Wednesday, December 30, 2020
... అయినా సరే.... స్వాగతిద్దాం...
Tuesday, December 22, 2020
చట్టాలను చేసి లాభమేమి....?
Tuesday, December 8, 2020
ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి?
నిర్భయ చట్టం వచ్చింది. దిశ చట్టం వచ్చింది. స్త్రీలపై అకృత్యాలు ఆగిపోయాయా? నిర్భయ ఘటన లో నేరస్తులకు ఉరి శిక్షలు విధించారు. దిశకు జరిగిన అన్యాయానికి పోలీసులే ఎన్కౌంటర్ చేసి దోషుల్ని హతమార్చారు. అయినా భయపడుతున్నారా? లేదే! ఏం చేస్తే ఈ దారుణకాండలకు అడ్డుకట్ట పడుతుంది? ఇదిలా ఉంచితే -- ఇటీవల జరిగిన అమానవీయ అకృత్యం ఒళ్ళు జలదరించేలా చేసేసిందందర్నీ !
నవంబరు14, శనివారం. దీపావళి పర్వదినం. జనమంతా సంబరాల్లో మునిగితేలుతున్న శుభ ఘడియల్లో జరిగిన హీనాతి హీనమైన దుస్సంఘటన! ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ కు సమీపాన ఘటంపూర్ అనే చోట--- ఓ ఏడేళ్ల బాలిక హత్యకు గురయింది. దాని పూర్వాపరాలు --- పరశురాం, సునయన దంపతులకు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం పెళ్లి అయిందట. కానీ సంతానం లేదు. ఓ బాలిక గుండె, కాలేయం తింటే పిల్లలు పుడతారని ఓ తాంత్రికుడు చెప్తే ఆ పని కోసం 20 సంవత్సరాల వయస్సున్న వాళ్ళ బంధువుల అబ్బాయిని కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చి పురమాయించారట ! అతను మరో స్నేహితున్ని ( 30 సంవత్సరాలు ) తోడు తీసుకుని ఏడు సంవత్సరాల వయసున్న ఆ దంపతుల పక్కింటి పాపను చాక్లెట్ల ఆశ చూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఇద్దరూ కలిసి కత్తితో గొంతు కోసి చంపేసారట ! దానికి ముందు ఆ నీచులు ఆ పసి దానిపై అత్యాచారం కూడా చేశారట! ఆ తర్వాత అవయవాలు కత్తితో పెకలించి, గుండె, కాలేయం పాలితిన్ కవర్లలో ఉంచి, మిగతా వాటిని అక్కడే పొలంలో కుక్కల కోసం విసిరేశారంట ! ఈ దారుణ కృత్యానికి ముందు అక్కడున్నఓ కాళీ మందిరం వద్ద తాంత్రిక పూజలు నిర్వహించారని వార్త ! అటు పిమ్మట గుండె, కాలేయం ఆ దంపతులకిస్తే వాళ్లు తిన్నారట !
ఎంత హేయమైన చర్య! అసలు మనుషులా వీళ్ళు? ప్రతిరోజు తమ ఇంటి ముందు అమాయకంగా ఆట్లాడుకునే ఓ పసిపిల్లను హతమార్చడానికి వీళ్ళ మనసెలా ఒప్పింది? అలా చేసి సంతానం పొందితే రేపు ఆ పిల్లకు ఇదే గతి పడ్తే.... అన్న ఆలోచన ఆ అధములకు తట్టలేదా? వాళ్లు చెప్తే మాత్రం -- ఏమాత్రం సంకోచించక సమ్మతించారంటే -- ఎలాంటి కిరాతకులు వాళ్ళు ! ఎటువంటి చోట పుట్టి, ఎలాంటి వాతావరణంలో పెరిగి ఇలా తయారయ్యి ఉంటారు!
ఈ దుష్ట కార్యానికి నాంది పలికిన అతన్ని, అవయవాలు తిన్న వారిని, హంతకులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారట. ఎందుకు? ఏళ్లకు ఏళ్లే పడుతుంది విచారణకు!
ఇలాంటి హంతకులు ఒకటి ఆలోచించాలి. ఈ దుస్థితి తమ ఇంట్లో తమ తల్లికీ, చెల్లికి, భార్యకు ఇంకా కూతురికీ వస్తే తమ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న తమకు తాము వేసుకుంటే కాస్తయినా వెనుకాడుతారేమో? అయినా మన పిచ్చి గానీ -- అంతటి విజ్ఞత, విలువలతో కూడిన జీవనశైలి వాళ్లకు ఉంటే ఇంతటి ఘోరాలు ఎందుకు జరుగుతాయి?
ఇంతకీ--- ఇలాంటి నరాధములకు ఎలాంటి శిక్షలు వేయాలి? ఏం చేస్తే ఆ తల్లిదండ్రుల కడుపుకోత, బాధ తీరుతాయి?
*************************************************
🌷భువి భావనలు 🌷
*************************************************
Friday, November 6, 2020
చెడును ప్రచారం చేయకండి, ప్లీజ్.... ఓ కథ కాని కథ
మధ్యాహ్నం మూడవుతోంది. గేటు చప్పుడు విని పడుకోబోతున్నదల్లా బయటకొచ్చింది జాహ్నవి. కల్పన లోనికొస్తూ కనిపించింది. కల్పన, జాహ్నవి రెండేళ్ల క్రితం పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. కల్పన ఓ స్కూల్లో, జాహ్నవి ఓ ఆఫీసులో పనిచేస్తుండేవాళ్లు. ఆర్నెళ్ల క్రితం జాహ్నవి వాళ్ళు ఇల్లు మారిపోయారు. పూర్వ పరిచయం తో ఇలా అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉంటుంది కల్పన.
" రా, ఏమిటీ, ఈ టైం లో. స్కూలు కెళ్లలేదా?.... " లోనికి దారితీస్తూ అడిగింది జాహ్నవి.
" స్కూలు నుండే, కాస్త తలనొప్పిగా ఉంటే పర్మిషన్ పెట్టి వచ్చా... " జవాబుగా అంది కల్పన.
ఏదో విషయం ఉందన్నమాట, అనుకుంటూ, " అలాగా... కూర్చో, వేడివేడిగా టీ తెస్తా.. " అంటూ వంటింట్లోకి నడిచింది జాహ్నవి. పది నిమిషాల్లో పొగలు గక్కుతున్న టీ తీసుకొచ్చి కల్పన చేతికిచ్చి, ఎదురుగా కూర్చుంది.
వారం రోజులుగా ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా ఉండి నిన్ననే కాస్త రిలాక్స్ అయ్యారంతా. బాగా అలసిపోయిందేమో రెస్ట్ తీసుకుందామని ఈరోజు శెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఎలా కనిపెడుతుందోఏమో తను ఇంట్లో ఉన్న సంగతి మరి ! ఇలా వచ్చేసింది. లోలోపల విసుగ్గా ఉన్నా తప్పనిసరై కూర్చుండిపోయింది జాహ్నవి.
టీ చప్పరిస్తూ, " జాహ్నవీ, నీకు మా కొలీగ్ అనంత తెలుసు గదా.... "
" ఊ.. మొదలెట్టింది..... " అనుకుంటూ తలూపింది జాహ్నవి.
".... తన కూతురు డిగ్రీ చదువుతోంది. ఎవరో కులం గాని అబ్బాయితో వెళ్లిపోయిందట పాపం ! నాల్గు రోజుల నుండీ స్కూలుకు రాకపోతే మా స్టాఫ్ నలుగురం కలిసి ఇంటికెళ్తే విషయం తెలిసింది. ఒకటే ఏడుపనుకో...... "
" ఊ.. అదన్నమాట సంగతి! ఈ వార్త చేరవేయటానికి తల నొప్పంటూ పర్మిషన్ తీసుకొని మరీ నా ఇంటికొచ్చింది. ఆవిడ అంత బాధలో ఉంటే వీళ్ళు వెళ్ళింది ఓదార్చడానికి కాదు, కూపీ లాగటానికి. సరే, లాగినవాళ్ళు అంతటితో ఊరుకోవచ్చు గదా, ఆ లాగింది అందరికీ ఇలా మోసెయ్యటం ! కొలీగ్ కెదురైన బాధకు ఏమాత్రం సానుభూతి లేదు సరి కదా ఇలా ప్రచారాలు చేస్తూ ఆమె బాధ మరింత పెంచడంలో వీళ్లు పొందే ఆనందం మాత్రం వర్ణనాతీతం!
