Tuesday, May 7, 2024

' నాన్నా, నాకు డబ్బు కావాలి, ఇవ్వు... ' 🌷 చిన్న కథ

   భర్త తోసిన తోపుకి విసురుగా వెళ్లి గోడకు తగిలి కింద పడిపోయింది కరుణ. ఆరేళ్ల సుధీర, నాలుగేళ్ల సురేష్ ఏడుపు లంకించుకుని ఓ మూల కూర్చుండిపోయారు. 
  " పనికి మాలిన దానా, అలసి వచ్చిన మొగుడికింత తిండి సరిగా పెట్టాలని ఉండదా నీకు... "
   అంటూ ఇంకా మీదికి వచ్చి మళ్లీ కొట్టబోయాడు వెంకట్రావు,  కానీ పిల్లలిద్దరూ భయంతో గట్టిగా అరవడంతో ఆగిపోయాడు. 
                         ***********
     కొన్నేళ్ళు గడిచాయి. 
" ఏమండీ, ఉగాది పండుగొస్తోంది కదా, బట్టలు కొనాలి..... " తలవంచుకుని మెల్లిగా అడిగింది కరుణ
    విసుక్కుంటూ ఐదొందలు చేతిలో కుక్కాడు వెంకట్రావు. 
"... నాక్కూడా బొత్తిగా చీరలు పాత పడిపోయాయి, ఓ రెండు కొనుక్కుంటాను, మరో ఐదు వందలు.... "
 కస్సుమని లేచాడతను. 
 " నోర్ముయ్, ఇక్కడరాశులేమీ పోసుకుని కూర్చోలేదు నేను నీకివ్వడానికి... వెళ్లి నీ బాబునడిగి కొనుక్కో చీరలు... "
 అంటూ విసవిసా బయటికి వెళ్లిపోయాడు. 
    పక్కనే కూర్చుని చదువుకుంటున్న సుధీర, సురేష్ మ్రాన్పడిపోయారు. వాళ్లిద్దరూ ఇప్పుడు ఎనిమిది, ఆరు తరగతుల్లోకి వచ్చేశారు. తండ్రి ఎప్పుడూ ఎందుకు అంత కోపంగా ఉంటాడో, తల్లిని ఎందుకలా
హింసిస్తుంటాడో మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల బుర్రలకు అర్ధమయ్యేది కాదు. కానీ పెరిగే కొద్దీ తండ్రి కర్కశత్వం పట్ల ఓ విధమైన ఏవగింపు కలగసాగింది.. ముఖ్యంగా సుధీరకు. తల్లి అవసరాలన్నీ ఇంకా తాతయ్యే చూడాలనడం ఆ పసిదానికి ఎంతకీ అర్థం కాని విషయం!
                             ********
   అలా అలా రెండేళ్లు భారంగా గడిచాయి. సుధీర ఇప్పుడు స్కూల్ ఫైనల్లో ఉంది. పబ్లిక్ పరీక్షలు. ఫీజు కట్టాలి. దేనికి డబ్బు కావాలన్నా ఒకటికి నాలుగు సార్లు అడుక్కుంటేనే గానీ డబ్బులు రాల్చడు తండ్రి. తల్లికా నోట్లో నాలుక లేదు. సంవత్సరానికి ఒక జత బట్టలు పిల్లలకు కొనడమే గగనం. తల్లి పరిస్థితి చూస్తే ఆ పిల్లకు ప్రాణం ఉసూరుమంటూ ఉంటుంది.
   తన తోటి క్లాస్మేట్స్ ఎంత ' జాలీ ' గా ఉంటారు! వాళ్ల నాన్నల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. అలాగని తన తండ్రికి సంపాదన లేదా?  గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ మంచి జీతమే తీసుకుంటున్నాడు, కానీ కట్టుకున్న భార్యకి రెండు కట్టుడు చీరలు కొనడానిక్కూడా ఎందుకంత గింజుకుంటాడో అర్థం కాదు. తను మాత్రం చాలా దర్జాగా తయారవుతాడు !
పసిపిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఏరోజూ తమని దగ్గరకు తీసినట్లుగానీ లాలించినట్లు గానీ సుధీరకు గుర్తు లేదు. 
   ప్రతీసారీ తల్లిద్వారానే ఏదైనా అడిగించేది తనకు తండ్రి ఎదురుగా నిలబడే ధైర్యం లేక. కానీ ఈసారి ఏదో మొండి ధైర్యం వచ్చిందా పిల్లకి. మనసులో స్థిరంగా నిశ్చయించుకుంది. 
   ఆరోజు యధావిధిగా తయారై ఆఫీస్  కు బయల్దేరుతున్నాడు వెంకట్రావు. సుధీర వెళ్లి అతని  కెదురుగా నిలబడింది. 
