Friday, June 30, 2023

అసాధ్యమా...! కాదుగదా !!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

ఎండి బీటలు వారిన భూమి 
తొలకరి చిరుజల్లు తాకి 
సస్యశ్యామలమవదా !
ఆకులన్నీ నేలరాలి నిస్తేజమై 
నిర్జీవశిలలా  నిలిచిన ఓ కొమ్మ 
ఋతువులు మారిన మరుక్షణాన 
చివురులు వేసి చిరునవ్వులు 
చిందించదా !!
మానసికవేదనతో మౌనరోదనతో 
మ్రాన్పడిపోయేలా మనిషిని 
కృంగదీసే మొండి వ్యాధి సైతం 
మటుమాయమై స్వస్థత చేకూరదా !!
మరి....!
మోడువారి ఆశలుడిగిన బ్రతుకున 
వసంతశోభ వరంలా అడుగిడి 
ఆశించని అదృష్టం ఒడినిజేరి 
కొత్త ఊపిరులు పోసుకుని 
అదే జీవితం శోభాయమానం 
అవడం మాత్రం అసాధ్యమా !
కాదుగదా....!!
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


Friday, June 23, 2023

'చిన్నారి' కథ -- మా అమ్మ చొక్కాలు బాగా కుడుతుంది

🙂😇🙎🙋👩🙂😇😅😊😇🙎👩🙎🙂

  సోమవారం. ఉదయం తొమ్మిది దాటి పదినిమిషాలవుతోంది.  ప్రార్థన తర్వాత పిల్లలంతా వచ్చి క్లాసులో  కూర్చున్నారు. అది  ఆరవ తరగతి. క్లాస్ టీచర్ సాధన అటెండెన్స్ తీస్తూ తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉండడం గమనించింది. తన వైపు చూడ్డం చూసి, ఆమె కాస్త ముందుకొచ్చింది. ఆవెనకే ఆమె కొంగు పట్టుకుని ఓ పిల్లాడు... 
" ఏరా, ఏమిటింత లేటు? పైగా మూడు రోజుల్నుంచీ బడికి రావడం లేదు.. ఒంట్లో బాగా లేదా ఏంటి? "
సాధన వాడిని చూసి ప్రశ్నలు సంధించింది. 
" అదేమీ లేదు టీచరమ్మా, వీడు బాగానే ఉన్నాడు. ఈనెల వీడి అన్న... అంటే నా పెద్ద కొడుకు పుట్టినరోజు టీచరమ్మా... వీడి నాన్న వాడికి కొత్తబట్టలు కుట్టించాడు. వీడేమో నాక్కూడా కావాలంటూ కొట్లాట! ఇద్దరికీ ఒకేసారంటే కూలి నాలి చేసుకుని బతికే వాళ్ళం కుదరదు లేరా... రెండు నెలలు అయ్యాక నీ పుట్టినరోజు వస్తుంది కదా... అప్పుడు కుట్టిస్తానంటే ఛస్తే వినడే ! కిందపడి దొర్లి  దొర్లి ఏడుస్తూ, ఇప్పుడే కావాలంటూ వాళ్ళన్న బట్టలు లాగేసుకుంటూ నానా యాగీ చేసి  బడి మానేసి కూకున్నాడు..."
 తల్లి అందుకుని చెప్పింది, రంగాను ముందుకు నెడుతూ. 
పిల్లలంతా తలలెత్తి ఆసక్తిగా వింటున్నారు. 
" అలాగా... ! ఏమిటి రంగా, తప్పు కదూ.. అలా చేయొచ్చా! ఇలారా... నువ్వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను... "
అంటూ రంగాను  దగ్గరికి పిలిచింది. రెండు నిమిషాల్లో అటెండెన్స్ పూర్తి చేసి, 
" పిల్లలూ, చూడండి.. మీకో  చిన్న సంగతి చెబుతాను. అందరూ శ్రద్ధగా వినండి... "
అంటూ అందరి వైపు ఓసారి చూసి మొదలెట్టింది.
" గాంధీ తాత గురించి తెలుసు కదా.. జాతిపిత... మహాత్మా గాంధీ.. ఆయన గొప్పతనం గురించి ఐదవ తరగతి తెలుగు పాఠంలో తెలుసుకున్నారు మీరంతా. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మనకున్న పీరియడ్లు సరిపోవు. ఇప్పుడు మన రంగా గురించి విన్న తర్వాత నాకో  విషయం గుర్తొస్తోంది. 