కల్పన నైజం జాహ్నవికి బాగా తెలుసు. పక్కపక్కనే ఉన్నారు గదా కొంతకాలం. ఎదురింట్లో, పక్కింట్లో, బంధుగణాల్లో, ఇంకా చెప్పాలంటే ముక్కు మొహం తెలియనివాళ్లిల్లలో జరిగిన బాధాకర సంఘటనలు అన్నీ పూసగుచ్చినట్లు అడిగినవారికీ, అడగని వారికీ అందరికీ చేరవేసే బాపతు. చిత్రమేంటంటే ఇదంతా చెడు విషయాలు చేరవేయడం వరకే. మంచి ఏదైనా జరిగితే మాత్రం ఎవరి దగ్గరా నోరు విప్పదు.
మూణ్ణెల్ల క్రితం ఓ షాపింగ్ మాల్ లో జాహ్నవి కి అనుకోకుండా తటస్థ పడింది ఈ కల్పన. అంతే! బరబరా పక్కనే ఉన్న క్యాంటీన్ కు లాక్కెళ్లి కూర్చోబెట్టి, టీ తాగుతూ మొదలెట్టింది.
" జాహ్నవి, మా ఎదురింటాయన రంగనాథం గారని.... నీకు తెలీదులే.... ఆయన కూతురు రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిందట! అంతటా వెతికారు పాపం. తర్వాత తెలిసింది, ఎవర్నో పెళ్లి చేసుకుందని! ఇంతలో ఏమైందో ఏమో మొన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అసలు విషయం ఏంటంటే, అతను ఆల్రెడీ పెళ్లయిన వాడట !.... "
అదిరిపడింది జాహ్నవి ఆ తల్లిదండ్రులకెదురైన విపత్తు సామాన్యమైంది కాదు. వాళ్ళ బాధలో వాళ్ళుంటే ఇలా అందరికీ తెలిసేలా చేస్తూ.... ఏమిటిది? అసలా రంగనాథం గారు ఎవరో, వాళ్ళ అమ్మాయి ఎవరో ఏమిటో ఏ మాత్రం ఎరగని తనకు ఈ విషాదం చెప్పడం అవసరమా ఈ కల్పనకు !... "
జాహ్నవి ఆలోచనలు అలా ఉన్నాయి. చాలాసార్లు కల్పనకు చెప్పాలనుకుంది, ఇలాంటి వార్తలు దయచేసి స్ప్రెడ్ చేయొద్దని.... కానీపెదవి దాకా వచ్చిన మాటలు అక్కడే ఆగిపోయేవి. ఎందుకో ఈరోజు అలా ఊరుకోబుద్ధి కావడం లేదు జాహ్నవి కి.
"... అనంత గారు ఎంతో బాధలో ఉండి ఉంటారు, చేతనైతే ఓ కొలీగ్ గా ఆమె బాధ తగ్గించే పని చేయాలి గానీ ఇదేమిటి కల్పనా ఇలా అనవసరంగా నాకు చెప్తున్నావు? ఆమె నీ కొలీగ్, మీ ఫ్రెండ్. తన బాధ నీతో పంచుకుంటే ఆ రహస్యం నీ గుండెల్లో దాచుకోవాలే గానీ ఇలా అందరి వద్దా ప్రస్తావించడం సబబా?... "
జాహ్నవి నుండి ఊహించని ఈ మాటలకు ఠక్కున టీ తాగడం ఆపింది కల్పన.
".... మీ పక్కింటి వాళ్ళ అమ్మాయికి మెడిసిన్లో సీటు వచ్చిందని చెప్పు, మీ బంధువుల అబ్బాయికి మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పు, ఫలానా వాళ్ళ అమ్మాయి కి మంచి సంబంధం కుదిరిందని చెప్పు అందరికీ. ఆ కుటుంబాలు ఎంతో సంతోషిస్తాయి. అప్పుడు నీకూ సంతోషమే కలుగుతుంది. అది స్వయానా అనుభవిస్తే నీకు తెలుస్తుంది. కానీ ఇలా జరిగిన చెడును మాత్రమే అందరికీ ప్రచారం చేస్తే అసలే బాధలో ఉన్న వాళ్ళు ఇంకెంతగా కుమిలిపోతారో నీకు పట్టదా?.. "
జాహ్నవి నుండి ఈ ప్రతిఘటన ఊహించని కల్పన అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయింది. జాహ్నవి మళ్లీ అందుకుంది,
" ఇదే మన ఇంట్లో మనకే జరిగితే.... నీకో కూతురుంది, నాకో కూతురుంది. మన పిల్లలే అలాంటి పనులు చేస్తే.. "
"...ఛఛ ! మన పిల్లలెలా చేస్తారు?..... " అడ్డుకుంది కల్పన.
" ఎందుకు చేయరు?.. " తూటాలా జాహ్నవి నుండి వచ్చిన మాటకు అవాక్కయింది కల్పన.
"...మన పిల్లలేమయినా ప్రత్యేకమా? అంత నమ్మకమా వాళ్ళ మీద !ఏ క్షణం ఎవరి బుర్ర లో ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేని రోజులివి. సరే, చేయరనే అనుకుందాం. మన పిల్లలు ఎంత పద్ధతిగా ఉన్నా బయట అంతా అంతే పద్ధతిగా ఉంటారన్న గ్యారంటీ ఉందా? నిర్భయ, దిశ సంఘటనలు గుర్తు లేదా? వాళ్లంతా మంచి అమ్మాయిలే... కానీ జరిగిందేమిటి? ఒక్కసారి ఊహించుకో... అలాంటిది మనకే జరిగితే.... అందరూ మన గురించి చెవులు కొరుక్కుంటుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో !...."
రెండు చెవులూ మూసేసుకుంది కల్పన.
"....కదా ! వినటానికే అంత కర్కశంగా అనిపిస్తోంది నీకు. మరి స్వయానా ఆ బాధ అనుభవించే వాళ్ళ కేలాగుంటుందో ఆలోచించు... "
నోట మాట రాక అచేతనంగా ఉండిపోయింది కల్పన.
"...ఇలా జరగాలనీ, జరుగుతుందనీ కాదు నేను చెప్పేది, ఏ బాధైనా మనదాకా వస్తేనే గానీ దాని తీవ్రత తెలియదు. మనకు జరగలేదు కదా అని వాళ్ళ బాధని అవహేళన చేయడం తగదు.... ఏమో ఎవరు చెప్పొచ్చారు? ఎందర్ని చూడ్డంలేదు ఈరోజెంతో సంతోషంగా ఉన్న కుటుంబాలు రేపటికి ఊహించని విధంగా దుఃఖంలో మునిగిపోతున్నాయి. నవ్విన కళ్ళే చెమ్మగిల్లొచ్చు, అలాగే వాడిన బ్రతుకులు పచ్చగానూ అవొచ్చు. వినలేదా కల్పనా.... నీతిబోధ చేస్తోంది అని మాత్రం అనుకోకు.. నిన్ను బాధ పెడితే సారీ..... "
ఏమంటుంది కల్పన? అప్పటికే మ్రాన్పడిపోయింది. కప్పు టీ పాయ్ మీద పెట్టి మెల్లిగా లేచి
" ఏదో మంచీ చెడూ అని.... " అంటూ బయటకు నడిచింది వెళ్తున్నానని కూడా చెప్పకుండా.
