Monday, April 26, 2021

సినిమాల్లో నటీనటుల ఊతపదాలు.... థియేటర్లలో కురిసే హాస్యపు జల్లులు --- సరదాగా కాసేపు

       కొందరికి ఊతకర్ర నడకకు ఎలా ఊతమిస్తుందో మరికొందరికి ఊతపదాలూ అంతే. అది లేకుండా వారి సంభాషణ కొనసాగదు కూడా. మన తెలుగు సినిమాల్లో అలాంటి ఊతపదాలతో బాగా పాపులర్ అయిపోయిన నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి ఊతపదాలు ఆయా నటీనటుల గురించి సరదాగా కాసేపు ముచ్చటించుకుందాం. 😊
🙂 గుమ్మడి గారు : రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన 'పెళ్లి పుస్తకం ' లో ఈయనదో తరహా. ఏదైనా విషయం ఎవరి దగ్గరైనా ప్రస్తావించదలచుకున్నప్పుడు ఆ విషయం ఏదైనా సరే ముందుగా, 'నేనూ.... ' అంటూ సాగదీసి ప్రారంభిస్తాడు.ఆ 'నేను ' కూ చెప్పబోయే విషయానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అది ఆయన ఊత పదం అంతే. ఈ సున్నితమైన హాస్యం ఇలా కూడా హాస్యం పుట్టించొచ్చన్నమాట అనుకునేలా చేస్తుంది. అది బహుశా బాపుగారి దర్శకత్వ ప్రతిభ కావచ్చు.
😊 ఆదర్శ కుటుంబం : ఇందులో నాగభూషణం గారు ఓ కన్ఫ్యూజింగ్ పర్సనాలిటీ. తాను కన్ఫ్యూస్ అవుతూ అందర్నీ కన్ఫ్యూజ్ చేసే రకం! " తమ్ముడూ, నీవు కన్ఫ్యూజ్ అవుతూ నన్ను కన్ఫ్యూజ్ చేయకు, " అంటుంటాడు. ఆయన అమాయకపు నటన ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది.
😊 మాయాబజార్ సినిమాలో దుశ్శాసన పాత్రధారి పక్కనున్న శకునితో " మామా, మన తక్షణ కర్తవ్యం..? " అంటుంటాడు ఆవేశంగా. 
🙂 ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారి " అల్లో అల్లో అల్లో " అనే ఊతపదం ఈనాటికీ ఎవ్వరూ మరిచిపో లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే" చరిత్ర అడక్కు చెప్పింది చెయ్ " కూడా అలాంటిదే.
😊 హాస్యానికి మారుపేరుగా నిలిచిన రేలంగి గారు ఓ పాత తెలుగు సినిమాలో ' జంబలకిడిపంబ ' అనే ఊతపదం వాడుతుంటాడు. తర్వాతి రోజుల్లో ఇ. వి. వి. సత్యనారాయణ గారి దర్శకత్వంలో అదే పేరుతో వచ్చిన చిత్రం జనాల్ని హాస్యపు జల్లులో ముంచెత్తివేసింది. ఓ ఊతపదం తో సినిమా రావడం ఓ విశేషమైతే అది ఘనవిజయం సాధించడం మరో విశేషం.
😊 నా రూటే సపరేటు అంటూ మోహన్ బాబు గారు సృష్టించిన ట్రెండ్ చెప్పనలవి కాదు.
😊 ఎన్న చాట-- వినిపిస్తే చాలు నవ్వులు  విరబూస్తాయి. అలీ కనిపిస్తే చాలు చాట, ఎన్న చాట అంటే అలీ గుర్తుకొచ్చి తీరాల్సిందే. రాజేంద్రుడు గజేంద్రుడు.. సినిమా వచ్చిన కొత్తలో చిన్న పిల్లలు కూడా అలీ కనిపిస్తే చాలు' అదిగో చాటగాడు ' అనేవాళ్ళట ! అలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలోఎంతో సరదాగాఈ  విషయం ప్రస్తావించడం చూసాను.  
🙂 తొక్కలో, నీఎంకమ్మ -- ఈ పదాలు జనబాహుళ్యంలోకి ఎంతలా చొచ్చుకుపోయాయంటే -- ఆడా మగా తేడా లేకుండా అడపాదడపా ఈ పదాలు వాళ్ళ సంభాషణలో దొర్లుతున్నాయి మరి ! ఇవి బ్రహ్మానందం గారి ఊతపదాలని ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా. 
😊 ఔను, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు -- లో ' నేనొప్పుకోను... ఐతే ఓ. కే ' అంటూ మొదటి సిన్మా తోనే చక్కటి గుర్తింపు తెచ్చు కున్నాడు కొండవలస !
😊 బొబ్బిలి రాజా లో వెంకటేష్ 'అయ్యో అయ్యో అయ్యయ్యో ' అంటూ నవ్విస్తాడు. 
🙂 రేసుగుర్రం లో అల్లు అర్జున్' దేవుడా ' అని పలికే తీరు సన్నివేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కంఠం మార్చి రకరకాలుగా ఆ పదం పలికే తీరు' వారెవ్వా ' అనిపించక మానదు. ఇదే మాట' క్షణక్షణం ' లో స్వర్గీయ శ్రీ దేవి ఆమె టెన్షన్లో ఉన్నప్పుడు' దేవుడా, దేవుడా, దేవుడా' అంటూ అమాయకంగా ఉచ్ఛరించే  తీరు ఎంతో ఫన్నీ గా ఉంటూ నవ్విస్తుంది.
🙂 ఇటీవల వచ్చిన  F2 చిత్రంలో ' అంతేగా అంతేగా' అంటూ భార్య చాటు భర్తగా ప్రదీప్ చెప్పే డైలాగ్ ఎంతగా ఆ ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయిందో తెలిసిందే. సినిమా మొత్తం మీద ఆ రెండే పదాల డైలాగ్ ఉన్న ఆ నటుడు సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ఆ దెబ్బతో' అంతేగా అంతేగా' పిచ్చ పాపులర్! ఒక్కసారిగా ఈ "ముద్దమందారం" హీరో అందరి దృష్టిలో కొచ్చిపడ్డాడు. 
🙂 కామెడీ, విలనీ బహుచక్కగా చేస్తూ అప్పట్లో ఓ వెలుగు వెలిగిన సుధాకర్ ' పిచ్చకొట్టుడు ' ఎవరూ మర్చిపోయి ఉండరనుకుంటా. 
🙂 ' చంటబ్బాయ్ ' లో చిరంజీవి ఏదైనా చెప్పాలనున్నప్పుడు రెండు చేతులూపుతూ 'వెల్... ' అంటూ మొదలిడతాడు. అదాయన ఊతపదం మరి !

