Saturday, March 9, 2024

హోమ్ మినిస్టర్....కథ

  🌷                                         ~~యం.ధరిత్రీ దేవి~~
   
    కిటికీలోంచి సూర్యకిరణాలు చురుక్కుమని తగిలేసరికి కళ్ళు నులుముకుంటూ బద్ధకంగా లేచి కూర్చున్నాడు సాంబశివరావు. అప్రయత్నంగా గోడకేసి చూసిన అతనికి గడియారం ఎనిమిది గంటలు చూపించింది. 'మై గాడ్' అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి హాలు లోకెళ్ళిన అతనికి అడ్డదిడ్డంగా పడి ఇంకా లేవని ఇంటర్, డిగ్రీ చదువుతున్న సుపుత్రులు వంశీ, వరుణ్ దర్శనమిచ్చారు. తండ్రి అరుపులకు దిగ్గున లేచి బాత్రూంలోకి దూరిపోయారిద్దరూ. 
   హడావుడిగా కిచెన్ లో అడుగుపెట్టిన అతనికి రాత్రి తిని పడేసిన ఎంగిలి కంచాలు, అంట్లగిన్నెలు వాసన కొడుతూ కనిపించేసరికి ఒక్కసారిగా నీరసం కమ్ముకొచ్చి ఠక్కున ఇల్లాలు గుర్తొచ్చింది.
    నిన్న ఉదయం వాళ్ళనాన్న బాత్రూంలో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంటుగా రమ్మని వాళ్ళ అమ్మ ఫోన్ ! అంతే!గబగబా వంట చేసేసి, రెండు చీరలు ఓ  సంచీలో కుక్కుకుని ముక్కు చీదుకుంటూ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయింది జానకి...అతని అర్ధాంగి. ప్రస్తుతం ఇంటి  దీన పరిస్థితికి అదీ కారణం...
   అరగంటలో స్నానాలు, గీనాలు ముగించేసి బయటపడ్డారు ముగ్గురూ.అలా అలా నాలుగు రోజులు గడిచాయి. సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం భయంగా ఉంటోంది సాంబశివరావుకి... ఇల్లంతా దుమ్ము...! ఎక్కడి  సామాన్లు అక్కడే! విడిచి బట్టలన్నీ మంచాల మీద !! వంటిల్లయితే చెప్పనలవికానట్లుంది... ఇంటి బయట ఎండిన ఆకులు, దుమ్ము ధూళి.. అంతా పరుచుకొని కంపరంగా అనిపిస్తోంది. వాటి కింద నుండి జానకి వెళ్లే రోజు ఉదయం వేసిన ముగ్గు దీనంగా తొంగి చూస్తూ కనిపిస్తోంది. ప్చ్ ! ఎలా ఉంచేది ఇల్లు!! అద్దంలా... ముట్టుకుంటే మాసిపోతుందా అన్నట్లు..!
    వారం దాటింది. జానకి జాడలేదు. ఫోన్ చేస్తే... "వయసు బాగా మీద పడింది కదా... నాలుగైదుచోట్ల కాలి  ఎముకలు విరిగాయట...రెండు ఆపరేషన్లు అయ్యాయి. మరో వారం దాకా హాస్పిటల్లోనే ఉండాలట... మా అమ్మ ఒక్కతే ఇంట్లో, హాస్పిటల్లో చూసుకోలేకపోతోంది. వచ్చేవారం మా అన్నా,   వదిన వస్తామన్నారు. అందాక నేను రాలేను... ఎలాగోలా మీరే సర్దుకోండి..."
 అంటూ చెప్పేసింది జానకి. గుండెల్లో రాయి పడింది సాంబశివరావుకి. ఇద్దరు  కొడుకులు తల వేలాడేసుకుని, మౌనంగా ఉండి పోయారు. చేసేదేముంది... అనుకుంటూ.. ఉదయం కాఫీలు మాత్రమే ఇంట్లో... టిఫిన్లు, మధ్యాహ్న భోజనం... బయట. రాత్రి మాత్రం ఏ ఉప్మానో, చపాతీనో చేసుకుని చట్నీలతో, కారంపొడులతో కానిచ్చేస్తున్నారు. 
