Saturday, November 20, 2021

చినుకులు వరదలైతే...

    చినుకు రాలందే భూమి తడవదు. భూమి తడవందే గింజ మొలవదు. పంటలు పండవు. అవి లేకపోతే జనాలకి తిండిగింజలుండవు. ఆకలి తీరే  మార్గం లేక అలమటించాల్సిందే! 
    నిజమే ! చినుకులు వర్షపు ధారలై అందర్నీ పరవశింపజేయాలి. బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలి. రైతన్నల కలల్ని పండించాలి. కానీ -- ఆ చినుకులన్నవి వరదలయితే ! భీభత్సాల్ని సృష్టిస్తే !
         ప్రస్తుతం విపరీత వర్షాలు, వరదలు సృష్టిస్తున్న అల్లకల్లోలం చూస్తుంటే ఏమిటీ  ప్రకృతి  వైపరీత్యం ! అనిపించక మానదు ఎవరికైనా. అసలే చలి కాలం. రెండు మూడు రోజులు ఎడతెగకుండా వర్షం కురిస్తేనే తట్టుకోలేని పరిస్థితి ! అలాంటిది రోజుల తరబడి ఈ కురిసే వానలతో, తుఫాన్ వాతావరణం తో కొన్ని ప్రాంతాల ప్రజలు పడుతున్న పాట్లు చూస్తుంటే చాలా  బాధనిపిస్తుంది. చూసేవాళ్ళకే  ఇలా ఉంటే అనుభవిస్తున్న వాళ్ల సంగతేమిటి ? 
      పక్కాగా కట్టుకున్న కాంక్రీటు భవనాలు కూడా  పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు, వరద నీళ్లలో ఇళ్లన్నీ జలమయమై వస్తు వాహనాలు సైతం కొట్టుకు పోతున్న దృశ్యాలు టీవీల్లో చూస్తున్నాం. గుడిసె వాసుల దైన్యం సరే సరి  ! ఊహించడమూ దుర్భరమే! అంతా కోలుకుని, మళ్లీ కూడగట్టుకొని స్థిరపడడానికి ఎంత కాలం పడుతుందో ఏమో ! 
       మరోపక్క రైతన్నల దుస్థితి! పంట చేతికి వచ్చిన తరుణం. అంతా ఆరబోసుకున్న  ధాన్యం రాశులు నీటి పాలై కొట్టుకుపోతుంటే కన్నీళ్ళ పర్యంతమై చేష్టలుడిగి చూస్తున్న తీరు బాధాకరం. పంట చేలన్నీ  నీట మునిగి కడుపు తరుక్కుపోయి విలవిలలాడుతూ దిక్కు తోచక ఆకాశం వైపు చూస్తున్నారు రైతు సోదరులు ! 
     నీరు ప్రాణాధారం అంటాం.గుక్కెడు నీటికై తహ తహ లాడి పోతుంటాం. గుప్పెడు నీరు ప్రాణాల్ని నిలబెడుతుంది కూడా.  కానీ అదే నీరు ఇలా విజృంభించి వరదలై పారితే మనిషి పరిస్థితి ఇంత  భయానకంగా, దారుణంగా, దయనీయంగాఉంటుందా!
     అందమైన జలపాతాలను, నదులను  చూసి ఆనందిస్తాం. జల జల పారే జలపాతాల్ని, ఆ హోరునీ ఎంతగానో ఆస్వాదిస్తారు జనం ! కానీ శృతి మించితే  అది ఘోషగా,కర్ణకఠోరంగా కూడా అనిపిస్తుందని ప్రస్తుత వరద బీభత్సాలు నిరూపిస్తున్నాయి.ఏది ఏమైనా బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. 

