Thursday, March 25, 2021

పునరావృతం

నిన్న మొన్నటి చిన్నారి చిట్టితల్లి 
 నేడో అందాల అపరంజి !
 పట్టభద్రురాలైన పాతికేళ్ల పడతి 
 అయినా --
 అయింది తండ్రి గుండెల మీద కుంపటి
 పెళ్ళి చూపుల తంతు మొదలైపోయి 
 ఆక్రోశించిందామె అంతరంగం
 రుణగ్రస్తుడై కన్నతండ్రి
 అనారోగ్యం పాలై తల్లి !
 కడకు పడిందామె మెడలో తాళి !
 తరలి వెళ్ళింది ఇల్లాలై మరో ఇంటికి 
అక్కడ  --
 అత్త...అత్తమ్మ కాలేక ఆరళ్ళు ఆరంభం !
తల్లి కొంగు చాటు మగడు !
ఆలి బాధ అర్థం చేసుకోడు 
ముద్దూ మురిపాలు మృగ్యమై 
మూడేళ్లు గడిచిపోయి 
అయ్యిందా అతివ తల్లి !
కొడుకును గన్న తల్లి !
ఒడిని జేరిన ముద్దు పాపడు 
అయ్యాడామె ఆరోప్రాణం !
ఏళ్ళు గడిచి ఎదిగాడు కొడుకు 
అత్త కాబోవు తరుణమాసన్నమాయె 
ఏమి చిత్రం !!
కొత్త హోదా మత్తు ఆవరించెనో ఏమో !
గతం మరిచి వరకట్నవీధిని బేరమాడుచుండె !!
మరో ఆడపిల్ల ఆవేదన 
ఎంత మాత్రం పట్టదాయె !

ఆహా ! నేటి కోడలా !
రేపటి అత్తవు నీవే కదా !
వ్యధల పాలైన నీవే 
వ్యధలకు మూలం అవుతున్నావే !
చరిత్ర పునరావృతం 
అంటే ఇదేనేమో !! 

