Monday, May 31, 2021

ముందుచూపు..... 'చిన్నారి ' కథ

       సీతారాముడు, బలరాముడు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. బలరాముడిది సంపన్నకుటుంబం కాగా, సీతారాముడి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. ఆ పల్లెటూర్లో వానాకాలం చదువు ఏదో అయిందిలే అనిపించారిద్దరూ. వయసొచ్చాక ఇద్దరి వివాహాలు ఇంచుమించు ఒకేసారి జరిగాయి. 
    బలరాముని భార్య కలిగినింటి నుండి వచ్చింది కాబట్టి ఆడంబరంగా ఉండేది. దానికి తోడు బలరాముడి దుబారాతనం కూడా తోడైంది. తరగని ఆస్తి ఉందన్న ధీమాతో విచక్షణారహితంగా ఖర్చు పెట్టేవారు. సీతా రాముడు తండ్రి నుంచి సంక్రమించిన రెండెకరాలతో గుట్టుగా సంసారం సాగించేవాడు. ఉన్నంతలో సర్దుకోవడం అతనికి చిన్నప్పట్నుంచి అలవాటే కాబట్టిగొప్పలకు పోయేవాడు కాదు.ఖర్చులు  పోను కాస్తోకూస్తో వెనకేసుకో  గలుగుతున్నాడు కూడా. అతని భార్య కూడా అనుకూలవతి కావడం అతనికి కలిసొచ్చింది.
   చూస్తోండగానే పదేళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో వారి జీవన స్థితిగతుల్లో చాలా మార్పులే  చోటు చేసుకున్నాయి. బలరాముని తండ్రి మరణించాడు. అంతవరకూ చాప కింద నీరులా ఉన్న అతడు చేసిన అప్పులన్నీ ఆయన మరణం తర్వాత ఒక్కసారిగా బయట పడ్డాయి. అప్పులవాళ్ళు చుట్టుముట్టి అందినంతా  లాక్కుపోయారు. ఒక్కసారిగా చెరువులో నుండి బయటపడ్డ చేపలా అయిపోయింది బలరాముడి పరిస్థితి. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని మునుపటిలా జరపడం అతడి శక్తికి మించిన పని అయిపోయింది. ఎక్కడైనా పని చేద్దాం అంటే గతంలో అతని హోదా అందుకు అంగీకరించక సతమతమై పోయాడు. చివరికి గత్యంతరం లేక పక్క ఊర్లో ఓ బట్టల కొట్లో గుమస్తాగా చేరిపోయాడు.కుటుంబపోషణకై అంతకు మించి మార్గం అతనికి కనిపించలేదు. 
      ఒక రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ ఉంటే సీతా రాముడు ఎదురయ్యాడు బలరాముడికి. ఒకే  ఊర్లో ఉంటున్నా వారిద్దరూ కలుసుకోవడం అరుదే. అయినా సీతారాముడు బలరాముడి  గురించిఅన్నీ  తెలుసుకుంటూనే ఉన్నాడు. తన చిన్ననాటి నేస్తం ఈనాడిలా డీలా పడిపోవడం అతనికి బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, బలరాముడు ధనికుల ఇంట పుట్టినా గర్విష్టి కాడు.
    ఆరోజు పట్టుబట్టి బలరాముణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళాడు సీతారాముడు. అతని ఇంటిని చూసేసరికి బలరాముడికి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అది గొప్పగా ఏమీ లేదు కానీ, ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కనిపించింది. చిన్న పెంకుటిల్లు. చుట్టూ ముళ్ళ కంచె. లోపల అందమైన పూల మొక్కలు విరబూసి స్వాగతం పలుకుతున్నాయి. లోపలకి వెళ్ళగానే సీతారాముడి భార్య చల్లటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. ఆతని  పిల్లలిద్దరూ ఒకపక్క కూర్చుని బుద్దిగా చదువుకుంటున్నారు.
     వాళ్ల బలవంతం మీద ఆ పూట భోజనం కూడా అక్కడే చేశాడు. భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తుంటే అతని కళ్ళు చెమర్చాయి. వెళ్లేటప్పుడు వారి పెరట్లోని కూరగాయలు ఓ సంచిలో వేసి ఇచ్చాడు సీతా రాముడు. బయటి దాకా వచ్చిన అతనితో బలరాముడు ఇక ఉండబట్టలేక, 
" రేయ్, సీతారాముడూ, అడక్కుండా  ఉండలేకపోతున్నాను, మొదట్నుంచీ నిన్నూ, నీ ఆర్థిక స్థితి గురించీ తెలిసినవాణ్ణి కాబట్టి చనువు  తీసుకుంటున్నాను. ఇంత చక్కగా ఎలా ఉండగలుగుతున్నావురా? "
అతని కళ్ళల్లోకే చూస్తూ అడిగాడు. 
 సీతా రాముడు చిన్నగా నవ్వి, " కేవలం ముందు చూపు మాత్రమే. పైగా గొప్పలకు పోకుండా ఉన్నదానితో సర్దుకుపోయే స్వభావం నాది. ఈ రోజు ఉంది కదా అని పారబోసుకోవడం మంచిపనా చెప్పు?  కూర్చుని తింటే కొండలైన కరిగిపోవా బలరాముడూ,....... "
 స్నేహితుడు ఏ మాత్రం నొచ్చుకోకుండా నెమ్మదిగా, మరింత ఆప్యాయంగా అతని చేయి నొక్కుతూ అన్నాడు సీతారాముడు. 
   అంతే! తాను చేసిన పొరపాటేమిటో అవగతమయ్యే సరికి ఒక్కసారిగా కళ్ళముందున్న తెరలు తొలగిపోయి, కనువిప్పు కలిగినట్లయింది బలరాముడికి. 