"......................"
"... ఓసారి గాంధీజీ ఓ స్కూలుకు వెళ్లారట. ఆయన ఎలా ఉంటారో ఫోటోల్లో  చూశారు కదా... మోకాళ్ళ దాకా పంచె, పైన చొక్కా ఏదీ  ఉండదు...ఓ వస్త్రం కప్పుకొని ఉంటాడంతే... ఆ స్కూల్లో పిల్లలంతా ఆయన గురించి వినడమే గానీ అదే మొదటిసారి చూడ్డం ! అందరికీ వింతగా తోచింది. అందులో ఓ పిల్లవాడికి మరీ విడ్డూరంగా అనిపించింది. 
"అయ్యో ! గాంధీ తాత అంటే చాలా గొప్పగా ఊహించుకున్నానే! కనీసం చొక్కా కూడా లేనంత పేదవాడా !..."
అలా అనుకుని ఊరకే ఉన్నాడా...! వెంటనే ఆయన్ని సమీపించి, 
" మా అమ్మ చొక్కాలు బాగా కుడుతుంది తాతా, 
ఓ చొక్కా నీకోసం అడిగి  తెస్తాను..."
అన్నాట్ట !! ఆయన బోసి నోటితో నవ్వి, 
" అలాగే తీసుకురా... కానీ,  నాకు వేలాది మంది అన్నదమ్ములున్నారు. వాళ్లకు కూడా నాలాగే చొక్కాలు లేవు.మరి...మీ అమ్మనడిగి వాళ్లందరికీ కూడా చొక్కాలు తీసుకురాగలవా? ! వాళ్లకు లేకుండా నేను మాత్రమే చొక్కా వేసుకు  తిరిగితే బాగుండదు కదా..!"
అన్నాడట ! 
" ఏమిటీ ! గాంధీ తాతకు అందరు  అన్నదమ్ములా !"
 ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడంట ఆ  పిల్లవాడు !!
 చూశారా! ఆయన గొప్పతనం ! అన్నదమ్ములంటే ఒకే తల్లి పిల్లలు మాత్రమే కాదు... దేశంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్లే... అనుకునేంత విశాల హృదయం ఆయనది. అందుకే జాతిపిత అయ్యాడు... అందరిచే కీర్తించబడుతున్నాడు ఇప్పటికీ. చనిపోయాక  కూడా జీవించడం అంటే ఇదే... !!"
అని చెప్పి, రంగా  వైపు తిరిగి, 
"... రంగా, చూడు, విన్నావు గదా... మరి నీవు సొంత అన్నతోనే అలా ప్రవర్తించవచ్చా...!"
" సారీ టీచర్... ఇంకెప్పుడూ అలా చేయను. ఇంటికెళ్ళాక మా అన్నకు సారీ చెప్పేస్తాను."
సాధన వాడిని దగ్గరగా తీసుకుని, తల నిమిరింది. అప్రయత్నంగానే వాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒకింత నొచ్చుకుని, 
" చూడండి, రంగా చేసింది తప్పేమీ కాదు. చిన్న వయసులో ఉండే ఓ సహజమైన లక్షణమే. మీరంతా చాలా చిన్న పిల్లలు. నేర్చుకునే దశలో ఉన్నారు. ఏది మంచో, ఏది చెడో తెలుకుంటూ ఉండాలి. గాంధీజీ అంత గొప్పగా మనం ఆలోచించలేకపోయినా... కనీసం మన ఇంట్లో అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో సఖ్యంగా ఉండగలగాలి. అది తెలుసుకోవాలనే గాంధీ గారి గురించి చెప్పాను మీకు. మీరు రంగాను చూసి నవ్వడం, ఎగతాళి చేయడం లాంటివి మాత్రం చేయకూడదు. ఏదైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకోవాలంతే... తెలిసిందా...!"
అంటూ రంగాను ఓదారుస్తూ కూర్చోబెట్టింది. పిల్లలంతా ఓ కొత్త విషయం గ్రహించినట్లు తలలూపారు.
🙂😊👩🙆🙆‍♀️😊🙂👧🙂😊👩🙂😊🙆🙋👧😊



