Friday, July 24, 2026

ఒక్క క్షణం ఆగండి.. ఆలోచించండి...

 😪

<><><><><><><><><><><><><><><><><><>>

 *  ప్రేమ విఫలమై ప్రేమికులిద్దరూ రైలు పట్టాలపై ఆత్మహత్య!

 * అమ్మాయి తన ప్రేమనంగీకరించలేదని వ్యధతో పురుగుమందు తాగిన యువకుడు!

* పదవ తరగతి పరీక్షలో ఒక సబ్జెక్టు తప్పినందుకు అవమాన భారం భరించలేక  అమ్మాయి ఉరేసుకుని  ప్రాణం తీసుకున్న వైనం..!

* ఉద్యోగ వేటలో విసిగిపోయి ఒకరు , ప్రేమ పెళ్లి విఫలమై ఒకరు,తండ్రి మందలించాడని మరొకరు!!...

 ఇలా రకరకాల కారణాలతో నిండు జీవితాల్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్న యువత గురించి ప్రతిరోజు వార్తాపత్రికల్లో చదువుతున్నాం... టీవీల్లోనూ చూస్తూ ఉన్నాం...ఇలాంటి ఉదంతాల్ని వింటున్నప్పుడు...మనసంతా కాసేపు బాధతో నిండిపోతూ ఉంటుంది. ఈ మధ్య మరీ చిన్న పిల్లలు...అంటే మూడు, నాలుగు తరగతులు చదువుతున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు మరీ విడ్డూరంగా ఉంటున్నాయి. సెల్ ఫోన్ ఎక్కువగా చూడొద్దు  అన్నందుకు ఓ పిల్లవాడు తండ్రి మీద అలిగి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడట!!

  గర్భస్థ శిశువుగా ఉన్ననాటి నుండి మొదలైన తల్లి కలలు ఆ బిడ్డ తన ఒడి చేరిన క్షణం నుండీ అలా కొనసాగుతూనే ఉంటాయి. బిడ్డ బాల్యం, అల్లరి, వారి చదువు సంధ్యలు, క్రమక్రమంగా వారు ఎదిగే తీరు, వారి ముద్దు మురిపాలు...ఓహ్! తల్లిదండ్రులు వారి చుట్టూ అల్లుకునే ఆశల పందిరి వర్ణించడానికి మాటలు చాలవు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో.. అలా నిర్మితమవుతున్న వారి స్వప్న సౌధం కళ్ళముందు సాక్షాత్కరించే తరుణం ఆసన్నమవుతున్న క్షణాల్లో ఒక్కసారిగా భయంకరమైన కుదుపు..!! వారి కలలపంట, ఆశాజ్యోతి.. కొడుకు గానీయండి.. కూతురు గానీయండి... కళ్ళముందు హఠాత్తుగా నిర్జీవమై ఓ శవంగా వారి ముందు పడి గుండెల్ని పిండివేస్తే ఆ కోలుకోలేని దెబ్బ నుండి తేరుకోవడం జన్మలో వారి తరమా!!

   కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రమైనదే కావచ్చు.. కానీ అది తాత్కాలికమైనదే అని గ్రహించలేని విజ్ఞత వారిలో లోపించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్కోసారి కాస్త సహనం వహిస్తే సమస్య దానంతకదే  పరిష్కారమవుతూ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. అప్పటికప్పుడు పరిష్కారం దొరకని సమస్యల్ని గురించి కొంతకాలం ఆలోచించకపోవడం మంచిది. కాలం అన్ని గాయాల్ని, ఇంకా చెప్పాలంటే ఎలాంటి గాయాలనయినా మానేలా చేస్తుంది అంటారు కదా... అలాగే ఈరోజు భయంకరంగా తోచిన గడ్డు సమస్య కొద్ది రోజుల వ్యవధిలోనే దూదిపింజలా తేలిపోవచ్చు. అంత ఆందోళన పడింది దీని కోసమా అని కూడా అనిపిస్తుంది. ఆమాత్రం దానికి భగవంతుడిచ్చిన అపురూపమైన ఈ బ్రతుకుని తాత్కాలిక సమస్య కోసమని  శాశ్వతంగా ముగింపజేయడం సమంజసమా!!?

     పరీక్ష ఫెయిల్ అయితే మళ్లీ రాసి పాస్ అవ్వచ్చు. ఉద్యోగం ప్రయత్నం మీద ఏదో ఒక రోజు రాకపోదు. ఒకవేళ రాకపోయినా, బ్రతికి తీరాలి అనుకుంటే బ్రతుకుతెరువుకు బోలెడు మార్గాలు.. 

   ప్రేమ విఫలమైతే  అదే జీవితమా...చెప్పండి,! తల్లిదండ్రులతో పాతికేళ్ళు పెనవేసుకున్న బంధం ముందు కొద్దిరోజుల ప్రేమ బంధం విలువ ఎంత!? మీ మీదే  అన్ని ఆశలూ పెట్టుకున్న ఆ అమాయక ప్రాణుల గురించి క్షణమైనా ఆలోచించాల్సిన అవసరం పిల్లలకు ఉండాలా లేదా!!

  చావడం పిరికితనం కాదు. ఎంతో ధైర్యం కావాలంటూ ఉంటారు. సరే, ఆ ధైర్యమేదో బ్రతకడానికే తెచ్చుకోండి. ఏమైనా, ఒక్క విషయం.. ఈ బలహీన మనస్కులంతా గుర్తుంచుకోవాలి. చచ్చి సాధించేది ఏమీ లేదు. బ్రతికే సాధించుకోవాలన్న నగ్న సత్యం... జీవితం కాస్తా ముగిసిపోయాక ఇక చేసేదేముంది!!? తల్లిదండ్రులకు జీవితకాలం  భరించలేని వేదన తప్ప !!

   ఇలాంటి సున్నిత మనస్కులు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తీవ్రతరమైనప్పుడు.. ఒక్క క్షణం..ఒకే ఒక్క క్షణం...ఆగిపోయి...ఆలోచించడం అన్నివిధాలా శ్రేయస్కరం.ఆ సమయంలో వారికి,

         " గతంలో మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు, పొందిన ప్రశంసలు, మీ ఆశలూ, ఆశయాలు... మననం చేసుకోండి. మీపై మీకు నమ్మకం కలగకపోదు. అంతకుమించి.. మిమ్మల్ని కన్న అమ్మానాన్నల గురించి... మీరు లేకుండా పోయాక వారి పరిస్థితి ఏమిటి? ఒక్కసారి..మీ నిర్జీవ దేహంపై పడి గుండెలవిసేలా వారు రోదిస్తున్న దృశ్యం ఊహించుకోండి..చాలు..ఎన్నటికీ..మరెప్పటికీ ఆ తలంపే మీ ఊహల్లోకి రాదు. అదే మిమ్మల్ని మీ కర్తవ్యం దిశగా నడిపించేలా చేస్తుంది..."

అని చెప్పాలనిపిస్తోంది.

  బాల బాలికలు, యువతీ యువకులే కాదు వయసుతో నిమిత్తం లేకుండా ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న ప్రతీవారు బ్రతుకుపై తీపినీ, రేపటి పై ఆశను  పెంచుకుంటే సమస్యల్ని అవలీలగా దాటే మానసిక స్థైర్యం వచ్చి తీరుతుంది. కాబట్టి.. సమస్యలకు భయపడకుండా కాస్త ఆగండి.. ఆలోచించండి...

Sunday, July 19, 2026

హృదయస్పందనకు దర్పణం..


కథ అంటే కాదు కల్పితం..
కథకుని హృదయస్పందనకు దర్పణం 
లోకం పోకడలను స్వానుభవంతో రంగరించి..
అల్లిన అనుభూతుల అనిర్వచనీయ కవనం..,!
వైవిధ్యభరిత మనస్తత్వ ఆవిష్కరణల 
అద్భుత విన్యాసం!
అతని ఊహా ప్రపంచంలో మెదిలి మెదిలి..
రూపుదిద్దుకొని.. కడకువీడి.. కాగితంపై 
అక్షరాల బారులై పరుచుకొని..పాఠకుని 
చేతికందిన అద్వితీయ బహుమతి 'పుస్తకం!'
కలల ప్రతిరూపం..ఊహకు నిలువెత్తు సాక్ష్యం..
సజీవంగా కళ్లెదుట సాక్షాత్కరించిన క్షణం...
ఆ సృష్టికర్త హృదిని ఎగసిపడే సంతోషతరంగం..
వర్ణనాతీతం!! అది అక్షరాలా అనుభవైకవేద్యం!!
ఆ కలం వెలిగించిన అక్షరదీపాలు..
దారి చూపే దివిటీలు..
ప్రగతికి బాటలు వేసే స్ఫూర్తిప్రదాతలు..
పాత్రల తీరుతెన్నులు..పాత్రోచిత చిత్రణ..
కథాగమనం..! ముగిసేదాకా జరిగే మేధోమధనం!!
కవితాహృదయం మాత్రమే ఎరిగిన అక్షర సత్యం!
చదువరి ఎదపై అదో చెరగని జ్ఞాపకం..
అంతర్లీనంగా అందే ఓ సందేశం..
సర్వజనావళికి  అదొక దిశానిర్దేశం..
రసజ్ఞత ఎరిగిన రచయితకు ఎదురేమున్నది..!
నవ్యత నిండిన రచనలకు కొదవేమున్నది..!?
అందుకే..కథ అంటే కానే కాదు.. కల్పితం..
కథకుని హృదయస్పందనకు అది దర్పణం..!!

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

['సంచిక ' ఆన్లైన్ వార పత్రికలో ప్రచురితమైన నా స్వీయ కవిత ]

Tuesday, July 14, 2026

జీవితమంటేనే పోరాటం...






మనసా..!నీకెందుకంత నిరాశ !!
బ్రతుకంటే దేనికంత భయం!?
ప్రాణత్యాగానికి ఎలా వస్తోంది అంత ధైర్యం!
అదేదో చూపించరాదా బ్రతకడం కోసం..
జీవితమంటే అంత విలువ లేనిదైపోయిందా !
క్షణికావేశం నీలోని విచక్షణను కమ్మేసిందా !

పది పరీక్ష తప్పితే  అదే పరమార్థమా !
మరో అవకాశం నీ కోసం 
వేచి ఉన్నదని మరిస్తే ఎలా ?
నాన్న కొడితే.. అమ్మ తిడితే..
అది ఎవరి కోసం? ముమ్మాటికీ నీకోసం..
ఉద్యోగం రాకుంటే.. మరణమే శరణ్యమా!
ప్రయత్నిస్తే దారులు శతకోటి.. ఎరుగవా..!
ఆశలుడిగిన జీవితం  చిగురులు వేయదా !!

అప్పుల పాలై అవమానాలతో తలవంపులా!
అయితేనేమి.. సహనం వహించి చూడు..
తలెత్తుకు తిరగ్గలవు.. తలరాత మారగలదు..
అనారోగ్యం అతలాకుతలం చేస్తోందా!
వెతికితే బాగయ్యే మార్గాలు  ఉన్నాయిగా !
ఇంట్లో శాంతిసౌఖ్యాలు  కరువా !
నెలకొల్పడం నీ చేతిలో పనే కదా సోదరా...