**************************************
            🌺 భువి భావనలు 🌺
**************************************













Tuesday, May 18, 2021

అమ్మ కడుపు ఎంత చల్లన !

అమ్మ కడుపు నుండి 
అవనికి దిగి అల్లన కన్నుదెరిచి 
కెవ్వుమన్న ఆ పసిగుడ్డు 
సిరప్పులు మింగలేక 
సూదిపోట్లు తాళలేక 
భయపడి బేజారై వగచిందిలా ---

 అమ్మ కడుపు ఎంత చల్లన!
 నులివెచ్చని ఆ చిన్నిగది 
 ఇచ్చిన రక్షణ నాకెంతటి ఆలంబన !
 అదో ఊయల ! ఆ లాలన మరువగలన !
 బరువులు బాధ్యతలు 
 బంధాలు బాదరబందీలు 
 మచ్చుకైన మదిజేరలేదే అచట !
 నెలలు నిండి నెలవుదప్పి 
 ఇలకు జారి ఇక్కట్లపాలైతి గద !
 తిరిగిపోవ తరమౌన 
 మనిషినై పుడితి నకట !!
 నిజముగ --
 అమ్మ కడుపు ఎంత చల్లన !!

 *****************************
         🌺 భువి భావనలు 🌺
 *****************************

Sunday, May 16, 2021

నిదురమ్మ

                                            
                                         
