Wednesday, January 19, 2022

షూరిటీ.... !

     లంచ్ బ్రేక్ బెల్ మోగింది. నీరసంగా స్టాఫ్ రూమ్ లో అడుగు పెట్టి అన్యమనస్కంగానే  లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది ప్రసూన.  ఏదో తింటోందన్న మాటే   గానీ ఆమె మనసంతా గజిబిజిగా, అల్లకల్లోలంగా తయారై ఇంకా విపరీతమైన ఆందోళన తో నిండిపోయిఉంది. దానికి కారణం గంట క్రితం వచ్చిన ఫోన్ కాల్!
       " హలో, ప్రసూనాంబ గారేనా? "
       " అవును, మీరెవరు..? "
       "... ఎనిమిది  నెలల క్రితం సుబ్బరాయుడు అనే వ్యక్తి మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. మీరు అతనికి షూరిటీ ఇచ్చారు..."
 అలా ఓ నిముషం పాటు మాట్లాడి  పెట్టేసాడతను. విషయం బోధపడే సరికి ప్రసూన మెదడు కాసేపు మొద్దుబారిపోయింది.
    నిజమే. ఎనిమిది  నెలల క్రితం గతంలో తాను పనిచేసిన స్కూల్లో క్లర్కుగా పని చేసిన సుబ్బారాయుడు తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అత్యవసరంగా డబ్బు అవసరం పడి పాతిక వేలు లోను తీసుకుంటున్నాననీ, దానికి షూరిటీ సంతకం కావాలనీ, మీరు సంతకం పెడితే లోను శాంక్షన్  అవుతుందనీ ప్రాధేయపడ్డాడు. ఒక చోట కలిసి కొంతకాలం పని చేసిన వాడు అయినందున మొహమాటంతో సరేనని సంతకం పెట్టేసింది తను. ఆ తర్వాత ఆ విషయం దాదాపు మర్చిపోయింది. ఇప్పుడీ  ఫోన్ కాల్! 
    అతను రెండు నెలలుగా లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడం లేదని, అందువల్ల పై నెలలో మీ శాలరీ నుండి కట్ చేస్తామని హెచ్చరించాడు ఇందాక  బ్యాంక్ అతను! అంటే, అతను తీసుకున్న లోన్ చెల్లించడం లేదన్నమాట !
   హతాశురాలైంది ప్రసూన ! నమ్మి ఏదో సహాయపడితే ఇలా చేశాడేంటి? తలపట్టుకుంది. వెంటనే స్ఫురించి సుబ్బరాయుడు కి ఫోన్ చేసింది. కాని రెస్పాన్స్ లేదు. మళ్లీ మళ్లీ చేసింది. లాభం లేదు. అదీ  ప్రస్తుతం ఆమె పరిస్థితి ! దిక్కుతోచని స్థితిలో సాయంత్రం దిగాలుగా ఇంటికి బయలుదేరుతుండగా ఫోన్ రింగ్ అయింది. సుబ్బారాయుడు ! వెంటనే ఎత్తి, గాభరాగా  విషయం చెప్పేసింది.
" మేడమ్, మీరేమీ టెన్షన్ అవ్వద్దు. కాస్త ఇబ్బందిగా ఉండి కట్టలేకపోయాను. ఈ నెల అంతా కట్టేస్తాను..."
 కూల్ గా జవాబిచ్చాడతను. అలా అన్నాడు గానీ మాట నిలబెట్టుకోలేదని మరుసటి నెల జీతం లో కట్ అయిన  అమౌంట్ చూసేసరికి తెలిసొచ్చింది ప్రసూనకు. అంతే, ఆమె  లో సహనం నశించింది.
" మేడం, నేనేమైనా అప్పు ఎగ్గొట్టే  వాడిలా కన్పిస్తున్నానా? కట్ చేసిన మీ డబ్బు త్వరలోనే తెచ్చి మీకు ఇచ్చేస్తాను. కాస్త ఓపిక పట్టండి..."
   ఫోన్ చేసి' ఏంటిది' అని అడిగితే అతనిచ్చిన జవాబది ! సంతకం కోసం ఇంటికి వచ్చినప్పుడు అతని మాట తీరు, ప్రవర్తన గుర్తొచ్చింది ప్రసూన కు. ఎంత వినయంగా అభ్యర్థించాడు ! మరి ఇప్పుడు ! అతని స్వరం లో తేడా కొట్టొచ్చినట్టు వినిపించింది. అవసరం తీరిపోయింది కదా మరి ! ఖర్మ ! ఏం చేస్తాం! అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకుంది.