".. బాధపడిందా తన మాటలకు ! అయినా పరవాలేదు, కాస్త ఆలోచనలో మాత్రం పడి తీరుతుంది. తానేదో గొప్ప పని చేసిందని కాదు గానీ కనీసం తన వద్ద అయినా ఇలాంటివి ఇక ఎప్పుడూ చెప్పదు. బహుశా మునుపటిలా తనతో మాట్లాడకపోనూ వచ్చు, అయినా సరే. స్నేహం మంచిదే. కానీ ఇలాంటి స్నేహం అభిలషణీయం కాదు. రేపు తన ఇంట్లో జరక్కూడనిదేదైనా జరిగినా ఇలాగే ప్రచారాలు చేయడానికి వెనుకాడరిలాంటి వాళ్ళు..."
తనకు తానే సర్ది చెప్పుకుంది జాహ్నవి. కల్పన గేటు దాటి వెళ్లిపోయింది. జాహ్నవి మనసు కుదుటపడింది.
***********
[ చెడు వార్తలు వ్యాప్తిచెందినంత శీఘ్రంగా మంచి వార్తలు వ్యాపించవు. కారణం? చెడు రుచించినంతగా మంచి రుచించదు జనాలకు !! ]
++++++++++++++++++++++++++++++++++++
* భువి భావనలు *
++++++++++++++++++++++++++++++++++++
.
Thursday, October 29, 2020
మానవుడా ! మర్మమెరిగి మసలుకో !
😊🙂🙂😊
ఈ దినం నాదీ నాదనుకుంటున్నది
రేపటికి మరొకరి సొంతం అన్నది ఎరుగక
ఓ వెర్రి మానవుడా, ఎందుకంత ఆరాటం?
ఏదో కావాలనుకుంటావు
మరేదో అయిపోవాలనుకుంటావు
కానీ ---
ఇంకేదో అయిపోయి
డీలా పడిపోతావు
తల్లి గర్భాన కన్ను తెరిచి
భూగర్భాన మన్నుగ మారి
కనుమరుగై పోయేదాక
విధి మున్ముందే రాసేసిన
నీ నుదుటిరాత తిరిగి
ఆ విధాత సైతం మార్చలేడన్న
చేదు నిజం ఎరుగక
ఓ పిచ్చి మానవుడా
ఎందుకా పరుగులు?
ఏమందుకోవాలనీ వృథాప్రయాసలు 😔😔
ఉన్నది చాలు, కడుపు నిండా తిను
మిగులుతుందీ అనుకుంటే
మరొకరి కడుపు నింపు
దీవిస్తారు 🙋💐🌷
ఆ దీవెనలే నీకు సదా రక్ష
వారి మదిలో నీవో
చెరగని ముద్ర ! 👃👃
నీవు లేకున్నా నిత్యం
కదలాడే నీ తీపి తలపులే
ఇలపై నిను నిలిపే ఎనలేని
కీర్తిప్రతిష్ఠలు !! 😇😊
అందుకే ---
ఓయి వెర్రి మానవుడా, మేలుకో !
మర్మమెరిగి మసలుకో !! 🙂🙂🙂
**********************************************
🌷 భువి భావనలు 🌷
**********************************************
కదలాడే నీ తీపి thalapule
Sunday, October 25, 2020
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో నటులు నాడు... నేడు
అలనాటి నుండీ నేటి వరకూ తెలుగు సినిమాల్ని గమనిస్తే కథకు మూలం కథానాయకుడూ, నాయికే గాదు, కథను నడిపించడంలో ప్రధాన పాత్ర వహించే సహాయ పాత్రలూ అత్యంత ప్రధానమన్న విషయం ద్యోతకమౌతుంది. ఆ పాత్రల్ని పోషించేవారే క్యారెక్టర్ ఆర్టిస్టులు. వీటిల్లో విలన్ పాత్రలు, కుటుంబ పెద్ద పాత్రలు ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగ్గవి తండ్రి పాత్రలు. అలాంటి పాత్రల్లో జీవించి ఆయా పాత్రలకే వన్నెతెచ్చిన నటులు ఆనాడూ, ఈనాడూ ----
* ఎస్. వి. రంగారావుగారు. చిన్నతనంలో ఆయన పేరు తెలిసేది కాదు గానీ పోషించిన పాత్ర మాత్రం బాగా గుర్తుండేది.' నర్తనశాల' చిత్రంలో కీచకునిపాత్ర పోషించిన నటుడు చాలా బాగా చేసాడని అందరూ అనుకునేవాళ్లు. కానీ ఆ నటుని పేరైతే అప్పట్లో తెలియదు నాకు. క్రమంగా పేరుతో బాటు వారియొక్క నటనా వైదుష్యం ఆకట్టుకొంది. పౌరాణిక పాత్రల్లో నందమూరి తారక రామారావు గారికి దీటుగా నటించగలిగిన ప్రతిభగల గొప్ప నట దిగ్గజం ఎస్. వి. ఆర్. దుర్యోధనుడిగా, కంసుడి గా ఆయన పోషించిన పాత్రలు అనితర సాధ్యం. భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశిపుడిగా, పాతాళ భైరవి లో మాంత్రికుడుగా ఆయన నటన మరచిపోలేము. సాంఘికాల్లోనూ ఆయన సత్తా చాటారు. మంచి మనసులు చిత్రంలో తండ్రి పాత్రలో ఆయన హావభావాలు, మానసిక సంఘర్షణ అమోఘం. పండంటి కాపురం, బాంధవ్యాలు--- చిత్రాల్లో అన్నయ్యగా హృద్యమైన నటన ప్రదర్శించారు. లక్ష్మీ నివాసం చిత్రంలో ఉదాత్తమైన తండ్రి పాత్రలో హుందాగా కనిపించారు. సాత్విక పాత్రలూ, గాంభీర్యం ఉట్టి పడే మాత్రమేగాక క్రూరత్వం ప్రతిబింబించే పాత్రలూ చేసిన ఘనత వీరిది. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు ఎస్. వి. ఆర్
* ఉదాత్తమైన తండ్రి పాత్రలకూ, సౌమ్యంగా కనిపిస్తూ గౌరవభావం కలిగించే పాత్రలకూ పెట్టింది పేరు' గుమ్మడి'గా అందరికీ సుపరిచితులైన గుమ్మడి వెంకటేశ్వర రావు గారు. ఆడపిల్ల తండ్రి పాత్ర అంటే గుమ్మడే అనేంతగా ఆ పాత్రలో ఒదిగి పోయే వారాయన. కొన్ని సన్నివేశాల్లో హఠాత్తుగా గుండె పట్టుకుని కూలిపోయే నటనలో అది సహజత్వం ప్రదర్శించే సహజనటన వారి సొంతం. మహామంత్రి తిమ్మరుసు చిత్రం లోని అప్పాజీ పాత్ర ఆయన నట జీవితంలో నే కలికితురాయి. మర్మయోగి, కథానాయిక మొల్ల, పూలరంగడు, భలే రంగడు, మరో మలుపు, లక్షాధికారి, అర్థాంగి-- చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు మర్చిపోలేనివి. ఇంకా-- పౌరాణికాల కొస్తే--- దశరథుడు, బలరాముడు, ధర్మరాజు, పరశురాముడు, దుర్వాసుడు, ద్రోణుడు-- ఇలాగే ఉంటారేమో అనిపించేలా ఉంటుంది ఆయన నటనా ప్రతిభ! కేవలం సానుభూతి పొందే పాత్రలే గాక సాఫ్ట్ విలన్ గా తేనె పూసిన కత్తి లాంటి పాత్రల్లో కూడా ఆయన జీవించారు.
* ' అల్లో అల్లో అల్లో ' " మడిసన్నాక కుసింత కలా పోసనుండాలి " --- ముత్యాల ముగ్గు సినిమాలో ఈ డైలాగులతో ప్రభంజనంలా దూసుకొచ్చి అందర్నీ ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న విలక్షణ నటుడు రావు గోపాలరావు గారు. ఒకటా, రెండా ! ఎన్నని ఉటంకించాలి ఆయన ధరించి మెప్పించిన పాత్రలు! క్రూరత్వం, సాధు తత్వం, మేక వన్నె పులి పాత్రలు -- వీటితో పాటు ఉదాత్తత ఉట్టి పడే పాత్రలూ ఈయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎన్. టీ. ఆర్ నటించిన వేటగాడు సినిమా లో అతి క్లిష్ట సమాస భూయిష్టమైన డైలాగులతో అదరగొట్టి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి సమ్మోహన పరిచడం ఆయనకే చెల్లింది. చాలెంజ్, అల్లరి అల్లుడు, ఘరానా మొగుడు--- ఇత్యాది చిత్రాల్లో ఆయన పోషించిన తండ్రి పాత్రలు ఎప్పటికీ గుర్తే.