    సాంబశివరావుకి వంట బొత్తిగా రాదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్  తీసుకొని ఉండేవారు. అప్పుడు కాస్త అలవాటు అయినవే..ఈ ఉప్మా, చపాతీ ప్రిపరేషన్లు... భార్య వచ్చాక, ఇక వంటింట్లో అడుగు పెట్టే అవసరం నాకేంటి.... అన్న ఫీలింగుతో కాలర్ ఎగరేసి తిరిగాడు.అంతేనా !  ఇద్దరూ కొడుకులే పుట్టారని తెగ మురిసిపోయాడింతవరకూ. కానీ.. ఇప్పుడు తెలిసి వస్తోందతనికి... ఆడపిల్ల లేని లోటు..! దేవుడా! నిజంగా ఆడది లేని ఇల్లు ఇంత దారుణంగా ఉంటుందా..! ఇంటికి దూరంగా ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు జానకి... కాన్పుల సమయంలో కూడా వాళ్ల ఊర్లో వైద్య సౌకర్యం సరిగా ఉండదని ఇక్కడే ఉండిపోయింది మరి... నిస్సహాయ స్థితిలో పడిపోయిన సాంబశివరావుకి పదేపదే పెళ్ళాం గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేముంది...!
    ఎలా ఉండేది ఇల్లు జానకి చేతిలో! ఉదయం ఎప్పుడు నిద్ర లేచేదో ఏమిటో... ఎనిమిదింటికంతా ఒంటిచేత్తో అన్నీ  సిద్ధం చేసి ఉంచేది. పనిమనిషి కూడా వద్దని సర్వం తనే చేసుకునేది. అందరి బట్టలూ ఉతికి ఇస్త్రీ చేసి టైంకు రెడీగా ఉంచేది. సాయంత్రం ఇంట్లో అడుగు  పెట్టేసరికి.... ఇల్లంతా ఆహ్లాదకరంగా. హాయిగొల్పుతూ ఉండేది. ఇప్పుడు..! తను లేని ఇల్లు బావురుమంటూ భారంగా అనిపించింది సాంబశివరావుకి! ఉన్నప్పుడు తెలియలేదు గానీ తన విలువ...ఎంతైనా ఆడవాళ్లు గ్రేట్ !! అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో 'ఇల్లాలు', 'ఇల్లాలే దేవత ', 'ఇంటికి దీపం ఇల్లాలు '...లాంటి సినిమా టైటిల్స్ అన్నీ గుర్తొచ్చాయి. దాంతోపాటు... 
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, 
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి  "
"ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం "
లాంటి సినిమా పాటలు కూడా గుర్తొచ్చి, గుచ్చి గుచ్చి మరీ వేధించాయి. 
   ఆ సాయంత్రం వంటింట్లో అడుగు పెట్టిన అతని చూపు అప్రయత్నంగా ఆ పక్కనే ఉన్న దేవుని గూడుపై పడింది. జానకి వెళ్లేరోజు పూజ చేస్తూ పెట్టిన పూలు, వాడి ఎండిపోయాయి. అగరొత్తుల తాలూకు ఆనవాళ్లు అక్కడ గూటినిండా పరుచుకుని ఉన్నాయి. అతని మనసంతా కలచివేసినట్లయింది. వెంటనే చీపురు తీసుకుని ముందు వంటిల్లంతా  శుభ్రం చేశాడు.అలవాటు లేని పని !దేహం మొరాయించింది. అయినా,  అలాగే మిగతా రూములూ అయిందనిపించాడు. .. కొడుకులు అది  చూసి లేచారు. పక్క బట్టలన్నీ సర్దేశారు.
    లోపల ఎలాగోలా అయిపోయింది... మరి గేటు బయట సంగతి! ఊడ్చడానికి నామోషీ ఒకటి! తల పట్టుకుని, "ఈ  ఇల్లు అద్దెకిస్తారా " అని ఎవరూ  అడగకముందే జానకి వచ్చేస్తే బాగుండు అనుకున్నాడు లోలోపల సాంబశివరావు. పోనీ, ఎవరైనా పనిమనిషిని చూద్దామా అనుకుంటే అంత అర్జెంటుగా దొరకడం గగన కుసుమమే! ఫోన్ చేసి భార్యను రమ్మనేద్దామా అనుకున్నాడో క్షణం. అత్తింటి వాళ్ళు ఎన్నడూ తన సహాయం కోరింది లేదు ఇప్పటివరకూ. లేక లేక అవసరమొస్తే తానలా చేయడం నచ్చక ఆ ఆలోచన విరమించుకున్నాడు వెంటనే..వారం అన్న జానకి మరో వారం దాకా రాలేదు. వాళ్ళ అన్నకు సెలవు దొరకలేదట..డీలా పడిపోయి జ్వరం వచ్చినంత పనయింది సాంబశివరావుకి.