 ఈ ఊతపదాల విషయానికి వస్తే నటీమణులు కూడా తక్కువేం తినలేదండోయ్. 
🙂 అక్కా చెల్లెలు-- ఈ సినిమాలో షావుకారు జానకి అయ్యో రామా అంటూ సందడి చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
🙂 శుభలగ్నం ' లో ఆమని అప్పుడప్పుడూ సందర్భానికి తగ్గట్టు' ఏమిటో ' అంటూ అదోలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంటుంది. 
😊 బాబూ చిట్టీ.. అనగానే నటీమణి శ్రీలక్ష్మి గుర్తుకు రాకమానదు. బాబూ చిట్టీ.. అనగానే ఓ రకమైన sad music రావడం భలే తమాషాగా ఉంటుంది. ఈనాటికీ ఆవిడ కనిపిస్తే' బాబూ చిట్టీ ' అనకుండా ఉండలేరెవ్వరూ. 
 
🙂 ఆ తర్వాతి తరంలో వచ్చిన తారలు-- ' స్వయంకృషి'లో విజయశాంతి ' అట్టా సూడబాకయ్యా ' అంటూ అదోలా చూడ్డం -- ' స్వర్ణకమలం' లో భానుప్రియ' అర్థం చేసుకోవూ ' అంటూ కళ్ళు, తల తిప్పుతూ రకరకాలుగా పలకడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
🙂 ఇటీవల వచ్చిన' సరిలేరు నీకెవ్వరు' లో నాయిక రష్మిక " నీకర్థం అవుతోందా?.. " అనే ఊతపదం జనాల్లోకి బాగా చొచ్చుకుపోయి కొందరైతే ఏదైనా విషయం చెప్పి వెంటనే ఎదుటి వాళ్ళతో నీకర్థం అవుతోందా, అని అనడం కూడా మొదలెట్టారు మరి! అలాగే F2 లో మెహరీన్ honey is the best కూడా బాగానే ఆకట్టుకుంది. 
  ఇకపోతే  -- కొందరు నటుల డైలాగ్స్-- వాటిని ఊతపదాలు అనవచ్చో లేదో నాకు తెలియదు గానీ, జనాల్లోకి మాత్రం బాగా చొచ్చుకుని పోతుంటాయి. వాటిలో కొన్ని--
😇 రజనీకాంత్-- 'బాషా ' లో -- ఈ బాషా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లు.
*నాన్నా, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. 
పై మాటలు బయట కూడా వాడుతున్నారు కదా !
* చూడూ, ఒకవైపే చూడు రెండోవైపు చూడాలనుకోకు 
  --బాలకృష్ణ 
* అగ్గిపెట్టుందా? -- అగ్ని పర్వతం చిత్రం లో సూపర్ స్టార్ కృష్ణ. 
* చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో 
   -- చిరంజీవి 
* హ, హ.. అంటూ భుజాలు కదిలించడం 
   సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా 
  -- పవన్ కళ్యాణ్ 
ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయి. నాకు గుర్తున్నవీ, తట్టినవి మాత్రమే రాయగలిగాను.
--- ఇంతకీ, ఈ ఊతపదాలన్నవి, అవటానికి రెండు మూడు పదాలే గానీ నటీనటులు వాటిని పలికే తీరు, ఆ పదాల విరుపు, ముఖంలో హావభావాలు వారి నటనా కౌశలానికి అద్దం పడతాయి. అవే వారిని పది కాలాల పాటు అందరూ గుర్తుంచుకోవడానికి దోహదం చేస్తున్నాయి కూడా.  
--- సినిమాల్లోనే కాదండోయ్, నిత్య జీవితంలో కూడా మనకు తెలిసిన వాళ్ళు కొందరు ఊత  పదాలు వాడటం చూస్తూనే ఉంటాము. 
' ఊ.. ' అంటూ మొదలెడతారు కొందరు, 
' అది కాదూ ' అంటూ మరికొందరు, 
' అది సరే గానీ...' అంటూ ఇంకొందరు,
' నేనేమంటానంటే.. ' అంటూ, అలా అలా అన్నమాట. 😊
 గమనిస్తే, ఇలాంటివి ఇంకా ఎన్నో మన దృష్టిలోకి వస్తాయి కూడా. 
-- ఇంతకీ, ఈసినిమా కబుర్లేంటి-- అంటున్నారా? 
ఎందుకంటే -- మనం రోజు వార్తాపత్రికల్లో, టీవీల్లో రకరకాల దారుణాలు చూస్తుంటాం, చదువుతుంటాం. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, మారణకాండలు, రాజకీయాలు, రచ్చలు, కుమ్ములాటలు-- ఇవి చాలవన్నట్లు మానవ తప్పిదాలతో భయంకరంగా ప్రబలి పోయిన కాలుష్యం, వీటికి తోడు కొత్తగా వచ్చి చేరి విజృంభిస్తున్న అంతుపట్టని వైరస్ రోగాలు-- ఒకటేమిటి, వీటన్నింటితో వేడెక్కిపోతున్న మన బుర్రలకు కాస్త రిలాక్సేషన్ కోసం ఇలాంటి తేలికైన, సరదా అయిన సమాచారం అప్పుడప్పుడూ చాలా అవసరం. అందుకే ఇదంతా, కాదంటారా! ( ఇక్కడ తేలికైన అంటే అర్థం చేసుకోవడానికి మెదడు పెద్దగా శ్రమించ నవసరం లేని సమాచారం అని గ్రహించ మనవి 🙏 )

******************************************
                 🌹  భువి భావనలు 🌹
******************************************


Monday, April 12, 2021

ఉగాది

అదిగో కోయిల !
కుహూ కుహూ అంటూ 
వీనులవిందుగ బహుపసందుగ 
అమృతగానం కురిపిస్తూ... 