*******************************
      *తెలుగు కథలు కవితలు వ్యాసాలు *
*******************************

 



 

Thursday, November 18, 2021

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే -1-- జీవనయానం లో పరిమళించిన స్నేహకుసుమాలు

        ప్రయాణమంటే బస్ లోనో, రైల్లోనో ప్రయాణిస్తేనే ప్రయాణమా? జీవితం కూడా ఓ ప్రయాణమే కాదా?  పుట్టినప్పటినుంచీ మరణించే దాకా మనం వేసే ప్రతీ అడుగూ ప్రయాణమే అని నా అభిప్రాయం. ఈ ప్రయాణం లో ఎన్ని ఒడుదుడుకులో!ఎన్ని మలుపులో, మరెన్ని ఆనందాలో! ఇంకా ఎన్నెన్ని అద్భుతాలో చోటుచేసుకుంటూ మనిషికి ఒక్కోసారి ఆనందానుభూతినీ, మరోసారి విషాదాన్నీ చవిచూపిస్తూ ఉంటాయి. ప్రతీ మనిషి జీవితం లో ఇవి మామూలే ! అత్యంత సహజమే ! అలాంటివి... కొన్ని నా ప్రయాణంలో  -----
   ఒకటి నుండి అయిదు తరగతుల దాకా ఓ మున్సిపల్ స్కూల్లో సాగింది నా చదువు.6, 7 తరగతులు మా  స్వగ్రామంలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్లో పూర్తయినాయి. అక్కడ క్లాసులో ముగ్గురమే అమ్మాయిలం  ఉండేవాళ్లం. ఆ వయసులో ఊరికే మాట్లాడుకోవడం తప్పించి స్నేహం గురించి పెద్దగా తెలియదు మాకు. ఏడో తరగతి పూర్తయి, పక్కనే ఉన్న టౌన్ లో గర్ల్స్  హై స్కూల్ లో ఇద్దరం  మాత్రమే చేరాం. ఒక అమ్మాయి చదువు మానేసింది. అంతవరకూ ముగ్గురమే ఉన్న స్కూల్ నుండి ఒక్కసారిగా క్లాసులో క్రిక్కిరిసి ఉన్న అమ్మాయిలతో కూర్చుని పాఠాలు వినడం చాలా కొత్తగా ఉండేది. కొత్త ముఖాలు, కొత్త స్నేహాలు, కొత్త టీచర్లు! కొందరు ఇప్పటికీ బాగా గుర్తే ! టెన్త్ తర్వాత ఇంటర్లో కో ఎడ్యుకేషన్. అక్కడ మళ్లీ ముగ్గురమే అమ్మాయిలం! అదో  అనుభవం మళ్ళీ. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి జూనియర్ అమ్మాయిలు ఓ పదిమంది దాకా చేరిపోయారు. అమ్మాయిలకు వెయిటింగ్ రూమ్ లేక స్కూల్ లైబ్రరీ లో కూర్చోబెట్టేవారు. అక్కడ అంతా కలిసి ఉండడం, కొత్త స్నేహాలవడం --  అదో చిన్న  ప్రపంచం అనిపించేది.
   ఇంటర్ దాకా పెద్దగా ప్రభావితమైన స్నేహాలేవీ  లేవనే  చెప్పాలి నాకు. అంతవరకూ ఓ ఎత్తు ! డిగ్రీలో చేరాక పరిచయమైన స్నేహాలన్నీ ఒక ఎత్తు! అలాగే BEd చేసే రోజుల్లో కూడా.ఆ  నాలుగు సంవత్సరాలు హాస్టల్ లోనే ఉన్నందువల్ల రూమ్మేట్స్ తో పాటు పక్క రూమ్మేట్స్ తో  కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. 
