Saturday, May 30, 2020

వినిపించని రాగాలు.....

🌺🌷🌺🌷🌺🌷🌺🌷
                🌺🌹🌺🌹🌺🌷

ఉప్పొంగే ఊహల ఊసులు 
భాషకు అందని భావాలై 
అలలు అలలుగా సాగి 
వినిపించని రాగాలై 
కనిపించే అక్షరాలుగా మారి 
పరుగులు తీస్తూ 
నా హృదయపు తంత్రుల్ని మీటి 
పరవశింపజేస్తున్నాయే !
ఇది నిజమా? 
ఔను నిజమే అంటూ 
అదిగో ! మరో భావవీచిక !
నా గుండె తలుపు తట్టుతోంది 
మస్తిష్కంలో జొరబడి 
వినిపించని రాగాలేవో 
పలికిస్తోంది మరి  !!

🌺🌹🌺🌹🌺🌹🌷🌹🌷🌹🌷🌹🌺🌹
🌺🌹🌺🌹🌺🌹🌷🌹🌷🌹🌺🌹🌷🌹

Tuesday, May 26, 2020

ఇక చాలు... విరమించు......

ఎక్కడ పుట్టావో ? 
ఎలా పుట్టావో ? 
ఇలనంతా ఆవరించావు !
మానవాళిని కబళిస్తూ 
మరుభూమిని తలపిస్తున్నావు !
వందలు వేలు లక్షలు !
ఇంకా తీరలేదా నీ దాహం !
ఇంకెన్నాళ్లీ రాక్షసత్వం !
ఇకచాలు
విరమించు 
నీ విజృంభణ !
మనుషులంతా మేల్కొన్నారు 
ప్రాణభయమే కావచ్చు 
పాఠాలెన్నో నేర్చుకున్నారు 
ప్రకృతిని శాసించడం కాదు 
ప్రేమించడం గౌరవించడం 
ప్రధానమన్న పచ్చినిజం 
గ్రహించి పొందారు జ్ఞానోదయం !
అందుకే ----
ఇకచాలు 
విరమించు 
నీ విజృంభణ !
ఈ పాఠాలే గుణపాఠాలై 
దారిచూపే దివిటీలై 
రేపటిదారులు సుగమమై 
ఓ సరికొత్త ప్రయాణం 
సాగుతుందని చేస్తున్నాం ప్రమాణం !
అందుకే ---
చాలు, విరమించు 
నీ విజృంభణ !
ఇక అందుకో 
మా వీడ్కోలు !!