   ఆరోజు ఉదయం తెలతెలవారుతుండగా గేటు చప్పుడయింది. జానకి రెండు సంచులతో ఇంట్లో అడుగు పెట్టింది. వంటింట్లో పాలు మరగబెట్టే పనిలో ఉన్న సాంబశివరావు అది గమనించి, అకస్మాత్తుగా దేవత ప్రత్యక్షమైనట్లు సంబరపడిపోయాడు..
" జానకీ, వచ్చేశావా...! ఫోనయినా చేయలేదే!.."
 అంటూ సంచులు అందుకున్నాడు.
" అవునండీ, అన్న, వదిన నిన్న సాయంత్రం వచ్చేశారు. ఇప్పటికే లేటయిందని నేను రాత్రి బస్సుకే బయలుదేరాను...ఏమిటీ, వీళ్ళింకా లేవలేదా..!"
అంటూ పిల్లల గదిలోకి తొంగి చూసింది. తల్లి గొంతు వినిపించి ఇద్దరూ గబగబా లేచి వచ్చారు వంశీ, వరుణ్. ఇల్లంతా ఓసారి పరికించి చూసిన జానకికి అంతా అర్ధమైపోయింది. అప్పటికప్పుడు ఏమీ  అనాలనిపించలేదామెకు. చీర కొంగు బిగించి, చీపురు అందుకుంది. అరగంటలో ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఇన్నేళ్లుగా తాను చేస్తున్న తప్పిదం బాగా తెలిసి వచ్చిందామెకు. దాంతోపాటు తన కర్తవ్యం కూడా బోధపడింది. ఇదంతా ఏమీ పట్టని సాంబశివరావు ఊపిరి పీల్చుకొని ఈజీ చైర్ లో రిలాక్స్ అయ్యాడు. 
    ఆ సాయంత్రం...
" రేయ్ఎక్కడికి బయల్దేరారు?... "
 కాలేజీ నుండి వచ్చి బ్యాట్లు పుచ్చుకుని బయటకు దారి తీయబోతున్న వంశీ, వరుణ్ తల్లి వైపు బ్యాట్లు  చూపిస్తూ, 
" క్రికెట్ ప్రాక్టీస్ కు మమ్మీ.."
 అన్నారు ఒకేసారి.
" అవన్నీ తర్వాత. ముందు అవి పక్కన పెట్టి ఇలా రండి, మీతో మాట్లాడాలి"
" అబ్బా,మమ్మీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రాక్టీస్ కు లేట్ అవుతుంది..."
"కుదరదు, నోరు మూసుకుని రండి."
 గద్దించేసరికి అలాగే బ్యాట్లు పట్టుకొని వచ్చి సణుగుతూ కూర్చున్నారు..
" జాగ్రత్తగా వినండి. ఈరోజు నుండీ కొన్ని అలవాట్లు మార్చుకోండి ఇద్దరూ . మీ పనులు మీరే చేసుకోవాలి.అంటే మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. మీ పుస్తకాలు అన్నీ మీరే సర్దుకోవాలి. ఇంటిపనులతోపాటు చిన్న చిన్న వంటపనులూ చేయాలి.... "
"...................."
"...రేపేదో మీ పెళ్ళాలకు చేసిపెట్టాలని కాదు, ఇదిగో, ఇప్పుడొచ్చిపడిందే గడ్డు పరిస్థితి...!అలాంటపుడు ఇబ్బంది పడకూడదని....! కనీసం కొంతలోకొంతైనా ఎవరికోసం చూడకుండా చేసుకోగలగాలని... అంతే.."
తలెత్తి చూశారిద్దరూ. 