* అలనాటి నటుల్లో అత్యున్నత స్థాయి jఅందుకున్న నటుల్లో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు. ప్రతినాయక పాత్ర పోషణలో ఆయనకు ఆయనే సాటి అన్న విధంగా ఉంటుంది ఆయన నటన! ఇప్పటికీ ఎనభై ఐదేళ్ల వయసులోనూ అడపాదడపా తెరమీద కనిపిస్తూ ఉండడమే ఆయన నటనా వైదుష్యానికి గొప్ప నిదర్శనం. పౌరాణిక పాత్రలకు జీవం పోసిన అద్భుత నటనా చాతుర్యం ఆయన సొంతం. దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు--- ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జానపద చిత్రాలలోనూ ఆయన పోషించిన పాత్రలు తక్కువేం కాదు. సాంఘికాల్లో--- తాతా మనవడు, నిప్పులాంటిమనిషి, శుభాకాంక్షలు--- ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. మురారి, అరుంధతి చిత్రాలు పోషించిన తాతయ్య పాత్రలూ చెప్పుకోదగ్గవే ! ఈ అద్భుత నటుడు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ అందర్నీ అలరించాలని కోరుకుందాం.
* కోట శ్రీనివాసరావు--- కామెడీ విలన్ పాత్రలకు పెట్టింది పేరు. నటనకు చిరునామా లాంటివాడు. నవ్విస్తూనే క్రూరత్వాన్ని అలవోకగా ప్రదర్శించడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్యేమో అనిపించేలా ఉంటుంది నటన! అహ నా పెళ్ళంట, ఆమె, ప్రతిఘటన, బావ- బావమరిది---ఇలా చాలా ఉన్నాయి వీరి ప్రతిభకు పట్టం కట్టేవి.
* పరభాషా నటులైనా ప్రభంజనంలా దూసుకు వచ్చి తెలుగు చిత్రసీమను కూడా ప్రస్తుతం ఏలుతున్న నటులు--- నాజర్, ప్రకాష్ రాజ్, సత్య రాజ్
క్యారెక్టర్ నటుడిగా నాజర్ అందుకున్న స్థానం తక్కువేమీ కాదు. పోషించిన పాత్రలూ కోకొల్లలు ! హీరోయిన్ తండ్రిగా, ప్రతినాయకుడిగా ఇంకా ఇతర ప్రాధాన్యం కలిగిన సహాయ పాత్రలకు ఈయన ప్రాణం పోశారు. జీన్స్ చిత్రంలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం ఎప్పటికీ మర్చిపోలేము. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రంలో పోషించిన తండ్రి పాత్ర అద్భుతం. అన్నింటినీ మించి' బాహుబలి' లో బిజ్జల దేవా పాత్ర ఆయన నట జీవితంలో నే అత్యద్భుతమైన పాత్ర !
* మొదట్లో డబ్బింగ్ వాయిస్ మీద ఆధారపడ్డా అతి త్వరగా సొంత గొంతు వినిపించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్! విలనీ పోషించడం ఈయనకు కొట్టినపిండే ! అంతేనా! క్రమంగా తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ఈ అద్వితీయ నటుడు పోషించిన పాత్రలు లెక్కపెట్టలేనన్ని ! అలాగే విలన్ పాత్రలూ. నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సోలో--- ఇలాంటి చాలా చిత్రాల్లో కూతురి కోసం ఆరాటపడే తండ్రిగా ఆయన నటన అనితర సాధ్యం.' అంతఃపురం చిత్రం లో విభిన్నషేడ్స్ కలిగిన పాత్ర చెప్పుకోదగినది.
* తర్వాతి స్థానం సత్యరాజ్ దే ! ఈయన పోషించిన తండ్రి పాత్రలకూ కొదువేం లేదు. రాజా రాణి, బ్రహ్మోత్సవం, ప్రతి రోజు పండగే--- ఇవి ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు. గతంలో మరెన్నో చిత్రాల్లో పోషించిన పాత్రలు వారి నటనకు అద్దం పట్టేవే! ఈ నటుడు పోషించిన పాత్రలన్నీ ఒకెత్తు,' బాహుబలి' చిత్రంలో పోషించిన కట్టప్ప పాత్ర ఒక ఎత్తు. అంతగా గుర్తింపు తెచ్చి పెట్టిన గొప్ప పాత్ర !
ఇలా పలురకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన నటులు అలనాడే కాదు ఈనాడూ అద్వితీయంగా వెలుగొందుతున్నారు !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌹 భువి భావనలు 🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Wednesday, October 21, 2020
వర్ణశోభితం
నల్లనల్లని మూలాలు పుడమి కడుపున
దాగెనే చల్ల చల్లగా
ఆపైని అలరించే కొమ్మలు రెమ్మలు
చుట్టూ విస్తరించగా
పచ్చపచ్చగా విచ్చిన పత్ర దళాల
చీర చుట్టుకుని నడుమ
నిలబడింది చూడు కాండం
ఠీవిగా గోధుమ వర్ణాన !
అంతేనా--
అటు చూడు చూడు🌺🌹
ఎన్ని మొక్కలు 🙂
ఎన్నెన్ని రంగులు !
మరెన్నెన్ని ఆకృతులు !
పసిడి కాంతులు వెదజల్లుతూ
పరిమళాలు విరజిమ్ముతూ
పలు వర్ణాల సమ్మిళితమై విరాజిల్లుతూ
తల్లి కొంగు చాటు నుండి
తొంగి చూస్తున్న బుజ్జి పాపల్లా
సుమబాలలవిగో 🌹🌷🌺😊🙂
ఎంత వర్ణ శోభితం!
మరెంత అబ్బురం !
రవంత విత్తనమే!
కొండంత విషయం దాచుకున్నదే !
తరచి తరచి చూసే
కళ్ళుండాలే గానీ
జగతి నిండా నలుమూలలా
అందమే అందం 🙋
ఆహా! ప్రకృతి ఎంత రమణీయం !
వెరసి ఈ సృష్టియే అద్భుతం!
మహాద్భుతం !!🙏🙏
**********************************************
🌷భువి భావనలు 🌷
**********************************************
Tuesday, October 20, 2020
ఆదివారం ఎంతో ఇష్టం.. ఎందుకంత ఇష్టం?
ఆదివారం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకని? వారంలో ఏ రోజుకూ లేని ప్రత్యేకత ఆదివారానికే ఉంది గనక! వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండీ పెద్దల దాకా ఎంతగానో ఎదురు చూస్తుంటారు ఈ రోజు కోసం. ఆరు రోజుల శ్రమ అనంతరం దొరికే ఆటవిడుపు కదా! ఇంతకీ అందరూ ఎరిగినదే అయినా ఆదివారం అన్నది ఎవరెవరికి ఎలా ఇష్టమైనదో చూద్దాం.
* పిల్లలకు-- ప్రతీ ఉదయం నిద్రమత్తు వీడకనే త్వరగా లేవాలి. తయారవ్వాలి. బోలెడు పుస్తకాల మోత. హడావుడిగా తినడం. పరుగులు తీయడం. అక్కడేమో వరుసగా పాఠాల మోత. బుర్ర కెక్కినా ఎక్కక పోయినా క్లాసులో కూర్చోవడం అయితే తప్పనిసరి! అంతేనా! టీచర్లతో చీవాట్లు, అప్పుడప్పుడు తన్నులు, ఇంకా హోం వర్క్ లు ! తలబొప్పి కడుతుంది. ఆరు రోజుల ఈ కష్టానికి ఒకరోజు బ్రేక్! అదే ఆదివారం! ఎంచక్కా నిదానంగా నిద్రలే వచ్చు. తీరిగ్గా స్నానపానాదులు. టీవీలో ఇష్టమైనవి చూడడాలూ. వీడియో గేమ్స్ ఆట్లాడుకోడాలు. ఫ్రెండ్స్ తో ఆటలు ! ఇవన్నీ ఉంటాయి కాబట్టే మరి పిల్లలకు ఆదివారం వస్తోందంటే అంత హుషార్! అంతటి హుషారూ సోమవారం ఉదయానికి నీరు గారి పోతుంది అనుకోండి, అది వేరే సంగతి!