***********************************
యం. ధరిత్రీ దేవి 
***********************************

Sunday, May 24, 2020

' కరోనా ' మరణం

     అదో పల్లెటూరు. ఆ ఊర్లో ఓ ఇంటి ముందు ఓ పదిహేను మంది దాకా విషణ్ణ వదనాలతో దూర దూరంగా నిలబడి ఉన్నారు. లోపల ఓ నలుగురు ఆడవాళ్ళు కన్నీళ్ళొత్తుకుంటున్నారు. ఇంటికి ముందు భాగంలో చాప మీద ఆ ఇంటి యజమాని విశ్వేశ్వర రెడ్డి గారి భౌతిక కాయం! ఓ పక్కగా కన్నీళ్లు ఇంకిపోయి ఆయన భార్య రుక్మిణమ్మ ! ' లాక్ డౌన్ ' పుణ్యమాని సమీప బంధువులు కూడా రాలేక ఎక్కడి వాళ్ళు అక్కడే ఇరుక్కు పోయారు. సాయంత్రం ఆరు గంటలకంతా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇంట్లో రుక్మిణమ్మ మరో నలుగురు బాగా దగ్గరి బంధువులు మిగిలారు. 
                     ++++++++++++++
          ఇంతకీ, రెడ్డి గారి ఆఖరి ప్రయాణం ఎందుకింత విషాదంగా ముగిసింది? ఆయనేమన్నా ఓ అనామకుడా? ఊర్లో అందరికీ సరిపడని వాడా? లేక ఎవరికీ ఏమీ కాని వాడా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం' కాదు ' అనే!
       ఆయన ఊర్లో పెద్ద మోతుబరి. అందరికీ లేదనకుండా సాయం చేసే వ్యక్తి. పైగా ఓ సారి సర్పంచి పదవి కూడా నిర్వహించిన వాడే! ఇక ఆయన సతీమణి రుక్మిణమ్మ చేతికి ఎముక లేని మనిషి! మరెందుకిలా? 
    రెణ్నెల్ల క్రితం రెడ్డి గారు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్లారు. తీరా అక్కడినుంచి వచ్చేద్దాం అనుకునేంతలో ' కరోనా ' వైరస్ విజృంభించి లాక్ డౌన్ ప్రకటించడంతో వెంటనే రాలేకపోవడం, ఆ తర్వాత ఎలాగోలా రకరకాల వాహనాల్ని పట్టుకుని టౌన్ దాకా చేరుకోవడం జరిగింది. కానీ అక్కడే చిక్కొచ్చిపడింది. దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్లందరినీ వెంటనే అక్కడే ఆపేసి తీసుకొనిపోయి టెస్టులు చేయించే నెపంతో క్వారంటైన్ లో ఉంచేశారు. అందులో ఈయనా ఒకరు. పధ్నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరీక్షలంటూ మరికొద్ది రోజులు అక్కడే ఉంచేశారు. అటు పిమ్మట డిశ్చార్జి చేశారు, కానీ ఈ లోగా ఈ వార్త దావానలంలా ఆ పల్లెటూర్లో పాకిపోయింది. 
                  +++++++++++++++++
     చాలా రోజుల తర్వాత రెడ్డి గారు తన వెంట ఒక పెద్ద సూట్ కేసు, మరో చిన్న బ్యాగు పట్టుకుని ఊరి పొలిమేరలో దిగారు. అక్కడ దారికి అడ్డంగా పెద్ద ముళ్ళకంచె కనిపించింది, బయటి వాళ్లెవరూ ఊర్లోకి రాకుండా. రెడ్డిగారు చుట్టూ చూశారు, మనిషి జాడ లేదు. ఎలాగోలా సందు చేసుకుని కంచె దాటి, ఊర్లో అడుగుపెట్టారాయన. అక్కడక్కడా ముగ్గురు నలుగురు కనిపించారు కానీ, తన దగ్గరికి ఎవరూ రాలేదు. ఇదివరకైతే తను కనిపించగానే పదిమంది దాకా పరుగున వచ్చి, చేతిలో బరువు అందుకునేవారు. అలాగే సూట్ కేసు లాక్కుంటూ ఇల్లు చేరారాయన. ఇంట్లో భార్య ఒక్కతే పని చేసుకుంటోంది. కాసేపటికి విషయం అంతా అర్థమైందాయనకి. తనకి కరోనా సోకిందనే అనుమానం తో దగ్గరికి వస్తే వాళ్లకి ఎక్కడ అంటుకుంటుందోనని అంతా దూరంగా ఉండిపోయారన్నమాట !
      ఆయన మనసంతా కకావికలమై పోయింది. ఎంత చేశాడీఊరికి ! ఎంతగా అభిమానించాడు అందర్నీ! ఇన్నాళ్ల తర్వాత వస్తే పలకరించడానికిక్కూడా ఎవరికీ మనసు రాలేదా? 
                   +++++++++++++++
      వారం రోజులు విపరీతంగా మదన పడ్డ ఆయన ఓ అర్ధరాత్రి గుండెల్లో సన్నగా నొప్పిగా ఉందంటూ భార్యను నిద్రలేపాడు. ఆమె కంగారుగా సహాయం కోసం బయటకు వెళ్లబోయింది. వద్దంటూ ఆమె చేయి పట్టుకొని ఆపి తన వద్దే కూర్చోబెట్టుకున్నారు. అంతే! తెల్లారింది. ఆయన బ్రతుకూ తెల్లారి పోయింది"
                    ++++++++++++++++
       అదీ జరిగింది! ఎక్కడో దూరాన ఉన్న కొడుకు కుటుంబంతో మూడో రోజుకుగానీ రాలేక పోయాడు. ఆరోజు రెడ్డి గారి పెద్ద దినం. కొందరు అతి దగ్గర బంధువులు వచ్చారు. తతంగమంతా జరుగుతూ ఉంది. ముఖాన కుంకుమ లేని రుక్మిణమ్మ రెడ్డి గారి ఫోటో ముందు కూర్చుని మౌనంగా రోదిస్తోంది. 
       ఇంతలో ఊర్లో వాళ్ళు కూడగట్టుకొని ఓ పెద్ద గుంపుగా తరలివచ్చారు. అందరి చేతుల్లో పెద్ద పెద్ద పూల దండలున్నాయి. వాటిని ఫోటోకు వేయడానికి ముందుకు కదిలారు వరుసగా. అంతవరకు మౌనంగా ఉన్న రుక్మిణమ్మ దిగ్గున లేచి గట్టిగా అరిచింది. ఎన్నడూ నోరు విప్పని ఆ ఇల్లాలు ఒక్కసారిగా అలా ఉగ్ర రూపంలో కనిపించేసరికి అక్కడందరూ శిలా ప్రతిమల్లా అయిపోయారు. 
   ".... ఆగండక్కడే ! మీకు ఆయన ఫోటో తాకే అర్హత లేదు. ఆయన కరోనా వల్ల చచ్చిపోలేదు. మీ వల్ల, మానవత్వం లేని స్వార్థపూరిత ప్రవర్తన వల్ల.... అందువల్ల చచ్చిపోయారు. వైరస్ వల్ల అందరూ దూరం పాటించండి అన్నారంతే. అంతేగానీ మనుషుల్లో అభిమానం, ఆప్యాయతలూ దూరం చేసుకోమని దానర్థం కాదు. రేపు మీకూ ఇలాంటి మరణం వస్తే ఎలాగుంటుందో కాస్త ఆలోచించండి.... "
     అక్కడంతా మ్రాన్పడి చూస్తుండగా స్థిరంగా అంది,.... "... ఇంకెప్పుడూ ఈ ఛాయలకు రావద్దు... ఆయన ఆత్మ నైనా ప్రశాంతంగా ఉండనీయండి... " అంటూ రెడ్డి గారి ఫోటోకు అడ్డంగా నిలబడింది!
    అంతే! వాళ్ళ చేతుల్లోని పూల దండలు వెలవెలబోయాయి!!
******************************************
( వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియలకు అడ్డగిస్తూన్న జనాల్ని గురించి విన్నప్పుడు---
 ఎంతోమంది అనారోగ్యాల్ని బాగుపరిచి ప్రాణదానం చేసిన వైద్యుల భౌతికకాయాల్ని సైతం స్మశానం లోకి అనుమతించక తిరిగి వెళ్ళి పోయేలా చేస్తున్న వైనం చదివినప్పుడు---
  మనుషుల్లో స్వార్థచింతన మరీ ఇంతగా వేళ్ళూనుకుని ఉందా! అన్న ప్రశ్న తలెత్తినపుడు కలిగిన స్పందనకు అక్షర రూపం ఈ " కరోనా మరణం ". )
************************************

Friday, May 22, 2020

మధురమైన భాష

తేనెను మించిన మాధుర్యం 
తెలుగు భాషకే సొంతమన్నది నిత్యసత్యం 
ప్రతిపదంలో పరిమళించే కమ్మదనం 
ప్రతీ పాదంలో జాలువారే రసరమ్య భావజాలం !
అమ్మ ప్రేమను గురుతుకు తెస్తుంది ప్రతీక్షణం !

యాభై అక్షరాల కూర్పుతో 
అలరారే తెలుగు అక్షరమాల 
సంస్కృతీసంప్రదాయాల విలువలు 
చాటిచెప్పే వరహాల విరులమాల 

కలం పట్టి కాగితం వేపు అలవోకగా 
చూస్తే చాలు ఆలోచనలు అక్షరాలై 
బారులు బారులుగా సాగిపోతూ 
మధురగీతాలై మది నిండిపోయి 
ఆనందపు వెల్లువలు కురిపిస్తాయి !
 
పరభాషను ప్రేమించటం తప్పని అనం 
తల్లిభాష ప్రాధాన్యం ఎరుగకపోవడమే నేరం 
భావవీచికలు చుట్టుముట్టి 
చెలరేగిన వేళ అవి సరైన ఆకృతి దాల్చి 
నిలిచేది సొంత భాషలోనే 
గుండె వేదనాభరితమై 
కుంగుతున్న వేళ కారే కన్నీటి చుక్కలు 
శిలలను సైతం కరిగించగల 
కావ్యాలయేదీ సొంతభాషలోనే !
అమ్మ తోడి సాన్నిహిత్యం 
మరెవ్వరితోనైనా సాధ్యమా మరి !!

*************************************

Thursday, May 21, 2020

చిట్టి తల్లీ !

😔👸😔😔😔
               చిట్టి తల్లీ !
                   🙎😔😔😔😔

చెత్తకుప్పలో విసిరేయబడ్డ పసిపాప !
చెదలు పట్టిన విషసంస్కృతికి ప్రతీక 
వెర్రితలలు వేస్తున్న పురుషాధిక్య భావన !
ఏ దేవుడాలకిస్తాడో చిట్టితల్లుల ఆక్రందన !

పొత్తిళ్ల నుండి ప్రాయం దాక ప్రాణప్రదమై 
పదిలంగా నున్న అపరంజి బొమ్మ !
పెళ్లి పీటలెక్కి పెద్దరికం వచ్చి 
చిరునవ్వు మరిచి చింతలపాలై పోతోందమ్మ !

