Saturday, August 26, 2023

తులసి...

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

తులసి... 
పవిత్రతకు ప్రతిరూపం... 
లక్ష్మీదేవి మరోరూపం...
ప్రాతఃకాల దర్శనం..మహద్భాగ్యం.. 
ఔషధాల గని...సర్వరోగనివారిణి... 
తులసి ఉన్న లోగిళ్ళు...
తరగని సంపదకు నెలవులు... 
ఆ ఇల్లాలి కంటినిండా వెలుగులు... 
మదినిండా సంతోషతరంగాలు...!
ఇంటి ముంగిట వెలసిన 
ఆకుపచ్చని అందం... 
పరిసరాలు కాలుష్యరహితం... 
ఇంటిల్లిపాది ఆరోగ్యం సురక్షితం... 
వేయివిధాల పూజలేల...!
చారెడు నీళ్లు చాలంటుంది... 
ఇంతులకెంతో ప్రీతిదాయకం... 
ఇలలో మరే మొక్కకూ 
లేదే...ఇంతటి ప్రాధాన్యం...!! 
తులసి కొలువున్న ఇంట 
ప్రశాంతతకు లోటే ఉండదిక....

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀


Tuesday, August 22, 2023

కళ్ళతో కాదు, మనసుతో చూడు !... కథ లాంటి ఓ నిజం !

     వివేక్ మనసు మనసులో లేదు. ఎలాగోలా ఇంటికొచ్చాడన్నమాటేగానీ మెదడంతా అల్లకల్లోలంగా ఉంది.
" ఏంటిరా వివేక్, నువ్వేమో సినిమా హీరోలా  ఉంటావ్, నీ పక్కన ఆ అమ్మాయి నిలబడితే ఎంత మాత్రం బాగా లేదు తెలుసా, అసలెలా  ఒప్పుకున్నావురా... !"
  సాయంత్రం ఆఫీసు నుండి వస్తోంటే చిన్ననాటి స్నేహితుడొకడు ఎదురుపడి, కుశల ప్రశ్నల తర్వాత పెదవి విరుస్తూ, ఏమాత్రం విచక్షణ అనేది లేకుండా అన్న ఆ మాటలు వివేక్ గుండెల్ని పదే పదే తాకుతూ నిలవ నీయకుండా చేస్తున్నాయి. అతని పెళ్లయి మూడు నెలలు దాటుతోంది. ఇలాంటి మాటలు వినడం ఇదే మొదటి సారి కాదతనికి. పెళ్లి పందిట్లోనే అంతా గుసగుసలు పోయారు కానీ, అతని చెవి దాకా సోకలేదు. అంతా అయిపోయి, రెండు మూడు వారాలు గడిచేదాకా అతను  భార్యతో బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాతే మెల్లిమెల్లిగా కొందరు బంధువులు, మరి కొందరు ఆప్తులనబడే మిత్రులూ ఉబుసుపోక ఏవో ' కామెంట్లు' ఇలాంటివే చేయడం ఆరంభించారు. 
   నిజానికి వివేక్ భార్య ప్రశాంతి మరీ అనాకారేమీ కాదు. కాస్తోకూస్తో చదువుకుంది. బాగా కలిగినింటి  అమ్మాయి. అన్ని విధాలా అతనికి చక్కని సంబంధమే. కానీ వివేక్ బలహీనత బాగా ఎరిగిన సన్నిహితులు కొందరు దాన్ని ఆలంబనగా చేసుకొని అతనిలో లేనిపోని దురాలోచనలు రేపడమే  పనిగా పెట్టుకున్నారు. కొందరి మనుషుల నైజమే అలా ఉంటుంది. ఎదుటివారు పచ్చగా ఉంటే చూడలేరు. ఎవరికైనా ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే చాలు లోలోపల చెప్పలేని ఆనందం వాళ్లకి!  అలాంటి బాపతు వాళ్ల వలలో వివేక్  లాంటి బలహీన మనస్కులు చాలాతేలికగా  చిక్కుకుంటారు. అది చూసి వాళ్ళు ఓ పైశాచిక ఆనందం పొందుతారు. వాళ్ళకదో తృప్తి. అలాంటి కుసంస్కారులు, ఓర్వలేని  లేని వాళ్ళ కుయుక్తులు పారడానికి వివేక్ఓ పావుకాగా, ప్రశాంతి అనే అమాయకురాలు అకారణంగా బలైపోతోంది. 
   రాన్రానూ భార్య మొహం చూడాలంటేనే కంపరంగా ఉంటోందతనికి. భర్త ప్రవర్తనలో మార్పు గ్రహించిన ఆమె కారణం ఏంటో తెలియక అల్లల్లాడిపోయింది. మొదట్లో ప్రేమగా మాట్లాడే అతను ఇలా ఎందుకు మారిపోయాడో ఆమెకు ఓ పట్టాన అర్థం అవ్వలేదు. క్రమంగా ఆమెను చీటికిమాటికి విసుక్కోవడం, ప్రతీ  పనిలో వంకలు వెతకడం, అందరికీ ఆమె మీద లేనిపోని ఫిర్యాదులు చేయడం మొదలైపోయాయి. ఇవన్నీ భరించడం విపరీతమైన బాధగా పరిణమించిందామెకి. ఆఖరికి ఆమెను ఎలా వదిలించుకోవాలా అన్న విపరీత పోకడ అతనిలో గుర్తించి వణికిపోయిందా నిస్సహాయురాలు ! దీనికంతా కారణం --వివేక్ లో లోపించిన వివేకం. ఫలితం ! ప్రశాంతి జీవితంలో కరువైపోయిన ప్రశాంతత !మరోవైపు ప్రశ్నార్థకంగా మారిన ఆమె భవిత !
                          * * * *
   తేజస్విని చాలా అందంగా ఉంటుంది. డిగ్రీ దాకా  చదువుకుంది. కాలేజీ రోజుల్లో కాలేజీ బ్యూటీ అన్న పేరు కూడా ఆమెకుంది. ఇటీవలే శ్రీమతి కూడా అయింది. ఓ రోజు సాయంత్రం భర్త రంగనాథ్ తో  కలిసి షాపింగ్ కెళ్ళింది. అక్కడ అనుకోకుండా కాలేజీలో తన క్లాస్మేట్ నీరజ కనిపించింది. తను కూడా అందంలో తేజస్విని కేమీ తీసిపోనట్లుగా ఉంటుంది. భర్తను  పరిచయం చేసాక, కాసేపు అక్కడే కాఫీ తాగుతూ కబుర్లాడుకుని, ఫోన్ నెంబర్ లు  తీసుకుని, సెలవు పుచ్చుకున్నారు.