* ఇక-- ఇంట్లో ఇల్లాళ్లకు. ఇంట్లో ఉంటారన్న మాటే గానీ వాళ్లకు తీరికనేది ఉండేది ఎక్కడ? తెల్లారగట్ల లేవాలి, భర్తకూ, పిల్లలకు టిఫిన్లు, భోజనాలు సిద్ధం చేయాలి. చిన్నపిల్లలయితే వాళ్లనూ రెడీ చేయాలి. రొప్పుతూ రోజుతూ అన్నీ అమర్చి వాళ్లను బయటికి సాగనంపేసరికి వాళ్ల తల ప్రాణాలు తోకకొచ్చేస్తాయి. మరి వీళ్లూ ఆదివారం కోసం ఎదురు చూస్తారు అనడంలో వింతేముంది? ఆ రోజైతే ఇంత ఉరుకులాట, టెన్షన్ అన్నది ఉండదు వాళ్ళకి.
* ఇంటికే పరిమితమయ్యే గృహిణుల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఉద్యోగినుల గురించి వేరే చెప్పాలా! రేపు ఉదయం టిఫిన్ నుండి మధ్యాహ్నం క్యారియర్, ఇంకా ఇంకా వగైరా వగైరా అన్నీ ముందురోజే ఆలోచించి సిద్ధం చేసుకోకపోతే అంతే సంగతులు! అందరికీ అన్నీ చూస్తూ తనకు తాను కూడా టైం లోపల రెడీ అవ్వాల్సిన పరిస్థితి వాళ్లది, ఇవన్నీ ప్రణాళిక ప్రకారం చేయలేకపోయారా, మరుసటి రోజు గమ్యస్థానం సమయానికి చేరడం దుర్లభమే ! ఆరు రోజుల ఈ ప్రయాస అనంతరం ఒక్కరోజు విశ్రాంతికై ఎదురు చూడడం అత్యాశ ఏమీ కాదు కదా! కొందరైతే కొన్ని పనులు ఆదివారానికి బదలాయిస్తూ ఉంటారు. బట్టలు ఉతుక్కోవడం, స్పెషల్స్ వండుకోవడం లాంటివన్నమాట! మిగతా రోజుల్లో కుదరదు కదా మరి!
* ఆడవాళ్ళ సంగతి అలా ఉంటే మరి మగవాళ్ల సంగతేమిటి? వీళ్ళ పని కాస్తలో కాస్త నయం. ఎందుకంటే, వంటింటి డ్యూటీలుండవు కాబట్టి! నూటికొక్క శాతం పురుషులు వంటింట్లో భార్యలకు సహాయపడటం, పిల్లల్ని రెడీ చేయడం లాంటివి చేస్తారేమో గానీ ఎక్కువ శాతం మాత్రం వాటికి దూరంగానే ఉంటారు. ఇలా అంటే మాకు బయట బోలెడు పనులు ఉంటాయి, అవి మీ ఆడవాళ్లు చేయలేనివి అంటుంటారు. వాళ్ల కోణంలో అదీ నిజమే. మిగతా ఆరు రోజులూ ఉద్యోగ బాధ్యతలతో సతమత మయ్యే వీళ్ళు ఆదివారం నాడేకాస్త రిలాక్స్ అవటానికి ఆస్కారం. అందుకే వాళ్లు కూడా ఆరోజు కై కచ్చితంగా ఎదురుచూస్తుంటారు.
* ఉద్యోగస్తులే కాదు, ఇతర పనులు అంటే వ్యాపారాలు చేసేవారు, ఇతర వ్యాపకాల తో బిజీగా ఉండేవారు కూడా ఆదివారం అన్నీ బంద్ చేసేసి విశ్రాంతి కోరుకుంటారు.
* ఇంకా-- కూలీ పనులు చేసేవారూ, భవన నిర్మాణ కార్మికులు ఆరు రోజులు మాత్రమే పని చేసి ఆదివారం సెలవు పుచ్చుకుంటూ ఉంటారు.
ఆదివారం( సెలవు దినం అని కూడా అనవచ్చు ) అందరికీ అందించే చిన్ని చిన్ని ఆనందాలు---
* శరీరానికీ, మెదడుకూ కాస్త విశ్రాంతి.
* రొటీన్ గా తీసుకునే దానికంటే కాస్త స్పెషల్ గా ఉండే ఫుడ్!
* పిల్లలతో ఏ పార్క్ కో, సినిమాకో వెళ్లి సరదాగా గడిపే అవకాశం. ( కరోనా పుణ్యమాని సినిమా వైభోగం ప్రస్తుతం బంద్ అయిందనుకోండి! )
* ఇవేవీ లేకపోయినా ఇంట్లోనే అంతా కలిసి హాయిగా ఓ పూట కాలక్షేపం చేసే సదవకాశం.
😊 ఈ దేహం రీఛార్జ్ అయి మళ్లీ సక్రమంగా, హుషారుగా పని చేయాలంటే దానికి విశ్రాంతి అన్నది చాలా చాలా అవసరం. ఆ విశ్రాంతి కోసమే ఈ' ఆదివారం'. అందుకే ఆరోజంటే అందరికీ అంత ఇష్టం మరి!!🙂
************************************************
🌷భువి భావనలు 🌷
************************************************
Saturday, October 17, 2020
'చిన్నారి ' పజిల్స్ --ఆలోచించండి --2
Friday, October 16, 2020
ఆరనీకుమా ఆశాదీపం
కలిమి పోయిందా?
కలవరపడకు
కష్టపడితే కలిసొస్తుంది
బలిమి పోయిందా?
బాధపడకు
బ్రతుకు బండేమీ ఆగిపోదు
ఆరోగ్యం దిగజారిందా?
దిగులు పడకు
బాగయ్యే మార్గాలున్నాయి వెతుకు
అయితే--
ఆశ ఆవిరై పోయిందా?
నీవు జీవన్మృతుడవే సుమా !
ఆ దీపం ఆరిపోనీకు ఎప్పటికీ
ఆశాజీవికి అపజయమెక్కడిది మిత్రమా !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌹భువి భావనలు 🌹
Monday, October 12, 2020
ఆరోగ్యభాగ్యం
🙂😊👌
హఠాత్తుగా దేవుడు నా ముందు నిలిచి
ఏంకావాలో కోరుకొమ్మని అడిగితే
క్షణమాలోచించక అడిగేస్తా
జీవితకాలం ఏ రుగ్మతలూ
నను దరిజేరని దివ్యమైన
ఆరోగ్యభాగ్య మిమ్మని 🙂
అష్టైశ్వర్యాలు, అడుగడుగునా దాసదాసీలు
అభిమానించే ఆత్మీయ బంధాలు
ఊరు వాడా బంధుగణాలు
ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో
వెన్నంటి నీ నీడలా ఉన్నా
మదినిండా ముదమన్నది కరువైన
పైవన్నీ వ్యర్థం వ్యర్థం 😔
అనారోగ్య భూతం నిను
కబళిస్తున్న వేళ అవేవీ
నిను కావలేవు సుమీ !
నిండైన ఆరోగ్యం తోనే అది లభ్యం 👌
ఆరోగ్యమే మహాభాగ్యం
అదుంటే అన్నీ ఉన్నట్టే కదా నేస్తం 👌
***********************************************
కరోనా వైరస్ మానవ జీవితాల్లోకి ప్రవేశించాక అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది.
