Friday, November 6, 2020

చెడును ప్రచారం చేయకండి, ప్లీజ్.... ఓ కథ కాని కథ

       మధ్యాహ్నం మూడవుతోంది. గేటు చప్పుడు విని పడుకోబోతున్నదల్లా బయటకొచ్చింది జాహ్నవి. కల్పన లోనికొస్తూ కనిపించింది. కల్పన, జాహ్నవి రెండేళ్ల క్రితం పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. కల్పన ఓ స్కూల్లో, జాహ్నవి ఓ ఆఫీసులో పనిచేస్తుండేవాళ్లు. ఆర్నెళ్ల క్రితం జాహ్నవి వాళ్ళు ఇల్లు మారిపోయారు. పూర్వ పరిచయం తో ఇలా అప్పుడప్పుడూ ఇంటికి వస్తూ ఉంటుంది కల్పన. 

" రా, ఏమిటీ, ఈ టైం లో. స్కూలు కెళ్లలేదా?.... " లోనికి దారితీస్తూ అడిగింది జాహ్నవి. 

" స్కూలు నుండే, కాస్త తలనొప్పిగా ఉంటే పర్మిషన్ పెట్టి వచ్చా... " జవాబుగా అంది కల్పన. 

 ఏదో విషయం ఉందన్నమాట, అనుకుంటూ, " అలాగా... కూర్చో, వేడివేడిగా టీ తెస్తా.. " అంటూ వంటింట్లోకి నడిచింది జాహ్నవి. పది నిమిషాల్లో పొగలు గక్కుతున్న టీ తీసుకొచ్చి కల్పన చేతికిచ్చి, ఎదురుగా కూర్చుంది. 

   వారం రోజులుగా ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా ఉండి నిన్ననే కాస్త రిలాక్స్ అయ్యారంతా. బాగా అలసిపోయిందేమో రెస్ట్ తీసుకుందామని ఈరోజు శెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఎలా కనిపెడుతుందోఏమో తను ఇంట్లో ఉన్న సంగతి మరి ! ఇలా వచ్చేసింది. లోలోపల విసుగ్గా ఉన్నా తప్పనిసరై కూర్చుండిపోయింది జాహ్నవి. 

టీ చప్పరిస్తూ, " జాహ్నవీ, నీకు మా కొలీగ్ అనంత తెలుసు గదా.... "

" ఊ.. మొదలెట్టింది..... " అనుకుంటూ తలూపింది జాహ్నవి. 

".... తన కూతురు డిగ్రీ చదువుతోంది. ఎవరో కులం గాని అబ్బాయితో వెళ్లిపోయిందట పాపం ! నాల్గు రోజుల నుండీ స్కూలుకు రాకపోతే మా స్టాఫ్ నలుగురం కలిసి ఇంటికెళ్తే విషయం తెలిసింది. ఒకటే ఏడుపనుకో...... "

" ఊ.. అదన్నమాట సంగతి! ఈ వార్త చేరవేయటానికి తల నొప్పంటూ పర్మిషన్ తీసుకొని మరీ నా ఇంటికొచ్చింది. ఆవిడ అంత బాధలో ఉంటే వీళ్ళు వెళ్ళింది ఓదార్చడానికి కాదు, కూపీ లాగటానికి. సరే, లాగినవాళ్ళు అంతటితో ఊరుకోవచ్చు గదా, ఆ లాగింది అందరికీ ఇలా మోసెయ్యటం ! కొలీగ్ కెదురైన బాధకు ఏమాత్రం సానుభూతి లేదు సరి కదా ఇలా ప్రచారాలు చేస్తూ ఆమె బాధ మరింత పెంచడంలో వీళ్లు పొందే ఆనందం మాత్రం వర్ణనాతీతం!

   కల్పన నైజం జాహ్నవికి బాగా తెలుసు. పక్కపక్కనే ఉన్నారు గదా కొంతకాలం. ఎదురింట్లో, పక్కింట్లో, బంధుగణాల్లో, ఇంకా చెప్పాలంటే ముక్కు మొహం తెలియనివాళ్లిల్లలో జరిగిన బాధాకర సంఘటనలు అన్నీ పూసగుచ్చినట్లు అడిగినవారికీ, అడగని వారికీ అందరికీ చేరవేసే బాపతు. చిత్రమేంటంటే ఇదంతా చెడు విషయాలు చేరవేయడం వరకే. మంచి ఏదైనా జరిగితే మాత్రం ఎవరి దగ్గరా నోరు విప్పదు. 

   మూణ్ణెల్ల క్రితం ఓ షాపింగ్ మాల్ లో జాహ్నవి కి అనుకోకుండా తటస్థ పడింది ఈ కల్పన. అంతే! బరబరా పక్కనే ఉన్న క్యాంటీన్ కు లాక్కెళ్లి కూర్చోబెట్టి, టీ తాగుతూ మొదలెట్టింది. 