సమస్యలు సుడిగుండాలైతే..
సావకాశంగా ఆలోచించు..
సానుకూలంగా స్పందించు..
గోరంతను కొండలు చేయకు 
కాలమే చెబుతుంది అన్నింటికీ సమాధానం 
వేచి చూడు ఎదురవుతుంది పరిష్కారం 
నేటి సమస్య తాత్కాలికం 
రేపటికంతా తేలిపోయే దానికోసం 
బలిపెట్టకు నిండు జీవితం 

దేహంలో జీవం ఉంటేనే కదా..
'రేపు' అన్నది చూడగలం..!
ఆ రేపు అన్నది నీకు ఉండాలంటే 
జీవించి ఉండడం ప్రధానం..
ప్రాణంతో ఉంటేనే కదా 
చవిచూడగలం 'విజయం' !
ఆత్మాహుతి ఆలోచనలు కాదు నేస్తం..
దృఢసంకల్పం అవసరం 
ఈ జీవితం ఓ అమూల్య వరం 
అత్యద్భుతమైన ఈ అదృష్టం చేజారనీకు..
తుది శ్వాస వరకూ పోరాడు..
జీవితమంటేనే పోరాటం కాదా మనకు..,!
పోరాడటానికే మనం పుట్టామని మరువకు!!
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

[ 'సంచిక' ఆన్లైన్ వార పత్రిక..( 22.2.26 ) లో 
     ప్రచురితమైన నా స్వీయ కవిత ]




Wednesday, June 24, 2026

నీకోసం నీవే...



"ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా 
నిజం మరిచి నిదురపోకుమా "
అన్నాడో కవి..! మాటలా అవి..!
కానేకావు.. పచ్చి నిజాలు..
మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తిని 
మేల్కొలిపే అక్షరసత్యాలు !
గమ్యంవైపు అడుగులు కదపమంటూ 
ముందుకు నడిపించే హితబోధలు!!

అందుకే.. నేస్తమా!
ఎదురుచూడకు ఎవ్వరికోసం..
ఎవరో వచ్చి ఏదో చేస్తారని
నిన్ను అందలం ఎక్కిస్తారని ఆశ పడకు..
స్వయంకృషిని మించినదేదీ 
ఉండదు..గ్రహించు...
ఆత్మన్యూనతను వదిలించుకొని..
ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని..
ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ..
కదులు.. ముందుకు.. మున్ముందుకు...

ఆత్మనిర్భరత నీకు శ్రీరామరక్ష 
ఎల్లవేళలా నీకదే అండాదండ..
స్వయంసమృద్ధిని సాధించు.. 
సాగిపో..ముందుకు...
స్వఆధారితజీవనం వైపు దృష్టి సారించు..
స్వావలంబన ఇచ్చే ధైర్యంతో 
నిర్భీతిగా కదులు...
అహాన్ని మాత్రం దరిజేరనీకు...
నీ దృడసంకల్పమే సదా 
నీ గుండె ధైర్యానికి చేయూత  
నీ ఆశయసాధనకు ఊపిరిలూదే 
స్ఫూర్తి ప్రదాత..తెలుసుకో..!

నీ భుజం నీవే తట్టుకో..
నీకోసం నీవే ఆలోచించుకో...
నాకేమీ తెలియదని దిక్కులు చూడకు
అవసరం నీకోసం దారులు సృష్టిస్తుంది 
స్వయంకృషిని మించిన దేదీ 
ఉండదని గ్రహించు...
నీలో ప్రతిభ నిజంగా ఉంటే అదే 
నీకు పట్టం కడుతుంది..
అందుకే..నేస్తమా ! 
ఎదురు చూడకు ఎవ్వరికోసం 
పయనం సాగించు ముందుకు...
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋

['విహంగ ' ఆన్లైన్ మహిళా మాస పత్రిక.. 
ఏప్రిల్ 2026 సంచికలో ప్రచురితమైన నా స్వీయ కవిత ]





Wednesday, June 17, 2026

భూమాతా... నీకిదే వందనం 🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                                ~ యం. ధరిత్రీ దేవి 

కొండలు తవ్వి కోటలు కడుతున్నా...

గునపాలు గాయాలు చేస్తున్నా...

గరళం గొంతులో నిండిపోతున్నా...

పెదవి విప్పదు...చలించదు...

ఆనకట్టలు కట్టి అలవికాని భారమైనా..

ఆక్రోశించదు.. అసహనం అసలుండదు...

వటవృక్షాల వేళ్ళు గుండె లోతుల్లోకి 

చొచ్చుకుని గుచ్చుకుంటున్నా.. 

చిరునవ్వులు చిందిస్తుంది...

పర్వతాల్ని భుజాలపై మోస్తుంది...

సముద్రాల్ని కడుపులో దాచేస్తుంది...

పంటలు పండిస్తుంది... 

పశుగ్రాసాన్నిస్తుంది...

అందరి కడుపులు నింపుతుంది...

అందరికీ ఆవాసాన్నిస్తుంది...

స్వార్థపూరిత మనుషుల చేష్టల్ని 

పసిపిల్లల అల్లరి అనుకుని 

నవ్వుకుంటుంది...క్షమిస్తుంది... 

అన్నీ భరిస్తుంది...అంతా సహిస్తుంది..

ధరణికి కాక మరెవరికుంటుంది..

ఇంతటి ఓరిమి...!! భూమాతా !

నీకిదే వందనం... పాదాభివందనం...🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹






Tuesday, June 9, 2026

గోము సేయమాకమ్మ... బాల గేయం



ఏడవకే ఏడవకే నా చిట్టితల్లీ
ఏడిస్తే నీ మోము చూడలేనె తల్లీ
చిదిమితే పాలుగారు చెక్కిళ్ళు నీవమ్మ
వడలిపోనీయకమ్మ వాడిపోనీయకమ్మ..
గోముసేయమాకమ్మ..గోల అసలు వద్దమ్మా 
                                                       //ఏడవకే//
పాలబువ్వ తినిపిస్తా..వెండిగిన్నె ఇదిగో
కమ్మనైన నెయ్యి తోటి పప్పన్నం కలిపేసి
గోరుముద్దలే చేసి తినిపిస్తా నీతోటి 
బుజ్జిపాప బొజ్జ నిండి బజ్జుంటే హాయి హాయి 
బంగారుకొండవులే..మా ముద్దులమూటవులే 
                                                      //ఏడవకే//
అల్లంత దూరాన బడిగంట అదిగో 
మోగుతోంది..రారమ్మని పిలుస్తోంది పిల్లలను
బడిసంచీ ఇదిగో / బడి బాట సాగిపో
బాలలతో కలిసిపో..బహుబాగా చదువుకో 
భావితరం దూతవై భవితవ్యం దిద్దుకో
                                                    //ఏడవకే//
అఆ లతో మొదలెట్టు/ ఆకాశమే నీ హద్దు 
పంతుళ్ళ పాఠాలు /  ప్రగతికి అవి నిచ్చెనలు
చెడు స్నేహం దరిజేరకు /నీ గమ్యం జారనీకు 
సాగాలీ మున్ముందుకు..చేరాలీ శిఖరాలకు 
మా కంటి వెలుగువే..కోటి ప్రభల కాంతివిలే 
                                                  //ఏడవకే //
                   


 
                                                             


Thursday, June 4, 2026

కాకమ్మ కబుర్లు


                                    ~~యం. ధరిత్రీ దేవి

కావు కావు మంటూ కాకమ్మ అదిగో...
కారునలుపు రంగుతో పదునైన 
ముక్కుతో...చురుకైన చూపుతో
కొమ్మచాటు నోసారి..కోటగోడ నొకసారి..
నింగికెగిరి ఒకసారి..నేలను దిగి ఓసారి...

స్నేహానికి ప్రతిరూపం ఈ కాకమ్మ..
పంచుకుని తినే స్నేహశీలి కదా..!
తనవి కాని కోయిల గుడ్లను తన గూటిలో 
పొదిగే పరోపకారి కాకమ్మే కదా!

అందం లేదనా..! అంతః సౌందర్యం
అపారమే కదా!సుగుణశీలి..సులక్షణాల
పక్షి ఇదే కదా..కాకి గోల.. కాకి బలగం..
కాకి బంగారం..పిల్లకాకికేం తెలుసు 
ఉండేలు దెబ్బ..అబ్బో! సామెతలు కోకొల్లలే!!

నేస్తం అస్తమించెనా..స్పందించునే తక్షణం..
చుట్టూ చేరి కాకులన్నీ కలిసి 
ప్రకటించునే సంతాపం..! మనిషిలో లేని
మానవత్వం కనగలం కాకిలో..

పరిసరాల్ని ప్రక్షాళనం చేసే సర్వభక్షకి..
పర్యావరణ హితం గోరు పక్షి..
ప్రకృతిని విస్తరింపజేయు సహాయకారి..
విపత్తులను పసిగట్టగల నేర్పరీ ఇదే కదా!!

పురాతన పక్షిరాజం...పురాణాల్లోనూ 
దర్శనం../పవిత్రమైనదీ వాయసం...
కాలజ్ఞాని..ఇది శనివాహనమే!!ఇక...
పోరాటసమయాన..ఇది సమైక్యతావాది..

సాయంసంధ్యకు గూటికి చేరే కుటుంబ జీవి..
అనాదిగా సాంకేతికత నెరిగిన జ్ఞాని..
అలనాడే అట్టడుగున కూజాలో 
నీళ్లు పైకి రప్పించిన మేధావి మరి!!

గతించిన పూర్వీకులకిది వారధి...
పిండం కాకి ముడితేనే కానీ తృప్తిజెందరే 
మరి పితృదేవతలు !! కాకి కరువైన..
ఆవేళ..పర్వదినం అసంపూర్ణమే..!!

కాకి అరిస్తే చుట్టాలొస్తారట ! 
శుభసూచనలూ అందిస్తుందట!! అయితే...
ఇంతటి చరితగల కాకమ్మ 
కనుమరుగై పోతున్నది ఏమిటమ్మ!!

పలు సుగుణాల కాకమ్మకు రక్షణ కల్పిద్దాం..
ఆశ్రయమిచ్చే చెట్లను పెంచుదాం..పలువిధాల 
పరోపకారికి పిసరంత ఉపకారం చేద్దాం... 
కాకిజాతి అంతరించకుండా కాపాడుకుందాం....
 