   గుంటూరు ఉమెన్స్ కాలేజీ లో BSc చదువుతున్న రోజుల్లో సాయి కుమారి అనే స్నేహితురాలు ఉండేది. చేరిన కొద్ది రోజుల్లోనే నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. నవ్వుతూ, చక్కగా జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించడం ఆమె ప్రత్యేకత. మనకు  పరిచయాలన్నవి చాలా మంది తోనే ఉంటాయి కానీ అన్ని విషయాలు పంచుకునే స్నేహాల్ని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి స్నేహమే మా మధ్య ఉండేదా రోజుల్లో! నేను హాస్టల్ లో ఉన్నందున అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళేది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యాక కూడా ఓ సంవత్సరం పాటు మా మధ్య ఉత్తరాలు నడిచాయి. ఆ తర్వాత... ఏముంది, మామూలుగానే ఆగిపోయాయి. అలాగే---
  గుంటూరు St.Joseph college for Education లో BEd చేసే రోజులు కూడా బాగా గుర్తు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ను మరిపించేలా చూసుకునేవారు నా రూమ్మేట్స్ ! ఆ కోర్స్ చేస్తున్న రోజుల్లో రెండు సార్లు నేను మలేరియా జ్వరంతో బాధపడ్డాను. ఆ సమయంలోనా రూమ్మేట్స్-- సరస్వతి, భాగ్యలత, అనంతలక్ష్మి -- ఈ ముగ్గురూ నాకు చేసిన సపర్యలు ఎప్పటికీ మర్చిపోలేను. బత్తాయి జ్యూస్ తీసి తాగించడం, టైమ్ కు టాబ్లెట్స్ వేయించడం, సరిగ్గా తినేలా చూడ్డం... అలా.. ఇంట్లో వాళ్లు కూడా చేయలేరేమో అన్నట్లుగా చూసుకున్నారు నన్ను! 
  కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే-- ఆ స్నేహాలూ, ఆ స్నేహితులూ మళ్లీ ఇంత వరకూ కనిపించకపోవడం ! ఇప్పటిలా సెల్ ఫోన్లు అప్పుడు లేవు కదా!  చివరి పరీక్షలు రాశాక, బై చెప్పుకుని ఎవరి ఊళ్లకు వాళ్ళం వచ్చేశాం.  ఆ బంధాలు అంతటితోనే  ముగిసిపోయాయి.
    కానీ,ఆ  జ్ఞాపకాలు మాత్రం మదిలో పదిలంగా నిక్షిప్తమయే  ఉన్నాయి ఇప్పటికీ! అలా, నా విద్యాభ్యాస కాలంలో పరిమళించిన ఆ స్నేహ కుసుమాలు ఇప్పటికీ తాజాగా ఉండి, గుర్తొచ్చినప్పుడల్లా సౌరభాలను వెదజల్లుతూనే ఉన్నాయి !! 
      రైల్లో ప్రయాణించేటప్పుడు, అంత వరకూ ఎంతో పరిచయమున్నవారిలా కబుర్లాడినతోటి ప్రయాణీకులు వారి  స్టేషన్ రాగానే దిగిపోతారు. మళ్ళీ జీవితంలో వాళ్ళు కనిపించడమన్నది జరగదు. ఈ స్నేహాలూ అంతే కదా అనిపిస్తుంది. వాళ్లంతా ఎవరి జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయిపోయి బిజీగా ఉంటారు. వాళ్లలో ఎవరికైనా నాలా ఆన్ లైన్ లో బ్లాగులు చూసే అలవాటు ఉండి ఉంటే గనక నా ఈ పోస్ట్ చూసే అవకాశం ఉండొచ్చేమో ! ఇది నా భావన ! అసంభవమైనా లోలోన ఏదో ఆశ కూడా ! 😊