      
   నిద్రను ' నిదురమ్మ ' అంటుంటాం.   ఎందుకని? అమ్మ లాలన, అమ్మ ప్రేమ, అమ్మ ఆప్యాయత అన్నీ కలబోసి మన దేహాన్ని ఆవహించి  స్వస్థత, సాంత్వన, ఉపశమనం-- ఇలా అన్నీ అందించి సేదదీరుస్తుందని అనుకుంటా . బాగా అలసి పోయి బడలికగా ఉన్నా, చిన్నచిన్న  రుగ్మతలు బాధిస్తున్నా ఓ గంట గాఢనిద్ర లోకి జారుకుంటే చాలు అవన్నీ మటుమాయమై పోతాయి. నిద్రకింతటి మహత్తుందన్నమాట !రోజుకి ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఈ శరీరానికి అవసరమని చెప్తూనే ఉంటారు మరి !అలాంటి నిద్రను నిదురమ్మ అనడం ఎంత సమంజసం !ఈ విషయం మన సినీకవులు ఏనాడో గ్రహించారు కాబోలు, అలనాటి నుండీ చిత్రసీమకు ఎన్నో అమూల్యమైన గీతాల్ని సృష్టించి వాటిని భావితరాలకు కానుకగా ఇచ్చివెళ్లారనిపిస్తుంది ఆ మధురాతిమధురమైన పాటల్ని వింటుంటే.                
 *నిదురపోరా తమ్ముడా 
 నిదురపోరా తమ్ముడా
 నిదురలోనా గతమునంతా 
 నిమిషమైనా మరిచిపోరా 
 కరుణలేని ఈ జగాన 
 కలత నిదురే మేలురా 
 నిదురపోరా తమ్ముడా 🐦
--- లతా మంగేష్కర్ గారి మధుర స్వరం నుండి జాలువారుతున్న ఆ పాట అమృతం కురిపిస్తున్న ట్లుగా ఉండదూ ! ఇంకా, పాట లోని భావం హృద్యంగా ఉండి మనసుల్ని  కదిలించి వేస్తుంది. 
" నిదురలో గతాన్ని నిమిషం పాటైనా మరిచిపో
 నీడనిచ్చే నెలవు మనకు నిదురయేరా తమ్ముడా " 
---- అందులో ఎంత నిజం దాగి ఉన్నదోకదా !
---- నిజమే, నిద్రపోతే కొన్ని ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమి దేహానికి ఎంతటి అపకారో అందరికీ తెలిసిందే. 
 పైన ఉదహరించిన' సంతానం' చిత్రంలోని పాటే కాదు, నిద్రకు సంబంధించిన మరపురాని మధుర గీతాలు ఇంకా ఉన్నాయి.. 

   చిన్న పిల్లలకు తల్లులు జోల పాడటం సినిమాల్లోనే కాదు 
నిత్యం నిజ జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పటి సినిమాల్లో ఈ జోల పాటలు అంతగా వినిపించవుగానీ,పాత సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందినవి ఉన్నాయి. అలాంటి వాటిలో పి. సుశీల గారు పాడిన పాటలు కొన్ని ---

* చిట్టీపాపా చిరునవ్వుల పాపా
  నా జాబిల్లీ నీవే బంగరుతల్లీ 
  గోముగ నీకు గోరుముద్దలే తినిపించేనమ్మా 
  ఒడినే చల్లని ఊయల చేసి లాలించేనమ్మా 
  చిట్టీపాపా చిరునవ్వుల పాపా  🐦

-- గారాల చిట్టి పాపకు గోరుముద్దలు తినిపిస్తూ ఇలా పాడితే ఏపాపైనా ఇట్టే నిద్రపోదా !

* కలలూ గనే వేళ ఇదే కన్నయ్యా 
   నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా 
   కలత మాని తీపి నిదురా పోవయ్యా 
   లాలీ.. లాలీ.. లాలీ 🐦

* అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మా 
   ఆదమరిచి హాయిగా నిదురపోమ్మా 
   ఆడుకొనీ ఆడుకొనీ అలసిపోతివా 
   అలుపు తీర బజ్జో మా అందాలబొమ్మా  🐦

-- ఇవన్నీ ఆ కోవకు చెందినవే. ఎన్నో ఏళ్ల క్రితం వచ్చినవే 
అయినా జనాల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయాయి. 
  పసిపాపల్ని నిద్రబుచ్చడానికి తల్లులు పాడే జోలపాటలు  
 పెద్దవాళ్ళకూ హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయంటే అతిశయోక్తి గాదు. ఈ సూత్రం తెలిసిన సినిమావాళ్ళు ఆ ప్రయోగాలు కూడా చాలానే చేశారు మరి !
-- అలాంటివి కొన్ని చూద్దాం.. 
* కునుకు పడితె మనసు కాస్త కుదుటపడతదీ 
  కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది  🐦

'మూగమనసులు 'లోని ఈ పాట విననివారుంటారా? ఘంటసాల గారి స్వరం లోని ఆర్ద్రత ఆపాటకు ఎంత నిండు దనాన్నిచ్చింది !భావం సంగతి సరేసరి !

