Tuesday, December 31, 2024

కష్టమైనా ప్రయత్నిద్దాం...

 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐    


                కొత్త సంవత్సరం వచ్చేస్తోంది...
                క్యాలెండర్ మారుతుంది...
                వీడ్కోలు చెప్పేద్దాం...
                నిన్నటి చేదు తుడిచేద్దాం 
                కష్టమైనా ప్రయత్నిద్దాం 
                కొన్ని కష్టాలు అధిగమిస్తేనే 
                సొంతమవుతుంది సంతోషం🙂
                తీపిని మరీ మరీ 
                నెమరేసుకుందాం..
                అదే కదా మనల్ని 
                ముందుకు నడిపించే 
                దివ్య ఔషధం !! 
                అదిగో..!!🌹
                వచ్చేసింది కొత్త సంవత్సరం..🌷
                స్వాగతిద్దాం... 🌺
                సంబరాలు చేసుకుందాం 
                నవ్వుతూ.. నవ్విస్తూ..
                జీవనయానం సాగిద్దాం...🙂🙏
    

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Monday, December 23, 2024

చీమను చూసి నేర్చుకో.... ' చిన్నారి కథ '

  

                                                 యం. ధరిత్రీ దేవి

 రాధాకృష్ణ మనసంతా అల్లకల్లోలంగా ఉందాక్షణంలో. ఆ విషయం తెలిసినపుడు, ముందుగా ఊహించిందే అయినా వాడి మనసు ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంతకీ ఆ విషయమేమిటంటే ఆ అబ్బాయి పదోతరగతి రెండోసారి కూడా తప్పాడు. 
   మొదటిసారి తప్పినప్పుడు పెద్దగా వాడికి ఏమీ అనిపించలేదు. కానీ ఇంట్లో తండ్రి చేత తెగ చీవాట్లు తిన్నాడు. వాళ్ళమ్మయితే ఆ రోజంతా ముఖం తిప్పుకొని, రెండు రోజుల దాకా వాడితో మాట్లాడనేలేదు. పరీక్ష పోయినందుకు కాదు గానీ, ఈ చిరాకంతా భరించడం వాడికి పెద్ద తలనొప్పి అయింది. 
  అన్నింటినీ మించి వాడు భరించలేని విషయం, వాళ్ళ పక్కింటి వనజ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలవడం ! తన నెంబర్ పేపర్లో లేదని తెలిశాక ఆ పిల్ల తన వైపు చూసిన చూపు, ఎగతాళిగా నవ్విన నవ్వు పదేపదే వాడికి గుర్తొచ్చి ఉక్రోషం ముంచుకొచ్చింది. 
  ఏదేమైతేనేం, తప్పిన రెండు సబ్జెక్టులూ మళ్లీ కట్టాడు. కానీ, వాడి దురదృష్టం! రెండింట్లోనూ మళ్లీ తప్పాడు. ఫలితాలు చూసుకుని కాళ్ళీడ్చుకుంటూ వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఎదురుగా జూనియర్ కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న వనజ! మళ్లీ అదే చూపు, అదే నవ్వు! తల కొట్టేసినట్లయింది రాధాకృష్ణకి. అంతే! గిర్రున వెనక్కి తిరిగి ఊరిబయటి కాలువగట్టుకు దారితీశాడు. ప్రస్తుతం వాడి మన స్థితికి కారణం అదే. రాత్రి యథాప్రకారం ఇంట్లో తిట్లు, శాపనార్థాలు! 
   " ఇక వీడు లాభం లేదే, ఊర్లో ఏ పెద్దకాపు ఇంట్లోనో పాలేరుగా కుదిరిస్తే తిక్క కుదురుతుంది.... "
 తల్లితో వాళ్ళ నాన్న అంటున్న మాటలు వింటుంటే రాధాకృష్ణ రక్తం ఉడికిపోయింది. తల్లి చాటుగా కళ్ళు ఒత్తుకోవడం చూసి ఓ పక్క బాధ కలిగింది. పట్టువదలని విక్రమార్కునిలా మళ్లీ పరీక్షకు కట్టాడు ఉక్రోషంతో. 
    దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగుచేయలేరన్నట్లుగా రాధాకృష్ణను ఈసారీ విధి వెక్కిరించింది. తల బాదుకుని చద్దామన్నంత విసుగు పుట్టింది వాడికి. ఈసారి అమ్మా నాన్నల్ని ఎలా ఎదుర్కోవాలన్న తలంపు వాణ్ణి మరింత కుంగదీసింది. ఓ క్షణం ఏ రైలు పట్టాల మీదో తల పెట్టేద్దామా అన్న ఆలోచన కూడా వాడి బుర్రలో దూరక పోలేదు. మరుక్షణమే రైలు బండి చప్పుడు గుర్తొచ్చి భయంతో వాడి గుండె దడదడ లాడింది. ఇక చేసేదేమీలేక, గుండె బరువెక్కి ఇంటికి వెళ్ళడానికి మోహం చెల్లక, తన అలవాటు ప్రకారం ఊరి బయట కాలవ గట్టు కేసి దారితీశాడు. 