   వారం తర్వాత నీరజ తేజస్విని వాళ్ళ ఇంటికి వచ్చింది, తన ఆహ్వానంపై. కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక, నీరజ కాస్త తటపటాయిస్తూనే తన సందేహం బయటపెట్టింది.
 " తేజూ, నిజంగా ఇష్టపడే రంగనాథ్ గారిని  చేసుకున్నావా?"
 అలాంటి ప్రశ్నేదో ముందే ఊహించిందేమో, తేజస్విని చిన్నగా నవ్వేసి, నీరజ కేసి చూస్తూ, 
" ఏ, ఎందుకలా అడిగావు?.." అంది.
" అహ, ఏమీ లేదు, ఈ  కాలేజీ బ్యూటీ అతనికి నచ్చడం లో వింతేమీ లేదు, కానీ...."
" నాకెలా నచ్చాడని ! .. అంతే కదా!.." అందుకుంది తేజస్విని.
"............... "
" చూడు నీరజా, ఆయన నాకంటే ఎక్కువగా చదువుకున్నాడు. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, నాకంటే ఎంతో చక్కగా మాట్లాడుతూ, అందరితో కలిసి పోతాడు. మరీ ముఖ్యంగా ఏ మాత్రం గర్వమన్నది  లేదు. అందర్నీ గౌరవిస్తాడు. ఎవరినీ నొప్పించడు. మరి నేను... అతనికంటే అందంగా ఉంటానన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తప్ప నాలో ఏముంది చెప్పు!.."
".............. "
" నిజమే, అతను పొట్టిగా, లావుగా, రంగు తక్కువగా నా పక్కన సరి జోడీగా ఉండని  మాట వాస్తవమే. కానీ అదంతా పైకి కనిపించేది మాత్రమే.  పెళ్ళికి ముందు ఆయన నాతో ఓ అరగంట మాట్లాడాడు.నా జీవితం ఇతనితో ఆనందంగా గడిచిపోతుందన్న ప్రగాఢ నమ్మకం ఆ కాస్త సమయంలోనే నాకు కలిగింది... ఎవరేమనుకుంటే నాకేంటి ! మేమిద్దరం సంతోషంగా ఉండడమే మాక్కావాల్సింది...."
".................................."
" నీరజా, ఒకటి చెబుతాను, అందాన్ని ఎప్పుడూ కళ్ళతో కాదు మనసుతో చూడాలి.... ఈవిషయం ఆయనతో పరిచయమై, పెళ్లి జరిగాక నాకు బాగా అర్థమయింది తెలుసా ! .. "
ప్రసన్నంగా చూస్తూ చెప్పింది తేజస్విని. ఆమాటలతో కొద్ది క్షణాలపాటు ఏదో మాయ ఆవహించినట్లయింది నీరజకు.
క్షణకాలం కళ్ళు మూసుకుంది. వెంటనే ఆమెను కొన్ని నెలలుగా విపరీతంగా వేధిస్తున్న సమస్య మంచుతెరలా మెల్లిమెల్లిగా కరగడం మొదలైంది. 
    ఆర్నెల్ల క్రితం  పెళ్లయిన ఆమెకు భర్త మాధవరావు ఎంత మాత్రమూ నచ్చడం లేదు. అయిష్టంగా అందరి బలవంతం మీద చేసుకుంది గానీ అతనితో సవ్యంగా ఉండలేక పోతోంది. కారణం అతను తన అందానికి ఏ మాత్రం సరిపోడన్న ఆమె దురభిప్రాయం. అతనెంత  అనునయంగా సర్దుకుపోదామన్నా ఆమె మనసందుకు ఎంత మాత్రం సహకరించక నిత్యం తను బాధపడుతూ అతన్నీ బాధపెడుతూ వస్తోంది. ఇప్పుడు తేజస్విని దంపతుల్ని చూస్తే ఆమెను కప్పుకున్న కంటిపొరలు మెల్లిగా విడివడి మనసంతా నిర్మలంగా మారడం మొదలైంది. కొందరి మాటల్లో నిజంగా ఎంతటి మహత్తు ఉంటుందో ఆమెకు అవగతమైంది. నిజానికి తన భర్త రంగనాథ్ గారి కంటే బాగుంటాడు. కానీ తనకూ  తేజస్వినికీ ఎంత తేడా! నిజమే ! తేజస్విని అన్నట్లు ఎదుటి వారి అందాన్ని -- ముఖ్యంగా భాగస్వామి అందాన్ని కళ్ళతో కాదు, మనసు తోనే చూడాలి. అప్పుడే వారిలో ఉన్న అసలైన అందం ప్రస్ఫుటమవుతుంది, అనుకుంటూ మనసులోనే తేజస్వినికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ లేచింది నీరజ. ఆ క్షణంలో ఆమెలో ఎప్పుడెప్పుడు వెళ్లి తన భర్త మాధవ రావుని కలుద్దామా అన్న ఆతృత కనిపించింది.
                       *   *    *     *
   నీరజ విచక్షణతో ఆలోచించగలిగింది. సర్దుబాటు ధోరణితో సంసారం సరిదిద్దుకోవాలనుకుంది. మరి, వివేక్ !ఇంగితమన్నది  ఏ మాత్రం లేక చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిచ్చి  సంతోషం కోల్పోయి కొట్టుమిట్టాడుతూ తనతో పాటు మరో ప్రాణికీ  మనసుకు శాంతి అన్నది లేకుండా చేస్తున్నాడు.
 తన భార్యను గానీ, భర్తను గానీ ఎవరైనా అభ్యంతరకరంగా 'కామెంట్' చేస్తే తేజస్వినిలా మాట్లాడగలిగే నేర్పు ఉండాలి. 