***********************************************
' భువి ' భావనలు
🌷🌷🌷🌷🌷🌷
Thursday, October 8, 2020
ప్రాణమా, నీవెక్కడ? వేధించే ప్రశ్నలు
తల్లి గర్భంలో జీవం పోసుకున్న ప్రాణి జన్మించిన పిదప క్రమ క్రమంగా ఎదుగుతూ ఎన్నో సాధిస్తూ చివరకు ఏదో ఒక రోజు జీవమన్నది ( అదే ప్రాణమన్నది ) తన దేహం నుండి వేరై నిర్జీవంగా మారడం.
ప్రాణానికి ఇంత విలువ ఉందా! అది ఉన్నంత వరకేనా మనిషి మనుగడ ! ఆ తర్వాత ఎంతటి వారలైనా కాటికి చేరాల్సిందేనా !
* మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఈ పేరు వినని వాళ్లు ఏ తరం లో నైనా ఉంటారా? ఓ బక్కపలుచని వ్యక్తి కొల్లాయి గట్టి కనీసం వంటిమీద చొక్కా అయినా లేకుండా అతి నిరాడంబరంగా కనిపిస్తూ అందర్నీ తన కనుసన్నల్లో నిలుపుకుని మొత్తం భారతావనికే తలమానికంగా నిలిచిన ఓ మహా మనీషి. భరతమాత దాస్యశృంఖలాలను తెంచాలన్న దృఢ సంకల్పంతో సకల జనావళినీ తన వెన్నంటే నడిచేలా చేయగలిగిన ధీశాలి. స్వాతంత్ర్యం సాధించి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టే దాకా నిద్రించని పట్టువదలని నిత్య శ్రామికుడు!
అంతటి మహోన్నత వ్యక్తి చివరకోతూటాకు బలై నేలకొరిగి ప్రాణమన్నది అనంత వాయువుల్లో కలిసిపోయి అచేతనుడై పోయాడు. యావత్తు దేశాన్ని నడిపించిన ఆ వ్యక్తి దేహం నిర్జీవమై పోయి పిడికెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోయింది. ప్రాణం ఉన్నంత వరకు అంతటి శక్తివంతమైన ఆ కాయం అది కాస్తా మాయమవగానే కూలిపోయింది ! ఇంతకూ ఆ ప్రాణమన్నదెక్కడ?
* ఇందిరాగాంధీ. ధీరవనిత! శక్తివంతమైన మహిళ! మేధోసంపత్తి, చాకచక్యం పుష్కలంగా కలిగి దేశ ప్రధానిగా తిరుగులేని విధంగా భాసిల్లి ఇందిర అంటే ఇండియా అన్న విధంగా కీర్తింప బడ్డ అద్వితీయ నారీమణి! చక్కటి చీర కట్టుతో, ఒత్తయిన తలకట్టుతో ఎంతో హుందాగా కనిపించే ఇందిరమ్మ తన ఇంటి ప్రాంగణంలో అండగా నిలవాల్సిన అంగరక్షకుల తూటాలకే బలై పోయింది. దేశాన్ని తిరుగులేని విధంగా ఏలిన ఆ గొప్ప మహిళ కూడా ప్రాణం దేహాన్ని వీడగానే ఒక్కసారిగా ఆమె జీవనయానం స్తంభించిపోయి నిస్సహాయురాలై పోయింది.
* చక్కటి రూపం, అంతకుమించిన అద్భుత నటనా కౌశలం, గంభీరమైన స్వరం -- ఆయన సొంతం. పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు. భీష్ముడు ఆయనే! ఇంకా ఇంకా ఎన్నో సాంఘిక చిత్రాల్లోని పాత్రల్లోనూ జీవించిన నందమూరి తారక రామారావు అశేష తెలుగు ప్రజానీకానికి ఆరాధ్య దైవం. రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రిగా వెలుగొంది కాలిడిన ప్రతీ రంగంలో తనకు తానే సాటి అనిపించుకున్న కారణజన్ముడు! అంతటి ధీరోదాత్తచరిత ప్రాణం ఉన్నంత వరకే!-- ప్రాణం అంటే ఏమిటి?
* ఒకటి కాదు, వంద కాదు, వెయ్యి కాదు --ఏకంగా నలభై వేల పాటలు --అదీ పదహారు భాషల్లో పాడిన ఘనత సాధించి రికార్డు సొంతం చేసుకుని 'గానగంధర్వుడి' గా కీర్తింపబడ్డ ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు --ఏరీ, ఎక్కడ? నిండైన ఆ విగ్రహం, చిరునవ్వులు చిందించే ఆ మోము గళం విప్పితే చాలు జాలువారే మధుర గీతాలు, పెదవి విప్పితే చాలు అనర్గళంగా సాగిపోయే ఆ వాక్ప్రవాహం -- ఇప్పుడెక్కడ? గాజుపెట్టెలో -- తేనెల వానలు కురిపించే ఆగళం, ఆ పెదవులు నిర్జీవంగా-- ప్రాణం లేనందుకే గా!
దేహంలో ప్రాణమన్నదానికి ఇంతటి ప్రాధాన్యత ఉందన్నమాట! అది వీడిన మరుక్షణం దానికి విలువ లేదు. మట్టిలో కలిసి పోవాల్సిందే. ఊపిరి ఉన్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు, బాధలూ, బాధ్యతలూ --- అది కాస్తా ఆగాక అంతా శూన్యం, శూన్యం.
ఏమిటీ, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి? సెలబ్రిటీల గురించే చెబుతున్నావు, వాళ్లంతా జగమెరిగిన వాల్లనా ! నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటేమిటి? వాళ్లు సెలబ్రెటీలు కారా?
ఎంత మాట! ప్రతీ వ్యక్తికీ అమ్మ నాన్నలను మించిన వారెవరుంటారు?
గుడ్లురిమినా నీపైనే
గుండెలకదుముకున్నా నిన్నే --- అనే అమ్మ
వేలెడంత వయసు నుంచీ
వేలు పట్టి నడిపించి
లోకం చూపించి లోకజ్ఞానం
తెలిసేలా చేసి, విలువలు నేర్పించి
దారిచూపిన నాన్న !
--- మేము లేకున్నా ఇక నీవు బ్రతుకు బాటలో సాగిపోగలవులే -- అన్న భరోసా వచ్చాక నిష్క్రమించిన ఇరువురూ కట్టెల్లో కట్టెగా మారి కాలిపోతున్న క్షణాన చూడలేక తల తిప్పుకున్న క్షణాలు ఇప్పటికీ గుర్తే !
ఇంతకీ నేచెప్పాలనుకున్నది దేహంలో ఈ ప్రాణం గురించి--
అసలు ప్రాణం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు మరణం ఉండదంటారు. మనిషి మరణించాక శరీరం నుండి ఆత్మ వేరై పోతుంది అనడం వింటుంటాం. అయితే దానికి మరణం తర్వాత తన భౌతికకాయానికి జరిగే తతంగాలన్నీ తెలుస్తూ ఉంటాయా? ఇవన్నీ వేధించే ప్రశ్నలే. జవాబులు మాత్రం దొరకడం లేదు.
************************************************
🌷🌷' భువి ' భావనలు 🌷🌷
************************************************
Sunday, October 4, 2020
'చిన్నారి ' పజిల్స్
కింది వాక్యాల్లో బంధుత్వాలు దాగి ఉన్నాయి. కని పెట్టండి.
1. ప్రతీఏడూ మా మల్లె చెట్టు విరగగాస్తుంది.
2.ఒరేయ్, అక్కడ నీకేమి పని?
3. నీవిచ్చిన అత్తరు నాకు నచ్చింది.
4. బాబా వద్ద ఆశీర్వాదం తీసుకో బాబూ.
5. నీవే కాదంటే నాకు మరి దిక్కెవరు నాన్నా !
6. ఈ జావ దినదినం రెండు సార్లు తాగాలి.
--------------------------------------------------------------------
1.మామ 2.అక్క 3.అత్త 4.బావ 5.మరిది 6.వదిన
--------------------------------------------------------------------
ఆసక్తి గలవారు ఇలాంటివి ప్రయత్నించగలరు.