   గట్టుమీద కూర్చుని కాలువలోని నీటి ప్రవాహాన్ని తదేకంగా చూస్తోన్న వాడి మస్తిష్కంలో నిరాశ పేరుకొని పోసాగింది. అందరూ ఎంతో సునాయాసంగా పాస్ అయిపోతుంటే తను ఎందుకు ఇలా ప్రతిసారీ ఫెయిల్ అయిపోతున్నాడో వాడికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తున్న వాడి దృష్టి ఉన్నట్టుండి కాలువ దిగువ భాగాన గడ్డి మీద పాకుతున్న ఓ గండుచీమ మీద పడింది. రెల్లు గడ్డి మీదనుండి అది మాటిమాటికీ కిందకి జారుతూ ఉంది. పైకి పాకి ఒడ్డు చేరడానికి ఎంతో శ్రమ పడుతోంది కానీ, చేరలేక పోతోంది. గడ్డి మీద నుండి ఏమాత్రం జారి కింద పడినా నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంది. 
  తన మనస్థాపం తాత్కాలికంగా కాస్త పక్కకు పెట్టి, ఒకింత ఉత్కంఠగా రాధాకృష్ణ దాన్నే గమనించసాగాడు. అలా అలా ప్రయత్నిస్తూ అది చూస్తోండగానే చిట్టచివరకు ఒడ్డుపైకి చేరి పోయింది. అమితాశ్చర్యం కలిగింది రాధాకృష్ణకి. సరిగ్గా అప్పుడే తలతిప్పి చూసిన వాడికి ఎప్పుడు వచ్చిందో ఏమో గానీ వెనగ్గా నిలబడి ఈ తతంగమంతా గమనిస్తున్న వనజ కనిపించింది. మళ్లీ అదే చూపు, అదే నవ్వు ! అంతే! వాడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పట్టరాని కోపంతో ఆ అమ్మాయి వైపువిసవిసా రెండడుగులు వేశాడు. 
' ఆగు '
అంటూ ఒకింత హెచ్చుస్థాయిలో చేయి చాపుతూ వారించింది వనజ. మంత్రం వేసినట్లు ఠక్కున ఆగిపోయాడు రాధాకృష్ణ !
"....ప్రస్తుతం నీవున్న మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలను. ఈ రోజెందుకో నీతో రెండు మాటలు చెప్పాలనిపించి నీ వెనకే వచ్చాను.... "
విస్తుబోతూ చూస్తోన్న రాధాకృష్ణనే చూస్తూ కొనసాగించింది వనజ. 
"....నా మీద కోపం తెచ్చుకోవడంలో అర్థం లేదు. నిన్ను నీవు ఓసారి పరీక్షించుకో. ప్రతిసారీ ఇంట్లో మీ నాన్న కోప్పడతాడనో, అమ్మ బాధపడుతుందనో పరీక్ష ఫీజు కడుతున్నావు గానీ ఒక్కనాడన్నా పాస్ అవ్వాలన్న కోరికతో పుస్తకం పట్టి చదివావా? పరీక్షలయితే రాసి వస్తున్నావు గానీ, పాసవుతానన్న ధీమా నీలో ఎప్పుడైనా కలిగిందా?  చిన్న చీమ నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పదే పదే పడిపోతూఉన్నా ప్రయత్నం మాత్రం మానుకోలేదది ! పట్టుబట్టి శ్రమించి గట్టు చేరుకుంది చూడు. దానికున్నపాటి పట్టుదల నీకూ ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పాస్ అయిపోయి ఉండేవాడివి. నీలో తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఆలోచన, అవగాహన--- అన్నీ ఉన్నాయి. లేనిదల్లా పట్టుదలే! పాస్ అయి తీరాలన్న పట్టుదల!.... "
 స్థిర కంఠంతో వనజ తీక్షణంగా అంది. ఆ క్షణంలో కళ్ళను కమ్ముకున్న తెర ఏదో మెల్లిగా జారిపోతున్న భావన రాధాకృష్ణలో ! 
  నిజమే! పరీక్ష ఫీజు కట్టడంతో తన పని అయిపోయింది అనుకునే వాడు. తండ్రి పోరు పడలేక ఆ తతంగం కాస్తా పూర్తి చేస్తున్నాడే గానీ నిజానికి చదివి పాసవ్వాలన్న కోరిక తనలో ఎక్కడుండేది? వనజను చూసి ఉక్రోషంతో కోపగించుకున్నాడు గానీ ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పేముంది? వాస్తవమే మాట్లాడింది. ఈసారైనా పట్టుబట్టి విజయం సాధించాలి. తన నిర్ణయం కళ్ళలో ప్రతిఫలిస్తూ ఉండగా వనజ వైపు సంభ్రమంగా చూశాడు రాధాకృష్ణ. మళ్లీ అదే చూపు! అదే నవ్వు! కానీ ఈ సారి రాధాకృష్ణకు ఆ పిల్లపై కోపం రాలేదు సరికదా చెప్పలేనంత ఉత్సాహం మరింత సంతోషం కలిగింది!
తనను కర్తవ్యం దిశగా నడిపే ప్రయత్నం చేసిన వనజ వైపు మెచ్చుకోలుగా చూస్తూ ముందుకు కదిలాడు.
-------------------------------------------------------------------
నీతి : కోరిక ఉంటే చాలదు.. పట్టుదల కూడా         
         ఉండాలి.
-------------------------------------------------------------------