" నా భార్య అందంగా లేకపోతే నీకేమిటి  సమస్య? నీ సమస్యలు నీకు బోలెడుంటాయి, వాటి సంగతి చూసుకో చాలు,.. " 
 అని వెంటనే అలా అన్న వారి  నోరు మూయించ గలిగే మానసిక పరిపక్వత వివేక్  లాంటి వాళ్లలో ఉండాలి. అంతే, మళ్లీ మరోసారి అలాంటి వ్యాఖ్యానాలు చేయడానికి ఎవ్వరూ  సాహసించరు. 

******************************************
                  🌺 భువి భావనలు  🌺
******************************************














Saturday, August 19, 2023

పసివాళ్లు పెరిగి పెద్దయ్యాక పశువులుగా ప్రవర్తిస్తున్నారా !

 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

" గురుబ్రహ్మ  గురువిష్ణు 
   గురుదేవో మహేశ్వరః 
   గురుసాక్షాత్ పరబ్రహ్మ 
   తస్మైశ్రీ గురవేనమః  "

--- చదువు చెప్పే గురువులను సాక్షాత్తూ దైవ స్వరూపులుగా భావించాలనీ, అంతటి అత్యున్నత స్థానాన్ని వారికి ఇవ్వాలనీ ఆది నుండీ చెప్పబడుతోంది. 
   మాతృదేవోభవ..
   పితృదేవోభవ.. 
   ఆచార్యదేవోభవ.. 
అంటారు...కానీ.. ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులు  అలానీరాజనాలందుకుంటున్నారా !!?  
   మూడు రోజుల క్రితం ఓ దినపత్రికలో ఓ వార్త చదివాక మనసంతా కలచివేసినట్లయింది. కేరళలోని ఓ  కళాశాలలో ఓ అంధ  అధ్యాపకునికి అతని తరగతిలోని విద్యార్థుల వల్ల జరిగిన అవమానమది ! అదే కళాశాలలో చదువుకున్న ఆయన చూపు లేకున్నా... ఎంతో శ్రమించి అదే కళాశాలలో అధ్యాపక స్థాయికి ఎదిగినాడు. ఎంతటి జ్ఞాన సంపన్నుడై ఉంటాడో ఊహించుకోవచ్చు ! కానీ అతని క్లాస్ లోని విద్యార్థులకు మాత్రం అతని మేధస్సు కనిపించలేదు. ఆయన పాఠం చెబుతుంటే.. చుట్టూ చేరి, అవహేళన చేస్తూ, దృష్టిలోపాన్ని ప్రస్తావిస్తూ ఆట పట్టిస్తూ అవమానించారట !! అది చాలక... అదేదో ఘనకార్యం చేశాం చూడండీ అన్నట్లు వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారట!! వింటుంటేనే... జుగుప్స కలిగే అతి హేయమైన చర్య కాదా ఇది ! ఆ విద్యార్థులను తరువాత...కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసిందట...అది వేరే విషయం.. 
   గంటసేపు బోధనకై నేను రెండు గంటల పాటు ప్రిపేర్ అయి, క్లాసుకి వెళ్తే జరిగింది ఇది... అని వాపోయాడట ఆ అధ్యాపకుడు ! ఇంకా... ఆ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో కళాశాల పరిధిలోనే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడట !!
    ఇది అధ్యాపకుని ఔదార్యం కావచ్చు ! కానీ.... చెప్పాలంటే.. ఆ వికృత చేష్టల వల్ల ఆయనకి పోయిందేమీ లేదు.. ఆ సంస్కారహీనులు వారి అజ్ఞానం, అవివేకం, అనైతికత... బాహాటంగా చాటుకోవడం తప్ప! అయినా వారేమీ పసిపిల్లలు కాదే! కళాశాల స్థాయి యువకులే !!   
        చాలా సంవత్సరాల క్రితం కొన్ని సినిమాల్లో దర్శకులు అధ్యాపకులను, ప్రిన్సిపాళ్లను బఫూన్లుగా, కమెడియన్లుగా చూపించిన వైనం అందరికీ విదితమే.తద్వారా తామేదో హాస్యాన్ని గుప్పిస్తూ అందర్నీ నవ్విస్తున్నామని వాళ్ళ ఆలోచన అయితే కావచ్చు... కానీ ఆ తరం విద్యార్థులపై అదెంత  ప్రభావం చూపించిందో బహుశా వారెరుగరు...
         ఒకప్పుడు ఉపాధ్యాయులన్నా, అధ్యాపకులన్నా ఎంతో గౌరవభావం, వాళ్లంటే ఓ విధమైన 'అడ్మిరేషన్'!...ఉండేది పిల్లల్లో, యువతలో... ఇంకా చెప్పాలంటే.. దూరంగా కనిపించినా పక్కకు తప్పుకోవడమో, ఆగి నమస్కరించడమో చేసేవాళ్లు..
రాను రానూ ఆ సత్ప్రవర్తన కనుమరుగైపోయింది.
      క్రమేణా సినిమాల్లో కాలేజీ స్థాయి నుండి  హైస్కూల్ స్థాయికీ, అది దాటుకుని ప్రాథమిక పాఠశాల స్థాయికీ ఈ కామెడీ సన్నివేశాలు పాకి... చిన్న పిల్లలు కూడా వాళ్ల టీచర్ల మీద జోకులు వేయడం, లెక్క లేకుండా మాట్లాడటం లాంటివి చూపించడం మొదలైంది. సినిమాల్లో చెడు మాత్రమేనా! మంచి కూడా చూపిస్తారు కదా... మంచిని గ్రహించవచ్చు కదా... అంటారేమో..! కానీ చెడు వ్యాపించినంత వేగంగా మంచి అన్నది అందరినీ చేరలేదు. శీఘ్రంగా ప్రభావితం చేయగల శక్తి చెడుకు మాత్రమే ఉంటుంది. మరీ ముఖ్యంగా పసివాళ్ళ మెదళ్లను ! మంచిని గ్రహించడం అయిష్టంగానూ, ఆచరించడం అంతకంటే కష్టంగానూ ఉండడమే అందుకు కారణం...
   ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పసితనం, అమాయకత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. వాళ్లకు టీచరు ఏది చెప్తే అదే రైటు...ఆ మాటే వేదవాక్కు... అన్నట్లు ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ హైస్కూలు ప్రవేశించగానే... ఆ పసితనం కాస్త పలచడుతూ ఆ స్థానంలో ఓ విధమైన 'మెచ్యూరిటీ' కనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు ఆ మెచ్యూరిటీ అన్నది వాళ్ల ప్రవర్తనలోనూ కనిపించేది. మెల్లిమెల్లిగా తర్వాతి తరాల్లో అది మాయమైపోతూ వాళ్లలో నిర్లక్ష్య ధోరణి పుట్టుకు రావడం మొదలైంది. అందరూ ఇలాగే ఉంటున్నారని చెప్పడం కాదు నా ఉద్దేశం... ఎక్కువ శాతం గురించి ప్రస్తావిస్తున్నాను. అందులోనూ... మగ పిల్లలు.. మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తొమ్మిదవ తరగతి నుండి మెల్లి మెల్లిగా మొదలయ్యే అల్లరి, అవిధేయత, నిర్లక్ష్యం ఇంటర్ స్థాయికి చేరేసరికి హద్దులు దాటుతున్న వైనాలు వింటున్నాము... అమ్మాయిలను  ఏడిపించడం, ప్రేమించానంటూ వెంట పడటం, వేధించడం...! వాళ్లు తిరస్కరిస్తే... దాడి చేయడం, ఇళ్లల్లో సైతం దూరి హతమార్చడం !! ఇలాంటి వార్తలు కోకొల్లలుగా వింటున్నాం, చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. 
      ఓ వయసంటూ  వచ్చాక ఇంట్లో తల్లిదండ్రుల మాట కూడా లక్ష్యపెట్టని పిల్లలుంటున్నారు. ఇంట్లో వినకా, బయట కాలేజీల్లో వినకా... ఇక వీళ్ళు బాగుపడేదెట్లు? !!
         ఎంతో శ్రద్ధగా  చదువుతూ ఇంటా  బయట మంచి పేరు తెచ్చుకుంటూ చక్కటి భవిష్యత్తును నిర్మించుకుంటున్న వాళ్లూ ఉంటున్నారు.. కానీ... పంట చేలో  కలుపు మొక్కల్లా పెరిగే అల్లరి యువత సమాజానికి తెచ్చే చేటు అంతాఇంతా కాదు..ఎన్నో  నేరాలు,ఘోరాలూ జరగడానికి కారణభూత మవుతున్నాయి. 
      ముందుగా ప్రస్తావించిన వార్త లాంటివి చదివినప్పుడు... ఇలాంటి వాళ్లలో మార్పు సాధ్యమా !పసివాళ్లు పెరిగి పెద్దయ్యాక ఇలా వాళ్లలో పశుత్వం చోటు చేసుకుంటున్నదెందుకని !! అనిపిస్తూ బాధగా ఉంటుంది....
******************************************


Tuesday, August 15, 2023

స్వతంత్రమంటే ఏందిర అన్న !!?