 





 

Saturday, May 16, 2026

' నాన్నా, నాకు డబ్బు కావాలి, ఇవ్వు... ' 🌷 చిన్న కథ

   భర్త తోసిన తోపుకి విసురుగా వెళ్లి గోడకు తగిలి కింద పడిపోయింది కరుణ. ఆరేళ్ల సుధీర, నాలుగేళ్ల సురేష్ ఏడుపు లంకించుకుని ఓ మూల కూర్చుండిపోయారు. 
  " పనికి మాలిన దానా, అలసి వచ్చిన మొగుడికింత తిండి సరిగా పెట్టాలని ఉండదా నీకు... "
   అంటూ ఇంకా మీదికి వచ్చి మళ్లీ కొట్టబోయాడు వెంకట్రావు,  కానీ పిల్లలిద్దరూ భయంతో గట్టిగా అరవడంతో ఆగిపోయాడు. 
                         ***********
     కొన్నేళ్ళు గడిచాయి. 
" ఏమండీ, ఉగాది పండుగొస్తోంది కదా, బట్టలు కొనాలి..... " తలవంచుకుని మెల్లిగా అడిగింది కరుణ
    విసుక్కుంటూ ఐదొందలు చేతిలో కుక్కాడు వెంకట్రావు. 
"... నాక్కూడా బొత్తిగా చీరలు పాత పడిపోయాయి, ఓ రెండు కొనుక్కుంటాను, మరో ఐదు వందలు..."
 కస్సుమని లేచాడతను. 
 " నోర్ముయ్, ఇక్కడరాశులేమీ పోసుకుని కూర్చోలేదు నేను నీకివ్వడానికి...వెళ్లి నీ బాబునడిగి కొనుక్కో చీరలు..."
 అంటూ విసవిసా బయటికి వెళ్లిపోయాడు. 
    పక్కనే కూర్చుని చదువుకుంటున్న సుధీర, సురేష్ మ్రాన్పడిపోయారు. వాళ్లిద్దరూ ఇప్పుడు ఎనిమిది, ఆరు తరగతుల్లోకి వచ్చేశారు. తండ్రి ఎప్పుడూ ఎందుకు అంత కోపంగా ఉంటాడో, తల్లిని ఎందుకలా
హింసిస్తుంటాడో మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల బుర్రలకు అర్ధమయ్యేది కాదు. కానీ పెరిగే కొద్దీ తండ్రి కర్కశత్వం పట్ల ఓ విధమైన ఏవగింపు కలగసాగింది.. ముఖ్యంగా సుధీరకు. తల్లి అవసరాలన్నీ ఇంకా తాతయ్యే చూడాలనడం ఆ పసిదానికి ఎంతకీ అర్థం కాని విషయం!
                             ********
   అలా అలా రెండేళ్లు భారంగా గడిచాయి. సుధీర ఇప్పుడు స్కూల్ ఫైనల్లో ఉంది. పబ్లిక్ పరీక్షలు. ఫీజు కట్టాలి. దేనికి డబ్బు కావాలన్నా ఒకటికి నాలుగు సార్లు అడుక్కుంటేనే గానీ డబ్బులు రాల్చడు తండ్రి. తల్లికా నోట్లో నాలుక లేదు. సంవత్సరానికి ఒక జత బట్టలు పిల్లలకు కొనడమే గగనం. తల్లి పరిస్థితి చూస్తే ఆ పిల్లకు ప్రాణం ఉసూరుమంటూ ఉంటుంది.
   తన తోటి క్లాస్మేట్స్ ఎంత 'జాలీ' గా ఉంటారు! వాళ్ల నాన్నల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. అలాగని తన తండ్రికి సంపాదన లేదా?  గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ మంచి జీతమే తీసుకుంటున్నాడు, కానీ కట్టుకున్న భార్యకి రెండు కట్టుడు చీరలు కొనడానిక్కూడా ఎందుకంత గింజుకుంటాడో అర్థం కాదు. తను మాత్రం చాలా దర్జాగా తయారవుతాడు !
పసిపిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఏరోజూ తమని దగ్గరకు తీసినట్లుగానీ, లాలించినట్లు గానీ సుధీరకు గుర్తు లేదు. 
   ప్రతీసారీ తల్లిద్వారానే ఏదైనా అడిగించేది, తనకు తండ్రి ఎదురుగా నిలబడే ధైర్యం లేక. కానీ ఈసారి ఏదో మొండి ధైర్యం వచ్చిందాపిల్లకి. మనసులో స్థిరంగా నిశ్చయించుకుంది. 
   ఆరోజు యధావిధిగా తయారై ఆఫీసుకు  బయల్దేరుతున్నాడు వెంకట్రావు. సుధీర వెళ్లి అతని  కెదురుగా నిలబడింది. 
" నాన్నా, నాకు డబ్బులు కావాలి, ఇవ్వు..."
    చివుక్కున తలెత్తాడు వెంకట్రావు. తండ్రి కళ్ళల్లోకి స్థిరంగా చూస్తూ, 
" ఫీజు కట్టాలి, పండక్కి నాకూ, తమ్ముడికీ, అమ్మకూ బట్టలు కొనుక్కోవాలి. డబ్బు కావాలి ఇవ్వు..."
దృఢంగా అంది తొణుకూ బెణుకూ లేకుండా. 
"ఏమిటీ, కొత్తగా....ఫీజుకిస్తా, బట్టలూ గిట్టలూ కుదర్దు..." జేబులో చెయ్యి పెట్టబోతూ అన్నాడు. 
" కుదర్దు...అంతా కలిపి 5000/- ఇవ్వాల్సిందే.. "
" నోరుమూసుకుని అవతలికి పద..... "
" లేదు, ఈరోజు...ఇప్పుడే...ఇచ్చి తీరాలి..."
" ఏమిటే, నోరు లేస్తోంది...ఎప్పుడూ లేనిది!  మీ అమ్మగాని నూరిపోసిందా?  ఇప్పట్నించీ దానికే గాదు మీక్కూడా కొనివ్వను. వెళ్లి ఆవిడ పుట్టింట్లో తెచ్చుకోమను...వెళ్ళు.."
" తాతయ్య ఎందుకివ్వాలి? "
" ఎందుకా? దాన్ని కన్నాడు కాబట్టి... "
" సరే అయితే. రేపు నాకూ పెళ్లి చేస్తావుగా ఎవడికో ఒకడికిచ్చి.వాడు కూడా ఇలాగే నన్ను ప్రతీదానికీ నీదగ్గర ముష్టెత్తుకోమని పంపిస్తాడు, ఇస్తావా మరి..!"
   ఒక్కసారిగా వెంకట్రావు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఆ పిల్ల నోట్లోంచి వచ్చిన ప్రతీ మాటా ఓ తూటాలా అతని గుండెల్లో సూటిగా దిగబడి తూట్లు పొడిచేసింది. ఇన్నాళ్లూ మన్నుదిన్న పాములా పడి ఉన్న దీనికి ఇంత నోరెలా వచ్చింది?!
  కోపంతో ఊగిపోతూ కట్టుకుంటున్న బెల్టు తీసి కూతురివేపు ఉరికి రాబోయాడు.ఇంతలో సుధీర తండ్రి వైపు విసురుగా అడుగులు వేసింది.
" ఎందుకు నాన్నా అంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అదేగా! నీ పద్ధతి ప్రకారం రేపు నాకు పెళ్లి చేశాక కూడా నా బాధ్యతలన్నీ నీవేగా తీసుకోవాల్సింది... "
" ఊరుకునే కొద్దీ మాటలు మితిమీరుతున్నాయే.. నోరు మూస్తావా లేదా... "
 వెంకట్రావులో ఆవేశం కట్టలు తెంచుకుంది.
" అదేంటి నాన్నా, తాతకోపద్ధతి,నీకో పద్ధతీనా..! ఇదిగో చూడు, ఇక్కడే ఉన్నాడుగా నీ కొడుకు  సురేష్...  ఊహ తెలిసినప్పటినుంచీ నిన్ను చూస్తూ పెరుగుతున్నాడు. నీవు చేసేది కరెక్టే అని అనుకుని, రేపు వీడి పెళ్లయ్యాక వీడి పెళ్ళాన్నీ ప్రతిదానికీ దాని పుట్టింటికి వెళ్లి తెచ్చుకోమంటాడు...మంచి పద్ధతులే నేర్పిస్తున్నావు నాన్నా... "
 తెల్ల మొహం వేసుకుని చూస్తున్న సురేషుకు అంతా అయోమయంగా తోచింది. ఓవైపు  తండ్రి ఉగ్రరూపం, మరోవైపు ఎన్నడూ ఎదురు మాట్లాడని అక్క!!
 పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన వెంకట్రావు లో సహనం నశించిపోయింది.
" నోరు ముయ్యమన్నానా... "
 అంటూ బెల్టు తీసుకుని విసురుగా ముందుకురికాడు.అంతవరకూ ఆ పక్కనే నిల్చుని చూస్తున్న కరుణ అనుకోని ఈ పరిణామానికి అవాక్కైపోయింది. ఒక నాడు పొత్తిళ్లలో తన ఒడిలో పసిగుడ్డుగా ఉండిన సుధీరేనా ఈ పిల్ల ! తన ఒంటి మీద వాతలు తేలేలా ఆడిన ఆ బెల్టు ఇప్పుడు తన బిడ్డ మీద పడబోతోంది. ఒక్కసారిగా ఆ అర్భకురాలిలో వెయ్యేనుగుల బలం వచ్చి చేరింది. అంతే, ఒక్క ఉదుటున వెళ్లి భర్తను అడ్డుకుంది. 
" ఆగవయ్యా, పిల్ల ఒంటిమీద చేయి పడిందంటే మర్యాద దక్కదు... "
 వెంకట్రావు వీపుమీద చెళ్ళున కొరడాతో కొట్టినట్టు అయింది. కోపం రెట్టింపవగా అటు నుండి ఇటువైపు తిరిగి కరుణ మీదికి  రాబోయాడు. వెంటనే అతన్ని బలంగా పక్కకు తోసేసింది కరుణ. ఊహించని ఆ ప్రతిచర్యకు అటు పక్కగా ఉన్న సోఫాలో కూలబడిపోయాడు వెంకట్రావు. నోరు విప్పింది కరుణ.
"... ఆ పిల్లకున్న తెగువ, ధైర్యం కాస్తయినా నాకు ఉండి ఉంటే ఈరోజు నా బ్రతుకిలా తగలడి ఉండేది కాదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా పిల్లలు నా పంచప్రాణాలు.వాళ్ళను బాధ పెడితే మాత్రం సహించేది లేదు. అలాగని ఇల్లు విడిచి పోతానని అనుకోకు, ఇది నా ఇల్లు. ఇక్కడే ఉంటాను నా పిల్లలతో. జాగ్రత్తగా ఉండు.. "
  మొట్టమొదటిసారి ఆమె రౌద్ర రూపం చూసి విస్తుపోయాడు వెంకట్రావు. మరోవైపు సుధీరలో పెల్లుబికిన ఆనందం ! ఇంకోవైపు ఏం జరుగుతోందో అర్థంకాక సురేష్ ! అతను తేరుకునేలోగా నెమ్మదించి పిల్లలిద్దర్నీ అక్కున చేర్చుకుంది కరుణ. దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు, ఇంతకాలం నియంతలా ఉన్న వెంకట్రావు. ఇంట్లో అంతా కలిసి ఎదురుతిరిగితే పరిస్థితి ఎంత విషమమో అతగాడికి తొలిసారిగా తెలిసొచ్చింది. కోరలు పీకి పడేసిన కోడెనాగులా తలదించుకుని బయటకెళ్లబోయాడు. 
" ఆగండి నాన్నా, డబ్బు..డబ్బు కావాలి.అంతా కలిపి 5000 /-  ఇక ప్రతిసారీ నువ్వే మా ముగ్గురికీ బట్టలు కొనాలి, నువ్వు ప్రతీ పండక్కీ కొనుక్కుంటావే అలాగన్నమాట... "
  కూతురి మాటలకు బయటకు పోతున్నవాడల్లా ఆగిపోయి ఇక తప్పేలా లేదనుకున్నాడో ఏమో , అప్రయత్నంగా బీరువా తెరిచి ఐదువేలూ  లెక్క పెట్టి ఆ పిల్ల చేతిలో పెట్టేసి గబగబా వెళ్ళిపోయాడు. పరమ సాత్వికురాలైన భార్య, తల్లి చాటుగా మౌనంగా పెరుగుతున్న కూతురు ఈరోజిలా చెలరేగి పోవడానికి తన నిరంకుశత్వ ధోరణి, క్రూర నైజమే కారణమన్న పచ్చినిజం ఆ పురుషపుంగవునికి తెలిసి వచ్చిందో లేదో తెలీదు గానీ...లోపల తల్లీ పిల్లలు మాత్రం ఏళ్లతరబడి కారాగారంలో పడి మగ్గిపోయి బయటపడ్డ ఖైదీల్లాగా అయిపోయారు. అక్కడి దృశ్యం ఓ సారి చూస్తే..... 
     సుధీరను గట్టిగా పొదువుకుంది కరుణ. సురేష్ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు. ఊహ తెలిశాక మొదటిసారి తల్లి కళ్ళలో మెరుపు చూసింది సుధీర. తల్లీకూతుళ్ళిద్దరి చెంపలమీదనుండి ధారలుగా కన్నీళ్లు ! ఇద్దరికీ తెలుసు, అవి ఆనందబాష్పాలని !!
                        *****************
[ పెళ్లయ్యాక భార్యాబిడ్డల బాధ్యతలు తనవే అని భావించక ఆ భారమంతా అత్తమామల మీద తోసేసే కొందరు ( అందరూ కాదు  ) ప్రబుద్దుల నిర్వాకం చూస్తూ... ఆ స్పందనతో... ]

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                        యం. ధరిత్రీ దేవి 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Sunday, April 26, 2026

సూర్యాస్తమయం...