   మరో రెన్నెళ్లు  గడిచాక ఆ సంగతి బుర్రలోంచి పక్కకు నెట్టేసింది బలవంతాన. నాలుగైదు నెలల తర్వాత ఆ  సుబ్బారాయుడనే అతను కట్ అయిన డబ్బయితే తెచ్చిచ్చాడు ప్రసూన కు,  కానీ ఈ మధ్యకాలంలో ఆమె పడిన మానసిక వ్యధ సంగతేంటి? ఆ అనుభవం ఓ గుణపాఠమై, ఇకపై ఎవరికీ షూరిటీ లన్నవి ఇవ్వరాదని దృఢంగా నిశ్చయించేసుకుంది ప్రసూన !
--- ప్రసూన లానే ఇలా చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. నా సర్వీసులో నలుగురైదుగురికి ఈ  షూరిటీ లన్నవి ఇచ్చి  ఉంటాను.అందులో ఒకాయన సరిగ్గా సుబ్బారాయుడిలాగే ప్రవర్తించాడు. మరో కొలీగ్ ఒకావిడ షూరిటీ కోసం అడిగింది. కొలీగ్ కదా అనుకుని సంతకం పెట్టేశాను. పెట్టాక, నోరూరుకోక, 
" ఈ షూరిటీ లెందుకు? ఒకవేళ మీరు లోన్ కట్టకపోతే నా శాలరీ నుండి కట్ చేస్తారా? "
అని ఏదో మాటవరసకి ఠక్కున అడిగేశాను.  అంతే. ఆవిడకి కోపం వచ్చేసింది. చిత్రమేమిటంటే ఆ రోజు వరకు బాగా మాట్లాడే ఆవిడ సడన్ గా నాతో మాటలు తగ్గించేసి ముభావంగా మారిపోయింది. "ఇదేం ఖర్మ రా బాబు! షూరిటీ ఇచ్చి చెడ్డయిపోయానా" అనుకుని  బాధపడ్డం నా వంతయ్యింది. 
    ఇదంతా ఎందుకు రాయాలనిపించిందంటే  ---
 ఇటీవల న్యూస్ పేపర్ లో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారన్న ఓ వార్త ! తమ వాటా దారునికి షూరిటీ సంతకం చేసి, ఆ వాటాదారు తీసుకున్న లోను చెల్లించకపోతే వీళ్ళ ఆస్తులు జప్తు చేశారట! అయినా అప్పు తీరక, మూడు కోట్ల ఆ అప్పు  తీర్చే దారి లేక ఆ దంపతులిద్దరూ దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డారన్న  ఉదంతం చదివి మనసంతా వికలమై పోయింది. అప్పు తీసుకున్న వాళ్లకు మనస్సాక్షి అన్నదుంటే ఇలా ప్రవర్తిస్తారా? మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఏమిటీ విపరీతాలు !
    ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. అలాంటప్పుడు షూరిటీ ఇచ్చినవాళ్ళ మానసిక వేదన మాటలకందనిది ! అలాగే అవసరమంటూ అప్పు తీసుకొని తిరిగి తీర్చాలన్న ధ్యాస లేకపోగా, అసలు ఆ ఊసే ఎత్తని మహానుభావులకూ కొదవేమీ లేదు  మన చుట్టూ ఉన్న సమాజంలో ! అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలనిపిస్తుంది ఇలాంటి వారి విషయంలో.
    పరులకు ఉపకారం చేయాలనుకునే ఆలోచన మంచిదే. అవతల వారికి కూడా మోసం చేయాలన్న దురాలోచన కూడా లేకపోవచ్చు. కానీ పరిస్థితులు అనుకూలించక వాళ్ళు నిజంగానే కట్టలేని దుస్థితి వాళ్లకి వస్తే, మేలు చేసిన వారి సంగతేమిటి? ఇలాంటి సందర్భాల్లో స్నేహ సంబంధాలు, బంధుత్వాలు చెడి  పోయే ప్రమాదమూ ఎంతగానో ఉంటుంది.
   అందరూ ఇలాగే ఉంటారని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ   కాదు. కానీ ఏ ఒక్కరు పైన  చెప్పిన విధంగా ప్రవర్తించినా షూరిటీ  ఇచ్చిన వాళ్లకు ఇబ్బందే కదా! 
        ఏది ఏమైనా, అత్యంత ఆప్తులకూ, ఎంతో నమ్మకస్తులైన సన్నిహితులకు తప్ప వేరెవరికైనా షూరిటీ ఇచ్చే విషయంలో బాగా ఆలోచించి అడుగేయాల్సి  ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది గనుక !!

