంత్రం జరిగినదే పదేపదే గుర్తొస్తూ ఓ పట్టాన నిద్ర పట్టడం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజా నాయకులన్న వాళ్లకు స్వచ్ఛందంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా తమకు నచ్చిన వారికీ, నిజాయితీపరులకూ ఓట్లేసి గెలిపించేవారట ! అలా ఎన్నుకున్న వారే నిస్వార్ధంగా తమ సమస్యల్ని పట్టించుకుంటారన్న కొండంత నమ్మకం వాళ్లపై ఉండేదని విన్నాను. రాను రాను పరిస్థితి దారుణంగా మారిపోయి కేవలం అధికారం కోసమే పదవులాశించే వాళ్ళు తయారైపోయారు. ఇప్పుడేమో ఈ పెనుమార్పు! ఇంటింటికీ డబ్బులు పంచి ఓట్లను కొనేసుకోవడం ! పోనీ, అలా డబ్బిచ్చిన వాళ్ళకే ఓటేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే! అన్ని పార్టీల వద్దా తీసుకోవడం తీరా ఆ సమయానికి వాళ్ల నిర్ణయం ప్రకారం వాళ్ళు అనుకున్న వాళ్లకు వేసేయడం! మరి ఇచ్చేవాళ్ళ నమ్మకమేమిటో అర్థం కాదు. ఇది కేవలం పేదలకూ, నిరక్షరాస్యులకు మాత్రమే పరిమితం కావడం లేదు. కొద్దో గొప్పో చదువుకుని అవగాహన ఉన్న వాళ్లు కూడా ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారంటే ' ఔరా' అనిపిస్తుంది. ఫలితం! ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సాధ్యం అన్న రీతిగా మారిపోయింది. అలాంటప్పుడు నిజాయితీకి స్థానమెక్కడ? 

  మరి ఇలా ఓట్లను నోట్లతో కొనడం ఎంతవరకూ భావ్యం? ఈ వ్యవస్థ ఇలా భ్రష్టుపట్టి ఇలాగే కొనసాగుతూ పోతే రేపటి భవితవ్యం ఏమిటి? జవాబైతే దొరక లేదు గానీ, ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్ర లోకి మాత్రం జారిపోయాను.

******************************************

       



Monday, February 5, 2024

మౌనరాగం...కవిత

 
🥀

మే 2022 మాలిక పత్రికలో కవిత....మౌనరాగం 
రచన : యం. ధరిత్రీ దేవి 
                                                              🐦

Friday, February 2, 2024

ఒక వంటకం వండి చూడు..(కథ)

