Friday, March 24, 2023

బఫే భోజనాలు... బాబోయ్.. !

       ప్లేట్ లో రెండు రకాల స్వీట్లు, ఓ బజ్జి , పులిహోర, కొన్ని వడియాలు, దోస, క్యారెట్ ముక్కలు -- ఇలా ఐదారు రకాలు పెట్టించుకుని ఇవతలకొచ్చి, నిలబడి చుట్టూ ఓ సారి చూసింది రేవతి, ఎక్కడైనా ఓ ఖాళీ ఛైర్ కనిపిస్తుందేమో, కాస్త నింపాదిగా కూర్చుని తిందామని! అబ్బే, అసలే అక్కడక్కడా కొన్ని చైర్స్ మాత్రమే వేశారు. ఎక్కువ వేస్తే తిరగడానికి ఇబ్బంది అనేమో ఉన్నవన్నీ పేర్చి, ఓ మూలన సర్దేశారు.  ఉన్న కొన్నింటినీ  కొందరు అప్పటికే ఆక్రమించి తింటున్నారు.హుష్ ! నిట్టూరుస్తూ ఓ పక్కగా నిలబడి, మెల్లిగా తినడం మొదలెట్టింది రేవతి. ఓ వైపు ఎండ, మరోవైపు కాళ్లు లాగుతున్నాయి. దానికి తోడు చేతిలో పళ్లెం మోత! ఈ 'బఫే'  కాదు గానీ, ఓ క్షణం విసుగొచ్చేసింది రేవతికి. ఎప్పుడెప్పుడు ముగించి, పళ్లెం ఆవల పెట్టేసేద్దామా అనిపించిందామెకి. 
     బాగా దగ్గరి చుట్టాలు. పిలిచాక వెళ్లకపోతే బాగుండదు. రాలేనని చెప్పడానికి వెధవ మొహమాటం! పోనీ ఊరికే అటెండ్ అయి వచ్చేద్దామా అనుకుంటే... తినకుండా వచ్చేస్తే బాధ పడతారేమో అని లోపల అదో  గుంజాటన !
      రేవతి రిటైరై అయిదేళ్ళయిపోయింది. ఇంటిపట్టునే ఉండడం అలవాటైపోయి, బద్ధకం పెరిగి, దాంతో పాటు శరీరం కూడా ఇట్టే పెరిగి పోయింది. మునుపున్న చలాకీతనం తగ్గిపోయి, ఆ స్థానంలో మోకాళ్ళనొప్పులు చోటు చేసుకుని ఇదిగో ఇలాంటి సందర్భాల్లో తెగ బాధపెడుతూంటాయి. ఒక్కోసారి వెళ్లడం మానేద్దామని గట్టిగా అనుకుంటుంది, కానీ మళ్ళీ మామూలే ! 
    పక్కింట్లో రిటైర్డ్ టీచర్ పార్వతమ్మ డెబ్భై కి చేరువలో ఉంది. ఇలా ఇంటికెవరైనా వచ్చి, ఫంక్షన్ లంటూ పిలిస్తే... నిర్మొహమాటంగా రాలేనని చెప్పేసి, ఆ వెంటనే వాళ్ళ చేతిలో ఏదో ఒక గిఫ్ట్ గానీ, లేదా ఎంతోకొంత 'ఎమౌంట్ ' పెట్టిన కవర్ గానీ పెట్టేసి ఏమీ అనుకోవద్దని నవ్వేస్తుంది ! 
  "వెళ్లకపోతే ఎలాగండీ, ఏమైనా అనుకోరా..? "
అని ఓసారి తనంటే, 
".. ఏమిటండీ, రేవతి గారూ, మీరు మరీనూ... పిలిచిన చోటికల్లా వెళ్లే వయసా  మనదీ..? అయినా,  మీ పిచ్చి గానీ,  మనం వెళ్లకపోతే ఏమైనా అనుకునేవాళ్లూ, అలిగే  వాళ్లు కూడా ఉంటారుటండీ ? సరే, ఉంటారే అనుకోండి. ఏమాత్రం అర్థం చేసుకోలేని అలాంటి వాళ్లను పట్టించుకోవడం, బుర్ర పాడు చేసుకోవడం మనకు అవసరమంటారా? చెప్పండి..." 
 అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. ఇంకా --
"... అయినా వెళ్లగలిగినంత కాలం వెళ్ళాం. చూసినంత కాలం అన్నీ చూశాం. ఇంకా ఎందుకు చెప్పండి ఈ ప్రయాసలన్నీ మనకు !.."  అనేసింది. 
  పార్వతమ్మ గారి మాటలు విన్న రేవతి, 
" నిజమే సుమీ.. ఇదేదో బాగానే ఉన్నట్టుంది.. ఈసారి నుండి నేను కూడా అలాగే చేయాలి...."
 అనుకుంది స్థిరంగా. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి, షరా మామూలే! ఏం చేస్తుంది?  మెత్తని మనసు! పైగా బంధుప్రీతి కూడా కాస్త ఎక్కువేనాయే ! తయారయిపోతుంది !