******************************
          🌷భువి భావనలు 🌷
******************************

Tuesday, March 16, 2021

విద్యుక్త ధర్మం... ' చిన్నారి ' కథ

      ఆరోజు ఈశ్వరరావు గారింట్లో ఒకటే హడావిడిగా ఉంది. తెల్లవారితే సత్య నారాయణ వ్రతం. వ్రతం అంటే మాటలా మరి ! ఇంటిల్లిపాదీ చేతులు కలిపితే గానీ పనులన్నీ ఒక కొలిక్కి రావు. అందునా బంధుమిత్రులంతా వస్తున్నారాయె ! ఇక ఈశ్వరరావు సంగతి అయితే చెప్పక్కర్లేదు. యజమానిగా అన్ని బాధ్యతలూ మోయాల్సి రావడంతో తెగ హైరానా పడిపోతున్నాడు. 
    ఇలా ఊపిరాడని పనులతో తలమునకలవుతున్నా అతనికి మరుసటి రోజే ఇన్స్పెక్షన్ అన్న సంగతి అనుక్షణం గుండెల్లో ఓమూల గుచ్చుకుంటూ నే ఉంది. కారణం, అతను చేయవలసిన పనులు బోలెడు పెండింగ్ లో ఉన్నాయి. అర్ధ సంవత్సర పరీక్షల పేపర్ లు కాదు కదా కనీసం యూనిట్ పరీక్షల పేపర్లు కూడా దిద్దిన పాపాన పోలేదు. ఇంకా పూర్తి చేయాల్సిన రికార్డ్ పనులు కూడా అలాగే ఉన్నాయి. 
    ఆ సమయంలో యధాలాపంగా అతనికి ఆనందరావు గుర్తొచ్చాడు. ఈశ్వర్ రావు, ఆనందరావు ఒకే పాఠశాలలో గత కొద్ది సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఇద్దరూ ఒకే స్థాయి ఉద్యోగులూ పైగా సమవయస్కులు. కానీ ఇద్దరి మనస్తత్వాలు మాత్రం తూర్పు పడమర గా ఉంటాయి. ఈశ్వరరావు ఆస్తికుడు. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, వ్రతాలు-- ఇత్యాది తతంగాలతో మునిగితేలుతూ ఉంటాడు. ఆనందరావును పరమ నాస్తికుడని అనలేము గానీ అతని ఆచారవ్యవహారాల్లో ఆ పోకడలు కనిపించవు. కానీ, అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉంటూ, ఎప్పుటి పనులప్పుడు పూర్తి చేస్తూ, ' work is worship ' అన్నదానికి నిదర్శనంగా ఉంటుంటాడు. ఈశ్వరరావు తద్భిన్నంగా ఉంటాడు. అతని పనులెప్పుడూ సకాలంలో పూర్తి కావు. అందుకే అతనంటే అందరికీ నిరసన. 
   ఈశ్వరరావుకర్థం కానిదొకటే.  తనెప్పుడూ దేవుణ్ణి కొలుస్తూ, స్తుతిస్తూ ఉంటాడు. అయినా దేవుడు తనపై కరుణ చూపిస్తున్నట్లుగా కనిపించదు. కానీ ఎన్నడూ దేవుడికి చేతులు జోడించి దండం పెట్టని ఆనందరావే ఎప్పుడూ తన కంటే ఓ మెట్టు పైన ఎలా ఉంటున్నాడో బుర్ర బద్దలు కొట్టుకున్నా అతనికి అవగతం కాదు. పైగా ఇటీవలే అతనికి రెండు ఇంక్రిమెంట్ లు కూడా వచ్చాయి. అవి ఆనందరావు కష్టపడి ప్రైవేటుగా చదివి పొందిన  MA; MEd డిగ్రీల తాలూకు ఇంక్రిమెంట్ లని ఈశ్వరరావు కు తెలుసు. అయినా అతని అంతరంగం ఒప్పుకోదు. ఇదంతా చూస్తోంటే అతనిపై ఈశ్వరరావుకు క్రమక్రమంగా ఏమూలో ఓ విధమైన ఈర్ష్య మెల్లగా చోటుచేసుకోవడం ఆరంభమైంది. 