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అన్నా అన్నా తెలుపర అన్నా...
స్వతంత్రమంటే ఏందిర అన్న ? 
స్వరాజ్యమంటే ఏందిర అన్న ? 
               చెల్లీ చెల్లీ ఓ పాలవెల్లి 
               మరుమల్లెల మందారవల్లి.... 
               వినవే తల్లీ చెబుతా మళ్ళీ.... 
               పరులకు దాస్యం ఒకనాడు 
               చేశాం మనము అందరమూ
               ఏకై వచ్చిరి ఆ దొరలు 
               మేకై గుచ్చిరి హృదయాలు !!
               కరువైపోయెను బ్రతుకున వెలుగు
               నిండెను గుండెల ఆరని దిగులు...
అన్నా అన్నా తెలుపర అన్న
దొరలంటే ఎవరే అన్న ? 
వారంటే వెరపెందుకె అన్న ? 
              చెల్లీ చెల్లీ ఓ పాలవెల్లి 
              మరుమల్లెల మందారవల్లి...
              దొరలంటే ఆంగ్లేయులే  నమ్మీ 
              చేశారు వారు మనపై దొమ్మీ !!
              అయితే ఒక్కటి నిక్కము సుమ్మీ... 
              అంతా ఏకం అయితే.. 
              ఐక్యమై కదిలి సాగితే..
              వారి పని సున్నే నమ్మీ... 
అన్నా అన్నా తెలుపర అన్న...
ఏకం అంటే ఏందిర అన్న ? 
ఐక్యం అంటే ఏమిటిరన్న ? 
              చెల్లీ చెల్లీ ఓ పాలవెల్లి... 
              మరుమల్లెల మందారవల్లి...
              ఏకం అన్నా ఐక్యంఅన్నా 
              ఒకటిగ కలిసీ ఉండడమూ...
              నాయకులంతా ఒకటై పోయిరి.. 
              జరిపిరి సమైక్యపోరాటమన్నది !
              స్వతంత్ర జీవన వాంఛితమే 
              వారల జీవిత ఆశయమూ ...
              త్యాగం తోటి తేజం చిందే
              బ్రతుకే వారల ఆదర్శం...!
అన్నా అన్నా తెలుపర అన్నా.. 
నాయకులంటే ఎవరే అన్న ? 
త్యాగం అంటే ఏందిర అన్న ? 
              నాయకులంటే మార్గదర్శులు 
              జాతికి జీవం పోసిన వీరులు !!
              భావిని చెరగని ముద్రలు వారు 
              భారత చరిత్ర నిలిచినవారు 
              భవితకు బంగరు బాటలు వారు !!
              బాలల జీవనజ్యోతులు వారు !!
అన్నా అన్నా తెలుపర అన్న..
మార్గదర్శులు ఎవరే అన్న ? 
బంగరు బాటలు ఏవిర అన్న ?? 
              గాంధీ దేవుడు చేసెను త్యాగం...
              నెహ్రూ దీవెన పోసెను జీవం...
              సుభాసు బోసు సింహనాదం  !
              జైహింద్ అంటూ కదిలిరి జనం !!
              భగత్ సింగ్ బలియైపోయెను...
              భారతనారీ ఝాన్సీ రాణీ..... 
              భారత చరితను నిలిచిన జ్యోతీ !!
              ఆంధ్ర కేసరి టంగుటూరి...
              ఉక్కుమనిషి పటేల్ జీ... 
              వెలుతురు చూపిరి..వెలుగే నింపిరి !
              వెళ్లగొట్టిరి శత్రుమూకను... 
              కొల్లగొట్టిరి  వారల పరువు !
              పగులగొట్టిరి దాస్య శృంఖలాలు  !!
              తెచ్చిరి కడకూ స్వతంత్రమన్నది !!
              తేనెల వానలు కురిపించిరి మదిని !

              వారే చెల్లీ మహానుభావులు...
              వారే తల్లీ అమరజీవులు....
              భారతమాతకు ముద్దుబిడ్డలు 
              జాతికి జీవం పోసిన వీరులు 
              భావిని చెరగని ముద్రలు వారు 
              భారత చరిత్ర నినిచినవారు
              భవితకు బంగరు బాటలు వారు 
              బాలల జీవన జ్యోతులు వారు !!
అన్నా అన్నా తెలిసెర అన్నా... 
స్వతంత్రమంటే స్వేచ్చాజీవనం  
బానిసత్వం నుండి విమోచనం !!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


         


Monday, August 14, 2023

స్వతంత్ర భారతం



 
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

అలముకున్న  అంధకారం...
అంతులేని కాలుష్యం
అలవికాని దారిద్ర్యం...!
అంతరించు శుభదినం
ఆగమనం ఏ దినం ?? 
అడవి లాంటి ఈ భారతం...
అగునా సస్యశ్యామలం !
ఇది ఒకనాటి ప్రశ్న...

గాంధీ,  నెహ్రూ పోరాడిరి... 
భగత్,ఆజాద్,అల్లూరి...
అసువులు బాసిరి !!
ఎందరో...మరెందరెందరో 
మహామహులు...మహనీయులు 
మట్టిలో కలిసిపోయిరి...!
కలిసికట్టుగ పోరాడిన ఫలితం !
తెల్లదొరలు తరలిపోయిరి... 
త్యాగధనుల ఆశయం...
ఫలియించెను ఆక్షణం... 
సిద్దించెను స్వాతంత్య్రం ! 
ఉదయించెను నవభారతం !
భావితరానికి నవోదయం !! 

మరచిపోలేము ఎన్నటికీ.. 
మహానుభావులు వారు ముమ్మాటికీ... 
మననం చేసుకుందాం
మన జాతిరత్నాల్ని మరీమరీ ...  

నేటి బాలలం... రేపటి పౌరులం...
నేటి కూనలం...రేపటి వీరులం..
నేడు చిరుదివ్వెలం....
రేపటి ఆఖండ జ్యోతులం...
చదువు బాగ నేర్చెదము..
నేర్చి నీతి కూర్చెదము.. 
కూర్చి ప్రగతి నడచెదము..
నడిచి చరిత నిలిచెదము..
నిలిచి ఖ్యాతిబొందెదము... 

అర్ధరాత్రి స్వాతంత్ర్యం... 
అంతరించె  అంధకారం..
కానరాదు  కాలుష్యం...
పారిపోయె  దారిద్ర్యం... 
అడవి లాంటి నాటి భారతం..
అయిందీ నేడు సస్యశ్యామలం...!!
నాటి ప్రశ్నకు ఇది సమాధానం.... 