ఇదిగో మామిడికొమ్మ !
కాయల బరువుతో వంగినా 
దృఢంగా దర్పంగా కనిపిస్తూ... 

అల్లదిగో వేపమాను !
లేత పసుపురంగులో లేలేత పూతతో
అరవిచ్చిన పూరేకులతో అలరారుతూ....
రారమ్మంటూ నను పిలుస్తూ
' శ్రీ ప్లవ ' నామ వత్సరాన్ని 
 స్వాగతించమంటున్నాయి !
 కదిలే నా కలం హఠాత్తుగా ఆగిందో క్షణం!
 ఇలాంటి పలుకుల కవితా సుమాలు
 వెదజల్లే వెలుగుల కాలమా ఇది? 
'వికారి 'నంటూ 'శార్వరి 'నంటూ 
 వచ్చిన ఉగాదులు సార్థక నామధేయులై 
 మిగిల్చాయి కన్నీటిధారలు !
 వికారిగా సకల వికారాల విశృంఖల ప్రదర్శన!
 శార్వరిగా సమస్త జగతినీ ఆవరించిన చిమ్మ చీకటి!
 ఇక-- ఆహ్లాదకరమైన కవితా  గానానికి చోటెక్కడ? 
 అంటూ ప్రశ్నిస్తోంది నా అంతరంగం!

 అయినా--
 రాబోతున్నది 'ప్లవ ' నామ వత్సరం 
 ఈ అంధకారం నుండి వెలుగులోకి 
 దాటిస్తుందని నమ్ముదాం అందరం
 అందుకే --
 పండుగ వేళ నైరాశ్యాన్ని విడనాడుదాం 
 సంవత్సరాదిని మనసారా స్వాగతిద్దాం !!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                  * భువి భావనలు *
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 

Friday, April 2, 2021

విలువలు......?

 * ప్రస్తుత సమాజంలో విలువలన్నవి పూర్తిగా దిగజారిపోయాయి. 
* అందరూ విలువలతో కూడిన నడవడిక అలవరచుకోవాలి. 
* పాఠశాలల్లో విలువల గురించి నేర్పించాలి. 
---- ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూన్న మాటలివి. అసలు' విలువలు' అంటే ఏమిటి? 
+ మూడేళ్ల పసిపాపపై కామాంధుని అత్యాచారం !
+ ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లో చొరబడి ముగ్గురు 
   యువకుల అఘాయిత్యం ! 
+ భర్తతోపాటు బైక్ మీద పోతున్న యువతిపై దాడి.
+ ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురైన వైద్య విద్యార్థిని చికిత్స
   పొందుతూ మృతి! 
ఇవి కొన్ని మాత్రమే. ప్రతీరోజు పేపర్లలో వస్తున్న వార్తలు వందలు, వేలల్లోనే ఉంటాయి. న్యూస్ పేపర్లకెక్కనివి మరెన్నో !

