చిలకా..ఓ చిలకా..ఓ రామచిలకా
పంచవన్నెల చిలుకా..అందాల ఓ చిలకా
పచ్చాని ఆరెక్కలు వయ్యారి ఆ నడకలు
పదుగురికి పంచేను పరవశాల తరంగాలు
పలుక నేర్చినావులే.. పదము పలికినావులే
'రామ' నామస్మరణ చేత 'రామ'చిలుక వైతివిలే //చిలుక//
ఎర్రానీ ఆ ముక్కు ముచ్చటైన ఆ వంపు
మెడ చుట్టూ మెరిసేటి ఆ హారం సొంపు
ఆకుపచ్చ కోక గట్టి అందమంత మూటగట్టి
కులుకుతున్న నిన్ను జూసి నెమలి కూడ
తెల్లబోయి తేరిపార చూడసాగెనే
నాట్యమాడ సంచయించి ఆగిపోయెనే
ఒక్కసారి చూడు చూడు అటు చూడవే //చిలుక//
ఆకుల్లో దాగి దాగి దోబూచులాడతావు
చూసే మా కళ్ళకు విందులే చేస్తావు
కొమ్మ మీద వాలిపోయి అటూ ఇటూ వెతుకుతావు
జామచెట్టు చూస్తావు.. జామకాయ కొరుకుతావు
కొరికినవే మీకంటూ మాకోసం విసురుతావు
తీయనైన ఆపళ్లు నీకు మహా ఇష్టం
రుచి చూసిన ఆ పళ్ళే మాకు మరీ ఇష్టం //చిలుక//
రోడ్డువారగుంటావు జోరు మీదుంటావు
జాతరలో ఉంటావు జాతకమే చూస్తావు
అరచేతిని అందిస్తే జోస్యమే చెబుతావు
చిలుక పలుకు భవిత తెలుపు అంటావు
రేపుతావు రేపటిపై అంతులేని ఆశలు
నీ పలుకులు పసందైన పంచదార గుళికలే
ఆరిపోవు దీపానికి నీ మాటలు ఆసరాలే //చిలుక//

No comments:
Post a Comment