బానిసలం కాదు మనం... 
స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న 
భారతీయులం! నేడే..స్వాతంత్ర్యదినం..
అందరం... మనమందరం...
కలిసి ఎగరేద్దాం..మువ్వన్నెల 
జాతీయ పతాకం...!!

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
 

Monday, August 7, 2023

థాంక్యూ సౌమ్యా...!

🌺

                                           ~~ యం. ధరిత్రీ దేవి ~~

"అయితే రాజేంద్రనాథ్ నిన్ను ప్రేమిస్తున్నాడంటావ్..."
" అవును సౌమ్యా, సంవత్సరం క్రితం మొదలైన మా పరిచయం ప్రేమగా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
"... మంచిదే కళ్యాణీ,కానీ ఒక మాట,  నీ కుటుంబ స్థితిగతులు నీకు బాగా తెలుసు. బీటెక్ లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నావు గనుక మీ నాన్న నిన్ను చదివించగలుగుతున్నాడు. అతనేమో డబ్బులో  పుట్టి , డబ్బులో పెరిగిన వాడంటున్నావు. కోట్లాది ఆస్తికి వారసుడంటున్నావు. అతని వరకు ఓకే... కానీ... అతని ఇంట్లో ఓకే అంటారా...! మీ ఇరు కుటుంబాల మధ్య చాలా అంతరం ఉంది కల్యాణీ . నిన్ను ఆ ఇంటి కోడలిగా అంగీకరిస్తారంటావా... ఆలోచించు..."
" నాకు రాజేంద్ర మీద పూర్తి నమ్మకం ఉంది సౌమ్యా. వాళ్ళింట్లో చెప్పి ఒప్పిస్తానని చెప్పాడు..."
"...ఒప్పిస్తానంటున్నాడు. ఇతను చెప్పగానే సరే అని వాళ్ళు వెంటనే అనకపోతేనే కదా ఒప్పించే ప్రయత్నం చేయాల్సివచ్చేది..."
వెంటనే అందుకుని అంది సౌమ్య. ఆ మాటకు కళ్యాణిలో ఆలోచన మొదలైంది.
                     **             **           **
" సరే కళ్యాణీ, ఈ వీకెండ్ నేను మా ఊరికెళ్తాను. ఈ ఇయర్   నా B.Tech కంప్లీట్ అవుతుంది. ఇంట్లో కూడా పెళ్లి ప్రస్తావన తెస్తూ ఉన్నారు. మన సంగతి అమ్మా నాన్నలతో  చెప్తాను. సరేనా... "
అలా చెప్పి వెళ్లిన రాజేంద్ర వారం తర్వాత తిరిగి కాలేజీకొచ్చాడు. కానీ కళ్యాణి నైతే కలవలేదు. బిజీగా ఉన్నాడేమోలే అనుకుని రెండ్రోజులాగి కల్యాణే అతన్ని కలిసింది.
" సారీ కల్యాణీ, వెంటనే నిన్ను కలవలేకపోయాను.... నాన్న ఫ్రెండ్ ఒకాయన.. ఆయన కూడా బిజినెస్ మ్యానే... ఆయన కూతుర్ని మా ఇంటి కోడలిగా చేయాలని ఉందని మా నాన్నతో అన్నాడట కళ్యాణీ.. నాన్నేమో వెంటనే అలాగేనంటూ మాటిచ్చేశాడట !మన సంగతి చెబితే...ఏమిటో...ఇంట్లో అంతా సుముఖంగా కనిపించలేదు కళ్యాణి... అయినా.. మరోసారి ప్రయత్నిస్తాను.. నీవేమీ వర్రీ అవకు.. "
నీళ్లు నములుతూ చెప్పాడు రాజేంద్రనాథ్. నిర్వికారంగా అయిపోయింది కళ్యాణి. 
" మరి నువ్వు నాకిచ్చిన మాట సంగతి ఏంటి!!"
ఊహించని అతని మాటలకు నివ్వరపోయినా పైకి  ఏమీ  అనలేదు. సౌమ్య మాటలు గుర్తొచ్చాయి ఆమెకు. అయినా... మరోసారి ప్రయత్నిస్తాను అన్నాడు కదా..! ఆమెలో మళ్లీ ఏదో ఆశ పొడసూపింది. 
                **                 **             **
    రాజేంద్రనాథ్ B.Tech ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. ఆ తర్వాత M.B.A  చేసే ఆలోచనలో ఉన్నాడు. కళ్యాణి సెకండ్ ఇయర్ లో ఉండగా ఆమెను చూశాడు ఆమె అందం చూసి  ఆకర్షితుడై పరిచయం పెంచుకున్నాడు. మొదట్లో పట్టించుకోకపోయినా కళ్యాణి నెమ్మదిగా అతని గురించిన ఆలోచనల్లో పడిపోయింది. సౌమ్య చెప్పేదాకా ఆమెకు మరో ఆలోచనే  రాలేదు. ఈరోజు అతని మాటలు ఆమె ఆశలపై ఇంకా చెప్పాలంటే ఆమె నమ్మకంపై నీళ్లు చిలకరించినట్లయింది.
    వారం గడిచింది. క్యాంపస్ సెలక్షన్స్ జరగబోతున్నాయి. కళ్యాణికేమో పుస్తకాల మీద మనసు లగ్నం కావడం లేదు. ఆ మాటకొస్తే రాజేంద్ర తో ప్రేమ వ్యవహారం మొదలైనప్పటినుంచే ఆమెకు చదువు మీద శ్రద్ధ తగ్గిందని చెప్పాలి. ప్రస్తుతం రాజేంద్ర ప్రవర్తనతో తన ప్రేమ సౌధం పునాదులు మెల్లిగా కంపిస్తున్న భావన ఆమెలో కలగసాగింది. దానికి తోడు అతను తనతో మునుపటిలా  మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఎదురుపడినా పక్కకు తప్పుకుని పోతున్నాడు.
" ఏమిటి ! ఇంత బలహీనమైనదా ఇతని  ప్రేమ!"
 కళ్యాణిలో తెలియని బాధ సుళ్ళు  తిరగసాగింది.
                      **           **             **
    క్యాంపస్ సెలక్షన్స్ పూర్తయ్యాయి. కళ్యాణి సెలెక్ట్ అవలేదు. అవుతానని కూడా ఆమె అనుకోలేదు. రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం క్లాసులయ్యాక హాస్టల్ వైపు నడుస్తున్న ఆమెకు ఆనంద్ ఎదురయ్యాడు. అతనూ  కళ్యాణి క్లాస్ మేటే... పైకి చెప్పకపోయినా నెమ్మదిగా ఆమె అంటే లోలోపల ఇష్టం లాంటిది కలిగింది అతనికి. దూరాన కనిపిస్తే ఆరాధనగా  చూసేవాడు.కానీ,  క్రమంగా ఆమె రాజేంద్ర తో చనువుగా ఉండడం, క్యాంటీన్లో ఈవినింగ్స్ కలిసి గడపడం చూసి  తన ఇష్టాన్ని బలవంతాన తుంచేసుకున్నాడు. అతన్ని చూసిన కళ్యాణి, 
" కంగ్రాట్స్, సెలెక్ట్ అయ్యారట  కదా.. !"
"థాంక్సండీ. .."
అన్నాడు ఆనంద్. ఎందుకో డల్ గా కనిపిస్తూన్న కళ్యాణిని చూసి ఊరుకోలేక, 
" మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండీ.. మనకి ఇంకా ఒక సంవత్సరం టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ గా మీరు సెలెక్ట్ అవుతారు చూడండి.."
అన్నాడు.కళ్యాణి పేలవంగా నవ్వింది.అది చూసిన ఆనంద్, 