"...అయినా మీ తప్పేమీ లేదులే. అంతా నాదే నాదే. మీకు మొయ్యకుండా ప్రతీదీ అమర్చిపెడుతున్నా చూడండీ... నాదీ.. నాదీ తప్పు. మగపిల్లలు మహారాజులూ... వాళ్ళు ఆడపనులు చేయకూడదూ అని మా అవ్వ, ముత్తవ్వ కాలం నాటి చాదస్తాలన్నీ నేనూ పాటించాను చూడూ...నాదీ..నాదే తప్పంతా. బుద్దొచ్చింది. ఉదయం మీఇద్దర్నీ చూశాక బాగా బుద్ధొచ్చింది. నాన్న వంటింట్లో ఒక్కడే అవస్థ పడుతుంటే మీరేమో హాయిగా గుర్రుపెట్టి నిద్దరోతున్నారు. సిగ్గుగా లేదురా మీకు !.."
"మమ్మీ, అదీ... "
" ముయ్యండి నోరు. ఇకనుంచీ నేను చెప్పినట్టు చేసితీరాల్సిందే.. "
"సరే మమ్మీ, ఈరోజు ప్రాక్టీస్ కెళతాం. రేపటినుండీ... "
"...కుదరదు. ఈరోజే ఇప్పుడే. మొదలెట్టాలి. మిగతావన్నీ తర్వాత.. "
తల్లి గొంతులో, ప్రవర్తనలో ఇదివరకెన్నడూ చూడని కాఠిన్యం చూశారిద్దరూ. మెల్లిగా బ్యాట్లు మూలన పెట్టి మాసిన బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు నడిచారు. టీ తాగుతున్న సాంబశివరావుకు భార్య ఏమిటో కొత్తగా కనిపించిందా క్షణంలో.
 " మొక్కై వంగనిది మానై వంగదండీ. అలవాటు పడాలి వీళ్ళు, తప్పదు. కొద్ది రోజులు నేను లేకపోయేసరికి ఇల్లు చూడండి ఎలా తయారైందో... !"
భార్య పరోక్షంగా తననూ అంటోందా అనిపించింది సాంబశివరావుకు. అయినా,సబబుగానే తోచింది అతనికి. ఈ మూడు వారాలూ తను పడ్డ కష్టం తలుచుకుంటే...! ప్రతీ ఇంట్లో చిన్నప్పట్నుంచీ మగపిల్లలకు తల్లో, అమ్మమ్మో, నాయనమ్మో లేకుంటే అక్కో, చెల్లో... ప్రతిదీ అందిస్తూ, అన్నీ అమరుస్తూ వాళ్ళను సోమరులుగా, ఏపనీ చేతగానివాళ్ళలా తయారుచేస్తున్నారు. ఇది ఆడపని..మేమెలా చేస్తాం అన్న ధోరణిలో పెరుగుతున్నారు. డిపెండెంట్ నేచర్ డెవలప్ అవుతోందని వాళ్ళకర్థం కావడం లేదు. వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ముందు తల్లులు మారాలి.. ఇదిగో...ఇలా...జానకిలా...! మనసులోనే భార్యను అభినందించాడు. కానీ, పైకి మాత్రం, 
" అది సరే వింటారంటావా... !"
అంటూ తటపటాయిస్తూనే సందేహం వెలిబుచ్చాడు. 
" తమరు వీళ్లకు వత్తాసు పలక్కుండా ఉండండి చాలు.. "
దండం పెట్టింది జానకి. 
" ఓకే ఓకే. హోమ్ మినిస్టర్ ఆదేశించాక తప్పుతుందా మరి !"
నవ్వుతూ, మరి ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని మెల్లిగా లేచి,అలా బయటికెళ్ళొస్తా... అంటూ గేటు దాటాడు. అక్కడ ఇంటి ముందు ముచ్చటగా ఓ కొత్త ముగ్గు..! మురిపెంగా కనిపించింది. అక్కడ నిన్న పరుచుకున్న చెత్త ఇప్పుడు మచ్చుకైనా లేదు.
"ఆహా ! ఆడది  ఉన్న ఇంటికీ లేని ఇంటికీ ఎంత తేడా! ఇదంతా ఇల్లాలి మహిమే కదా!"
 భార్యపై ప్రేమతో పాటు గౌరవమూ కలిగింది సాంబశివరావుకి.అంతలో ఠక్కున ఏదో స్ఫురించింది. బాపురే !ఈరోజు ఏదో విశేషమున్నట్లుందే !ఏమిటబ్బా!
బుర్ర గోక్కున్నాడు. మార్చ్, 8. Women's Day. మహిళాదినోత్సవం..! మరిచేపోయా... ఈ సందర్భంగా నా ప్రియమైన శ్రీమతికి ఓ చక్కటి బహుమతి ఇచ్చి తీరాల్సిందే... తృప్తిగా,  సంతోషంగా ముందుకు కదిలాడు సాంబశివరావు.
🌷💐🌹🌷💐🌹🌷🌹💐🌷🌹💐🌷🌹💐🌷🌹💐