Sunday, June 18, 2023

'జల'జ

😊
       " వేణమ్మక్క పంపించిందమ్మా, పని మనిషి కావాల న్నావంట  కదా... "
 గేటు చప్పుడు విని బయటకొచ్చిన జలజను చూస్తూ చెప్పిందామె. 
" అలాగా.. రా.. " 
 అంటూ జలజ లోపలికి పిలిచిందావిణ్ణి. దాదాపుముప్ఫయి  ఏళ్లు దాటి ఉంటాయేమో ! పొట్టిగా గుమ్మటంలా ఉంది. మనిషి చాలా' స్టైలిష్' గా ఉందనిపించింది జలజకు. . చూస్తే ఇంటి పని చేసే దానిలా అనిపించలేదు ఎందుకో ఆమెకు. రెండేళ్ల నుండి  పని చేస్తున్న భాగ్యవేణమ్మ కూతురి కాన్పు కోసం వెళ్లాలి, మళ్లీ మూడునెలల్లో వచ్చేస్తానంటూ రెండ్రోజుల క్రితం చెప్పి వెళ్ళిపోయింది. ఈలోగా తనకు ఇబ్బంది ఉండకూడదని, తెలిసినావిడ ఉందంటూ, పంపిస్తానని  చెప్పి, తిరిగి వచ్చాక మళ్లీ నేనే చేస్తానని హామీ ఇచ్చి మరీ వెళ్ళింది. ఆవిడే  ఈవిడ అన్నమాట!
    లోపలికి రమ్మని, చేయవలసిన పనులు,  ఇచ్చే జీతం మాట్లాడుకున్నారిద్దరూ. ఉద్యోగిని అయిన జలజకు  ఇంటిపని, బయటపనీ చేసుకోవాలంటే చాలా శ్రమ గా ఉంటోంది. మళ్లీ ఇంత త్వరగా పనా విడ కుదిరినందుకు పొంగిపోయి, అడిగినంతా  ఇచ్చేస్తానని ఒప్పేసుకుని, 
".. ఇంతకీ నీ పేరేమిటి?.. " అనడిగింది జలజ. 
" అనుష్క "
 ఉలిక్కిపడింది జలజ. 
".. ఔనమ్మా, అనుష్క.. "
కళ్లింతలు చేసుకున్న జలజను  చూస్తూమళ్ళీ చెప్పిందామె. 
"..  అదేదో  వేరే పేరు చెప్పిందే వేణమ్మ.. "
".. ఆ.. అలివేలని చెప్పుంటుందిలే... నేనంటే దానికి కుళ్ళు... "
".. అయ్యో, అలాగైతే నిన్నెందుకు పనిలో పెడుతుంది? "
 లోపల అనుకోబోయి, ఠక్కున పైకే  అనేసింది జలజ. 
" ఆ.. మరొకరూ  మరొకరైతే ఇల్లు విడిచి పెట్టడానికి ఒప్పుకోరు కదమ్మ, నేనైతే గమ్మున వెళ్లిపోతానని. "
 వెంటనే అందుకుని చెప్పేసింది. 
" భలే గడుసు దానిలా ఉందే.. " అనుకుంటూ, 
"... సరిసర్లే.. ఏదైతే ఏమి గానీ పేరు చక్కగా ఉందిలే.. ఎవరు పెట్టారింతకీ? "
 నవ్వుతూ అడిగింది జలజ. 
".. టీవీ సీరియల్ లో డాక్టరమ్మ ఇంట్లో పనిమనిషి పేరు ప్రియమణి కదమ్మా, అంతకంటే నేనేమి  తక్కువని అనుష్క అని నేనే పెట్టేసుకున్నానమ్మ.. "
చప్పిడి ముక్కు, గార పళ్ళు...గట్టిగా  రబ్బర్ బ్యాండ్ తోబిగించి కట్టిన పొట్టి జుట్టు,   భూమికి నాలుగడుగులు ఉండీ  లేక.. ఇది అనుష్క!.. "
వస్తున్న నవ్వాపుకుంటూ, 
" అదేమిటి? అలివేలు.. దేవత పేరు... బాగానే ఉందిగా?, "
అంది మళ్ళీ. 
" బాగుందమ్మ, కానీ మరీ బొత్తిగా పాత పేరు. మొరటుగా కూడా ఉంటుందని.. "
నెత్తి గీరుకుంటూ నసిగింది. దీంతో ఇక ఎక్కువ మాటలు ఎందుకులే అనుకుని, లేస్తూ అడిగింది, 
" సరేలే.. పన్లోకి  రేపటినుంచి  వస్తావా? "
" రేపటి దాకా ఎందుకు? ఇప్పుడే మొదలెట్టనూ .. "
అంటూ తనూ  లేచి  మూలనున్న  చీపురు అందుకుంది. 
' అమ్మయ్య,.. వంటింట్లో సింకులో అంట్ల గిన్నెల బాధ తప్పిందన్నమాట..."
అనుకుంటూ లోనికి  దారితీసింది జలజ. 
                         **    **      **
      మరుసటి రోజు ఉదయం వంటావార్పు పూర్తి చేసుకుని రెడీ అయింది జలజ. భర్త, పిల్లలు అరగంట క్రితమే వెళ్లిపోయారు. అలివేలు...అదే.. అదే ..అనుష్క.. ఇల్లు తుడవడం ఆఖరి దశలో ఉంది. మరో పావు గంటలో బ్యాగ్ తగిలించుకుని, తాళం తీసుకుని బయటికొచ్చింది జలజ. సరిగ్గా అప్పుడే పని ముగించుకున్న అలివేలు ఇల్లు తుడిచిన నీళ్ల బకెట్ తెచ్చి, ముందుకూ వెనక్కూ ఓ ఊపు ఊపి కాంపౌండ్ లో ఓ మూలనున్న స్థలం కేసి దబ్బుమని చల్లేసింది. అంతే ! జలజలా వర్షం కురిసినట్లుగా నీళ్లన్నీ అక్కడున్న ఎండిపోయిన  చెట్టుమీద ఒక్కసారిగా పడిపోయాయి. బకెట్ తీసుకుని లోపలికెళ్లబోతూ అటు వైపు చూసి, 