    కొద్ది రోజుల క్రితం మధ్యాహ్నం బడి వదిలే ముందు ఆనందరావు పర్మిషన్ తీసుకుని ముందుగానే బయలుదేరాడు. ఇది గమనించిన ఈశ్వరరావు కారణం అడిగాడు. 
" ఏమీ లేదు ఈశ్వర్, మా పాపకు వారంరోజులుగా జ్వరం పట్టిపీడిస్తోంది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. విషజ్వరమేమోనని అనుమానంతో ఈ ఉదయం స్పెషలిస్ట్ కు చూపిస్తే వెంటనే హాస్పిటల్ లో చేర్పించమన్నాడు. అందుకే వెళ్తున్నా.. "
అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు.
" అదీ సంగతి ! ఇంతకాలానికి దేవుడి దృష్టి వీడిపై పడిందన్నమాట ! ఏ పూజలూ చేయకుండా దైవాన్ని అలక్ష్యం చేస్తే ఆ పాపం ఊరికే పోతుందా.. ఇప్పుడు తెలిసొస్తుంది ఘనుడికి... " అనుకుంటూ అతని పరిస్థితికి సానుభూతి చూపకపోగా లోలోన సంబరపడ్డాడు ఈశ్వర్ రావు.
    ఆనందరావు మరుసటి రోజు సెలవు పెట్టాడు. ఆ తర్వాత మరికొన్ని రోజులు పొడిగించాడు. పాప పరిస్థితి ఎలా ఉందో అని స్కూల్లో అందరూ ఆందోళన పడసాగారు.
 ఈలోగా ఇన్స్పెక్షన్ తేదీ ఖరారు చేయడం జరిగింది. ప్రతిసారి కంటే ముందుగానే ఇన్స్పెక్షన్ రావటం, అదీ వ్రతం అనుకున్న మరునాడే కావడం-- ఈశ్వర్ నెత్తిన పిడుగు పడినట్లయింది. పోనీ వ్రతం పైనెలకు వాయిదా వేసుకుందామా అనుకున్నాడో క్షణం. 
" అమ్మో! ఇంకేమైనా ఉందా! బడి పనైనా ఎగ్గొట్టొచ్చేమో గానీ దైవ కార్యాన్ని వాయిదా వేస్తే ఇంకేమైనా ఉందా! "
 ఈ ఆలోచనతో ఇంక అన్నీ పక్కన పెట్టేసి వ్రతం ఏర్పాట్లలో మునిగిపోయాడు ఈశ్వరరావు.
   ఇన్స్పెక్షన్ రెండు రోజులుందనగా స్కూలుకు వచ్చాడు ఆనందరావు. అందరూ అతన్ని పరామర్శించారు. కూతురు గండం నుంచి గట్టెక్కినందుకు సంతోషించారు. ఈశ్వరరావు మాత్రం గుర్రుగా చూశాడు. ఇన్స్పెక్షన్ అయినా, వారం రోజులుగా సెలవులో ఉన్నా ఆనందరావు ఏ ఆందోళనా లేకుండా నిశ్చింతగా ఉన్నాడు. ఈశ్వర రావు మాత్రం తెగ హైరానా పడిపోతున్నాడు. ఓ పక్క స్కూల్ వర్క్, మరోపక్క ఇంట్లో వ్రతం గురించిన టెన్షన్-- అన్నీ కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