   ~
ధరిత్రీ దేవి 

                  దినకరుడు...
                 సెలవు పుచ్చుకుంటున్న వేళ...
                 నింగీనేల కలిసే చోట...
                 ప్రకృతి గీసే ఆ వర్ణచిత్రం !
                 ఎంత మనోహరం !!
                 పొద్దు వాలుతున్న ఆ క్షణాలు
                 ఎందుకో మరి !అందరికీ అంత ఇష్టం !
                 జీవిత చరమాంకాన్ని మాత్రం ద్వేషిస్తాం...
                 క్రుంగిపోతాం..వద్దూ వద్దంటాం...!
                 సూర్యాస్తమయంలో ఆహ్లాదం...
                 మలివయసులో  మనిషిలో మాత్రం 
                 ఉండదా ఏమి !! వెతుకుదాం...
                 బాధ్యతల సంకెళ్లు విడివడి...
                 మనకంటూ మిగిలి..చేతికందిన... 
                 ఆ అరుదైన సమయాన్ని 
                 సొంతానికి మాత్రమే 
                 సొంతం చేసుకుంటే...సంతోషం 
                 మన సొంతమవును కదా !!
                 కనురెప్పలు మూతలు పడేదాకా...
                 కలతలకతీతంగా పయనం సాగిద్దాం
                 వృద్ధాప్యాన్ని ప్రేమిద్దాం 🙂
                 ఆనందంగా ఆస్వాదిద్దాం ...

🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞


Monday, April 13, 2026

చినుకులు కావవి... పన్నీటి జల్లులు..

🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚... 


అదిగదిగో ఆకాశాన....
కమ్ముకుంటూ నల్ల నల్లని మబ్బులు...
దోబూచులాడుతూ...పరుగులు తీస్తూ..
అటు ఇటు సాగుతూ..సాగుతూ...
సృష్టిస్తున్నాయి అంబరాన
మౌనంగా అలజడులు....
నీలాల నింగి..అంతలో అయ్యింది కడలి...
చల్లగాలి సోకి...అదిగదిగో..మొదలవుతోంది...
చిరుజల్లుల చిలకరింపుల
పలకరింపులతో  పరవశింప చేస్తూ...
చిటపట చినుకుల తాళం వేస్తూ...
పగుళ్లు వారిన నేలను పదును చేస్తూ...
సకల జనుల్ని సేదదీరుస్తూ...
అరెరే...!! వచ్చేసిందిగా...వాన !!
ఇదిగిదిగో..అయింది మౌనంగా జడివాన..!!
పన్నీటి జల్లులు కురిశాయి హృదయాన...!!

🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦


                      

Monday, April 6, 2026

మండే ఎండల్లో మల్లెల సౌరభాలు !


            ~ యం. ధరిత్రీ దేవి ~
************************
వేసవి  వచ్చింది 
ఎండల్ని తెచ్చింది 
మల్లెల్ని ఇచ్చింది !
ముడుచుకున్న ఆకులన్నీ  
విప్పారినవి 
పండుటాకులు రాలి 
పచ్చని చివుళ్లు 
పలుకరిస్తున్నాయి 🙂
ఇన్నాళ్లూ ఎక్కడ 
దాక్కున్నాయో మరి !!
నిద్రించిన కొమ్మలు 
ఒక్కసారిగా మేల్కొన్నాయి !
అదిగో, మొదటి మొగ్గ  !!
విచ్చుకుంది మరునాటికి !
కనురెప్ప పాటులో 
కనువిందు చేస్తూ... 
కొమ్మకొమ్మనా చిట్టి మొగ్గలు !
చిరు నవ్వులు చిందిస్తూ... 
చెట్టంతా...విరిసిన మల్లెలు 
వారం గడిచేసరికి  !
నింగిని పరుచుకున్న 
నక్షత్రాల మాదిరి !!
పరిమళభరితాలు 
మల్లెలు...సన్నజాజులు 😊
ఋతురాగాలకు స్పందించే 
శ్వేతవర్ణ కుసుమాలు !
మండే ఎండల్లోనే కదా 
ఈ మల్లెల గుభాళింపులు !
ఆస్వాదించాలంటే
స్వాగతించాలి మరి 
వేసవి వడగాడ్పుల్ని  !! 
అందుకే...
వేసవి రావాలి 
ఎండల్ని తేవాలి 
మల్లెల్ని మనకివ్వాలి  🙂🙂
**************************
                 
                