    ఆలోచనల్నుండి  బయటపడి, వెళ్లి,  కాస్త అన్నం లో రసం, పెరుగు వేయించుకుని  ఏదో అయిందనిపించి, చేయి కడిగేసుకుంది రేవతి. వినడానికి  విడ్డూరంగా అనిపించొచ్చునేమోగానీ, ఒక్కోసారి సగం కడుపు మాత్రమే నిండి, సాయంత్రం మళ్లీ ఇంట్లో ఏదైనా తిన్న రోజులున్నాయి రేవతికి !
     ఏమిటో ! ఒకప్పుడు పెళ్లి భోజనమంటే ఎంత ఆనందంగా ఉండేది ! ఇప్పుడు 'వద్దురా బాబు' అనిపిస్తోంది రేవతికి.  ఇలాంటి సందర్భాల్లో దాదాపు ఇరవై  సంవత్సరాల క్రితం తన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు జరిపించిన వైనం గుర్తొస్తూ ఉంటుందామెకు. అప్పటికే ఈ బఫే సంస్కృతి బాగా చొచ్చుకుని వచ్చేసింది. "కాలానుగుణంగా మనమూ మారాలి" అని  భర్త ఎంత చెప్తున్నా, వినక పట్టుబట్టి ఖర్చు ఎక్కువైనా సరే అని కుర్చీలు,  బల్లలు వేయించి భోజనాల ఏర్పాటు చేయించింది తను.
   ఇది ఒక్క రేవతి అనుభవమే కాదు, ఈ రోజుల్లో ఎక్కువ శాతం జనాలది కూడా. మరీ ముఖ్యంగా వయసు మీద పడ్డ వాళ్లది. ఎదురుగా లెక్కలేనన్ని వంటకాలు నోరూరిస్తూ  ! పళ్లెం నిండా రకరకాల రుచులు ! కానీ తినడానికి మాత్రం నోచుకోలేని స్థితి ! 
 ఆత్రంలో తోసుకుంటూ ప్లేటు పట్టుకుని క్యూలో నిలబడ్డం ! ఒకేసారి అన్ని ఐటమ్స్ పెట్టించుకోలేరుగా! ఒకసారితో  అయిపోదు మరి! మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాల్సిరావడం !ఇబ్బందే!
  ఏ మనిషైనా మూడు రకాలు తినగలడు... నాలుగు రకాలు తినగలడు... అన్నేసి  రకాలు తినడం అంటే సాధ్యం కాదు. అయినా సరే..గొప్పల కోసం  పదుల సంఖ్యలో వంటకాలు  చేయించడం..! తినే దాని కన్నా వృధాయే  ఎక్కువ ఇలాంటి చోట ! 
    ఒకప్పుడు పంక్తి భోజనాలు ఎంత సౌకర్యంగా ఉండేవి! బల్లలు, కుర్చీలు వేసి వడ్డించే రోజులు ఆనవాలు లేకుండా కనుమరుగైపోయాయి. వందలాది జనాలున్నా బఫేనే... యాభై, అరవై మందున్నా బఫేనే!
   ఒక్కోసారి రేవతికి అనిపిస్తూ ఉంటుంది... ఎంతో ఆలోచించి, మరెంతో ఖర్చుపెట్టి ఇన్నేసి రకాలు చేయించడంలో ఉన్న ఆసక్తి, శ్రద్ధ... వచ్చిన అతిథులు తృప్తిగా తినేలా చేయడంలో కూడా చూపిస్తే ఎంత బాగుంటుందో కదా  అని..! అయినా  ఎవరి బాధలు వాళ్ళవి! ఎవరి ఇబ్బందులు, సమస్యలు వాళ్ళవి ! దీనికీ  ఎన్నో కారణాలు ఉంటాయి మరి! 
     స్థలం తక్కువ ఉండడం, అంతమందికీ వడ్డించేవారు లేకపోవడం.. ఇంకా భోజనాల తంతు త్వరగా అయిపోతుందనుకోవడం -- ఇలాంటివి ఎన్నో!
 నిజం చెప్పొద్దూ ! కొందరికి రేవతి లాగే ఎంచక్కా కూర్చుండబెట్టి వడ్డించాలనే  ఉంటుంది... కానీ పై కారణాల వల్ల వాళ్లూ ఆ కోరికను అణిచేసుకుని, 
"నలుగురితో పాటు నారాయణా" అనుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం ! సర్దుకుపోవాలిగా ! మారిన కాలంతో పాటు మారుతున్న పద్ధతుల్నీ ఆహ్వానించాల్సిందే ! తప్పదు. లేదా... ఇదో ఇబ్బందిగా భావించేవారు పార్వతమ్మ గార్ని'ఫాలో'అయిపోతేసరి!
పేచీయే ఉండదు !!అంతేగా ! 😊😊😊