                                        ~~ రచన : యం. ధరిత్రీ దేవి 

" ఏంటిది సుమీ, ఏం కూర ఇది? రుచీ  పచీ లేదు.. "
" బీరకాయ కూరండి.. "
" ఛ ఛ ! ఏదీ  ఆ పచ్చడి ఇలా పడెయ్.. అదైనా తిన బుద్ధవుతుందేమో.. "
 సుమిత్ర మనసంతా అదోలా అయిపోయింది. పెళ్లయి మూడు నెలలు పూర్తి కావస్తోంది. పెళ్లికి ముందు వంటింటి మొహం చూసి ఎరగదు. భర్త సురేష్ కు రుచిగా లేకుంటే ముద్ద దిగదు. పైగా... రోజుకోరకం కావాలంటాడు. ప్రతి పూటా  ఇదే గొడవ!
   సెల్ ఓపెన్ చేసి, యూట్యూబ్ లో వంటల వీడియోలన్నీ చూసేసింది. చేయగలిగినవి.. ఓ నాలుగైదు సెలెక్ట్ చేసుకుని, ట్రై చేసింది. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక  ఊడిందన్నట్లు అయింది ఆమె పరిస్థితి. ! విసుక్కోవడం ముదిరిపోయి చేయి కడుక్కుని లేచిపోవడం మొదలైంది. 
    గుడ్ల నీరు కుక్కుకుంటూ పక్కింటి ప్రభావతి ఆంటీతో  మొరపెట్టుకుంది ఆ పిల్ల తన గోడు. ఆవిడ ఓదార్చి, పెళ్లయిన కొత్తలో ఇలాంటివి మామూలేనంటూ ఆరోజు తను చేసిన వంకాయ కూర ఓ గిన్నెలో పెట్టి ఇచ్చింది. లొట్టలేసుకుంటూ తిన్నాడు సురేష్. అంతటితో ఊరుకోక, 
" సుమీ, నువ్వూ ఇలా చేయడం నేర్చుకోవా.. "
 అంటూ ఓ సలహా పారేశాడు. మరుసటి రోజు చిన్న సీసాలో టమోటా చట్నీ ఇస్తూ, దాంతోపాటు బంగాళాదుంప వేపుడూ ఇచ్చింది ప్రభాతమ్మ. 
" ఎంత బాగుందో... ఎంత బాగుందో! "
 అనుకుంటూ... భార్యను కాదు... ప్రభావతి ఆంటీని మెచ్చుకున్నాడు సురేష్. ఆంటీ నడిగి తెలుసుకుని, రెండు రోజుల తర్వాత అచ్చం అదే పద్ధతిలో చేసి పెట్టింది సుమిత్ర. 
" అబ్బా ఏంటి సుమీ.. ఆంటీ కూర ఎంత బాగుండింది!"
 అంటూ మళ్లీ నసుగుడు, విసుగు! ఆంటీ చెప్పినట్లే తుచ  తప్పకుండా చేసింది.. కానీ ఆ  రుచి రాలేదట అయ్యగారికి!! ఏముంది! ఏడుపు ఒక్కటే తక్కువ సుమిత్రకు.
"ఛఛ...! వంట ఆడవాళ్లే చేయాలని నియమం ఎందుకు పెట్టారో ఏంటో ! ఆ రోజుల్లో అయితే ఓకే. కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా మగవాళ్లతో సమానంగా బయటపడి ఉద్యోగాలు చేస్తున్నారు కదా! మరి.. అలాగే మగాళ్లు కూడా వంట పనులు చేయడం లేదేమిటి! ఎందుకని ఈ వివక్ష !! ఆ మాట అన్నామంటే గయ్యిమని మీదపడి తన్నినంత పని చేస్తారీ మగాళ్లు.."
 తల పట్టుకుంది సుమిత్ర. అయినా.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు...అన్నట్లు "ఓ వంటకం వండి  చూడు" అని చెప్పాలి ఈ మగాళ్ళందరికీ. ! ఒళ్ళు మండిపోయి తలనొప్పి వచ్చేసిందా పిల్లకి...ఆ ఊపుతో రాత్రంతా ఆలోచించింది. అలా వరుసగా వారం రోజులు పాటు ఆలోచిస్తూనే గడిపేసింది. ఆ మరుసటి రోజు, ఆంటీ ఇచ్చిందండీ అంటూ బంగాళాదుంప వేపుడు, మజ్జిగ పులుసు వడ్డించింది. 
" అబ్బ ! ఆంటీ చేతి వంటే వంట !! ఆ చేతిలో ఏముందో గానీ,  అద్భుతం! ఎంత బాగుందో!"