" అమ్మా, ఈ చెట్టు బాగా ఎండిపోయింది, పీకి పారేయండి.."
అని ఓ  ఉచిత సలహా పారేసింది. ఆ మాటతో అటువైపు అప్రయత్నంగా దృష్టిసారించింది జలజ.  ఒక్క క్షణం ఆమె మనసంతా అదోలా అయిపోయింది.
" అరె ! ఎంత పొరపాటయిపోయింది ! పని వత్తిడిలో పడిపోయి రెండు వారాలుగా  అటువైపు చూడ్డమే లేదు. ఇంతలో ఇలా అయిపోయిందేమిటి  !..."
అచేతనంగా నిలబడిపోయింది జలజ. తనకు మొక్కలంటే చాలా ఇష్టం. చిన్న ఇల్లు. అదీ  అద్దె ఇల్లు.. అయినా ఉన్న కాస్త స్థలంలో ఓ అరడజను తొట్లు తెచ్చి, వాటిల్లో క్రోటన్లు, పూల మొక్కలు నాటి, అవన్నీ కాంపౌండ్లో ఓవైపు సర్దేసింది.   రోజూ వాటికి  నీళ్లు పోయడం తనకలవాటు. మరో మూల ఎందుకో   కాస్త స్థలం వదిలేశాడు ఓనరు. ఓసారి తన కొలీగ్ ఇంట్లో ఓ పూల మొక్క చూసి ముచ్చటపడి, చిన్న మొలక తెచ్చి ఆ ఖాళీ స్థలంలో నాటేసింది  జలజ. వర్షాకాలం అయినందువల్లో  ఏమో... ప్రత్యేకించి నీళ్లుపోయక  పోయినా  అది కాస్తా నిలదొక్కుకుని కొద్ది రోజుల్లోనే ఏపుగా పెరిగి, పూలు పూయడం మొదలెట్టింది. కనకాంబరం రంగులో చిన్న చిన్న పూలు !! సంవత్సరం క్రితం నాటిన ఆ మొక్క బాగా పెద్దద యిపోయి ముచ్చటగొలుపుతూ  చాలా అందంగా కనిపిస్తూ ఉండేది. 
     అసలే ఎండాకాలం. ఒక్కరోజు నీళ్లందకపోతే నీరసించి, వేలాడిపోతాయి మొక్కలు.  ఎలాగోలా తొట్లకు పోస్తోంది గానీ మరో మూల నుండే ఆ పూల మొక్కను అశ్రద్ధ చేసేసింది. దాని ఫలితమే ఇదన్నమాట !
" సరే, ఏం చేస్తాం. ఆఫీసు నుండి వచ్చేటప్పుడు మరో మొక్క ఏదైనా కొని తెచ్చి, అక్కడే నాటేస్తాను.. "
తనను తాను ఓదార్చుకుని లోనికెళ్లి పోయింది  జలజ. అనుకుందేగానీ పనుల ఒత్తిడితో సతమతమ వుతూ జలజ ఆ సంగతి తాత్కాలికంగా పక్కనపెట్టేసింది. మరో రెండు వారాలు గడిచిపోయాయి. ఆ రోజు ఉదయం రెడీ అవుతున్న జలజకు ఠక్కున గుర్తొచ్చింది మొక్క సంగతి.
" ఈరోజు ఎలాగైనా సాయంత్రం వస్తూ వస్తూ ఏదైనా పూల మొక్కతేవాల్సిందే.. "అని గట్టిగా అనుకుంది.
 అలివేలు..అహ.... కాదు కాదు అనుష్క.. ఇల్లు తుడవడం పూర్తిచేసి, బకెట్ నీళ్లతో బయటికి వచ్చి, అలవాటు ప్రకారం నీళ్లను మూలకు చల్లేసి, అటువైపయినా చూడకుండా లోపలికి తుర్రుమంది. సరిగ్గా అప్పుడే బయటికొచ్చిన జలజ చూపు అటు వైపు మరలింది. ఆశ్చర్యం ! ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేక పోయింది. మూలనున్న ఆ ఎండిన మొక్క నిండా పచ్చని ఆకులు !! పులకించిపోయి, పరుగున వెళ్ళి దగ్గరగా నిలబడి పరిశీలించింది. సందేహం లేదు. అదే పూల మొక్క ! చివుళ్ళు  వేసి, నిండా ఆకులతో అక్కడక్కడా మొగ్గలతో కళకళలాడుతోంది.
"  మై గాడ్! ఇదెలా సాధ్యమైంది? చచ్చిపోయింద నుకున్నానే ! "
మరుక్షణంలో ఆమె బుర్రలో తళుక్కున మెరిసింది అలివేలు... ప్రతిరోజూ ఇల్లు తుడిచిన నీళ్లు ఆ మూలకు చల్లేయడం! బాప్ రే ! అదా  సంగతి! ఆ నీళ్లతో వాడిపోయిన ఈ మొక్క బతికి బట్టకట్టిందన్న మాట !
" ఔరా!జలమహిమ!"
అబ్బురమనిపించింది జలజకు. నీళ్ళే కదా అనుకుంటాం గానీ వాడి ఎండిపోతున్న మొక్కల్ని సైతం పునరుజ్జీవింప జేయగల శక్తివంతమైన టానిక్ ఈ నీరన్న మాట!దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ మొక్కే ! తెలిసొచ్చింది జలజకు. 
