Sunday, December 8, 2024

నది... కథ

 *****************************************


☀️నిండుగా ప్రవహించే నది తనలోని సుడిగుండాల్ని, ఆటుపోట్లని  తనలోనే దాచుకొని ఎంతో గంభీరంగా, మరెంతో  ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. యమున కూడా ఈరోజు దాకా అందరి చేత ఓ నిండునది లాంటిది అనిపించుకొంది. జీవితాంతం అలాగే ఉండేదే కానీ... అనుకోకుండా ఆమెలో ఈరోజు అలజడి చెలరేగుతోంది. అందుకు కారణభూతమైన క్షణాలు ఎంత వద్దనుకున్నా ఆమెను మరీ మరీ కమ్ముకుంటున్నాయి.
    కన్నతల్లికి కన్నబిడ్డలంతా సమానమే అని అంటారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగడం తల్లి హృదయం భరించలేదంటారు. మరి ఇదెలా సంభవించింది ! 
   యమున ఇంటర్లో ఉండగానే ఆమె తండ్రి పెరాలసిస్ తో మంచం పట్టాడు. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆదాయం మరీ సన్నగిల్లింది. ఇంటికి పెద్ద కూతురు తనే. ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడు. యమున చదువు సాగడం దుర్లభమయింది. విధిలేని పరిస్థితి. కుటుంబ పోషణకై తనూ ఓచేయి వేయక తప్పలేదు. యమునకు తండ్రి కోలుకుని సంసారరధాన్ని యధా ప్రకారం మోస్తాడనీ, తన చదువు మళ్లీ కొనసాగుతుందనీ కొండంత ఆశ పెట్టుకుంది. కానీ త్వరలోనే అవి అడియాశలే అని కొద్ది కాలానికే తెలుసుకుంది. తండ్రి జబ్బు  ఆయనని మామూలు మనిషిని చేయలేదు కానీ, జీవచ్ఛవంగా మార్చి వదిలి వేసింది. 
      ఇక యమున నడుం బిగించక తప్పలేదు. తండ్రి అనారోగ్యం, ఎన్నడూ గడప దాటి  ఎరుగని తల్లి.  మరోవైపు.. ఇంకా బాధ్యతలు తెలియని తోబుట్టువులు...! యమునకు అనూహ్యంగా ఆశించని పెద్దరికాన్ని అంటగట్టాయి. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి, దగ్గరలోని కాన్వెంట్ లో టీచర్ గా చేరింది. అంతే.. ఆ క్షణం నుండే ఆమె జీవన పోరాటం మొదలైంది. క్షణం తీరిక లేకుండా ఇంటా బయటా చేసి ఏదో ఒకలాగా నాలుగు రాళ్లు సంపాదించడమే ఆమె ధ్యేయమైపోయింది. అలుపెరుగని ఆ ప్రయాణంలో తీరా కాస్త సమయం దొరికి వెనక్కి తిరిగేసరికి... ఇంకేముంది !! తను ఎక్కడ ఉందో తనకే తెలియని అయోమయ స్థితి!
      ఇంట్లో ఉండే కష్టపడి క్వాలిఫికేషన్ పెంచుకుంది. జీతం పెరిగింది. ఉద్యోగ స్థాయీ పెరిగింది. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి తన కష్టార్జితంతోనే  జరిపించింది. తమ్ముడి చదువు కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజో రేపో వాడూ ఓ ఉద్యోగి అవుతాడు. ఇక చిన్న చెల్లెలు ఒక్కతి ఉంది. దానికి కూడా త్వరలోనే ఏదో ఒక సంబంధం చూసే ప్రయత్నంలో ఉంది. అంతా స్థిరపడినట్లే.. కానీ, తనకే..ఎందుకో ఇన్నేళ్ల తర్వాత తనూ ఓ ఆడపిల్లనే అనీ,  తనకూ ఓ మనసనేది ఉందనీ గుర్తుకొస్తోంది. దానికి కారణమూ లేకపోలేదు. కొద్దికాలంగా చిన్ననాటి నుండీ తనతో సన్నిహితంగా  మెలిగే స్నేహితురాలు సంధ్య తనతో అంటున్న మాటలు...
" ఎంతకాలం ఇలా ఉంటావు యమునా.. నీ వాళ్ళ బాగోగులు చూడాలి సరే.. కానీ నీ గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత  వాళ్లకు లేదంటావా!? అప్పుడే నీకు ముప్పై దాటిపోయాయి. తమ్ముడు, చెల్లెళ్లు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇకనుంచి అయినా నీ గురించి నీవు ఆలోచించుకోరాదా..."
     ఒక్కసారి కాదు యమున కలిసిన ప్రతిసారీ ఈ ప్రసక్తి తీసుకురాకుండా ఉండలేకపోయేది సంధ్య. అప్పట్లో ఆమె మాటలు తేలిగ్గా కొట్టి పారేసేది యమున. కానీ ఈ మధ్య ఎందుకో ఏదో తెలియని దిగులు.., వెలితి ఆమెను చిన్నగా వేధించడం మొదలు పెట్టాయి. క్రమక్రమంగా ఆమె ఆలోచనలు ఆ కోణంలో సాగడం మొదలైంది.