 లొట్టలేసుకుంటూ మళ్లీ మళ్లీ కలుపుకొని తిన్నాడు సురేష్ తృప్తిగా. సుమిత్ర తల పంకించింది. అలా వరుసగా నాలుగైదు రోజులు పక్కింటి ఆంటీ ఇచ్చిందనీ, ఎదురింటి అక్కయ్య రుచి చూడమందనీ రకరకాల కర్రీస్ వడ్డించింది సురేష్ కు. ఏముంది...వాళ్ళను పొగడడం, భార్యను తెగడడం...అలాగే చెయ్యాలంటూ పోరుపెట్టడం..!కొత్త బాధ మొదలైంది సుమిత్రకు.మూడు రోజులు గడిచాయి. ఆరోజు మధ్యాహ్నం మామూలుగా భోజనానికొచ్చాడు సురేష్. 
" చూడండి. ఆంటీలాగే చేశాను.. వంకాయ కూర.. "
అంటూ వడ్డించింది. అతను మొహం అదోలా పెట్టి , 
" అస్సలు కుదర్లేదు సుమీ, ఆ రుచే రాలేదు.ప్చ్ !"
పెదవి విరిచాడు. 
"తెలివి అఘోరించినట్టే ఉంది. మొన్న ఇదే కూర బ్రహ్మాండంగా ఉందంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు...!"
"అవునూ.. అది ఆంటీ చేసినది కదా !"
" మహాశయా, ఆ కూరా ఈ కూరా చేసింది నేనే. అంతేకాదు, వరుసగా మూడు రోజులు వాళ్ళూ వీళ్లూ ఇచ్చారని మీకు చెప్పి వడ్డించిందీ నేను వండినవే. పక్కింటి ఆంటీవి కాదు, ఎదురింటి అప్పలమ్మవీ కావు... "
"..అదేంటే !వాళ్లిచ్చారని చెప్పావ్ !"
" ఆ, అలా చెప్తేగానీ తమరి నోటకెక్కదాయె.. ఏంచేయను మరి !నేను చేస్తే చేదా !వాళ్ళూ వీళ్లూ చేస్తే అమోఘమూ, అద్భుతమూనా !! అయినా, రోజూ కూరలు గీరలూ నాకు సప్లై చేయడానికి నేనేమన్నా వాళ్ల అమ్మ చుట్టాన్నా, అబ్బ చుట్టాన్నా.. !" 
" సుమీ, నిజమా ! నిజంగా నిజమా! అవి కూడా నువ్వే చేశావా..!"
" లేకపోతే... "
" సారీ రా. నువ్వు కూడా వాళ్లంత బాగా చేయాలని అలా అంటుంటాను గానీ..."
".. అదేమీ కాదు లెండి, పొరుగింటి పుల్ల కూర రుచి ఎవరికైనా.."
 ఉడుక్కుంది  సుమిత్ర. అతని వైపు ఓరగా చూస్తూ, గిన్నెలు సర్దుతూ, 
" అయినా, అప్పుడప్పుడైనా పెళ్ళాం వంటల్ని మెచ్చుకోకపోతే అసలుకే మోసం వస్తుందండీ శ్రీవారు.."
దెప్పిపొడిచింది. ఆ రోజు నుండీ సురేష్ భార్య వంటలకు వంకలు పెడితే ఒట్టు! అని అంటాను అనుకుంటున్నారా ఏంటి !! అయ్యో రామ! ఇప్పటికి  పదేళ్లయిపోయింది పెళ్లయిపోయి.. ఇద్దరు పిల్లలు ఇంట్లోకి ఎక్స్ట్రాగా వచ్చారు. సుమిత్ర కష్టపడి ఓపిగ్గా చేస్తూనే ఉంది. ఆయన గారు కడుపారా తింటూనే ఉన్నారు. వంకలు పెడుతూనే ఉన్నారు.. నైజం ఎక్కడికి పోతుందండీ  బాబు! సుమిత్ర మాత్రం తక్కువ తిందా! భర్త మెప్పు కోసం తన వంతు ప్రయత్నం మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంది.. అది ఆమె నైజం!అది మాత్రం ఎక్కడికి పోతుంది పాపం!! పుట్టుకతో వచ్చిన బుద్ధులు మరి !!   
  కాకపోతే... ఓ చిన్న మార్పయితే జరిగిందండోయ్.! ఇది వరకు ప్లేటు  ముందు కూర్చోగానే వంకలు వెదికే భర్త గారి జోరు మాత్రం కాస్తలో కాస్త తగ్గింది. కారణం..! ఆయన గారు నోరు తెరిస్తే చాలు.. బ్రేకులు వేసే సుమిత్ర కస్సుబుస్సులే !! thank god! కనీసం అదైనా అలవడింది ఆ ఇల్లాలికి.. !