 ఇంకా నయం! ఆ రోజే వెంటనే పీకి  పారేశాను గాదు. చూడచక్కని పూల మొక్క...ఎండి పోయినందుకు ఎంత బాధ పడిందా రోజు ! ఎప్పుడూ విపరీతంగా తిట్టుకునే తన పని ఒత్తిడి పై మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేనంత ఇష్టం కలిగింది జలజకు. 
  " ఇంతకీ.. అనుష్కకి చెప్పుకోవాలి  థాంక్స్..."
అంతవరకూ అలివేలు గానే తప్ప అనుష్క గా 'యాక్సెప్ట్ ' చేయని జలజకు  ఉన్నట్టుండి ప్రేమ పొంగి పోయింది పనావిడ మీద. 
                 **     **       **      **
  చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఆదివారం. పనవగానే వెళ్తూ వెళ్తూ  చెప్పింది అలివేలు, 
" అమ్మా, వేణక్క బిడ్డ కాన్పయిందంట. మనవడు  పుట్టాడంట. ఈ నెలాఖరుకల్లా వచ్చేస్తాదంట.... "
"... అమ్మా, వేణక్కొస్తే నేవెళ్ళిపోతా గదా.... నీవి రెండు పాత చీరలేవైనా.... ఇవ్వండమ్మా.. "
 మెల్లిగా నసుగుతూ కోరిక వెలిబుచ్చింది. నవ్వుకుని, 
" నీకు పాత  చీరేంటి, కొత్తదే ఇచ్చుకుంటాలే "
అని లోలోపల అనుకుంది జలజ. నిజానికి వేణమ్మ కంటే అలివేలే  హుషారుగా పనిచేస్తోంది. ఉన్నంతసేపు గలగలా మాట్లాడ్తూ సందడి చేస్తూ ఉంటుంది. పైగా ఉదయం చాలా తొందరగా వచ్చేస్తుంది. అదో వెసులుబాటు తనకు.మొదట్లో చూడంగానే, 
" ఇదేం పని చేసే బాపతులా లేదే "
అనుకుంది గానీ త్వరలోనే తన అభిప్రాయం తప్పని నిరూపించింది అలివేలు.  తను వెళ్ళి పోతుందనుకుంటే జలజకు ఏదో వెలితిగా అనిపిస్తోందిప్పుడు.  మూడు నెలల సమయమే అయినా ఎంతో దగ్గరయినట్టుంది అలివేలు. కానీ పాత పనావిడ వేణమ్మను వద్దనలేదుగా ! మరో విషయం ఏంటంటే...ఆకులతో పోటీ బడుతూ విరగగాస్తున్న పూలచెట్టును చూస్తుంటే  తనకే  తెలియకుండా ఆ  పూల మొక్కకు పునర్జన్మ నిచ్చిన అలివేలంటే ఏమిటో ప్రత్యేకమైన అభిమానం పుట్టుకొచ్చింది జలజకు. 
                **       **       **         **
     నెలాఖరు వచ్చేసింది. మరుసటి రోజు నుండీ పనిలోకి వస్తానని వేణమ్మ  కబురు పంపింది. రోజులాగే పనంతా ముగించుకుని చేతిలో బకెట్ తో బయటకు వచ్చింది అలివేలు. యధాలాపంగా నీళ్లు మూలన గుమ్మరించేసి లోపలికి పోబోతూ అనుకోకుండా  అటువైపు చూసింది.
"..అమ్మా, నువ్వు మళ్ళీ నాటావు  కదా, ఈ మొక్క ! అప్పుడే ఎంతగా పెరిగిందో చూడు!పూలు కూడా పూస్తోంది.. ."
 అంటూ జలజ  వైపు చూసింది, కళ్లింతవిగా చేసి. 
" పిచ్చి మొద్దూ, అది  ఆ ఎండిన మొక్కే. పీకేయమన్నావు గదా, కానీ... రోజూ  నీవు పోసే నీళ్ళతో మళ్ళీ ఇలా తయారైంది.."
అని  నవ్వేసింది జలజ.
" ఔనామ్మా.... "
బుగ్గలు నొక్కుకుంది అలివేలు.మరో పది నిమిషాల్లో పనంతా పూర్తి చేసి,  
" అమ్మా, వెళ్తానమ్మా. రేపు వేణక్క వస్తుంది... "
చేతులు తుడుచుకుంటూ వచ్చి చెప్పింది అలివేలు. 
" సరేగానీ ఇలారా... "
అంటూ లోపలికి పిలిచి ఓ ప్యాకెట్ చేతిలో ఉంచింది జలజ. తెరిచి చూసి, 
"..కొత్త చీర ! అయ్యో, పాతది చాలమ్మ నాకు.... "
అంటూ మొహమాటపడింది. 
"... అవి కూడా ఉన్నాయిలే.. ఇదిగో.. "
అంటూ మరో పాకెట్ అందించింది.దాంతోపాటు ఆనెల జీతం డబ్బులు !  అలివేలు ముఖంలో ఎన్నడూ ఎరగని ఆనందం ! కోరకనే ఒళ్ళో వచ్చిపడ్డ బహుమతులు !రెండు పాకెట్లూ ఒక చేత్తో, మరోచేత్తో డబ్బులూ  పట్టుకుని, 
" ఎప్పుడు ఏ పని బడినా కబురు పెట్టమ్మా. చిటికెలో వచ్చి వాలిపోతా...మర్చిపోకమ్మా...ఎల్లొస్తా "
అనేసి ముఖం మతాబులా వెలిగిపోతుండగా గేటు తీసుకుని క్షణాల్లో అదృశ్యమై పోయింది అలివేలు... అహహ... కాదు కాదు... అనుష్క !!  
                    🌷🌷🌷🌷🌷🌷🌷




