Monday, July 27, 2026

నా స్మృతుల్ని సమాధి చేయగలవా..!!😌

 

అమ్మా.. నేచేసిన నేరమేమిటమ్మా..!?
అంత ప్రేమ అంతలోనే ఎలా మాయమైపోయెనమ్మ..?
ఆటాడుతూ పడిపోతే అల్లల్లాడిపోయావు 
బువ్వ తినిపిస్తూ పొలమారితే కలవరపడతావు..
నే నవ్వితే నీ మోమున కోటి కాంతులు !!

' అమ్మా' అని పిలిస్తే చాలు అక్కున చేర్చుకుంటావే..!
మరి..ఆ పిలుపు వద్దంటూ ఎందుకమ్మా 
నా నోరు నొక్కేయాలనుకున్నావు ?
లాలపోసి.. జోలపాడి నిద్రబుచ్చిన ఆ చేతులు..
పౌడరద్ది..దిష్టిచుక్క పెట్టి.. ఫ్రాకు తొడిగి..
బుట్టబొమ్మలా తీర్చిదిద్దిన ఆ చేతులు..
ఎలా బిగించాయమ్మా ఉరి నా లేత గొంతుకు ..!?

అర్ధరాత్రి ఆకలికేడిస్తే.. నోటి కందిన 
ఆ పాలధారల కమ్మదనం.. మరువగలనా!
నను హత్తుకుని ఆదమరిచి నీవు..
నిదురించడం నాకింకా గురుతే..
తప్పటడుగులనాడు అంబరాన్నింటిన 
నీ సంబరం.. ఎక్కడ? అదృశ్యమైపోయెనా !
నా చిలుకపలుకులు నిన్నలరించిన క్షణాలు..
నాకెరుకే..! అంతలోనే అంత చేదెలా అయితినమ్మా!!

అత్తింట ఆరళ్ళు.. అదనపు కట్నపు సెగలు..
అప్పుల బాధలు.. నిను చుట్టుముడితే..
నాన్న అరాచకాలు నిను వేధిస్తే..
శిక్ష నాకు వేశావేమిటమ్మా! ఎదురీత చేతగాక..
తలరాత మార్చాలనుకున్నావు..
నువ్వు లేక నా అనాధ బ్రతుకు 
ఊహించలేకపోయావు.. చివరికి... 
మిగిలిందేమిటమ్మా !? నా ఆయుష్షు కూడా 
పోసుకుని నీవు మాత్రం మిగిలావు..!!

సమస్యలు వేధిస్తే.. బ్రతుకులు చిదిమేయాలా !
పది నెలలు కడుపున మోశావు..
మరణం అంచులు తాకి.. మరో జన్మ ఎత్తి..
నాకు జన్మనిచ్చావు.. ఆపాటి కడగండ్లు 
నీకు దూదిపింజలే!! సహనానికి మారుపేరు నీవు..
అంత కఠినంగా ఎలా మారిపోయావు?
ఇప్పుడు తీరాయా నీ వెతలు !
సమసిపోయాయా నీ సమస్యలు !!

అమ్మా.. నీకో ఊరట..! కన్ను మూసిన 
నీ కంటి పాపకు.. ఇక నిశ్చింతేలే ..!
నాలాంటి అభాగ్యులు కోకొల్లలిక్కడ ..
అమ్మ చేత.. నాన్న చేత హతులై..
నాకు తోడుగ ఉన్నారిచట.. నా బెంగ నీ గురించి..
ఎలా మోయగలవమ్మ..! నీ జీవితకాలం 
దహించే ఆ వేదన!! నన్ను సమాధి చేశావు..
నా స్మృతుల్ని చేయగలవా..!
నా అభ్యర్థన ఒక్కటే.. దయచేసి..
మళ్లీ ఉరి బిగించుకోకు..
నన్ను వెతుక్కుంటూ వచ్చి..నా చెంత చేరకు...
😌🤔😌🤔😌🤔😌🤔😌🤔😌🤔😌🤔😌

[ 'విహంగ ' ఆన్లైన్ మాసపత్రిక మే 2026 
    సంచికలో ప్రచురితమైన నా కవిత 🙏]





No comments:

Post a Comment