* నీలాల కన్నుల్లో మెలమెల్లగా
   నిదురా రావమ్మా రావే నెమ్మదిగా రావే 
   నెలవంక చలువల్లు వెదజల్లగ 
   నిదురా రావమ్మా రావే నిండారా రావే  🐦

-- కలత చెందిన మనసుతో ఉన్న అన్నను ఓదారుస్తూ, సేదదీరేలా మృదుమధురంగా ఓ చెల్లి పాడే ఈ పాట  వెన్నెలకురిసే రాత్రి వేళ  ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందోకదా !

* నీమది చల్లగా స్వామీ నిదురపో 
   దేవుని నీడలో వేదన మరిచిపో  🐦

-- కొన్ని సందర్భాల్లో భర్త కూడా భార్యకు ఓ పసివాడులా కనిపిస్తాడేమో !  మానసిక ఆందోళనతో సతమతమౌతున్నపుడు ఇలాంటి సన్నివేశాలు సహజమేకదా అనిపిస్తుంది. ' ధనమా, దైవమా ' చిత్రంలోని ఈ పాట ఓ ఆణిముత్యం !
* సడిసేయకోగాలి సడిసేయకో 
   బడలి ఒడిలో రాజు పవళించెనే  🐦
-- అలసిన రాజు బడలికతో ఉన్నాడు, సడి సేయకు ఓ గాలి, నిదురించనీ.... అంటూ ప్రియురాలు పాడే ఈ మృదువైన గానం లీల గారు పాడినది' రాజమకుటం 'చిత్రంలోనిది.  
   ఈమధ్య వచ్చిన చిత్రాల్లో ఎంతో మెలోడియస్ గా హృదయాన్ని కదిలించేలా ఉన్న ఓ చక్కని పాట నాకెంతగానో నచ్చింది. ఓనలుగురు చిన్నపిల్లలు ఓ పసివాడికి పాడే ఈ జోలపాట ' వినయవిధేయరామ ' చిత్రంలోనిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాట ఓసారి వింటే మళ్ళీ తప్పకుండ  వినాలనిపిస్తుంది. 
* అమ్మా నాన్నా లేని పసివాళ్లు 
   అయినా అన్నీ ఉన్నోళ్లు 
   నింగీనేలా వీరి నేస్తాలు 
   కొమ్మారెమ్మా చుట్టాలు 
   ఈ ఆడీపాడే పాండవులు 
   కలతే లేనీ మహారాజులు 
   ఈ బంధం లేనీ బంధువులూ 
    కలిసుంటారంటా ఎనలేని రోజులూ 
    లాలిజో.. లాలిజో... లాలిజో  🐦
అప్పట్లో వచ్చినన్ని జోలపాటలు ఇప్పుడు రాకపోయినా అడపాదడపా ఇలా అరుదుగానైనా పలకరిస్తూ ఉంటాయి. 
    అజరామరమైన ఈ గీతాలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎవరికైనా. నిజంగా ఆయా కవుల భావుకతకు వందనాలు సమర్పించాల్సిందే. అలాగే మధురాతిమధురమైన స్వరాలు కూర్చి వాటిని గాయనీగాయకుల గళంలో పలికించిన సంగీతకర్తలకు ప్రణమిల్లాల్సిందే. 

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

                  * భువి భావనలు *
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦


   