                  













Sunday, June 11, 2023

"అమ్మా, నువ్వు ఏదైనా అవ్వాలనుకుంటున్నావా?"...రైటర్ పద్మభూషణ్

 🌷
      ప్రస్తుతం థియేటర్లలో సినిమా చూడడమన్నది బాగా తగ్గిపోయింది. ఒకప్పుడయితే రిలీజ్ అయిన ప్రతి సినిమా... అది ఎలాంటిదైనా సరే చూసేవాళ్ళం. రాను రానూ ఏ నెలకో,  రెండు నెలలకో ఓసారి అన్నట్టు తయారయాం. ఆపిదప...మావరకూ  సెలెక్టెడ్ గా చూసి తీరాలి అనిపించిన వాటిని మాత్రమే చూడడానికి అలవాటు పడిపోయాం  మేము. ఇక కరోనా వచ్చి, జనాల్ని పలకరించి, నానా బీభత్సం సృష్టించాక బయటకి వెళ్లి సినిమా చూడడం అనేది పూర్తిగా అదృశ్యం అయిపోయింది. చెప్పాలంటే ఆ కోరిక చచ్చిపోయింది అనాలేమో !
     అయితేనేం ! మనకు మన టీవీ ఉందిగా !  ఆ లోటు ఫీల్ కాకుండా... అన్నీ  ఇంట్లోనే కూర్చుని పైసా  ఖర్చు, శ్రమా లేకుండా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా వీక్షిస్తూనే ఉన్నాం. సరే, ఈ సోదంతా ఎందుకూ అంటారేమో ! అదే చెప్పబోతున్నా... 
    అలా చూస్తున్న వాటిలో కొద్దిరోజుల క్రితం నేను చూసిన 'రైటర్ పద్మభూషణ్' మూవీ ఒకటి. ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం... అంతే...! అప్పటి వరకే...! వారం దాటితే ఏదీ  గుర్తుండదు. కానీ హృదయానికి హత్తుకునేవి, కొంతకాలం వాటి గురించే ఆలోచిస్తూ ఉండేలా చేసేవి బహు  అరుదు. అలాంటి కోవ లోకి వస్తుందీ మూవీ ! అంత గొప్పగా ఏముంది అంటారేమో ! దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించిన ఓ కాన్సెప్ట్... బహుశా ఇదివరకు ఎవరూ  టచ్ చేయని అంశం (నాకు తెలిసినంతవరకూ)  అని నా వ్యక్తిగత అభిప్రాయం.
    తల్లిదండ్రులు కూతుళ్లను  గారాబంగా పెంచుతారు. కోరిన చదువు చెప్పిస్తారు. వారిలో ఏవైనా ప్రతిభా పాటవాలు గమనిస్తే ఉప్పొంగిపోయి ప్రోత్సహిస్తారు. అందులో నిష్ణాతులు అవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ... అదంతా ఆ పిల్లకు పెళ్లి చేసి ఓఅయ్య చేతిలో పెట్టేసి,  అత్తారింటికి పంపించేదాకే..! ఆ పిదప... ఆ ఇంటి వాళ్ళ ఇష్టం... ముఖ్యంగా భర్త అన్నవాడి చేతిలోకే  ఆమె భవితవ్యం పూర్తిగా జారిపోతుంది అన్నది నగ్న సత్యం. పెళ్లికి ముందున్న ఆమె ఆశలు, ఆశయాలు, కలలు, అభిరుచులు భర్త గుర్తించి, ప్రోత్సహించి చేయూతనిస్తే ఓకే.. ఆమె అంత అదృష్టవంతురాలు మరెవరూ  ఉండరు కచ్చితంగా. కానీ అది మృగ్యమైతే...! అన్నీ అణగార్చుకుని,  ఓవిధంగా చంపుకుని నిస్తేజంగా బ్రతుకీడవాల్సిన దురవస్థ ! నాలుగు గోడల మధ్య వండి వార్చుతూ కేవలం పిల్లల్ని పెంచి పెద్ద చేసే ఓ యంత్రంలా మారిపోవాల్సి వస్తుంది. భర్తలో ఉన్న నైపుణ్యాల్ని చూసి భార్య ఎంతో సంతోషపడుతుంది. అతను ఉన్నత స్థాయికి చేరుకోవడానకి తనూ  ఓ చేయి వేస్తుంది. భర్త అనుకున్నది సాధిస్తే ఆమె కన్నా గర్వించే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ.. మరి ఎంతమంది భర్తలు భార్య గురించి అలాగే ఆలోచిస్తున్నారు !!? 
     భార్య ఓ  గాయని అయితే గుర్తించరు. ఓ కళాకారిణి అంటే గౌరవించరు. ఓ రచన చేస్తే ఎగతాళి చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఆమె వ్యక్తిత్వానికి విలువ అన్నదే ఇవ్వరు. అదే భర్త తండ్రిగా మారినప్పుడు కూతుర్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తాడు. అందుకోసం ఎంతైనా ఖర్చుకు వెనుకాడడు. రేపు ఆ పిల్లకు పెళ్లయ్యాక తన అల్లుడూ తనలాగే ప్రవర్తిస్తే తన కూతురి పరిస్థితి ఏమిటి ? ఈ ఆలోచన ఆ తండ్రి మస్తిష్కంలో మెదలదు. 
    మూవీలో ఈ సున్నితమైన అంశాన్ని  స్పృశించిన తీరు నాకు చాలా నచ్చింది. భార్య, భర్త, కొడుకు... ఈ మూడు ముఖ్యపాత్రల మధ్య నడిచే  చక్కటి కథనం. కొడుకు ఓ సాహిత్యాభిలాషి. తనయొక్క ఓ  రచనను స్వయంగా పబ్లిష్ చేసి అమ్మజూపితే ఎవరూ కొనేవాళ్లే ఉండరు. ఉచితంగా ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉండదు. కొడుకు దీనస్థితి చూసిన తల్లి తనకున్న ఒకప్పటి అభిరుచి...అదే...రాసే అలవాటుతో తనే స్వయంగా ఒక కథ రాసి పుస్తకంగా  పబ్లిష్ చేసి దానికి రచయితగా కుమారుని పేరు పెట్టి, అతని ఫోటో అందులో వేయిస్తుంది. ఆ పుస్తకం చాలా ప్రాచుర్యం పొంది కొడుకుకు రచయితగా గుర్తింపు వస్తుంది. కానీ... అతనికి తెలుసు...అది తను రాయలేదని.! ఎవరు వ్రాశారా  అని తెలుసుకునే ప్రయత్నంలో... ఒకానొక సందర్భంలో అసలు విషయం తెలుసుకుంటాడు.             అంతే... తల్లి పట్ల అతని హృదయం ఆర్ద్రత తో  నిండిపోతుంది. తల్లి రుణం తీర్చుకోవడానికా అన్నట్లు ... స్వయానా రాయగలిగిన అతను ఓ రచన  చేసి,పబ్లిష్ చేసి, దానికి రచయిత్రిగా తల్లి పేరుతో పాటు ఆమె ఫోటో అందులో వేయిస్తాడు. ఈ సస్పెన్స్ సినిమా చివర్లోనే తెలుస్తుంది. ఆ పుస్తకావిష్కరణ జరుగుతున్నప్పుడు ఆహూతులందరిలో ఓరకమైన భావోద్వేగం!! 