                      ***************

               🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷














Wednesday, March 22, 2023

ఏది ముఖ్యం? .... 'చిన్నారి 'కథ

 👩🙋🙎😅🙂😇

           అదో ప్రాధమిక పాఠశాల. మధ్యాహ్నం చివరి పీరియడ్ నడుస్తోంది. ప్రతీ  శనివారం బడి వదిలే ముందు కొద్దిసేపు నాలుగు మంచి మాటలు పిల్లలకు చెప్పడం సాధన టీచర్ కు అలవాటు. పిల్లలకు కూడా టీచర్ చెప్పే కబుర్లు అంటే చాలా ఇష్టం. అందుకే శనివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. చైర్ లోంచి  లేచి మెల్లిగా మొదలెట్టింది సాధన.అందరూ సర్దుక్కూర్చున్నారు. 
" పిల్లలూ, మనం జీవించడానికి అతి  ముఖ్యమైనదేది? చెప్పండి చూద్దాం..."
" అన్నం టీచర్"
 బొద్దుగా,  ముద్దుగా ఉండే కిట్టూ వెంటనే లేచి  చెప్పాడు. అందరూ ఫక్కున నవ్వారు. వాడు చిన్న బుచ్చుకుని గబుక్కున కూర్చున్నాడు. 
" అహ.. నీళ్లు టీచర్. అన్నం లేకున్నా కొద్దిరోజులు ఉండగలం. కానీ నీళ్లు లేకుంటే కొన్ని గంటలు కూడా ఉండలేం  కదా!.. ". 
వెంటనే సూర్య అందుకుని చెప్పాడు.
" అదేమీ కాదు... గాలి టీచర్.. గాలి... అదే లేకుంటే నిమిషం కూడా బ్రతకలేము .. అంతే కదా టీచర్..!"
పద్దూ అనే పద్మిని ఎంతో నమ్మకంగా టీచర్ ని చూస్తూ అంది. టీచర్ మెచ్చుకోకపోవడం చూసి, అటూ  ఇటూ చూస్తూ నెమ్మదిగా కూర్చుంది. కాసేపు క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. హరిత తటపటాయిస్తూనే లేచింది.
".. టీచర్, వీళ్లంతా ఒకటి మరిచారు. ఇల్లు టీచర్ ఇల్లు! అది లేకుండా మనం ఎక్కడ ఉంటాం?.. "
ఔను సుమా... అన్నట్లు చూశారంతా. ఇంతలో గణేష్ కు  చప్పున ఏదో స్ఫురించింది. దిగ్గున లేచాడు. 
" టీచర్,  అవేవీ  కాదు.. బట్టలు.. బట్టలు టీచర్.."
 ఒక్కసారిగా క్లాస్ అంతా గొల్లుమంది. వాడు ఉడుక్కుని, 
" ఏంటమ్మా నవ్వుతారు..! మీరు చెప్పినవన్నీ ఉన్నా, బట్టలు లేకుండా ఎవరైనా బయట తిరుగుతారా ఏంటి? "
అనగానే సాధన తో పాటు అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. బిక్క మొగం వేసుకున్న వాడి దగ్గరగా వెళ్లి, రెండు బుగ్గలూ పుణికి, సముదాయించి కూర్చోబెట్టి, 
"... మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ,  అవన్నీ ఉన్నా మరొకటి...మరొక్కటి సరిగా లేకపోతే బ్రతుకు దుర్భరమవుతుంది. అదేమిటో కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి.."
అంది సాధన అందర్నీ పరికిస్తూ. అంతా బుర్రలు గోక్కున్నారు. రెండు నిమిషాలాగి, సమాధానం రాకపోయేసరికి నవ్వి, 
" సరే, నేనే చెప్తాను.. అన్నం, నీళ్లు, గాలి, దుస్తులు, ఇల్లు... ఇవన్నీ ఓకే. అయితే అవన్నీ ఉన్నా, మన దేహంలో చక్కటి ఆరోగ్యం లేకపోతే ఏమాత్రం సుఖశాంతులన్నవి ఉండవు. అవునా... కాదా.. కాస్త ఆలోచించండి.."
అంది అందరి మొహాల్లోకి చూస్తూ. అంతా ఆశ్చర్యంగా నోళ్లు తెరిచారు. తర్వాత వాళ్లకేదో తట్టింది. అందరి తలల్లో ఏవేవో మెదిలాయి. నిజమే !ఆరోగ్యం సరిగా లేక ఊర్లో చాలామంది ఇళ్లలో దిగులుగా ఉంటున్నారు. కారణం తెలీదు వాళ్లకు ఇన్నాళ్లూ... ఇప్పుడు తెలిసింది. అదన్నమాట సంగతి ! వాళ్లకు మిగతావన్నీ ఉన్నాయి మరి ! టీచర్ చెప్పింది అక్షరాలా కరెక్ట్ ! పైకి అనేశారు కూడా.
" కదా ! అందుకే మీరంతా ఆరోగ్యాన్ని చిన్నతనం నుండే  కాపాడుకోవాలి. మంచి అలవాట్లు అలవరుచుకోవాలి. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం. అనుకున్నది ఏదైనా సరే సాధించగలం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా..! సరేనా!"
" అవును టీచర్, అలాగే టీచర్.."
అన్నారంతా ముక్తకంఠంతో. లాంగ్ బెల్ మోగింది. గుడ్ ఈవెనింగ్ చెప్తూ అంతా బిలబిలమంటూ లేచారు. వాళ్లననుసరిస్తూ సాధన కూడా కదిలింది.