******************************************


Thursday, January 25, 2024

చిన్నారి పజిల్స్.. మాటల ఆట...

 చిన్నారి పజిల్స్ 🙂( సరదాగా కాసేపు )




( ఈనాడు ' హాయ్ ! బుజ్జి !!' లో ప్రచురితం )

Wednesday, January 24, 2024

నిజం తెలుసుకుంటే...బ్రతుకంతా సంబరమే...

🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀

తొంగి చూడకు గతంలోకి...
అక్కడంతా చీకటి !!
కమ్ముకున్న మేఘాల దాగి
తడి ఆరని కన్నీటి తడి...
తరచి తరచి వగచితివో... 
మరింత అలజడి...
అందులో... 
మురిపిస్తాయి..మైమరిపించే 
సందడులు కొన్ని..
మిణుకు మిణుకుమంటూ 
కొద్ది క్షణాలే అవన్నీ...
మరుక్షణమే మాయమై
మళ్లీ మొదలు...వేధిస్తూ 
జ్ఞాపకాల సుడిగాలులు... 
అందుకే... 
చూడకు గతంలోకి...
అక్కడంతా  చీకటి...!!
"వేదన కొంత... వెలుతురు కొంత...
ఇంతే కదా...జీవితమంతా...!"
మేఘాల మాటున దాగిన ఆ తడి...
మండుతున్న నీ గుండెను
సేద దీర్చే పన్నీటి జడి అనుకో !!
నిజం తెలుసుకుని సాగిపో...
ముందుకు...మున్ముందుకు...
ఆపై...అంతా వెలుగే...
బ్రతుకంతా సంబరమే !!

🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀


 

Thursday, January 18, 2024

కొత్త అమ్మ కాదు.. చిన్నమ్మ అసలే కాదు.. సొంత అమ్మే... !( కథ )