    ప్రతిరోజూ వింటున్న ఈ అమానుష సంఘటనలు తలుచుకుంటూ ఉంటే గుండె జలదరిస్తుంది. అసలు నేటి సమాజంలో ఆడవాళ్లకు గౌరవ మర్యాదలు అటుంచి కనీస రక్షణ కూడా కరువై పోవడం అత్యంత బాధాకరం. యువతలో మరీ ముఖ్యంగా యువకుల్లో విలువలన్నవి గణనీయంగా పడి పోతున్నాయనడానికి ఈ దుస్సంఘటనలే నిదర్శనం.  కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ దారుణం' నిర్భయ ' చట్టం ఆవిర్భావానికి నాంది పలికింది. ఇది అందరికీ విదితమే. మానవ మృగాలు అంటారు కానీ మృగాలు సైతం అంత హీనంగా ప్రవర్తించవు. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంత అపురూపంగా పెంచుకొని ఉంటారు! ఆమె భవిష్యత్తు పై ఎన్ని ఆశలు పెట్టుకుని ఎన్నెన్ని కలలు కని ఉంటారు! అవన్నీ కొద్ది క్షణాల్లో సర్వనాశనం చేసేస్తున్న ఆ కిరాతకులకు ఎంతటి తీవ్రమైన శిక్ష విధించినా ఆ తల్లిదండ్రుల ఆవేదన తీరుతుందా? ఆ పిల్ల ఆత్మ శాంతిస్తుందా?  ఏదో ఒక అనర్ధం జరిగితే గానీ ఇలాంటి చట్టాలు పుట్టుకు రావేమో? చట్టాలు చేసారు సరే, అవి సక్రమంగా అమలవుతున్నాయా? దానివల్ల ఒరిగింది ఏమిటి భయపడుతున్నారా?   స్త్రీలపై దాడులు ఆగిపోయాయా? 
    అసలు ఆడపిల్లల జీవితాల్ని చిదిమేసే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు? యువకుల్లో విచక్షణ అన్నది దిగజారి పోవడానికి కారణాలేమిటి? ఇంట్లో పెంపకం లోపమా? అదుపాజ్ఞలు లేకపోవడమా? పెడదోవ పట్టిస్తున్న పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానమా?  సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వాడుకోలేని విపరీత పోకడలా? 
   మనం గమనిస్తూనే ఉంటాం, నేటి యువతలో కనీస సంస్కారం కూడా లేనివారు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు లేశమాత్రంగా కూడా వాళ్లలో ఉండటంలేదు. దీనికి కారణాలన్వేషిస్తే  --- ఆడ-మగ తేడాలు ఇంటి నుండే ప్రారంభం కావడం ప్రధానంగా గోచరిస్తుంది. తల్లిదండ్రులు ఒకవైపు అమ్మాయిపై  అపారమైన ప్రేమానురాగాలు కురిపిస్తూనే వెన్వెంటనే కొడుకు మీద వాళ్ల దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో మగవాడి దే పై చేయి అన్నట్లు అబ్బాయిలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వాళ్లు తప్పు చేసినా సరే సమర్థిస్తూ, చూసిచూడనట్లు ఉంటుంటారు. దీంతో మగవాడిననే అహం, గర్వం వాళ్లలో పెచ్చుమీరిపోయి ఆడది అంటే చులకన భావం నాటుకుని పోతోంది. ప్రతి ఇంటిలో ఇలాగే ఉంటుందని కాదు, ఎంతో సంస్కారంతో అక్క చెల్లెళ్ళని, బయట ఆడవారినీ గౌరవించే మగవాళ్లూ ఉంటున్నారు. కాకపోతే అలాంటి వారి శాతం నానాటికీ  దిగజారి పోతోంది. 