Tuesday, December 3, 2024

" చిన్నారి" మనోభావాలు..ఇష్టం..మాకిష్టం.

  ****************************************

      🙋‍♀️[ బడికి వెళ్లే బాలల మనోభావాలు ] 💁

                        యం. ధరిత్రీ దేవి 

 ****************************************

🙆‍♂️👩‍🎤🙋‍♂️🙅‍♂️🙋‍♀️🙋‍♂️👩‍🎤🙆‍♂️🙋‍♀️🙅‍♂️🧑‍🎤👨‍⚖️👩‍⚖️🧑‍💼👩‍🚀

****************************************

 ఇష్టం.. ఇష్టం.. మాకిష్టం...

 ఆదివారం మాకు చాలా చాలా ఇష్టం🧑‍💼

 ముందు రోజు శనివారం మరీ మరీ ఇష్టం...

 మరురోజు వస్తుందిగా మరి...ఆదివారం.. 🙂

 హోంవర్క్ తో కుస్తీలు..పాఠాలతో కసరత్తులు...

 బడిగంటల చప్పుళ్ళు..టీచర్ల అదిలింపులు...

 అన్నీ బంద్..! ప్రకటిస్తాం విరామచిహ్నాలు..!!

 ఉదయం లేస్తాం గంట ఆలస్యం..

 అయినా అమ్మకు రానే రాదు కోపం...🤱🧑‍🎤

 నాన్నక్కూడా...మా తర్వాతే లేస్తాడు మరి!!😄

 అదేమంటే..నాకూ ఆదివారమేగా...

 అంటాడు అమ్మతో ముసిముసిగా...

 నాకు కాదా...అంటుంది అమ్మ రుసరుసలాడ్తూ.. 

 స్పెషల్ బ్రేక్ ఫాస్ట్...ఉప్మా పెసరట్.

 లేదా..ఇడ్లీ..వడ.. సాంబార్..

 అమ్మ చేస్తే మహ టేస్ట్👌

 మధ్యాహ్నం వేడివేడి లంచ్...😋

 అదిరిపోయే డిషెస్ 🙋‍♂️...ఆపై...

 Watching TV.. Playing Video games..

 No restrictions...No orders..!!

 అంతా మా ఇష్టం...మాదే రాజ్యం..

 సాయంత్రం చిరుతిళ్ళు...🥪🥯

 మా వీధి నేస్తాల్తో...చెట్టపట్టాలు.🙅‍♂️🙆‍♂️🚴‍♂️🤽

 సందడే సందడి...అల్లరే అల్లరి...🧑‍🎤🙋‍♀️

 వారానికి సరిపడా 'రీఛార్జ్..'

 ఐపోతాంగా భేషుగ్గా...🫠

 రాత్రి 'గుడ్ బై' తో వీడ్కోలు...🙋‍♀️🙋‍♂️

 సోమవారానికి పలుకుతాం... 

 స్వాగతాలు ( అయిష్టంగానే ).. 🧑‍💼👩‍⚖️

 అందుకే...ఆదివారం మాకు 

 ఎంతో ఎంతో ఇష్టం..కానీ..

 అమ్మకే పాపం! పనులెక్కువై కష్టం..🤱

 అయినా..మా ఇష్టం అమ్మకూ ఇష్టం..

 కష్టమైనా తనకూ మహా మహా ఇష్టం...🙂

 అందుకే...అమ్మంటే మాకు అంతులేని ఇష్టం🥰🤗

💁‍♀️🙋‍♂️🙇💁🙆🙆‍♂️🤷‍♂️🙋‍♂️👩‍💼👩‍🎨👩‍🎤🧑‍💼👩‍⚖️🙋‍♂️👩‍🎤🙋‍♀️

***************************************