      అనుకున్న విధంగానే వ్రతం రోజు రానే వచ్చింది. ఇంట్లో తతంగమంతా పూర్తయి, ఎక్కడివారు అక్కడికి వెళ్ళేసరికి రాత్రి బాగా పొద్దు పోయింది మరునాడే ఇన్స్పెక్షన్. అలసట వల్ల, బడలిక వల్ల, మానసిక ఆందోళన వల్ల ఉదయం త్వరగా లేవలేక స్కూల్కు ఆలస్యంగా వెళ్ళాడు ఈశ్వరరావు. అప్పటికే పర్యవేక్షణాధికారి వచ్చి ఉన్నాడు. అతని క్రమశిక్షణా రాహిత్యాన్ని, బాధ్యత లేనితనాన్ని, పేరుకు పోయిన రికార్డు పనుల్ని చూసి తల వాచేలా  చీవాట్లు పెట్టాడు. అందరి ముందు అవమానభారంతో నిలబడ్డ ఈశ్వరరావుకు తల తీసేసి నట్లయింది. అది చాలదన్నట్లు ఆనందరావు పనితనాన్నీ, నిజాయితీని ప్రత్యేకంగా ప్రశంసించాడు. 
   ఇన్స్పెక్షన్ పూర్తయింది. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొని ఇళ్లకు బయలుదేరారు. కానీ ఈశ్వర్ రావు  మాత్రం గుండె బరువెక్కి పోయి అలాగే తన క్లాస్ రూం లో కూర్చుండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఆనందరావు మాత్రం తనను వెతుక్కుంటూ వచ్చాడు. ఈశ్వరరావు కళ్ళల్లో అప్రయత్నంగా గిర్రున నీళ్ళు తిరిగాయి. 
  తన భుజం మీద ఉన్న ఆనందరావు చేయి అదుముతూ, 
" ఆనంద్, ఒకటడగనా, నీకు దేవుడిపై నమ్మకం లేదు. ఎన్నడు నీవు గుడికి వెళ్ళడం నేను చూడలేదు. కానీ, అన్నింటిలోనూ విజయం సాధిస్తున్నావు, నీ విజయ రహస్యం ఏమిటి?... " గొంతు పెగల్చుకుని అడిగాడు. 
 ఆనందరావు నవ్వి, 
"  నాకు దేవుడిపై నమ్మకం లేదని ఎప్పుడు చెప్పాను? ఏదో ఒక అతీతమైన శక్తి ఈ లోకాన్ని నడిపిస్తోందని నేను నమ్ముతాను. ఆశక్తే దేవుడంటాను. కానీ, ఈశ్వర్, ఒకటి గుర్తుంచుకో. నిత్యం ఆరాధిస్తూ ఉంటేనే దైవాన్ని కొలిచినట్లా? భక్తితో మనసులో తలుచుకుంటే చాలదా ! ఆ సంగతి గ్రహించని నీవు నీ ఉద్యోగ ధర్మాన్ని కూడా అలక్ష్యం చేసి, ఒక విధంగా దేవుణ్ణి అవమానించావు. ఎలాగంటావా? Duty is God  -- పనే దైవం-- అన్నమాట నీకు తెలియనిదా! నీ విద్యుక్తధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి అలక్ష్యం చేసినట్లు కాదా!....... "
 కొరడాతో చెళ్ళున కొట్టినట్లయింది ఈశ్వరరావు కి. 
".... నా ఉద్యోగ ధర్మాన్ని నేను ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్నాను. అందువల్ల నేను దేవుణ్ణి నిత్యం పూజిస్తూనే ఉన్నానని భావిస్తాను... " కొనసాగిస్తూ అన్నాడు ఆనందరావు. 
  ఏదో కొత్త విషయాన్ని అవగతం చేసుకున్న జ్ఞానిలా అక్కడ నుంచి లేచాడు ఈశ్వరరావు. ఆనందరావు భుజం మీద చేయి వేసి అతనితోపాటు ముందుకు కదిలాడు. 