***********************************
        * తెలుగు కథలు కవితలు వ్యాసాలు *
***********************************






 

Sunday, November 14, 2021

ఓ విన్నపం

   నమస్తే ! నా బ్లాగు చదువుతున్నవారికి ఓ విన్నపం. నిన్నటి దాకా " తెలుగు కథలు కవితలు వ్యాసాలు " అన్న పేరుతో వస్తున్న నా బ్లాగు నేటినుండి " భువి భావనలు" గా మార్చబడినదని మనవి చేసుకుంటున్నాను. 🙏
                                                 --- యం. ధరిత్రీ దేవి 

Saturday, November 13, 2021

ఎర్ర గులాబీ

                                          🌷🌷🌷🌷🌷🌷🌷
                                             భువి భావనలు🐦
                                         🌷🌷🌷🌷🌷🌷🌷


🌹
తెలతెలవారుతూ 
తొలి కిరణాలు తాకి
ఎర్రగులాబీ విచ్చుకుంటూ 
విరబూసింది మెల్లిమెల్లిగా !
వెదజల్లుతూ సౌరభాల్ని 
ఆకర్షిస్తూ అందర్నీ 
పలకరించింది తీయగా !
అంతలో ఏదో గుర్తొచ్చి 
ఎదురుచూడసాగింది ఆశగా !
అదుగో, నిరీక్షణ ఫలించింది 🙂
అటుగా వస్తూ కనిపించిందో చిన్నారి ! 🙎
కానీ, ఆగక ముందుకు సాగింది. 
స్పందన జాడలేని ఆ మోము గని 
అచ్చెరువొంది ఆపి అడిగింది గులాబీ, 
" పాపా, నీ నవ్వుల గలగలలెక్కడ? 
 ముచ్చటైన ఆ చిలుకపలుకులు 
ఎక్కడ చిక్కుకున్నవి ? 
తళతళ మెరిసే నీ కళ్ళు 
నీళ్లతో నిండినవేమి ? 
నను చూసీ నవ్వవేమి ? 
చిట్టితల్లీ, దేనికి ఈ విచారం ? 
బాలల దినోత్సవం కదా, 
నెహ్రూ మామయ్యకు 
నను కాన్కగా ఇవ్వవా ఏమి ! " 
కదిలే కొమ్మల్ని ముందుకు సాచి 
రారమ్మంటూ గారంగా పిలిచింది. 😊
చివ్వున తలెత్తింది చిన్నారి !!🙎
" బడులే లేవు, బాలల పండగెక్కడ ? 
పంతుళ్లు రారు, పాఠాల ఊసు లేదు 
నేస్తాలు లేరు, ఆటపాటలు లేవు 
మొక్కుబడి చదువులు 
మౌనంగా రోదిస్తూ నడుస్తున్నాయి  రోజులు !
పరీక్షలు లేవు, పై తరగతులైతే ఉన్నాయి !
చదవలేము రాయలేము లెక్కలు రానేరావు 
అన్నీ తీసివేతలే మిగిలాయి !
'కరోనా 'అంట !కాలనాగై కాటేసింది !
మా చిరునవ్వుల్ని చిదిమేసి 
మా భవిష్యత్తును కాలరాసింది !
ఇంకెక్కడి బాలల పండగ !
ఎన్నడూ లేదంట, ఇలాంటి దురవస్థ !
అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది.. "
ఎర్రబడ్డ ఆ పాలబుగ్గల మీద 
జలజలా కన్నీటి ధారలు "😔
 నివ్వెరపోయి క్షణం -- మరుక్షణం 
చలించిపోయింది గులాబి !
ఆపై విరిసిన ఆ పూరేకలు 
ముడుచుకుపోయి మూగబోయాయి !!

                    ************







 

Saturday, November 6, 2021

ఆడపిల్ల.. పెళ్లికి ముందు.. ఆతర్వాత..!

                                             🌷🌷🌷🌷🌷🌷🌷
                                                భువి భావనలు🐦
                                            🌷🌷🌷🌷🌷🌷🌷               