అత్తిల్లు కాదది ఆరళ్లకు పుట్టిల్లు 
రక్షకుడు కాడా మగడు భక్షకుడు !
ఆడబ్రతుకెప్పుడూ అరిటాకే 
మారదు ఈ నానుడి ఎన్నడూ మరవబోకు !

ఈ చేదునిజం జీర్ణించుకున్నదేమో నీ తల్లి 
చిట్టితల్లీ ! నిను కడుపులోనే కాలరాసి 
' హంతకి ' అనిపించుకుంటేనేమిగాక !
నూరేళ్ల బతుకుభారం నీకు దించేసింది సుమీ !!
                   ☺️🙂🙂🙂🙂
------------------------------------------------------
చెత్తకుప్పలో పసిపాప మృత దేహం ----అన్న వార్తలు
పదే పదే చూస్తున్నపుడు కలిగిన స్పందనతో ----
------------------------------------------------------
యం. ధరిత్రీ దేవి
*********************************

Tuesday, May 19, 2020

అమూల్యం

అరవై వసంతాలు 
అలవోకగా సాగిన జీవనం 
తీరిక దొరికి చూద్దునుగదా 
జీవితం కరిగిపోయింది 
వెన్నముద్దలా వెలిగే కొవ్వొత్తిలా !
ఎక్కడ? 
చిరుగజ్జెల సవ్వడితో 
చిందేసిన ఆ పసిడి పదాలు? 
నాన్న ముద్దులతో 
అమ్మ గోరుముద్దలతో 
అలరారిన ఆ పాలబుగ్గలు? 
పట్టు పరికిణీతో 
పచ్చల హారంతో విరబూసిన 
చిరునవ్వుల సందళ్ళు? 
ఎక్కడ? 
అంటూ ప్రశ్నించింది 
అంతరంగం 
మూడు ముళ్ళు !
ముడివడ్డ కొత్త బంధాలు 
అల్లుకున్న పేగుబంధాలు 
అంతే ! 
జారిపోయింది 
మూడుపదుల వయస్సు !
చదివిన చదువు 
ప్రశ్నార్థకమై కుదిపేస్తే 
మరో భూమిక 
ఇచ్చిందో సరికొత్త రూపం !
రెండు పడవల 
ప్రయాణం ఆరంభం !
వైవిధ్య ప్రపంచాలతో 
సంబంధబాంధవ్యాలు 
నిత్యం అనునిత్యం 
ఉరుకులూ పరుగులూ 
ఫలితం !
నేడు వాడివడలిన 
నా ఈ దేహం !
అదిరిపడి అద్దం ముందు 
నిలబడితే 
పరిహసిస్తూ నా ప్రతిరూపం !
ఒక్కక్షణం నివ్వెరపాటు !
మరుక్షణం సాక్షాత్కరిస్తూ 
ఓ కఠోర సత్యం !
ఇది జీవనయానం సుమా !
బాధ్యతలతో పండిపోయినా 
మదినిండిపోయే తృప్తి 
అమూల్యం కాదా అంటూ !"
      💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

యం. ధరిత్రీ దేవి .... మళ్ళీ కలుద్దాం !
**********************************

Monday, May 18, 2020

మళ్ళీ లాక్ డౌన్...

   ' లాక్ డౌన్ ' పొడిగించబడింది మళ్లీ ఈ నెలాఖరు వరకూ. జనాలందరూ బాగా డీలా పడిపోయారు. ఎంత కాలమిలా? దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు మరి! ఎన్నాళ్లని ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడతారు? ఎవరైనా ఎన్నాళ్లని ఎవరినైనా పోషించగలరు? 
   ఓ వర్గం వారి పరిస్థితి ఇలా ఉంటే--- బాగా ఉన్న వాళ్ళ పరిస్థితేమో కలిగి ఖర్మంలా ఉంది. చేతినిండా డబ్బు ఉంది గాని ఏది కొందామన్నా కాలు బయట పెట్టలేని దుస్థితి. ఏ వారానికో పది రోజులకో బయటపడ్డా, దుకాణాలన్నీ బంద్! 
     వారం క్రితం వరకూ కూరగాయలు, సరుకులన్నా దొరికేవి. ఇప్పుడు వాటికీ మొహం వాయాల్సి వస్తోంది. మరీ ' కరోనా ' విజృంభణ అధికంగా ఉన్న కర్నూలు లాంటి రెడ్ జోన్ ప్రకటిత పట్టణాల్లో మందుల షాపులు సైతం మూతబడ్డాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. 
    ఎంత కాలమిలా? కొందరేమో వైరస్ తో సహజీవనం చేయాలి, తప్పదంటున్నారు. కరోనాతో అటుంచి ఈ కఠినతర నియమాలతో జనం అతలాకుతలమై పోతున్నారు. ఈ దుస్థితి తొలగి జనజీవనం ఎప్పటికి మామూలు స్థితికి వస్తుందో!!

*****************************************
యం. ధరిత్రీ దేవి 
మళ్ళీ కలుద్దాం !
*****************************************

Saturday, May 16, 2020

మృగాలు సైతం....

 ఆడపిల్లంటే ఆదిశక్తి అంటూ 
మహాలక్ష్మి స్వరూపమంటూ 
సిరి నట్టింట వెలిసిందంటూ 
మహదానందపడే రోజులా ఇవి  ?

అదెప్పుడూ ' ఆడ ' పిల్లేనంటూ 
శని నెత్తిన దాపురించిందంటూ 
తెగటార్చడానికి సిద్ధపడే తండ్రులు 
తయారైన కసాయిరాజ్యం ప్రస్తుతమిది !

వావివరుసలు వయోభేదాలు మరిచి 
కన్నుమిన్ను గానక చెడిన 
కామాంధులకాలవాలమైపోయి 
మైలవడ్డ మృత్యుకుహరమిది 

మానవ మృగాలంటే మృగాలుసైతం
సిగ్గుతో చితికిపోయే దుస్థితికి 
దిగజార్చిన అమానవీయ దుశ్చర్యల 
పరంపర కడకేతీరం చేరి కడతేరుతుందో మరి !!

**************************************
ముక్కమల్ల ధరిత్రీ దేవి 
**************************************

Thursday, May 14, 2020

' లాక్ డౌన్ ' పెళ్లి

పెళ్లి ఇది !
ఈ రకం పెళ్లి 
ఎంచక్కటి పెళ్లి !
' లాక్ డౌన్ ' పెళ్లి !
అరుదైన పెళ్లి 
ఆడంబరాలు లేని పెళ్లి 
అప్పులే అవని పెళ్లి 
ఆదర్శపు పెళ్లి !

బంధువుల గుసగుసలు 
వియ్యంకుల రుసరుసలు 
పైపైని పలకరింపులు 
పనికిరాని విమర్శలు !
మనస్పర్థలూ మనసుకు గాయాలూ !
ఇవేవీ కానరాని పెళ్లి !

