Tuesday, November 25, 2025

ఎన్ని కలలు.. ఎన్నెన్ని ఆశలు..!!

"ఆకాశానికి చిల్లు పడిందా... 
అన్నట్లు జోరున వర్షం...
అయినా ఆగక గమ్యం చేరడమే 
లక్ష్యంగా దూసుకుపోతున్న వాహనం...!
ఆదమరిచి నిశ్చింతగా నిద్రిస్తున్న 
అమాయక జనం...ఒక్కసారిగా
భయంకరమైన విస్ఫోటనం !!  
కన్ను మూసి తెరిచేలోగా
బూడిదగా మారిన క్షణం !
ఆ నిశీధి వేళ.. ఆహుతైపోయి...
మాంసపుముద్దలై మిగిలిన 
మానవ నిర్జీవ శరీరాలు !!"

స్పందించని హృదయముండునా!
ఇటువంటి దుర్వార్త విన్న క్షణాన..
ఆక్రోశించని మనిషుండునా!
జీవితం క్షణభంగురమేనా !!
గాలిబుడగేనా ఈ బ్రతుకు!!
అనిపించదా ఎవరికైనా...
ఎన్ని కలలు! ఎన్నెన్ని ఆశలు !!
అన్నీ కల్లలై బ్రతుకులే తెల్లారిపోయే!! 
ఊహించని ఉత్పాతమా...
ఎంత వేదన మిగిల్చితివో కదా!
ఎన్ని పెనవేసుకున్న బంధాలు..క్షణంలో
తెగిపోయి తలరాతలు మారిపోయెనో ! 
ఎన్ని కుటుంబాలు దిక్కులేక 
అయిపోయెనో కదా అనాధలు !
ఇది విధివిలాసమా ! 
విధాత వ్రాసిన విషాద గీతమా !!




No comments:

Post a Comment