" జాహ్నవి, మా ఎదురింటాయన రంగనాథం గారని.... నీకు తెలీదులే.... ఆయన కూతురు రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిందట! అంతటా వెతికారు పాపం. తర్వాత తెలిసింది, ఎవర్నో పెళ్లి చేసుకుందని! ఇంతలో ఏమైందో ఏమో మొన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అసలు విషయం ఏంటంటే, అతను ఆల్రెడీ పెళ్లయిన వాడట !.... "

 అదిరిపడింది జాహ్నవి ఆ తల్లిదండ్రులకెదురైన విపత్తు సామాన్యమైంది కాదు. వాళ్ళ బాధలో వాళ్ళుంటే ఇలా అందరికీ తెలిసేలా చేస్తూ.... ఏమిటిది? అసలా రంగనాథం గారు ఎవరో, వాళ్ళ అమ్మాయి ఎవరో ఏమిటో ఏ మాత్రం ఎరగని తనకు ఈ విషాదం చెప్పడం అవసరమా ఈ కల్పనకు !... "

 జాహ్నవి ఆలోచనలు అలా ఉన్నాయి. చాలాసార్లు కల్పనకు చెప్పాలనుకుంది,  ఇలాంటి వార్తలు దయచేసి స్ప్రెడ్ చేయొద్దని.... కానీపెదవి దాకా వచ్చిన మాటలు అక్కడే ఆగిపోయేవి. ఎందుకో ఈరోజు అలా ఊరుకోబుద్ధి కావడం లేదు జాహ్నవి కి. 

"... అనంత గారు ఎంతో బాధలో ఉండి ఉంటారు, చేతనైతే ఓ కొలీగ్ గా ఆమె బాధ తగ్గించే పని చేయాలి గానీ ఇదేమిటి కల్పనా ఇలా అనవసరంగా నాకు చెప్తున్నావు? ఆమె నీ కొలీగ్, మీ ఫ్రెండ్. తన బాధ నీతో పంచుకుంటే ఆ రహస్యం నీ గుండెల్లో దాచుకోవాలే గానీ ఇలా అందరి వద్దా ప్రస్తావించడం సబబా?... "

 జాహ్నవి నుండి ఊహించని ఈ మాటలకు ఠక్కున టీ తాగడం ఆపింది కల్పన. 

".... మీ పక్కింటి వాళ్ళ అమ్మాయికి మెడిసిన్లో సీటు వచ్చిందని చెప్పు, మీ బంధువుల అబ్బాయికి మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పు, ఫలానా వాళ్ళ అమ్మాయి కి మంచి సంబంధం కుదిరిందని చెప్పు అందరికీ. ఆ కుటుంబాలు ఎంతో సంతోషిస్తాయి. అప్పుడు నీకూ సంతోషమే కలుగుతుంది. అది స్వయానా అనుభవిస్తే నీకు తెలుస్తుంది. కానీ ఇలా జరిగిన చెడును మాత్రమే అందరికీ ప్రచారం చేస్తే అసలే బాధలో ఉన్న వాళ్ళు ఇంకెంతగా కుమిలిపోతారో నీకు పట్టదా?.. "

 జాహ్నవి నుండి ఈ ప్రతిఘటన ఊహించని కల్పన అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయింది. జాహ్నవి మళ్లీ అందుకుంది,

" ఇదే మన ఇంట్లో మనకే జరిగితే.... నీకో కూతురుంది, నాకో కూతురుంది. మన పిల్లలే అలాంటి పనులు చేస్తే.. "

"...ఛఛ ! మన పిల్లలెలా చేస్తారు?..... " అడ్డుకుంది కల్పన. 

"  ఎందుకు చేయరు?.. " తూటాలా జాహ్నవి నుండి వచ్చిన మాటకు అవాక్కయింది కల్పన. 

"...మన పిల్లలేమయినా ప్రత్యేకమా? అంత నమ్మకమా వాళ్ళ మీద !ఏ క్షణం ఎవరి బుర్ర లో ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేని రోజులివి. సరే, చేయరనే అనుకుందాం. మన పిల్లలు ఎంత పద్ధతిగా ఉన్నా బయట అంతా అంతే పద్ధతిగా ఉంటారన్న గ్యారంటీ ఉందా?  నిర్భయ, దిశ సంఘటనలు గుర్తు లేదా?  వాళ్లంతా మంచి అమ్మాయిలే... కానీ జరిగిందేమిటి?  ఒక్కసారి ఊహించుకో... అలాంటిది మనకే జరిగితే.... అందరూ మన గురించి చెవులు కొరుక్కుంటుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో !...."

రెండు చెవులూ మూసేసుకుంది కల్పన. 

"....కదా ! వినటానికే అంత కర్కశంగా అనిపిస్తోంది నీకు. మరి స్వయానా ఆ బాధ అనుభవించే వాళ్ళ కేలాగుంటుందో ఆలోచించు... "

నోట మాట రాక అచేతనంగా ఉండిపోయింది కల్పన. 