కళ్యాణమంటపాలు 
శుభలేఖలు పంచటాలు 
లెక్కకు మించి వంటకాలు 
అనవసర ఆర్భాటాలు 
ఇవేవీ అక్కర్లేని పెళ్లి !
వ్యర్థం అసలుండని పెళ్లి !

ఈ రకం పెళ్లి 
ఎంచక్కటి పెళ్లి !
' లాక్ డౌన్ 'పెళ్లి !
ఆదర్శపు పెళ్లి 

కారాదు పెళ్లి ఆడంబరం 
ఆతర్వాత అన్యోన్యతే ప్రధానం 
అవును ఇది 'లాక్ డౌన్ ' పెళ్లి !
' వెడ్ లాక్ ' తో ముడి 
బ్రతుకంతా ఇక సందడే సందడి !

మంచి పాఠాలు చాలానే 
నేర్పించితివి మాకు ' కరోనా '
అందులో ---
ఇది ' అతి మంచి ' పాఠం ఎంతైనా !
మున్ముందూ కొనసాగితే ధన్యులం నిజంగా !!

🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌷🌺🌷🌺🌹🌷🌺
మళ్ళీ కలుద్దాం
యం. ధరిత్రీ దేవి
🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹

కూర ' గాయాలే '

    ఈమధ్య కాలంలోనే కాదు, ఇంతకుముందు కూడా టీవీల్లో, దినపత్రికల్లో తరచుగా చూసే ఓ వార్త---
 తుఫాను బీభత్సంతో కూలిపోయిన అరటి తోటలు, నేల పాలైన మామిడికాయలు, ఇంకా తమలపాకుల తోటలు వగైరా-- వాటి గురించిన ఛాయాచిత్రాలు-- ఇంకా వానకు తడిసిన ఎండుమిరపకాయలు, వడ్లు, రాశులుగా పోసిన ఇతర ధాన్యాలు! ఆరబోసిన వేరుశెనగ కాయలు-- ఇంకా ఇలాంటివే కల్లాల్లోకి చేరిన రకరకాల పంటలు-- వాటిని కాపాడుకునే ప్రయత్నాల్లో రైతు కుటుంబాలు! ఇలాంటివి చూస్తూ ఉంటే అనిపిస్తుంది-- నోటిదాకా వచ్చిన ముద్ద నోటి లోకి వెళ్ళేదాకా నమ్మకం లేదు అని. 
    ఓ పంట ఇంటికి చేరాలంటే ఆ రైతు పడే కష్టం, శ్రమ బేరీజు వేయలేం. అదొక్కటేనా! అదును లో పొలం దున్నటం మొదలు విత్తనాలు చల్లడం, నీరు పెట్టడం వర్షాధార భూములు అయితే వర్షం కోసం ఎదురు చూడడం, పంట పెరిగి కోతకు వచ్చే దాకా కంటికి రెప్పలా కాపాడుకోవడం, ఈ మధ్యలో ఏ ఆటంకం ఎదురైనా పెట్టింది అంతా వ్యర్థమే అవడం! దీనికితోడు సాగు కోసం, కూలీల కోసం అయ్యే ఖర్చు భరించడం! ఇంతా చేసి, ఆఖరికి నూర్పిళ్ళు కూడా పూర్తి చేసుకుని ఫలసాయం తృప్తిగా కళ్ల జూసుకునే తరుణాన ఇదిగో--ఈ తుఫాన్లు, అకాల వర్షాల వల్ల సర్వం నాశనమై పోవడం! ఈనగాచి నక్కలపాల్జేసినట్లు ! 
    ఈ మధ్య ఉత్పన్నమైన కొత్త సమస్య' కరోనా ' 
 వల్ల పండిన పళ్ళు, కూరగాయలు అమ్ముకోడానికి కూడా నోచుకోక కొందరు పొలాల్లో, తోటల్లోనే వాటిని వదిలివేయడం చూస్తోంటే ' అన్నదాత ' రైతు దైన్య స్థితి అవగతమవుతుంది. రైతు దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, మనిషికి పట్టెడన్నం పెట్టే వాడు రైతే అన్నది నిత్య సత్యం. కానీ ఇలా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రం రైతన్న ఎప్పుడూ బలవుతున్నాడు. 
    ఇకపోతే, వైరస్ ప్రభావం వల్ల కూరగాయల కొనుగోళ్లు బాగా తగ్గి పోయి, ఈసారికి కూరగాయలు పండించడం మానేయాలని రైతులు అనుకుంటున్నారని తాజా వార్త! అదే జరిగితే, రాబోయే రోజుల్లో కూరగాయలన్నవి ఎక్కడా దొరకక, కనిపించక జనాలందరికీ కూర ' గాయాలే ' సుమా, అనిపించడంలేదూ !!

*****************************************
మళ్ళీ కలుద్దాం !
యం. ధరిత్రీ దేవి 
*****************************************

Wednesday, May 13, 2020

అన్నా ! రైతన్నా !

అన్నా !రైతన్నా !
నీకెంత కష్టం వచ్చిందన్నా !
నలుగురికి పెట్టే చేయి నీదన్నా 
 నలిగి పోతున్నావు కదన్నా
 హలం పట్టి పొలం దున్ని
 నారు పోసి నీరు పోసి
 బండెడు బాధ భరించి
 మట్టి నుంచి మంచి
 ముత్యాలు సృష్టించి
 జనాల దోసిలి నింపి
కాలే కడుపుల ఆకలి తీర్చి 
 నేనున్నానంటూ నిలిచే రైతన్నా 
 నీకెంత కష్టం వచ్చిందన్నా !
 ఆరుగాలం శ్రమించి పండించి
 అమ్మకానికెళ్తే ' కరోనా ' అంటారు
 ' లాక్ డౌన్ ' అంటారు 
 పారబోసి పరుగులు తీయిస్తారు 
 కూరగాయలు కుళ్ళిపోయి 
 ఆకుకూరలు వడలిపోయి
 గుండెకు మానని గాయాలై 
 అన్నా, రైతన్నా ! 
 నీకు ఎంత కష్టం వచ్చిందన్నా !
 పండించే రైతుల కష్టం
 పక్కకు నెట్టేస్తే 
 అన్నదాతకు అవమానమే
 మిగిలిస్తే పళ్లెంలోకి
 పరమాన్నం కాదు కదా
 పట్టెడన్నం కూడా పుట్టదు కదా!
 అన్నా ! రైతన్నా !!   

*****************************************
యం. ధరిత్రీ దేవి 
మళ్ళీ కలుద్దాం !
*****************************************

Tuesday, May 12, 2020

ఇంకెన్నాళ్ళిలా?

ఎలా మొదలైందో 
దీని మూలమెక్కడో? 
దావానలంలా చెలరేగుతూ 
దారీతెన్నూ తెలీని స్థితిలో 
మానవాళిని నెట్టేసిందే? 