                                             ~ రచన: యం. ధరిత్రీ దేవి 

"వీళ్లేనా శరణాలయంలో చేర్చాలనుకుంటున్న పిల్లలు?" 
ఎనిమిదేళ్లలోపు వయసున్న పాప,  బాబు లను చూస్తూ అడిగింది అనాధ శరణాలయం నిర్వాహకురాలు వసుంధర. 
" అవునమ్మా... " 
 ఆ పిల్లల నాయనమ్మ, తండ్రి ఇద్దరూ ఒకేసారి బదులిచ్చారు. 
" చాలా చిన్న పిల్లలు. ఇంతకూ  ఎందుకు చేర్చాలనుకుంటున్నారు? తండ్రి ఉన్నాడు. నాయనమ్మవు నీవూ  ఉన్నావు.. వీళ్ళ బాగోగులు చూడ్డానికి మరో పెళ్లి కూడా చేశావు నీ కొడుక్కి.. ఇందరుండగా... వీళ్ళు అనాధలెలా అయ్యారు?... "
 భార్య చనిపోయిన ఆర్నెళ్లకే మళ్లీ మనువాడిన అతన్ని చూస్తూ అడిగింది వసుంధర. ఆ సూటి ప్రశ్నలకు క్షణం మాట్లాడలేదు ఇద్దరూ. 
" నిజమేనమ్మ.. కానీ..ఎంతైనా సవతి తల్లి.. కన్నతల్లిలా ఎలా చూస్తుంది.. ! అందుకే... "
 తల పంకించి, 
" ఆమె వచ్చి ఎన్నాళ్ళయింది? "
" నెల దాటిందమ్మ... "
" నెల రోజులకే ఆమె వీళ్ళని సరిగా చూడదని నిర్ణయించుకున్నావా ?.  "
 చాలా 'కూల్' గా అడగడానికి ప్రయత్నించింది వసుంధర. 
" అవునమ్మ.. ఎందర్ని చూడ్డం లేదూ.. !"
" అలాంటప్పుడు కొడుక్కి పెళ్ళెందుకు  చేశావు? నీవే చూసుకోవచ్చు గదా, సొంత నాయనమ్మవేగా.. "
" అయ్యో అమ్మ ! నా కొడుకు వయసెంతని?  పైగా రేపో మాపో  పోయేదాన్ని నేను... వీళ్లను ఎన్నాళ్లని చూడగలను?  వంటా గింటా... మిగతా అన్ని పనులూ  నాతో అవుతాయా?... "
" కదా.. అవేవీ  నీతో కావు. అవన్నీ చేయడానికి ఓ ఆడది కావాలి. బయటి వాళ్లు చేయలేరు. చేయరు. ఇంటి మనిషే కావాలి. అందుకు నీ కొడుక్కి పెళ్లే చేయాలి. తప్పదు..."
" అంతే కదమ్మా..."
" అంతవరకూ  ముక్కూ  మొహం ఎరగని ఆమె నుండి అంత ఆశిస్తున్నావు... సరే.. బాగుంది.. నీ ఇంటికొచ్చి, అంతవరకూ  ఏ బంధం  లేని మిమ్మల్ని సొంత వాళ్లుగా, నీ కొడుకు పిల్లల్ని సొంత పిల్లలుగా చూడాలనుకుంటున్నావు నీవు ! అలాంటప్పుడు ఆమెను  మీరూ  మీ సొంత మనిషిలా చూసుకోవాలి కదమ్మా.... "
"................"
" మీరంతా కోరుకున్న విధంగా ఆమె ఉండాలంటే... ఆమె కోరుకున్న విధంగా మీరూ  ఉండాలి కదా ! నీ కొడుక్కి  రెండో పెళ్లి కావచ్చు... ఆమెకు మొదటిదే కదా! ఎన్ని ఆశలతో తన వాళ్లను వదిలి నీ ఇంట్లో అడుగు పెట్టి ఉంటుంది !.."
"................"
".. భార్యను పని చేయడానికే  వచ్చిన దానిలా, మీ అవసరాలు తీర్చడానికే వచ్చింది అన్నట్లుగా ప్రవర్తిస్తే.. మీమీద  తనకి ప్రేమాభిమానాలు ఎలా పుట్టుకొస్తాయి?  చెప్పు బాబూ, నీ భార్యను ప్రేమగా చూసుకుంటున్నావా ? "
 అతని వైపు చూస్తూ ప్రశ్నించింది వసుంధర. తల దించుకున్నాడతను. 
".. చూడండీ, పరిస్థితులకు తలఒగ్గే ఏ ఆడపిల్లయినా ఇలాంటి పెళ్లికి సిద్ధపడుతుంది. అనవసర భయాల్తో, అనుమానాలతో ముందుకుముందే ఆమె గురించి ఓ నిర్ణయానికి రాకండి. ఇంకా ఇంట్లో అడుగుపెట్టక ముందే ఆమె పట్ల ఓ రకమైన ఏహ్యభావాన్ని పిల్లల్లో కలిగించి వాళ్ల పసి మనసుల్ని విషపూరితం చేస్తే ఎలా? "
ఇద్దరిలోనూ చిన్నగా అలజడి !
"... కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకు వెళ్తున్నాను, వాళ్లు నన్ను ఎలా చూసుకుంటారో అన్న భయం, అనుమానం ఆమెకూ  ఉంటాయి కదా ! తన వైపు నుంచి కూడా ఆలోచించాలి గదమ్మా... "
".. మేమేదో అనుకుని వస్తే, ఈవిడేంటి నీతి బోధలు చేస్తోంది మాకు.. అనుకోమంటే... ఒక్క మాట చెబుతాను. ఆ తర్వాత మీ ఇష్టం... "
ఇద్దరూ తలెత్తి  ఆమె కళ్ళల్లోకి చూశారు. 
" మీ పిల్లల్ని సరిగా చూసుకుంటూ ఉన్నదా లేదా అన్న విషయం కొద్దిరోజులపాటు పక్కనబెట్టి, ముందు మీరు ఆమెను ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోవడం మొదలెట్టండి ఈరోజు నుండే... ఆమెను మీ సొంత మనిషిలా చూస్తూ, నీకు మేమున్నామనే భరోసా, ధైర్యం కలిగించండి. అప్పుడు.. అప్పుడు.. మీరేదయితే ఆమె నుండి ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా మీకు అంది  తీరుతుంది..... "
"..................... "
".. మన ప్రవర్తనని బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. పెద్దదానవు..నీకు నేను చెప్పేదేంటి! ... పరాయింటిది అన్న ఆలోచన మాని,...అమ్మలా  ఆమెను అక్కున చేర్చుకో.. భర్తగా నీ గుండెల్లో చోటివ్వు బాబూ.. అప్పుడు నీ పిల్లలకు సవతి తల్లి కాదు.. కన్నతల్లే  దొరుకుతుంది.వాళ్లు ఎప్పటికీ అనాధలు కారు.."
"...కొత్తఅమ్మ కాదు.. చిన్నమ్మ అసలే కాదు, వాళ్లకెప్పుడూ ఆమె అమ్మే ! అలా ఉండాలంటే ముందు మీరు మారండి... "
తల్లీకొడుకులిద్దరూ రెండు చేతులూ జోడించి  నమస్కరించారు. ఇంతవరకూ వాళ్లకు తోచని కొత్త విషయం బోధపడింది.వాళ్ళ కళ్ళల్లో నీటి సుడులు...!!
మొహాల్లో అవ్యక్త భావన !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, January 15, 2024