Friday, March 20, 2026

కల్మషమెరుగని పసిపాప...'కవిత

 'విహంగ ' ఆన్లైన్ మాసపత్రిక.. ఫిబ్రవరి 2026 లో నా కవిత 

" కల్మషమెరుగని పసిపాప " ప్రచురింపబడినది. 🙏

Friday, March 6, 2026

హోమ్ మినిస్టర్....కథ

  🌷                                         ~~యం.ధరిత్రీ దేవి~~
   
    కిటికీలోంచి సూర్యకిరణాలు చురుక్కుమని తగిలేసరికి కళ్ళు నులుముకుంటూ బద్ధకంగా లేచి కూర్చున్నాడు సాంబశివరావు. అప్రయత్నంగా గోడకేసి చూసిన అతనికి గడియారం ఎనిమిది గంటలు చూపించింది. 'మై గాడ్' అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి హాలు లోకెళ్ళిన అతనికి అడ్డదిడ్డంగా పడి ఇంకా లేవని ఇంటర్, డిగ్రీ చదువుతున్న సుపుత్రులు వంశీ, వరుణ్ దర్శనమిచ్చారు. తండ్రి అరుపులకు దిగ్గున లేచి బాత్రూంలోకి దూరిపోయారిద్దరూ. 
   హడావుడిగా కిచెన్ లో అడుగుపెట్టిన అతనికి రాత్రి తిని పడేసిన ఎంగిలి కంచాలు, అంట్లగిన్నెలు వాసన కొడుతూ కనిపించేసరికి ఒక్కసారిగా నీరసం కమ్ముకొచ్చి ఠక్కున ఇల్లాలు గుర్తొచ్చింది.
    నిన్న ఉదయం వాళ్ళనాన్న బాత్రూంలో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంటుగా రమ్మని వాళ్ళ అమ్మ ఫోన్ ! అంతే!గబగబా వంట చేసేసి, రెండు చీరలు ఓ  సంచీలో కుక్కుకుని ముక్కు చీదుకుంటూ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయింది జానకి...అతని అర్ధాంగి. ప్రస్తుతం ఇంటి  దీన పరిస్థితికి అదీ కారణం...
   అరగంటలో స్నానాలు, గీనాలు ముగించేసి బయటపడ్డారు ముగ్గురూ.అలా అలా నాలుగు రోజులు గడిచాయి. సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం భయంగా ఉంటోంది సాంబశివరావుకి... ఇల్లంతా దుమ్ము...! ఎక్కడి  సామాన్లు అక్కడే! విడిచి బట్టలన్నీ మంచాల మీద !! వంటిల్లయితే చెప్పనలవికానట్లుంది... ఇంటి బయట ఎండిన ఆకులు, దుమ్ము ధూళి.. అంతా పరుచుకొని కంపరంగా అనిపిస్తోంది. వాటి కింద నుండి జానకి వెళ్లే రోజు ఉదయం వేసిన ముగ్గు దీనంగా తొంగి చూస్తూ కనిపిస్తోంది. ప్చ్ ! ఎలా ఉంచేది ఇల్లు!! అద్దంలా... ముట్టుకుంటే మాసిపోతుందా అన్నట్లు..!
    వారం దాటింది. జానకి జాడలేదు. ఫోన్ చేస్తే... "వయసు బాగా మీద పడింది కదా... నాలుగైదుచోట్ల కాలి  ఎముకలు విరిగాయట...రెండు ఆపరేషన్లు అయ్యాయి. మరో వారం దాకా హాస్పిటల్లోనే ఉండాలట... మా అమ్మ ఒక్కతే ఇంట్లో, హాస్పిటల్లో చూసుకోలేకపోతోంది. వచ్చేవారం మా అన్నా,   వదిన వస్తామన్నారు. అందాక నేను రాలేను... ఎలాగోలా మీరే సర్దుకోండి..."
 అంటూ చెప్పేసింది జానకి. గుండెల్లో రాయి పడింది సాంబశివరావుకి. ఇద్దరు  కొడుకులు తల వేలాడేసుకుని, మౌనంగా ఉండి పోయారు. చేసేదేముంది... అనుకుంటూ.. ఉదయం కాఫీలు మాత్రమే ఇంట్లో... టిఫిన్లు, మధ్యాహ్న భోజనం... బయట. రాత్రి మాత్రం ఏ ఉప్మానో, చపాతీనో చేసుకుని చట్నీలతో, కారంపొడులతో కానిచ్చేస్తున్నారు. 
    సాంబశివరావుకి వంట బొత్తిగా రాదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్  తీసుకొని ఉండేవారు. అప్పుడు కాస్త అలవాటు అయినవే..ఈ ఉప్మా, చపాతీ ప్రిపరేషన్లు... భార్య వచ్చాక, ఇక వంటింట్లో అడుగు పెట్టే అవసరం నాకేంటి.... అన్న ఫీలింగుతో కాలర్ ఎగరేసి తిరిగాడు.అంతేనా !  ఇద్దరూ కొడుకులే పుట్టారని తెగ మురిసిపోయాడింతవరకూ. కానీ.. ఇప్పుడు తెలిసి వస్తోందతనికి... ఆడపిల్ల లేని లోటు..! దేవుడా! నిజంగా ఆడది లేని ఇల్లు ఇంత దారుణంగా ఉంటుందా..! ఇంటికి దూరంగా ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు జానకి... కాన్పుల సమయంలో కూడా వాళ్ల ఊర్లో వైద్య సౌకర్యం సరిగా ఉండదని ఇక్కడే ఉండిపోయింది మరి... నిస్సహాయ స్థితిలో పడిపోయిన సాంబశివరావుకి పదేపదే పెళ్ళాం గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేముంది...!
    ఎలా ఉండేది ఇల్లు జానకి చేతిలో! ఉదయం ఎప్పుడు నిద్ర లేచేదో ఏమిటో... ఎనిమిదింటికంతా ఒంటిచేత్తో అన్నీ  సిద్ధం చేసి ఉంచేది. పనిమనిషి కూడా వద్దని సర్వం తనే చేసుకునేది. అందరి బట్టలూ ఉతికి ఇస్త్రీ చేసి టైంకు రెడీగా ఉంచేది. సాయంత్రం ఇంట్లో అడుగు  పెట్టేసరికి.... ఇల్లంతా ఆహ్లాదకరంగా. హాయిగొల్పుతూ ఉండేది. ఇప్పుడు..! తను లేని ఇల్లు బావురుమంటూ భారంగా అనిపించింది సాంబశివరావుకి! ఉన్నప్పుడు తెలియలేదు గానీ తన విలువ...ఎంతైనా ఆడవాళ్లు గ్రేట్ !! అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో 'ఇల్లాలు', 'ఇల్లాలే దేవత ', 'ఇంటికి దీపం ఇల్లాలు '...లాంటి సినిమా టైటిల్స్ అన్నీ గుర్తొచ్చాయి. దాంతోపాటు... 
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, 
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి  "
"ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం "
లాంటి సినిమా పాటలు కూడా గుర్తొచ్చి, గుచ్చి గుచ్చి మరీ వేధించాయి. 
   ఆ సాయంత్రం వంటింట్లో అడుగు పెట్టిన అతని చూపు అప్రయత్నంగా ఆ పక్కనే ఉన్న దేవుని గూడుపై పడింది. జానకి వెళ్లేరోజు పూజ చేస్తూ పెట్టిన పూలు, వాడి ఎండిపోయాయి. అగరొత్తుల తాలూకు ఆనవాళ్లు అక్కడ గూటినిండా పరుచుకుని ఉన్నాయి. అతని మనసంతా కలచివేసినట్లయింది. వెంటనే చీపురు తీసుకుని ముందు వంటిల్లంతా  శుభ్రం చేశాడు.అలవాటు లేని పని !దేహం మొరాయించింది. అయినా,  అలాగే మిగతా రూములూ అయిందనిపించాడు. .. కొడుకులు అది  చూసి లేచారు. పక్క బట్టలన్నీ సర్దేశారు.
    లోపల ఎలాగోలా అయిపోయింది... మరి గేటు బయట సంగతి! ఊడ్చడానికి నామోషీ ఒకటి! తల పట్టుకుని, "ఈ  ఇల్లు అద్దెకిస్తారా " అని ఎవరూ  అడగకముందే జానకి వచ్చేస్తే బాగుండు అనుకున్నాడు లోలోపల సాంబశివరావు. పోనీ, ఎవరైనా పనిమనిషిని చూద్దామా అనుకుంటే అంత అర్జెంటుగా దొరకడం గగన కుసుమమే! ఫోన్ చేసి భార్యను రమ్మనేద్దామా అనుకున్నాడో క్షణం. అత్తింటి వాళ్ళు ఎన్నడూ తన సహాయం కోరింది లేదు ఇప్పటివరకూ. లేక లేక అవసరమొస్తే తానలా చేయడం నచ్చక ఆ ఆలోచన విరమించుకున్నాడు వెంటనే..వారం అన్న జానకి మరో వారం దాకా రాలేదు. వాళ్ళ అన్నకు సెలవు దొరకలేదట..డీలా పడిపోయి జ్వరం వచ్చినంత పనయింది సాంబశివరావుకి.
   ఆరోజు ఉదయం తెలతెలవారుతుండగా గేటు చప్పుడయింది. జానకి రెండు సంచులతో ఇంట్లో అడుగు పెట్టింది. వంటింట్లో పాలు మరగబెట్టే పనిలో ఉన్న సాంబశివరావు అది గమనించి, అకస్మాత్తుగా దేవత ప్రత్యక్షమైనట్లు సంబరపడిపోయాడు..
" జానకీ, వచ్చేశావా...! ఫోనయినా చేయలేదే!.."
 అంటూ సంచులు అందుకున్నాడు.
" అవునండీ, అన్న, వదిన నిన్న సాయంత్రం వచ్చేశారు. ఇప్పటికే లేటయిందని నేను రాత్రి బస్సుకే బయలుదేరాను...ఏమిటీ, వీళ్ళింకా లేవలేదా..!"
అంటూ పిల్లల గదిలోకి తొంగి చూసింది. తల్లి గొంతు వినిపించి ఇద్దరూ గబగబా లేచి వచ్చారు వంశీ, వరుణ్. ఇల్లంతా ఓసారి పరికించి చూసిన జానకికి అంతా అర్ధమైపోయింది. అప్పటికప్పుడు ఏమీ  అనాలనిపించలేదామెకు. చీర కొంగు బిగించి, చీపురు అందుకుంది. అరగంటలో ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఇన్నేళ్లుగా తాను చేస్తున్న తప్పిదం బాగా తెలిసి వచ్చిందామెకు. దాంతోపాటు తన కర్తవ్యం కూడా బోధపడింది. ఇదంతా ఏమీ పట్టని సాంబశివరావు ఊపిరి పీల్చుకొని ఈజీ చైర్ లో రిలాక్స్ అయ్యాడు. 
    ఆ సాయంత్రం...
" రేయ్ఎక్కడికి బయల్దేరారు?... "
 కాలేజీ నుండి వచ్చి బ్యాట్లు పుచ్చుకుని బయటకు దారి తీయబోతున్న వంశీ, వరుణ్ తల్లి వైపు బ్యాట్లు  చూపిస్తూ, 
" క్రికెట్ ప్రాక్టీస్ కు మమ్మీ.."
 అన్నారు ఒకేసారి.
" అవన్నీ తర్వాత. ముందు అవి పక్కన పెట్టి ఇలా రండి, మీతో మాట్లాడాలి"
" అబ్బా,మమ్మీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రాక్టీస్ కు లేట్ అవుతుంది..."
"కుదరదు, నోరు మూసుకుని రండి."
 గద్దించేసరికి అలాగే బ్యాట్లు పట్టుకొని వచ్చి సణుగుతూ కూర్చున్నారు..
" జాగ్రత్తగా వినండి. ఈరోజు నుండీ కొన్ని అలవాట్లు మార్చుకోండి ఇద్దరూ . మీ పనులు మీరే చేసుకోవాలి.అంటే మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. మీ పుస్తకాలు అన్నీ మీరే సర్దుకోవాలి. ఇంటిపనులతోపాటు చిన్న చిన్న వంటపనులూ చేయాలి.... "
"...................."
"...రేపేదో మీ పెళ్ళాలకు చేసిపెట్టాలని కాదు, ఇదిగో, ఇప్పుడొచ్చిపడిందే గడ్డు పరిస్థితి...!అలాంటపుడు ఇబ్బంది పడకూడదని....! కనీసం కొంతలోకొంతైనా ఎవరికోసం చూడకుండా చేసుకోగలగాలని... అంతే.."
తలెత్తి చూశారిద్దరూ. 
"...అయినా మీ తప్పేమీ లేదులే. అంతా నాదే నాదే. మీకు మొయ్యకుండా ప్రతీదీ అమర్చిపెడుతున్నా చూడండీ... నాదీ.. నాదీ తప్పు. మగపిల్లలు మహారాజులూ... వాళ్ళు ఆడపనులు చేయకూడదూ అని మా అవ్వ, ముత్తవ్వ కాలం నాటి చాదస్తాలన్నీ నేనూ పాటించాను చూడూ...నాదీ..నాదే తప్పంతా. బుద్దొచ్చింది. ఉదయం మీఇద్దర్నీ చూశాక బాగా బుద్ధొచ్చింది. నాన్న వంటింట్లో ఒక్కడే అవస్థ పడుతుంటే మీరేమో హాయిగా గుర్రుపెట్టి నిద్దరోతున్నారు. సిగ్గుగా లేదురా మీకు !.."
"మమ్మీ, అదీ... "
" ముయ్యండి నోరు. ఇకనుంచీ నేను చెప్పినట్టు చేసితీరాల్సిందే.. "
"సరే మమ్మీ, ఈరోజు ప్రాక్టీస్ కెళతాం. రేపటినుండీ... "
"...కుదరదు. ఈరోజే ఇప్పుడే. మొదలెట్టాలి. మిగతావన్నీ తర్వాత.. "
తల్లి గొంతులో, ప్రవర్తనలో ఇదివరకెన్నడూ చూడని కాఠిన్యం చూశారిద్దరూ. మెల్లిగా బ్యాట్లు మూలన పెట్టి మాసిన బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు నడిచారు. టీ తాగుతున్న సాంబశివరావుకు భార్య ఏమిటో కొత్తగా కనిపించిందా క్షణంలో.
 " మొక్కై వంగనిది మానై వంగదండీ. అలవాటు పడాలి వీళ్ళు, తప్పదు. కొద్ది రోజులు నేను లేకపోయేసరికి ఇల్లు చూడండి ఎలా తయారైందో... !"
భార్య పరోక్షంగా తననూ అంటోందా అనిపించింది సాంబశివరావుకు. అయినా,సబబుగానే తోచింది అతనికి. ఈ మూడు వారాలూ తను పడ్డ కష్టం తలుచుకుంటే...! ప్రతీ ఇంట్లో చిన్నప్పట్నుంచీ మగపిల్లలకు తల్లో, అమ్మమ్మో, నాయనమ్మో లేకుంటే అక్కో, చెల్లో... ప్రతిదీ అందిస్తూ, అన్నీ అమరుస్తూ వాళ్ళను సోమరులుగా, ఏపనీ చేతగానివాళ్ళలా తయారుచేస్తున్నారు. ఇది ఆడపని..మేమెలా చేస్తాం అన్న ధోరణిలో పెరుగుతున్నారు. డిపెండెంట్ నేచర్ డెవలప్ అవుతోందని వాళ్ళకర్థం కావడం లేదు. వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ముందు తల్లులు మారాలి.. ఇదిగో...ఇలా...జానకిలా...! మనసులోనే భార్యను అభినందించాడు. కానీ, పైకి మాత్రం, 
" అది సరే వింటారంటావా... !"
అంటూ తటపటాయిస్తూనే సందేహం వెలిబుచ్చాడు. 
" తమరు వీళ్లకు వత్తాసు పలక్కుండా ఉండండి చాలు.. "
దండం పెట్టింది జానకి. 
" ఓకే ఓకే. హోమ్ మినిస్టర్ ఆదేశించాక తప్పుతుందా మరి !"
నవ్వుతూ, మరి ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని మెల్లిగా లేచి,అలా బయటికెళ్ళొస్తా... అంటూ గేటు దాటాడు. అక్కడ ఇంటి ముందు ముచ్చటగా ఓ కొత్త ముగ్గు..! మురిపెంగా కనిపించింది. అక్కడ నిన్న పరుచుకున్న చెత్త ఇప్పుడు మచ్చుకైనా లేదు.
"ఆహా ! ఆడది  ఉన్న ఇంటికీ లేని ఇంటికీ ఎంత తేడా! ఇదంతా ఇల్లాలి మహిమే కదా!"
 భార్యపై ప్రేమతో పాటు గౌరవమూ కలిగింది సాంబశివరావుకి.అంతలో ఠక్కున ఏదో స్ఫురించింది. బాపురే !ఈరోజు ఏదో విశేషమున్నట్లుందే !ఏమిటబ్బా!
బుర్ర గోక్కున్నాడు. మార్చ్, 8. Women's Day. మహిళాదినోత్సవం..! మరిచేపోయా... ఈ సందర్భంగా నా ప్రియమైన శ్రీమతికి ఓ చక్కటి బహుమతి ఇచ్చి తీరాల్సిందే... తృప్తిగా,  సంతోషంగా ముందుకు కదిలాడు సాంబశివరావు.
🌷💐🌹🌷💐🌹🌷🌹💐🌷🌹💐🌷🌹💐🌷🌹💐

 




      

Friday, February 20, 2026

ప్రశ్నించు..ప్రశ్నిస్తూనే ఉండు...