      సరిగ్గా అప్పుడే ఆమెకు తట్టింది.. అవునూ... సంధ్యకు వచ్చిన ఆలోచనలు కన్నతల్లిగా నా తల్లికీ వచ్చి ఉండాలి కదా..! కానీ ఎందుకో అమ్మ నా పెళ్లి గురించి ప్రస్తావించడం గానీ బాధపడడం కానీ చూడలేదు తను. అయినా పైకి ఎలా చెప్పుకోవాలో తెలియక లోలోపల ఆమె నా గురించి ఎంత కుమిలిపోతూ ఉందో ఎవరికి తెలుసు!! అనుకుందామె అంతరంగం.
" ఏది ఏమైనా నేనూ స్థిరపడాలి జీవితంలో... "
 ఎంతో అంతర్మధనం తర్వాత ఓ స్థిర నిశ్చయానికి వచ్చింది యమున.
                       **           **             **
     ఆ తర్వాత కొద్ది రోజులకే సంధ్య నుండే ఆమెకో ప్రపోజల్ వచ్చింది.
" యమునా, నీ పరిస్థితిని అవకాశం గా తీసుకొని ఈ సంబంధం గురించి చెప్తున్నానని దయచేసి నీవు అనుకోవద్దు. అతను వరుసకు నాకు కజిన్ అవుతాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇద్దరు పాపలున్నారు.ఆరేళ్లు, నాలుగేళ్లు ఉంటాయి.భార్య జబ్బుతో కొద్దికాలం క్రితం చనిపోయింది. నేను చెప్పడం కాదు గానీ మనిషి చాలా మంచివాడు. సర్దుకుపోయే మనస్తత్వం. నీ గురించి చెప్పాను. నీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడమన్నాడు. అతనికి తన పిల్లలంటే ప్రాణం. మళ్లీ పెళ్లి చేసుకుంటే వారికి అన్యాయం జరుగుతుందని ఆ ఊసే లేకుండా ఉన్నాడు. కానీ నీ గురించి నేను చెప్పాక, సరే అన్నాడు. నీవు గనక ఒప్పుకుంటే నీ జీవితం ఓ దారిలో పడినట్లే... యమునా, ఇంక ఏమీ ఆలోచించకు... "
     ఆ తర్వాత కొద్ది రోజులు ఆ సంబంధం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది యమున. మరుసటి వారం అతను రానే వచ్చాడు యమునను చూడటానికి. పెళ్లిచూపుల తతంగమేమీ లేకుండా ముందుగా అనుకున్న విధంగా ఓ పార్కులో కలిశాడు.
" మళ్లీ వివాహం చేసుకోవాలన్న ఆకాంక్ష నాకు లేదు. కానీ సంధ్య మీ గురించి మరీ మరీ చెప్పింది. మీ సహనం, ఓర్పు, త్యాగగుణం... ఇవన్నీ నాకు నచ్చాయి. నా పిల్లలకి మళ్ళీ తల్లి దొరికితే చాలని నేను కోరుకుంటున్న తరుణంలో మీరు తటస్థపడటం నా పిల్లల అదృష్టంగా భావిస్తున్నాను... "
 యమున ఏమీ మాట్లాడలేదు. పది నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు త్వరలో ముహూర్తాలు  పెట్టిస్తాను అంటూ. యమునకూ అభ్యంతరం చెప్పడానికి ఏ కారణం కనిపించలేదు. తనను వెతుక్కుంటూ సంబంధం రావడమే గొప్ప. పిల్లలుంటేనేం.. నాకూ ఓ ఇల్లంటూ ఏర్పడుతుంది అనుకుంది.
    ఇంతవరకూ జరిగిన విషయాలు ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈరోజు చెప్పాలనుకుంటూ లేచి ఇంటి దారి పట్టింది.
                        **           **           **
"  యమున పెళ్లికి ఇప్పుడు ఏం తొందర అన్నయ్య? చిన్నదాని పెళ్లయిపోతే, అబ్బాయి గురించి దిగులు ఏముంటుంది గనక!అందుకే... ఇప్పుడు యమునకు మీరు తెచ్చిన సంబంధాన్ని చిన్న దానికి చూద్దాము. ఇక యమున అంటారా... దాన్ని ఎప్పుడూ మేము కూతురుగా చూడలేదు. ఈ ఇంటి పెద్ద కొడుకు గానే భావించాము. పైగా దానికి పెళ్లీడు కూడా  దాటిపోయింది. ఎలాగూ ఉద్యోగం ఉంది కాబట్టి దాని జరుగుబాటు గురించి ఆలోచన లేదు. అలాగని దానికి పెళ్లి వద్దని అనడం లేదు. కాకపోతే ఈ చిన్న పిల్ల బాధ్యత తీరిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది..ఆతర్వాత...యమున రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది...ఏమీ అనుకోక ముందు చిన్నదాని సంగతి చూడండి అన్నయ్యా... "