     ********************************






Thursday, January 13, 2022

సంబరాల సంక్రాంతి వస్తోంది...

🌷🌷🌷     💐💐💐   😊😊😊   🌷🌷🌷

 సంక్రాంతి వస్తోంది
 సంబరాలు తెస్తుంది
 నూతన కాంతులు వెదజల్లుతుంది
 నూతనోత్సాహం నింపుతుంది  😊
 ముచ్చటైన పండగిది 
 మూడు రోజుల మురిపెమిది !
 ముంగిట్లో రంగవల్లులు
 రమణుల అచ్చట్లు ముచ్చట్లు  
 నవధాన్యాల నడుమ
 గొబ్బెమ్మల సోయగాలు
 ముద్దబంతుల సౌరభాలు 
 ముద్దుగుమ్మల ఆట పాటలు
 మామిడాకు తోరణాలు !
 -- ఇన్ని సంబరాల్ని తెచ్చి మనకిచ్చి
 మది పరవశింపజేస్తుంది మరి 
 మన సంక్రాంతి లక్ష్మి 🙏
 ఇంకా --
 బసవన్నలు వస్తారు ముస్తాబై 
 హరిదాసులు పాడతారు
'హరిలో రంగ హరీ 'అంటూ !
 చిన్నారులకేమో భోగి పండ్లు
 నట్టింట భలే భలే  సందళ్ళు !😊😊
 మరోపక్క ---
 గగనాన గాలిపటాల రెపరెపలు 😊
 కోడి పందేల కోలాహలాలు
 ఫలించిన రైతన్నల ఎదురుచూపులు
 గాదెల నిండుగ ధాన్య రాశులు !
 బంధు జనాల లోగిళ్ళు 
 వైవిధ్యంగా  వంటలు ,పిండి వంటలు !
 విందులు, వినోదాలు 
 ఊరంతా సంబరాలు 🎆🎆🎆
 ఆహా ! సందడే సందడి !!
 చేయండి చేయండంటూ 
 అదిగో సంక్రాంతి వస్తోంది😊😊😊
 నూతన కాంతులు వెదజల్లుతూ
 నూతనోత్సాహం నింపటానికి 
 మనందరిలో-- అదిగో అదిగో
 వస్తోంది వస్తోంది సంక్రాంతి 🌄😊🌷🌺

🌹💐🌷🌹💐🌷🌹💐🌷🌺💐🌷🌹
 

 





Friday, January 7, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే... మాయాబజార్