  ఒకాయన వెంటనే తన భార్యకు ఫోన్ చేసి, ఆమెనో  మాట అడగాలనుకుంటున్నాను అని పక్కనున్న అతనితో అంటాడు. ఓ చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి  ఫంక్షన్ లో ఉన్న వాడి తల్లిని కొంగు పట్టి లాగుతూ అడుగుతాడు...
".. అమ్మా, నువ్వు ఏదైనా  అవాలనుకుంటున్నావా? "
అని !! ఆ తల్లి ఉప్పొంగిపోయి పిల్లాడిని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది.ఐదారు నిమిషాల వ్యవధిలో వీక్షకుల కంటతడి పెట్టించే సీన్స్ఇవి రెండూ!
    పెళ్లయ్యాక ప్రతీ భర్త తన భార్య అభిరుచులు గుర్తించి ప్రోత్సహిస్తే ఎంత బాగుంటుంది ! పెళ్లి తర్వాత కూడా ఆమెకో వ్యక్తిగత జీవితం అంటూ ఉంటుంది కదా! కొందరు అమ్మాయిలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా పెళ్లి తర్వాత అత్తింటి  వారికి ఇష్టం లేదనీ, భర్త వద్దన్నాడనీ మానేసి ఇంటికే పరిమితమౌతూ ఉంటారు. మరి చిన్నతనం నుండీ  పెళ్లి వరకూ ఆమె పడ్డ శ్రమంతా వృధాయేనా !? ఇంట్లో ఒప్పించి, తమ కోరిక తీర్చుకునే వారు ఉండరని కాదు...ఉంటారు.. కానీ చాలా అరుదు. అంతటి నేర్పు, దృఢ సంకల్పం అందరికీ ఉండవు కదా! ఇంట్లోవారి సపోర్ట్ కోసమే చూస్తారంతా...ముఖ్యంగా భర్త ఆసరా కోసం !
     తల్లి తన పిల్లల్లోని టాలెంట్స్ ని చూసి సంబరపడిపోతుంది. పదిమందికీ  చెప్పుకొని మురిసిపోతుంది. మరి పిల్లలు !! పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు... ఇంకా... ఇంట్లో వాళ్లని ఇంట్లో వాళ్ళు మెచ్చుకోరు, గుర్తించరు అన్నచందాన తల్లిని ఏ మాత్రం పట్టించుకోరు.
  దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఎంచుకున్న కథాంశం చాలా ప్రత్యేకమైనది. మొదటి సగం  పెద్దగా ఆకట్టుకోలేక పోయినా, రెండవ సగం కాస్త ఊపందుకుని క్లైమాక్స్ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. కానీ.. ఫ్లాష్ బ్యాక్  లో చూపే సన్నివేశాలు తొందర తొందరగా క్షణకాలం పాటు మాత్రమే చూపించడం జరిగింది. కథలో కీలకమైన అంశం వీక్షకులకు చేరాలంటే ఆ సన్నివేశాలు కాస్త విశదంగా, బలంగా  చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అదే కథకు ఆయువుపట్టు కాబట్టి! (ఈమధ్య చాలా సినిమాల్లో గమనిస్తున్నదిదే. అతి ముఖ్యమైన ఫ్లాష్ బ్యాక్ సీన్లను టపటపా తిప్పేయడం! వీక్షకులు ఓ క్షణం చూపు మరలిస్తే చాలు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి !) అనవసరమైన వాటికి ప్రాధాన్యత తగ్గించి, ఇలాంటి అవసరమైన వాటికి చోటిస్తే బాగుంటుంది. 
     అమ్మ పాత్ర పోషించిన రేవతి చక్కని నటి. రచయిత్రిగా ఆమె పాత్రను మరి కాస్త విస్తృతపరిచి మరికొన్ని సన్నివేశాలు జోడించి ఉంటే బాగుండేది. రచన పట్ల ఆమెకున్న తృష్ణ, ఎందుకు దాన్ని  పక్కన పెట్టేయాల్సివచ్చింది... ఇలాంటి సన్నివేశాలు కొన్ని సృష్టించి ఉండాల్సింది. సుహాస్ ! చక్కని కనుముక్కు  తీరు, ఒడ్డు పొడుగూతో పాటు నటనాకౌశలం, నాట్యంలో ప్రావీణ్యం కూడా ఉన్న ప్రతిభగల నటుడు. మేకప్ కు దూరంగా మధ్య తరగతి కుర్రాడంటే ఇలాగే ఉండాలి... అది సినిమా అయినా సరే.. ! అన్నట్లుగా ఉన్నాడు. ఆ సహజత్వమే  ఆ పాత్రకు, అతని నటనకు వన్నె తెచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
    ఇది సినిమా రివ్యూ మాత్రం కాదు. మూవీలో అంతర్లీనంగా అందించబడ్డ ఓ చక్కటి సందేశం నచ్చి రాయాలనిపించింది. ఏది ఏమైనా.. జీవితాన్ని పంచుకున్న భార్యకూ, జన్మనిచ్చిన అమ్మకూ ఆమె అభిరుచి మేరకు ఓ స్థానాన్ని, ఓ స్థాయినీ కల్పించాలి అన్నది ఎంత చక్కని ఆలోచన !! దర్శకుని అభిరుచి, చేసిన ప్రయత్నం ఎంతేని అభిలషణీయం కదా !
      పెళ్లి తర్వాత ఆమె చురుకుదనం, ఆసక్తులూ గమనించి ఆమెను ప్రోత్సహించి, సివిల్స్ కు ప్రిపేరయ్యేలా చేసిన ఓ భర్త గురించి వార్తాకథనం చూశాను. డిగ్రీ దాకా చదివిన భార్యను పెళ్లి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా B Ed పూర్తి  చేయించి ఆమె ఓ మంచి ఉద్యోగంలో ప్రవేశించేలా చేసిన భర్త గురించీ విన్నాను. వారికీ, అలాంటి విశాల దృక్పథం గల అందరికీ జోహార్లు. 
    అలాగే...పిల్లల ఉన్నతి కోసం తమ కెరీర్ ను సైతం త్యజించి అహర్నిశలూ వారి బాగోగులు చూస్తూ అన్నీ అందిస్తూ వారి బంగారు భవితకై నిచ్చెనలై పోతున్న 'అమ్మ'ల  గురించి పిల్లలు కూడా కాస్తో కూస్తో ఆలోచిస్తే ఎంత బాగుంటుంది !!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
  