--------------------------------------------------------------------
🌷🌷'భువి 'భావనలు 🌷🌷
--------------------------------------------------------------------
Friday, October 2, 2020
మహాత్మ.......
ఓ సారి గాంధీజీ ఓ పాఠశాలను దర్శించాడట. అప్పుడు ఓ తరగతిలోని ఓ పిల్లవాడు గాంధీజీ చొక్కా లేకుండా తిరగడం చూసి, " అయ్యో, గాంధీ తాత వేసుకోవడానికి చొక్కా కూడా లేనంత బీద వాడా... " అనుకుని, ఆయన్ను సమీపించి, " మా అమ్మచొక్కాలు బాగా కుడుతుంది. ఆమెను అడిగి ఓ చొక్కా మీకోసం తెస్తాను..... " అని అన్నాడట. గాంధీజీ నవ్వి, ఆ పిల్లవాణ్ణి దగ్గరకు తీసుకుని,
" నాకు కొన్ని కోట్ల మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్లకు కూడా చొక్కాలు లేవు. నీవు వాళ్లందరికీ కూడా చొక్కాలు తీసుకురా గలవా మీ అమ్మనడిగి.... " అన్నాడట.
" ... ఏమిటి, గాంధీ తాత కు అంత మంది అన్నదమ్ములా...... " అనుకుని అవాక్కై పోయాడట ఆ పిల్లవాడు!యావత్తు దేశప్రజలందర్నీ తన వాళ్ళుగా భావించి వాళ్లకు లేని సౌకర్యం తనకెందుకని చొక్కా త్యజించిన మహనీయుడాయన. ఆయన నిరాడంబరత్వాన్ని తెలిపే ఇలాంటి ఉదాహరణాలెన్నో !
గాంధీజీ ఆశయాలు, పట్టుదల, దీక్ష పరాయి దేశాలను కూడా ఎంతో ఆకర్షించాయి. విదేశీయుడైనా రిచర్డ్ అటెన్ బరో గాంధీజీ జీవిత చరిత్రను సినిమాగా తీయడమే ఇందుకు గొప్ప నిదర్శనం. ఆ సినిమా తీయడానికి అటెన్ బరోకు దాదాపు 18 సంవత్సరాలు పట్టిందట ! ' గాంధీ ' అన్న పేరుతో నవంబర్, 30, 1982 లో విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఎనిమిది ఆస్కార్ అవార్డులను గెలుచుకొంది.
1. Best Director
2. Best Actor
3. Best Picture
4. Best original screen play
5. Best Film editing
6. Best Art Direction
7. Best cinematography
8. Best costume Design
గాంధీజీ 151 వ జయంతి సందర్భంగా ఆయన సూక్తుల్లో కొన్ని ----
* అహింసను మించిన ఆయుధం లేదు.
* ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి.
* కంటికి కన్ను సిద్దాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
* ఓటు, సత్యాగ్రహం -- ఈ రెండూ ప్రజల చేతిలోని ఆయుధాలు.
* పాముకాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. కానీ తాగుడు వ్యసనమన్నది ఆత్మను చంపేస్తుంది.
* మానవత్వం అనే పుస్తకం కంటే వేరే ఉత్తమ గ్రంథం ఏముంటుంది?
ఇంకా ----
బసవరాజు అప్పారావు గారు గాంధీజీ ఆహార్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ సరళమైన పదాలతో ఎంత చక్కగా వ్యక్తీకరించారో చూడండి...
'మాలపిల్ల ' సినిమా లో ఈ గీతాన్ని సూరిబాబు గారు హృద్యంగా ఆలపించారు.
కొల్లాయి గట్టితే నేమీ
మా గాంధి కోమటై పుట్టితే నేమి
వెన్నపూస మనసు, కన్నతల్లి ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు
నాల్గు పరకల పిలక
నాట్యమాడే పిలక
నాల్గు వేదాల నాణ్యమెరిగిన పిలక
బోసినోర్విప్పితే
ముత్యాల తొలకరే
చిరునవ్వు నవ్వితే
వరహాల వర్షమే
చకచక నడిస్తేను
జగతి కంపించేను
పలుకు పలికితేను
బ్రహ్మ వాక్కేను
----- ఎన్నో సంవత్సరాల నాటి పాట. వింటుంటే ఇప్పటికీ జీవం తొణికిసలాడుతూ ఉంటుంది.
చివరగా -- ప్రఖ్యాత శాస్త్ర వేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ గాంధీజీ గురించి ఇలా అన్నారు.
" ఇలాంటి ఒక మనిషి సజీవంగా ఈ భూమ్మీద నడయాడాడంటే భావితరాల వారు నమ్మడం కష్టం. "
**********
అక్టోబర్, 2, 1869 న జన్మించిన గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం జనవరి, 30, 1948 న వినాయక గాడ్సే తూటాలకు బలై నేలకొరిగాడు. చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహనీయుని శకం ఆవిధంగా ముగిసిపోయింది. 💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌷🌷🌷' భువి ' భావనలు 🌷🌷
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Saturday, September 26, 2020
ఆ గంధర్వగానానికి మరణం లేదు
ఆగష్టు మొదటి వారంలో అనుకోకుండా యూట్యూబ్ లో ఓ వీడియో చూశాను. అది -- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు తనకు కరోనా వైరస్ సోకిందనీ, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయనీ, మరేమీ పరవాలేదు తగ్గిపోతుంది అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదనీ తాను పెట్టిన ఓ సెల్ఫీ వీడియో.
" సరే, కరోనా వస్తే ఏమవుతుంది, ఎంత మందికి రావడం లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే బాగయిపోతుంది. లక్షణంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు " అనుకున్నారంతా. కానీ, రోజులు గడుస్తూ నెలన్నర దాటిపోయి ఆశనిరాశల మధ్య అందర్నీ ఊగిసలాడేలా చేస్తూ ఆఖరికి నిన్నటి దినం దుర్వార్త వినిపించి దిగ్భ్రాంతికి గురిచేసేసింది విధి ! ఇది సినీ జగత్తుకే కాదు యావత్తు ప్రజానీకానికి ఇంకా అశేష సంగీతప్రియులందరికీ జీర్ణించుకోలేని దురవస్థే. హఠాత్తుగా మహమ్మారి సోకడం , హాస్పిటల్ కెళ్ళినవాడు అట్నుంచటే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం !ఊహించని అశనిపాతం ఇది ! అప్పట్లో 'అమరగాయకుడు ' ఘంటసాల, ఇప్పుడు ' గానగంధర్వుడు ' ఎస్. పి. బి !
" ఎంతసేపు మానవులకేనా, మాక్కూడా మీ గానమాధుర్యం కాస్త వినిపించరాదా !" అంటూ దేవతలే ఇరువుర్నీ స్వర్గానికి రప్పించుకున్నారేమో అన్న భావన కల్గుతోంది.
ప్రస్తుతం బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించడం మినహా చేయగలిగిందేమున్నది !కొందరంటున్నట్టు వారు కనుమరుగైనా వారి పాట నిత్యం మనముందు మెదుల్తూనే ఉంటుంది. ఇది అక్షరాలా నిజం.