Monday, May 10, 2021

లేతమనసు --- ' చిన్నారి ' కథ

     గుండె నిండా గుబులు నింపుకుని భారంగా అడుగులు వేస్తున్నాడు రాజు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒకటిన్నర కావస్తోంది. బడిగంట వినిపిస్తోంది. మలుపు తిరిగితే బడి కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే వాడి కంట పడ్డదో దృశ్యం. ముందు వెళ్తున్న ఓ అబ్బాయి పుస్తకాల సంచీ కన్నంలోంచి కాంపాస్ బాక్స్ జారి పడిపోయింది. రాజు వెంటనే అరిచి చెప్పబోయాడు. కానీ, అజ్ఞాత శక్తి ఏదో వారించినట్లుగా ఠక్కున వాడి నోరు మూతబడిపోయింది. ఒక్కసారి చుట్టూ చూశాడు. ఎవరూ కంట పడలేదు. వెంటనే వడి వడిగా వెళ్లి దాన్నందుకుని చటుక్కున తన సంచిలోకి జారవిడిచాడు. కొత్త కాంపాస్ బాక్స్. ఆ క్షణంలో వాడి కళ్ళలో బెదురు, ఒంటి గగుర్పాటు చెప్పకనే చెబుతున్నాయి, వాడు చేసింది తప్పని. అయినా వాడు మరేమీ ఆలోచించ దలచుకోలేదు. 
    దాదాపుపది రోజుల నుండీ కాంపాస్ బాక్స్ కొనమని వేధించే లెక్కల టీచర్, కొందామంటే మొండి చేతులు చూపించే అమ్మానాన్నలు, క్లాస్ లో మిగతా పిల్లల ముందు దీనంగా తలదించుకునేలా చేస్తున్న తన పరిస్థితీ -- ఇవన్నీ కలగాపులగంగా చేరి వాడి మెదడును మొద్దుబారేలా  చేసేశాయి. ఆ పూట ఇక స్కూలుకు పోవటం బాగుండదని గిరుక్కున వెనుతిరిగి దౌడు తీశాడు. 
    మరుసటి రోజు ఉదయం పదినిమిషాలు ముందుగానే బడికి బయలుదేరిన రాజు వడివడిగా నడుస్తున్న వాడల్లా ఏవో అరుపులు వినిపించి చటుక్కున పక్కకు తిరిగాడు. 
" వెధవా, కడుపు కట్టుకుని టీనీళ్లు కూడా మానేసి కూడబెట్టి కొనిచ్చిన బాక్స్ రా అది. నీవేమో ఒంటి మీద స్పృహ లేకుండా క్షణాల్లో పోగొట్టుకొని వస్తావా !..."
 చేతిలో ఉన్న కర్ర విరిగేలా తన సహాధ్యాయి రాముణ్ణి పట్టుకుని తంతూ వాళ్ళ నాన్న!
   రాజు ఒక క్షణం దిమ్మెరపోయాడు. మరుక్షణం గుండె చిక్కబట్టుకుని ముందుకుసాగాడు. తను నిన్న తీసినకాంపాస్ బాక్స్ రాముడి సంచీలోంచి జారి పడినదే ! పేదరికంతో మగ్గిపోతున్న తాను మరో పేదవాడి మనస్థితి అర్థం చేసుకోవడంలో ఎందుకింత పొరపాటు చేశాడు? రాముడి కుటుంబ పరిస్థితి తన కుటుంబం కంటే మెరుగైనది ఏమీ కాదు.
   కంపాస్ బాక్స్ తనకిప్పుడు అత్యవసరమే. కానీ దాని కోసం తాను చేసిన పని మాత్రం హర్షణీయం కాదు.ఖర్మగాలి ఈ సంగతి బయటపడిందంటే తనపై శాశ్వతంగా ' దొంగ' అన్న ముద్ర పడిపోతుంది. అది  తొలగిపోవడం సాధ్యమా!
  టీచర్ అనుమతి కోరి తను బాక్స్ ఈరోజు కాకుంటే రేపైనా కొనుక్కోవచ్చు. ఇలా వాడి మనస్సు పరి పరి విధాల ఆలోచించసాగింది. క్రమంగా వాడిలో అలజడి తగ్గి మనసు నావరించియున్న తెరలు  విడివడసాగాయి. 
  " దారిలో తనకు దొరికిందని చెప్పి, బడికి వెళ్ళగానే టీచర్ కి ఇచ్చేస్తాను. దాంతో రాము వస్తువు రాముకు అంది పోతుంది." ఈ ఆలోచనతో వాడి మనసు కుదుటపడింది.
  చేసిన నేరానికి శిక్షగా రాత్రంతా తాను కలత నిద్రతో బాధ పడ్డ సంగతి గుర్తొచ్చింది వాడికి. మనస్సాక్షి అన్నది ఉన్నవాడు తప్పు చేస్తే అది ఎంతటి నరకప్రాయంగా ఉంటుందో వాడికి అనుభవపూర్వకంగా ద్యోతకమయింది. రాత్రి పడ్డ సంఘర్షణతో గాయపడ్డ వాడి లేత మనసు ప్రస్తుతం మబ్బు వీడిన ఆకాశంలా నిర్మలంగా మారిపోయింది. 