       పాత తెలుగు సినిమాల్లో బాగా గమనిస్తే హీరోయిన్ల విషయంలో ఒక అంశం గమనించవచ్చు. అదేంటంటే... పెళ్లికి ముందు అమ్మాయి.... లంగా వోణీ, పొడుగాటి జడ, దాని చివర జడకుప్పెలు, తల్లో  ఓ బంతి పువ్వు, లేదా ఏదో ఒక పూల దండ తో చెంగు చెంగు మంటూ చెట్ల వెంటా పుట్టల వెంటా తుళ్ళుతూ, లేడి పిల్లలా  గంతులు వేస్తూ హాయిగా పాట పాడుతూ కనిపిస్తుంది.ఒకటి రెండు సీన్ల తర్వాత పెళ్లయిపోతుంది ఆ పిల్లకి.. అంతే! నెక్స్ట్ సీన్లో పెద్ద ముత్తయిదువులా నిండుగా చీర, నుదుట  కాసంత బొట్టు, చేతినిండా గాజులు, మరీ ముఖ్యంగా ఇంత  పెద్ద కొప్పు వేసుకుని పెద్ద ఆరిందాలా హుందా గా మారిపోయి కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే..... 
     ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి  తర్వాత ఎలా ఉండాలో సినిమాల్లో అప్పట్లో చూపించేవారు. అంటే పెళ్లికి ముందు పుట్టింట్లో ఎంత గారాబంగా ఉన్నా పెళ్లి తర్వాత బాధ్యతగా ఉండాలన్నది దానర్థమేమో !అప్పట్లో ఆ ట్రెండు నడిచేది ఆహార్యం విషయంలో. ఆహార్యం సరే, ఆమె జీవితం గురించిన మాటేమిటి? అసలు ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు ఉన్నట్లు పెళ్లి తర్వాత కూడా నిశ్చింతగా ఉండే అవకాశం లేదా? ఖచ్చితంగా లేదనే జవాబు వస్తుంది కాస్త ఈ ఉదాహరణలు చూస్తే  --

