Sunday, October 25, 2020

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో నటులు నాడు... నేడు

     అలనాటి నుండీ నేటి వరకూ తెలుగు సినిమాల్ని గమనిస్తే కథకు మూలం కథానాయకుడూ, నాయికే గాదు, కథను నడిపించడంలో ప్రధాన పాత్ర వహించే సహాయ పాత్రలూ అత్యంత ప్రధానమన్న విషయం ద్యోతకమౌతుంది. ఆ పాత్రల్ని పోషించేవారే క్యారెక్టర్ ఆర్టిస్టులు. వీటిల్లో విలన్ పాత్రలు, కుటుంబ పెద్ద పాత్రలు ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగ్గవి తండ్రి పాత్రలు. అలాంటి పాత్రల్లో జీవించి ఆయా పాత్రలకే వన్నెతెచ్చిన నటులు ఆనాడూ, ఈనాడూ ----

* ఎస్. వి. రంగారావుగారు. చిన్నతనంలో ఆయన పేరు తెలిసేది కాదు గానీ పోషించిన పాత్ర మాత్రం బాగా గుర్తుండేది.'  నర్తనశాల' చిత్రంలో కీచకునిపాత్ర పోషించిన నటుడు చాలా బాగా చేసాడని అందరూ అనుకునేవాళ్లు. కానీ ఆ నటుని పేరైతే అప్పట్లో తెలియదు నాకు. క్రమంగా పేరుతో బాటు వారియొక్క నటనా వైదుష్యం ఆకట్టుకొంది. పౌరాణిక పాత్రల్లో నందమూరి తారక రామారావు గారికి దీటుగా నటించగలిగిన ప్రతిభగల గొప్ప నట దిగ్గజం ఎస్. వి. ఆర్. దుర్యోధనుడిగా, కంసుడి గా ఆయన పోషించిన పాత్రలు అనితర సాధ్యం. భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశిపుడిగా, పాతాళ భైరవి లో మాంత్రికుడుగా ఆయన నటన మరచిపోలేము. సాంఘికాల్లోనూ ఆయన సత్తా చాటారు. మంచి మనసులు చిత్రంలో తండ్రి పాత్రలో ఆయన హావభావాలు, మానసిక సంఘర్షణ అమోఘం. పండంటి కాపురం, బాంధవ్యాలు--- చిత్రాల్లో అన్నయ్యగా హృద్యమైన నటన ప్రదర్శించారు. లక్ష్మీ నివాసం చిత్రంలో ఉదాత్తమైన తండ్రి పాత్రలో హుందాగా కనిపించారు. సాత్విక పాత్రలూ, గాంభీర్యం ఉట్టి పడే మాత్రమేగాక క్రూరత్వం ప్రతిబింబించే పాత్రలూ చేసిన ఘనత వీరిది. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు ఎస్. వి. ఆర్

* ఉదాత్తమైన తండ్రి పాత్రలకూ, సౌమ్యంగా కనిపిస్తూ గౌరవభావం కలిగించే పాత్రలకూ పెట్టింది పేరు' గుమ్మడి'గా అందరికీ సుపరిచితులైన గుమ్మడి వెంకటేశ్వర రావు గారు. ఆడపిల్ల తండ్రి పాత్ర అంటే గుమ్మడే అనేంతగా ఆ పాత్రలో ఒదిగి పోయే వారాయన. కొన్ని సన్నివేశాల్లో హఠాత్తుగా గుండె పట్టుకుని కూలిపోయే నటనలో అది సహజత్వం ప్రదర్శించే సహజనటన వారి సొంతం. మహామంత్రి తిమ్మరుసు చిత్రం లోని అప్పాజీ పాత్ర ఆయన నట జీవితంలో నే కలికితురాయి. మర్మయోగి, కథానాయిక మొల్ల, పూలరంగడు, భలే రంగడు, మరో మలుపు, లక్షాధికారి, అర్థాంగి-- చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు మర్చిపోలేనివి. ఇంకా-- పౌరాణికాల కొస్తే--- దశరథుడు, బలరాముడు, ధర్మరాజు, పరశురాముడు, దుర్వాసుడు, ద్రోణుడు-- ఇలాగే ఉంటారేమో అనిపించేలా ఉంటుంది ఆయన నటనా ప్రతిభ! కేవలం సానుభూతి పొందే పాత్రలే గాక సాఫ్ట్ విలన్ గా తేనె పూసిన కత్తి లాంటి పాత్రల్లో కూడా ఆయన జీవించారు. 