🌺
     ప్రతీ జీవితం ఓ ప్రయాణమే అన్నా కదా ! ఈ జీవితంలో   ఎన్నో మలుపులు, ఆ మలుపుల్లో ఎన్నో జ్ఞాపకాలు ! అవి.. తీపివీ,  కావచ్చు, చేదువీ   కావచ్చు!
 ఏవైనా మర్చిపోలేనివే  అయి ఉంటాయి. కాకపోతే... తీపి జ్ఞాపకాలయితే మనసుకు సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తే... చేదు జ్ఞాపకాలు తలపుకొచ్చినప్పుడల్లా ముల్లులా హృదయాన్ని గుచ్చుతూనే  ఉంటాయి. ఏది ఏమైనా, అన్నీ జ్ఞాపకాలే ! కానీ వీటన్నిటికీ అతీతంగా ఉండేవి, బాధకు దూరంగా ఉండేవీ చిన్ననాటి స్మృతులు ! తెలిసీ తెలియని వయసు.. ఇంకా ఊహ రాని  లేత మనసుల్లో దాగినవీ అలాంటివి కొన్ని ఉంటాయి ప్రతివారి జ్ఞాపకాల పొరల్లో... అవి తీయనివా, చేదువా అని చెప్పలేము. లీలగా గుర్తుండిపోయిన చెరగని గురుతులు మాత్రమే ! అందులోనుంచి  ఒకటి.... 
     🙂  బాగా చిన్న వయసు. ఐదు లేక ఆరు సంవత్సరాల వయసు ఉంటుందేమో నాకు. సాయంత్రం మా ఇరుగుపొరుగు అమ్మలక్కల తో కలిసి బయటకు వెళుతూ నన్ను కూడా తీసుకెళ్ళింది మా అమ్మ. వాళ్ళ మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే మేమంతా ఏదో బజార్ కి వెళ్తున్నామని ! దారిలో అడిగా మా అమ్మని, 
" అమ్మా, మనం ఎక్కడికెళ్తున్నాం..? " అని. 
" మాయాబజార్ కు.. " అన్నది మా అమ్మ. 
   అంటే అదేదో' బజార్ 'అనీ, అక్కడికి మేమంతా ఏదో కొనడానికి వెళ్తున్నామనీ అనుకొన్నా  నేను వెంటనే. తీరా వెళ్ళింది మా ఊర్లో దూరంగా ఉన్న ఓ టెంట్  సినిమాకు! ఆ సినిమా పేరు ' మాయాబజార్ '. 
   ఆ రోజు అమ్మ తో కలిసి మట్టి రోడ్డెంట నడుచుకుంటూ వెళ్ళడం వరకు మాత్రమే గుర్తుంది నాకు... అదీ  లీలగా.. ఉండీ లేనట్టుగా... ఆ సినిమా చూడ్డం గానీ,  అందులో దృశ్యాలు గానీ ఎంత మాత్రమూ గుర్తు లేవు. లోపలికి వెళ్లగానే పడుకుని  హాయిగా నిద్ర పోయానట !🙂
     అదే సినిమా మరి కొన్ని సంవత్సరాల తర్వాత చూడడం జరిగింది. అప్పుడు కూడా ఆసాంతం గుర్తులేదు గానీ, కొన్ని దృశ్యాలు మాత్రం మైండ్ లో నిలిచిపోయాయి. అవి---

👌  రేలంగి ( ఉత్తర కుమారుడు) సావిత్రి ( శశిరేఖ) డాన్స్ చేస్తూ పాడే పాట.
    "సుందరి నీవంటి దివ్య స్వరూపము 
      ఎందెందు వెదకిన లేదు కదా"
👌  ఘటోత్కచుడు విందారగిస్తూ  పాడే పాట..
      " వివాహ భోజనంబు వియ్యాలవారి విందు"
   --- ఆ వేషధారి ఎస్. వి. ఆర్ అని అప్పుడు నాకు అస్సలు  తెలియదు.
👌   ఇంకా.. మాయా మంత్రాలతో కూడిన కొన్ని దృశ్యాలు.. అవి చూస్తూ జనాలంతా పొట్టచెక్కలయ్యేలా పడీ  పడీ  నవ్వడం చాలా బాగా గుర్తు. అంతే! అంతకు మించి పెద్దగా ఏదీ మనసుకు పట్టలేదు.
    మళ్లీ డిగ్రీ చేసే రోజుల్లో అనుకుంటా.. ఈ సినిమా మొదటి నుండీ  చివరి దాకా ఆస్వాదిస్తూ చూడడం జరిగింది ఓ థియేటర్లో. అద్భుతం !అనిపించింది. అప్పుడే అర్థమైంది నాకు అదో దృశ్య కావ్యమనీ, కళాఖండమనీ !ఆ పదాలు మాయాబజార్ అనే ఈ సినిమాకు నూటికి నూరు పాళ్ళు సరిపోతాయని !   ఇంతకీ,సిన్మా  చూసే ముందు--- 
 