( పిల్లల మాస పత్రిక' బాలమిత్ర' లో ప్రచురితం )

****************************************
               🌺భువి భావనలు 🌺
****************************************

Saturday, May 1, 2021

ఇంతకీ, వెళ్లాలా, వద్దా?

    సమయం ఉదయం ఎనిమిది దాటింది. వంటగదిలో జానకి కాఫీ, టిఫిన్ల తయారీలో బిజీగా ఉంది. ఇంతలో బయట ఎవరో వచ్చిన అలికిడై అలా తొంగి చూసింది.  భర్త దశరథ్  వచ్చిన వాళ్లను ఆహ్వానిస్తూన్నాడు. అంజలి, ఆనందరావు. కూతురి పెళ్ళిశుభలేఖ ఇవ్వడానికొచ్చారు. జానకిహాల్లోకెళ్లి నవ్వుతూ పలకరించి కాఫీ లందించింది . కాసేపు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు
  జానకి ఆలోచనలో పడిపోయింది. ఈ వారంలో ఇది మూడో ఆహ్వానం. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తోందని న్యూస్ పేపర్లు, టీవీలు ఒకటే ఊదరగొడుతున్నాయ్. ఫంక్షన్ లు వద్దు మొర్రో అంటున్నాయి. కానీ ఇటు  చూస్తే ఇలా వరుసగా ఆహ్వానాలు!
   ఎలా?  వెళ్లాలా, వద్దా? 
 ఇది ఒక్క జానకి కుటుంబం సమస్యే కాదు, ప్రస్తుతం ప్రతి ఇంటిని పట్టి వేధిస్తున్న తీవ్ర సమస్య. బయట అడుగు పెడితే చాలు-- మూతికి మాస్క్, శానిటైజర్ కంపల్సరీ. భౌతిక దూరం సరే సరి! మొదటి రెండూ మన చేతిలో పనే కాబట్టి అమలు పరుస్తాము. మరి  మూడో దాని సంగతి ఏంటి? ఓ ఫంక్షన్ కి వెళ్ళాక భౌతిక దూరం పాటించడం సాధ్యపడే పనేనా? అలాగని అన్నీ మానుకోలేరు కదా! మానుకుని ఎన్నాళ్ళని ఉండగలరు? దగ్గరి  వాళ్ళ నైనా పిలుచుకోకుండా ఫంక్షన్ చేయలేరు కదా. పిలిచాక వెళ్లకుండా కూడా ఉండడం అసలే సాధ్యంకాదు. కోవిడ్ రీత్యా అర్థం చేసుకోగలిగితే పరవాలేదు, కానీ అలా ఎందరికి అవగాహన ఉంటుంది? ఒక్కోసారి ఆరోగ్యం సరిగా ఉండదు. అయినా, వెళ్లకపోతే ఏమనుకుంటారో అనుకుని కొందరు వెళుతూ ఉంటారు. 
"వాళ్లేమనుకుంటారో అని మాత్రమే ఆలోచించకునీ ఆరోగ్యం ఏమవుతుందో అని కూడా ఆలోచించు" అంటున్నారు కొందరు. 
"హు !ఎప్పుడూ నెగెటివ్ గానే ఆలోచిస్తే ఎలా? అని మరికొందరు !"
" ఆత్మస్థైర్యం, సానుకూలదృక్పథం ముఖ్యం "అనే స్ఫూర్తి ప్రదాతలు మరోపక్క !
మరెలా? 
  కొద్ది రోజుల క్రితం ఫంక్షన్లకు యాభై మందికి మాత్రమే అనుమతి అని హుకుం జారీ చేసింది ప్రభుత్వం. అది ఆచరణలోఅమలవుతుందా? మరోవైపు వ్యాక్సిన్ల హడావుడి !  ఒకటి కాదు రెండు డోసులు తీసుకోవాలట ! అలా తీసుకుంటే కరోనా రాదా అంటే గ్యారంటీ అయితే లేదట ! కాకపోతే మరణం సంభవించదు అంటూ చివర్లో ట్విస్ట్ ! 
తల పట్టుకుంది జానకి. ఒకటి కాదు రెండు కాదు, ఒక దాని వెంట మరోటి! ఒకటే ఫంక్షన్లు !
" ఇంతకీ, వెళ్లాలా, వద్దా? "