******************************************
            🌷 భువి భావనలు 🌷
******************************************

Monday, March 8, 2021

మహిళా, మేలుకో !

ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతావని
 అతివకొసగిన ఆనందానుభూతి ఏది ? 
 అహరహం శ్రమించినా పట్టెడన్నం నోచని వైనం !
 బడుగు జీవియై లాగిస్తోంది బతుకు బండి పాపం !
 అయినా -- సహనం కోల్పోలేదు మరి-- ఆమె నారీమణి!
 చదివి చదివి అలసిసొలసి ఆదమరచి నిదరోయిన 
 చిన్నారి చిట్టితల్లి విహరిస్తోంది 
 రేపటి ఆశల రెక్కల గుర్రం పైని 
 కలలు తీరం చేరక కల్లలై వెక్కిరించిన క్షణాన 
 ఏడుస్తుంది పాపం, పొగిలి పొగిలి!
 అయినా స్థైర్యం కోల్పోదు మరి --
 ఆమె నేటి తరుణీ ప్రతినిధి  !🙋
 కన్యాశుల్కం కనుమరుగై వరకట్నం వట వృక్షమై 
 అప్పుడూ ఇప్పుడూ బలిపీఠం తనకే సొంతమై
 ఉరి బిగుస్తూ తపిస్తూ తపిస్తూ
 తల్లడిల్లుతున్న తటిల్లత !😔
 కోర్కెలు శిధిలమై కోరింది అందకున్నా 
 అందినదే అందలం అనుకునే నెలత ! 
 ఎందుకంటే --  నాడు, నేడు --ఏనాడైనా 
 ఆమె ఓ సగటు మహిళ  !
అంతటి ధీరవనిత నేడు --
మహిలో మానవమృగాల మధ్య 
మనలేక మగ్గిపోతున్నదే !
సహనం, సర్దుబాటు, ఓర్పు, నేర్పు, దీక్ష, దక్షత 
త్యాగం, శీలం --అన్నీ కలబోసుకున్న ధన్యజీవి !
దుష్టసాంప్రదాయాల దురంతాల కోరల జిక్కి 
నలిగిపోతున్నదే ! ఈ సమాజం ఏ తీరున మారాలి? 
మహిళాదినోత్సవాలెన్ని వచ్చిపోతున్నా
మారని ఈ రాక్షస వైఖరినేమనాలి? 
స్త్రీ, పురుష సమానత్వం మాటలకే పరిమితమైతే 
చట్టాలన్నీ కాగితాల్లోనే పదిలమైతే 
తరుణి తలరాత మారడం ఎలా సంభవం !
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిననాడే 
అసలైన స్వాతంత్య్రం అన్నావు 
పట్టపగలే పడతికి పదుగురున్నా 
రక్షణ కరువైన దుస్థితి పైనుండి చూస్తూ 
ఓ మహాత్మా ! ఎంతగా కుమిలిపోతున్నావో గదా !
చివరగా --
 ఎవరో వచ్చి ఏదో చేస్తారని 
 దిక్కులు చూస్తూ ఎదురు చూడడం
 ఎండమావిలో జలధారకై 
 వెతుకులాడుతూ తపించడమే !
 మహిళకు మనుగడ సడలని తన మనోధైర్యమే 
 తరగని చెదరని ఆత్మవిశ్వాసమే
 సదా ఆమెకు రక్షణ కవచం 
 ఈ నిజం గ్రహించగలిగితే చాలు
 ప్రతి స్త్రీ అవుతుంది ఓ ఉక్కు మహిళ !
 అందుకే --
ఓ మహిళా ! మేలుకో !
మేలుకొని నీ భవిత నీవే తీర్చి దిద్దుకో !
అబలను కాను సబలను 
అని నిరూపించుకో !!  🙏

