Tuesday, September 8, 2026

చందమామ రావే...చల్లగాలి తేవే...

🤱🧏🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝

చందమామ రావే/
చల్లగాలి తేవే 
వెన్నెలమ్మ రావే / 
వెలుగులే తేవే
చందమామ చల్లగాలి 
లిసిపోయి ఈ పూట
పాపాయికి పాడాలి 
కమ్మనైన లాలిపాట          
                                                      //చందమామ//
నింగిలోన నీవుంటే 
చుక్కలన్ని నీ చుట్టే
మా చెంతకు నీవొస్తే 
అలకబూనునేమో 
చిన్నబోవునేమో 
తగవులాట లేకుండా 
తరలిరావ చందమామ 
ఆ చుక్కల మించిన 
చిన్ని చిన్ని పాపలిచట 
వేచి వేచి ఉన్నారు
వేయి కళ్ళతోటి ఓ మామ..
వచ్చిపోవ ఇటువేపు 
లేకుంటే గొంతు దిగదు
అమ్మ చేతి గోరుముద్ద
వేగిరమే వచ్చేయ్ వా 
మా లోగిలి నడయాడగ 
చక్కనైన ఓ చందమామ         //చందమామ//

చక్కదనం చల్లదనం 
కలబోసుకున్న 
ఓ కలువలరాయడా
చీకట్లు తొలగించి 
వెలుగురేఖలందించే 
ఓ వెన్నెలరేడా 
అందనంత ఎత్తులో 
ఆకసాన ఉన్నావుగానీ
అందుబాటులోనె కద 
ఉన్నావు..ఓ మామ..
అంబరాన వెన్నెలంత 
మా సొంతమె అంటావే 
దిగిరావా వేగిరమే నెలరేడా...
నిలబడవా నిమిషమైన 
ఒక్కసారి మా ముంగిట  
మా ముచ్చట తీర్చవా 
చక్కనైన చందమామ        //చందమామ//
 🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝

     
['సంచిక ' ఆన్లైన్ వార పత్రిక ( 30.8.26 ) లో ప్రచురితమైన నా రచన 🙏]