ఇంద్రధనుస్సు...The Rainbow.. TWO...మరోసారి


 *జనవరి  * 2024
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌷

**************************************
ఈనాటి 'ఇంద్రధనుస్సు' లో....
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
*    పెద్దల మాట            ----   బాలరసాలసాల...
*   స్వాగతం 2024        ----   సర్వజనుల పండగ✍️  
*   స్ఫూర్తి                      ----   పాటల్లో పాఠాలు 
*   మనసు పలికిందిలా ----   ఆరనీకుమా.... ✍️
*   😄😊😛😁             ----   సరదాగా ఓ నిమిషం 
*   చిన్నారి పజిల్స్        ----   వాక్యాల్లో వాహనాలు✍️
*   మరిన్ని                    ----   విదేశాల్లో వివాహాలు...? 
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
                                      నిర్వహణ:యం.ధరిత్రీ దేవి               *****************************************
                 పెద్దల మాట  
 శ్రీనాథుడు, పోతన...ఇద్దరూ గొప్ప కవులే. తెలియనివారెవరుంటారు చెప్పండి...!k ఒకటే తేడా...శ్రీనాథకవి తన కావ్యాలను మహారాజులకు అంకితమిచ్చి వారు బహూకరించే ధనరాశులతో  విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పోతనామాత్యుడు తద్భిన్నం...వ్యవసాయం చేసుకుంటూ భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ ఉంటాడు. 
" ఎందుకిలా కష్టపడతావు? నీ కావ్యాలను నాలాగా రాజులకర్పించి సుఖ జీవనం సాగించవచ్చు కదా..!"
అన్న శ్రీనాథునితో పోతనామాత్యుడు ఒకానొక సందర్భంలో అన్న మాటలివి... పద్య రూపంలో....
🌷
బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటె 
సత్కవుల్ హాలికులైననేమి  కందమూల 
కౌద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై 🌷

     " గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి కావ్య కన్యకను అమ్ముకుని ఆ పడుపు కూడు తినడం కంటే నిజమైన కవులు తమ భార్యా  బిడ్డల ఉదర పోషణ కోసం నాగలి పట్టిన రైతు లయినప్పటికీ,అటవీ ప్రాంతంలో దుంపలు, పుట్ట తేనెలతో జీవించు వారైనప్పటికీ తప్పు లేదు....."
   పోతనగారి ఔన్నత్యం, నిరాడంబరత ప్రస్ఫుటంగా తెలియడం లేదూ ఇందులో..!! ఆతరం వాళ్లలో ఈ పద్యం విననివారు బహుశా అరుదనుకుంటాను...ఓసారి మననం చేసుకునే ప్రయత్నం మాత్రమే ప్రస్తుతం నేను చేస్తున్నది...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~   🌷 స్వాగతం 🌷సర్వజనుల పండగ 🐦 ✍️