     స్త్రీలను గౌరవించడమన్నది ఇంటినుంచే మొదలవాలి. ఆడపిల్ల పట్ల ప్రేమానురాగాలు వాళ్లలో పెరిగేలా వాళ్ళను తీర్చిదిద్దితే కొంతలో కొంతైనా మంచి పౌరులు తయారవుతారు. ఇంట్లో తల్లినీ, తోడబుట్టిన వాళ్ళను గౌరవిస్తూ వాళ్లతో మర్యాదగా నడుచుకొనేలా పెద్దలు హెచ్చరించాలి. బయట అడుగుపెడితే ఎందరో స్త్రీలు కనిపిస్తుంటారు. వాళ్ల పట్ల గౌరవ భావం కలిగేలా యువకులు తమని తాము సంస్కరించుకోవాలి. ఇది ఇంటి నుంచే మొదలవ్వాలి. చాలా కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉండడం లేదు.   ఫలితమే ప్రస్తుత పరిస్థితి ! అమానుష చర్యలకు పాల్పడితే అవతల అమ్మాయి జీవితం తో పాటు తమ జీవితం కూడా నాశనమౌతుందన్న నగ్నసత్యం వాళ్లు గుర్తించాలి. 
    మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన లేక ప్రతి విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం పెచ్చుమీరి పోతోంది. జీవితంలో సర్దుబాటు ధోరణి పూర్తిగా మృగ్యమై పోతోంది. ఇది వివాహ వ్యవస్థపై తీవ్ర పరిణామాల్ని సృష్టిస్తూ అలజడి రేపుతోంది. ఒకప్పుడు ఏ చిన్న తప్పు చేసినా పదిమందీ ఏమనుకుంటారోనన్న సంకోచం ప్రతి వారిలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇదే విలువల   గురించి పట్టించుకోకపోవడానికి ముఖ్య కారణం. క్షణిక సుఖాలకు లోబడిపోయి వందేళ్ళ జీవితాన్ని బలిపెట్టడం ఎంత సబబో వాళ్లు ఆలోచించాలి. జీవితం అది స్త్రీదైనా, పురుషుడిదైనా ఎంత విలువైనదో వాళ్ళు గుర్తించి తీరాలి. ఈ విషయంలో ముందస్తుగా మేల్కొనాల్సిందీ, ఆలోచించాల్సిందీ తల్లిదండ్రులే. ఆపై నవ నాగరీకులమనుకుంటున్న యువత! 
 ఇంతకీ విలువలు అంటే  --- ఏమిటి? 
* నీతి, నిజాయితీ కలిగి ఉండడం
* ఎవరికీ హాని చేసే తలంపు లేకపోవడం
* కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా, సఖ్యతగా ఉండడం
* పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలు కలిగి ఉండడం
* ముఖ్యంగా స్త్రీల పట్ల మర్యాదగా నడుచుకోవడం 
* సర్దుబాటు ధోరణి కలిగి ఉండడం
* సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించడం
* దయాగుణం కలిగి ఉండడం
* ఇతరుల పట్ల న్యాయంగా ఆలోచించడం
* తమ పరువు ప్రతిష్ట లతోపాటు ఇతరుల పరువు ప్రతిష్టల గురించి ఆలోచించడం. 
---- ఈ భావనలు వ్యక్తి లో ఉంటే వాటిని పాటించగల్గినట్లయితే కచ్చితంగా ఆ వ్యక్తి విలువలు కలిగిన వ్యక్తే. పూర్వపు రోజుల్లో ఇవి ఒకరు నేర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. ఇలాగే కొనసాగితే ఎలాంటి సమాజం తయారవుతుందో మరి  !!