మళ్ళీ ఆలోచనలో పడిపోయింది. 
  అసలీ విపత్కర పరిస్థితి ఏమిటిరా బాబూ ! బయట అడుగు పెట్టకుండా ఇంటికే ఎంతకాలమని పరిమితమవుతాము ! ఏనాడైనా కలలోనైనా, కథల్లో నైనా ఊహించామా ఈ విచిత్రమైన దౌర్భాగ్యస్థితి! అసలు ఎప్పటికైనా దీన్నుండి బయటపడి మళ్లీ మామూలు పరిస్థితి అన్నది వస్తుందా? స్వేచ్ఛగా అందరిలో సందడిగా తిరగ్గలమా? ఆ సమయంలో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ పద్యమొకటి తలపుకొచ్చింది ఆమెకి. 
" where the mind is without fear " 
 అందులోని కొన్ని లైన్లు తెలుగులో --
" ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో
 ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో 
 ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో 
 ఎక్కడ మనస్సు నిరంతరం వికసించే భావాలలోకీ, 
 కార్యాలలోకీ నీచే  నడపబడుతుందో 
 ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రీ ఈ దేశాన్ని నడిపించు"
--- ఎన్నో ఏళ్ళ క్రితం ఆ మహానుభావుడు, ' గీతాంజలి' సృష్టికర్త వ్రాసినదైనా అందులోని ఈ కొన్ని లైన్లు ప్రస్తుతం మనం  ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితికి అన్వయించుకోవచ్చు నేమో అనిపించిందామెకి.
  నిజంగా మునుపటిలా అలా స్వేచ్ఛగా బయట విహరించే రోజులు మళ్లీ వస్తాయా? అందులో ఉన్నట్లు ప్రస్తుతం --
జ్ఞానం కావాలని కోరడం లేదు, మనసు వికసించే భావాలతో నిండి ఉండాలనీ  కోరుకోవడం లేదు, కేవలం స్వేచ్ఛగా భయం అనేది లేకుండా మునుపటిలా తిరగాలని, ఆ స్వేచ్ఛా స్వర్గం రావాలని మాత్రమే భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. నేటి ఈ విపత్కర పరిస్థితిలో ప్రపంచంలో అందరి కోరికా ఇదే. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదే, అత్యాశ, దురాశ అంతకన్నా కానేకాదు. అయినా అది సంభవమా అన్నదే ప్రస్తుతం వేధిస్తున్న సమస్య ! 
  తల బరువెక్కిపోయి ఓవిధమైన నైరాశ్యంతో మెల్లిగా కళ్ళు తెరిచింది జానకి. ఎదురుగా టీపాయ్ మీద అంజలీ వాళ్ళిచ్చి వెళ్లిన శుభలేఖ. దానిమీద విఘ్నేశ్వరుడు ! 
" మరీ అతిగా ఆలోచించకు, మరేమీ కాదులే, అంతా సర్దుకుంటుంది... " అంటునట్టు తోచి ఒకింత ఉపశమనం పొందినట్లై, గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఒక్కసారి తల విదిల్చి, ఠక్కున లేచి నిలబడింది, అంతేలే, అంతకన్నా చేసేదేముంది అనుకుంటూ. 



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
                      * భువి భావనలు *
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