  *ప్రభాతవేళ ! ప్రభాకరుని కిరణాలు భూమాతను సోకుతున్న వేళ ! తల్లి పొత్తిళ్ల  దాగిన చిరు మొగ్గల  లేలేత  పూరేకలు మెల్లి మెల్లిగా విచ్చుకుంటూ, పసిపాప నవ్వును తలపిస్తున్న వేళ ! సవ్వడి సేయక ఏతెంచిందిగా...నూతన సంవత్సరం !!
     తనకేం తెలుసు! జగమంతా సంబరాలు చేసుకుంటూ, కేరింతలు కొడుతూ, జేజేలు పలుకుతూ, వేయి కళ్ళతో ఎదురు చూస్తూ...అట్టహాసంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా... గత రాత్రి నుండీ నిద్ర మాని మరీ తనకోసం స్వాగత సన్నాహాలు చేస్తున్నారని !!
   ప్రతీ జనవరికీ మరల మరల... తిరిగి తిరిగి వస్తున్నా...ఎందుకోమరి... అందరికీ అంత  ఆనందం!అంత ఎదురుచూపులు !! ఇంతా చేసి.. అదంతా ఒక్కరోజే...! ఆ తర్వాత అంతా మామూలే...అంతే ! అదో ఆనవాయితీ ! అదో సంప్రదాయం! అందరూ కలిసి కొద్దిసేపు అన్నీ మరిచి... ఆడుతూ పాడుతూ, ఊసులాడుకుంటూ, సరదాగా నవ్వులు కురిపిస్తూ...!ఓస్ ! మంచిదేగా!!
   ఎన్నో పండుగలు చేసుకుంటాం.. కొన్ని మన ఇంటికే  పరిమితం.. కొన్ని కొందరికే  పరిమితం.. కొన్నేమో.. దేశానికి మాత్రమే పరిమితం. కానీ ఇది మాత్రం సరికొత్త పండుగ..! అందరికీ చెందిన పండుగ బహుశా ఇదొక్కటేనేమో!! కుల మతాలకు తావివ్వని, హద్దులూ  సరిహద్దులూ ఎరగని, ఆంక్షలు, ఆక్షేపణలూ లేనిది !! సర్వజనుల పండగ ఇది!🙂అదిగో ! నూతన సంవత్సర ఆగమనం!! ఆహ్వానిద్దాం... ఆనందిద్దాం..

      💐🙋‍🙂 HAPPY NEW YEAR 💐🙋‍🙂
                                2024
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~               స్ఫూర్తి ✍️
గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలే కాదు... గమనిస్తే, కొన్ని సినీ గీతాలు కూడా ఎంతో ప్రేరణనిస్తుంటాయి..కదా !
🥀
    కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి 
    నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి 
    జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు 
🥀   
    చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో 
    మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో 
    పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో 
    మారిపోని కథలే లేవని గమనించుకో 
    తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు 
    నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి 
    నీ సంకల్పానికి  ఆవిధి సైతం చేతులెత్తాలి 
🥀
    అనుకున్నామని జరగవు  అన్ని
    అనుకోలేదని ఆగవు కొన్ని
    జరిగేవన్నీ మంచికనీ  
    అనుకోవడమే మనిషి పని...
--- ఇవి కొన్ని మాత్రమే. ఇంకా.. చాలా..చాలా ఉంటాయి... గుర్తు తెచ్చుకుంటే..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  *   మనసు పలికిందిలా 🌄✍️
ఆశాదీపం ఆరిపోనీకు...
-------------------------
    కలిమి పోయిందా !
    కలవరపడకు...
    కష్టపడితే కలిసొస్తుంది...
    బలిమి పోయిందా !
    బాధపడకు....
    బతుబండేమీ ఆగిపోదు... 
    ఆరోగ్యం దిగజారిందా !
    దిగులు పడకు...
    బాగయ్యే మార్గాలున్నాయి...
    వెతుకు....అయితే...
    ఆశ ఆవిరైపోయిందా....!!
    నీవు జీవన్మృతుడవే సుమా... 
    ఆదీపం ఆరిపోనీకు ఎప్పటికీ....
    ఆశాజీవికి అపజయమెక్కడిది !
 మేలుకో...మిత్రమా!!👍           ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
🤗😊😄😇 సరదాగా ఓ నిమిషం... 