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷    
            నేడు [  08.03.2021 ]
             మహిళా దినోత్సవం 💐
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
          
                  🌺  భువి భావనలు  🌺


Tuesday, March 2, 2021

ఎన్నికలు... ఎన్ని కలలు... !

 దాదాపు పది రోజుల క్రితం దినపత్రిక తిరగేస్తుంటే ఓ హెడ్డింగ్ నన్నాకర్షించింది. కాస్తంత తమాషాగా, మరింత ఆసక్తికరంగా ఉండడంతో వెంటనే గబగబా చదివేశాను. దాని సారాంశం --
 గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు ముమ్మరంగా జరుగుతున్న సందర్భంగా ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రతీ ఇంటికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చిందట ! వాళ్లేమో దాన్ని కోసుకుని చికెన్ వండుకుని తినేశారట ! మరుసటి రోజు ఆ సంగతి తెలిసిన ప్రత్యర్థి వెంటనే ఇంటికి రెండు కోళ్ల చొప్పున పంపిణీ చేసేసిందట! ఇంకేముంది ! కోళ్లను ఇచ్చారు సరే, అవి తిన్న రుణం ఎలా తీర్చుకోవాలో, ఓటెవరికెయ్యాలో తెలీక సందిగ్ధంలో పడిపోయి జనాలంతా బుర్ర గోక్కోవడం మొదలెట్టారట ! మరో రోజు మరో వార్త ! ఓ అభ్యర్థి ఇంటింటికీ చీర సమర్పిస్తూ ప్రచారం సాగించిందట ! అంతేనా! ఓటుకింత అని లెక్కగట్టి ఇంటింటికీ పంచుతూ లక్షలు లక్షలు గుమ్మరిస్తున్నారని చెవులు కొరుక్కోవడం ! అందులో నిజమెంతో తెలియదు గానీ అలా చెప్పుకుంటున్నది మాత్రం వాస్తవం. గ్రామ సర్పంచ్ లాంటి చిన్న పదవి కోసం ఇంత పెనుగులాట, ఆర్భాటం అవసరమా అంటే అది'ప్రిస్టేజ్ ' ఇష్యూ గా తీసుకుంటున్నట్లు సమాచారం ! 
   ఇంతా చేసి ఆఖరికి అతి తక్కువ మెజారిటీ తో గెలవటం ! రెండు, మూడు ఓట్ల తేడాతో గెలిచారు అన్న వార్తలూ చదివాం. ఈ సందర్భాల్లో గెలిచిన వాళ్లకు 'గెలిచాంరా దేవుడా 'అనుకోవడం తప్ప పెద్దగా సంతోషించాల్సినదేమీ కూడా ఉండదేమో ! ఇకపోతే, జయాపజయాలు దైవాధీనాలు. గెలుపన్నది ఏ ఒక్కరికో దక్కుతుందన్నది తెలిసిందే. అయినా రెండు మూడు ఓట్ల తేడాతో ఓటమిపాలైన వారి పరిస్థితి ఊహించుకోవడానికే బాధాకరం. ఇక వాళ్లకి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా! ఎలెక్షన్ల ఊసు మొదలైన క్షణం నుండి పోలింగ్ పూర్తయిన క్షణం దాకా ఎన్నెన్ని కలలు కని ఉంటారో కదా! ఎవరి పిచ్చి వాళ్ళ కానందం అన్నట్లు ఒక్కొక్కరి టేస్ట్ ఒకలా గుంటదేమో ! ఇది పాలిటిక్స్ పిచ్చి అనుకోవచ్చు అనుకుంటా. ఏదో ఒక రోజు గెలిచి తీరుతామన్న ధీమా కావచ్చు, కొందరు మళ్ళీ మళ్ళీ పోటీలో నిలుస్తుంటారు. 
    ఇంతకీ-- గ్రామస్థాయిలో ఇంత కోలాహలం, ఇంతటి అనూహ్య స్పందన (? ) మున్నెన్నడూ కనీవినీ ఎరుగం! పల్లెటూరి ప్రజలు అమాయకులు, కల్లాకపటం తెలియనివాళ్లు, కల్మషం ఏమాత్రం లేని సహృదయులు, ఇంకా చదువు పెద్దగా లేకపోయినా సంస్కారం పుష్కలంగా ఉన్న వాళ్ళు అన్న అభిప్రాయం ఆదినుండీ ఉంది. కానీ, అలాంటి ప్రశాంతతకు ఆలవాలమైన పల్లెలు ఇప్పుడు ఇలా మారిపోయాయి అంటే ఏమనుకోవాలి? ఎవరిని నిందించాలి? 
    ఒకప్పుడు గ్రామం మంచి కోరి పాటుపడే వాళ్లకు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఓటు వేసే వారు. గ్రామ పెద్దల మాటే వేదంగా ఉండేది. కానీ, ప్రస్తుతం కక్షలూ, కార్పణ్యాలూ, ఈర్ష్యా ద్వేషాలు ప్రబలి పరస్పరం అభిమానం, గౌరవం కరువైపోయింది మరి! 
     ఆఖరికి జనాలు ఎన్నికలు వస్తున్నాయంటే అదేదో పండుగ వస్తోంది అన్నట్లుగా ఫీలయి ఆనందిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా తయారైందో ఊహించు కోవచ్చు. మహాత్మా గాంధీ ఇప్పుడు గనక పుట్టినట్లయితే స్వతంత్ర భారతావనిని చూసి తల పట్టుకుని తల్లడిల్లిపోతాడు ఖచ్చితంగా.
        ఆగండాగండి, అయిపోలేదు, ఇంకా ఉంది. అదిగో, కార్పొరేషన్ ఎన్నికలు. సంరంభం మొదలైంది. అభ్యర్థులు గుంపులు గుంపులుగా వీధుల వెంట కనిపిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారాలు సాగిస్తున్నారు, చూద్దాం, ఎవరి కలలు ఫలిస్తాయో !!

***************************************
               🌺భువి భావనలు 🌺
***************************************