Friday, August 28, 2026

అమ్మ భాష విశిష్టత...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం నేడు 
తెలుగును వాడుక భాషగా ప్రోత్సహించిన ఘనుడు
తెలుగుభాషా దినోత్సవ శుభ సందర్భం ఈనాడు
ఇది కేవలం వేడుక మాత్రమే కాదు 
భాషాభివృద్ధి..సంస్కృతీ పరిరక్షణల 
నిరంతర కృషికై స్ఫూర్తినిచ్చు శుభదినం...
అనాదిగా ఘనచరిత గలిగిన బాష మనది...
ఆదికవిగా తెలుగు భాషకు పునాది వేసిన నన్నయ... 
సంఘ సంస్కరణల భావాల వెల్లువతో
చిరస్మరణీయుడైన కందుకూరి..
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
అంటూ సామాజికస్పృహ రగిలించిన గురజాడ...
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా..
అంటూ ఎలుగెత్తి చాటిన వేములపల్లి...
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. అంటూ
గేయాల వెల్లువ కురిపించిన ఆత్రేయ... 
దేశభాషలందు తెలుగు లెస్సయని
పలికిన కృష్ణదేవరాయల అభిమానధనం...
భాషావైభవాన్ని చాటి చెప్పిన బమ్మెర పోతన భాగవతం... 
అంతేనా... వేమన శతకం..
సుమతీ శతకం అందించిన నీతులు..సూక్తులు
నాడూ..నేడూ ఏనాడైనా..పరిమళం కోల్పోని 
సుగంధ భరిత నిత్య స్ఫూర్తి కిరణాలు...
మహామహులను స్మరించుకుంటున్న
ఈ మహత్తర క్షణాన..మాతృభాష విశిష్టత 
మననం చేసుకుందాం... అమ్మ భాష గొప్పదనాన్ని
నలుచెరగులా విస్తరింపజేద్దాం... 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
        తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹








 

Tuesday, August 25, 2026

నేర్చుకుందాం గుణపాఠాలు...

 

                        ~యం. ధరిత్రీ దేవి 

అనుభవాలు తరచిచూడ అనేక రకాలు 
జీవన గమనాన తప్పనివి..తప్పించుకోలేనివి !
తీపివి కొన్ని.. చేదు తినిపించేవి కొన్ని..!
ఆహ్లాదాన్నిస్తూ తీయనివి.. పలుకరిస్తాయి..
మదిని పులకరింపజేస్తాయి..
మనోవేదనకు చోటు లేని 
మధురానుభూతులవి !!
చేదు అనుభవం.. తద్భిన్నం !
చెరిగిపోదు.. గాయం మానిపోదు..
గుండెల్లో దిగబడ్డముల్లు కనిపించదు..
గుచ్చుకుంటూనే ఉంటుంది..
అవమానాల భారం పెంచే ఆ బాధకు 
మరణం లేదు.. ఉండదు..
అయితే.. మనిషికి తెలియందొక్కటే..
ఏది మంచి.. ఏది చెడు.. తెలిపేది
చేదు అనుభవాలే అని..!!
నిజస్వరూపాలు తేటతెల్లమయ్యాక 
తేలిక పడటం ఎంత తేలిక !!
తెలుసుకో నేస్తం.. నేర్చుకుందాం..
చేదు నుండి పాఠాలు.. ఆ పాఠాలు గుణపాఠాలై 
మరిక పడనేపడవుగా..'తప్పు'టడుగులు !!
<><><><><><><><><><><><><><><><><>

Friday, August 14, 2026

మలిసంధ్య

 

~ యం. ధరిత్రీ దేవి 
    
దినకరుడు పడమటి దిక్కున 
దిగిపోతున్న సమయాన.. నింగిని మెరిసే 
ఆ వర్ణచిత్రం ఎంత మనోహరం! అది..
ప్రకృతి గీసిన అద్భుత సౌందర్యం!!
చూపరులకు అది ఇచ్చే ఆహ్లాదం 
అనిర్వచనీయం.. పొద్దు వాలుతున్న ఆ క్షణం 
అందరికీ ఎందుకో అంత ఇష్టం !!

జీవిత చరమాంకాన్ని తలచి తలచి..
భయపడతాం.. బాధపడతాం..
అస్తమించే సూర్యునిలో అగుపించే ఆ అందం .
మలి వయసులో మనిషిలో మాత్రం కనలేమా!
మరెందుకా అలజడి! జీవనగమనంలో..
అలసి సొలసిన ఈ దేహం 
విశ్రాంతి కోరే చివరి అంకం వృద్ధాప్యం..
బరువు.. బాధ్యతలు తీరిపోయి..
తమకంటూ మిగిలి.. చేజిక్కిన
అరుదైన అదృష్టాన్ని అందుకుని..
తనకోసం వాడితే.. సూర్యాస్తమయంలోని 
మెరుపులు మలి వయసులోనూ మెరిసిపోవా!!

ముసలితనం శాపం కాదు..
మనకోసం.. ప్రతీ మనిషి కోసం..
దేవుడిచ్చిన దివ్య వరం 
అప్పుడెప్పుడో కన్న కలలకు 
రూపమివ్వడానికి చేతి కందిన 
మహత్తర అవకాశం ..! అందుకే..
మలిసంధ్యను స్వాగతిద్దాం..
మనసారా ఆస్వాదిద్దాం...
   
[ 5.7.26 సంచిక..ఆన్లైన్ వారపత్రిక లో 
   ప్రచురింపబడ్డ నా స్వీయ కవిత 🙏]




Thursday, August 6, 2026

అన్నా అన్నా రారా..{ బాలగేయం}

🫠🙂🤗🙂🫠🤗🙂🤗

అన్నా అన్నా రారా 
పలకా బలపం తేరా 
అ ఆ ఇ ఈ దిద్దించరా 
ఏ బి సి డి పలికించరా 
ఆటలు పాటలు నేర్పించరా 

చెల్లీ చెల్లీ వస్తున్నా..
అడిగినవన్నీ తెస్తున్నా 
అచ్చులు హల్లులు దిద్దిస్తా 
ఏ బి సి డి పలికిస్తా 
ఇదిగో ఇదిగో వస్తున్నా 

అమ్మ ఆవు ఇల్లు ఈగ 
ఉడత ఊయల ఎలుక ఏనుగు
పుస్తకమంతా చదివిస్తా 
ఆటలు పాటలు నేర్పిస్తా
ఇదిగో ఇదిగో వచ్చేశా...
🤗🫠🙂🤗🙂🤭🤗🙂

[ రచన : యం. ధరిత్రీ దేవి ]