*  సావిత్రి శశిరేఖగా ఏం బాగుటుందబ్బా అనుకున్నా.. ఎందుకంటే, సావిత్రి అంటే సాత్వికమైన, ఇంకా  విషాద భరిత పాత్రలకు అయితేనే బాగుంటుందన్న ఆలోచన,  స్థిరాభిప్రాయం అప్పట్లో నాకు ఉండేది. కానీ చూశాక తెలిసింది-- సావిత్రి తప్ప మరెవరూ ఆ పాత్రకు సరిపోరని! ముఖ్యంగా-- 
" అహ, నా పెళ్ళంట"  పాటలో ఆమె హావభావాలు,  నృత్యం, మాయా శశిరేఖగా ' బాడీ లాంగ్వేజ్' మార్చడం! ఓహ్ ! అద్భుతం! అందుకే ఊరికే అంటారా 'మహానటి' అని ! అనుకున్నా. 
 *  ఇక కృష్ణుడిగా ఎన్టీఆర్ నెంబర్ వన్! కాదనగలమా!

మిగతా ప్రధాన పాత్రలు పోషించిన ఏఎన్ఆర్, ఎస్వీఆర్, గుమ్మడి, ముక్కామల, ఛాయాదేవి, సూర్యకాంతం మొదలైన హేమాహేమీల నటనా వైదుష్యం చిరస్థాయిగా నిలిచిపోయేదిగా ఉంద నిపించింది. అందుకేనేమో ప్రతీ నోటా మాయాబజార్ చిత్రం ఈ నాటికీ కీర్తించబడుతూ ఉంది. 
    ఇప్పుడైతే గ్రాఫిక్స్ అంటూ వచ్చాయి గానీ ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే అంతటి  మాయలూ  మహత్తులూ అద్భుతంగా, అత్యంత సహజంగా చిత్రీకరించారు అంటే వారి నైపుణ్యం అమోఘం! వర్ణనాతీతం! అందలి  నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎవ్వరూ ఈనాడు లేకపోవచ్చుగానీ  ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ వారు చిరంజీవులే, చిరస్మరణీయులే 🙏
   చాలాా సంవత్సరాలు గడిచాక ఇదే సినిమాకు రంగులద్ది విడుదల చేశారు. అది  టీవీలో వీక్షించడం మరో సరికొత్త అనుభవం 🙂
     ఇప్పటికీ టీవీలో ఈ సినిమా చూసినప్పుడంతా  -- పసితనంలో ఏవో కొనడానికి మాయాబజార్ కు పోతున్నాం అనుకున్న ఆ అమాయకత్వపు జ్ఞాపకం నా మదిలో మెదిలి నాలో నేనే నవ్వుకుంటుంటాను. 🙂🙂

                    *****************

Monday, January 3, 2022

అసలైన జీవితం...?