                                        ~యం. ధరిత్రీ దేవి

నాల్గు గోడల నడుమ ఉన్నా...
నాకెందుకులే అని సరిపెట్టుకుందామన్నా...
వర్తమానభారతం వార్తల భారంతో.. 
చెలరేగే ఆలోచనాసంద్రపు సుడిగుండాల్లో చిక్కి...
మునిగిపోతూ..నలిగి నలిగీ..కడకు తేలి..
రూపుదిద్దుకుని..నా మస్తిష్కపుపొరలు 
చీల్చుకుని..అక్షరాలై కాగితాన బారులై 
పరుచుకున్న నా భావజాలమా...!!

అడగవా ఈ సమాజాన్ని...కులమతాల అడ్డు గోడలు
రేపుతున్న విద్వేషాల ఆరని అగ్నకీలలు..ఎందుకని ?
ఉగ్రవాదం విషపుకోరలు సాచి విషం చిమ్ముతూ...
అమాయకుల్ని విగతజీవులుగా మార్చి మరుభూమిని
తలపిస్తున్న తీవ్ర సంక్షోభాల్ని..ఖండించవా...
ఈ మారణహోమాలు ఎందుకూ..ఎందుకని ?

తరతరాలుగా..ప్రతీతరాన్ని తీరని వేదనలో ముంచెత్తుతూ 
నిర్వీర్యంచేస్తూ.. ప్రగతిరథాన్ని ముందుకు కాదు...
వెనుకకు మళ్ళిస్తూ..దుస్సాంప్రదాయాల పడగనీడలో 
పాతుకుపోయి..కుళ్ళిపోతున్న ఈ మారని మనస్తత్వాల్ని 
ప్రశ్నించవా..ఎందులకీ అనాగరిక మూఢత్వపు ముసుగులని...!?

ఆత్మాభిమానం మృగ్యమై..మానవీయ విలువలు శూన్యమై...
అర్ధాంగి ఆస్తులకు అర్రులు చాస్తూ..మూడుముళ్ల బంధం 
మూన్నాళ్ళ ముచ్చటగా మారుస్తూ..నవ వధువుల్ని కాటికి 
పయనం కట్టిస్తున్న ఆత్మ విమర్శ ఎరుగని నేటి 
సంస్కారహీనుల్ని నిలదీయవా..తగునా ఇది మీకని...!!

ఏ మూల వెతికినా..ఏ వార్త చదివినా..ఏమున్నది గర్వకారణం..! 
తీరని మానసిక సంఘర్షణల క్షోభ దప్ప..
అటనుండి ఆవిర్భవించే వేదనాభరిత స్పందన దప్ప...!
అయినా సరే..మదిని కలవరపరిచే నా భావజాలమా..
అక్షరసైన్యమై మరోసారి..మరోసారి.. మరీ మరీ... 
ప్రశ్నించి చూడు..ప్రశ్నార్థకంగా మారుతున్న దేశ భవిత గురించి...
భావితరాల అగమ్యగోచర  ప్రస్థానం గురించి...!!

['సంచిక ' ఆన్లైన్ వార పత్రిక ( 1.2.26 ) లో ప్రచురింపబడ్డ నా కవిత ]


 


Friday, February 13, 2026

కట్టుబాట్లు

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦 
                        కట్టుబాట్లు 
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

 ప్రేమించుకున్నామంటారు... 
 ప్రేమికులం మేం అంటారు...!
 పెళ్లంటే వద్దూ వద్దంటారు... !
 సహజీవనం ముద్దంటారు...!!
 స్వేచ్ఛాజీవనం కావాలంటారు...
 కొత్తదనంలోనే ఆనందమంటారు...
 రోజులు గడుస్తాయి....
 మోజులు తీరతాయి...
 'మైనస్ ' లు  బయటపడి...
'ప్లస్ '  లు మరుగునబడి... 
కలహాలు మొదలై... కష్టాలపాలై... 
కలల సౌధం కూలిపోయి...
విషాదం మూటగట్టుకుని...విడిపోయి... 
వీధినిబడుతున్న ఆధునిక యువత...!
ప్రశ్నార్ధకమవుతున్న బంగరు భవిత !
కన్ను మిన్ను గానక చరించిన ఫలితమిది  !!
గతి తప్పిన దారుల వెంట ...
గమ్యం లేని బ్రతుకులివి .... ! 
సజావుగా సాగాలంటే జీవితాలు... 
ఉండాలిగా మరి నీతినియమాలు.... !!
కట్టుబాట్లతో కూడిన ఆ పెట్టని గోడలు.. 
నిరంతరం హెచ్చరించే లక్ష్మణరేఖలు !!
నిత్యం ఆదుకునే రక్షణకవచాలు...!!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦



Wednesday, February 11, 2026

నడయాడే వెన్నెలకెరటం...

 *****************************************
తెలతెలవారుతోంది..తలుపు తీసింది...
సూర్యోదయం పలకరించింది చిరునవ్వుతో..
ముంగిలి ఊడ్చింది...కల్లాపి జల్లింది..
భూమాత పరవశించింది..
ముత్యాలముగ్గు పెట్టింది..
మహలక్ష్మి గడపలో అడుగు పెట్టింది...
దేవుని ముందు దీపం వెలిగించింది.. 
గంటలు మ్రోగాయి...పనులు మొదలయ్యాయి..
గోడ మీద గడియారం ముల్లు సాగుతూ ఉంది..
తోడుగా పరుగులు తీస్తూ ఆమె !! 
అందర్నీ సిద్ధపరిచి సాగనంపింది..ఎవరామె ?
ఆ ఇంటి ఇల్లాలు..అలా అలా..
ఉదయం..మధ్యాహ్నం..సాయంత్రం..
దాటిపోయాయి..పనులకు కొదవలేదు ..
తీరిక..!క్షణం లేదు..! రాత్రీ గడిచింది..
తెల్లారింది..మళ్లీ మొదలు ! 
ఇది గృహిణి దినచర్య !!
" ఏం చేస్తావు నువ్వు? " అనడిగితే.. 
ఏమీ చేయనంటుంది...ఎదురు ప్రశ్నించదు..
"గడప దాటి పని చేస్తేనే ఉద్యోగమా?"అనదు...
ఆ తలపే రాదు మరి !!
సంపాదన నోచుకోని..పదవీ విరమణ ఎరుగని 
జీవితకాల 'ఉద్యోగం!'…వెల కట్టలేము...
ధర చెల్లించలేము...అది అమూల్యం!!  
అలసట దరిజేరినా..చిరునవ్వుతో తరిమేస్తుంది..
విసుగొచ్చినా ఓపిక కొని తెచ్చుకుంటుంది ! 
స్వార్థ చింతన..స్వీయ రక్షణ...
తలవని తరుణి...! తనకు మారుగా దైవం
ఇలకు పంపిన దైవ స్వరూపిణి !!
గృహాన్ని స్వర్గసీమగా మార్చి...
అలవోకగా నడిపే మంత్రిణి !!
ప్రతి ఇంటా తిరుగాడే ఆ ఇంటి దీపం...
అనునిత్యం నడయాడే వెన్నెల కెరటం !!
*********************************              
         ఆగస్ట్ 2025' విహంగ' మహిళా 
              మాసపత్రికలో  ' తెలతెలవారుతోంది'
                పేరుతో ప్రచురితం            
*********************************






   

Sunday, February 8, 2026

కళ్ళతో మాత్రమే ఆస్వాదించే దృశ్య మాలికలివి...





ఎన్నెన్నో వర్ణాలు..
చూడాలంటే చాలవు 
రెండు నయనాలు 
చిత్రకారుని కుంచెకు 
చిక్కని చిత్రాలు
చిత్రంగా అమరి 
కొలువుదీరిన పుష్పరాజాలు  
ప్రకృతి ప్రసాదితవరాలు..
ప్రకృతికే వన్నెలొసగే 
వన్నె వన్నెల పూబాలలు..
తోటలో విరబూశాయా..
ఆ తోటకే తలమానికాలు..
ఇంటి ముంగిట విరిశాయా..
ఇల్లాలి మది నిండా సంబరాలు..
చిరుగాలికి అల్లనల్లన కదిలే 
ఆ కొమ్మలు పంచే ఆహ్లాదాలు..
పరిమళ సుగంధాలు గుప్పిస్తూ..
అవి అందించే సుస్వరాలు..
తేనియలు గ్రోలుతూ..
రంగురంగుల తుమ్మెదలు..
కనుల విందుగా పచ్చపచ్చగా
కదిలే క్రోటన్ అందాలు..
కళ్లతో మాత్రమే ఆస్వాదించే 
దృశ్యమాలికలివి..
ఎన్ని కాసుల రాశులు 
పోసినా కొనలేనివి...




 

Thursday, February 5, 2026

పాఠశాల గేయం....

సాగాలీ సాగాలీ నిరంతరం...
చేరాలీ చేరాలీ మన గమ్యం...