**************************************
             🌺భువి భావనలు 🌺
**************************************

Thursday, April 1, 2021

బ్లాగర్ మహాశయులకు వందనాలు మరియు హృదయపూర్వక అభినందనలు

గతసంవత్సరం సరిగ్గా ఇదే రోజు ( 1.4.2020 ) నా బ్లాగును మొదలెట్టాను. ఏడాది కాలం పూర్తవడం పెద్ద విశేషమేమీ కాకపోయినా ఓ విషయం ప్రస్తావించాలన్న కోరికతో రాయాలనిపించింది. నా బ్లాగ్ ప్రారంభించడానికి ముందు కొందరి బ్లాగ్స్ చూశాను. పది సంవత్సరాల నుండి కొందరు, పదిహేను సంవత్సరాల నుండి మరికొందరు తమ బ్లాగులు నిర్వహిస్తుండడం గమనించి అచ్చెరువొందాను. అంతటి ఓర్పు, నేర్పు, ప్రతిభ గల్గిన వారిని తలచుకుంటూ నేను కనీసం ఓ సంవత్సరం పాటైనా రాయగలనా అనుకునేదాన్ని. నిజంగా వారి దృఢ సంకల్పానికి నా హృదయపూర్వక అభినందనలు. నా విషయానికి వస్తే కొద్ది రోజుల పాటు బ్లాగ్ లో పోస్టులు పెట్టాక ' రాయడం అవసరమా' అని సందిగ్ధం లో పడిపోయాను. ఆ సమయంలో కొందరు విజ్ఞుల చక్కటి వ్యాఖ్యలు నను ప్రోత్సాహపరిచి కొనసాగించేలా చేశాయి. వారందరికీ నా కృతజ్ఞతలు.🙏
    మదిలో మెదిలే భావాలకు అక్షర రూపం ఇస్తూ నలుగురితో పంచుకోవడానికి చక్కని వేదికగా నిలుస్తున్న ఈ బ్లాగ్ లోకానికి నమస్సుమాంజలులు.🙏

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
              * భువి భావనలు *
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