 




      

4 comments:

  1. // “ నాదీ..నాదే తప్పంతా. ” //

    పూర్తిగా ఆవిడదే తప్పు. పనిమనిషిని పెట్టుకోక పోవడం తప్పు (మన దేశంలో). పెట్టుకోగలిగిన స్తోమత ఉన్నప్పుడు ఏమొచ్చింది.

    ఇంకో రకం విపరీతపు ఇల్లాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళింట్లో ఇంటావిడ పనిమనిషిని ఇంటి లోపలికి రానివ్వదు. అంట్లు తోమడం, బయట ఊడ్వడం వరకు చేసి వెళ్ళిపోవాలిట. దాంతో గదులు ఊడ్వడం ఇంటావిడే చేసుకోవాలి , దానికి మళ్ళీ బద్ధకం. దాంతో ఇల్లు (గదులు, హాలు వగైరా) నానా కంగాళీగా ఉంటాయి. వెర్రి రకరకాలు.

    మగపిల్లలకు కూడా ఇంటి పనులు నేర్పించడం తప్పకుండా చెయ్యాల్సిందే. తమ పనులు తాము చేసుకోవడం, ఇంట్లో అమ్మకు అప్పుడప్పుడు సహాయం చెయ్యడం అలవాటవుతుంది. ప్లస్ రేపు పై చదువులకు అమెరికాలు గట్రా వెడితే పనికొస్తుంది (తమ బాత్ రూమ్ కడుక్కోవడంతో సహా) 🙂. మంచి ట్రైనింగ్ 🙂.

    ReplyDelete
    Replies
    1. చక్కటి విశ్లేషణ. Thank you very much for your comment 🙏

      Delete
    2. 'ఇంకో రకం విపరీతపు ఇల్లాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళింట్లో ఇంటావిడ పనిమనిషిని ఇంటి లోపలికి రానివ్వదు. అంట్లు తోమడం, బయట ఊడ్వడం వరకు చేసి వెళ్ళిపోవాలిట.' - ఇందులో విపరీతం ఏముంది. అది ఇల్లాలి ఇష్టం.

      మగవారు ఈ రోజుల్లో ఇంటి వంట పనులు కూడా బాగానే చేస్తున్నారు. గృహిణి కష్టం తప్పక గుర్తించాలి. అయితే మగ వారు చేసే బయటి పనులు, కుటుంబ సభ్యుల కోసం వారు చేసే త్యాగం, వారి ఉద్యోగం, వారు పడే కష్టం తక్కువేమీ కాదు. కానీ మగవారికి గుర్తింపు, సానుభూతి అంతగా ఉండదు.

      Delete
    3. “ఇల్లాలి ఇష్టమే” కాదనేదేముంది. మిగిలిన పనిని తను పూర్తి చేసుకోవడానికి నడుం కట్టుకునే ఆడవాళ్ళకు ఇబ్బంది లేదు. బద్ధకస్తులకు, పని సామర్థ్యం లేని వాళ్ళు పూర్తి పని చేయించుకోవాలి. అలాగే అసలు పనిమనిషినే పెట్టుకోని వాళ్ళు కూడా.

      నా సదరు వ్యాఖ్యలోని సదరు పేరాలో మొదటి సగమే తీసుకున్నట్లున్నారు. రెండో సగంతో అన్వయించుకుంటే స్పష్టమవుతుంది (నా భావం).

      Delete