🙋🙎🙋🙎🙋🙎🙋🙎🙋🙎🙋🙎🙋🙎🙋🙎🙋🙎


Monday, March 13, 2023

అతి సున్నితత్వం వద్దు...

🌷
       క్రితంసారి తారకరత్న గురించి నాలుగు మాటలు చెప్పడం జరిగింది. అతనికి జరిగింది అతని చేతుల్లో లేనిది... పరిస్థితులు ఏవైనా కావచ్చు... ! అనూహ్యంగా జరిగిన ఓ విషాదం. ఎంతో జీవితం ముందు పరుచుకొని ఉన్నా, ఆశలూ, ఆశయాలూ రూపుదాల్చి ఆహ్వానిస్తూ ముందడుగు వేయమంటున్నా... ఆయుష్షు  లేక అర్ధాంతరంగా కానరాని, తిరిగి రాలేని లోకాలకు తరలి వెళ్లడం...! విధిరాత ! 
    కానీ.. కొద్దిరోజులుగా జరుగుతున్న అత్యంత విషాద మరణాలు మాత్రం ఊహకందనివి..జీర్ణించుకోలేనివి..
రకరకాల మానసిక దౌర్భల్యాలవల్లనో, చుట్టుముడుతున్న ఆర్థిక, సామాజిక సమస్యల వల్లనో, లైంగిక వేధింపులవల్లనో తట్టుకోలేని పరిస్థితులెదురై బలవన్మరణాల  పాలవుతూ పండంటి జీవితాలకు అర్ధాంతరంగా తామే స్వయంగా ముగింపు పలుకుతూ, కన్నవారికీ, కావలసిన వారికీ తీవ్రశోకాన్ని మిగిలించి కనుమరుగై పోతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు.. ! ఇటీవల జరిగిన ఉదంతాలు అన్నీ అందరికీ విదితమే. చక్కటి ఆరోగ్యం, మంచి చదువు, తెలివితేటలూ, సమాజంలో మంచి స్థానం కలిగి ఉండీ... కొందరు యువతీ యువకులు తప్పుటడుగులు  వేస్తూ, దారి తప్పి అయోమయంలో పడిపోతూ దిక్కు తోచని   స్థితిలో కొట్టుమిట్టాడుతూ చివరికి ప్రాణాల్ని బలి పెడుతున్నారు. 