బాలూ గారి పాటల్లో వారు సోలో గా ఆలపించినవి నాకు బాగా ఇష్టమైనవి కొన్ని ----
* ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హాలాహలం
* ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
--- చిత్రం : నీరాజనం
* చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన
కర కంకణములు గలగలలాడగ
ఆడవే మయూరి నటనమాడవే మయూరి
--- చిత్రం : చెల్లెలి కాపురం
* పుణ్యభూమి నాదేశం నమో నమామి
నన్ను గన్న నా దేశం నమో నమామి
--- చిత్రం : మేజర్ చంద్రకాంత్
* తారలు దిగి వచ్చిన వేళ
మల్లెలు నడిచొచ్చిన వేళ
చందమామతో ఒక మాట చెప్పాలి
ఒక పాట పాడాలి
--- చిత్రం : ప్రేమాభిషేకం
* మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు
మహా పురుషులవుతారు
తరతరాలకీ తరగని వెలుగౌతారు
ఇలవేలుపులవుతారు
--- చిత్రం : అడవి రాముడు
* మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్నీ
మాసిపోయి కుములు వేళ
మిగిలింది ఆవేదన
--- చిత్రం : పూజ
* కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్లు కవ్వించే సోగ్గాళ్లు
ఆటగాళ్లు పాటగాళ్లు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు
--- చిత్రం : అందమైన అనుభవం
* ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిలా
మౌనమైన వేళలా
చిత్రం : గీతాంజలి
* ఈ పేటకు నేనే మేస్త్రీ
నిరుపేదల పాలిట పెన్నిధి
--- చిత్రం : ముఠామేస్త్రి
* ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధి లీల
వెంట ఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుది వేళా
మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి కాయమని
నీ బరువు నీ పరువు మోసేది
ఆ నలుగురు... ఆ నలుగురు
--- చిత్రం : ఆ నలుగురు
******************************************
🌺🌺' భువి ' భావనలు 🌺🌺
******************************************
*
Monday, September 21, 2020
'పజిల్స్ '
' కూరగాయల మాటలు' అన్న పైన ఇచ్చిన పజిల్ కొంతకాలం క్రితం నేను తయారు చేసి ఈనాడు' హాయ్ బుజ్జీ ' పేజీకి పంపినది. ఆసక్తిగలవారు ఇలాంటి వాక్యాలు ప్రయత్నించి వ్రాయుటకై మనవి చేస్తున్నాను. 🙏
****************
🌹🌹'భువి 'భావనలు 🌹🌹
*****************
Monday, September 14, 2020
'చిన్నారి ' పజిల్స్
Wednesday, September 9, 2020
తప్పెవరిది? కన్నబిడ్డలు బలిపశువులా?..... ఓ విశ్లేషణ
Friday, September 4, 2020
నవ్వుల పువ్వుల రవ్వల నడుమ మనం మనం.....
ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని అంతరంగం.....
Monday, August 31, 2020
గురువంటే.....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Saturday, August 29, 2020
అప్పట్లో దూరదర్శన్..... అదో అడ్మిరేషన్ !
Sunday, August 23, 2020
తరతమ భేదాలు లేనిది........?
Wednesday, August 19, 2020
మనసా, చలించకే.... !
**********
నా సెలవు అయిపోవచ్చింది. వెళ్ళవలసిన రోజు దగ్గర పడుతోంది. రాజమ్మను చూస్తోంటే నా ఆరాటం అధికమవుతోంది. నేను అనుకున్నది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? అమ్మ మాటలకు మరీ ఇంతగా లొంగిపోయానేమిటి? నాలో చెప్పలేని వెళితి ఏర్పడిపోయింది. లాభం లేదు, ఏదో ఒకటి చేసెయ్యాలి.
ఎలాగైతేనేమి, నా ప్రయాణం రోజు రానే వచ్చింది. ఆ రోజు పది గంటల బండికి వెళ్లాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాను. అమ్మ నాకు జాగ్రత్తలు చెప్పసాగింది. ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణం కాబట్టి ఇది మామూలే ఎప్పుడూ. నా అంత కనిపించే ఆడపిల్లలకు కాలేజీలో పాఠాలు చెబుతున్నా అమ్మ నన్నింకా పసిపిల్లలాగే జమకడుతుంది. అమ్మ చెప్పే వాటి కంతా తలాడిస్తూన్నాను కానీ నా మనసంతా రాజమ్మ కోసమే ఎదురు చూస్తోంది. ఆరోజెందుకో తను ఇంకా రాలేదు. రోజు తెల్లారేసరికే వచ్చేది. ఆ మాటే అమ్మతో అంటే, " వస్తుందిలే తీరిగ్గా, దాంతో ఇప్పుడేమిటి నీకు పని? " అని ఎదురు ప్రశ్నించింది.
ఇక రాజమ్మ ప్రసక్తి ఎత్తడం సుతరామూ మంచిది కాదనిపించింది. అంతే! క్షణాల్లో నేనో స్థిర నిర్ణయానికొచ్చేసాను. తొమ్మిది కావొస్తోంది. అన్నీ సర్దుకుని సూట్కేసు బయట పెట్టాను. ఈలోగా అమ్మ దేనికోసమో లోపలికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే రాజమ్మ వస్తూ కనిపించింది. నేనిక ఆలస్యం చేయదలచుకోలేదు. రాజమ్మ దగ్గరకు రాగానే, " ఊరు వెళ్తున్నాను రాజమ్మ, అమ్మను జాగ్రత్తగా చూసుకో, " అంటూ పర్సులో నుంచిఅయిదు వందల నోట్లు నాలుగు తీసి ఆమె చేతిలో పెట్టి మెల్లిగా అన్నాను, " ఏమిటో, నా సంతోషం రాజమ్మ, ఇది అమ్మకు చెప్పాల్సిన పని లేదు,... "
రాజమ్మ గాబరాగా, " ఇదేంటమ్మా, వద్దు తల్లీ... " అంటూ మొహమాట పడిపోతూ తిరిగి ఇవ్వబోయింది.
" పర్వాలేదు ఉంచు, " అంటూ నోట్లను ఆమె చేతిలో అదిమిపెట్టి మరో వైపు తిరిగి ఇంట్లోకి చూస్తూ అమ్మను కేకేశాను. గత కొద్ది రోజులుగా నాలో రేగుతున్న అలజడి ఒక్కసారిగా సద్దుమణిగింది. అమ్మ రాగానే, రాజమ్మ సూట్ కేస్ తీసుకుంది. ఇద్దరూ కలిసి రోడ్డు దాకా వచ్చి, నన్ను ఆటో ఎక్కించారు. వెళ్తున్న ఆటోలోంచి ఓసారి వెనక్కి చూశాను. ఇద్దరూ చేతులూపుతూ కనిపించారు. నీళ్ళు నిండిన రాజమ్మ కళ్ళలో ఏదో భావం! నాకు మాత్రమే అర్థమయ్యేలా!
**********
రైలు వేగం పుంజుకుంది. దాంతో నా ఆలోచనలు కూడా పరుగు పెట్టాయి. ఆ ఇద్దరి గురించి ఆలోచిస్తున్న నాకు అకస్మాత్తుగా ఓ పౌరాణిక గాధ లోని సంఘటన స్పురించింది. మహాభారతంలో గొప్ప దాతగా ప్రసిద్ధిగాంచిన కర్ణుడు ఎడమ చేతి నుండి కుడి చేతికి బంగారు పాత్ర మార్చి దానం చేసే లోగా ఎక్కడ తన మనసు మారిపోతుందోననే అనుమానంతో, ఎడమచేత్తో దానం చేయకూడదని తెలిసి కూడా ఆ చేత్తోనే యాచకుడికి ఆ పాత్ర దానం చేశాడట! కర్ణుడంతటి గొప్ప దాతకే తప్పలేదు ఈ చిత్తచాంచల్యానికి లొంగిపోవడం ! ఇక నేనెంత! అనిపించింది.
హాస్పిటల్లో నేను అనుకున్న వెంటనేరాజమ్మకు చీరలిచ్చి ఉంటే సరిపోయేది. కానీ, కొన్నిరోజుల అనంతరం ఇంటికి రావడం, అమ్మ అడ్డుపుల్లలు వేయడం -- ఇలాంటి అవాంతరాలతో నా నిర్ణయం సడలిపోవడం ! ప్చ్ ! నిజంగా ఈ మనసనేది ఎంత విచిత్రమైనది ! ఒకసారి ఉన్నట్లు మరోసారి ఉండదెందుకని?
ఏదేమైనా, నేను చేయాలనుకున్నది చేసేశాను. అందుకేనేమో ప్రస్తుతం మబ్బు విడిన ఆకాశం లా నా మనసంతా తృప్తితో నిండిపోయింది. మదిలో సుళ్ళు తిరిగే ఆలోచనల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు సాగింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