బీదాబిక్కి బతుకుబండి 
సాగే దారిలేక 
డొక్కలు మాడి 
దిక్కులు చూస్తూ 
ఇంకెన్నాళ్ళిలా ?

పశుపక్ష్యాదులు పాపం !
తిండిలేక తిరుగుతూ 
చుక్కనీటికై వెతుకుతూ 
తల్లడిల్లుతూ 
ఇంకెన్నాళ్ళిలా? 

సరుకులు నిండుకున్న ఇళ్లు 
తలుపులు తెరవని అంగళ్ళు 
అయ్యోపాపం ! మధ్యతరగతి జీవులు !
మందూమాకూ దొరకక 
ముసలీముతకా విలవిల !
ఇంకెన్నాళ్ళిలా?? 

**********************************
ముక్కమల్ల ధరిత్రీ దేవి 
మళ్ళీ కలుద్దాం !
**********************************

Sunday, May 10, 2020

ఆరనీకుమా ఆశాదీపం

కలిమి పోయిందా ? 
కలవరపడకు 
కష్టపడితే కలిసొస్తుంది           🌹🌺🌷

బలిమి పోయిందా? 
బాధపడకు 
బ్రతుకుబండేమీ ఆగిపోదు       🌷🌺🌹

ఆరోగ్యం దిగజారిందా? 
దిగులు పడకు, బాగయ్యే 
మార్గాలున్నాయి, వెతుకు         💐🌺🌹

అయితే ---
ఆశ ఆవిరై పోయిందా ? 
నీవు జీవన్మృతుడవే సుమా !
ఆ దీపం ఆరిపోనీకు ఎప్పటికీ 
ఆశాజీవికి అపజయమెక్కడిది మిత్రమా !!
                                                🌄🌈💐🌹🌄*

Friday, May 8, 2020

కరోనాను మించి......

   కరోనా వైరస్
   మహమ్మారి
   విలయతాండవం
   కరాళ నృత్యం
   మరణమృదంగం
   లాక్ డౌన్
రెండు నెలలుగా జనాలందరి నోళ్ళలో నానుతున్న పదాలివి అని గ్రహించిఉంటారు.ఇదంతా కరోనా వైరస్ గురించేనన్నది విదితమే. దాన్ని మించిన ఉత్పాతం నిన్న విశాఖ సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ అనే వాయువు లీకేజీ ఫలితంగా సంభవించిన విషాద ఘట్టం!
   కరోనా వైరస్ మనిషిమీద దాడి చేసిన కొద్దిరోజుల తర్వాత గానీ దాని ప్రభావం, లక్షణాలూ కనిపించవు. కానీ ఈ విషవాయువు క్షణాల్లో మనిషిని మృత్యుముఖం లోకి నెట్టేసే అత్యంత ప్రమాదకరమైందని నిన్నటి బాధాకర దృశ్యాలు చూస్తే తెలిసింది. రోడ్డువార, కాలువల్లో, బావిలో పడి మృత్యువాత బడ్డ వారి దీనస్థితి వర్ణించడానికి మాటలు చాలవు. 
    ప్రభుత్వం వేగమే స్పందించి ఆయా కుటుంబాలకు కోటి పరిహారం అందిస్తామనడం హర్షణీయం. బాధితులకు సత్వరమే సహాయ చర్యలు  చేపట్టడం, భరోసా ఇవ్వడం నిజంగా ఊరట కల్గించే విషయం. 
-----కానీ, గత కొద్దిరోజులుగా సంభవిస్తున్న ఘటనలు చూస్తోంటే అసలు మనిషి ప్రాణాలకు ' గ్యారంటీ ' అన్నదుందా? అన్న సందేహం కల్గుతోంది. ఎందుకంటే నిన్నటిదాకా ఆరోగ్యంగా, ఉల్లాసంగా తిరిగిన వ్యక్తి ఈదినం హఠాత్తుగా అదృశ్యమైపోవడం !

+++++++++++++++++++++++++++++++++++++
మళ్ళీ కలుద్దాం 
+++++++++++++++++++++++++++++++++++++

స్పందన --- సంభవమా !

   గత నాలుగైదు రోజులుగా దినపత్రికల్లో వస్తున్న ఓ వార్త దిగ్భ్రమ గొలుపుతోంది. ఆ వార్తకు సంబంధించి ఛాయాచిత్రాలు చూస్తోంటే ' ఔరా ' మనుషులు ఎంతగా ఈ వ్యసనానికి బానిసలయ్యారు, అనిపించక మానదు. అది మరేదో కాదు మద్యపానం. మద్యం షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆలస్యం, వెన్వెంటనే జనాలంతా' లాక్ డౌన్ ' సంగతి మరిచారేమో, దాన్నిఇట్టే పక్కకు నెట్టేశారు. ఇక' కరోనా ' మహమ్మారి! దాని సంగతి దేవుడెరుగు! గొంతులో మద్యం సుక్క పడకపోతే ఇప్పుడే ప్రాణం పోయేలాఉంది అనుకున్నారో ఏమో, అంతా మద్యం షాపుల ముందు క్యూలు కట్టేశారు. బారెడు దూరం మరిచి ఒకరినొకరు తోసుకుంటూ, మాస్క్ అన్న ప్రసక్తే లేకుండా ఆ ఫోటోల్లో దర్శనమిచ్చేశారు. అందులో వాళ్లూ వీళ్లూ అన్న తేడా లేక అన్ని వర్గాల వారూ, ఆఖరికి స్త్రీలు, అమ్మాయిలు సైతం బారులు తీరి ఉన్నారంటే ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. మరుసటి రోజు ఒక ఫోటో లో దూరదూరంగా గొడుగులు పట్టుకుని మరీ నిల్చున్నారు, అదీ ఒక నిత్యావసర సరుకే అన్నట్టు!
       ఇంతకీ ఈ వ్యసనానికి ఇంతలా ఎందుకు లొంగి పోతున్నారు జనం! అందులో ఏ ఆనందాన్ని పొందుతారో వాళ్ళకే తెలియాలి గానీ, అందువల్ల వాళ్ళ వ్యక్తిగత జీవనం అంతకుమించి కుటుంబం ఎంత దుర్గతి పాలవుతుందో వాళ్లకు తెలియనిదేమీ కాదు. అయినా ఆ బలహీనతను వదులుకోలేని దౌర్బల్యం వారిది ! ఇంట్లో ఇల్లాలు పొందే వేదన వాళ్ళ తలకెక్కదు. చిన్నపిల్లలు ఉంటే వారి మానసిక స్థితిని వీళ్లు అంచనా వేయలేరు. 
      కష్టపడి సంపాదించినదంతా ఇలా తాగుడుకు తగలేస్తూ చిందేయడం, నిత్యం ఇంట్లో వాదులాటలూ, కీచులాటలూ ! ఇంట్లో ఈ దృశ్యాలు పెరుగుతున్న వయసులో పిల్లలపై ఎలాంటి ముద్ర వేస్తాయి !భవిష్యత్తులో వారి జీవితం ఎలా తయారౌతుంది?  
     ' కరోనా ' మహమ్మారి మనకు తెలీకుండా మనలో జొరబడి మనల్ని బలి తీసుకుంటోంది. కానీ ఈ తాగుడు మహమ్మారిని మనిషే తనలోకి ఆహ్వానించి తన పతనానికే గాక కుటుంబ పతనానికి కారణభూతుడవుతున్నాడన్నది ఎంత పచ్చి నిజం !
       ప్రభుత్వం ఆదాయంకోసం వీటిని ప్రోత్సహిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. అందుకోసం వేరే మార్గాలు అన్వేషించవచ్చు గదా అని మరికొందరి ఆరోపణ ! ఒకవైపు అమ్మకాల్ని ప్రోత్సహిస్తూ మరోవేపు'మద్యపానం ఆరోగ్యానికి హానికరం ', ' నిషేధం ' అంటూ ప్రకటనలు !ఎంత హాస్యాస్పదం ! 
    ఇంతకీ --- వ్యక్తిలో మార్పు రావాలి గానీ చట్టపరమైన ఈ నిషేధాలూ, హెచ్చరికలూ ఏంచేస్తాయి ? తన ఆరోగ్యం, తన కుటుంబక్షేమం ఇంకా తన భవిష్యత్తుపై స్పష్టత అన్నది ఉన్న ఏ మనిషీ బాధ్యతారహితంగా ప్రవర్తించడు. మనిషన్న తర్వాత  ఎన్నో బలహీనతలుంటాయి. అందులో ఇదీ ఒకటి, నిజమే, కానీ ఏ అలవాటైనా హద్దులు మీరకూడదు. అతి అన్నది ఎప్పుడూ అనర్థదాయకమే గదా ! ఇది ప్రతివారూ గ్రహించిననాడు మద్యం షాపులముందు ఇలా క్యూలు కనిపించవు. కానీ అది సంభవమా !!