" మీరేమీ అనుకోకపోతే ఒకటడుగుతాను..కొద్ది రోజులుగా మీరు చాలా డల్ గా కనిపిస్తున్నారు. హెల్త్ జాగ్రత్తండీ.ఇది మన కెరీర్ ను నిర్ణయించుకునే పీరియడ్. మన ఫ్యూచర్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనకెన్ని సమస్యలున్నా పక్కకు నెట్టేసి చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలంటాను. ఓకే...బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ "
అంటూ ముందుకు వెళ్లిపోయాడు. 
    ఆనంద్ కూడా మిడిల్ క్లాస్ వాడే. తనతోపాటే చేరాడు. మొదట్లో...అతను తనను ఆసక్తిగా చూడడం కళ్యాణి గమనించకపోలేదు. కానీ...అప్పుడు తనేమో పూర్తిగా రాజేంద్ర మత్తులో ఉండిపోయి అదేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు చదువుపై,భవిష్యత్తుపై అతని శ్రద్ధ చూస్తుంటే...ఏమిటో గిల్టీగా అనిపించింది కల్యాణికి.ముఖ్యంగా ఎంతో కేరింగ్ గా తనకు అతనిచ్చిన సలహా ఆమె మనసుకు హత్తుకుపోయింది..
   రెణ్ణెళ్ల తర్వాత ఒకరోజు...రాజేంద్ర తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడని తెలిసింది.కారణం తెలిసి నిర్వికారంగా నవ్వుకుంది. ఇంత వ్యక్తిత్వం లేని  అతన్ని నేనెలా ప్రేమించగలిగాను !! తానేమీ అతని వెంట పడలేదే ! కొద్దిరోజులు తేరుకోలేకపోయింది.ఏదేమైతేనేం...అతని ఆంతర్యం తెలిశాక అతని ప్రేమ కేవలం కాలక్షేపానికే అన్న విషయం రూఢిగా అర్థమయిపోయిందామెకు. ఆ క్షణాన్నే అతన్నీ, అతని ప్రేమనూ దూరంగా నెట్టేసింది. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడని తెలిసినా ఏబాధా కలగలేదు కళ్యాణికి. ఆలోచిస్తుంటే ఆమెకు తనది కూడా నిజమైన ప్రేమ కాదేమో అనిపించింది. లేకుంటే ఇంత త్వరగా తాను కూడా మరిచిపోవడమేమిటి !!
        ఆరోజు ఆనంద్  మాటలు విన్నప్పటినుంచీ ఆమె ఓ స్థిర నిశ్చయానికి  వచ్చింది... పూర్తిగా స్టడీస్ మీదే మనసు లగ్నం చేసింది. ఇప్పుడు ఆమె  లక్ష్యం... చదువు పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడటం...అంతే !
        ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఆరోజు సాయంత్రం క్లాసులు అయ్యాక హాస్టల్ కు వెళ్తున్న కళ్యాణికి క్యాంపస్ లో ఓ  చెట్టు కింద సౌమ్య, ఆనంద్ నిలబడి మాట్లాడుకుంటూ ఉండడం కనిపించింది. సౌమ్య టెన్త్ క్లాస్ నుండీ కళ్యాణికి క్లాస్మేట్. ఇద్దరూ ఒకేసారి B.tech లో చేరారు. క్లాస్మేట్ గా  కంటే ఓ మంచి ఫ్రెండ్ అనడమే కరెక్ట్. అంతకన్నా...తన శ్రేయోభిలాషి కూడా.
     ఈరోజే కాదు... రెండు మూడు సార్లు వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కళ్యాణి కంటబడింది. ఏదో మూల అదోలాంటి ఫీలింగ్ కలిగిందామెకు. 
               **           **           **
" ఏమిటి కల్యాణీ, నువ్వు మరీను... క్యాంపస్ సెలక్షన్స్ కు ప్రిపేర్ అవడం గురించి టిప్స్ కొన్ని తెలుసుకోవాలని ఆనంద్ తో మాట్లాడుతున్నానంతే. మా ఇద్దరి మధ్యా మరేదీ  లేదు..."
కళ్యాణి ప్రశ్నకు సమాధానంగా నవ్వింది సౌమ్య.
"...అసలు నీకో విషయం చెప్పనా.. మొన్న మాటల మధ్యలో రాజేంద్ర ప్రసక్తి వచ్చింది. అతనితో నీ ప్రేమ, బ్రేకప్, అతని పెళ్లి... ఇవన్నీ చూచాయగా అతనికీ తెలిసినట్లున్నాయి. నవ్వేసి, అదంతా ట్రాష్ అంటూ సింపుల్ గా కొట్టిపడేశాడు. ఇందులో నువ్వు బాధ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదంటూ మాట్లాడాడు.కల్యాణీ, అతని మాటల్లో నీపట్ల ఏదో తెలియని అవ్యక్తభావం...అదే, ఇష్టం లాంటిదన్నమాట! కనిపించింది నాకు... "
" సౌమ్యా.. !"
" అవును.. రాజేంద్ర లాంటివాడు కాదు ఆనంద్ కల్యాణీ,  చాలా ప్రాక్టికల్ పర్సన్. అతని మాటల్లో నిజాయితీ, ఎదుటి వాళ్ళ పట్ల గౌరవం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. తనకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. అవి చేరుకోవడానికి శ్రమించే గుణమూ ఉంది... "
సౌమ్య చెబుతూ ఉంటే అలా వింటూ ఉండిపోయింది కళ్యాణి.
" నీ పట్ల మొదటినుంచీ అతనికి ఇష్టం ఉందన్న విషయం అతని మాటల ద్వారా నేను గ్రహించాను... "
ఆ మాటలు వినీ విననట్లు తల పక్కకు తిప్పుకుంది కళ్యాణి. రాజేంద్ర వల్ల ప్రేమ అనే భావన మీదే ఒకలాంటి విరక్తి పుట్టిందామెకి.. ! అదే చెప్తూ, 
" అదంతా ఏమోగానీ సౌమ్యా, నీకు మాత్రం నేను థాంక్స్ చెప్పుకొనితీరాలి. ఆరోజు నువ్వు రాజేంద్ర గురించి నన్ను హెచ్చరించి ఉండకపోతే, నాకై నేను మేలుకొని ఉండేదాన్ని కాదేమో...!"
".. ఊరుకో కళ్యాణీ, అంతస్తుల తారతమ్యాలు అంత సులభంగా పోయేవి కావని నాకెందుకో అనిపించింది. నీతో ఓ  మాట చెప్పాలనిపించింది. ఎంతో తటపటాయిస్తూనే చెప్పాను. అసలు  చెప్పకుండా ఉండలేకపోయాను కూడా.  ఎన్నో సంవత్సరాల స్నేహం మనది. మీ అమ్మానాన్న కూడా నాకు బాగా తెలుసు.రాజేంద్రను చూస్తుంటే ఎందుకో అతను నీకు, నీ కుటుంబానికి సెట్ అవడేమో అనిపించింది. అతని స్టైలిష్ నేచర్, లైఫ్ స్టయిల్, స్నేహాలూ...రానురానూ నీ మెంటాలిటీకి  సరిపడవని తోచింది.ఓ మాట చెప్పాలనిపించింది.నా మాటలకు నువ్వు కోపం తెచ్చుకోక పాజిటివ్ గా తీసుకున్నావు. అందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలి.. సరే, జరిగిందేదైనా మన మంచికే అనుకుందాం,  పద"
