[ ఈనాడు దినపత్రిక.. " హాయ్ బుజ్జీ " శీర్షికన ప్రచురింపబడ్డ పజిల్..🙏]
భువి భావనలు
Monday, October 5, 2026
Friday, October 2, 2026
జాతిపిత ఒక్కడే....
🙏 ~~ యం.ధరిత్రీ దేవి ~~
🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🌹🥀🥀🌹🥀🥀
ఈ ధరణిపై ఇప్పటిదాకా
ఎందరో పుట్టారు...
సామాన్యులు...అసామాన్యులు...
కొందరు మహానుభావులయ్యారు...
కొందరు అమరజీవులయ్యారు...
మరికొందరు....
చిరస్మరణీయులయ్యారు...
మహాత్ములూ... జాతిపితలూ మాత్రం
ఎవరూ అవలేదు...
ఒక్క గాంధీజీ తప్ప...!!
🥀🌷🌹🥀🌷🥀🌷🥀🌷🥀🌹🥀🌷🌹🥀🌷🥀
Tuesday, September 29, 2026
Saturday, September 26, 2026
కృషీవలునికి ప్రణమిల్లుదాం...
పల్లవి :
నింగిని మేఘం కరిగింది
చినుకై నేలను రాలింది
ఎండిన బీడు తడిసింది
పంటకు సై అంటు పిలిచింది
పదరా పదరా రైతన్నా
పరుగున కదలర ఓరన్నా
నాగలి పట్టర నాగన్నా
నాట్లు వేద్దాం రారన్నా
పదరా పదరా పదరా //నింగిని//
చరణం 1 :
హలం భుజం పైకెత్తాడూ...
కాడెద్దులతో కదిలాడూ...
కాయకష్టం చేశాడు
కలలకు ఊపిరి పోశాడు
గింజలు పొలాన చల్లాడు
అదిగో మొలకల సందడి చూడు
ఇదిగో రైతన్న కన్నుల దివ్వెలు
ఇల్లాలి మోమున విరిసే నవ్వులు
ఇదిగో ఇదిగో ఇదిగో //నింగిని//
చరణం 2
పైరగాలుల పలకరింపులు
పచ్చదనాల సింగారాలు
అమ్మలక్కల ఆటలు పాటలు
కూలీల నడుమ అచ్చట్లు ముచ్చట్లు
సద్దిమూటల సరదాల సందళ్ళు
కోతకు వచ్చిన పసిడిపంటలు
కల్లాల నిండా ధాన్యం రాశులు,
కళకళలాడుతు పల్లెల లోగిళ్ళు
అదిగో అదిగో అదిగో //నింగిని//
చరణం 3 :
జేబుల నిండుగ కాసులు ఉన్నా
బ్యాంకుల బండెడు కోట్లు ఉన్నా
పండించే రైతన్న లేకుంటే
అంగట్లొ సరుకులు వచ్చేదెట్లా
జనాల కడుపులు నిండేదెట్లా
కావాలంటే వెచ్చాలు మనకు
రావాలి రావాలి మన రైతన్నలు
లేకుంటె తప్పవు అగచాట్లు
వినండి వినండి వినండీ //నింగిని//
చరణం 4 :
మట్టిని నమ్మిన మట్టి మనుషులు
భూమి తల్లికి ముద్దులబిడ్డలు
ఆరుగాలము శ్రమించు జీవులు
నేలతల్లిని వదలని ప్రాణులు
అన్నదాతలు వారే లేకున్న
లోకాన కరువే...కనరాదు మెతుకే
కడుపులు నింపే కృషీవలునికీ
కరములు జోడించి ప్రణమిల్లుదాము
రారండి రారండి రారండీ //నింగిని//
[ 'సంచిక ' ఆన్లైన్ మాస పత్రిక ( 6.9.26 ) లో ప్రచురితమైన నా రచన 🙏]
Wednesday, September 23, 2026
పుస్తకం... నా ప్రియ నేస్తం...
.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
~ యం. ధరిత్రీ దేవి
పుస్తకం నా ప్రియ నేస్తం...
నాకు ప్రాణప్రదం...
అలసిన వేళ సేదదీర్చే ఔషధం
ఒంటరినైన...ఊరడించే నెచ్చెలి...
తెరిస్తే చాలు...అక్షరాలు కావవి...
అనంతకోటి ఆలోచనలు
కొలువుదీరిన కూటమి...!
మేధావుల కలం నుండి జాలువారి
చెక్కుచెదరక నిలిచిన
అక్షర శిల్పాలే మరి...!!
అలరిస్తూ..మురిపిస్తూ ఒకసారి...
నవ్విస్తూ..విషాదంలో ముంచేస్తూ
మరోసారి...అంతలోనే...
ఓదారుస్తూ.. నిద్రాణమైన శక్తిని
తట్టిలేపుతూ..బద్ధకాన్ని వదిలిస్తూ...