" నాన్నా, నాకు డబ్బులు కావాలి, ఇవ్వు..."
    చివుక్కున తలెత్తాడు వెంకట్రావు. తండ్రి కళ్ళల్లోకి స్థిరంగా చూస్తూ, 
" ఫీజు కట్టాలి, పండక్కి నాకూ, తమ్ముడికీ, అమ్మకూ బట్టలు కొనుక్కోవాలి. డబ్బు కావాలి ఇవ్వు..."దృఢంగా అంది తొణుకూ బెణుకూ లేకుండా. 
" ఏమిటీ, కొత్తగా.... ఫీజుకిస్తా, బట్టలూ గిట్టలూ కుదర్దు..." జేబులో చెయ్యి పెట్టబోతూ అన్నాడు. 
" కుదర్దు.... అంతా కలిపి 5000/- ఇవ్వాల్సిందే.. "
" నోరుమూసుకుని అవతలికి పద..... "
" లేదు, ఈరోజు...ఇప్పుడే...ఇచ్చి తీరాలి.... "
" ఏమిటే, నోరు లేస్తోంది... ఎప్పుడూ లేనిది?  మీ అమ్మ గాని నూరిపోసిందా?  ఇప్పట్నించీ దానికే గాదు మీక్కూడా కొనివ్వను. వెళ్లి ఆవిడ పుట్టింట్లో తెచ్చుకోమను...వెళ్ళు.."
" తాతయ్య ఎందుకివ్వాలి? "
" ఎందుకా? దాన్ని కన్నాడు కాబట్టి... "
" సరే అయితే. రేపు నాకూ పెళ్లి చేస్తావుగా ఎవడికో ఒకడికిచ్చి. వాడు కూడా ఇలాగే నన్ను ప్రతీదానికీ నీదగ్గర ముష్టెత్తుకోమని పంపిస్తాడు, ఇస్తావా మరి.."
   ఒక్కసారిగా వెంకట్రావు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఆ పిల్ల నోట్లోంచి వచ్చిన ప్రతీ మాటా ఓ తూటాలా అతని గుండెల్లో సూటిగా దిగబడి తూట్లు పొడిచేసింది. ఇన్నాళ్లూ మన్ను తిన్న పాములా పడి ఉన్న దీనికి ఇంత నోరెలా వచ్చింది? 
  కోపంతో ఊగిపోతూ కట్టుకుంటున్న బెల్టు తీసి కూతురివేపు ఉరికి రాబోయాడు.ఇంతలో సుధీర తండ్రి వైపు విసురుగా అడుగులు వేసింది.
" ఎందుకు నాన్నా అంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అదేగా! నీ పద్ధతి ప్రకారం రేపు నాకు పెళ్లి చేశాక కూడా నా బాధ్యతలన్నీ నీవేగా తీసుకోవాల్సింది... "
" ఊరుకునే కొద్దీ మాటలు మితిమీరుతున్నాయే.. నోరు మూస్తావా లేదా... "
 వెంకట్రావులో ఆవేశం కట్టలు తెంచుకుంది.
" అదేంటి నాన్నా, తాతకోపద్ధతి,నీకో పద్ధతీనా... ఇదిగో చూడు, ఇక్కడే ఉన్నాడుగా నీ కొడుకు  సురేష్...  ఊహ తెలిసినప్పటినుంచీ నిన్ను చూస్తూ పెరుగుతున్నాడు. నీవు చేసేది కరెక్టే అని అనుకుని, రేపు వీడి పెళ్లయ్యాక వీడి పెళ్ళాన్నీ ప్రతిదానికీ దాని పుట్టింటికి వెళ్లి తెచ్చుకోమంటాడు... మంచి పద్ధతులే నేర్పిస్తున్నావు నాన్నా... "
 తెల్ల మొహం వేసుకుని చూస్తున్న సురేష్ కు అంతా అయోమయంగా తోచింది. ఓవైపు  తండ్రి ఉగ్రరూపం, మరోవైపు ఎన్నడూ ఎదురు మాట్లాడని అక్క!!
 పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన వెంకట్రావు లో సహనం నశించిపోయింది.
" నోరు ముయ్యమన్నానా... "
 అంటూ బెల్టు తీసుకుని విసురుగా ముందుకురికాడు.అంతవరకూ ఆ పక్కనే నిల్చుని చూస్తున్న కరుణ అనుకోని ఈ పరిణామానికి అవాక్కైపోయింది. ఒక నాడు పొత్తిళ్లలో తన ఒడిలో పసిగుడ్డుగా ఉండిన సుధీరేనా ఈ పిల్ల ! తన ఒంటి మీద వాతలు తేలేలా ఆడిన ఆ బెల్టు ఇప్పుడు తన బిడ్డ మీద పడబోతోంది. ఒక్కసారిగా ఆ అర్భకురాలిలో వెయ్యేనుగుల బలం వచ్చి చేరింది. అంతే, ఒక్క ఉదుటున వెళ్లి భర్తను అడ్డుకుంది. 