* రజని  డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా చేరింది. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. తన కంటూ కొన్ని అభిరుచులు, జీవితం పట్ల కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. కానీ అదృష్టమో దురదృష్టమో జాబ్ లో చేరిన కొన్ని నెలలకే పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి తర్వాతా భర్త ఉన్నచోటే ఏదైనా జాబ్ వెతుక్కోవచ్చు లే అనుకున్న ఆమె ఆశ తీరే  దారిఎంత మాత్రమూ  లేదని కొద్దిరోజుల్లోనే అర్థమైపోయింది ఆమెకి. కారణం, భార్య ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేకపోవడం!  పైగా ఆమె అభిరుచులు అన్నింటి మీద నిరసన ప్రదర్శిస్తూ ఆమె ఆశలన్నింటి మీద నీళ్లు చల్లడం! భార్య అంటే వండి వార్చే  ఓ మర మనిషి మాత్రమే అన్న సంకుచిత స్వభావి అతను కావడం! అంతే, రజని  ఆశలన్నీ ఆవిరైపోయి జీవితం నిస్సారంగా, నిస్తేజంగా మారిపోయింది. 
* పావని ది  మరోరకం! పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయవచ్చన్నారు అత్తింటివారు. బాగానే ఉంది. కానీ నెల జీతం అంతా నయా పైసల్తో  సహా తెచ్చి వాళ్ళ చేతిలో పెడితే గానీ ఊరుకునే వారు కాదు. భర్త తల్లి మాటకు తాన తందాన అనే రకం! సంపాదిస్తున్నా, పది రూపాయలు ఖర్చు పెట్టుకునే స్వాతంత్ర్యం లేని బ్రతుకై  పోయిందిపావనిది ! పెళ్లికి ముందు ఆమె కన్న కలలన్నీ.
 కల్లలై పోయి శూన్యం మిగిలిపోయింది. 
* సమీర ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెరిగిన ఆ పిల్ల అత్తగారింటికొచ్చి ఊహించని విధంగా ఆ ఇంట్లో జీతభత్యాలు లేని ఓ పని మనిషి గా మారిపోయింది. కాలు కదిపితే కంది పోతుందేమో అన్న  చందాన పెంచుకున్న బిడ్డ ఓ అనాగరిక  కుటుంబంలో పడిఅల్లాడి పోతున్నందుకు  తల్లీ దండ్రీ  నెత్తి నోరూ  బాదుకుంటూ చింతించని  క్షణం లేదు. అల్లుడు ఉద్యోగే  కానీ తల్లిదండ్రుల మాట జవదాటడు. భార్యకు అండగా ఉండాలన్న ధ్యాస ఉండకపోగా మాటలతో హింసించే  రకం! ఫలితం! సమీర మొహంలో నవ్వు అన్నది మటు మాయమైపోయింది.
      అందరి పరిస్థితీ ఇలాగే ఉందనీ  చెప్పలేం. కొందరు అదృష్టవంతులూ  ఉంటారు. ఆ కోవకు చెందిందే కమల. 
* ఇంటర్ దాకా  చదివిన కమలకు మోహన్ తో పెళ్లయింది. అతను ఓ ప్రైవేటు యాజమాన్యంలో ఓ చిరుద్యోగి. భార్య చదువులో చురుగ్గా ఉండటం గమనించిన అతను ప్రైవేట్ గా డిగ్రీ కట్టించాడు ముందుచూపుతో. అతని ప్రోత్సాహంతో చదువు కొనసాగించిన కమల నాలుగేళ్లలో బీఈడీ కూడా పూర్తి చేసి, లక్షణంగా  ఉద్యోగంలో చేరి పోయింది. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ఆమె  సంసారం హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఇదంతా కేవలం భర్త సహృదయత, ఆతని అవగాహన వల్లే సాధ్యమైందని చెప్పక్కర్లేదు కదా ! 
* స్నిగ్ధ  బాగా చదువుకుంది, కానీ నోట్లో నాలుక లేని పిల్ల. పెళ్లయి, పోయి పోయి ఓ ఉమ్మడి కుటుంబం లో పడి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అత్తగారు, ఆడపడుచు, తోడికోడలు మాటలతో హింసించడం, పనంతా ఆమె నెత్తినే వేయడం, ఉన్నవీ లేనివీ కల్పించి ఆమె పై దుష్ప్రచారం చేయడం సాగించారు. అంతా భరిస్తూ  మౌనంగా రోదిస్తున్న భార్య పరిస్థితి గమనించిన భర్త కుమార్ అదును చూసి వేరింటి కాపురం పెట్టేసి, ఆమెను ఆ ఇక్కట్ల బారినుండి తప్పించేశాడు.