వెంగళప్ప : అప్పర్ బెర్త్ దొరికిందేమో... రాత్రంతా నిద్ర లేదు.
మిత్రుడు : పోనీ.. కింది బెర్త్ వాళ్ళను రిక్వెస్ట్ చేసి బెర్త్ మార్చుకోవాల్సింది... 
వెంగళప్ప : అడుగుదామనే  అనుకున్నా. కానీ, రాత్రంతా చూసినా బెర్త్  ఖాళీగానే ఉంది...
😛
ఇంటావిడ ( ఫోనులో ) : కాలింగ్ బెల్ పని చేయట్లేదని నిన్న ఫోన్ చేశాను. వస్తానని చెప్పి మీరు రాలేదు..? 
ఎలెక్ట్రీషియన్ : నిన్ననే వచ్చాను. కానీ, ఎన్నిసార్లు బెల్లు కొట్టినా మీరు తలుపు తీయలేదు...🤔
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  *                చిన్నారి పజిల్స్ 🧒🙎?  ✍️
( ఈనాడు 'హాయ్!బుజ్జి!!' లో  ప్రచురితం )



ఏమిటీ ! చిన్నపిల్లల్లా.. ! అనుకుంటున్నారు కదూ! నిజమే... చిన్నపిల్లలు పూరించాల్సినవే... కానీ, వీటిని రూపొందించే 'ప్రాసెస్' లో కాస్త ఆలోచించాల్సిందే నండోయ్... కావాలంటే, ఓ రెండు వాక్యాలు ప్రయత్నించి చూడండి.బోలెడంత కాలక్షేపం కూడ🙂ఏమంటారు!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
      *      మరిన్ని ••••
   ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావిస్తూ... కొంతమంది సంపన్నులు విదేశాల్లో వివాహాలకు మొగ్గు చూపుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లో పరిణయం (wed in India) ప్రచారం ప్రారంభించాలని సంపన్న పారిశ్రామిక కుటుంబాలను ఆయన కోరారు. వీరిలో  క్రీడా, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఎక్కువగా ఉంటున్నారు. కారణాలు అన్వేషిస్తే....
• వ్యక్తిగత గోప్యత
• స్వేచ్ఛ
• బంధుమిత్రులతో నచ్చినట్లుగా గడివే వీలు 
• భద్రతాపరమైన సమస్యలు పెద్దగా లేకపోవడం
   పై కారణాలన్నింటి వల్ల వివాహ నిర్వహణ సులభతరంగా ఉంటుందన్నది వారి ఆలోచన..! కానీ దీనివల్ల ఖర్చు  అయితే తక్కువ ఏమీ కాదట !! ఈ సందర్భంగా వివాహం కోసం చేసే ఖర్చంతా మనదేశంలోనే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 
    ఇదంతా  పక్కన పెడితే... ఇటీవలి  కాలంలో సంపన్నులతో పాటు సామాన్యులు  కూడా పెళ్లిళ్ల కోసం పెడుతున్న ఖర్చు తక్కువగా  ఏమీ ఉండటం లేదు... పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుండే ఈ ధోరణి గురించి కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో !!
<><><><><><><><><><><><><><><><><>
             అందరికీ ధన్యవాదాలు 🙏
<><><><><><><><><><><><><><><><><