"మన స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి సౌమ్యా, "
చేతిలో చెయ్యి వేసింది సౌమ్య. 
                     **        **           **          
 మూడేళ్లు గడిచిపోయాయి. ఆనంద్ ఇప్పుడు బెంగుళూరులో ఓ  మంచి పేరున్న కంపెనీలో చేస్తున్నాడు. కళ్యాణి, సౌమ్యలకు క్యాంపస్ సెలక్షన్స్ లోనే జాబ్స్ వచ్చాయి. కళ్యాణి ప్రస్తుతం హైదరాబాదులో ఉంది. సౌమ్య సంవత్సరం పాటు జాబ్ చేసి,తల్లిదండ్రులు  చూసిన సంబంధం చేసుకుని కెనడా వెళ్లిపోయింది. అక్కడే తానూ జాబ్ చూసుకుంది. అప్పుడప్పుడూ  ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో పోరు పెడుతున్నా, కళ్యాణి మాత్రం పెళ్లి విషయం దాటవేస్తూ వస్తోంది. 
      ఆరోజు ఆదివారం. విజిటర్స్ డే. సాయంత్రం నాలుగు గంటలకు అటెండర్ ఒకమ్మాయి వచ్చి, తనకోసం ఎవరో వచ్చారని చెబితే, కిందికి వెళ్ళింది కళ్యాణి . విజిటర్స్ రూమ్ లో అటువైపు తిరిగి కూర్చున్న ఓ వ్యక్తి అలికిడి విని ఇటువైపు తిరిగాడు. కళ్యాణి మొహం అప్రయత్నంగానే విప్పారింది. 
ఆనంద్ !! ఎన్నాళ్ళకి !
" బాగున్నారా.. "
 లేచి దగ్గరగా వస్తూ పలకరించాడతను. తలూపుతూ, 
" మీరు ఎలా ఉన్నారండీ?  నేనిక్కడున్నట్లు మీకెలా తెలిసింది? "
" మనసుంటే మార్గం ఉండదా కళ్యాణి గారూ... !"
నవ్వాడు. ఎప్పటి పరిచయం! ఏడేళ్లయింది... ఫైనల్ ఇయర్ అయ్యి,  సెండ్ ఆఫ్ చెప్పుకున్నాక,. మళ్లీ మాట్లాడుకున్నది లేదు. కనీసం ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోలేదు... మళ్లీ ఇప్పుడు !!
    అరగంట తర్వాత బయట రెస్టారెంట్లో టీ తాగుతూ, 
" ఉపోద్ఘాతాలేవీ  వద్దు. సూటిగానే అడుగుతాను. మీరు ఓకే అంటేనే... ప్రొసీడ్ అవుతాను..."
"..................."
"... నాతో పెళ్లికి మీరు సుముఖంగా ఉంటే చెప్పండి. మా నాన్నగారు వెళ్లి, మీ పెద్దవాళ్ళతో మాట్లాడతారు."
ఓ క్షణం ఆనంద్  వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది కళ్యాణి.
" మాట్లాడండి"
" కాస్త ఉపోద్ఘాతం ఉంటే బాగుండేదేమో....!"
చిన్నగా నవ్వింది. కాలేజీలో చేరిన కొద్దిరోజుల తర్వాత పరిచయం అతనితో..ఎన్నడూ పెద్దగా మాట్లాడు కున్నది లేదు ఇద్దరూ. ఇన్నేళ్ల  తర్వాత కూడా తనమీద ఇష్టమన్నది చెక్కుచెదరలేదన్న మాట! ఈ ఇష్టాన్నే ప్రేమ అనొచ్చా! కొంతకాలం క్రితం ఓచోట చదివింది కళ్యాణి. 
"ఏ మనిషి మీదైనా ఇష్టం అన్నది  పుట్టి, ఆఇష్టం... రోజులు,  వారాలు, నెలలు కాదు...ఏళ్ళు గడిచినా... ఏమాత్రం తగ్గక స్థిరంగా నిలిచి ఉంటే...అదే అసలైన ప్రేమ"
అని !!
రెండు నిమిషాల మౌనం తర్వాత పెదవి విప్పింది కళ్యాణి.
" మీతో ఓ విషయం చెప్పాలి..."
" ఎమిటీ, రాజేంద్ర గురించేనా ! అదే అయితే ఏమాత్రం అవసరం లేదు. అయినా అది ఇంకా మీ మైండ్ లోఉందా ! వెంటనే డిలీట్ చేసేయండి ఇప్పటికైనా..."
" అదెప్పుడో జరిగిందే అయినా... మీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉందనిపించింది"
" నో ప్రాబ్లం.. అలా అనుకుంటే నాకూ ఒకటీఅరా ఉన్నాయిలెండి. నేనూ చెప్పాలంటారా ఏంటి కొంపదీసి..!"
" ఔనా..." నమ్మలేనట్లు మొహం పెట్టింది కళ్యాణి.
" అవునండీ  బాబూ ! చదువుకునే రోజుల్లో యాభై శాతం స్టూడెంట్స్ కు ఇలాంటివి క్వైట్ నాచురల్ ! అదంతా లవ్ అనుకుంటే మన పని అయినట్లే..."
"...................."
"..మొదలయ్యేటప్పుడు సిన్సియర్ గానే మొదలౌతుంది. రోజులు గడిచేకొద్దీ  ఒకరి వీక్నెస్ లు మరొకరికి తెలిసిపోయి ప్రేమ స్థానంలో మరేదో పుట్టుకొస్తుంది. అంతే....ప్రేమ పక్షులు చెరో దిక్కు  ఎగిరిపోతాయి.!"
ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. కళ్యాణికి ఏదో పెద్ద భారం తలమీంచి దిగిపోయినట్లయింది. ఆనంద్ అంటే తనకూ ఇష్టం ఏర్పడినా, తనకు తాను బయటపడటం బాగుండదనుకుంటూ సౌమ్య చెప్తున్నా జాప్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు తనకు తానే వచ్చాడు. ఎదురుగా నిలబడ్డాడు. ప్రేమ డైలాగులు వల్లించలేదు. పెద్దల ద్వారానే వెళ్దాం అంటున్నాడు.అదీ..తనకి ఇష్టమైతేనే!! ఈరోజుతో తనకున్న అనుమానాలూ, భయాలూ పూర్తిగా తొలగిపోయి,  తుఫాను వెలిసినట్లయి మనసంతా తేలికైపోయింది.ఇప్పటికీ  తను ఎస్ అనకపోతే... చేజేతులా కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లవుతుంది.
" ఇంతకీ మీ రెస్పాన్స్ ఏమిటో చెప్పనేలేదు..."
 ఆలోచనల నుండి బయటపడిన కళ్యాణి, 
" ఇంత ఓపెన్ గా ఉన్న మీకు నో ఎలా చెప్పగలను!"
" అంటే... ప్రొసీడ్ అవమంటారు...! అమ్మయ్య! బ్రతికించారు.. మా నాన్నకి ఈ రోజే ఫోన్ చేసి చెప్తాను.."
గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాడు ఆనంద్. 
ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు.
"ఇక  నేను మీ సౌమ్యకు థాంక్స్ చెప్పుకోవాలి.."
వద్దనుకుంటేనే పైకి అనేశాడు ఆనంద్. విస్మయంగా చూసింది కళ్యాణి.
" అవునండీ, తమరి ఆచూకీ  లీక్ చేసింది తనేగా మరి!!"
అమ్మ సౌమ్యా ! అనుకున్న కళ్యాణి, 
" మీరే కాదండీ, నేను కూడా చెప్పుకోవాలి... పదండి, ఇద్దరం కలిసే  చెబుదాం సౌమ్యకు థాంక్స్.."
ఇద్దరూ నవ్వుకుంటూ తమ భావిజీవితానికి సోపానాలు వేసుకునే తలపులతో కలిసి అడుగులు ముందుకు వేశారు. 
******************************************