గమ్యం చూపిస్తూ..ఆగకుమా
సాగిపొమ్మంటూ..వెన్నుతడుతూ
ముందుకు తోసే స్ఫూర్తిప్రదాతలు
ఆ అక్షర దీపాలు...!!
పుస్తకం..కాదు హస్తభూషణం...
మస్తిష్కాన్ని మధించే
మహిమాన్విత ఉపకరణం..
ఉజ్వల భవితకు సోపానాలు
వేసే ఉత్తమోత్తమ సాధనం...!
విజ్ఞాన వినోదాల భాండాగారం...
కాలక్షేపం కలగలసి..లభ్యం..
మానసికోల్లాసం...!
పుస్తకపఠనం..మెదడును
పదును పెట్టే ఇంధనం...
కావాలి దినచర్యలో అదో భాగం..
నూతనోత్తేజానికి పడుతుందపుడే బీజం!!
అందుకే...పుస్తకం నా ప్రియనేస్తం..
నాకు ప్రాణప్రదం...!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Tuesday, September 8, 2026
చందమామ రావే...చల్లగాలి తేవే...
🤱🧏🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝
చందమామ రావే/
చల్లగాలి తేవే
వెన్నెలమ్మ రావే /
వెలుగులే తేవే
చందమామ చల్లగాలి
కలిసిపోయి ఈ పూట
పాపాయికి పాడాలి
కమ్మనైన లాలిపాట
//చందమామ//
నింగిలోన నీవుంటే
చుక్కలన్ని నీ చుట్టే
మా చెంతకు నీవొస్తే
అలకబూనునేమో
చిన్నబోవునేమో
తగవులాట లేకుండా
తరలిరావ చందమామ
ఆ చుక్కల మించిన
చిన్ని చిన్ని పాపలిచట
వేచి వేచి ఉన్నారు
వేయి కళ్ళతోటి ఓ మామ..
వచ్చిపోవ ఇటువేపు
లేకుంటే గొంతు దిగదు
అమ్మ చేతి గోరుముద్ద
వేగిరమే వచ్చేయ్ వా
మా లోగిలి నడయాడగ
చక్కనైన ఓ చందమామ //చందమామ//
చక్కదనం చల్లదనం
కలబోసుకున్న
ఓ కలువలరాయడా
చీకట్లు తొలగించి
వెలుగురేఖలందించే
ఓ వెన్నెలరేడా
అందనంత ఎత్తులో
ఆకసాన ఉన్నావుగానీ
అందుబాటులోనె కద
ఉన్నావు..ఓ మామ..
అంబరాన వెన్నెలంత
మా సొంతమె అంటావే
దిగిరావా వేగిరమే నెలరేడా...
నిలబడవా నిమిషమైన
ఒక్కసారి మా ముంగిట
మా ముచ్చట తీర్చవా
చక్కనైన చందమామ //చందమామ//
🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝
['సంచిక ' ఆన్లైన్ వార పత్రిక ( 30.8.26 ) లో ప్రచురితమైన నా రచన 🙏]
Friday, August 28, 2026
అమ్మ భాష విశిష్టత...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం నేడు
తెలుగును వాడుక భాషగా ప్రోత్సహించిన ఘనుడు
తెలుగుభాషా దినోత్సవ శుభ సందర్భం ఈనాడు
ఇది కేవలం వేడుక మాత్రమే కాదు
భాషాభివృద్ధి..సంస్కృతీ పరిరక్షణల
నిరంతర కృషికై స్ఫూర్తినిచ్చు శుభదినం...
అనాదిగా ఘనచరిత గలిగిన బాష మనది...
ఆదికవిగా తెలుగు భాషకు పునాది వేసిన నన్నయ...
సంఘ సంస్కరణల భావాల వెల్లువతో
చిరస్మరణీయుడైన కందుకూరి..
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
అంటూ సామాజికస్పృహ రగిలించిన గురజాడ...
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా..
అంటూ ఎలుగెత్తి చాటిన వేములపల్లి...
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. అంటూ
గేయాల వెల్లువ కురిపించిన ఆత్రేయ...
దేశభాషలందు తెలుగు లెస్సయని
పలికిన కృష్ణదేవరాయల అభిమానధనం...
భాషావైభవాన్ని చాటి చెప్పిన బమ్మెర పోతన భాగవతం...
అంతేనా... వేమన శతకం..
సుమతీ శతకం అందించిన నీతులు..సూక్తులు
నాడూ..నేడూ ఏనాడైనా..పరిమళం కోల్పోని
సుగంధ భరిత నిత్య స్ఫూర్తి కిరణాలు...
మహామహులను స్మరించుకుంటున్న
ఈ మహత్తర క్షణాన..మాతృభాష విశిష్టత
మననం చేసుకుందాం... అమ్మ భాష గొప్పదనాన్ని
నలుచెరగులా విస్తరింపజేద్దాం... 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Subscribe to:
Posts (Atom)