* ' అల్లో అల్లో అల్లో ' " మడిసన్నాక కుసింత కలా పోసనుండాలి " --- ముత్యాల ముగ్గు సినిమాలో ఈ డైలాగులతో ప్రభంజనంలా దూసుకొచ్చి అందర్నీ ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న విలక్షణ నటుడు రావు గోపాలరావు గారు. ఒకటా, రెండా ! ఎన్నని ఉటంకించాలి ఆయన ధరించి మెప్పించిన పాత్రలు! క్రూరత్వం, సాధు తత్వం, మేక వన్నె పులి పాత్రలు -- వీటితో పాటు ఉదాత్తత ఉట్టి పడే పాత్రలూ ఈయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎన్. టీ. ఆర్  నటించిన వేటగాడు సినిమా లో అతి క్లిష్ట సమాస భూయిష్టమైన డైలాగులతో అదరగొట్టి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి సమ్మోహన పరిచడం ఆయనకే చెల్లింది. చాలెంజ్, అల్లరి అల్లుడు, ఘరానా మొగుడు--- ఇత్యాది చిత్రాల్లో ఆయన పోషించిన తండ్రి పాత్రలు ఎప్పటికీ గుర్తే. 

* అలనాటి నటుల్లో అత్యున్నత స్థాయి jఅందుకున్న నటుల్లో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు.  ప్రతినాయక పాత్ర పోషణలో ఆయనకు ఆయనే సాటి అన్న విధంగా  ఉంటుంది ఆయన నటన! ఇప్పటికీ ఎనభై ఐదేళ్ల వయసులోనూ అడపాదడపా తెరమీద కనిపిస్తూ ఉండడమే ఆయన నటనా వైదుష్యానికి గొప్ప నిదర్శనం. పౌరాణిక పాత్రలకు జీవం పోసిన అద్భుత నటనా చాతుర్యం ఆయన సొంతం. దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు--- ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జానపద చిత్రాలలోనూ ఆయన పోషించిన పాత్రలు తక్కువేం కాదు. సాంఘికాల్లో--- తాతా మనవడు, నిప్పులాంటిమనిషి, శుభాకాంక్షలు--- ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. మురారి, అరుంధతి చిత్రాలు పోషించిన తాతయ్య పాత్రలూ చెప్పుకోదగ్గవే ! ఈ అద్భుత నటుడు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ అందర్నీ అలరించాలని కోరుకుందాం. 

* కోట శ్రీనివాసరావు--- కామెడీ విలన్ పాత్రలకు పెట్టింది పేరు. నటనకు చిరునామా లాంటివాడు. నవ్విస్తూనే క్రూరత్వాన్ని అలవోకగా ప్రదర్శించడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్యేమో అనిపించేలా ఉంటుంది నటన! అహ నా పెళ్ళంట, ఆమె, ప్రతిఘటన, బావ- బావమరిది---ఇలా చాలా ఉన్నాయి వీరి ప్రతిభకు పట్టం కట్టేవి. 

* పరభాషా నటులైనా ప్రభంజనంలా దూసుకు వచ్చి తెలుగు చిత్రసీమను కూడా ప్రస్తుతం ఏలుతున్న నటులు--- నాజర్, ప్రకాష్ రాజ్, సత్య రాజ్

 క్యారెక్టర్ నటుడిగా నాజర్ అందుకున్న స్థానం తక్కువేమీ కాదు. పోషించిన పాత్రలూ కోకొల్లలు ! హీరోయిన్ తండ్రిగా, ప్రతినాయకుడిగా ఇంకా ఇతర ప్రాధాన్యం కలిగిన సహాయ పాత్రలకు ఈయన ప్రాణం పోశారు. జీన్స్ చిత్రంలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం ఎప్పటికీ మర్చిపోలేము. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రంలో పోషించిన తండ్రి పాత్ర అద్భుతం. అన్నింటినీ మించి' బాహుబలి' లో బిజ్జల దేవా పాత్ర ఆయన నట జీవితంలో నే అత్యద్భుతమైన పాత్ర !