"...ఇలా జరగాలనీ, జరుగుతుందనీ కాదు నేను చెప్పేది, ఏ బాధైనా మనదాకా వస్తేనే గానీ దాని తీవ్రత తెలియదు. మనకు జరగలేదు కదా అని వాళ్ళ బాధని అవహేళన చేయడం తగదు.... ఏమో ఎవరు చెప్పొచ్చారు?  ఎందర్ని చూడ్డంలేదు ఈరోజెంతో సంతోషంగా ఉన్న కుటుంబాలు రేపటికి ఊహించని విధంగా దుఃఖంలో మునిగిపోతున్నాయి. నవ్విన కళ్ళే చెమ్మగిల్లొచ్చు, అలాగే వాడిన బ్రతుకులు పచ్చగానూ అవొచ్చు. వినలేదా కల్పనా.... నీతిబోధ చేస్తోంది అని మాత్రం అనుకోకు.. నిన్ను బాధ పెడితే సారీ..... "

ఏమంటుంది కల్పన? అప్పటికే మ్రాన్పడిపోయింది. కప్పు టీ పాయ్ మీద పెట్టి మెల్లిగా లేచి 

" ఏదో మంచీ చెడూ అని.... " అంటూ బయటకు నడిచింది వెళ్తున్నానని కూడా చెప్పకుండా. 

".. బాధపడిందా తన మాటలకు ! అయినా పరవాలేదు, కాస్త ఆలోచనలో మాత్రం పడి తీరుతుంది. తానేదో గొప్ప పని చేసిందని కాదు గానీ కనీసం తన వద్ద అయినా ఇలాంటివి ఇక ఎప్పుడూ చెప్పదు. బహుశా మునుపటిలా తనతో మాట్లాడకపోనూ వచ్చు, అయినా సరే. స్నేహం మంచిదే. కానీ ఇలాంటి స్నేహం అభిలషణీయం కాదు. రేపు తన ఇంట్లో జరక్కూడనిదేదైనా జరిగినా ఇలాగే ప్రచారాలు చేయడానికి వెనుకాడరిలాంటి వాళ్ళు..."

తనకు తానే సర్ది చెప్పుకుంది జాహ్నవి. కల్పన గేటు దాటి వెళ్లిపోయింది. జాహ్నవి మనసు కుదుటపడింది. 

                        ***********

[ చెడు వార్తలు వ్యాప్తిచెందినంత శీఘ్రంగా మంచి వార్తలు వ్యాపించవు. కారణం? చెడు రుచించినంతగా మంచి రుచించదు జనాలకు !!   ]

++++++++++++++++++++++++++++++++++++

                  *  భువి భావనలు  *

++++++++++++++++++++++++++++++++++++




.


4 comments:

  1. మగవారిలో పురుషాహంకారం ఉంటుంది.
    ఆడవారు ఆడవారికే శత్రువు. చాలా మంది అందమైన ఆడవాళ్లు అసూయ, అసహనం, ఇతరులను ఆడిపోసుకోవడం వంటి వికారాలతో తమ అందానికి మసి పూసుకుంటారు.
    ఆడవారంటే అందం, సౌకుమార్యం, సౌజన్యం మొ: లలిత సుగుణాలతో జగత్తునే శోభాయమానంగా చేయగలిగి ఆకర్షణ కలిగిన మోహినీ దేవతలని అందరూ భ్రమ పడుతుంటారు.
    కాని అందరూ భ్రమపడినట్లు చాలా మందిఆడవాళ్లలో ఆలక్షణాలు కనిపించడంలేదు.
    కల్పన లాంటి ఆడవారు ఆడ జాతికే మచ్చ.
    సీత లాంటి సౌశీల్యవతులు ఎక్కడో కాని ఉండరు.

    ReplyDelete
    Replies
    1. నిజమే, బాగా చెప్పారు 🙏

      Delete
  2. కథ ఇతివృత్తం బాగుంది. అయితే ఎదుటివారికి అంత కరాఖండీగా చెప్పేవాళ్ళు అరుదేమోనని నా అనుమానం. కల్పన లాంటి మనుషుల గురించి ... తను చెప్పేది ఒక చెవిన విని రెండో చెవితో వదిలేస్తే పోలా, ఇటువంటి వాళ్ళకు మంచి చెప్పినా వినరు ... అనే చాలా మంది అనుకుని మిన్నకుండి పోతారని నా అభిప్రాయం. అఫ్-కోర్స్ మీ కథలో లాగా జరిగితే బాగానే ఉంటుంది లెండి.

    (కల్పన, కవిత లాంటి పేర్లు మీకు ఇష్టం అనుకుంటానే, మీ కథల్లో ఎక్కువగా వాడుతుంటారు. అఫ్-కోర్స్ ఆ పేర్లు బాగుంటాయి లెండి 🙂)

    ReplyDelete
  3. అరుదేమోనని అనుమానం అంటున్నారు మీరు కూడా. అంటే ఒకరిద్దరైనా ఉంటారనేగా!చెడు ప్రచారాలరికట్టడంలో జాహ్నవి లాంటి వారు అక్కడక్కడా ఉండాలన్నదే నా భావన. 🙂
    కథలో పాత్రల స్వభావానికి తగ్గ పేర్లు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అలా పెట్టినవే జాహ్నవి, కల్పన పేర్లు 🙂🙏

    ReplyDelete