******************************************
మళ్ళీ కలుసుకుందాం 
************

Wednesday, May 6, 2020

అవనిలో వనిత... రాతికత్తులు... బలిపశువులు

సంప్రదాయాలను పాటించడంలో మహిళలు ముందువరుసలో ఉంటారెప్పుడూ. అంతవరకూ మంచిదే. అందరూ అంగీకరించేదే. కానీ విచారించాల్సిన విషయమేమిటంటే దుస్సాంప్రదాయాల విషయంలో కూడా మహిళల్నే ముందుకు నెట్టడం సమాజంలో ఆదినుండీ వస్తున్న అనాచారం. దానికి ఓ ప్రత్యక్ష నిదర్శనం చదవండి...... 

     "... అయినవారు, ఆత్మీయులు కన్నుమూస్తే..... ఎవరి హృదయాలైనా బద్దలవుతాయి. అంతులేని వేదనతో కళ్ళు ధారాపాతాలవుతాయి. మనసుకు అయిన గాయాలకు కాలమే మందుగా మారి.... కొన్నాళ్ళకు ఆ బాధను మరిపిస్తుంది...... "
    కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రికలో ఓ అమానవీయ దురాచారాన్ని ఉటంకిస్తూ వ్రాయబడ్డ వాక్యాలివి. 
    విషయంలోకెళ్తే --- ఇండోనేషియా దేశంలోని' డానీ ' అనబడే తెగకు చెందిన మహిళల పట్ల జరుగుతున్న ఓ అమానుష చర్యను వింటే ఎలాంటి వారికైనా హృదయం ద్రవించక మానదు. అదేమిటంటే---
   ఎంతగానో ప్రేమిస్తూ ఆప్యాయతను పంచే కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే--- ఆ మరణించిన వారి ఆత్మలకు ఎలాంటి కీడు కలుగకుండా శాంతి చేకూరేందుకు ఆ కుటుంబంలోని మహిళలు తమ చేతి వేళ్ళ భాగాలను అర్పిస్తారట ! గమనార్హం ఏమిటంటే--- ఈ సంప్రదాయం ఆ తెగలోని మహిళలకే పరిమితం కావడం!
    ఇంతకీ ఆ వేళ్ళు నరికే పద్ధతి విన్నామంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందులకై రాతి కత్తులను వినియోగిస్తారట ! ముందుగా వేలి మధ్యభాగంలో చిన్నపాటి తాడుతో గట్టిగా బిగించి కట్టడంవల్ల క్రమంగా పైభాగానికి రక్తసరఫరా నిలిచిపోయి కొద్దిసేపటికి నొప్పి తెలిసే అవకాశం ఉండదట! ఆ స్థితిలో రాతి కత్తితో ఆ భాగాన్ని నరికి అంత్యక్రియల సందర్భంలో నిర్వహించే పూజలో ఉంచుతారట ! గాయమైన వేలి భాగంలో ఇన్ఫెక్షన్ రాకుండా అక్కడ కలుస్తారట!
     ఇంతకీ, ఈ తతంగమంతా ఆ మహిళ తాలూకు తోబుట్టువులే నిర్వహిస్తారట ! కుటుంబ సభ్యుల మరణాలు పెరిగేకొద్దీ చేతి వేళ్ళ భాగాలు ఇలా నరికివేతకు గురవుతూ ఉండడం వలన వయసు మళ్ళిన స్త్రీల అరచేతులు సగం వేళ్ళు కోల్పోయి మొండిగా కనిపిస్తుండటం గుండెల్ని పిండి వేస్తుందని వారి అత్యంత దయనీయ స్థితిని ఆ వార్తలో ప్రస్తావించడం జరిగింది. 
    ఇండోనేషియా ప్రభుత్వం ఈ దురాచారాన్ని కొన్నేళ్ల కిందటే నిషేధించినా, ఆ తెగ ప్రజల్లో ఎన్నో చైతన్య కార్యక్రమాల్ని నిర్వహించినా గుట్టుచప్పుడు కాకుండా ఈ అమానవీయ విశ్వాసం అక్కడి చాలా కుటుంబాల్లో కొన సాగుతూనే ఉందట!
   పూర్వపు రోజుల్లో' ' సతీసహగమనం ' అనే దురాచారం వేళ్ళూనుకుని ఉండేదనివిన్నాం. భర్త చనిపోతే బ్రతికున్న భార్యను కూడా ఆ చితి పైనే దహనం చేసే అమానుష చర్య అది! ఆ చితి మంటలు ఆమె సజీవ శరీరాన్ని ఆక్రమిస్తోంటే ఆ బాధ భరించలేక ఆమె చేసే ఆర్తనాదాలు మిన్నంటే దృశ్యం మన ఊహాశక్తికి అందనిదేమీకాదు. కొన్ని సందర్భాల్లో ఆ అగ్నికీలల ధాటికి తాళలేక చితి నుండి దూకి పరుగులు తీస్తుంటే కర్రల తోటి తిరిగి ఆ చితిలోకి తోసేవారట ! ఎంతటి పైశాచిక కాండ ! 
       అత్యంత హేయమైన ఈ దురాచారం ప్రబలంగా ఉండే ఆ రోజుల్లో మహామహులైన సంఘసంస్కర్తలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, పోరాడి ఆ  దుష్ట సాంప్రదాయాన్ని రూపుమాపి, మహిళా లోకానికి కొండంత అండగా నిలిచి, చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అయినా అడపాదడపా ఇప్పటికీ ఒకటీ అరా జరుగుతూనే ఉన్నాయని వార్తల్లో చదువుతూనే ఉంటాం. 
   ఇంతకీ--- ఇక్కడ కొసమెరుపు--- అంతా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పై రెండు దుస్సాంప్రదాయాల్లోను అభాగ్య సోదరీమణులు మహిళలే బలిపశువులు కావడం!!