     చాలా  సినిమాలు నాయికా నాయకుల పెళ్లవడం తో ముగుస్తాయి. కానీ ప్రతి వారి జీవితం ప్రారంభమయ్యేది అప్పటి నుంచే కదా!
      చెప్పాలంటే కన్ను తెరిచినప్పటినుంచి కన్ను మూసే వరకు మనిషి జీవనయానాన్ని నాలుగు అధ్యాయాలుగా విభజించవచ్చని నా అభిప్రాయం.
🌺 పుట్టినప్పటినుంచీ పెళ్ళయ్యే వరకు మొదటి అధ్యాయం గా చెప్పుకోవచ్చు. ఇది 90 శాతం మందికి ఆహ్లాదకరం గానే ఉంటుంది.
🌺    పెళ్లి తర్వాత మొదలయ్యే అధ్యాయం కొంతవరకూ  ఆనందంగానే సాగుతుంది.పిల్లలు, వాళ్ల పెంపకం, విద్యాబుద్ధులు నేర్పించడం, వాళ్ళ బాగోగులు, కోరికలు  తీర్చడం.. ఇలాంటి బరువు బాధ్యతలతో ఒకింత భారంగానే గడిచినా అందులో ఏదో అనిర్వచనీయమైన సంతోషం,  సంతృప్తి నిగూఢంగా ఉంటాయి కాబట్టి అదీ ఓ. కే. 
🌺   ఇక మూడోది.. పిల్లల పెళ్లిళ్లు, వాళ్ళను  జీవితంలో స్థిరపరచడం ! అదీ తీయనైన బాధ్యతే! కాబట్టి విసుగనిపించక లాగించేస్తారంతా. 
🌺   ఆ తర్వాత మొదలయ్యేదే నాలుగో అధ్యాయం. పిల్లలంతా  సెటిల్ అయిపోయారు అనుకొని ఓ నిట్టూర్పు విడిచి ఇక నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంటున్న తరుణంలో... మొదలవుతుంది అసలైన ఈ అధ్యాయం! అదే చివరి అధ్యాయం కూడా అనుకోవచ్చు ! మెల్లిమెల్లిగా ఏదో కోల్పోతున్న భావన! ముదిమి మీద పడుతూ చుట్టుముడుతూ పలకరించే అనారోగ్య సమస్యలు! అది చాలదన్నట్టు మునుపెన్నడూ ఎరుగని రకరకాల కొత్త అనుభవాలు!
🌺 ఓసారి ఇలా చూద్దాం.... 

* సాంబశివరావు, పరమేశ్వరి దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. చాలీచాలని జీతం అయినా నలుగురినీ ఏ లోటూ లేకుండా పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, చక్కగా  పెళ్లిళ్లు జరిపించి స్థిరపడేలా చేశారిద్దరూ. వాళ్ల నీడలో, ఆదరణలో శేషజీవితం హాయిగా గడపొచ్చులే అనుకున్నవాళ్ళ ఆశ అడియాశ  కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఓ కొడుకు, కూతురు అమెరికాలో స్థిరపడ్డారు. మరో కొడుకు, కూతురు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో ఇరుక్కుపోయారు. వీళ్ళు అక్కడికి వెళ్లి ఉండలేరు. వాళ్లు వీళ్ల వద్దకు వచ్చి ఉండలేని పరిస్థితి! డెబ్భై  సమీపిస్తున్న వృద్ధాప్యంలో ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందో అన్న భీతితో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వాళ్లలో ప్రస్తుతం ఏదేని వృద్ధాశ్రమంలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు పసివాళ్లుగా  ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా ఏ దిగులు ఉండేది కాదు వాళ్ళకి. పెళ్లిళ్లు  చేసేటప్పుడూ ఇబ్బంది పడలేదు. అలా అన్నింటినీ ధైర్యంగా ఎదురీదిన వాళ్లు ఇప్పుడు బెంబేలు పడుతూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడైతే చేతినిండా డబ్బు ఉంది కానీ.... ఎవరైనా వాళ్లను కదిపితే  చాలు.. 
" అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది మాకు.. "
 అంటూ వాపోతారు అందరితో!