Tuesday, August 1, 2023

ప్రకృతి

🌷

      రోడ్లన్నీ గతుకులమయం ! దారుణంగా దెబ్బ తిన్న రహదారులు !! కూలుతున్న వంతెనలు! వరదలతోో పోటెత్తుతున్న నదులు ! జనావాసాల్లోకి వచ్చిన నీళ్లు!  నిలువ నీడ లేక అగచాట్లు !! 
     వార్తా పత్రికల నిండా ఇవే వార్తలు. వాటి తాలూకు ఛాయాచిత్రాలు ! టీవీ న్యూస్ ఛానల్స్ అన్నింటా ఇదే ఘోష ! 
    మొన్నటిదాకా మండే ఎండలు ! భరించలేనంత ఉక్కపోత ! చెమటలు కక్కుతున్న శరీరాలతో చిరాకులు, విసుక్కోడాలు!  అదంతా ఎలా మటుమాయమైపోయిందో ఏమో! వానలు మొదలయ్యాయి.. ఒక్కసారిగా జనాలకు ఊరట ! అదీ ఎంతసేపు ! రోజుల వ్యవధిలోనే మళ్లీ బాధలు మొదలు! ఈసారి కొత్త రకంగా ! జల్లుగా  మొదలైన చినుకులు జడివానలై, వరదలై వీధులన్నీ జలమయం చేస్తూ... నదులు, ఏరులు పొంగుతూ ఊరువాడల్ని ముంచెత్తుతూ, బీభత్సం సృష్టిస్తూ జన జీవనాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ప్రస్తుతం ఇదీ  పరిస్థితి! 
      కాంక్రీట్ బిల్డింగుల్లోకి కూడా నీళ్లు చొరబడి రక్షణ అన్నది కరువైపోయిన వైనం ! గుడిసెలు, మట్టిమిద్దెల దుస్థితి ఇక వర్ణించలేము. అవి బాగుపడేదాకా వారి అవస్థ చెప్పనలివి కాదు. ఎలా? ఎప్పుడు? ఎంత కాలం పడుతుందో ! మళ్లీ మామూలుగా మారేవరకు తిప్పలు తప్పవు మరి ! మారడమైతే జరుగుతుంది. కానీ అంత వరకు తప్పదు కదా భరించడం!
    ఇక... క్రమంగా మొదలవుతుంది చలికాలం... కాస్త ఊపిరి పీల్చుకునేలోగా...మళ్లీ మొదలు కష్టాలు... చలి!! రాను రాను రోజులు గడిచే కొద్దీ భరించలేని చలి  మరి జనాలకి ప్రశాంతత, సంతోషం సంవత్సరంలో ఎంతకాలం?  ఆలోచిస్తే...కొద్ది కాలం మాత్రమే !!
     ఇంతకీ...ఎండాకాలం, వానకాలం, చలికాలం... ఈ మూడింటిలో ఏది నీకు ఇష్టం అంటే...!
 అన్ని కాలాలూ  మంచివే... అన్నీ  ఉండాల్సిందే... అన్నింటికీ వాటి వాటి ప్రత్యేకత ఉంది. ఏది లేకపోయినా జనావళికి తీరని నష్టమే. కాకపోతే ఏదైనా మితంగా ఉంటేనే మంచిది...  ఆ హద్దు దాటిందంటే... ఇదిగో.. ఇలాంటి అనర్ధాలే ! 
   వరదలు, ముంపులూ, వంతెనలు కూలడాలు, రోడ్లు పాడైపోయి నడకకు కూడా ఇబ్బందులు రావడాలు ! వీటికి తోడు జబ్బులు, అంటువ్యాధులు, అనారోగ్యాలు !!
    వర్షాకాలం ఇలాగైతే... వేసవి కాలం వడదెబ్బలు, అత్యధిక ఉష్ణోగ్రత వల్ల వచ్చే సమస్యలు మరో విధంగా మనుషుల్ని బాధ పెడతాయి.అలాగే చలికాలం మరోరకం బాధలు ! కానీ చిత్రం ఏమిటంటే...చలికాలం వచ్చాక  ఎండాకాలం కోసం ఎదురుచూడడం, ఎండలు భరించలేక వర్షాల కోసం ఆరాటపడడం...అవీఎక్కువైపోతే...మళ్ళీదేనికోసమో!ఇదంతా సహజమే కదా !   
 ఇవన్నీ ఋతురాగాలే ! ఏదిఏమైనా...ప్రకృతి అనుగ్రహిస్తే అంతా ఆనందమే ! ఆగ్రహిస్తే ప్రళయమే!!

******************************************