******************************************
 చిన్న మనవి  :  నిన్న పోస్టులో ఉంచిన ' బాలగేయం ' రెండో చరణం నాల్గవ లైనులో  ఊర్వశినీ  కి బదులు ఉర్వశినీ అని తప్పు దొర్లింది. అచ్చు తప్పుకు క్షంతవ్యురాలిని. 
******************************************
మళ్ళీ కలుద్దాం 
******************************************

Sunday, May 3, 2020

చూసేకళ్లకు హృదయమే ఉంటే......

దేవుడు లేడూ లేడంటూ
ఏడీ, ఎక్కడున్నాడో చూపించండంటూ
ప్రశ్నలు గుప్పిస్తూ జవాబుకై దబాయించే
మనుషులందరికీ ఒక్కప్రశ్న ! ఒకేఒక్క ప్రశ్న !

భగభగ మండుతూ భూగోళమంతా
వెలుగులు విరజిమ్ముతూ
జీవకోటికి జవసత్వాలిస్తున్న భానుడు
కాడా కనిపించే భగవానుడు?

రేయంతా వెండి వెన్నెల కురిపిస్తూ
 చల్లచల్లగా జనాల్ని సేదదీరుస్తూ
హాయిగొలిపే నిండు చందురుడు
కాడా కనిపించే దేవుడు?

 గుండె గదులకు ఊపిరిలూదుతూ
 నిత్యం ప్రతినిత్యం శ్వాసలో శ్వాసగా
 నిలుస్తూ, చుట్టూ ఆవరించియున్న
 ఈ గాలి కాదా కనిపించే దేవుడు?

 ఇందరు దేవుళ్ళని కళ్ళెదురుగా చూస్తూ
 ఇంకా దేవుడెక్కడంటూ
 చూపించ మంటూ ప్రశ్నలేమిటి?
 అంతదాకా ఎందుకు?
 దేశ క్షేమం కోసం స్వార్థం వీడి
 సరిహద్దుల నిలిచి నిద్ర మరిచి
 మనల్ని నిద్రబుచ్చుతూ
 జనం కోసం తన ప్రాణాలడ్డువేస్తూ
 కాపుగాస్తున్న మన వీర సైనికులంతా
 కారా కనిపించే దేవుళ్ళు!

 నేడు యావత్ప్రపంచాన్నీ గడగడలాడిస్తున్న
' కరోనా ' రక్కసికెదురొడ్డి పోరాడుతూ
 నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాచుకుంటున్న
 అపరధన్వంతరులు వైద్యనారాయణులు
కారా కనిపించే దేవుళ్ళు!

 సవాల్ విసిరిన ' కరోనా ' మహమ్మారిని
 మట్టుబెట్టే మందు కోసం మానవాళి మనుగడ కోసం
 రేయింబవళ్ళు తపిస్తున్న మన ' శాస్త్రజ్ఞులు '
 కారా కనిపించే దేవుళ్ళు?

 కిరీటందాల్చి నాల్గు చేతులు శంఖు చక్రాలతో
 పట్టుపీతాంబరాలతో ధగధగా మెరుస్తూ
 దర్శనమిస్తేనే దేవుడా? చూసే కళ్ళకు
 హృదయమంటూ ఉండాలే గానీ
ఆపదలో చేయందించే ప్రతీమనిషీ కనిపించే దేవుడే
 ప్రతీ మంచి మనసూ భగవత్స్వరూపమే !!

