~యం. ధరిత్రీ దేవి
నాల్గు గోడల నడుమ ఉన్నా...
నాకెందుకులే అని సరిపెట్టుకుందామన్నా...
వర్తమానభారతం వార్తల భారంతో..
చెలరేగే ఆలోచనాసంద్రపు సుడిగుండాల్లో చిక్కి...
మునిగిపోతూ..నలిగి నలిగీ..కడకు తేలి..
రూపుదిద్దుకుని..నా మస్తిష్కపుపొరలు
చీల్చుకుని..అక్షరాలై కాగితాన బారులై
పరుచుకున్న నా భావజాలమా...!!
అడగవా ఈ సమాజాన్ని...కులమతాల అడ్డు గోడలు
రేపుతున్న విద్వేషాల ఆరని అగ్నకీలలు..ఎందుకని ?
ఉగ్రవాదం విషపుకోరలు సాచి విషం చిమ్ముతూ...
అమాయకుల్ని విగతజీవులుగా మార్చి మరుభూమిని
తలపిస్తున్న తీవ్ర సంక్షోభాల్ని..ఖండించవా...
ఈ మారణహోమాలు ఎందుకూ..ఎందుకని ?
తరతరాలుగా..ప్రతీతరాన్ని తీరని వేదనలో ముంచెత్తుతూ
నిర్వీర్యంచేస్తూ.. ప్రగతిరథాన్ని ముందుకు కాదు...
వెనుకకు మళ్ళిస్తూ..దుస్సాంప్రదాయాల పడగనీడలో
పాతుకుపోయి..కుళ్ళిపోతున్న ఈ మారని మనస్తత్వాల్ని
ప్రశ్నించవా..ఎందులకీ అనాగరిక మూఢత్వపు ముసుగులని...!?
ఆత్మాభిమానం మృగ్యమై..మానవీయ విలువలు శూన్యమై...
అర్ధాంగి ఆస్తులకు అర్రులు చాస్తూ..మూడుముళ్ల బంధం
మూన్నాళ్ళ ముచ్చటగా మారుస్తూ..నవ వధువుల్ని కాటికి
పయనం కట్టిస్తున్న ఆత్మ విమర్శ ఎరుగని నేటి
సంస్కారహీనుల్ని నిలదీయవా..తగునా ఇది మీకని...!!
ఏ మూల వెతికినా..ఏ వార్త చదివినా..ఏమున్నది గర్వకారణం..!
తీరని మానసిక సంఘర్షణల క్షోభ దప్ప..
అటనుండి ఆవిర్భవించే వేదనాభరిత స్పందన దప్ప...!
అయినా సరే..మదిని కలవరపరిచే నా భావజాలమా..
అక్షరసైన్యమై మరోసారి..మరోసారి.. మరీ మరీ...
ప్రశ్నించి చూడు..ప్రశ్నార్థకంగా మారుతున్న దేశ భవిత గురించి...
భావితరాల అగమ్యగోచర ప్రస్థానం గురించి...!!
['సంచిక ' ఆన్లైన్ వార పత్రిక ( 1.2.26 ) లో ప్రచురింపబడ్డ నా కవిత ]
No comments:
Post a Comment