--- ఇలా, కమల, స్నిగ్ధ -- ఇద్దరూ పెళ్లి తర్వాతా సంతోషంగా జీవనం గడిపే అదృష్టం దక్కించుకున్నారు. అది కేవలం వారికి లభించిన భర్తల సహకారం, అవగాహన వల్ల మాత్రమే సాధ్యమైంది మరి !
    దీన్ని బట్టి చూస్తుంటే ఆడపిల్ల అదృష్టవంతురాలా లేక దురదృష్టవంతురాలా అన్నది లభించిన భర్త మీదే ఆధారపడి ఉంటుందన్నది స్పష్టమవుతున్నది. కమల, స్నిగ్ధ లాంటి అదృష్టవంతుల శాతం బహు తక్కువ అనే చెప్పాలి. అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు కాబోయే భార్య గురించి ఏవేవో ఊహించుకోవడం సహజమే! వారు కోరుకున్న విధంగా కూడా జరగని వాళ్ళూ  ఉంటారు. కానీ అబ్బాయి లకున్న  సౌలభ్యాలు అమ్మాయిలకు పెళ్లి తర్వాత ఉండే అవకాశం  మన సమాజంలో పూర్వపు రోజుల్లో నే కాదు ఈ ఆధునిక రోజుల్లో కూడా ఎంత మాత్రం ఉండడం లేదంటే అతిశయోక్తేమీ కాదు. 
      అంతవరకూ పుట్టిపెరిగిన ఇల్లు, ఆ వాతావరణం, కన్న తల్లీ దండ్రీ, తోబుట్టువులు... ఈ అందర్నీ ఒక్కసారిగా వదిలేసి ఓ కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకి తరలివెళ్లాల్సిఉంటుంది ఆడపిల్ల ! అక్కడ ఆ వాతావరణం, ఆ మనుషులు ఈ అమ్మాయిని సాదరంగా తమలో కలుపుకోగలిగితే అదృష్టవంతురాలే. కానీ ఏమాత్రం తేడా వచ్చినా ఆ పిల్లకు సంకటమే. దానికి తోడు కట్టుకున్న భర్త అన్నవాడు కూడా అర్ధం చేసుకోలేని మనస్తత్వం గలవాడైతే అది మరీ నరక సదృశంగా ఉంటుందా కొత్త ఇంటిలో ! 
     అదే మగవాడైతే ఉన్న చోటు నుండి ఎక్కడికీ కదలాల్సిన పనే ఉండదు. అతని ఇష్టాలు, రుచులు, అభిరుచులు, ఆశయాలు,  తన కెరీర్ గురించిన  లక్ష్యాలు ఏవీ మార్చుకోవాల్సిన  అవసరం ఎంతమాత్రమూ ఉండదు. అందుకోసం ఎవరి అనుమతీ  అవసరం లేదు ఎంచక్కా తన మనుషుల మధ్య యథాతధంగా ఉండవచ్చు. కానీ భార్యగా  ఆ ఇంట  కాలు పెట్టిన ఆడది మాత్రం అన్నీ మార్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ విధంగా తన అభిరుచుల్నీ, అనుకున్న లక్ష్యాల్నీ చంపుకుని జీవచ్ఛవంలా కేవలం కుటుంబం కోసం ఓ ప్రాణంలేని యంత్రంలా  బతకాల్సి వస్తుంది. 
    పూజ కొద్దీ పురుషుడు అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయి  అంటారు. అదంతా ఏమోగానీ, ఆడపిల్ల జీవితం మాత్రం నుదుటి రాత ప్రకారం నడుస్తుంది అన్నది నిర్వివాదాంశమే అనిపిస్తుంది ఇలాంటివి  వింటుంటే.
     దృఢ  సంకల్పం, ఆత్మవిశ్వాసం, భర్తను ఆకట్టుకోగలిగిన  చాకచక్యం, సమస్యల్ని   సొంతంగా పరిష్కరించుకోగల నైపుణ్యం, వీటన్నింటితో పాటు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం -- ఇవన్నీ ఉన్న అమ్మాయిలు తమ అభిరుచుల్ని, లక్ష్యాల్ని సమాధి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటినీ అధిగమించి తమకంటూ ఓ మంచి భవిష్యత్తును సృష్టించుకో గలరు. అలా నెగ్గుకొస్తున్నవాళ్ళు కూడా ప్రస్తుత సమాజంలో ఉంటున్నారు. ఎటొచ్చీ, ఆ సామర్ధ్యాలు లేకుంటేనే సమస్య!
                             🌹🌹🌹🌹🌹