*   జగన్నాథం, శారదాంబల పరిస్థితీ  దాదాపు ఇదే. కాకపోతే మరో రకంగా ఉంటుందది ! ఇద్దరు కొడుకులూ, కోడళ్లు బాగానే చూసుకుంటున్నట్టే ఉంటారు. కానీ వీళ్ళ మాట ఎంత మాత్రం సాగనీయరు. కొడుకుల పెళ్లిళ్లయే  వరకు ఏకఛత్రాధిపత్యంగా సాగిన ఇంటి పెత్తనం కోడళ్ల రాకతో ఉన్నట్టుండి వాళ్ల చేతిలోకి ' ట్రాన్స్ ఫర్ ' అయిపోయేసరికి వాళ్ల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైయిపోయి, దయనీయంగా  తయారయింది. పోనీ... విడిగా ఉందామా అంటే కొడుకులు ఒప్పుకోరు. నలుగురూ ఏమంటారంటూ తీసి పారేస్తారు. కలిసుండే సర్దుకుపోదాంలే   అనుకుంటే.. అనుక్షణం  ఆత్మా భిమానం, అహం దెబ్బతింటూ, మింగలేక కక్కలేక అన్నట్టుంది ఇద్దరికీ ! ప్రస్తుతం  వాళ్లదీ అదే మాట.. అదే వేదన...
" అసలైన జీవితం ఇప్పుడే మొదలైంది మాకు..." అని!

*   కృష్ణమూర్తి, సునంద లది ప్రేమ వివాహం. అటూ ఇటూ పెద్దలు ఒప్పుకోకపోయినా ఖాతరు  చేయలేదు ఇద్దరూ. పెళ్ళయ్యాక వాళ్లే దిగి వస్తారులే అనుకున్నారు గానీ అది  జరక్కపోగా మరింత దూరమైపోయారు. బాధపడ్డా క్రమంగా అలవాటు పడిపోయారిద్దరూ. కాలం గడిచే కొద్దీ సంతానలేమి సమస్యా తోడైంది. దాంతో ఒకరికొకరు వాళ్లే ప్రపంచంగా  మారిపోయారు! ముఖ్యంగా కృష్ణమూర్తి భార్య తోడు లేకుండా ఏ చిన్న పనీ  చేసుకోలేని అశక్తుడుగా మారిపోయాడు ! కాలగమనంలో సునంద కన్నుమూసింది. కృష్ణమూర్తి ఒంటరిగా మిగిలిపోయాడు. భార్య ఉండగా కూర్చున్న చోటికే అన్నీ వచ్చి చేరేవి. మరి ఇప్పుడు...? శూన్యంలో ఉన్నట్టు అనిపిస్తోందతనికి. మొదట్నుంచీ  బయటికెళ్ళి నలుగురితో కాలక్షేపం చేయలేని అంతర్ముఖుడతడాయె ! నాలుగు గోడల మధ్య భరించలేని ఒంటరితనం. మరోవైపు అనుక్షణం వెంటాడుతూ భార్య స్మృతులు !!
 'జీవితం అంతా ఒక ఎత్తు.. ఈ చివరి దశ ఒక ఎత్తు.'
 --అనిపిస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడతను ప్రస్తుతం!
--- ఇలా రక రకాలైన సమస్యలతో చివరిదశ ఎదుర్కొనే జీవితాలు  చాలానే ఉంటాయి. యవ్వన ప్రాయంలో, నడివయసులో ఎంత తీవ్రత నైనా ఎదుర్కొనే ఇంకా   భరించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి మనిషికి. మరి ఈ అవసానదశలో...? 
   సంపాదన లేని కొడుకుల్ని విధిలేక పోషించే తండ్రులు, పెళ్లిళ్లయినా కుదుట పడని  సంసారాల్తో భారంగా మారిన పిల్లలు... ఇంకా ఎన్నోరకాలుగా డెబ్భై సమీపిస్తున్నా తీరని బాధ్యతలతో కుంగిపోతూ.. తపిస్తూ... ప్రశాంతతను కోల్పోతున్న వారెందరో !!వారందరిదీ ఇదే మాట..
" అసలైన జీవితం ఇదే నేమో...!"

                         ***********