Friday, October 31, 2025

ఆ నిశీధి వేళ...!!

 


                       ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..
                       విధివిధానము తప్పించుటకై ఎవరు సాహసించెదరూ..

   ఎన్నో ఏళ్ల నాటి పాట.. అందులోని భావం.. కాలాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ నిలిచిఉండే పచ్చి నిజం...24.10.25 తెల్లవారుజామున కర్నూలు జిల్లా, చిన్నటేకూరు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కారణాలు ఏవైతేనేమి.. బాధ్యులు ఎవరైతేనేమి.. 19 నిండు ప్రాణాలు ఊహకందని విధంగా సజీవదహనం కావడం ప్రతి వారిని దిగ్భ్రమకులోను గావించిన విషయం. ఎంతో జీవితం ముందు పరచుకుని, ఉజ్వల భవిష్యత్తుకై కలలు కంటున్న యువత ఎక్కువమంది ఈ దుర్ఘటనలో బలి కావడం హృదయవిదారకమే ..
  బాధ్యతారహితమైన జీవనశైలి, నిర్లక్ష్యపు ఆలోచనాధోరణి.. చనిపోయిన వారినేగాక  ఎందరిని ఎన్ని విధాలుగా జీవచ్ఛవాలుగా మార్చివేసిందో ఈ దుస్సంఘటన నిరూపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో... ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి! కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. క్షణాల్లో చుట్టుముట్టిన అగ్నికీలలు, ఊపిరి సలపనివ్వని  దట్టమైన పొగ కారణంగా..ఎక్కడివాళ్ళక్కడ ఒరిగిపోయి, కాలి మాంసపు ముద్దలుగా స్లీపర్ బెర్తుల మధ్య శవాలుగా మిగిలిపోయారట!! ఓ మృతదేహం బస్సు కిటికీ నుంచి సగభాగం బయటకు వచ్చిన స్థితిలో కనిపించిందట! కిందకి దూకే ప్రయత్నంలో జరిగిన విషాదమిది! ఓ కుటుంబంలో నలుగురు( భార్య,భర్త, కొడుకు, కూతురు ) మరణించడం హృదయవిదారకం. మంటల్లో చిక్కుకున్న సమయంలో తల్లి తన కుమార్తెను గుండెలకు హత్తుకుని అదే స్థితిలో కాలిపోయి కనిపించడం!!19 మంది మృతుల్లో అత్యధికులు 30 ఏళ్ల లోపు వారే అని సమాచారం...
    అతివేగం, మద్యం సేవించి బండి నడపడం, నిర్లక్ష్యధోరణి, ఏమవుతుందిలే అన్న బాధ్యతారహిత భావన, మరోవైపు.. ప్రమాదం గమనించినా స్వీయ రక్షణకై ఆలోచించడం.. అన్వేషిస్తే ఇలాంటి కారణాలు మదిలో మెదులుతాయి...విశ్లేషణలూ అలాగే ఉంటున్నాయి.  అలా జరిగి ఉంటే బాగుండేది...అలా చేసి ఉంటే బాగుండు... అనుకుంటాం గానీ... ఆ సమయంలో... ఆ క్షణాల్లో... దిక్కుతోచని ఆ దుస్థితిలో... వారి మానసిక స్థితి అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది  అన్నది గ్రహించాలి. ఏది ఏమైనా, బస్సులో ప్రయాణించిన ఏ ఒక్కరూ ఎంతమాత్రమూ ఊహించని దుర్ఘటన ఇది. అలాగే... అర్ధరాత్రి సమయాన బైక్ మీద ప్రయాణిస్తూ ప్రమాదానికి లోనైన అతను , అతని స్నేహితుడు, బస్సు డ్రైవర్ కూడా...! ఊహించని ఘటనలు జరగడమే విధి విలాసం అంటే అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు !! ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ స్పందించి 'అయ్యో' అనుకునేలా చేసిన విషాద ఉదంతమిది....
   ఎన్నో కుటుంబాల జీవితకాల వేదన..! పూడ్చలేని లోటు..! పరిహారమందుతుంది సరే..అయినవాళ్ళతో, కుటుంబసభ్యులతో,జీవితభాగస్వాములతో కన్నబిడ్డలతో పెనవేసుకున్న ఆ బంధాలు.. వాటి మాటేమిటి!? ఆ పరిహారమన్నది కుటుంబ పరిస్థితులు కొంతవరకు సర్దుకోవడానికి ఉపకరిస్తుందేమోగానీ... కనుమరుగైపోయిన ఆ మనుషులను సజీవంగా తిరిగి కళ్లెదుట నిలపడమన్నదైతే జరగదు కదా..! 
_____________________________________________________________________________________________

No comments:

Post a Comment