నవ్వుల పువ్వుల రవ్వల 
నడుమ మనం మనం 
ఆడుతు పాడుతు 
జీవించాలి క్షణం క్షణం 
సాగాలీ సాగాలీ నిరంతరం 
చేరాలీ చేరాలీ మన గమ్యం          //నవ్వుల//

మా బడియే మా ప్రియమైన మా ఇల్లు 
మమతకు మారు రూపాలు 
చదువులు చెప్పే గురువులు 
శుభోదయం నేడే పట్టండీ కుసుమాలు 
వేడుకమీర చెప్పండీ జేజేలు 
ఆ గుడిలాంటి ఈ బడిలో 
వెలసిన ఈ దేవుల నడుమ 
కలిసి మెలిసీ కన్నులవిందుగ      //నవ్వుల//

నిచ్చెనలోని మొదటి మెట్టు నువు ఎక్కకనే 
చేరగలేవు ఆఖరిమెట్టు ఎన్నటికీ 
ఆ మొదటి మెట్టు నీ ఉపాధ్యాయుడు మరవద్దూ
జీవనపథమున పైన నిలిచిన ఆ పొద్దూ 
ఆ గుడి లాంటి ఈ బడిలో 
వెలసిన ఈ దేవుల నడుమ 
కలిసి మెలిసి కన్నులవిందుగ     //నవ్వుల//

Monday, February 2, 2026

నది... కథ

 *****************************************


☀️నిండుగా ప్రవహించే నది తనలోని సుడిగుండాల్ని, ఆటుపోట్లని  తనలోనే దాచుకొని ఎంతో గంభీరంగా, మరెంతో  ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. యమున కూడా ఈరోజు దాకా అందరి చేత ఓ నిండునది లాంటిది అనిపించుకొంది. జీవితాంతం అలాగే ఉండేదే కానీ... అనుకోకుండా ఆమెలో ఈరోజు అలజడి చెలరేగుతోంది. అందుకు కారణభూతమైన క్షణాలు ఎంత వద్దనుకున్నా ఆమెను మరీ మరీ కమ్ముకుంటున్నాయి.
    కన్నతల్లికి కన్నబిడ్డలంతా సమానమే అని అంటారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగడం తల్లి హృదయం భరించలేదంటారు. మరి ఇదెలా సంభవించింది ! 
   యమున ఇంటర్లో ఉండగానే ఆమె తండ్రి పెరాలసిస్ తో మంచం పట్టాడు. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆదాయం మరీ సన్నగిల్లింది. ఇంటికి పెద్ద కూతురు తనే. ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడు. యమున చదువు సాగడం దుర్లభమయింది. విధిలేని పరిస్థితి. కుటుంబ పోషణకై తనూ ఓచేయి వేయక తప్పలేదు. యమునకు తండ్రి కోలుకుని సంసారరధాన్ని యధా ప్రకారం మోస్తాడనీ, తన చదువు మళ్లీ కొనసాగుతుందనీ కొండంత ఆశ పెట్టుకుంది. కానీ త్వరలోనే అవి అడియాశలే అని కొద్ది కాలానికే తెలుసుకుంది. తండ్రి జబ్బు  ఆయనని మామూలు మనిషిని చేయలేదు కానీ, జీవచ్ఛవంగా మార్చి వదిలి వేసింది. 
      ఇక యమున నడుం బిగించక తప్పలేదు. తండ్రి అనారోగ్యం ఒకవైపు,ఎన్నడూ గడప దాటి  ఎరుగని తల్లి మరోవైపు..!అది చాదన్నట్లు ఇంకా బాధ్యతలు తెలియని తోబుట్టువులు...!! ఇవన్నీ యమునకు అనూహ్యంగా ఆశించని పెద్దరికాన్ని అంటగట్టాయి. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి, దగ్గరలోని కాన్వెంట్ లో టీచర్ గా చేరింది. అంతే..! ఆ క్షణం నుండే ఆమె జీవన పోరాటం మొదలైంది. క్షణం తీరిక లేకుండా ఇంటా బయటా చేసి ఏదో ఒకలాగా నాలుగు రాళ్లు సంపాదించడమే ఆమె ధ్యేయమైపోయింది. అలుపెరుగని ఆ ప్రయాణంలో తీరా కాస్త సమయం దొరికి వెనక్కి తిరిగేసరికి...ఇంకేముంది !! తను ఎక్కడ ఉందో తనకే తెలియని అయోమయ స్థితి!
      ఇంట్లో ఉండే కష్టపడి క్వాలిఫికేషన్ పెంచుకుంది. జీతం పెరిగింది. ఉద్యోగ స్థాయీ పెరిగింది. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి తన కష్టార్జితంతోనే  జరిపించింది. తమ్ముడి చదువు కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజో రేపో వాడూ ఓ ఉద్యోగి అవుతాడు. ఇక చిన్న చెల్లెలు ఒక్కతి ఉంది. దానికి కూడా త్వరలోనే ఏదో ఒక సంబంధం చూసే ప్రయత్నంలో ఉంది. అంతా స్థిరపడినట్లే.. కానీ, తనకే..ఎందుకో ఇన్నేళ్ల తర్వాత తనూ ఓ ఆడపిల్లనే అనీ,  తనకూ ఓ మనసనేది ఉందనీ గుర్తుకొస్తోంది. దానికి కారణమూ లేకపోలేదు. కొద్దికాలంగా చిన్ననాటి నుండీ తనతో సన్నిహితంగా  మెలిగే స్నేహితురాలు సంధ్య తనతో అంటున్న మాటలు...
" ఎంతకాలం ఇలా ఉంటావు యమునా.. నీ వాళ్ళ బాగోగులు చూడాలి సరే.. కానీ నీ గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత  వాళ్లకు లేదంటావా!? అప్పుడే నీకు ముప్పై దాటిపోయాయి. తమ్ముడు, చెల్లెళ్లు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇకనుంచి అయినా నీ గురించి నీవు ఆలోచించుకోరాదా..."
     ఒక్కసారి కాదు యమున కలిసిన ప్రతిసారీ ఈ ప్రసక్తి తీసుకురాకుండా ఉండలేకపోయేది సంధ్య. అప్పట్లో ఆమె మాటలు తేలిగ్గా కొట్టి పారేసేది యమున. కానీ ఈ మధ్య ఎందుకో ఏదో తెలియని దిగులు..,వెలితి ఆమెను చిన్నగా వేధించడం మొదలు పెట్టాయి. క్రమక్రమంగా ఆమె ఆలోచనలు ఆ కోణంలో సాగడం మొదలైంది.
      సరిగ్గా అప్పుడే ఆమెకు తట్టింది.. అవునూ... సంధ్యకు వచ్చిన ఆలోచనలు కన్నతల్లిగా నా తల్లికీ వచ్చి ఉండాలి కదా..! కానీ ఎందుకో అమ్మ నా పెళ్లి గురించి ప్రస్తావించడం గానీ బాధపడడం కానీ చూడలేదు తను. అయినా పైకి ఎలా చెప్పుకోవాలో తెలియక లోలోపల ఆమె నా గురించి ఎంత కుమిలిపోతూ ఉందో ఎవరికి తెలుసు!! అనుకుందామె అంతరంగం.
" ఏది ఏమైనా నేనూ స్థిరపడాలి జీవితంలో... "
 ఎంతో అంతర్మధనం తర్వాత ఓ స్థిర నిశ్చయానికి వచ్చింది యమున.
                       **           **             **
     ఆ తర్వాత కొద్ది రోజులకే సంధ్య నుండే ఆమెకో ప్రపోజల్ వచ్చింది.
" యమునా, నీ పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఈ సంబంధం గురించి చెప్తున్నానని దయచేసి నీవు అనుకోవద్దు. అతను వరుసకు నాకు కజిన్ అవుతాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు పాపలున్నారు.ఆరేళ్లు, నాలుగేళ్లు ఉంటాయి.భార్య జబ్బుతో కొద్దికాలం క్రితం చనిపోయింది. నేను చెప్పడం కాదు గానీ మనిషి చాలా మంచివాడు. సర్దుకుపోయే మనస్తత్వం. నీ గురించి చెప్పాను. నీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడమన్నాడు. అతనికి తన పిల్లలంటే ప్రాణం. మళ్లీ పెళ్లి చేసుకుంటే వారికి అన్యాయం జరుగుతుందని ఆ ఊసే లేకుండా ఉన్నాడు ఇంతకాలం. మొన్న నీ గురించి నేను చెప్పాక, సరే అన్నాడు. నీవు గనక ఒప్పుకుంటే నీ జీవితం ఓ దారిలో పడినట్లే... యమునా, ఇంక ఏమీ ఆలోచించకు... "
     యమున భుజం మీద చేతులు వేస్తూ అనునయంగా చెప్పింది సంధ్య. ఆ తర్వాత కొద్ది రోజులు ఆ సంబంధం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది యమున. మరుసటి వారం అతను రానే వచ్చాడు యమునను చూడటానికి. పెళ్లిచూపుల తతంగమేమీ లేకుండా ముందుగా అనుకున్న విధంగా ఓ పార్కులో కలిశాడు.
" మళ్లీ వివాహం చేసుకోవాలన్న ఆకాంక్ష నాకు లేదు. కానీ సంధ్య మీ గురించి మరీ మరీ చెప్పింది. మీ సహనం, ఓర్పు, త్యాగగుణం... ఇవన్నీ నాకు నచ్చాయి. నా పిల్లలకి మళ్ళీ తల్లి దొరికితే చాలని నేను కోరుకుంటున్న తరుణంలో మీరు తటస్థపడటం నా పిల్లల అదృష్టంగా భావిస్తున్నాను... "
 యమున ఏమీ మాట్లాడలేదు. పది నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు,ఆలోచించుకుని ఏ సంగతీ తెలియజేస్తే త్వరలో ముహూర్తాలు  పెట్టిస్తాను అంటూ. యమునకూ అభ్యంతరం చెప్పడానికి ఏ కారణం కనిపించలేదు. తనను వెతుక్కుంటూ సంబంధం రావడమే గొప్ప. పిల్లలుంటేనేం.. నాకూ ఓ ఇల్లంటూ ఏర్పడుతుంది అనుకుంది.
    ఇంతవరకూ జరిగిన విషయాలు ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈరోజు చెప్పాలనుకుంటూ లేచి ఇంటి దారి పట్టింది.
                        **           **           **
"  యమున పెళ్లికి ఇప్పుడు ఏం తొందర అన్నయ్య? చిన్నదాని పెళ్లయిపోతే, అబ్బాయి గురించి దిగులు ఏముంటుంది గనక!అందుకే... ఇప్పుడు యమునకు మీరు తెచ్చిన సంబంధాన్ని చిన్న దానికి చూద్దాము. ఇక యమున అంటారా... దాన్ని ఎప్పుడూ మేము కూతురుగా చూడలేదు. ఈ ఇంటి పెద్ద కొడుకు గానే భావించాము. పైగా దానికి పెళ్లీడు కూడా  దాటిపోయింది. ఎలాగూ ఉద్యోగం ఉంది కాబట్టి దాని జరుగుబాటు గురించి ఆలోచన లేదు. అలాగని దానికి పెళ్లి వద్దని అనడం లేదు. కాకపోతే ఈ చిన్న పిల్ల బాధ్యత తీరిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది..ఆతర్వాత...యమున రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది...ఏమీ అనుకోక ముందు చిన్నదాని సంగతి చూడండి అన్నయ్యా... "
     అప్పుడే గుమ్మంలో కాలు పెట్టబోతున్న యమున చెవిలో తల్లి మాటలు పడనే పడ్డాయి. ఆమెలో ఒక్క సారిగా భూమి,ఆకాశం బద్దలౌతున్న అనుభూతి!!
                    **         **             **
   సమయం రాత్రి పదకొండు దాటింది. యమునకు కంటిమీద కునుకు పట్టడం లేదు.. పదేపదే తల్లి మాటలు చెవుల్లో మార్మోగుతూ ఆమె గుండెల్ని పిండి వేస్తున్నాయి. కన్నతల్లిలో ఇంతటి స్వార్థమా! కూతురు గురించి ఇంత కఠినంగా ఆలోచించే మాతృ హృదయం కూడా ఉంటుందా! ఇంతకాలం కేవలం నన్ను  మిగతా పిల్లల అభివృద్ధికే చేయూతగా వాడుకున్నారా!! ఆమె మెదడు మొద్దు బారి పోయింది.
   ప్రస్తుతం ఆమెలో చెలరేగుతున్న అలజడికి అదే కారణం. మునుపెన్నడూ స్పందించని రీతిలో ఆమె హృదయం   తల్లడిల్లిపోసాగింది. ఆ స్థితిలో కొద్ది రోజులపాటు వేదనతో ఊగిసలాడిన ఆమెలో ఓ నిర్ణయం రూపు దిద్దుకుంది. ఆతర్వాత కాగితం, కలం తీసుకుని రాయడం మొదలెట్టింది.
డియర్ సంధ్యా,
         నా గురించి నీవు పడిన తపన రక్తం పంచుకు పుట్టిన నా తోబుట్టువుల్లో నేనెన్నడూ చూడలేదు. నా సంపాదనలో ప్రతి పైసా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ ఎన్నడూ వారి కళ్ళలో నా పట్ల కృతజ్ఞతగానీ, ప్రేమ భావంగానీ నేను ఎరుగను. మా అక్క తమ అందరికోసం ఆహుతైపోతోందన్న ఆలోచన, బాధ వారిలో ఏ కోశానా ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఇప్పుడు నన్ను పెళ్లాడాలనుకున్న  వ్యక్తి నన్ను తన పిల్లల కోసమే తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు తప్ప నన్ను నన్నుగా కాదు. అతను నాతో మాట్లాడిన కొద్ది నిమిషాలు తన పిల్లల గురించి తను ఎంతగా ఆరాటపడుతున్నాడో చెప్పాడే గానీ నా గురించి, నా జీవితం గురించీ అతనికి ఏ ధ్యాస ఉన్నట్లు నేను గుర్తించలేదు. ఇంతవరకూ నా జీవితం, జీతం నా వాళ్ళు అనుకున్నవాళ్ల కోసం  ఖర్చుచేశాను. ఇకనుంచీ అతని సంబంధీకుల కోసం చేయాలి. వద్దు సంధ్యా, నన్ను ఇలా బ్రతకనివ్వు. ఇలా మాట్లాడుతున్నందుకు అన్యధా భావించకు. నేను చాలా అలసిపోయాను. ఇక మీదటైనా నా జీవితం నా కోసమే అనుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా ఆలోచించాను సంధ్యా. నా ఆలోచనలకు సరిపడే వ్యక్తి తటస్థిస్తే తప్ప పెళ్లి గురించి ఆలోచించను. జీవితంలో పెళ్లి ఒక భాగమే. పెళ్లే జీవితం కాదు. జీవిత పరమార్ధమూ కాదు. నా వ్యక్తిత్వం నిలబడాలి. నా జీవితం కేవలం నాదే కావాలి. మరెవరికోసమో కాదు..సహనం, ఓర్పు ఉండాలి, నిజమే.. కానీ, అది హద్దుల్లో ఉంటేనే బాగుంటుందని స్వానుభవంతో తెలిసొచ్చింది.కాస్త ఆలస్యం అయిందంతే.అంతో ఇంతో స్వార్థమన్నది మనిషికి అవసరంకూడా.నదిలో ఎన్ని లొసుగులున్నా నిండుగానే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ, ఉప్పొంగితేనో !! ఈ యమున కూడా అంతే ! నా కోసం నీవు ఎంతో ఆలోచించావు. కానీ నన్ను అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో ఉన్నాను.బాధనిపిస్తే క్షమించు.నా నిర్ణయం నీవు హర్షిస్తావని ఆశిస్తూ...
                                                  స్నేహమయి 
                                                     నీ యమున 
*****************************************
       [ వనితా జ్యోతి మాసపత్రికలో ప్రచురితం ]
*****************************************