.
                           







  












Tuesday, November 2, 2021

శ్రమైక జీవనం

                                          🌷🌷🌷🌷🌷🌷🌷
                                             భువి భావనలు🐦
                                         🌷🌷🌷🌷🌷🌷🌷

         మీరెప్పుడైనా ఇల్లు కట్టించారా? లేదా! పోనీ ఎక్కడైనా కడుతున్న ఇంటిని గమనించారా? నాకైతే కొద్ది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని బాగా దగ్గరగా చూసే అవకాశం లభించింది.
" ఇల్లు కట్టి చూడు,  "పెళ్లి చేసి చూడు", అని మన పెద్ద వాళ్ళు ఎందుకన్నారో  నాకు అప్పుడు తెలిసి వచ్చింది. మొదలుపెట్టినప్పటి నుంచీ పూర్తయ్యేదాకా ఎన్ని రకాల అంశాలు అందులో చోటు చేసుకుంటాయో గదా అనిపించింది. వాటన్నింటిలో నన్ను బాగా ఆకర్షించింనదీ, ఎక్కువగా ఆసక్తి గొలిపినదీ ఏంటంటే-
    -- అక్కడ మేస్త్రీల దగ్గర పని చేసే పని వారు! మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు!తాము  ఆడవాళ్ళం, శారీరకంగా బలహీనులం అన్న ఆలోచన ఏ మాత్రం దరిజేరనీయకుండా వాళ్ళు  చేసే కష్టం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ఇంతకీ విషయం లోకి వస్తే-
    ఉదయం ఆరు ఆరున్నర కంతా పనిలోకి వస్తారు ఆడ, మగ  పనివాళ్ళు. ఆడవాళ్ళయితే వచ్చేటప్పుడు ఓ మోస్తరు చీరలో చక్కగానే వస్తారు. కేవలం ఓ  పది నిమిషాల్లో వాళ్ళ వేషధారణ మొత్తం మారిపోతుంది. చీరను ఎగదోపి దాని చుట్టూ ఓ పాత వస్త్రం చుట్టేసుకుని పైన ఓ షర్టు వేసుకుంటారు. ఆపై తలకో  గుడ్డ కట్టుకుంటారు. అసలు పది  నిమిషాల క్రితం వచ్చింది వీళ్లేనా అన్న అనుమానం వచ్చేలా ఉంటుంది వాళ్ళ ఆహార్యం ! మగవాళ్లూ దాదాపు ఇంతే. మంచి డ్రెస్ తీసేసి, పాత దుస్తులేవో వేసుకుని ఇక పనిలోకి దిగుతారు. గోడ నిర్మాణంలాంటి పనులు మగవాళ్ళు చేస్తుంటే ఆడవాళ్ళు ఇటుకలు అందించడం, ఇసుక, సిమెంటు, కంకర కలిపేసి తట్టల్లో  నింపి మోయడం లాంటి పనులు చకచకా చేసేస్తుంటారు. కొందరు ఆడవాళ్లు గడ్డపారల్తో గుంతలు తవ్వడం కూడా చేస్తుంటారు. మట్టి పనులు చేయడం వాళ్లకు కరతలామలకమేమో అనిపిస్తుంది వాళ్ల నైపుణ్యం చూస్తుంటే. వాళ్లను చూస్తూ ఇంతటి శక్తి సామర్థ్యం వీళ్ళకెలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోయాన్నేను ! 
     కులాసాగా నవ్వుకుంటూ చలాకీగా కదులుతూ ఉంటారు అలుపన్నది తెలియకుండా ఉండేందుకో ఏమో ! పని భారం ఎక్కువైనప్పుడు ఒకరిమీద ఒకరు గయ్యి గయ్యి మంటూ అరుచుకుంటూ ఉంటారు. మళ్లీ అంతలోనే సర్దుకుని మామూలయిపోతుంటారు.
     తెచ్చుకున్న భోజనాలు అందరూ గుంపుగా కూర్చుని, కబుర్లాడుకుంటూ తింటారు. కాసేపు అలా కూర్చుంటారోలేదో మళ్లీ యధాలాపంగా పనిలోకి దిగుతారు. అంతే! సాయంత్రం ఆరైనా ఆరోజు నిర్ణయింపబడిన పని పూర్తయ్యేదాకా వాళ్లకదే ధ్యాస !
    వెళ్లేటప్పుడు మళ్ళీ వాళ్ళ వేషధారణ మారిపోతుంది. చుట్టుకున్న పాత వస్త్రం, వేసుకున్న షర్టు అన్నీ  తీసేసి  ఉదయం వచ్చేటప్పుడు ఎలా వచ్చారో అలాగే తయారైపోయి, శుభ్రంగా ఇళ్లకు కదులుతారు.  రోజు అలా ముగుస్తుంది వాళ్ళకి! మరుసటిరోజు తెల్లారేసరికి మళ్లీ ప్రత్యక్షమయేవారు. ఆ విధంగా వారానికి ఐదు రోజులు శ్రమిస్తూనే ఉంటారు.
      ఈ శ్రమజీవులు కార్చే చెమట ధారలే వారికి కాసులు కురిపిస్తాయి. అవే వారి జీవనాధారాలు మరి !

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