* మొదట్లో డబ్బింగ్ వాయిస్ మీద ఆధారపడ్డా అతి త్వరగా సొంత గొంతు వినిపించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్! విలనీ పోషించడం ఈయనకు కొట్టినపిండే ! అంతేనా! క్రమంగా తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ఈ అద్వితీయ నటుడు పోషించిన పాత్రలు లెక్కపెట్టలేనన్ని ! అలాగే విలన్ పాత్రలూ. నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సోలో--- ఇలాంటి చాలా చిత్రాల్లో కూతురి కోసం ఆరాటపడే తండ్రిగా ఆయన నటన అనితర సాధ్యం.' అంతఃపురం చిత్రం లో విభిన్నషేడ్స్ కలిగిన పాత్ర చెప్పుకోదగినది. 

* తర్వాతి స్థానం సత్యరాజ్ దే ! ఈయన పోషించిన తండ్రి పాత్రలకూ కొదువేం లేదు. రాజా రాణి, బ్రహ్మోత్సవం, ప్రతి రోజు పండగే---  ఇవి ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు. గతంలో మరెన్నో చిత్రాల్లో పోషించిన పాత్రలు వారి నటనకు అద్దం పట్టేవే!  ఈ నటుడు పోషించిన పాత్రలన్నీ ఒకెత్తు,' బాహుబలి' చిత్రంలో పోషించిన కట్టప్ప పాత్ర ఒక ఎత్తు. అంతగా గుర్తింపు తెచ్చి పెట్టిన గొప్ప పాత్ర !

ఇలా పలురకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన నటులు అలనాడే కాదు ఈనాడూ అద్వితీయంగా వెలుగొందుతున్నారు !! 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                      🌹 భువి భావనలు 🌹

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

7 comments:

  1. అయ్యో, అయ్యో, అయ్యో .... నాగయ్య, CSR, నాగభూషణం, ముక్కామల, మిక్కిలినేని, కొంతవరకు అల్లు రామలింగయ్య (తన నటజీవితం రెండో సగంలో) .... ఈ పేర్లు కొన్ని వదిలేశారే (notable omissions)?

    అఫ్-కోర్స్ మీ పోస్ట్ బాగా వ్రాశారు. విభిన్నమైన టాపిక్ ఎంచుకున్నారు, బాగుంది.

    ReplyDelete
  2. అనుకుంటూనే ఉన్నాను ఎవరినైనా మరిచిపోయానేమో అని. కాకపోతే నాగయ్య,CSR చాలా సీనియర్ ఆర్టిస్టులు. వాళ్ళ గురించి రాసే నాలెడ్జి నాకు లేదు. అల్లు రామలింగయ్య గారు హాస్య నటులుగా సుప్రసిద్ధులన్న భావన. నాగభూషణం గారి గురించి ప్రస్తావించక పోవడం పొరపాటే. వారి గురించి ప్రత్యేకంగా రాయడానికి ప్రయత్నిస్తాను. గుర్తు చేసినందుకు థాంక్స్. 🙏

    ReplyDelete
    Replies
    1. 🙂 👍
      నేనూ ఇంకెవరినైనా మరిచిపోయానా అనే అనుమానం నాకూ వదలటం లేదు లెండి నిన్నటి నుండి 😟.

      Delete
  3. ఇంకా చాలామంది ఉన్నారు.రంగనాధ్, శరత్ బాబు, నూతన్ ప్రసాద్ etc.

    ReplyDelete
  4. ఓహ్? ఒకప్పుడు హీరో వేషాలు వేసి, తరువాత మీద పడుతున్న తమ వయసును గుర్తించి హుందాగా కారెక్టర్ పాత్రలకు మారిన నటులా (“రెండు కళ్ళ” లాగా కాకుండా) ? నేనలా అనుకోలేదు. అలా అయితే నాకు వెంటనే తడుతున్న రెండు పేర్లు - తంద్రమోహన్. నరేష్,

    హీరోగా చెయ్యలేదు గానీ కారెక్టర్ ఆర్టిస్టు గా మెప్పించిన మరొక నటుడు ఆహుతి ప్రసాద్, అలాగే చలపతిరావు, గిరిబాబు కూడా.

    ReplyDelete
    Replies
    1. "వయసును గుర్తించి హుందాగా కారెక్టర్ పాత్రలకు మారిన నటులా"

      మీ notable omissions లిస్టులో చిత్తూరు నాగయ్య కూడా అంతే కదండీ.

      Delete
    2. Yes, నాగయ్య గారు కూడా ఆ బాపతే.

      Delete