*    ఫేస్బుక్ పరిచయాలు
*    ప్రేమలో వైఫల్యాలు
*    అపరిచితుల చేతుల్లో మోసపోవడాలు 
*    మాదకద్రవ్యాలకు బానిసలవడం
*    ఆ ఊబిలోంచి రాలేని నిస్సహాయులవడం 

ఇలా.. ఎన్నో... ఎన్నెన్నో... ! టీనేజీ నుండి దాదాపు పాతికేళ్ళ వయసు దాకా యువతీ యువకులకు కీలకమైన దశ. భవితకు పునాదులు పడడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయమిది. అలాంటి దశలో ఏ బలహీనతలకో లోబడి మనసు దారి మళ్ళిందంటే... భవిష్యత్తు అగమ్యగోచరమే...! ప్రస్తుతం రోజురోజుకూ పెరిగి పోతున్న సాంకేతికత మంచికీ,  చెడుకీ.. రెండింటికీ దోహదం చేస్తోంది. వివేకంతో ప్రవర్తించడం చాలా అవసరం.
   ఏ సమస్యలో ఇరుక్కున్నా కాస్త స్థిమితంగా ఆలోచించాల్సి ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయంటే... కొన్ని సమస్యలు వాటంతటవే అనూహ్యంగా పరిష్కరింపబడుతూ అదృశ్యమై పోతుంటాయి. అలాంటి తాత్కాలిక సమస్య గురించి సతమతమవుతూ అనాలోచితంగా నిండు ప్రాణాల్ని బలి పెడుతున్నారు కొందరు.
   ఇటీవల ఈ మరణాలు చూస్తుంటే... అతి  సున్నిత మనస్తత్వం ఉండడం ఏమాత్రం మంచిది కాదనిపిస్తుంది. కాస్త మానసిక పరిపక్వత చాలా అవసరం అని కూడా అనిపిస్తున్నది. ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం పెంపొందించుకోవాలి. తమ అనాలోచిత చర్య వల్ల తల్లిదండ్రులు, ఇంకా తమపైనే ఆధారపడ్డ కుటుంబీకులు ఎదుర్కోబోయే విపత్తుల్ని, విషాదాన్ని కూడా అంచనా వేయాల్సిన బాధ్యత వాళ్లకు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు.. ఇలాంటి ఉదంతాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. 
   అందుకే... ఓ యువతా.. ! మరీ సున్నిత మనస్కులుగా ఉండకండి. ఆలోచనా దృక్పథం మార్చుకోండి. రేపటి దినం మీదే !!

****************************************
  

Thursday, March 2, 2023

అంత తొందరెందుకయ్య... !?

🌷

సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా 
చిరుచిరు నవ్వే నవ్వవా 
నీచిరుచిరు నగవుల కిలకిల సడిలో 
వలపుల పాటలు పాడవా 
చెలిమికి నామది చూపవా.... 
మధురాతిమధురమైన ఆ గీతాలాపనం... అత్యంత మనోరంజితమైన అభినయం... !
--- కొన్నేళ్ల క్రితం...'యువరత్న' మూవీ లో  అప్పుడెంతో హాయి గొలిపిన ఆ గీతం... నేడెంతో బాధను కలిగిస్తోంది. 
తారకరత్న !!
ఎన్ని కలలు కంటివో కదా ఆ కళ్ళ నిండా !
మరెన్నెన్ని ఆశలు నింపుకొంటివో కదా ఆ గుండెల నిండా !! అన్నీ అరక్షణంలో అదృశ్యమై, నిలువెత్తు రూపం కుప్పగూలి, కనుమరుగై కానరాని లోకాలకు తరలిపోయె గదా ! నేల విడిచి నింగిని తారకవై వెలుగొందడానికి ఎందుకయ్యా అంత తొందర !!
  విధివైపరీత్యం ! మనసారా వలచిన చెలిని ఒంటరిని చేసి, బరువుబాధ్యతలు వదిలేసి, భారమంతా భాగస్వామిని భుజాలపై వేసి... అర్ధాంతరంగా కన్నుమూసి, కన్న కలలకు శాశ్వతంగా 'గుడ్ బై' చెప్పేశావు.  
    కథానాయకునిగా రాణించలేక పోయినా, తగిన గుర్తింపు చేజిక్కకపోయినా, నిరాశకు లోనుకాక, తగురీతిని శక్తి పుంజుకుంటూ రాజకీయాలవైపు అడుగులు వేయాలన్న తలంపుతో ఉన్న తరుణాన....అనూహ్యంగా విధి వెక్కిరించడం బాధాకరం. తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అంటే ఇదేనేమో ! ఏదిఏమైనా... నీ ఆత్మకు శాంతి కలగాలి. 
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