******************************************
మళ్ళీ కలుద్దాం
************

Saturday, May 2, 2020

ఫలితం...... ' చిన్నారి ' కథ

ఫలితం 
----------
   లక్ష్మీపురం ఉన్నత పాఠశాలలో  పదవ తరగతి విద్యార్థులకు యూనిట్ పరీక్ష జరుగుతోంది. పరీక్ష కేమేమి చదవాలో టీచర్ వారం క్రితమే చెప్పినా వినోద్ పుస్తకం ముట్టిన పాపాన పోలేదు. అందుకే ఈ రోజు ఒక్క ప్రశ్నక్కూడా జవాబు రాయలేక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. వాడికి అటువైపు కూర్చున్న వికాస్ పరిస్థితీ దాదాపు అలాగే ఉంది. కానీ వినోద్ లాగా వికాస్ చదవకుండా పరీక్షకు రాలేదు. వారం నుండీ చదవాల్సిందంతా బట్టీ పడుతూనే ఉన్నాడు. కానీ వాడి జ్ఞాపకశక్తి అంతంత మాత్రమే. అందుకే  నేర్చు కున్న దంతా మరిచిపోయి, ఎంత ఆలోచించినా గుర్తురాక తల పట్టుక్కూచున్నాడు. 
    ఇంతలో వినోద్ కు వాడు ఎదురు చూస్తున్న అవకాశం దొరికింది. వాడి ముందు కూర్చున్న అబ్బాయి కాస్త పక్కకు జరగడంతో వాడు రాస్తున్న జవాబులు వినోద్ కు స్పష్టంగా కనిపించసాగాయి.  అంతే ! ఆక్షణం కోసమే ఎదురు చూస్తోన్న వినోద్ అది చూసి ఎంచక్కా చకచకా రాసేయడం మొదలెట్టాడు. సమయం అయిపోయేలోగా పాస్ మార్కులకు అవసరమైనన్ని జవాబులు రాసేసుకున్నాడు. 
       వారం తర్వాత టీచర్ అందరి పేపర్లు దిద్ది, క్లాసులో ఇచ్చేసింది. వినోద్ పాసై పోయాడు. వికాస్ మాత్రం ఫెయిలై బిక్కమొగం వేసాడు. టీచర్ వాడికి చీవాట్లు వేస్తూ, ఎందుకు చదవలేదంటూ నిలదీసింది. వికాస్ వెక్కివెక్కి ఏడుస్తూ తన గోడు చెప్పుకున్నాడు. వాడి బాధ అర్థం చేసుకున్న టీచర్ వాణ్ణి ఓదారుస్తూ, అందరివేపు చూస్తూ, " చదివింది గుర్తుండాలంటే ముందుగా అర్థం చేసుకుని చదవాలి. నేర్చుకున్న తర్వాత ఒకసారి చూడకుండా రాసి చూసుకోవాలి. అప్పుడు మీమీద మీకు నమ్మకం కలుగుతుంది. అంతటితో ఆగక అలా నేర్చుకున్నవి మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి, " అంటూ కొన్ని చిట్కాలు చెప్పింది. 
      వికాస్ బుద్ధిగా తలూపి, మరోసారి ఫెయిల్ కానంటూ టీచర్ కు మాటిచ్చాడు. వినోద్ కు ఇవేమీ పట్టలేదు. పాసయానన్న ఆనందంలో వాడి తప్పిదం వాడికి తెలియలేదు. తెలిసినా బుర్ర కెక్కించుకునే స్థితిలో వాడు లేడు. 
         తర్వాతి యూనిట్ పరీక్షకు వికాస్ కష్టపడి చదువుతుంటే వాడిపక్కన జేరి, " రేయ్, ఎందుకురా బుర్ర పాడుజేసుకుంటావ్?  ఎంచక్కా గైడ్ పక్కన పెట్టుకుని చూసి రాయొచ్చు గదా, లేదంటే ఎవడైనా బాగా రాసే వాడి పక్కన కూచున్నా సరిపోతుంది గదా, " అంటూ ఉచిత సలహా పారేశాడు. 
     రెండవ యూనిట్ పరీక్ష అయిపోయింది. వికాస్ పాసయ్యాడు. వినోద్ కూడా పాసయ్యాడు, వికాస్ కంటే ఎక్కువ మార్కులతో ! వాడి పద్ధతి షరా మామూలే. చకచకా అర్ధసంవత్సర పరీక్షలు వచ్చేశాయి. టీచర్ సలహాలు తు. చ తప్పక పాటించిన వికాస్ తలెత్తకుండా రాసుకుంటూ పోతున్నాడు. తనకలవాటైన పద్దతిలో గైడ్ కింద పెట్టి కాపీ కొడుతూ రాస్తున్న వినోద్ భుజం మీద ఒక్కసారిగా టీచర్ చేయి పడింది. 
      " ఇన్నాళ్లూ మార్కులు బాగా వస్తుంటే చక్కగా చదువుతున్నావనుకున్నా, ఇదన్నమాట అసలు సంగతి ! " వాడి చేయి పట్టుకుని హెడ్మాస్టర్ గారి గదికి బరబరా లాక్కెళ్ళింది. అక్కడ తల వాచేలా చీవాట్లు తిని, బయటకొచ్చి ఒక్కసారి తల విదిలించుకున్నాడు. అంతేగానీ వాళ్ళ మాటలు ఇసుమంతైనా తలకెక్కించుకోలేదు. 
       తిరిగి చూసేలోగా పరీక్షలయిపోయాయి. ఈసారి వికాస్ మొదటి ఐదుగురిలో ఒకడిగా నిలిచాడు. వినోద్ కాపీ కొట్టిన మార్కులతో ఏదో పాసయాననిపించాడు. 
      సంవత్సరాంత పరీక్షలకు ఉపాధ్యాయులంతా కష్టపడి విద్యార్థులందరినీ చదివిస్తున్నారు. ఒకరోజు ఏకాగ్రతతో చదువుకుంటున్న వికాస్ చెంతకు వినోద్ చేరాడు, " రేయ్, ఎందుకురా మరీ ఇంత కష్టపడతావు ? నేను చూడు టీచర్ల నందరినీ ఎలా బురిడీ కొట్టిస్తున్నానో ! పాపం! వాళ్లంతా నేను నిజంగానే చదివి పాసవుతున్నాననుకుంటున్నారు.."
ఓసారి ముక్క చీవాట్లు తిన్నసంగతి మరుగున పడిపోయిందేమో, వికాస్ కు దగ్గరగా జరుగుతూ ఇంకా ఏదో చెప్పబోయాడు. వాడి మాట మధ్యలోనే తుంచేస్తూ వికాస్ అందుకున్నాడు, 
     " రేయ్, నీవు బురిడీ కొట్టిస్తున్నది టీచర్లను కాదురా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అన్ని వేళలా నీ ఎత్తులు పారవని తెలుసుకో. కనీసం ఇప్పటి నుండైనా కష్టపడి చదువు, బాగుపడతావు..." అంటూ అక్కడినుండి విసురుగా లేచి వెళ్ళిపోయాడు. కానీ, వికాస్ మాటలు వాడికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే అయ్యాయి. 
      చూస్తుండగానే పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. వినోద్ పర్యవేక్షణ చాలా కఠినంగా ఉండే సెంటర్లో పడ్డాడు. పైగా ఆ సంవత్సరం అన్ని ప్రశ్నాపత్రాలు చాలా క్లిష్టంగా వచ్చాయి. ఇక వినోద్ పరిస్థితి చెరువు లో నుండి బయట పడ్డ చేపలా తయారైంది. ప్రతీరోజు తెచ్చుకున్న కాపీ చీటీలన్నీ పరీక్ష ప్రారంభానికి ముందే లాగేసుకునేవాళ్ళు ఇన్విజిలేటర్లు. వాళ్ళు తల కూడా తిప్ప నీయకుండా తిరుగుతూ ఉంటే పక్కవాడి వంక చూసి సాహసం చేయలేకపోయాడు వినోద్. కళ్ళనీళ్ళ పర్యంతమై ప్రతీరోజు రెండు గంటల పాటు నరకం అనుభవిస్తూ నీరసంగా బయటికి రావడం వాడి వంతయింది. 
      ఆఖరి రోజు పరీక్ష అయిపోయాక నీరసంగా అడుగులు వేస్తూ ఓవారగా వెళ్లి నిల్చున్నాడు వినోద్. మిగతా పిల్లలంతా హుషారుగా నవ్వుతూ తుళ్ళుతూ వెళ్తున్నారు. 
    ఒక్కసారిగా వాడి కళ్ళముందు తరగతి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు మెదిలారు. 
   " అన్ని వేళలా నీ ఎత్తులు పారవని తెలుసుకో" 
 వికాస్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చి తల తిరిగి పోయింది వాడికి. 
     వాళ్లందరి మాటలు పెడచెవిని పెట్టిన ఫలితం! ఎంతో విలువైన ఓ విద్యాసంవత్సరం కోల్పోయి, అందరిలోనూ అవమాన పడాల్సిన పరిస్థితి దాపురించే సరికి మొదటిసారిగా వాడి కళ్ళ నుండి బొటబొటా నీళ్ళు కారాయి. 

******************************************
మళ్ళీ కలుద్దాం 
*********