     అప్పుడే గుమ్మంలో కాలు పెట్టబోతున్న యమున చెవిలో తల్లి మాటలు పడనే పడ్డాయి. ఆమెలో ఒక్క సారిగా భూమి,ఆకాశం బద్దలౌతున్న అనుభూతి!!
                    **         **             **
   సమయం రాత్రి పదకొండు దాటింది. యమునకు కంటిమీద కునుకు పట్టడం లేదు.. పదేపదే తల్లి మాటలు చెవుల్లో మార్మోగుతూ ఆమె గుండెల్ని పిండి వేస్తున్నాయి. కన్నతల్లిలో ఇంతటి స్వార్థమా! కూతురు గురించి ఇంత కఠినంగా ఆలోచించే మాతృ హృదయం కూడా ఉంటుందా! ఇంతకాలం కేవలం నన్ను  మిగతా పిల్లల అభివృద్ధికే చేయూతగా వాడుకున్నారా!! ఆమె మెదడు మొద్దు బారి పోయింది.
   ప్రస్తుతం ఆమెలో చెలరేగుతున్న అలజడికి అదే కారణం. మునుపెన్నడూ స్పందించని రీతిలో ఆమె హృదయం   తల్లడిల్లి పోసాగింది. ఆ స్థితిలో కొద్ది రోజులపాటు వేదనతో ఊగిసలాడిన ఆమెలో ఓ నిర్ణయం రూపు దిద్దుకుంది. ఆతర్వాత కాగితం, కలం తీసుకుని రాయడం మొదలెట్టింది.
డియర్ సంధ్యా,
         నా గురించి నీవు పడిన తపన రక్తం పంచుకు పుట్టిన నా తోబుట్టువుల్లో నేనెన్నడూ చూడలేదు. నా సంపాదనలో ప్రతి పైసా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ ఎన్నడూ వారి కళ్ళలో నా పట్ల కృతజ్ఞతగానీ, ప్రేమ భావంగానీ నేను ఎరుగను. మా అక్క తమ అందరికోసం ఆహుతైపోతోందన్న ఆలోచన, బాధ వారిలో ఏ కోశానా ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఇప్పుడు నన్ను పెళ్లాడాలనుకున్న  వ్యక్తి నన్ను తన పిల్లల కోసమే తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు తప్ప నన్ను నన్నుగా కాదు. అతను నాతో మాట్లాడిన కొద్ది నిమిషాలు తన పిల్లల గురించి తను ఎంతగా ఆరాటపడుతున్నాడో చెప్పాడే గానీ నా గురించి, నా జీవితం గురించీ అతనికి ఏ ధ్యాస ఉన్నట్లు నేను గుర్తించలేదు. ఇంతవరకూ నా జీవితం, జీతం నా వాళ్ళు అనుకున్న వాళ్లకోసం  ఖర్చుచేశాను. ఇకనుంచీ అతని సంబంధీకుల కోసం చేయాలి. వద్దు సంధ్యా, నన్ను ఇలా బ్రతకనివ్వు. ఇలా మాట్లాడుతున్నందుకు అన్యధా భావించకు. నేను చాలా అలసిపోయాను. ఇక మీదటైనా నా జీవితం నా కోసమే అనుకుంటున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా ఆలోచించాను సంధ్యా. నా ఆలోచనలకు సరిపడే వ్యక్తి తటస్థిస్తే తప్ప పెళ్లి గురించి ఆలోచించను. జీవితంలో పెళ్లి ఒక భాగమే. పెళ్లే జీవితం కాదు. జీవిత పరమార్ధమూ కాదు. నా వ్యక్తిత్వం నిలబడాలి. నా జీవితం కేవలం నాదే కావాలి. మరెవరి కోసమో కాదు.సహనం, ఓర్పు ఉండాలి, నిజమే.. కానీ, అది హద్దుల్లో ఉంటేనే బాగుంటుందని స్వానుభవంతో తెలిసొచ్చింది.కాస్త ఆలస్యం అయిందంతే.అంతో ఇంతో స్వార్థమన్నది మనిషికి అవసరం కూడా.నదిలో ఎన్ని లొసుగులున్నా నిండుగానే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ, ఉప్పొంగితేనో !! ఈ యమున కూడా అంతే ! నా కోసం నీవు ఎంతో ఆలోచించావు. కానీ నన్ను అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో ఉన్నాను.బాధనిపిస్తే క్షమించు.నా నిర్ణయం నీవు హర్షిస్తావని ఆశిస్తూ...
                                                  స్నేహమయి 
                                                     నీ యమున 
*****************************************
       [ వనితా జ్యోతి మాసపత్రికలో ప్రచురితం ]
*****************************************





No comments:

Post a Comment