Thursday, January 29, 2026

ఆశావాదం ఆయుధంగా...

                             యం. ధరిత్రీ దేవి

ముచ్చట్ల తో మైమరిపించి 
కడగండ్లతో కన్నీటి ధారలు కురిపించి
మూడు వందల అరవై ఐదు  రోజులు 
మరో విధంగా పన్నెండు నెలలు...
పరుగుడి పరుగిడి...
సెలవు పుచ్చుకొంటున్నది 
పాతబడ్డ కొత్త సంవత్సరం..

ప్రతినెలా దేనికదే ప్రత్యేకం 
పరవశింపజేస్తూ ఒకసారి..
విషాదంలో ముంచేస్తూ మరోసారి..
జీవితమంటే పరిమళాలు వెదజల్లే 
పూల తోట మాత్రమే కాదు..
గుచ్చుకునే పదునైన ముళ్ళు 
పరచుకున్న రాళ్లబాట కూడా...
అంటూ గుణపాఠాలు నేర్పి 
తీపి చేదు అనుభవాల జ్ఞాపకాల 
దొంతరలను మదిని పేర్చి..
గతంలోకి జారుకుంటూ 
కదిలి వెళుతూ చెప్తోంది వీడ్కోలు...

అదిగో..అడుగిడుతోంది 
మరో నూతన సంవత్సరం.. 
వినూత్న రీతిని...!
తెలతెలవారుతుండగా..
మంచు తెరలను చీల్చుకుని..
మల్లెల సౌరభాలు వెదజల్లుతూ...
మన కోసమే..మనందరి కోసమే...
నడిచి నడిచి వస్తూ..అదిగో..అదిగో.!
కష్ట సుఖాలు కావడికుండలన్న నిజం 
నమ్మేద్దాం..ఆశావాదంతో అడుగులు వేస్తూ 
సాగుదాం..గతానికి వీడ్కోలు పలుకుతూ..
వర్తమానానికి చేతులు చాస్తూ..
మనసారా స్వాగతిద్దాం...

[ 'సంచిక'  11.1.26 వార పత్రికలో ప్రచురితమైన నా కవిత..]



  

Tuesday, January 27, 2026

చిన్నారులతో సాధనా టీచర్

 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                     

                 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                                       ~ యం.ధరిత్రీ దేవి                  
      ఆరోజు శనివారం. అలవాటు ప్రకారం మధ్యాహ్నం చివరి పీరియడ్ కోసం ఎదురుచూస్తున్నారు ఐదవ తరగతి పిల్లలంతా. ఈరోజు టీచర్ ఏ విషయం గురించి చెబుతుందో, ఏ కొత్త కథ చెబుతుందో అని అంతా ఆసక్తిగా ఉన్నారు. అంతలో బెల్ మోగింది. ఎదురుచూస్తున్న చివరి పీరియడ్  రానే వచ్చింది. సాధన టీచర్ క్లాస్ లోకి అడుగు పెట్టింది. అందరి మొహాల్లో సంతోషం...! నిలబడ్డారంతా.
" హాయ్, పిల్లలూ! ఈరోజు ఓ చక్కటి విషయం చెప్పబోతున్నాను... "
 అందరూ చిరునవ్వుతో టీచర్ వంక చూశారు.
"... రేపటి దినం ప్రత్యేకత తెలుసు కదా అందరికీ.."
" రిపబ్లిక్ డే టీచర్ "
 ముక్తకంఠంతో అన్నారంతా.
 " అది సరే, ఇంతకీ రిపబ్లిక్ డే అంటే ఏమిటో తెలుసా ? "
 అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 
" ఆరోజు జెండా ఎగరేస్తాం టీచర్ "
 శివ లేచి చెప్పాడు,
" ఎందుకు ఎగరేస్తామో చెప్పు  "
 టీచర్ ప్రశ్న. తల గోక్కున్నాడు వాడు.
" ఆ. మనకు స్వాతంత్ర్యం వచ్చింది  కాబట్టి.. "
 గోపీకి గుర్తొచ్చింది చెప్పాడు.
" అది స్వాతంత్ర్య దినం కదా!"
 అది కాదురా అన్నట్లు గోపీ వైపు చూశాడు శివ.
 అలా అలా మరో ఇద్దరు ఏవేవో చెప్పాక,
" అవేవీ కాదు. చెబుతాను వినండి శ్రద్ధగా... "
 సాధన పిల్లల వైపు చూస్తూ చెప్పసాగింది.         
"బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్రం పొందిన రోజును స్వాతంత్ర్యదినంగా జరుపుకుంటాము మనము. ఇక రిపబ్లిక్ డేను భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటాము. రెండింటికి వ్యత్యాసం అదే.  రిపబ్లిక్ డే ను తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు..."
" ఓ, అలాగా..!"
 అన్నట్లు తలూపుతూ చూశారంతా టీచర్ వైపు. కొనసాగించింది సాధన.
"... గణతంత్ర రాజ్యం అనేది ఒక పరిపాలనా విధానం. ఇందులో రాజ్యాధికారం ప్రజలది, వారు ఎన్నుకున్న ప్రతినిధులది. గణతంత్ర రాజ్యంలో దేశం పరిపాలకులది కాకుండా ప్రజలందరి సొత్తు.." 
"................."
"...ఈ పద్ధతిలో ఏ కుటుంబానికో లేక సమూహానికో పరిపాలన మీద అధికారాలు ఉండవు. ప్రజా ప్రతినిధులు దేశ ప్రజలచే ఎన్నుకోబడినందున భారతదేశాన్ని రిపబ్లిక్ అంటారు..." 
"................"
"... దేశ ప్రజలచే ఎన్నుకోబడడం అంటే... ఈ మధ్య ఎలక్షన్లు.. అదే ఎన్నికలు జరిగాయి కదా.. మీ ఇళ్లల్లో పెద్దవాళ్లు అంతా వెళ్లి ఓట్లు వేశారు కదా... అదన్నమాట. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడతారు....ఇప్పుడు అర్థమైందా రిపబ్లిక్ అంటే ఏమిటో.."
 అందరూ తలలూపారు.
".. ఈ వయసులో మీకు ఈ మాత్రం అర్ధమైతే చాలు. మరింత వివరంగా పై క్లాసులకు వెళ్లే కొద్దీ తెలుసుకుంటారు.సరే మరి. రేపు రిపబ్లిక్ డే కదా. మరి స్పీచ్ ఎవరు ఇస్తారు?  "
" నేను ఇస్తా టీచర్ "
" టీచర్ నేను కూడా.. " 
 ఇద్దరు ముగ్గురు చేతులెత్తారు.
" వెరీ గుడ్. పాయింట్స్ అన్నీ బాగా గుర్తు పెట్టుకోండి. సరేనా "
" అలాగే టీచర్ "
 లాంగ్ బెల్ మోగింది. అంతా లేచి నిలబడి,
" థాంక్యూ టీచర్, గుడీవినింగ్ టీచర్  "
 చెప్పేసి, బిలబిలమంటూ టీచర్ వెంటే బయటికి దారితీశారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 
                   


Sunday, January 25, 2026

ప్రయత్నం మొదలెట్టు...

<><><><><><><><><><><><><><><><><><>>
                                       యం. ధరిత్రీ దేవి 
                                       ***********
టిక్.. టిక్.. టిక్.. టిక్...!
గోడన గడియారం బ్దం...
లయబద్ధంగా...
శృతి ఏమాత్రం తప్పక...
సెకండ్లు.. నిమిషాలు..గంటలు...
దొర్లి పోతున్నాయి...విరామం ఎరుగక..! 
భ్రమణం సాగుతోంది...
కాలం కదిలిపోతోంది...!
మరోవైపు...
బిడ్డ ఎదుగుతోంది...
ప్రతీ పుట్టినరోజు జరుపుకుంటోంది...
పాపం! ఆయువు తరుగుతోంది !!
అదేమిటో !ఆ తలంపే రాదెవ్వరికీ !!
కన్ను మూసి తెరిచేలోగా 
ముసలితనం పలుకరిస్తుంది...
మరణానికి సిద్ధం కమ్మంటూ  !!
అందుకే...త్వరపడు...
జారుతున్న క్షణాల్ని ఒడిసిపట్టు...
ప్రతీక్షణం విలువ లెక్కపెట్టు...
సద్వినియోగం చేసుకునే 
ప్రయత్నం మొదలెట్టు...👍

<><><><><><><><><><><><><><><><><><>>