" ఆగవయ్యా, పిల్ల ఒంటిమీద చేయి పడిందంటే మర్యాద దక్కదు... "
 వెంకట్రావు వీపుమీద చెళ్ళున కొరడాతో కొట్టినట్టు అయింది. కోపం రెట్టింపవగా అటు నుండి ఇటువైపు తిరిగి కరుణ మీదికి  రాబోయాడు. వెంటనే అతన్ని బలంగా పక్కకు తోసేసింది కరుణ. ఊహించని ఆ ప్రతిచర్యకు అటు పక్కగా ఉన్న సోఫాలో కూలబడిపోయాడు వెంకట్రావు. నోరు విప్పింది కరుణ.
"... ఆ పిల్లకున్న తెగువ, ధైర్యం కాస్తయినా నాకు ఉండి ఉంటే ఈరోజు నా బ్రతుకిలా తగలడి ఉండేది కాదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా పిల్లలు నా పంచ ప్రాణాలు. వాళ్ళను బాధ పెడితే మాత్రం సహించేది లేదు. అలాగని ఇల్లు విడిచి పోతానని అనుకోకు, ఇది నా ఇల్లు. ఇక్కడే ఉంటాను నా పిల్లలతో. జాగ్రత్తగా ఉండు.. "
  మొట్టమొదటిసారి ఆమె రౌద్ర రూపం చూసి విస్తుపోయాడు వెంకట్రావు. మరోవైపు సుధీరలో పెల్లుబికిన ఆనందం ! ఇంకోవైపు ఏం జరుగుతోందో అర్థంకాక సురేష్ ! అతను తేరుకునేలోగా నెమ్మదించి పిల్లలిద్దర్నీ అక్కున చేర్చుకుంది కరుణ. దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు ఇంతకాలం నియంతలా ఉన్న వెంకట్రావు. ఇంట్లో అంతా కలిసి ఎదురుతిరిగితే పరిస్థితి ఎంత విషమమో అతగాడికి తొలిసారిగా తెలిసొచ్చింది. కోరలు పీకి పడేసిన కోడె నాగులా తలదించుకుని బయటకెళ్లబోయాడు. 
" ఆగండి నాన్నా, డబ్బు.. డబ్బు కావాలి.అంతా కలిపి 5000 /-  ఇక ప్రతిసారీ నువ్వే మా ముగ్గురికీ బట్టలు కొనాలి, నువ్వు ప్రతీ పండక్కీ కొనుక్కుంటావే అలాగన్నమాట... "
  కూతురి మాటలకు బయటకు పోతున్నవాడల్లా ఆగిపోయి ఇక తప్పేలా లేదనుకున్నాడో ఏమో , అప్రయత్నంగా బీరువా తెరిచి ఐదువేలూ  లెక్క పెట్టి ఆ పిల్ల చేతిలో పెట్టేసి గబగబా వెళ్ళిపోయాడు. పరమ సాత్వికురాలైన భార్య, తల్లి చాటు గా మౌనంగా పెరుగుతున్న కూతురు ఈరోజిలా చెలరేగి పోవడానికి తన నిరంకుశత్వ ధోరణి, క్రూర నైజమే కారణమన్న పచ్చినిజం ఆ పురుషపుంగవునికి తెలిసి వచ్చిందో లేదో తెలీదు గానీ... లోపల తల్లీ పిల్లలు మాత్రం ఏళ్లతరబడి కారాగారంలో పడి మగ్గిపోయి బయటపడ్డ ఖైదీల్లాగా అయిపోయారు. అక్కడి దృశ్యం ఓ సారి చూస్తే..... 
     సుధీరను గట్టిగా పొదువుకుంది కరుణ. సురేష్ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు. ఊహ తెలిశాక మొదటిసారి తల్లి కళ్ళలో మెరుపు చూసింది సుధీర. తల్లీకూతుళ్ళిద్దరి చెంపలమీదనుండి ధారలుగా కన్నీళ్లు ! ఇద్దరికీ తెలుసు, అవి ఆనందబాష్పాలని !
                        *****************
పెళ్లి అయ్యాక భార్యాబిడ్డల బాధ్యతలు తనవే అని భావించక ఆ భారమంతా అత్తమామల మీద తోసేసే కొందరు ( అందరూ కాదు  ) ప్రబుద్దుల నిర్వాకం చూస్తూ...... ఆ స్పందనతో... 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                        యం. ధరిత్రీ దేవి 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment