👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
మనసా..!నీకెందుకంత నిరాశ !!
బ్రతుకంటే దేనికంత భయం!?
ప్రాణత్యాగానికి ఎలా వస్తోంది అంత ధైర్యం!
అదేదో చూపించరాదా బ్రతకడం కోసం..
జీవితమంటే అంత విలువ లేనిదైపోయిందా !
క్షణికావేశం నీలోని విచక్షణను కమ్మేసిందా !
పది పరీక్ష తప్పితే అదే పరమార్థమా !
మరో అవకాశం నీ కోసం
వేచి ఉన్నదని మరిస్తే ఎలా ?
నాన్న కొడితే.. అమ్మ తిడితే..
అది ఎవరి కోసం? ముమ్మాటికీ నీకోసం..
ఉద్యోగం రాకుంటే.. మరణమే శరణ్యమా!
ప్రయత్నిస్తే దారులు శతకోటి.. ఎరుగవా..!
ఆశలుడిగిన జీవితం చిగురులు వేయదా !!
అప్పుల పాలై అవమానాలతో తలవంపులా!
అయితేనేమి.. సహనం వహించి చూడు..
తలెత్తుకు తిరగ్గలవు.. తలరాత మారగలదు..
అనారోగ్యం అతలాకుతలం చేస్తోందా!
వెతికితే బాగయ్యే మార్గాలు ఉన్నాయిగా !
ఇంట్లో శాంతిసౌఖ్యాలు కరువా !
నెలకొల్పడం నీ చేతిలో పనే కదా సోదరా...
సమస్యలు సుడిగుండాలైతే..
సావకాశంగా ఆలోచించు..
సానుకూలంగా స్పందించు..
గోరంతను కొండలు చేయకు
కాలమే చెబుతుంది అన్నింటికీ సమాధానం
వేచి చూడు ఎదురవుతుంది పరిష్కారం
నేటి సమస్య తాత్కాలికం
రేపటికంతా తేలిపోయే దానికోసం
బలిపెట్టకు నిండు జీవితం
దేహంలో జీవం ఉంటేనే కదా..
'రేపు' అన్నది చూడగలం..!
ఆ రేపు అన్నది నీకు ఉండాలంటే
జీవించి ఉండడం ప్రధానం..
ప్రాణంతో ఉంటేనే కదా
చవిచూడగలం 'విజయం' !
ఆత్మాహుతి ఆలోచనలు కాదు నేస్తం..
దృఢసంకల్పం అవసరం
ఈ జీవితం ఓ అమూల్య వరం
అత్యద్భుతమైన ఈ అదృష్టం చేజారనీకు..
తుది శ్వాస వరకూ పోరాడు..
జీవితమంటేనే పోరాటం కాదా మనకు..,!
పోరాడటానికే మనం పుట్టామని మరువకు!!
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
[ 'సంచిక' ఆన్లైన్ వార పత్రిక..( 22.2.26 ) లో
ప్రచురితమైన నా స్వీయ కవిత ]
No comments:
Post a Comment