 

Monday, June 5, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే !..17.. మోచేతి నొప్పి

🌺

 హైస్కూల్లో చదివేరోజుల్లో మా సైన్స్ టీచర్ గారి గురించి ఇదివరలో ఓ పోస్ట్ లో ప్రస్తావించాను. సన్నగా, పొడవుగా కళ్ళద్దాలతో చాలా హుందాగా ఉండేవారు. ఆవిణ్ణి ఎప్పుడూ సీరియస్ గా ఉండటమే చూశాం మేము. మిగతా టీచర్లతో కూడా ఎప్పుడూ కలివిడిగా మాట్లాడ్డం మా కంటబడలేదు. 
    ఆవిడ క్లాసులో అడుగు పెట్టబోతుండగానే అంతవరకూ రణగొణధ్వనులతో నిండిన వాతావరణం ఒక్కసారిగా చప్పున చల్లారి సైలెంట్ గా అయిపోయేది.  రాగానే వెంటనే చాక్ పీస్ తీసుకుని, 
" ఈరోజు టాపిక్... "
అంటూ వెంటనే బోధన మొదలెట్టేది. అంతా pindrop silence ! చెప్పేది తలకాయలూపుతూ బుద్ధిగా వినడమే తప్ప...ప్రశ్నలు వేయడంగానీ, మాటకు ఎదురు చెప్పడంగానీ... ఉహూ..అసలుండేది గాదు. ఆవిడ మొహంలో చిరునవ్వుకోసం  ఎదురుచూసేవాళ్ళం... !సాధ్యపడేది గాదు. అలాంటి ఆ టీచర్ గారు ఒకరోజు యధావిధిగా క్లాసులోకి వచ్చారు.  
" ఈరోజు టాపిక్.. 'కీళ్లు'...joints "
అంటూ బ్లాక్ బోర్డు మీద హెడ్డింగ్ రాసి, అందరివైపు చూస్తూ మొదలెట్టారు. కీళ్లలోని రకాలు చెప్తూ, మోచేతి కీలు గురించి వివరించబోతూ ఒక్క క్షణం ఆగారు. చప్పున ఆమె పెదాలపై సన్నగా నవ్వు! మేమంతా షాక్! ఆ నవ్వును కొనసాగిస్తూ, 
" ఈ మోచేతి కీలు గురించి చెప్పేముందు, ఓ చిన్న పిట్ట కథ గుర్తొస్తోంది నాకు... అదేంటంటే..."
అంతా నిటారుగా అయిపోయాం ! ఈవిడ  నోటి నుండి కథ ! చెవులు రిక్కించాం. అందరిలో ఉత్కంఠ !
"...ఒకమ్మాయికి కొత్తగా పెళ్లయింది. సరే... అత్తారింటికి వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత ఆమె తండ్రి కూతురు ఎలా  ఉందో చూసొద్దాం అనుకుని ఆమె అత్తారింటికి వెళ్ళాడు. ఎలా ఉందమ్మా కొత్త కాపురం అని అడిగాడు... ఆ పిల్ల... ఎలా ఉండడమేంటి  నాన్నా... చాలా బాగా ఉంది. ఎంత బాగా అంటే... హఠాత్తుగా మోచేతికి ఏదైనా తగిలితే, ఎంత ఆనందంగా ఉంటుందో అంత హాయిగా అన్న మాట..!అని  చెప్పింది. ఆ తండ్రి.. ఆహా ! నిజంగా అంత సంతోషంగా ఉందన్నమాట నా బిడ్డ.. ! మరేమీ పరవాలేదు.. అనుకుంటూ గుండెల నిండా సంతోషం నింపుకుని ఇల్లు చేరాడు. కొన్ని రోజుల తర్వాత... ఇంట్లో నుండి బయటకు గబగబా వస్తూ ఉన్న ఆయన మోచేయి అనుకోకుండా గోడకు గట్టిగా కొట్టుకుంది. అంతే! నొప్పితో ప్రాణం గిలగిలలాడిపోయిందాయనకి!
తాళలేక గట్టిగా మోచేతిని పట్టుకొని కూర్చుండిపోయాడు.. హఠాత్తుగా ఆయనకి కూతురు మాటలు గుర్తొచ్చాయి. మోచేతికి  దెబ్బ తగిలితే ఇంత నొప్పిగా ఉంటుందా ! ఇంత వయసాచ్చింది నాకు... ఈ విషయం ఇప్పటిదాకా తెలియలేదేంటి ! అంటే నా కూతురు అత్తింట్లో అంత బాధ పడుతోందన్నమాట !! అప్పటికి గానీ ఆ అమాయకపు తండ్రికి కూతురి మాటల్లోని అంతరార్థం బోధపడలేదు... ! అదీ  సంగతి! "
కథ ముగిసింది. గుడ్లప్పగించి చూస్తోన్న మేమంతా  రిలాక్స్ అయిపోయి, తేరుకుని,  వెంటనే ఒక్కసారిగా చప్పట్లు కొట్టాం... కథ గురించి కాదు.. మా సైన్స్ టీచర్ కథ చెప్పారు.. అదీ... నవ్వుతూ... ! అందుకని అసంకల్పితంగానే వచ్చేశాయి ఆ కరతాళధ్వనులు !వెంటనే గలగల నవ్వులు!! శృతి కలుపుతూ మా టీచర్ గారు!
    అంతే... ఆ రోజుతో సరి! మళ్లీ మామూలే.. ఆ సీరియస్నెస్సే ! మళ్లీ అలాంటి సందర్భం వస్తుందా! మళ్లీ ఆ నవ్వు చూడగలమా ! అని ఎదురు చూడడమే గానీ... మా ఆశ అయితే ఫలించలేదు. ఒకే ఒక్క కథ అయినందుకో  ఏమో... ఆమె చెప్పిన ఆ కథ మెదడులో అలా హత్తుకుని పోయింది ఈనాటికీ... ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కూడా... కథతో  పాటు ఆ టీచర్... ఆ జ్ఞాపకమూనూ !!
******************************************